అమరజీవి కామ్రేడ్ రాధక్క(సడ్మెక్ రుక్మిణి)ను గుర్తు చేసుకోవడం అంటే, మహారాష్ట్రలోని గడ్ చిరోలీ జిల్లా ఉద్యమాన్ని ఒక్కసారి మన కళ్ల ముందు పరచుకోవడమే. కామ్రేడ్ రాధక్క విప్లవోద్యమంలో భాగం అయ్యేనాటికి గడ్‌చిరోలీ జిల్లా ఒక ప్రత్యేక జిల్లాగా ఇంకాఉనికిలోకే రాలేదు. ఆనాడు అది దేశంలోని అతి పెద్ద జిల్లాలలో ఒకటిగా లెక్కించబడే చంద్రపుర్ (చాందా) లోనే భాగంగా ఉండేది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఆ జిల్లాల రైతాంగ పోరాటాలపై ప్రభుత్వ సాయుధ బలగాల అణచివేత చర్యలు తీవ్రం చేశాయి. అక్కడి ఉద్యమాన్ని కాపాడుకుంటూ, దానిని ఉన్నత స్థాయికి పురోగమింపచేయడంలో భాగంగా దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా మలిచే లక్ష్యంతో చేపట్టిన గెరిల్లా జోన్ నిర్మాణ కర్తవ్యంతో విప్లవోద్యమం గోదావరి నదిని దాటి చంద్రపుర్ అడవులలోకి ప్రవేశించింది.
అప్పటికి, కామ్రేడ్ రాధక్క యవ్వనప్రాయంలో వున్నచురుకైన గ్రామీణ ఆదివాసీ యువతి. ఆమె పేరు రుక్మిణి, కానీ, గ్రామాలలో స్త్రీ-పురుషులలో ఎవరినైనా ఈరకంగా సంబోధించడం వారెరుగరు. వారంతా ఆమెను ‘రుక్ని’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. వారిది సడ్మెక్ గోత్రం. ఆనాటి రుక్మిణి, ఈనాటి ఉద్యమ రాధక్క 43 సంవత్సరాల విప్లవోద్యమ ప్రస్థానం కలిగిన కాకలుతీరిన మావోయిస్టు నాయకురాలు భౌతికంగా మనకిక లేదు. ఆ కామ్రేడ్ తీవ్ర అనారోగ్యంతో 2025 మార్చ్29 నాడు తీవ్ర అనారోగ్యంతో అజ్ఞాత ప్రాంతంలో కన్నుమూసింది. వేలాది పీడిత ప్రజల అభిమాన విప్లవకారిణి, అణగారిన ఆదివాసీ ప్రజల ఆశాజ్యోతిగా వెలిగిన ఆ కామ్రేడ్ అజ్ఞాత ప్రాంతంలో, అందరికీ దూరంగా కన్నుమూయడం ఆపరేషన్ కగార్ కర్కశత్వాన్ని చాటుతోంది. ఆ కామ్రేడ్ ఉజ్వలమైన విప్లవోద్యమ ప్రస్థానాన్ని గురించి తెలుసుకునే ముందు ఆ కామ్రేడ్‌కు వినమ్రంగా విప్లవ జోహార్లర్పిద్దాం. ఆమె ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుదామని శపథం చేద్దాం.
కామ్రేడ్ రాధక్క తన అలుపెరుగని సుదీర్ఘ విప్లవ ప్రస్థానంలో ఎన్నడూ ఎలాంటి ఊగిసలాటకు గురి కాలేదు. కామ్రేడ్ రాధక్క 1982లో ఏర్పడిన గడ్ చిరోలీ జిల్లా అహెరీ తాలూకా, పెద రాజారాం గ్రామంలో దాదాపు 65 సంవత్సరాల క్రితం ‘రాజ్ గోండు’ (కోయ) తెగలో జన్మించింది. ఆమె తల్లి-తండ్రులకు తొల్చూరు బిడ్డ. ఆ కామ్రేడ్‌కు ఒక తమ్ముడు కామ్రేడ్ సమ్మన్న, ఒక చెల్లె ఉండేది. పెదరాజారాం అప్పటికి ఆ చుట్టుపక్కల ఊర్లలోకెల్లా పెద్ద ఊరు కిందే లెక్క. ఆ ఊళ్లో బయటి నుండి వెళ్లిన సాహుకార్లు వుండేవారు. గౌడ కులస్థులు, దళితులు (మాల,మాదిగ) వుండేవారు. జిల్లాలో మాలవారిని నేతకాని లేద మహర్‌లని పిలిచేవారు. వారిలో కాస్త విద్యాబుద్ధులు తెలిసిన వారు తమను బౌద్ధగా పరిచయం చేసుకునేవారు. ఇది, బాబా సాహెబ్ అంబేడ్కర్ తన లక్షలాది అనుయాయిలతో మతమార్పిడి చేసుకున్న ఫలితం. రాజారాం ఊళ్లో అప్పటికే టీచర్లు లేకపోయినా ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వున్నప్పటికీ, చదువు-సంధ్యలు ఎరుగని అందరాదివాసీ ఆడపిల్లల్లాగే కామ్రేడ్ రుక్ని పెరిగింది.
కామ్రేడ్ రుక్మిణి తల్లి-తండ్రులు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు కూలీ పని కూడ చేసుకునేవారు. చిన్నతనం నుండి రుక్మిణి కూడ కుటుంబ శ్రమలో పాలుపంచుకునేది.
1980లలో గడ్‌చిరోలీ జిల్లాలో అటవీ శాఖ వారి అభివృద్ధి కార్యక్రమాలు ‘కార్పొరేషన్’ తరుఫున (ఖీశీతీవర్ ణవఙవశ్రీశీజూఎవఅ్ జశీతీజూశీతీa్‌ఱశీఅ) జరుగుతుండేవి. మరోవైపు, గడ్‌చిరోలీ అడవులలో ‘బల్లర్ పుర్ (బల్లార్షా) పేపర్ మిల్లు’ వారి వెదురు నరికే పనులు, రోడ్డు మరమ్మత్తులు సైతం యేడాదిలో దాదాపు ఎనిమిది మాసాలు ముమ్మరం గానే జరిగేవి. యేడాదిలో కనీసం 15 రోజులు వేసవిలో తునికాకు సేకరణ పనులు జనం పోటీలు పడి చేస్తుండేవారు. ఈ పనులతో ప్రజలకు నగదు ఆదాయం లభించేది. ఈ పనులన్నింటిలో ప్రభుత్వ అటవీ శాఖ ఉద్యోగులు, పేపర్ మిల్లు ఉద్యోగులు, కంట్రాక్టర్లు, ఆదివాసీ పీడిత ప్రజల శ్రమశక్తి యధేచ్ఛగా దోపిడీ చేసేవారు. దానికి తోడు ఆదివాసీ యువతులపై ఇచ్ఛానుసారంగా లైంగిక దోపిడీ జరిగేది. వీటిని ఎదిరించడంలో కామ్రేడ్ రుక్మిణి యువతులందరికి నాయకురాలుగా పేరు తెచ్చుకుంది. ఆమెలోని మిలిటెన్సీ ఫలితం అది. ఆ మిలిటెన్సీనే ఆమెను విప్లవోద్యమం ఒడిలోకి చేర్చింది. ఆమె ఆ పనులలో పాల్గొంటుండడంతో ఆమెకు మరాఠీ భాష నేర్చుకోవడానికి అవకాశం చిక్కింది.
విప్లవోద్యమ ప్రారంభంలోనే, ఆదిలాబాద్ నుండి గోదావరి దాటి సిరొంచ అడవులలోకి వెళ్లి తొలి రాత్రి గడపడంతోనే, మరుసటి రోజు ముయ్యబోయినపేటలో పోలీసులు గెరిల్లాలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో కామ్రేడ్ పెద్ది శంకర్ అమరుడై ఎమర్జన్సీ తరువాత పోలీసు కాల్పులలో అసువులు బాసిన తొలి అమరవీరుడిగా చరిత్ర పుటలలోకెక్కి త్యాగాల అధ్యాయాన్ని లిఖించుకున్న విప్లవ సందేశం ఆ అడవి, ఆ జిల్లా, ఆ రాష్ట్రమే కాదు, యావద్దేశాన్ని ఆవహించి ఆలోచింపచేసింది. ఆ ప్రాంత యువతను మరీ కదిలించింది. వారిలో కామ్రేడ్ రుక్మిణి ఒకరు.
1980ల ప్రారంభంలో ఒక మహిళ అందులో ఆదివాసీ మహిళ విప్లవోద్యమం గురించి ఎన్నడూ కనీవినీ ఎరుగనిది విప్లవోద్యమంలో చేరడం అత్యంత సాహసంతో కూడుకున్నదే. ఒకవైపు నక్సలైట్లు దొంగలు, హంతకులు, వారిని తరిమికొట్టండి అని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ముయ్యబోయినపేటలో కామ్రేడ్ పెద్ది శంకర్ నెత్తుటితో నాగేటిచాళ్లు నాని వున్నాయి. భయం, ఆందోళన, ఎటూ అర్థం కాని, పాలుపోని స్థితి ప్రజలది. ఇలాంటి స్థితిలో విప్లవకారులే నిలబడలేకపోయి, పెద్ది శంకర్ అమరత్వం తరువాత ఓ మూడు మాసాలు ఆ ప్రాంతాన్ని వదిలి తిరిగి గోదావరి దాటి వెనక్కి ఆంధ్రప్రదేశ్ లోని మహదేవ్‌పూర్ అడవులలోకి వెళ్లక తప్పలేదు. పరిస్థితులను సమీక్షించుకొని తునికాకు సేకరణ పనులను అవకాశంగా తీసుకొని విప్లవకారులు మళ్లీ గోదావరి దాటి మహారాష్ట్ర అడవులలోకి వెళ్లారు. మిగతా దళాలు దండకారణ్యంలోని బస్తర్, ఆదిలాబాద్, మన్యం ప్రాంతాలలో పని చేయసాగాయి.
విప్లవకారులు ప్లాన్ చేసుకున్న విధంగానే తిరిగి సిరొంచ అడవులలోకి వెళ్లారు. అది తునికాకు సేకరణ సీజన్. ప్రజలు తునికాకు సేకరించుకొని కంట్రాక్టర్లకు కారుచౌక ధరలకు అమ్ముకుంటుంటారు. ఆ సమస్యను తీసుకొని ఆకులను అధిక రేటుకు అమ్ముకునేలా ప్రజలను ప్రోత్సహించి సమ్మె పోరాటాన్ని పరిచయం చేశారు. ఆ పోరాటంలో 70 ఆకుల కట్ట ఒక్కంటికి రేటు మూడు పైసల నుండి ఆరు పైసలకు పెరిగింది. ఆ రకంగా ప్రజలు అమ్ముకునే ఆకుల ధరను గెరిల్లాలు పెంచగలిగారు. మరోవైపు గెరిల్లాలకు కలసి వచ్చిన విషయమేమంటే, చాలా వరకు అక్కడికి వెళ్లేవారు తెలంగాణాకు చెందిన కాంట్రాక్టర్లే కావడం. వారికి విప్లవోద్యమంతో పరిచయం వుండడంతో, వారు దాని పట్ల సానుకూలంగా వ్యవహరించి ప్రజలకు అధిక రేటు చెల్లించి ఆకులు కొనుగోలు చేయడంతో ప్రజలలో విప్లవకారుల పట్ల పోలీసులు సృష్టించిన దుష్ప్రచార దుమారమంతా దూది పింజల్లా ఎగిరిపోయింది. అదే సమయంలో అహెరీ మహారాజు విప్లవకారులను స్వంతం చేసుకుంటూ వాళ్లూ మన పిల్లలేనని చేసిన ప్రచారం విప్లవకారులను ప్రజలు అర్థం చేసుకోవడానికి బోనస్ పాయింట్ అయింది. ఈ పరిస్థితులలో కామ్రేడ్ రుక్మిణి విప్లవోద్యమంలో చేరడం, దానికి కొండంత బలాన్నిచ్చింది. ఇక విప్లవకారులు వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితులే ఎన్నడూ దాపురించలేదు. ఆ ఉద్యమం గత 45 సంవత్సరాలుగా గడ్‌చిరోలీ అడవులను అరుణారుణం చేస్తూ కొనసాగుతోంది. అందులో కామ్రేడ్ రుక్మిణి, ఉద్యమ పొత్తిళ్లలోనే తొలి పొద్దుగా చేరి రాధక్కగా మారి 44 సంవత్సరాల చరిత్రకు నాయకురాలైంది. సాయుధమైంది. ఆమెను ఏ దుష్ప్రచారం అడ్డుకోలేకపోయింది. నాలుగు అడుగుల రెండు ఇంచులకు మించని రాధక్క బొద్దుగా వుండి వీపున కిట్టుతో, జబ్బకు తుపాకీతో ఆ ఆదివాసీ గూడేలలోకి గెరిల్లాల వెంట యూనిఫాంలో వెళ్లడం ఎంతో మందిని ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంది. అప్పటివరకు ప్రజలలో నక్సలైట్లంటే గూడుకట్టుకున్న అనేక ఊహలు, సందేహాలు, భయాలు ఆమెతో పంచుకొని ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకునేవారు. ఆమె భర్తీ ఇక అనేక మంది యువతీ, యువకులను విప్లవోద్యమం వైపు ఆలోచించేలా చేసింది. అలా ఆలోచించిన వారిలో అనేక మంది సాయుధమయ్యారు. గ్రామాలలోని తెగ పెద్దలు, అనుభవజ్ఞులు తమ పిల్లలకు ఎంతో నచ్చ చెప్పి తుదివరకు దళాలతోనే ఉండాలనీ సాగనంపేవారు. అప్పటికే గడ్‌చిరోలీలో విప్లవకారులకు ‘అన్నలు’ పర్యాయపదంగా మారింది. పొరుగున ఉన్న బస్తర్‌లో నర్కటోర్ (చీకటోల్లు లేక రాత్రులందు సంచరించేవారు)గా వ్యవహరించసాగారు. ఆ అన్నలకు రాధక్క తోడై అన్నలు-అక్కలు అనే పదబంధానికి ప్రాణం పోసింది.
కామ్రేడ్ రాధక్క సాయుధం కావడంతో పాటు ఆ ప్రాంతంలోని అనేక మంది మహిళలు సాయుధం కావడానికి తోడ్పడిరది. ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం అది. మహిళలపై సర్వత్రా కొనసాగుతున్న సామాజిక అణచివేత, వివక్ష, లైంగిక వేధింపులు, మేనరికపు పెళ్లిళ్లు దోపిడీల ఫలితమది. దానితో మహిళలను సంఘటితం చేయడమనే కర్తవ్యం పార్టీ ముందుకు వచ్చింది. 1984 నాటికి గడ్‌చిరోలీలో ‘ఆదివాసీ శేత్ కారీ, శేత్ మజూర్ సంఘటన్’ ఏర్పాటయింది.
కామ్రేడ్ రాధక్క గెరిల్లాగా మారేనాటికి రాజ్ గోండు తెగకన్నా, మాడియా గోండులలో కాలం చెల్లిన గోండు సాంప్రదాయాలు బలంగా కొనసాగుతుండేవి. యువతి పెళ్లి విషయంలో ఆమె అభిప్రాయం అడిగే వాళ్ళే లేరు. తల్లి-తండ్రులు ఎవరిని కుదిరిస్తే వారిని పెళ్లాడాల్సిందే. పుటుల్ పిల్ల అంటూ మేనవాళ్లు ఆ పిల్లకు ఇష్టం వున్నా లేకపోయినా ‘మా విత్తనం’ అంటూ తీసుకెళ్తారంతే.
అలాంటి పెళ్లిళ్ల బారి నుండి తప్పుకొని తిరిగే మహిళలు 1980లలో ఊరికి కనీసం ఒకరిద్దరు వుండేవారు. వారినే కెర్దేలుగా గోండీలో వ్యవహరించేవారు. అలాంటి కెర్దేలను విప్లవోద్యమం ‘రాగో’లుగా మలిచి సాయుధం చేసింది. అలాంటి రాగోలెందరో రాధక్క ద్వారా ఉద్యమంలో చేరారు. పెళ్లయిన యువతులు జాకెట్లు ధరించకూడదు. అర్థ నగ్నంగా వుండాల్సిందే. అలాంటి యువతులకు రాధక్క విప్లవోద్యమం అండగా వుందని ధైర్యం చెప్పేది. రకరకాల తెగ పితృస్వామ్యం యువతులను, మహిళలను హింసించేది, వేధించేది. వాటన్నింటికి విప్లవోద్యమం చెల్లుచీటీ ఇప్పించి మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. విప్లవోద్యమంపై వారిలో అపార నమ్మకం ఏర్పడిరది. మహిళా సంఘంలో చేరిన మహిళ వైపు కన్నెత్తి చూడడానికి ఏ మగాడికి ధైర్యం చాలేది కాదు. మహిళల జీవితాలలో పోరాటాల ద్వారా గౌరవం పెరిగింది.
ఆ సంఘం తన తొలి మహాసభలను కమలాపుర్‌లో జరుపుకోవడానికి పూనుకుంది. కానీ, వాటిని అడ్డుకోవడానికి రాజ్యం అన్ని రకాలుగా కోరలు విప్పింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి ఉత్సాహంగా తండోపతండాలుగా తరలివస్తున్న జనాలకు పోలీసులు దారులు మూసేశారు. తెలంగాణ నుండి కమలాపుర్ చేరుకునే వారిని కామ్రేడ్స్ వరవరరావు, గద్దర్, సంజీవ్ లాంటి రచయితలను, కళాకారులను దారిలోనే అడ్డుకొని గద్దర్, సంజీవ్‌లతో పాటు అనేక మందిని చంద్రపుర్ జైలులో నిర్బంధించింది. ముంబాయి, చంద్రపుర్ ల నుండి తరలివస్తున్న అనురాధ గాంధీ, మిలింద్ తేల్తుంబ్డే మున్నగువారినీ అడ్డుకుంది. తరువాత వారందరినీ ఆనాటి సోషలిస్టు నాయకులలో ఒకరైన మిత్రులు, చంద్రపుర్ లో పేరున్న వకీలు ఏక్ నాథ్ సాల్వే గారు కోర్టు ద్వారా విడిపించారు. ఆ సభలకు ప్రత్యక్షంగా మార్గదర్శకత్వం అందించడానికి పార్టీ కార్యదర్శి కామ్రేడ్ ప్రహ్లాద్ (అమరుడు మల్లోరaల కోటేశ్వర్లు) ముందే అడవికి చేరుకొని గెరిల్లాలను కలుసుకున్నాడు. ఆ సభలను పోలీసులు అడ్డుకొని విప్లవోద్యమం శరవేగంగా రాష్ట్రమంతా ప్రచారం కావడానికి తోడ్పడ్డారు.
అమర కామ్రేడ్ అనురాధ గాంధీ ‘కమలాపూర్ బాటలు మూసి క్రాంతిని అరికట్టలేరు’ అనే పుస్తకాన్ని ప్రచురించింది.
కమలాపూర్ మహాసభను బహిరంగంగా నడువనీయకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. కానీ, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రహ్లాద్ చొరవతో రహస్యంగా ఏ.కే.ఎస్.ఎస్ మహాసభ జరిగింది.
కామ్రేడ్ సిడం లచ్చన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ వెన్వెంటనే, కామ్రేడ్ ప్రహ్లాద్ నాయకత్వంలోనే అడవులలోని గెరిల్లాలకు తొలి వివాహాల వేడుకలు జరిగాయి. 1984 మార్చ్ 1 నాడు కామ్రేడ్ రాధక్క వివాహం ఆ ప్రాంత దళ కమాండర్ గోపన్నతో జరిగింది. వీరి వివాహంతో పాటు మరో రెండు వివాహాలూ జరిగాయి. కామ్రేడ్ రాధక్క వివాహం జరిగిన సరిగ్గా 40 ఏళ్ల తరువాత ఆమె అమరత్వం ఆమె జీవితకాలంలో ఆ జంట నిలిపిన అనేక ఆదర్శాలను విప్లవోద్యమంలోని పల్లె, పల్లె నమోదు చేసుకుంది. వారి వివాహం ఆ తరువాతి అనేక గెరిల్లాల వివాహాలకు ఆదర్శమైంది.
కమలాపూర్ మహాసభ విచ్ఛిన్న ప్రభావం స్థానికంగా తీవ్రమైన అణచివేత రూపంలో ముందుకురాగా, రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోద్యమ సందేశం చేరుకొని అన్ని సెక్షన్ ల ప్రజలను ముఖ్యంగా యువతను ఆలోచింపచేసింది. స్థానికంగా ప్రజలపై విరుచుకుపడిన నిర్బంధ ప్రభావం చాలా తీవ్రంగా వుండిరది. అక్కడి ప్రజలు ముందెన్నడూ అలాంటి అణచివేతను ఎదుర్కోని ఫలితంగా గెరిల్లాల పట్ల ఎంత ప్రేమాభిమానాలున్నా, వారికి తిండి పెట్టడానికి సాహసించేవారు కాదు. అలాంటి పరిస్థితులలో, రాధక్క సహ ఉద్యమంలో చేరిన మరికొంత మంది స్థానిక కామ్రేడ్స్‌తో పాటు గెరిల్లాలంతా రాత్రి వేళ ఇల్లిల్లు తిరిగి పంచె పట్టి తిండి అడుక్కతిని విప్లవం కోసం జీవించారు. సమాజంలో ఎవరు ఏ కులం వారైనా, ఎవరు ఏ తెగవారైనా, వారు అనుసరించే కుల కట్టుబాట్లు ఏవైనా, విప్లవోద్యమం మనుషులలోని ఆ భావాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తుడిచివేస్తుందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకెందుకు? కుల నిర్మూలనకు, పంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు కావాలని ఆశించిన వారు విప్లవోద్యమ అనుభవాలను చూడవచ్చు.
ఆ పరిస్థితులలో వందలాది మంది ఆదివాసీ, గైరాదివాసీ రైతులను పోలీసులు అరెస్టు చేసి ‘టాడా’ (ప్రస్తుత ఊపాకు తొలి రూపం) కేసులో నిర్బంధించారు. ఆ రోజుల్లో గడ్ చిరోలీ, చంద్రపుర్, భండారా జిల్లాలలో టాడా బాధితులపై అధ్యయనం చేసి పాత్రికేయులు కామ్రేడ్ పుణ్య ప్రసూన్ బాజ్ పేయి 1990ల నాటికే సవివరమైన నివేదికను వెలుగులోకి తెచ్చాడు. టాడా పోయి పోటా వచ్చినా, పోటా పోయి ఊపా వచ్చినా ఈ మూడు దశాబ్దాల కాలంలో గడ్‌చిరోలీలో టాడా పీడితులు అనేక మంది కన్నుమూసినా సజీవంగా మిగిలిన వాళ్లు మాత్రం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతునే వున్నారు. భయాందోళనలతో తల్లడిల్లుతున్న స్థానిక ప్రజలు ‘అన్నలను’ కలువలేకపోతున్నందుకు ఎంతగానో తన్లాడుతున్నారు. వస్తుగత పరిస్థితులను తెలుపుతూ ప్రజలకు ధైర్య సాహసాలను ఇస్తూ విప్లవోద్యమం ద్వారా అన్నింటిని అధిగమించగలుగుతామనే సారంతో కామ్రేడ్ సాధన కలం నుండి ‘జిల్లాల్లోనా జిల్లా వుందిరా, గడ్‌చిరోలీ జిల్లా వుందిరా’ అంటూ ఆజిల్లా విశిష్టతలతో, ప్రజా శక్తిని ఎత్తిపడుతూ వెలువడిన పాటను కమాండర్ గోపన్న సహ గెరిల్లాలు ఊరూరా పాడి ప్రజలను సంఘటితం కావడానికి ఉద్యుక్తులను చేశారు. ఆ రోజుల్లో కామ్రేడ్ రాధక్కకు అత్యంత ఇష్టమైన పాట గదర్ రాసిన ‘శంకరన్న దళం పోరెల్లిపోంగా రావణా ఉయ్యాలో, అయ్యయ్యో దేవనా ఉయ్యాలో, ఎనుకనుంచి యముడు తూట పేల్చిండో…..’’ ఊరూరా వినిపించి ప్రజల కోసం నెత్తుర్లు ధారపోసిన ఆ అమరున్ని పరిచయం చేసేది. ఆ నెత్తుటి త్యాగాల ఫలం, గడ్‌చిరోలీ ఉద్యమం. ఆ ఉద్యమం వెలుగు తార కామ్రేడ్ రాధక్క. రాజారాం రుక్మిణి.
‘ప్రళయమే సంభవిస్తే సముద్రం సైతం తన మర్యాదలను వదిలేస్తుంది, కానీ, ఎంతటి మహా విపత్తులెదురైనా సజ్జనులు మాత్రం మర్యాదలను వదిలిపెట్టరు’ అన్న నానుడి రాధక్క విషయంలో అక్షరాల నిరూపితమైంది. ఆమె తన జీవితకాలంలో అనేక నిర్బంధాలను, అణచివేతలను చూసింది. కామ్రేడ్ రాధక్క లాంటి యువతులు పదుల సంఖ్యలో సాయుధం కావడంతో గ్రామాల్లో ఆదివాసీ బంధుత్వాల యువతులు, మహిళలు ఉత్సాహంగా ముందుకు రాసాగారు. వారందరిని సంఘటితం చేసి విడిగా మహిళా సంఘం ఏర్పర్చాలనీ డివిజన్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ, అప్పటికి పార్టీలో విడిగా మహిళా సంఘాల నిర్మాణం వుండదనే ఒక అస్పష్టమైన, అహేతుకమైన, తప్పుడు అభిప్రాయం వుండిరది. దానితో విభేదిస్తూ ఒక స్పష్టతతో, మహిళా విముక్తి లక్ష్యంతో 1986లో ‘క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్’ ను ఏర్పర్చడం పార్టీ నాయకత్వంలోని విప్లవోద్యమంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది.
ఆ సంఘం గత నాలుగు దశాబ్దాల కాలంలో లక్షకు పైగా మహిళలను సంఘటితం చేస్తూ వందలాది మహిళలను మహిళా విముక్తి మార్గంలో సాయుధం చేసింది. అనేక ఉద్యమ ప్రాంతాలలో మహిళా సంఘాల ఆవిర్భావానికి దారులు చూపింది. ఆకాశంలో సగం, పోరాటంలో సగం అంటూ సుత్తీ కొడవలి నక్షత్రం హత్తిన జెండాను ఎగురవేస్తూ సమాన హక్కుల కోసం, అవకాశాల కోసం పోరు సలుపుతూ ‘ఆధే ఆస్మాన్ కే చమక్తే సితారా’ లెంతో మంది అమర జీవులయ్యారు. వారి సంఘానికి కామ్రేడ్ ప్రత్యూష (కామ్రేడ్ మడావీ దాదాగా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే అమరుడు పసుల రాంరెడ్డి, కోరుట్ల) ‘నారీ ముక్తీ జెండా హం ఫహరాయేంగే, శోషన్ ముక్తీ జెండా హం లహరాయేంగే’ అనే అమర జెండా గీతకను అందించాడు.
కామ్రేడ్ రాధక్క ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో వివిధ స్థాయిలలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించింది. ఆమె మహిళా సంఘానికి కొంత కాలం అధ్యక్షురాలుగా వుంది. ఆమె 1990ల మధ్యలో అహెరీ దళానికి కమాండర్ గా బాధ్యతలు చేపట్టి దాదాపు 4-5 ఏళ్లు కొనసాగింది. ఆ కాలం గడ్‌చిరోలీ విప్లవోద్యమానికి ఒక పరీక్షా కాలం. 1991-94 మధ్య ఆ ఉద్యమం నిప్పులు చెరిగిన నిర్బంధాన్ని ఎదుర్కొంది. 1991లో బూటకపు ఎన్ కౌంటర్లు మొదలయ్యాయి. యేడాది తిరక్కముందే స్థానికంగా 60 మందిని పోలీసులు కాల్చి చంపారు.
ఆరోజులలో వారంతా విప్లవోద్యమానికి ఆయువుపట్టులాంటి వారే. కామ్రేడ్ రాధక్క దళంపై కూడ రెండు సార్లు కాల్పులు జరిగాయి. కానీ, రాధక్క సహ గెరిల్లాలంతా వాటిని ప్రతిఘటిస్తూ సురక్షితంగా బయటపడ్డారు.
విప్లవోద్యమాన్ని దెబ్బ తీయడానికి పోలీసు ఇన్ఫార్మర్ నెట్ వర్క్ పెద్ద ఎత్తున తయారైంది. రకరకాల ప్రభుత్వ సంస్కరణలు వెల్లువెత్తాయి. గడ్ చిరోలీ జిల్లా కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక సంస్కరణల ప్యాకేజీని ప్రకటించింది. దానితో పాటు స్థానిక యువకులతో, ప్రత్యేకంగా విప్లవోద్యమం శిక్షించిన కుటుంబాల యువకులతో గ్రే హౌండ్స్ తరహాలో ‘సీ-60’ (క్రాక్ కమాండోస్) పేరుతో ఒక ప్రత్యేక జిల్లా పోలీసు బలగాన్ని తయారు చేసింది. (ఇపుడు దాని సంఖ్య 500 దాటింది). అడవులలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఉద్యమం నుండి మడమ తిప్పేవారి సంఖ్య పెరగసాగింది. వారిలో తెలంగాణతో సహ మైదాన ప్రాంతాల నుండి వచ్చిన వారు అధికంగా వుండినారు. దళాలపై పోలీసుల కాల్పులు పెరగసాగాయి. అమరత్వాలు పెరిగాయి. అడవులు రక్తసిక్త మవుతున్నాయి. మరో విడత ప్రజలలో భయాందోళనలు మిన్నంటాయి. దళాలలో వారికి నమ్మకమున్న వారు, వారి విశ్వాసాన్ని చూరగొన్నవారు ఊళ్లోకి వెళితేనే గెరిల్లాలకు ఆ పూటకు తిండి దొరికేది. గ్రామాల్లోని ప్రజలు తమకు తెలియని, కొత్త దళ సభ్యులు తిండి కోసం ఊళ్లోకి వెళితే, వారి ముఖం పట్టుకొని ‘నీవు ఎప్పుడు తుపాకీ వదిలి వెళతావో, మా వీపులు మోత మోగిస్తావో, నిను నమ్యేది లేదని’ నిస్సంకోచంగానే చెప్పేవారు. అలాంటి పరిస్థితులలో, కామ్రేడ్ రాధక్క లాంటి సీనియర్ స్థానిక మహిళలు గెరిల్లాలకు తిండి పుట్టించి ఆకలి తీర్చే అక్కలయ్యారు, అమ్మలయ్యారు. అనేక ఆటుపోట్లలో రాటుతేలిన, కాకలుతీరిన కామ్రేడ్ రాధక్క జీవితం భవిష్యత్ తరాలకు తరగని అనుభవాలను అందించింది.
గెరిల్లా దళాలలను మట్టుబెట్టడానికి ఓ వైపు సంస్కరణలతో కూడిన స్పెషల్ ఆక్షన్ ప్లాన్, మరో వైపు సీ-60 కమాండో బలగాల నిర్మాణం, ఇన్ ఫార్మర్ నెట్ వర్క్ ను పటిష్టం చేసుకోవడం, 1980ల వరకు తాలూకాకు ఒక పోలీస్ స్టేషన్ ఉన్న చోట, విప్లవోద్యమం కాలూనుకోవడంతో, అదనంగా అనేక పోలీసు స్టేషన్ లను నెలకొల్పడం, పోలీసు క్యాంపులను ఏర్పర్చడం, ప్రజల సంక్షేమం గుర్తుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనేక చోట్ల ఆస్పత్రులు, పాఠశాలలు తెరవడం, రోడ్లు పోయడం, ఆదివాసీ యువతీ-యువకులకు ప్రభుత్వమే సామూహిక పెళ్లిల్లు చేయడం లాంటి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బ్యాంకుల ద్వారా ఆదివాసీ, పీడిత ప్రజలకు అప్పులు ఇవ్వడం, గొర్రెలు, బర్రెలు పంపకాలు చేయడం ప్రారంభించారు. ఇవన్నీ చూసి ప్రజలు విస్తుపోయేవారు. ఇవన్నీ అన్నల ఫలితమనీ వారికి ఎవరు చెప్పాల్సిన పని లేకుండా పోయింది.
అన్నలు లేని నాడు అడిగినోడు లేడు. కానీ, ఇప్పుడు అడిగి అడిగి అవసరాలు తీరుస్తున్నారని జనం సంబురపడేది. ఇవన్నీ కామ్రేడ్ రాధక్కలో విప్లవ చైతన్యాన్ని, నిబద్ధతను, నిమగ్నతను పెంచడానికి తోడ్పడినాయి. కానీ, విప్లవకారులకు మాత్రం వీటి గురించి స్పష్టంగా తెలుసు. రాజ్యం కొనసాగించే హింసా, అణచివేతలకు ఇవి సాధికారతను కల్పించే కంటితుడుపు సంస్కరణలనీ, అలాగే, ఇవి విప్లవ చిరుజల్లులనీ భావించారు. కానీ, విచారకరంగా ఆ చిరుజల్లులను అత్యంత వివేచనతో వాడుకోవడానికి మాత్రం ఆనాడు విప్లవోద్యమం సిద్ధపడలేదు. వాటిని బహిష్కరిస్తూ రాజ్య హింసను ఎదుర్కోవడానికి ప్రతి హింస చర్యలు అనివార్యమని వారు భావించారు.
పార్టీ నిర్ణయం మేరకు, 1991లో గడ్‌చిరోలీలో ప్రతిఘటన చర్యలు ప్రారంభమయ్యాయి. కుర్కెడా తాలూకా తిప్పాగఢ్ ఏరియాలోని చక్రీఘాట్ వద్ద తొలి మాటుదాడి చర్యకు గెరిల్లాలు ఆరంగేట్రం చేయగా, టెక్నికల్ కారణాలతో అది విఫలం అయింది. కానీ, ఆ తరువాత వెంటనే ఏటపల్లి తాలూకా, భామ్రాగఢ్ పరిసరాలలోని బెజ్జూరు సమీపంలో గల లంజెవంచ దగ్గర పోలీసులపై జరిపిన మాటు దాడి పూర్తిగా సఫలమైంది. ఆ దాడిలో గెరిల్లాలు పోలీసుల తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ మాటుదాడిలో కామ్రేడ్ రాధక్క ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఈ ప్రతిదాడి చర్య ప్రజలలో ఉత్తేజాన్ని కల్గించింది. తమను పీడిరచే, వేధించే పోలీసుల చావు వారికి ఊరూరా ఒక పండుగలా మారింది. ఆ దాడితో గడ్‌చిరోలీ సైతం భారతదేశ రాజకీయ పటంపై విప్లవకారుల ప్రతిఘటన చర్యలతో ఎర్రరంగు పులుముకుంది.
కామ్రేడ్ రాధక్క, 1998లో గడ్ చిరోలీ నుండి మాడ్ కు బదిలీ అయింది. గడ్‌చిరోలీలో దాదాపు రెండు దశాబ్దాల ఉద్యమ అనుభవాలతో మాడ్ కొండలకు చేరిన రాధక్కను అక్కడి పార్టీ కేడర్లు, ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. గడ్‌చిరోలీ జిల్లా సాపేక్షికంగా అభివృద్ధి చెందిన ఆదివాసీ ప్రాంతం. అయితే, ఆదివాసీ జనాభా మాత్రం జిల్లాలో 2011 జనగణన నాటికి 45 శాతానికి చేరుకొని మైనార్టీగా మారింది. ప్రధానంగా పట్టణాలలో గైరాదివాసీ జనాభా పెరుగగా, లోతట్టు అటవీ గ్రామాలలో మాత్రం ఆదివాసీ ప్రజలే అధికంగా వుండేవారు. గడ్‌చిరోలీలో సాపేక్షికంగా మెరుగైన వ్యవసాయ పద్ధతులు, మెరుగైన జీవన విధానం, అక్షరాస్యతలో ముందంజలో ఉన్న ప్రాంతం కావడమే కాకుండా, విప్లవ పోరాటాలలో రకరకాల పోరాటాలకు సమరశీల నాయకత్వాన్ని అందించిన జిల్లా కూడా కావడంతో కామ్రేడ్ రాధక్క మాడ్‌కు వెళ్లడం తన సుసంపన్నమైన అహెరీ ప్రాంత పోరాట అనుభవాలను అక్కడి ప్రజలతో పంచుకోవడానికి చాలా ఉపయోగపడిరది. అక్కడి వాతావరణం, కఠినమైన భౌగోళిక పరిస్థితులు, కోప్‌ా లా లాంటి చిరుధాన్యలే ప్రధాన ఆహారంగా అక్కడి ప్రజలు జీవించడం, నూనె వాడుకం తెలియని వారు, భాషా వ్యత్యాసాలు లాంటి పలు సమస్యలను కామ్రేడ్ రాధక్క విప్లవ చైతన్యంతో అధిగమించింది.
కామ్రేడ్ రాధక్క తన విప్లవ ప్రస్థానంలో, సగానికి పైగా జీవితాన్ని మాడ్ ప్రజల మధ్య, మాడ్ ప్రజలతోనే పంచుకుంది. ఆమె అక్కడికి వెళ్లేనాటికి పార్టీ గ్రామ రాజ్య కమిటీల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ గ్రామ రాజ్య కమిటీలు 2001 నాటికి మరింత స్పష్టతతో ‘విప్లవ ప్రజా కమిటీ’ (Rూజ) లుగా, 2002లో ప్రజల సులభ వ్యవహారానికై జనతన సర్కార్లుగా మారాయి.
2004లో జనతన సర్కార్లు ఏరియా సర్కార్లుగా, వాటిలో కొన్ని 2007 నాటికి డివిజనల్ సర్కార్లుగా అభివృద్ధి చెందాయి. ఆ అభివృద్ధిలో కామ్రేడ్ రాధక్క ఒక విడదీయరాని భాగమైంది. ఆమె 2008 నుండి 2021 వరకు దాదాపు 12 ఏళ్లకు పై కాలం డివిజనల్ సర్కార్ అధ్యక్షురాలుగా బాధ్యతలను కొనసాగించింది.
కామ్రేడ్ రాధక్క, డివిజనల్ సర్కార్ లను నడపడంలో మంచి అనుభవాన్ని సంపాదించింది. అడవులను నరికి జూం (పేందా/పోడు) పద్దతులలో చిరుధాన్యాలు పండిస్తూ నాగళ్లతో వ్యవసాయం తెలియని మాడ్ ప్రజలకు, చిన్నపాటి గునపాలతో భూమిని తవ్వి విత్తనాలు చల్లుకునే మాడ్ ప్రజలకు తొలుత పార్టీ చాలా శ్రద్ధ పెట్టి, వ్యవసాయ కార్యకర్తలను నియమించి నాగళ్లతో వ్యవసాయాన్ని పరిచయం చేసింది. జనతన సర్కార్ల ప్రారంభంలో చిన్న చిన్న చెఱువులు పోయడం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, పనస, మామిడి మున్నగు పళ్ల తోటలు పెంచడానికి ప్రోత్సహిస్తూ వ్యవసాయ విప్లవ సంస్కరణలు సాగాయి. కానీ, కామ్రేడ్ రాధక్క డివిజన్ జనతన సర్కార్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కాలంలో మాడ్ కొండలలో ట్రాక్టర్లతో సేద్యం చేసే మౌలిక మార్పులు జరిగాయి. ఆ కొండలలో రోడ్డు చేరని ఊరు లేదంటే అతిశయోక్తి కాకుండా పోయింది. బ్రిటిష్ కాలంలో అబూజ్ (అర్థం కానీ /తెలియని) మాడ్‌గా గణుతికెక్కిన మాడ్ కొండలు ఆధునిక సేద్యం, కమ్యూనికేషన్ సౌకర్యాలతో ప్రభుత్వం వారి ‘ఆకాంక్ష’ జిల్లాలలో అగ్రభాగాన నిలిచాయి. విప్లవకారులు ప్రవేశ పెట్టిన మార్పులు ప్రజల ప్రయోజనాల రీత్యా కాగా, ఆకాంక్ష జిల్లాలలో చేర్చి కోటానుకోట్ల రూపాయల నిధులు గుమ్మరిస్తూ పరుస్తున్న రోడ్లు, నిలుపుతున్న మొబైల్ టవర్లు, ఏర్పరుస్తున్న పోలీస్ స్టేషన్‌లు, కడుతున్న డాక్లర్లు రాని ఆస్పత్రులు, టీచర్లు వుండని పాఠశాలలు మాడ్ కొండలను కొల్లగొట్టుకపోయే కార్పొరేట్ ఆకాంక్షల వెలుగు జిలుగుల మార్పులనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే అక్కడి ప్రజలు ‘‘మాకు జనతన సర్కార్లే కావాలి, దోపిడీ సర్కార్ల అభివృద్ధి అక్కరలేదు’’ అని కరాఖండిగా నినదించడం వెనుక కామ్రేడ్ రాధక్క కృషి సదా స్మరణీయం.
కామ్రేడ్ రాధక్క 2021లో తన అనారోగ్యం, పెరుగుతున్న వయసును దృష్టిలో పెట్టుకొని ఎదుగుతున్న తరాలను తర్ఫీదు చేసుకోవాలనీ పార్టీ అందిస్తున సాధారణ అవగాహనలో భాగంగా జనతన సర్కార్ అధ్యక్ష బాధ్యతల నుండి వైదొలగి మరో మహిళా కామ్రేడ్ కు ఆ బాధ్యతలను అప్పగించడమే కాకుండా, ఆమెకు తన అనుభవాన్ని అందించడానికి చివరి వరకూ చేతనైనంత కృషి చేసింది.
కామ్రేడ్ రాధక్క మాడ్ చేరుకున్న తరువాత 2003లో జరిగిన పార్టీ ప్లీనంలో డివిజనల్ కమిటీ మెంబర్ గా ఎన్నికైంది. ఆమె తన కమిటీ పని విభజనలో భాగంగా చాలా కాలం కుతుల్ ఏరియాను గైడ్ చేసింది. జనతన సర్కార్లను సమర్థవంతంగా నడపడానికి, విప్లవ సంస్కరణలను శక్తివంతంగా అమలు చేయడానికి పార్టీ ఏర్పర్చిన ప్రత్యేక పార్టీ కమిటీలో కామ్రేడ్ రాధక్క సభ్యురాలుగా కొనసాగింది. ఆ సమయంలో అక్కడ వ్యవసాయంపై కేంద్రీకరించడానికి బయటి నుండి పార్టీ పంపించిన వ్యవసాయ కార్యకర్తలతో వుంటూ తాను వారి నుండి నేర్చుకుంటూ వారిని గైడ్ చేయడంలో మంచి అనుభవాన్ని సంపాదించింది.
కామ్రేడ్ రాధక్క ఎక్కడున్నా ప్రభుత్వ ఉద్యోగులతో, స్థానిక సాహుకార్లతో, విద్యార్థులతో సత్సంబంధాలను కొనసాగించడం ఆమె చైతన్యయుతంగా నేర్చుకుంది. ఆమె జనతన సర్కార్ అధ్యక్ష బాధ్యతలలో వున్నపుడు ఆ కృషిని మరింత ద్విగుణీకృత పట్టుదలతో కొనసాగించేది.
కుతుల్ సంతకు వచ్చే సాహుకార్లందరితో ఆమెకు మంచి పరిచయాలు వుండేవి. జనతన సర్కార్ ఏర్పర్చిన సంత కమిటీలు నిర్ణయించిన శాతానికి లాభాలు మించకుండా సరుకులు అమ్ముకునే విధంగా సాహుకార్లను కోరేది. నిలువుదోపిడీని ఇక ఆపాలనీ, ప్రజలు జనతన సర్కార్ల నాయకత్వంలో చైతన్యవంతులవుతున్నారనీ, అడ్డమైన దోపిడీని అడ్డుకుంటారనీ హెచ్చరించేది.
మాడ్ కొండలలో వున్న రామకృష్ణ మిషన్ వారి పాఠశాల విద్యార్థులతో, టీచర్లతో, వైద్య సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరేది. వారి హిందుత్వ రాజకీయాలు, సంప్రదాయాలు ఆదివాసీ జన జీవితాలకు భిన్నమైనవనే ఎరుకతోనే వర్గ చైతన్యంతో వారితో వ్యవహరించేది.
కామ్రేడ్ రాధక్క బడికి వెళ్లి చదువుకోనప్పటికీ, పార్టీ వ్యవహారాలు నడపడంలో, అకౌంట్స్ నిర్వహణలో, ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించడంలో చదువుకున్న కామ్రేడ్స్ నుండి పూర్తి సహాయాన్ని తీసుకునేది. కామ్రేడ్ రాధక్క పార్టీలోనే అక్షరాభ్యాసం చేసి చదువు నేర్చుకుంది. అవకాశం వున్నపుడు పార్టీ టీచర్ల వద్ద, పార్టీ నడిపే పాఠశాలలకు హాజరై చదువు నేర్చుకుంది. ఆమె పార్టీ నిర్వహించే పలు రాజకీయ తరగతులకు హాజరైంది. సమావేశాల వద్ద జరిగే సమష్టి రాజకీయ చర్చలలో చురుగ్గా పాల్గొనేది. ఆమెలో నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మెండుగా వ్యక్తమయ్యేది. ఆమె పత్రికలు చదవడం, పుస్తకాలు చదవడం, తోటి కామ్రేడ్స్ తో వాటిలోని విషయాలను చర్చించడం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించేది.
కామ్రేడ్ రాధక్క పార్టీ నిర్వహించిన తొలి ప్రత్యేక మహిళా గెరిల్లా రాజకీయ-సైనిక శిక్షణా శిబిరానికి 1996లో హాజరైంది. ఆ మహిళా శిబిరానికి దాదాపు 40 మంది మహిళలు హాజరైనారు. పురుషులతో కలిపి మహిళలకు సైనిక శిక్షణా శిబిరాలు నిర్వహించడం కాకుండా, మహిళలలో ఆత్మ విశ్వాసం పెంచడానికి వారికి విడిగా శిక్షణా శిబిరం నిర్వహించి వారి ఎదుగుదలకు కృషి చేయాలనీ పార్టీ తీసుకున్న నిర్ణయం అది. ఆ శిక్షణా శిబిరంలో మహిళలకు ఫెమినిజం గురించి పరిచయం చేయడమైంది. అక్కడే ఉద్యమంలో మహిళలు ఎదుర్కొంటున్న పురుషాధిక్య ధోరణులపై విస్త్రుతమైన చర్చలు జరిగాయి. ఆ శిబిరానికి బయటి నుండి పట్టభద్రురాలైన మహిళా డాక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ వచ్చి మహిళలకు శరీర నిర్మాణ శాస్త్రం గురించి తరగతులు చెప్పారు. అన్నింటిలో కామ్రేడ్ రాధక్క చురుగ్గా పాల్గొంది. ఆ క్యాంపులో మహిళలంతా ధూమపానం అలవాటున్న పురుషులతో దానిని వదలుకోవాలని పోరు చేశారు. అందులో ఒక్కరిని మినహా మిగతా కామ్రేడ్స్ తో పొగతాగడం మాన్పించారు.
కామ్రేడ్ రాధక్క పార్టీ నిర్వహించే ప్లీనాలకు, మహాసభలకు అనేక సందర్భాలలో ప్రతినిధిగా హాజరై అక్కడ జరిగే రాజకీయ చర్చలలో చురుగ్గా పాల్గొనేది. పార్టీలో కొనసాగుతున్న పురుషాధిపత్య దోరణులను నిర్మొహమాటంగా విమర్శించేది. పార్టీలో, విప్లవోద్యమంలో కొనసాగుతున్న పురుషాధిక్య భావజాలాన్ని ఎదుర్కోవడంలో రాధక్క లాంటి అనేక మంది కాకలుతీరిన మహిళా కామ్రేడ్స్ అగ్రభాగాన నిలిచారు. వారి పోరాట ఫలితంగా దళాలలో, పార్టీలో, విప్లవోద్యమంలో స్త్రీ-పురుష సమానత్వ దిశలో అనేక ప్రజాస్వామిక మార్పులు జరిగాయి. ఆ మహిళలంతా అభినందనీయులే. ఆదర్శప్రాయమైన వారి విప్లవ సేవలు సదా స్మరణీయమే.
కామ్రేడ్ రాధక్క పాల్గొనని ప్రత్యేక మహిళా సమావేశాలు బహుశా గడ్ చిరోలీ, మాడ్ లలో లేవనుకోవచ్చు. దండకారణ్య వ్యాప్తంగా మహిళలతో పార్టీ జరిపే ఏ ప్రత్యేక సమావేశమైనా కామ్రేడ్ రాధక్క తప్పనిసరిగా హాజరై అక్కడ తన భావాలను ప్రతినిధులందరితో పంచుకునేది.
మార్చ్8 వచ్చిందంటే, ఆమె ఉన్న చోట ఒక సందడి వాతావరణమే నెలకొనేది. మహిళలను జాగరూకులను చేయడానికి ఆ సందర్భంగా సెమినార్ లు నిర్వహించే ఒక కొత్త వరవడి ప్రారంభమైన పిదప కామ్రేడ్ రాధక్క మాడ్ లో అనేక చోట్ల సెమినార్ లు నిర్వహించి గ్రామీణ సంఘటిత మహిళలతో శ్రామిక మహిళల విముక్తి కోసం అనేక చర్చలు చేసేది. తాను తెలుసుకున్న ఏ కొత్త విషయమైనా, వెంట వెంటనే దానిని ప్రజల వరకు చేర్చడంలో కామ్రేడ్ రాధక్క తనకు తానే సాటిగా పేరు తెచ్చుకుంది.
కామ్రేడ్ రాధక్క మాడ్ లో డివిజన్ స్థాయి ఉద్యమ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆమె చివరి ఊపిరి వదిలే వరకు నిత్య నిర్బంధంలోనే పని చేసింది.
2005లో ప్రారంభమైన శ్వేత బీభత్స సల్వాజుడుం ఘాతుకాలను ఆమె ప్రజలతో కలిసి ఎదుర్కోవడంలో మంచి అనుభవాన్ని సంపాదించింది. ఆ తరువాత ముందుకు వచ్చిన ప్రభుత్వ ఫాసిస్టు గ్రీన్ హంట్ సైనిక కేంపెయిన్ (2009-17) కాలంలో ఆమె అనేక సందర్భాలలో పోలీసు గాలింపు చర్యలలో నుండి ప్రజల సహకారంతో బయటపడిరది. 2017లో ప్రారంభమై 2022 వరకు కొనసాగిన ఆపరేషన్ సమాధాన్ సైనిక కేంపెయిన్ కాలంలో కూడ ఆమె చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ తన డివిజన్ సర్కార్ అధ్యక్ష బాధ్యతలను కొనసాగించింది. పలు మార్లు ఆమె మాడ్ కొండలలో సాగే గాలింపు చర్యల నుండి ప్రజల అండతో బయటపడిరది. అనేక సందర్భాలలో తృటిలో ప్రమాదాలను తప్పుకుంది. ఆమె కగార్ సైనిక దాడుల మధ్య మాడ్ కొండలలో ప్రజల మధ్య బతికింది. అనేక సందర్భాలలో ప్రజలు ఆమెను పోలీసుల చుట్టివేత నుండి కాపాడారు.
ఆమెకు ప్రజలంటే ప్రాణం, ప్రజలకు ఆమె అంటే గుండెకాయ. వారి బంధం, అనుబంధం విడదీయలేనిది. కానీ, చివరి రోజులలో అనివార్యంగా ఆమె తన ప్రజలకు దూరంగా, అజ్ఞాత స్థావరంలో అసువులు బాయడం బాధాకరం.
కామ్రేడ్ రాధక్క తరం మహిళలు విప్లవోద్యమంలో అనేక నూతన సంప్రదాయాలకు తెర లేపారు. వారు పురుషాధిక్యతపై రాజీ లేని పోరాటాలు చేశారు. విప్లవోద్యమంలో కొనసాగుతున్న పురుషాధిక్య ధోరణులను వదిలించుకునేలా చేశారు. గెరిల్లాల రోజువారి జీవితంలో అనేక రకాల పురుషాధిక్యతను ఎదుర్కొన్న వారు, వాటన్నింటినీ అత్యంత సామరస్యపూర్వకంగా, కామ్రేడ్లీభావంతో ఎదుర్కొన్నారు. ఆ తరం మహిళల్లో అనేక మందిలాగే కామ్రేడ్ రాధక్క జుట్టు కత్తిరించుకొన్న తొలి మహిళా బృందంలో వుండేది. ఆమె దాదాపు 10 సంవత్సరాలకు పైగా జుట్టు కత్తిరించుకొని గెరిల్లా జీవితాన్ని గడిపింది. ఆ తరువాత అనేక కారణాలతో తనకు ఇష్టం లేకపోయినా, అనివార్యంగా పోనీ టెయిల్ తో వుండసాగింది. ఆమె తోటి మహిళలను జుట్టు కత్తిరించుకోవాలని ప్రోత్సహించేది. మరోవైపు జుట్టు కత్తిరించుకోవడానికి వ్యతిరేకంగా మహిళల్లో లోలోపల జరిగే ఆర్గనైజేషన్ పై ఆమె ధ్వజం ఎత్తుతూ జుట్టు కత్తిరించుకోవడంలోని సౌకర్యం అందరికీ వివరించేది. అది మనువాదంపై ప్రత్యక్ష పోరు అని కూడ చెప్పేది.
కామ్రేడ్ రాధక్క, పై కాలమంతా రాజ్య హింస, అణచివేతల మధ్య సాగిన మాడ్ డివిజన్ ఉద్యమ అభివృద్ధిలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. పైన పేర్కొన్నట్టు 2005 నుండి 2024 ప్రారంభం వరకు, నిర్ధిష్టంగా చెప్పాలంటే, 2024 మధ్య వరకు వివిధ స్థాయిలలో జనతన సర్కార్లు సంఘటితమై, విస్తరిస్తూ అభివృద్ధి చెందాయి. ఒక వైపు కార్పెట్ సెక్యూరిటీ పటిష్టమవుతూ విస్తరించడం, మరోవైపు జనతన సర్కార్లు వాటి మధ్య తమ ప్రజాహిత అభివృద్ధి కార్యక్రమాలు, భూమి మరమ్మత్తు కేంపెయిన్ లు కొనసాగించాయి. డివిజన్ లో దాదాపు డజన్‌కు పైగా విద్యార్థి వసతి గృహాలతో సహ క్రాంతికారి జనతన స్కూళ్లను నడిపించాయి. స్కూల్ టీచర్లకు వేతనాలు చెల్లించాయి. క్రమంగా పెరుగుతున్న రాజ్యహింస, పోలీసు దాడులతో వీటి సంఖ్య తగ్గినప్పటికీ, వేరు వేరు రూపాలలో వీటిని ప్రజల ప్రయోజనార్థం నడపడానికి కృషి సాగింది. ఆ కృషి అంతటిలో కామ్రేడ్ రాధక్క తన చెమట నెత్తుర్లను ధారపోసింది.
2020-2021 నుండి మాడ్‌తో సహ దండకారణ్య వ్యాప్తంగా ఒక నూతన ప్రజా పోరాటాల వెల్లువ ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి 2014-15 లలోనే గడ్‌చిరోలీలో బీజాలు పడినప్పటికీ, అది యావత్ దండకారణ్య ప్రజలను తన పక్షం మలచుకొని కదలించడంలో చాలా సమయం తీసుకుంది. 2020 మధ్య పశ్చిమ బస్తర్ లోని పిట్టోడ్ మెట్టలో గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా, 2020 చివర, తూర్పు బస్తర్‌లో పోలీసు క్యాంపుకు వ్యతిరేకంగా గ్రామసభల నాయకత్వంలో ప్రారంభమైన ప్రజా పోరాటం 40 రోజులు సాగి ఒక నూతన వరవడిని సృష్టించింది. ఆ వరుసన 2021 మేలో దక్షిణ బస్తర్ లో సిలింగేర్ ప్రజా ఉద్యమం ఊపిర్లు పోసుకుంది. ఇక ఆ తరువాత పశ్చిమ బస్తర్ లో పూసునార్‌తో సహ అనేక చోట్ల, దర్భాలో ఎన్నో చోట్ల నిరవధిక సమరశీల ప్రజా ధర్నాలు ప్రారంభమైనాయి. ఆ సమర వీచికలు బలంగా ఉత్తరానికి వీచాయి.
ఉత్తర బస్తర్‌లో పలు చోట్ల ప్రజా ధర్నాలు ప్రారంభమైనాయి. దక్షిణ, ఉత్తర ప్రజా ధర్నాల ప్రభావం మధ్యలోని మాడ్‌ను కదిలించాయి. మాడ్‌లో సైతం ఇరక్ బట్టి, బెహరావేడ, మూహందీ మున్నగు చోట్ల ప్రజాధర్నాలు ప్రారంభమైనాయి. ఆ ప్రజా ధర్నాలు కొనసాగడానికి గ్రామ గ్రామాన జల్, జంగల్, జమీన్ పై మాకే అధికారం అనే నినాదాల స్ఫూర్తితో ఏర్పడిన గ్రామసభలు పునాదులుగా పని చేశాయి. ఆ గ్రామసభలను గ్రామ గ్రామాన జనతన సర్కార్లు సాదరంగా ఆహ్వానించాయి. ఆ ప్రక్రియంతటిలో కామ్రేడ్ రాధక్క ఒక విడదీయరాని భాగంగా నిలిచింది. తోటి డీవీసీ కామ్రేడ్స్‌ను వెంటేసుకొని, ఆ ధర్నాల వద్ద జరుగుతున్న కార్యక్రమాలు, వారు చేపడుతున్న కొత్త ప్రోగ్రాంలు, వారి అవసరాలు, వారి సమస్యలు తెలుసుకోవడం పై కామ్రేడ్ రాధక్క ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. అక్కడ జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి జనతన సర్కార్లు జోక్యం చేసుకోవాలనీ కోరేది.
కామ్రేడ్ రాధక్క, గత దశాబ్దకాలానికి పైగా మధుమేహ వ్యాధితో బాధ పడుతోంది. షుగర్‌లెవల్స్ ఎప్పుడూ నియంత్రణలో వుండేవి కావు. ప్రమాద హెచ్చరికలు సంకేతిస్తున్నప్పటికీ, ఆమె నిశ్చింతగానే తన పనులు తాను చేసుకునేది. ఆమె మరీ ముఖ్యంగా గత మూడేళ్లుగా తీవ్ర అస్వస్థతను ఎదుర్కొంటున్నది. రోజూ ఇన్సులిన్ తీసుకుంటూ పనులు చేసుకునేది. ఆమె వరుసగా మలేరియా పీడితురాలు, కొన్ని సందర్భాలలో పాల్సిపారం కూడ దాడి చేసేది. వాంతులు, విరేచనాలతో అనేక ఇబ్బందులు పడేది. కగార్ దాడుల మధ్య కొండలలో దాగుడుమూతలాడుతూ పోలీసుల వలయాల నుండి బయటపడేది. ఆమె సహచరుడు బహుముఖప్రజ్ఞాశాలి కావడంతో మధుమేహంతో బాధపడే రాధక్కకు వీలున్నపుడల్లా రకరకాల వైద్యం చేస్తూ ఆమెకు స్వస్థత చేకూర్చడానికి ఎంతగానో తోడ్పడేవాడు. నిజంగా, వారి మధ్య అన్యోన్యతతో ఆ రకమైన సేవలు అక్కకు అంది వుండకపోతే, ఆమె ఇంతకాలం రకరకాల వ్యాధులతో జీవించివుండేదా, అనేది సందేహమే. చివరి రోజులలో జ్ఞాపకశక్తి చాలా తగ్గింది.
రాధక్క దాదాపు నాలుగు దశాబ్దాల కాలం విప్లవోద్యమానికి తన సేవలందించి 2025 మార్చ్ 29 నాడు మనకందరికి భౌతికంగా దూరమైంది. ఆమె ఆశలు, ఆశయాల సాకారం కోసం మనం పోరాడుదాం. కగార్ సైనిక దాడులలో ఎందరెందరో గొప్ప కాకలుతీరిన యోధలను కోల్పోతున్నాం. సైనిక దాడులలో ప్రతిఘటిస్తూ అమరులవుతున్నారు. అరెస్టయి చిత్రహింసలను ఎదుర్కొంటూ అమరులవుతున్నారు. అనారోగ్యాల బారిన పడి సరైన వైద్యం అందక నిండు జీవితాన్ని విప్లవోద్యమం కోసం త్యాగం చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా పీడిత ప్రజల ముద్దు బిడ్డలు భారత విప్లవానికి ఊపిరులందిస్తున్నారు. వారి త్యాగాలే ఇంధనంగా భవిష్యత్ తరాలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని సాధించి తీరుతారు. వారిని ఏ కగార్‌లు ఏ హిందుత్వలు అడ్డుకోలేవు.