కాలం తన పరుగును ఆపదు. రోజులు మారుతాయి, రహదారులు మారుతాయి, పనులు మారుతాయి…కాని మనిషి హృదయంలో మాత్రం నిశ్శబ్దం నెమ్మదిగా పెరుగుతూనే ఉంది. దాదాపు పాతికేండ్ల క్రితం మమతా కాలియా గారు రాసిన “పరుగు” నవల. నేటి వేగవంతమైన జీవితాన్ని చూస్తే నిజమేనని మనకు అనిపిస్తుంది. తరాలు ఎంత మారినా, మనిషి అంతరంగంలో కలిగే ఒంటరితనం మాత్రం మారలేదు.
బయట శబ్దం పెరిగింది, లోపల సున్నితమైన నిశ్శబ్దం మరింత గాఢమైంది. మనుషులు లక్ష్యాల వెంట పరుగెత్తడంలో బిజీగా ఉన్నారు కాని ఆ పరుగులో తన వాళ్లను, తన బంధాలను, తన వెచ్చదనాన్ని…చాలా సార్లు తమను తామే నెమ్మదిగా వెనుక వదిలిపెడుతున్నారు. “పరుగు” నవల ఈ మౌన దూరాలను చాలా ఆప్యాయంగా చూపిస్తుంది.
పవన్–స్టెల్లా వంటి పాత్రలు సంపాదన, భవిష్యత్తు, ఉద్యోగ భద్రత వంటి పేర్ల కోసం ఎలా ఒకరి చేతిని ఇంకొకరు విడిచిపెట్టి దూరమైన రద్దీ రహదారుల్లో ఒంటరిగా నడుస్తారో పుస్తకం చాలా మృదువుగా చెప్పుతుంది. పెళ్లి అయిన వెంటనే ఒక్కొక్కరు వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉండడం ఇది కుటుంబమా, లేదా రెండు చోట్ల రెండు అస్తిరమైన జీవితాలా? ఈ ప్రశ్నను నవల ఎంతో నిదానంగా మన గుండెల్లో ఉంచుతుంది. ఇప్పటి జీవితం ఒక రొటీన్. అలారం మోగడం, పనికి వెళ్లడం, మీటింగ్‌లు, గడువులు, స్క్రీన్ ముందు రోజు ముగిసేలోపే మనిషి తన మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాడు. కానీ ఆ మర్చిపోయినదే అతని అసలు జీవితం అని గ్రహించే సమయం చాలా మందికి రాదు. మనిషి యంత్రంలా పని చేస్తూ నిజమైన సంబంధాల్ని చూసే కళ్ళు నెమ్మదిగా అలసిపోతాయి. మనిషి దగ్గర ఉండాలి అనుకున్న వారే తనతో మాట్లాడే వారికి సమయం లేనట్టుగా దూరమైపోతారు. కంపెనీలు కోరుకునే పని, మనిషి ఇవ్వాల్సిన ప్రేమను, సమయాన్ని చూపకుండా తీసుకుపోతుంది. ఈ నవల ఆ నిజాన్ని ఎక్కడా వేలుపెట్టకుండా, ఏ పదం ఘాటుగా లేకుండా చాలా సున్నితంగా చెబుతుంది. సంబంధాలు ఒక్కరోజు విరగవు. అవి నెమ్మదిగా ఎండిపోతాయి. నీళ్లు తగ్గిన మొక్కలా ఆప్యాయత తగ్గిన బంధాలు నెమ్మదిగా పొడిబారిపోతాయి. ఈ రోజుల్లో మిత్రుల కలయిక ఒక ఫోన్ కాల్ సమయంగా మారిపోతోంది. కుటుంబం ఒకే గదిలో ఉన్నా ప్రతి ఒక్కరు వేర్వేరు స్క్రీన్లలో వేర్వేరు ప్రపంచాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు మాట్లాడాలనుకుంటే
మనకు సమయం దొరకదు. కాని వాళ్ల ఎదురు చూపులో ఎంత ప్రేమ, ఎంత నిశ్శబ్దం, ఎంత తపన దాగి ఉందో మనకు కనిపించదు.
ఈ నవలలో వచ్చే ఒక NRI కొడుకు తండ్రి మరణించినపుడు అంతక్రియలకు వెంటనే రాలేనని తండ్రి దేహాన్ని మార్చురీలో ఉంచమని అనే ఆ మాటల్ని చదువుతున్నప్పుడు మన హృదయంలో చిన్న నొప్పిలా నిలబడిపోతుంది. “వీలైతే వస్తాం” అనే మాట ఎలా ఒక ఒంటరితనంగా మారుతుందో ఈ నవల ఎంతో సున్నితంగా చూపిస్తుంది.
బానిసత్వం రూపం మారింది అని మనమంతా నమ్ముకున్నాం. కానీ నేడు మనం చూసేది బానిసత్వం అసలు పోకపోవడం… అది కేవలం వేరే పేర్లను ధరించడం. సంకెళ్లు ఇప్పుడు ఇనుముతో కాదు ప్రతిరోజూ నింపాల్సిన టాస్క్‌లతో, పరిగెత్తాల్సిన టార్గెట్లతో, ల్యాప్‌టాప్ వెలుగుతో మృదువుగా తయారవుతున్నాయి. కాని ఈ బంధనాల గురించి నవల ఎక్కడా అరవదు… ఏ పదమూ కఠినంగా వుండదు. అది కేవలం మన తలలను మృదువుగా తట్టి “ఇలా జీవించడం వల్ల ఎవరిని కోల్పోతున్నావో ఒకసారి చూసుకో” అని మాత్రమే చెబుతుంది.
చివరగా చెప్పేదేమిటంటే. “పరుగు” నవల మన వెన్నుపై మోపే సందేశం పరుగులో ఉన్నవాళ్లకి శబ్దం వినిపిస్తుంది, నడుస్తున్న వాళ్లకి మనసు వినిపిస్తుంది.
జీవితం అంతా పరుగు కాదు. పరుగు ఆపిన తర్వాత మనతో ఉంటాయేమిటంటే మనిషి మాట, మనిషి చేతి వెచ్చదనం, మనిషి ప్రేమ, మనతో కలిసి ఉండాలనుకునే వాళ్లు. మమతా కాలియా గారు హిందీలో నిర్మించిన ఈ సున్నితమైన ప్రపంచాన్ని, డాక్టర్ వి.ఎల్. నరసింహం శివకోటి గారు ఎంతో మృదువుగా తెలుగులోకి తీసుకువచ్చారు.
ప్రచురించిన వెన్నెల పిట్ట ఈ నిశ్శబ్ద కథకు అందమైన రెక్కలు జోడించింది. ఈ నవల మనకు చివరగా చెప్పేది
పరుగులో ఏం గెలిచామన్నది ముఖ్యమేమీ కాదు, ఆ పరుగులో మనం ఎవరిని మరచిపోయామన్నది, ఏం కోల్పోతున్నాం అనేది మాత్రమే మనం తెలుసుకోవాలి.




