నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా, మోదీ ప్రభుత్వం మళ్లీ ఘనంగా “జనజాతి గౌరవ దివస్”ను జరిపి, దేశ జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న ఆదివాసుల శ్రేయస్సు కోరేవారిగా తనను తాను చూపించుకుంటోంది.

మరోవైపు, ఇటీవల, ప్రభుత్వం లదాఖ్‌లోని ఆదివాసుల రాజ్యాంగపరమైన డిమాండ్ కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దారుణంగా అణచివేసింది. మణిపూర్‌లో ఆదివాసీ-స్థానిక సముదాయాల పైన రెండేళ్ల హింస తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. మావోయిజం నిర్మూలన పేరుతో బస్తర్‌లో ఆదివాసులపై పోలీసుల అణచివేత జరుగుతోంది. జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల ఆదివాసులు తమ స్వతంత్ర మతపరమైన కోడ్ (నియమ నిబంధనల జాబితా) కోసం చేస్తున్న డిమాండ్‌పైన కేంద్రం మౌనం వహిస్తోంది. గత 11 సంవత్సరాల విధానాలు, కేంద్రం వైఖరిని పరిశీలిస్తే, మోదీ ప్రభుత్వ ‘నూతన భారతం’లో ఆదివాసుల మనుగడే ప్రమాదంలో ఉందని స్పష్టమవుతోంది.

ఆదివాసుల జీవితం, జీవనోపాధి, గుర్తింపు వారి సామూహికత, సంస్కృతి, భూమి, నీరు, అడవులతో గాఢంగా ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ లేకుండా, ఆదివాసులు కేవలం కార్మిక మార్కెట్‌లో దోపిడీకి గురయ్యే శ్రామికులుగా మిగిలిపోతారు. దేశంలో ఆదివాసుల వనరుల దోపిడీ, వారి సామాజిక-ఆర్థిక శోషణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా అయినా, ఆదివాసేతర భూస్వామ్య దోపిడీదారులకు వ్యతిరేకంగా అయినా లేదా ప్రభుత్వాల ఆదివాసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అయినా ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసుల పోరాట చరిత్ర కూడా సుదీర్ఘమైనది.

ఈ పోరాటాల వల్ల  ఆంగ్ల పాలకులకు ఆదివాసులకు అనుకూలమైన అనేక చట్టాలను రూపొందించక తప్పలేదు. ఉదాహరణకు, జార్ఖండ్‌లో ఛోటానాగ్‌పూర్, సంతాల్ పరగణా కౌలుదారి చట్టాలు. స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశంలో కూడా ఇలాంటి అనేక చట్టాలు సజావుగా కొనసాగాయి. అదే సమయంలో, స్వాతంత్ర్యం తరువాత, ఎప్పటికప్పుడు ఆదివాసుల భూమి, నీరు, అడవులపై హక్కులను, వారి స్వయంప్రతిపత్తిని రక్షించడానికి అనేక రాజ్యాంగపర నిబంధనలను, చట్టాలను రూపొందించారు; వాటిలో ఐదవ, ఆరవ షెడ్యూల్, పంచాయతీల విస్తరణ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు) చట్టం (పెసా), అటవీ హక్కుల చట్టం మొదలైనవి ఉన్నాయి.

వీటన్నింటి మూల సారాంశం ఏమిటంటే, ఆదివాసులు తమ జీవితం, సంస్కృతి, వనరుల నిర్వహణను తమ సాంప్రదాయక స్వపరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు; ఆదివాసేతర సముదాయాలు, వ్యవస్థలు వారిపై ఆధిపత్యాన్ని చెలాయించలేవు. వారి సామూహిక అనుమతి లేకుండా ప్రభుత్వం వారి భూమి, నీరు, అడవులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోలేదు.

కానీ ఇప్పటి వరకు ఏ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాలను నిజాయితీగా పాటించడంలేదు. మోదీ ప్రభుత్వం అయితే హిందూ రాష్ట్రాన్ని స్థాపించడం, వనరులను నిరంకుశంగా దోచుకోవడం, వనరులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ఎజెండాతో గత 11 సంవత్సరాలలో ఆదివాసులను మరింత అంచుకు నెట్టేసింది.

ఆదివాసీ స్వయంప్రతిపత్తిని అంతం చేయడం; నీరు, అడవులు, భూమిని దోచుకోవడం

దేశంలో 10 రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాలు ఐదవ షెడ్యూల్ కింద నోటిఫై అయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో ఆరవ షెడ్యూల్ అమలులో ఉంది. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో ఆదివాసుల భూమి పరిరక్షణ కోసం; దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక నియమాలు రూపొందించవచ్చు. పెసా చట్టం కింద, ఐదవ షెడ్యూల్ ప్రాంతాల ఆదివాసులకు వారి సంస్కృతి, వనరులపైన స్వయంప్రతిపత్తికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

అదే సమయంలో, ఆరవ షెడ్యూల్‌లో వనరులు, పాలనా వ్యవస్థపైన స్వయంప్రతిపత్తికి సంబంధించి మరింత బలోపేతమైన, ప్రభావవంతమైన నిబంధనలు ఉన్నాయి.

ఇటీవల లదాఖ్‌లో జరిగిన పరిణామాలు ఆదివాసుల స్వయంప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను రద్దు చేయాలనే మోదీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎత్తిచూపుతున్నాయి. 95 శాతం జనాభా ఆదివాసులే అయిన లదాఖ్‌లో, ఆరవ షెడ్యూల్ వ్యవస్థను అమలు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.

2019లో మోదీ ప్రభుత్వం తుపాకీ గురిపెట్టి జమ్మూ-కశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి, దాని ప్రత్యేక రాష్ట్ర హోదాను రద్దు చేసింది. దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా – జమ్మూ-కశ్మీర్- లదాఖ్‌గా – విభజించింది. అదే సమయంలో, స్థానిక ప్రజల భూమి, ఉద్యోగాలు మొదలైన వాటికి ప్రత్యేక రక్షణ కల్పించే ఆర్టికల్ 35ఎను కూడా రద్దు చేసింది.

తమ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్లు నెరవేరుతాయని ఆశించి లదాఖ్‌లోని చాలా మంది ఆర్టికల్ 370 తొలగింపుకు మద్దతు ఇచ్చారు. కేంద్రం కూడా అలాంటి వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు స్థానికులు తమ వనరులు, ఉద్యోగాలు, పాలనా వ్యవస్థపైన తమకు ఎలాంటి నియంత్రణ లేదని చెబుతున్నారు. ఉదాహరణకు, గత సంవత్సరం లదాఖ్ ప్రజల అంగీకారం లేకుండా అక్కడ ఒక పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు; దీని ప్రత్యక్ష దుష్ప్రభావం జీవనోపాధి, పర్యావరణాల పైన పడుతుంది.

పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ కోసం లదాఖ్ ఆదివాసులు చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని కేంద్రం ఇటీవల విస్తృత అణచివేతతో అడ్డుకుంది. పోలీసుల హింసలో నలుగురు మరణించారు; అనేకమందిపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రముఖ గాంధేయ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కూడా జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఒకవైపు మోదీ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధిని గురించి గొప్పగా చెబుతూ, మరోవైపు, నిరంతరం ప్రైవేట్ కంపెనీల ప్రయోజనం కోసం వారి నీరు, అడవులు, భూమిని దోచుకునే మార్గాన్ని తెరుస్తోంది. దీని కోసం పెసా, అటవీ హక్కుల చట్టంలోని నిబంధనలను నిష్క్రియం చేస్తూ, నీరు, అడవులు, భూమి, గనులకు సంబంధించిన చట్టాలలో సవరణలు జరుగుతున్నాయి.

2014లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, భూసేకరణ చట్టం 2013లో సవరణ చేయడానికి ఆర్డినెన్స్‌ను ఆమోదించారు. 2013 చట్టంలో, భూసేకరణకు ప్రజల అంగీకారం, సామాజిక ప్రభావం, పర్యావరణ ప్రభావం అంచనాను తప్పనిసరి చేశారు. అయితే, మోదీ ప్రభుత్వం ఈ రెండు నిబంధనలను తొలగించింది. ఆదివాసులు, ఇతర రైతు సమూహాల నుండి విస్తృత నిరసన రావడంతో, కేంద్రం ఈ మార్పులను రద్దు చేయాల్సి వచ్చింది.

అయితే, ఆ తర్వాత కేంద్రం చాకచక్యంగా ఈ మార్పులను ఝార్ఖండ్ వంటి అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయించింది. దీనితో పాటు, ఝార్ఖండ్‌లో ఆదివాసుల భూమి హక్కులకు రక్షణ కవచాలుగా పరిగణించే ఛోటానాగ్‌పూర్, సంతాల్ పరగణా కౌలుదారి చట్టాలలో కూడా రఘుబర్ దాస్ ప్రభుత్వం 2016-17లో సవరణలు చేయడానికి ప్రయత్నించింది. కానీ విస్తృత ప్రజల నిరసన కారణంగా, ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చింది.

అటవీ భూమి, వనరులు, ఆ ప్రాంతంలో ఉన్న గనులపైన మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అటవీ హక్కుల చట్టం, పెసా చట్టాలను పట్టించుకోకుండా, 2020లో మోదీ ప్రభుత్వం బొగ్గు కోసం వాణిజ్య మైనింగ్ విధానాన్ని అమలు చేసి, ప్రైవేట్ కంపెనీలకు వనరులను దోచుకోవడానికి ద్వారాలను మరింతగా తెరిచింది. 2023లో ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని సవరించి, ఆదివాసులు, అడవులపైన ఆధారపడిన ఇతర సముదాయాల సమ్మతిని తీసుకోవడానికి సంబంధించిన నిబంధనలను బలహీనపరిచింది; వాటిని ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టే వ్యవస్థను ఏర్పాటు చేసింది.

2023లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన వెంటనే, బీజేపీ ప్రభుత్వం అదానీ మైనింగ్ ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రే హస్‌దేవ్ అరణ్యాన్ని నాశనం చేసి, చదును చేయడానికి పూనుకోవడం కేవలం యాదృచ్చికం కాదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఇతర ఆదివాసీ సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో మైనింగ్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టుల కోసం ప్రజల అంగీకారం లేకుండానే అడవులను దోచుకోవడం సర్వసాధారణంగా మారింది. ఉదాహరణకు, ఒడిశాలోని రాయగఢలో వేదాంత, కోరాపుట్‌లో అదానీ బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇనుప ఖనిజం మైనింగ్ ప్రాజెక్టులు, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో అదానీ బొగ్గు మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఆదివాసీ ప్రాంతాలను పోలీసు రాజ్యంగా మార్చడం:

ఆదివాసులపై పోలీసుల అణచివేత చరిత్ర అంతులేనిదిగా, దేశానికి సిగ్గుచేటుగా ఉంది. గత 11 సంవత్సరాలలో ఇది మరింత భయంకరమైన రూపాన్ని తీసుకుంది. మావోయిజం నిర్మూలన పేరుతో, ఆదివాసీ ప్రాంతాలలో ప్రజల అంగీకారం లేకుండానే అనేక భద్రతా బలగాల క్యాంపులను ఏర్పాటు చేసారు. ఇందులో చాలావరకు గ్రామ సభ అంగీకారం ఉండాలనే రాజ్యాంగ నిబంధనలను పట్టించుకోకుండా ఏర్పాటు చేశారు. ఆదివాసులు తుపాకీ నీడలో జీవించవలసి వస్తోంది. వారి దైనందిన స్వేచ్ఛపై ఆంక్షలను విధించారు. వారు తమ పండుగ కోసం సంత నుండి కేవలం బియ్యం కొనుక్కొని వస్తుంటే కూడా భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలలో బస్తర్‌లో వందలాది క్యాంపులను ఏర్పాటు చేసారు. ఒక అంచనా ప్రకారం, అక్కడ ప్రతి 9 మంది ఆదివాసులకు ఒక భద్రతా సిబ్బంది ఉన్నాడు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ పరిధిలోని కోల్హాన్, సరండ అడవులలోని కేవలం కొన్ని వేల ఎకరాల ప్రాంతంలోనే కనీసం 25 క్యాంపులను  ఏర్పాటు చేసారు.

గృహ మంత్రి అమిత్ షా పదే పదే 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెబుతున్నాడు. కానీ అంతమవుతున్నది మాత్రం ఆదివాసులే.

2024 జనవరిలో బస్తర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించింది. దీనిలో ఇప్పటివరకు దాదాపు 500 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఆదివాసులే. మరణించిన వారిలో మావోయిస్టులు ఉన్నారు, అనేకమంది సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఈ హత్యలు చేసినందుకు భద్రతా బలగాలకు కోట్లాది రూపాయల బహుమతులు లభించాయి.

కేవలం సాయుధ ఉద్యమాలకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, విస్థాపన, దౌర్జన్యంగా జరుపుతున్న గని తవ్వకాలు, క్యాంపుల నిర్మాణం, పెరుగుతున్న సైనికీకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు చేస్తున్న శాంతియుత ప్రజాస్వామ్య నిరసనను కూడా అణచివేస్తున్నారు. బస్తర్‌లోని ఆదివాసీ యువజన సంఘం – మూలవాసీ బచావో మంచ్ – దౌర్జన్యంగా పోలీసు క్యాంపులు ఏర్పాటు, విస్థాపనకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతోంది. ఈ మంచ్‌ను నిషేధించి, దాని యువ నాయకులను యుఎపిఎ చట్టంతో సహా వివిధ తప్పుడు ఆరోపణలపైన అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

క్రమంగా, అనేక ప్రాంతాలలో మావోయిజం అదృశ్యమైనా, క్యాంపులు తాత్కాలికం నుండి శాశ్వతంగా మారాయి. క్యాంపుల స్థాపనకు విరుద్ధంగా, ఆదివాసీ ప్రాంతాల్లోని అనేక పాఠశాలలను ‘హేతుబద్ధీకరణ’ పేరుతో మూసివేసి, దూరంగా ఉన్న పాఠశాలల్లో విలీనం చేసారు. దీనిని బట్టి ప్రభుత్వం దేనికి ప్రాధాన్యతనిస్తోంది అనే విషయాన్ని అంచనా వేయవచ్చు. భద్రతా బలగాల క్యాంపులు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే తరచుగా గని తవ్వకాలు లేదా ఏదైనా కార్పొరేట్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందనే విషయం ఎవరికీ తెలియనిది  కాదు.

ఇటీవలి కాలంలో అనేకమంది అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు, కేడర్‌లు లొంగిపోతున్నప్పటికీ, ఆదివాసుల మూల సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి అలాగే ఉంది.

ఆదివాసీ మనుగడపై హిందూత్వ దాడి:

ఒకవైపు వనరుల దోపిడీ, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆదివాసుల రాజ్యాంగ హక్కులను రద్దు చేస్తూంటే, మరోవైపు ఆదివాసీ సమాజంపైన హిందూత్వ దాడి నిరంతరం పెరుగుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) హిందూత్వ భావజాలం ప్రకారం, ఆదివాసులు హిందూ వర్ణ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్న వనవాసులు.

1952లో ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా వనవాసి కళ్యాణ్ ఆశ్రమ స్థాపన జరిగినప్పటి నుండి, ఆదివాసులలో హిందూత్వ వ్యాప్తి నిరంతరం జరుగుతోంది. దీని కోసం వనవాసి కళ్యాణ్ ఆశ్రమంతో సహా ఇతర హిందూత్వ సంస్థలు అనేక వ్యూహాలను అనుసరిస్తున్నాయి, అవి: ఆదివాసులలో హిందూ మతం, సంస్కృతిని ప్రచారం చేయడం, ఆదివాసుల సంస్కృతి, పూజా స్థలాలు మొదలైన వాటిపైన మతపరమైన ఆధిపత్యం చెలాయించడం, క్రైస్తవ ఆదివాసులకు వ్యతిరేకంగా ఇతర ఆదివాసులను రెచ్చగొట్టడం మొదలైనవి.

ఆదివాసులలో మతం పేరుతో విభజన సృష్టించడానికి, వారిని హిందుత్వం వైపు ఆకర్షించడానికి క్రైస్తవ ఆదివాసులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుండి తొలగించడం అనే ముఖ్యమైన డిమాండ్‌తో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.. ఈ ప్రక్రియ గత దశాబ్దంలో మరింత వేగవంతమైంది.

జార్ఖండ్‌తో సహా ఇతర రాష్ట్రాలలోని ఆదివాసులలో ఒక పెద్ద సెక్షన్ తమ స్వతంత్ర ధార్మిక వ్యవస్థ (ఉదాహరణకు, జార్ఖండ్‌లో సర్నా ధర్మం) కోసం అధికారిక గుర్తింపు కోసం నిరంతరం పోరాడుతోంది. మరోవైపు, హిందూత్వ సంస్థలు ‘సర్నా-సనాతనం ఒకటి’ వంటి నినాదాలతో వారి స్వతంత్ర ధార్మిక గుర్తింపును హిందూ వ్యవస్థలో భాగంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు, బీజేపీ నాయకులు, హిందూత్వ సంస్థల ద్వారా జార్ఖండ్‌లోని అనేక సర్నా స్థలాల (ఆదివాసుల పూజా స్థలాలు) నుండి మట్టిని సేకరించి ఆలయ నిర్మాణానికి పంపడం జరిగింది. అదే సమయంలో, సునిశితమైన ప్రణాళికతో ఆదివాసులను తీర్థయాత్ర కోసం అయోధ్యకు కూడా తీసుకువెళ్లారు.

జనాభా లెక్కలలో మతం వరుసలో ఆదివాసీ మతం కోసం ఒక ప్రత్యేక కోడ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం, జనాభా లెక్కలలో కేవలం 6 మతాలను – హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన్ – మాత్రమే ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. అయితే, ‘ఇతర’ విభాగంలో నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల, ఈ 6 మతాలకు చెందని చాలా మంది ఆదివాసులను జనగణన సిబ్బంది తరచుగా హిందూ మతంలోనే చేర్చుతున్నారు.

జార్ఖండ్ ప్రభుత్వం 2020లో ఆదివాసుల ప్రత్యేక మత కోడ్ డిమాండ్‌పైన అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, కేంద్రానికి పంపింది. కేంద్రం 2026లో జరగబోయే జనాభా లెక్కలలో కుల గణనను జోడించినప్పటికీ, ఆదివాసుల కోసం ప్రత్యేక మత కోడ్‌ను జోడించలేదు. బీజేపీ ‘నూతన భారతంలో’ ఆదివాసులు తమ స్వతంత్ర గుర్తింపుతో కాకుండా, సనాతన గుర్తింపుతోనే జీవించాల్సి ఉంది.

తూర్పు, మధ్య భారతదేశంలోనే కాక, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ ఎజెండాకు మరింత బలం చేకూరింది. అక్కడ హిందూత్వ సంస్థల ద్వారా సనాతన ధర్మాన్ని ఆది ధర్మంగా ప్రదర్శించడం ద్వారానూ, క్రైస్తవ ఆదివాసులను బయటి మతంతో ముడిపెట్టడం ద్వారా వివిధ ఆదివాసీ-స్థానిక సముదాయాలను హిందూత్వ ఎజెండాలో చేర్చుకుంటున్నారు. దీనికి అత్యంత భయంకరమైన ఉదాహరణ మణిపూర్‌లో జరిగిన హింస; దీనిపై కేంద్ర ప్రభుత్వం వహించిన మౌనం.

మణిపూర్‌లోని ఆదివాసీ-స్థానిక సముదాయాల (కుకీ, నాగా, మీతేయ్) పరస్పర ఘర్షణల చరిత్రను బిజెపి హిందూత్వ ఆధారిత పాలన మరింత తీవ్రం చేసింది. బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలల తరబడి మౌన ప్రేక్షకులుగా కూర్చుని, హింస జరగడానికి అనుమతించాయి.

ఆదివాసులు వర్సెస్ కార్పొరేట్ పాలన:

ఆదివాసులు నిరంతరం తమ హక్కుల ఉల్లంఘనను, వనరుల దోపిడీని స్థానిక స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆదివాసులలో ఒక పెద్ద భాగం హిందుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. అయితే, గత రెండు దశాబ్దాలలో ఆదివాసులలో బీజేపీ ఎన్నికల పట్టు చాలా పెరిగిందనేది కూడా నిజం. దేశంలోని 543 లోక్‌సభ స్థానాలలో 8 శాతం స్థానాలను ఆదివాసుల కోసం రిజర్వ్ చేసినప్పటికీ, జాతీయ స్థాయిలో ఆదివాసుల బలమైన రాజకీయ స్వరం లేకపోవడం కనిపిస్తోంది.

మరోవైపు, జార్ఖండ్‌లో ఆదివాసీ సమస్యలపైన ఎన్నికల్లో గెలిచిన జెఎంఎం సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆదివాసీ హక్కుల పట్ల ఉదాసీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకుని, ఆదివాసులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సంఘటితం అవ్వాలి; బలమైన రాజకీయ జోక్యం కూడా ఉండాలి.

 (రచయిత సామాజిక కార్యకర్త; జార్ఖండ్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.)

07/11/2025

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply