“దేవున్ని నమ్మే గుంపులో ఏ నిర్ణయం ప్రవేశ పెట్టాలన్న దేవుని పై పదే పదే విశ్వాసం ప్రకటించాల్సి వుంటుంది  – బాలగోపాల్”

సరిగ్గా బాలగోపాల్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కూడా చివరకు హిందూ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా తయారు చేసిన “ఫ్లెక్సీ పొరపాటున ప్రింట్ అయింది” అని మీడియా ముందు స్పష్టం చేసి, పౌరహక్కుల సంఘం (ఆంధ్రప్రదేశ్) కమిటి 20 వ మహాసభను ప్రారంభించాల్సి వచ్చింది. 

తిరుపతిలో పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పడిన బ్యానర్ వివాదం పెద్ద రాజకీయ–సామాజిక, సాంస్కృతిక చర్చకు దారితీసింది. ఈ ఘటనలో పౌర హక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్యపై రాజద్రోహం (sedition) కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు, హిందూ రాష్ట్ర దృక్పథంపై చర్చను తిరిగి ముందుకు తెచ్చింది.

క్రాంతి చైతన్య పై ఫిర్యాదు వివరాలు

FIR సంఖ్య: 31/2026, తేదీ: 09.01.2025

“సనాతన ధర్మ పరిరక్షణ సమితి” అధ్యక్షుడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదులో ఆయన 08-01-2026 రాత్రి 10:30 గంటలకు అన్నమయ్య సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా కట్టిన కొన్ని బ్యానర్లను గమనించినట్లు తెలిపాడు. వీటిపై రాజ్య చిహ్నమైన అశోక స్థంభం వికృతంగా చూపించబడిందని ఆరోపించాడు.

ఆ బ్యానర్లలో:

●             జాతీయ చిహ్నమైన అశోక స్థంభం మార్ఫింగ్ చేశారు.

●             మూడు సింహాల స్థానంలో ఎద్దు ముఖాలు, ఖాకీ ప్యాంట్లు, బెల్ట్‌ల రూపంలో చిత్రీకరించారు.

●             అశోక చక్రంలో spokes సంఖ్యను మార్చారు.

●             గుర్రం-ఎద్దు స్థానంలో తుపాకీతో కాల్చే వ్యక్తి చిత్రం ఇంకా స్వస్తిక్ గుర్తు చేర్చారు.

●             “సత్యమేవ జయతే” స్థానంలో “సత్యమేవ పరాజయతే”గా రాశారు.

●             “హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం” వంటి నినాదాలు వ్రాయబడ్డాయి.

●             హిందూ మతోన్మాదులను శిక్షించాలన్న పిలుపులు ఉన్నట్లు, దాని కింద గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ ల ఫొటోలున్నట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

ఈ బ్యానర్లు పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు (జనవరి 10–11, 2026, తిరుపతి) పేరుతో ముద్రించబడి, GVK ప్రింటింగ్ ప్రెస్, STV నగర్, తిరుపతిలో ప్రింట్ అయ్యాయని అన్నారు.

ఫిర్యాదుదారుడు బ్యానర్ల ఫోటోలు తీసి, ఆ బ్యానర్లను తొలగించి మడతపెట్టి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఆ బ్యానర్ లు కట్టిన వ్యక్తులపై ఆ కార్యక్రమంలో పాల్గొన్న, ఇంకా ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దీనిని రాజద్రోహం కేసుగా నమోదు చేసి క్రాంతి చైతన్య తో పాటు ఆ గ్రాఫిక్స్ యజమాని నీ 3 వ ముద్దాయిగా చూపెడుతూ క్రాంతి చైతన్య తో పాటు రిమాండ్ చేశారు.

రెండవ ముద్దాయిగా హేమాద్రిని చూపించారు. పౌర హక్కుల సంఘానికి చెందిన చిట్టిబాబు,  శ్రీమన్నారాయణ, చిలుక చంద్రశేఖర్, అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌లను కూడా ముద్దాయిలుగా పేర్కొన్నారు.

వివాదం, అరెస్టు

అసలు వివాదం జనవరి 8న ప్రారంభమైంది. సంఘ్ అనుబంధ కార్యకర్తలు ఆ రోజు తిరుపతిలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల సంఘం ఫ్లెక్స్ బ్యానర్లను తొలగించారు.

జనవరి 8–9 రాత్రి మధ్య, అంటే జనవరి 9వ తేదీ రాత్రి 1 గంట సమయంలో, బ్యానర్లు కడుతున్న సి.ఎల్.సి కి చెందిన నలుగురు సభ్యులను సంఘ్ అనుబంధ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ విషయం సి.ఎల్.సి కార్యకర్తలు సి.ఎల్.సి నాయకుడు క్రాంతి చైతన్యకు తెలియజేయగా, ఆయన వెంటనే అక్కడికి వెళ్లారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న అందరినీ వెళ్లిపోవాలని చెప్పారు. సంఘ్ అనుబంధ కార్యకర్తల పట్ల పోలీసులు మద్దతుతో కూడిన  వైఖరి ప్రదర్శించారు. క్రాంతి చైతన్యనే రాజీపడమని కూడా వారు కోరారు. ఈ సమయంలో సంఘ్ అనుబంధ కార్యకర్తలు గట్టిగా “జై శ్రీరామ్” అంటూ నినాదాలు చేశారు.

అదే రోజు సాయంత్రం క్రాంతి చైతన్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. చిట్టిబాబు, చిలుక చంద్ర శేఖర్ ఇంకా ఇతరులు ఆయనతో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లారు. అయితే పోలీసులు కేవలం క్రాంతి చైతన్యనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై రాజద్రోహ కేసు పెట్టాం అని మరుసటి రోజు చెప్పారు.

సంఘ్ అనుబంధ కార్యకర్తల చర్యల ద్వారా జనవరి 10 నాడు జరగాల్సిన సి.ఎల్.సి మహాసభ ను అడ్డుకోవడానికి పయత్నం చేశారు. అయినప్పటికీ ఎ.పి.సి.ఎల్.సి మహాసభ కొనసాగించాలని నిర్ణయించింది. 350 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి, హిమాన్షు కుమార్, జస్టిస్ చంద్ర కుమార్ తదితరులు మాట్లాడారు.

అదే రోజు రాత్రి క్రాంతి చైతన్య రిమాండ్ చేయబడ్డాడు.

ప్రధానంగా రెండు ఫోటోల ఆధారంగా వారిపై ఈ కేసు నమోదు చేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

వాటిలో

●             ఒకటి “హిందూ ఫాసిజంకు వ్యతిరేకంగా పోరాడుదాం” అనే శీర్షికతో ఉన్న చిత్రం లో నరేంద్ర దభోల్కర్, గోవింద్ పంసారే, ఎం.ఎం. కల్బుర్గి, గౌరీ లంకేష్ చిత్రాలు ఉన్నాయి. అలాగే హేతువాదులను, ప్రజాస్వామిక వాదులను హత్య చేస్తున్న హిందూ మతోన్మాదులను శిక్షించాలి! అని రాశారు.

●             రెండో ఫోటో “హిందూ రాష్ట్రం” చిహ్నంగా ఉన్న దానిని భారత జాతీయ చిహ్నమైన అశోక సింహస్థంభంతో పోలి ఉందని ఆరోపణ చేశారుa

ఈ నేపథ్యంలో క్రింది చట్టాల కింద నేరాలు నమోదయ్యాయి:

BNS, 2023లోని సెక్షన్లు 196(1), 197(1), 152, 292, 294(2), 352, 351(3), 353, 61(2) r/w 3(5) తో పాటు, జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం 1971లో సెక్షన్ 2, భారత రాష్ట్ర చిహ్నాల తప్పుడు వినియోగ నిషేధ చట్టం 2005లో సెక్షన్ 6 మరియు 1950లోని రాష్ట్ర చిహ్నాలు మరియు పేర్ల తప్పుడు వినియోగ నిషేధ చట్టం లో సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.

సి.ఎల్.సి అవగాహన:

క్రాంతి చైతన్య లేదా సి.ఎల్.సి సభ్యులు ఎక్కడా ఆయుధాలు పట్టమని లేదా దేశంపై దాడి చేయమని చెప్పలేదు. కేవలం ‘హిందూ ఫాసిజం’ అనే భావజాలాన్ని విమర్శించారు.

వారు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాకుండా, రాజ్యాంగంలోని ‘సెక్యులరిజం’ను కాపాడాలని కోరుతున్నారు. రాజ్యాంగ విలువల కోసం మాట్లాడటం రాజద్రోహం ఎలా అవుతుంది?

వ్యంగ్యం (Satire) నేరం కాదు. ప్రపంచవ్యాప్తంగా కార్టూనిస్టులు ప్రభుత్వ చిహ్నాలను మార్చి విమర్శలు చేస్తుంటారు. దీన్ని ‘సృజనాత్మక స్వేచ్ఛ’గా చూడాలి.

ఒక బ్యానర్‌పై వేసిన చిత్రం ‘రాజముద్ర’గా ఎవరూ భ్రమపడరు. అది స్పష్టంగా ఒక రాజకీయ కార్టూన్. ప్రజాస్వామ్యంలో కార్టూన్ల ద్వారా వ్యవస్థను విమర్శించే హక్కు పౌరులకు ఉంది. కాబట్టి వాటిపై రాజా ద్రోహం, “జాతీయ చిహ్నాల ను తప్పుగా వాడటం పై నిషేధ చట్టం” మోపడం అసంబద్ధం. అలాంటి చట్టాల కింద నేరం నమోదు చేయడానికి ఎలాంటి ఆస్కారం లేనటువంటి అంశం ఇది. 

అసీమ్ త్రివేది కేసు

Criminal Public Interest Litigation No. 03 of 2015, Bombay High Court, 17 March 2015 లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజద్రోహం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేసిన ప్రముఖ తీర్పు.

2011లో ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో అసీమ్ త్రివేది గీసిన కార్టూన్లలో అశోక స్తంభంలోని సింహాల స్థానంలో రక్తపిపాసి తోడేళ్లు కనిపించగా, ‘సత్యమేవ జయతే’ స్థానంలో ‘భ్రష్టమేవ జయతే’ అనిరాసారు. పైగా దాని పక్కన National Emblem అని స్పష్టంగా కార్టూన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపై ముంబై పోలీసులు సెక్షన్ 124A ఇంకా జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు.

బాంబే హైకోర్టు తీర్పు సారాంశం:

●             ప్రభుత్వంపై విమర్శ నేరం కాదు

●             నిరసన వ్యక్తం చేయడం రాజద్రోహం కాదు

●             రాజద్రోహం వర్తించాలంటే హింసకు ప్రేరణ లేదా ప్రజల్లో తిరుగుబాటు సృష్టించే ప్రభావం ఉండాలి

●             కేవలం అభ్యంతరకర పదాలు లేదా చిత్రాలు ఉన్నాయనే కారణంతో అరెస్ట్ చేయకూడదు

●             కార్టూనిస్ట్ ఉద్దేశం కీలకం; ఆయన ఉద్దేశం అవినీతిని ప్రశ్నించడం మాత్రమే

●             ఆర్టికల్ 19(1)(a) ప్రకారం పౌరులకు కళాత్మకంగా, వ్యంగ్యంగా తమ నిరసనను వ్యక్తం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది.

తిరుపతి బ్యానర్ వివాదంతో పోలికలు

రెండింటిలో రాజకీయ వ్యంగ్యం ఉంది

●             అసీమ్ త్రివేది: అవినీతి పై వ్యంగ్య పూరితమైన కార్టూన్ ద్వారా భావ వ్యక్తీకరణ చేశారు.

●             సి.ఎల్.సి సభ్యులు: “హిందూ (ఫాసిస్ట్) రాష్ట్ర” భావజాలం పై వ్యంగ్య పూరితమైన ఫ్లెక్సీ ద్వారా భావ వ్యక్తీకరణ చేశారు.

అసీమ్ త్రివేది కేసు తీర్పు ప్రకారం తిరుపతిలో క్రాంతి చైతన్యపై పెట్టిన రాజద్రోహం కేసు నిలవడం కష్టం. ఎందుకంటే బ్యానర్ల వల్ల హింస, శాంతిభద్రతల భంగం లేదా తిరుగుబాటు జరగలేదు; కేవలం భావజాల విమర్శ మాత్రమే జరిగింది. అయినప్పటికీ క్రాంతి చైతన్య రిమాండ్ కు పంపారు.

క్రాంతి చైతన్యను రిమాండ్ చేస్తున్న సమయంలో, “ఈ ఫోటోలను తప్పుగా భావిస్తున్నారా?” అని మేజిస్ట్రేట్ క్రాంతి చైతన్య ను ప్రశ్నించగా, అక్కడ ఉన్న సంస్థ సీనియర్ సభ్యుడు, న్యాయవాది పి. రాజా రావుతో పాటు క్రాంతి చైతన్య కూడా ఒకసారిగా ఒకే మాట చెప్పారు — “Certainly NOT.”

చిహ్నాల మార్పు ద్వారా వ్యక్తీకరించిన సృజనాత్మక సందేశం చాలా స్పష్టం — అది ఫాసిజాన్ని ఎత్తిచూపడమే.

పౌర హక్కుల సంఘం మొదటి నుంచీ సెక్యులర్ స్వభావం కలిగిన, నాస్తికత్వ దృక్పథంతో, ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేసే సంస్థగా సమాజానికి తెలిసిందే. అందువల్ల ఈ సంఘం హిందూ మతానికి లేదా దాన్ని ఆచరించే వ్యక్తులకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్న అనుమానానికి ఏ ఆధారమూ లేదు.

పౌర హక్కుల సంఘం వ్యతిరేకించింది హిందూ మతాన్ని కాదు. హిందూ మతోన్మాదాన్ని మాత్రమే.

ఇప్పటి దేశ రాజకీయ–సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అనేక మంది హిందువులే బహిరంగంగా చెబుతున్నారు.

ముస్లింలు, క్రైస్తవులు మరియు ఇతర మతస్తులను రెండో తరగతి పౌరులుగా ఈ దేశంలో చూడటం, వారికి నిత్యం అభద్రత భావన కల్గించడం దేశానికి ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు.

హిందూ మతం పేరుతో ఇతర మతాలపై ద్వేషాన్ని నూరిపోసే సంఘ్ మరియు దాని అనుబంధ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా స్వామి అగ్నివేశ్ వంటి హిందూ మతాచార్యులే బహిరంగంగా స్పందించారు; ఆయన తాను జీవించి ఉన్న సమయంలో అలాంటి  సంఘ్ కార్యకర్తల దాడులకు కూడా గురయ్యారు.

ఈ నేపథ్యంలో తిరుపతిలో కార్టూన్ రూపంలో వచ్చిన విమర్శ, హిందూ మతాన్ని అవమానించడం కాదు; దేశంపై పొంచి ఉన్న ఫాసిస్టు భావజాల ప్రమాదాన్ని చూపించే ప్రయత్నం మాత్రమే.

“Manu Rules Our Hearts” కు వ్యతిరేకంగా — సెక్యులరిజం కోసం తయారు చేసిన ఒక Sarcastic కార్టూన్ ఇది

భారత జాతీయ పతాకం లాగా ప్రపంచంలోని ప్రతి దేశానికి తమ తమ జెండాలు, రాజముద్రలు ఉంటాయి. అలాగే ఏ రాజకీయ వ్యవస్థకైనా ఒక చిహ్నాత్మక గుర్తు అవసరమవుతుంది. భారత రాజ్యాంగానికి అశోక ముద్ర ఉన్నట్టే, దానికి వ్యతిరేకంగా హిందూ రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుకునే వర్గాల(ఫాసిస్టుల)ను  ఉద్దేశిస్తూ ఒక వ్యంగ్యపూరితమైన చిహ్నం ను చూపించటం భావ ప్రకటన స్వేచ్ఛ లో భాగమే.

హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్న వారు కాషాయ పతాకాన్ని తమ పాలనా గుర్తుగా చూపెట్టుకుంటున్నారు. అదే విధంగా, వారి దృష్టిలో రాజ్యాంగంగా ఉండాల్సింది మనుస్మృతి అనే భావనను కూడా వారు ముందుకు తెస్తుంటారు.

ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగం రూపుదిద్దుకున్నప్పుడే, దానికి వ్యతిరేకమైన హిందూ ఫాసిస్ట్ స్వరాలు ఎలా వచ్చాయో చూడాలి. 1950 ఫిబ్రవరి 6న RSS పత్రిక Organiser లో “Manu Rules Our Hearts” అనే వ్యాసం ప్రచురితమైంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి శంకర్ సుబ్బ అయ్యర్ రాసిన ఆ వ్యాసంలో, మనుస్మృతి హిందువుల దైనందిన జీవితాన్ని నియంత్రించే గ్రంథమని, దేశానికి తుది ధర్మశాస్త్రంలా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం స్థాపించిన సెక్యులర్, సమాన హక్కుల తత్వానికి వ్యతిరేకిస్తూ ‘మనుస్మృతి పాలన’ను ప్రతిపాదించే భావజాలం ఆనాటికే ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

ఇలాంటి దృక్పథాన్ని ఎదుర్కొంటూ తిరుపతిలో ప్రదర్శించబడిన కార్టూన్, “హిందూ రాష్ట్రం” ఎలా కనిపించవచ్చో చూపించే వ్యంగ్య రూపకం మాత్రమే. అది హిందువులపై దాడి కాదు; సెక్యులర్ రాజ్యాంగాన్ని బలహీనపరిచే హిందూ రాష్ట్ర భావజాలంపై విమర్శ. కాబట్టి ఈ కార్టూన్‌ను రాజ్యాంగ వ్యతిరేకంగా కాకుండా, సెక్యులరిజాన్ని కాపాడాలని డిమాండ్ చేసే రాజకీయ–కళాత్మక వ్యక్తీకరణగా చూడడం అవసరం. ఈ సందర్భంలో కార్టూన్ తెలిపే ప్రధాన సందేశం ఏమిటంటే— భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం నుంచి మనుస్మృతి ఆధారిత హిందూ రాష్ట్ర దిశగా సాగితే, “సత్యమేవ జయతే” కాదు, “సత్యమేవ పరాజయతే” అనేదే నిజమవుతుందనే హెచ్చరిక ఆ కార్టూన్ ద్వారా తెలియజేసారు.

“హిందూ రాష్ట్రం” వర్సెస్ సెక్యులర్ భారతం

ఈ అరెస్ట్ మరింత లోతైన సంక్షోభాన్ని వెలికి తీస్తోంది. ఒక హిందూ రాష్ట్రాన్ని ఫాసిస్టు పాలనగా చిత్రీకరిస్తే అది రాజద్రోహమా?

ఈ ఘటనతో, భారతదేశం నిజంగా “హిందూ రాష్ట్రం” వైపు వెళ్తోందా అన్న అనుమానం కలుగుతోంది.

“భిన్నత్వంలో ఏకత్వం” అన్న భావంతో నడిచే ఈ దేశం సెక్యులర్‌గా ఉండాలి; ఏ ఒక్క మతం ఆధారంగా దేశం నడవకూడదు. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు, కానీ ఏ మతం దేశంపై అధిపత్యం చెలాయించకూడదు.

హిందూ మతాన్ని ఆచరిస్తూనే, భారతదేశం హిందూ రాష్ట్రంగా మారకూడదని కోరుకునే ప్రజలు సైతం తిరుపతిలో జరిగిన ఈ సంఘటనతో ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందా?

జస్టిస్ చంద్ర కుమార్, హిమాన్షు కుమార్ వంటి ప్రముఖులు పాల్గొన్న ఏ.పి.సి.ఎల్.సి మహాసభలో, దేశంలో అసలైన ప్రమాదం దేశపు సెక్యులర్ నిర్మాణాన్ని పాడుచేయాలని చూస్తున్న వారివలననే పొంచి ఉందని స్పష్టం చేశారు.

మొదటి బ్యానర్లలో నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గి, గౌరీ లంకేష్ చిత్రాలను ఉంచారు. ఈ వ్యక్తులు “మతోన్మాదం”కి వ్యతిరేకంగా పోరాడినందుకు హత్య చేయబడ్డ వారు. 

ఒక రకంగా ఇటువంటి “హిందూ మతోన్మాదం” గురించి, ఇంకా సంఘ్ కార్యకర్తల పని విధానం గురించి 1948లో భారత ఉప ప్రధాని సర్దార్ పటేల్, ఎం.ఎస్. గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో కూడా హెచ్చరించారు.

“హిందువులను సంఘటితం చేయడం ఇంకా వారికి సహాయం చేయడం ఒక విషయం; కానీ అమాయక పురుషులు, స్త్రీలు, పిల్లలపై ప్రతీకారం తీర్చుకోవడం పూర్తిగా వేరే విషయం…

వారి ప్రసంగాలన్నీ మతోన్మాద విషంతో నిండిపోయాయి. హిందువులను ఉత్సాహపరచడానికి, వారి రక్షణ కోసం సంఘటితం చేయడానికి ఈ విషాన్ని పంచడం అసలు అవసరం లేదు.”

“హిందూ రాష్ట్రం” – రాజ్యాంగ వ్యతిరేక దృక్పథం కలిగి ఉంది.  ఈ నేపథ్యంలో హిందూ మతోన్మాద వ్యతిరేకంగా అలాంటి ఒక కళాత్మక నిరసన ఈ ఫోటో.

సి.ఎల్.సి 11 జనవరి రోజు జరిగిన సమావేశంలో కార్యకర్తలకు స్పష్టంగా అర్థం చేయించగలిగింది.

●             హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక బ్యానర్ ద్వారా అని చెప్పడం నేరం కాదు.

●             నరేంద్ర నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గి, గౌరీ లంకేష్ ల హత్యలను సూచిస్తూ హిందూ మతోన్మాదులను శిక్షించాలి అని ఒక ఫోటోను బ్యానర్ గా కట్టడం మేం నేరంగా భావించడం లేదు.

●             డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య పరిధిలోనే ఉందని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది.

●             ఒక సృజనాత్మక వ్యంగ్య చిహ్నం ద్వారా హిందూ రాష్ట్ర పాలనా భావజాలాన్ని విమర్శించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదని అభిప్రాయం వ్యక్తం అయ్యింది

 తిరుపతి ఘటన న్యాయవ్యవస్థకు అసలైన పరీక్షలా మారింది. దేశం ఏ దిశగా వెళ్తోంది అనే విషయంపై ఆలోచన రేపడానికి ఉద్దేశించిన ఒక వ్యంగ్య బ్యానర్‌ను “రాజ ద్రోహం నేరం”గా పరిగణిస్తే, ఆ బ్యానర్‌పై ఉన్న “సత్యమేవ పరాజయతే” అనే శీర్షిక నిజమవుతుందని చూపించే ఉదాహరణగా మారింది.”

PS:

కాషాయ గుంపులు వివాదాలు లేపినా, పౌరహక్కుల నాయకత్వం పై రాజ్యం దాడి చేసినా,   ఏ.పి.సి.ఎల్.సి 20వ మహాసభ 350 మందికి పైగా సభ్యులతో విజయవంతంగా సాగింది. ఇది పౌర హక్కుల ఉద్యమ స్ఫూర్తిని ఏ FIR లతోను, రాజద్రోహ చట్టాలతో అణిచివేయలేమని చూపించింది.

One thought on “పౌరహక్కుల నాయకత్వంపై రాజ్యం దాడి

  1. ఇదేదో AI రాసినట్టుగా ఉంది. ఒరిజినల్ వ్యాసం పెడితే బాగుండు.
    – రీడర్.

Leave a Reply