ప్రపంచ దేశాల ఉత్పత్తి, మార్పిడి, వినియోగం కార్యకలాపాల మొత్తాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. ఇది ప్రపంచీకరణలో ఒక భాగం. ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చైనా, జర్మనీ, జపాన్, భారత్‌లు ఉన్నాయి. అమెరికా అధ్యకక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2న విముక్త దినోత్సవం రోజున ప్రకటించిన దిగుమతి సుంకాల పెంపుతో అకస్మాత్తుగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, బలహీనమైన వృద్ధి నెలకొంది. అన్నీ దేశాల్లో నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం విస్తృతి చెందాయి. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి మార్కెట్ మందగించింది. ఈ స్థితి భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెంచుతుంది. మరోవైపు కృత్రిమ మెధస్సుచే పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగాలు ప్రభావితమవుతున్నాయి. ట్రంప్ దిగుమతి సుంకాలను అనాలోచితంగా, అపరిమితంగా పెంచడంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో షాక్ తరంగాలను పంపింది. ఆర్థిక మార్కెట్ అస్థిరతను ప్రేరేపించింది.
ప్రపంచ దేశాలకు ఆర్థిక వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్యం ముద్దు అని నీతి సూత్రాలు వల్లించిన అమెరికా ఇప్పుడు 17వ శతాబ్ధపు వర్తకవాద సిద్ధాంతం వైపు వెళ్లింది. ఇది ప్రభుత్వాలు జాతీయ సంపదను పెంచడానికి వాణిజ్యాన్ని నియంత్రించే ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది. ఇది రాజ్య జోక్యం ద్వారా వెండి, బంగారం సంపదను కూడబెట్టుకోవడంపై దృష్టి పెడుతుంది. ఈ విధానం దిగుమతులు తగ్గించి ఎగుమతులను పెంచడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విధానాన్ని ఆడమ్ స్మిత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీనికి ప్రతిస్పందనగా అడమ్ స్మిత్ 18వ శతాబ్దంలో స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. స్మిత్ తత్వశాస్త్రం 18, 19 శతాబ్దంలో పశ్చిమ దేశాలను ఆధిపత్యం చేసిన ఉదారవాదాన్ని యానిమేట్ చేసింది. వాణిజ్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సరైన సంస్థ కాదంటాడు స్మిత్. అంతర్జాతీయ మార్కెట్లను పోటీకి తెరువడం వల్ల ప్రజల స్వార్థం కఠినమైన ప్రభుత్వ నియంత్రణ కంటే ఎక్కువ శ్రేయస్సును సృష్టిస్తుందని స్మిత్ వాదిస్తాడు. స్మిత్ స్వేచ్ఛా వాణిజ్య విధానం అంతర్జాతీయ వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించి, ప్రత్యేకంగా పోటీ ద్వారా ఎక్కువ అధిక శ్రేయస్సును ప్రోత్సహించాలని సూచించాడు. ఇవాళ అమెరికా ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. స్మిత్ స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతానికి భిన్నంగా కాలం చెల్లిన వాణిజ్యవాదాన్ని పునరుద్ధరిస్తూ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ ప్రతీకార సుంకాలతో ఏకపక్ష వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు.
సంపన్నుల లాభాపేక్ష, దురాశ ఒకవైపు, తీవ్రస్థాయి యాంత్రీకరణ మరోవైపు ఉపాధి కొరతను పెంచుతుంది. ప్రజల జీవన పరిస్థితులను దుర్భరం చేస్తున్నాయి. తాజాగా సంక్షోభ తీవ్రతలో అమెరికా ప్రభుత్వం మూతపడింది. ప్రభుత్వ వ్యయానికి నిధుల విడుదల ఆగిపోయింది. ఫలితంగా ఆర్థిక కలాపాలు నిలిచిపోయి అక్కడి ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది. దీంతో అమెరికా అగ్రవాదానికి, ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని, అగ్రరాజ్య హోదాని నిలబెట్టుకోవడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ట్రంప్ చేపడుతున్న అనేక విధానాలను ఫెడరల్ కోర్టు కూడ తప్పు పట్టింది. అమెరికా ప్రజల నుంచి కూడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హెచ్ 1బి వీసా ధరఖాస్తుల ఫీజు పెంపుదలకు వ్యతిరేకంగా పలు సంస్థలు అమెరికాలోని న్యాయ స్థానాల్లో దావా దాఖల్ చేయడం జరిగింది. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకు చాలా నష్టం కలిగిస్తాయని కార్పొరేట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా, దాని మిత్ర దేశాలు సామ్రాజ్యవాద దురహంకారంతో రెండు రకాల యుద్ధాలు చేస్తున్నాయి. ఒకటి మిలటరీ, రెండు సుంకాలు. ఒకటి రక్తపాతాన్ని, మరోకటి ఆర్థికంగా దెబ్బతీసి లొంగతీసుకునే పద్ధతి. ఇవాళ ట్రంప్ సుంకాల పేరిట ప్రారంభించింది వాణిజ్య యుద్ధమే నేడు ప్రపంచానిన అతలాకుతలం చేస్తున్నది. 2008లో ప్రారంభమైన అమెరికన్ ఆర్థిక సంక్షోభం నేటికీ కొనసాగుతోంది. నేడు మరింత విశ్వరూపం దాల్చింది. ఇది గృహ మార్కెట్, సబ్‌ప్రైమ్ తనఖా సంక్షోభంతో ప్రారంభమైన మాంద్యం. దీనివలన క్రెడిట్ ఫ్రీజ్, స్టాక్ మార్కెట్ పతనం, భారీ ఉద్యోగ కోతలకు దారి తీసింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక సంక్షోభాలు సహజ సిద్ధమని ఎన్నోసార్లు రుజువైంది. సంక్షోభాల ప్రభావానికి ప్రధానంగా గురయ్యేది సామాన్య ప్రజలే, సంపన్నులు కాదు. ఒకవైపు అమెరికా ఒలిగార్కీ లాభాపేక్ష దురాశ, మరోవైపు తీవ్రస్థాయి యాంత్రీకరణ, ఉపాధి కొరత వంటి కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులను దుర్భరం చేస్తున్నాయి. మొత్తంగా ట్రంప్ విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమై ప్రభావాలను చూపాయి, ప్రధానంగా అధిక దిగుమతి సుంకాల ద్వారా, ఇవి ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితిని సృష్టించాయి. ఈ విధానాలు అమెరికన్ తయారీని పెంచాలని, ఉద్యోగాలను రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అవి అమెరికా వినియోగదారులకు అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళానికి దారితీశాయి. ఆర్థికవేత్తలు ఈ విధానాలు అమెరికాకు హాని కలిగించవచ్చని, వాణిజ్య భాగస్వాముల ఆర్థిక వ్యవస్థలను వక్రీకరించవచ్చని హెచ్చరిస్తున్నారు.
2025 ఐఎంఎఫ్ రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సగటు అభివృద్ధి 3.2 శాతం వద్ద ఉంది. అమెరికా గ్రోత్ రేటు రెండు శాతానికి పడిపోయింది. ఇతర సామ్రాజ్యవాద దేశాల్లో ప్రధానంగా జర్మనీ 0.2 శాతం బ్రిటన్ 1.3 శాతం, ఫ్రెంచి 0.7 శాతం, జపాన్ 1.1 శాతం చొప్పున స్తబ్దంగా ఉన్నాయి. మరోవైపు చైనా, ఇండియా ఇందుకు మినహాయింపు. చైనా గ్రోత్ రేటు 4.8 శాతం, ఇండియా గ్రోతం రేట్ 6.4 శాతం. ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా వెనకబడ్డ దేశాలు బాగా ముందుకు వెళుతున్నాయి. అందులో సౌత్ సుడన్ 27.2 శాతం, గుహన 14.4, లిబియా 13.7, సేనిగల్ 19.3, పలావు 8.5 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారంగా అమెరికా దాని మిత్ర దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక అసమానతలు, అసంతృప్తి పెరిగిపోయాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న వలసదారులపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత ప్రజలపై అమెరికా, ఆస్ర్టేలియా, బ్రిటన్ దేశాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల మంది వలసదారులు ఈ దాడుల వల్ల చనిపోయారు. సంక్షోభానికి పరాకాష్టగా దీన్ని పేర్కొనవచ్చు. సామ్రాజ్యవాద దేశాలు అంతర్గతంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి. రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృకంగా సామాజిక రంగాల్లో ఈ సంక్షోభాలు పెరుగుతున్నాయి. అమెరికా వీటి నుండి బయటపడడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వనరులను కొల్లగొట్టడం కోసం డైరెక్ట్ గా మిలిటరీ ద్వారా దాడులు చేయడం, చేయించడం మరోవైపున సుంకాల పేరిట వాణిజ్య యుద్ధం ద్వారా లొంగతీసుకొని తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటటువంటి మార్గాలను ఎంచుకుంటున్నది. ట్రంప్ ప్రభుత్వం ఈ రెండు రకాలుగా దండెత్తుతున్నది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలలో తీవ్రమైన తిరోగమనాన్ని సూచిస్తుంది. ఇది తరచుగా ఆర్థిక సంక్షోభం ద్వారా ప్రేరేపించబడి, మాంద్యం, మార్కెట్ పతనాలు, విస్తృతమైన నిరుద్యోగంతో వ్యక్తీకరించబడుతాయి. ట్రంప్ సృష్టించిన ట్రేడ్ వార్ వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, ప్రపంచ మార్కెట్లో అస్థిరతను పెంచుతున్నాయని ఐరాస తెలిపింది. ప్రపంచ దేశాల మొత్తం స్థూల జాతీయోత్పత్తి 112 ట్రిలియన్ డాలర్లు కాగా ఒక్క అమెరికా జిడిపి 30 ట్రిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికాది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రధాన వాణిజ్య, ఆధిపత్య రిజర్వ్ కరెన్సీ డాలర్ జారీదారుగా దాని వనరుల కారణంగా అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. దాని ఆర్థిక వృద్ధి, ద్రవ్య విధానం, వాణిజ్య చర్యలు, సుంకాలతో సహా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వాణిజ్య ప్రవాహాలు, ఇతర దేశాలతో వృద్ధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. దీనికి విరుద్ధంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులలో, దిగుమతుల వినియోగదారుగా దాని పాత్ర ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం కూడ అమెరికాని ప్రభావితం చేస్తుంది.
2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా అభివృద్ధి చేస్తానని, తయారీ రంగంలో దేశాన్ని మేటిగా నిలుపుతానని, అన్నింటా అమెరికాయే ఫస్ట్ అని నినదిస్తూ, శ్వేతజాతి దురహంకారాన్ని రెచ్చగొట్టి రెండో దఫా అమెరికా అధ్యకక్షుడైన ట్రంప్ పెట్రేగిపోతున్నాడు. ఇప్పటి దాకా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో ప్రపంచ దేశాలకు ఆర్థిక నీతి సూత్రాలు వల్లించిన అమెరికా ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీ సుంకాలతో ఏకపక్ష వాణిజ్య యుద్ధానికి (ట్రేడ్‌వార్) తలపడ్డాడు. ఈ విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది, అధిక స్థాయి వాణిజ్య అనిశ్చితిని సృష్టిస్తోంది. ట్రంప్ విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపాయి. ప్రధానంగా అధిక టారిఫ్‌లు, వాణిజ్య తీవ్రతలు, అనిశ్చితిని సృష్టించడం ద్వారా ఈ విధానాలు ప్రపంచ వృద్ధిని తగ్గించాయి. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు చైనా, మెక్సికో, బ్రెజిల్, భారత్ వంటి దేశాలతో దెబ్బతిన్నాయి. దిగుమతులపై సుంకాల పెరుగుదల అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. అమెరికా భాగస్వాములతో ఘర్షణలకు దారి తీశాయి. ఈ విధానాలు ప్రపంచ దేశాలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడ ప్రతికూల ప్రభావాలను చూపాయి.
వివిధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు సవ్యంగా జరిగేలా చూసేందుకుగాను జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ (గాట్) స్థానంలో 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లు.టి.ఓ) ఏర్పడిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికి కూడా నేడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనదేశంపై ట్రంప్ మొత్తం 50 శాతం దిగుమతి సుంకాలు విధించడంతో వాణిజ్యంలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. చర్చలు కొనసాగుతున్నాయి. అయితే భారత్‌కు పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి వ్యవసాయోత్పత్తులు, పాలపొడి వంటి ఇతర ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని, 140 కోట్లకు పైగా జనాభా కల్గిన ఇండియాలోని భారీ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని అమెరికా తహతహలాడుతోంది. అందుకుగాను సరళమైన సుంకాలతో తమకు అనుమతి ఇవ్వాలని కొన్ని థాబ్ధాలుగా అమెరికా మనదేశంపై ఒత్తిడి చేస్తోంది.
భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో జౌళి వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, వజ్రాలు, స్వర్ణాభరణాలు, పాదరక్షలు, సుగంధ ద్రవ్యాలు, రబ్బర్, రొయ్యలు, చేపలు, ఇతర మత్స్య సంపదతో సహా వీటన్నిటి ఉత్పత్తిలో భాగస్వాములైన కొన్ని లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ట్రంప్ సుంకాల దెబ్బకు పెద్ద ఎత్తున ఎగుమతులు ఆగిపోతున్నాయి. భారత్‌పైనే గాక బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, కెనడా తదితర దేశాలపై భారీ సుంకాలు విధించి అమెరికా మళ్లీ సామ్రాజ్యవాద పెత్తనాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేస్తున్న యత్నాలు అంతర్జాతీయ వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికాలో విడుదలయ్యే మన సినిమాలపైన 100 శాతం, ఫార్మాకు సంబంధించి బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మన దేశం ఎక్కువగా జనరిక్ మందులను ఎగుమతి చేస్తుండటం వల్ల ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే మన కలపపై 10 శాతం, ఫర్నీచర్‌పై 25 శాతం సుంకాలు మోపుతామని చెప్పారు.
అమెరికా జారీ చేసే హెచ్1బి వీసాలపై ట్రంప్ ఎన్నో ఆంక్షలు విధించారు. అన్ని రంగాల సంస్థలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించడంపైన దృష్టి సారించాయి. ఐ.టి రంగ నిపుణులకు ఇది పెద్ద పిడుగు లాంటి వార్త. హెచ్ 1బి వీసాల సహాయంతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి పలు ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేస్తాయి. సుమారు 70 శాతం మంది భారతీయులే ఉంటారు. గత సంవత్సర కాలంలో హెచ్ 1బి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. ట్రంప్ నిలకడలేని నిర్ణయాల వల్ల అనేకమంది యువత భవిష్యత్ ఆగమ్యగోచరంగా ఉంది. హెచ్ 1బి వీసా దరఖాస్తుల ఫీజు పెంపుదలకు వ్యతిరేకంగా పలు సంస్థలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు అమెరికాలోని న్యాయస్థానంలో ఇటీవల దావాదాఖలు చేయడం జరిగింది. ఏ దేశంతోనైనా వాణిజ్యపరమైన సంబంధాలు, ఒప్పందాలు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగానే జరగాలి. ట్రంప్ నిర్ణయాలు అమెరికాకు నష్టం కలిగిస్తాయని ఆయుధ తదితర పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటంతో పెంటగన్ సూచనపై కంపెనీలు తమకు అవసరమైన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకోవచ్చునని మినహా యింపు ఇవ్వడం కొంత మేరకు ఊరట కలిగించింది.
అమెరికా అధ్యకక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన అధిక సుంకాలు గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదాయాలు భారీగా దెబ్బతినవచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. అమెరికా సుంకాల వల్ల గ్లోబల్ కంపెనీలు 35 బిలియన్ డాలర్ల (రూ.3 లక్షల కోట్లు) పైగా అదనపు వ్యయాలు ఎదుర్కొన్నాయని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. ఇది ఆ కంపెనీలకు నష్టంగా మారొచ్చని విశ్లేషించింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం యుఎస్ సుంకాలను 1930ల నాటి గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో కంపెనీలు తమ ఖర్చు అంచనాలను తగ్గించాయి. మరోవైపు ధరల పెంపు వంటి ప్రణాళికలు రూపొందించాయి. రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం… 2025లో కంపెనీలు 21 బిలియన్ డాలర్ల నుంచి 22.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) నష్టాలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది 2026లో 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.3 లక్షల కోట్లు) నష్టం ఉండొచ్చు. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టొయెటా 9.5 బిలియన్ల (రూ.53 వేల కోట్లు) అంచనాతో అతిపెద్ద నష్టాన్ని ఎదుర్కోనుంది.
ముగింపు :
ట్రంప్ విముక్తి దినోత్సవం అయిన ఏప్రిల్ 2న ప్రారంభించిన ప్రతీకార సుంకాల లక్ష్యం స్వేచ్ఛా వాణిజ్యానికి స్వస్తి పలికి కాలం చెల్లిన వర్తక వాదాన్ని స్వీకరించడం జరిగింది. ట్రంప్ కొత్త వర్తకవాదం పురోగతి రెండు ఆశ్చర్యాలను అందించింది. మొదటిది, ప్రారంభ భయానక మార్కెట్ ప్రతిచర్య ఉన్నప్పటికీ, సుంకాలు దాదాపు అదే రేట్ల వద్ద అమలులో ఉన్నాయి. నిజానికి, భారతదేశం, కెనడా, చైనా, బ్రెజిల్ వంటి ముఖ్యమైన దేశాలకు అవి పెరిగాయి. రెండవది, ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేదు. అమెరికాకు అనుకూలంగా వాణిజ్య నిబంధనలకు తీవ్రంగా తగ్గించడంలో ప్రపంచం అంగీకరించింది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనేక ప్రభావాలు కలిగి ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి అధిక సుంకాలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ సహాకారంతో అనిశ్చితి, బలహీనతలు చోటు చేసుకుంటాయి. సుంకాల వల్ల ధరలు పెరుగుతాయి. కొన్ని దేశాలు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు, మరికొన్ని దెబ్బతినవచ్చు. మొత్తం మీద ట్రంప్ విధానాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అనిశ్చితి, గందరగోళాన్ని సృష్టించాయి.




