ప్రజాయుద్ధ నాయకుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, మావోయిస్టు ముఖ్య నేత కామ్రేడ్ పాక హనుమంతు అలియాస్ వుయికె గణేష్ డిసెంబర్ 25న ఒడిశా లో అమరత్వం, 28వ తేదీన అన్ని ఆటంకాలను, కుట్రలను దాటుకొని పోరాటాల నల్లగొండ జిల్లా, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో తను పుట్టిన గడ్డమీద ఆ మహా నాయకుడి పార్థివ దేహానికిఅత్యంత గౌరవపూర్వకంగా జరిగిన అంతిమయాత్రలో అంతే చైతన్య పూర్వకంగా వేలాదిమంది పాల్గొని ఎర్రెర్రని నివాళులు అర్పించిన సందర్భంగా గణేష్ అన్నకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు, (2000 సంవత్సరం నుండి 2013 వరకు సంబంధించినవి).
ఇప్పుడు ఆపరేషన్ కగార్ ను భూతద్దంలో చూపెడుతూ, దాని వికృత రూపాన్ని పొగుడుతూ, ఇక దాని ముందు మావోయిస్టులు తట్టుకోలేరని 2026 మార్చి 31 కల్లా వారిని రూపుమాపడం తద్యమని, జరుగుతున్న ప్రచారాన్ని, అందుకు అనుగుణమైన నరమేధాన్ని చూస్తున్న వింటున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
1980 ల నుండి దండకారణ్యంలో నిలదొక్కుకున్న దళాలు, క్రమ క్రమంగా తమ నిర్మాణాలను అదేవిధంగా ప్రజా పునాదిని పెంచుకుంటూ 2005 వరకు విప్లవోద్యమం ముందుకు సాగుతూ పోయింది. అప్పటివరకు రాజ్యమూ, పోలీసులు వెనక పట్టులో ఉండి అన్నల గొప్పతనం గురించి, వారి శక్తి సామర్థ్యాల గురించి వారి స్టేషన్లలో క్యాంపులలో కథలు కథలుగా చెప్పుకునేవారు. సల్వా జూడుం కూడా ఆదివాసి సమాజంపై పై చేయి సాధించడానికి చాలా ఇబ్బందులు పడ్డది. 90 లలో రెండుసార్లు జన జాగరన్ పేరుతో తెచ్చిన నిర్బంధాలు త్వర త్వరగా ఓడిపోయాయి. 2005లో సల్వా జూడుంలో కూడా వెంటనే రియాక్షనరీ సెక్షన్లు చేరలేదు. అందుకని మొదట బయట నుండి గూండాలను తీసుకువచ్చి వారి ద్వారానే ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. దాని లక్ష్యం సర్వం విద్వంసం. కంటికి కనబడ్డ వేటిని వదలకుండా ధ్వంసం చేయడం, అవి నిర్జీవ పనిముట్లు వస్తువులు అంటే ఇండ్లు ఆస్తులు వగైరా. సజీవ అంటే మనుషులు జంతువులు (కోళ్లు కుక్కలను కూడా వదలలేదు.) అటువంటి క్రూరమైన పాషవికమైన సల్వజూడుమ్ ను ఓడించడమే కాక ఆ వెన్నంటి వస్తున్న గ్రీన్ హంట్, ప్రహార్, సమాధాన్ వంటి మిలిటరీ ఆపరేషన్లను కూడా నిలువరిస్తూ వాటి నుండి తమ బలాన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా ప్రజలను రక్షించుకుంటూ వచ్చిన మావోయిస్టు పార్టీ దాని పి ఎల్ జి ఏ బలగాలు దండకారణ్యంలో గొప్ప చరిత్రను నిర్మించాయి. ఆ కాలమంతా సి ఆర్ పి ఎఫ్, వివిధ కేంద్ర బలగాలు, కమాండో దళాలు మావోయిస్టుల అణచివేతలో పూర్తిగా సఫలం కాలేకపోయాయి. 80 వ దశకంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన కె పి ఎస్ గిల్, సి ఆర్ పి ఎఫ్ ఇంచార్జ్ నళిని ప్రభాత్ వంటి ఎందరెందరో హేమా హేమీ పోలీస్ అధికారులు దండకారణ్యంలో ప్రజా యుద్ధాన్ని అణచలేక అవమాన భారంతో వెనుతిరిగిపోయిన చరిత్ర ఉంది. మావోయిస్టు పార్టీ యొక్క వివిధ కమిటీలు నాయకత్వం పూర్తిస్థాయిలో ప్రజలతో మమేకమైనందు వల్లనే ఇట్టి మిలిటరీ క్యాంపెయిన్లను ఓడించడం లేదా మరో 18 ఏళ్ల పాటు నిలువరించడం చేయగలిగారు.
అటువంటి నాయకత్వంలో పాక హనుమంతు అలియాస్ గణేష్ అన్న మొదటి వరుసలో ఉన్నారు. ఈ కాలంలోనే హిడ్మా మరికొందరు కమాండర్లు సాయుధ బలగాల క్రూర చర్యలను ఎదుర్కొంటూ పి ఎల్ జి ఏ నాయకత్వ స్థానాలలోకి ఎదిగారు. ఈ క్రమం అంతటికి ఉయికె గణేష్ వ్యూహాత్మక నాయకత్వం వహించాడు. ముఖ్యంగా తాను ఎక్కువ కాలం బాధ్యత వహించిన పశ్చిమ బస్తర్ ను విప్లవోద్యమానికి ఉక్కు కోటగా మలిచాడు.
వాస్తవానికి ప్రజా యుద్ధం అంటే ప్రజలందరూ చేసే యుద్ధం, దానికి ప్రజా పునాది లేదా బలమైన ప్రజాపంధా కావాలి. అటువంటి ప్రజా పంధాకు కేరాఫ్ అడ్రస్ ఉయికె గణేష్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. అక్కడి వాతావరణం ఒక జాతర లా ఉండేది. కారణం అతడు గొప్ప ప్రజా సేవకుడు కావడమే. ప్రతి గ్రామంలోనూ అందరినీ పేరుపేరునా గుర్తుపెట్టుకుని, వారి అనారోగ్యాలు బాధలు, పెళ్లిళ్లు చావులు కాన్పులు కష్టాలు, కుటుంబాల సమస్యలు, పండుగలు జాతరలు, సాంఘిక, సాంస్కృతిక సమస్యలు అన్ని స్వయంగా తెలుసుకుంటూ వాటికి తగిన పరిష్కార మార్గాలు చూపెట్టేవాడు. వారికి అప్రతిహతంగా వైద్య సేవలు అందేలా చూసేవాడు. ఆయనకు ప్రజలపై అపారమైన నమ్మకంతో పాటు యువతరంపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది.
అదే సమయంలో అతను గొప్ప ప్రజానాయకుడిగా, మార్గదర్శిగా కూడా ఉండేవాడు. ప్రజా యుద్ధ రాజకీయాలను నిరంతరం ప్రజల నోళ్ళల్లో నాణేలా తాను ముందుండి పనిగట్టుకుని ప్రచారం చేయడం, అలాగే తన కేడర్లు అందరి తో కూడా ప్రచారం చేయించడం అనునిత్యం అమలుపరచేవాడు.
సామాన్య ప్రజలను విప్లవోద్యమ కేడర్లుగా తీర్చిదిద్దడమే గాక ఏ ఏ పనులకు ఎవరెవరు ఎలా సరిపోతారో సరి అయిన అంచనాలతో వాళ్లకు ఆయా పనులను కేటాయించడంలో ఆయన చాలా నేర్పరి కేడర్లుగా చేరలేని వారిని వివిధ ప్రజా సంఘాల లో గాని విప్లవోద్యమ సహాయకులుగా గాని కనీసం సానుభూతిపరులుగా గాని నిలబెట్టడంలో ఆయనకు ఆయనే సాటి.
2000 సంవత్సరం నుండి జంటన సర్కార్లు ఏర్పరచడంలో అతను చాలా బిజీ అయిపోయాడు ప్రజలకు విద్య వైద్యం వ్యవసాయం పశుపోషణ చేపల పెంపకం కూరగాయల సాగు లోపల స్థానిక అవసరాల కోసం చిన్న స్థాయి రోడ్లు రవాణా ఇలా చెప్పలేనన్ని రంగాలలో స్థానిక ప్రజా ప్రభుత్వాలతో కలిసి చాలా అభివృద్ధిని సాధించి పెట్టాడు.
అనేక చోట్ల చెరువులు కుంటలు చెక్ డ్యామ్ లు పోయించాడు. రేపటి తరాల అవసరాలను ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా పండ్ల తోటలు వేయించాడు. ఉద్యమ ప్రాంతాలలో పిల్లలకు నిరంతరం విద్య అందేలా రకరకాల పాఠశాలలు కొన్ని చోట్ల ఆశ్రమాలు ఏర్పాటు చేయించాడు.
దండకారణ్యం అంటేనే అందునా దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్ అంటేనే పెద్ద పెద్ద మీటింగులు సభలకు ప్రసిద్ధి. ఆ రోజుల్లో గణేష్ నాయకత్వంలో జరిగే మీటింగ్‌లు సభలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చేవారు. అలా బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద సభలో వేలాదిమంది ఏకకంఠంతో తన రాజకీయ నినాదాలకు ప్రతి నినాదాలు ఇస్తుంటే ఒక జన సముద్రం అలలు అలలుగా ఊగుతున్నట్లు మెక్సికన్ వేవ్స్ కదలుతున్నట్లుగా, పరిశీలకులకు, అక్కడికి రిపోర్టింగ్ కోసం వచ్చిన విలేకరులకు కూడా గూస్ బంప్స్ వచ్చాయి.
నూతన ప్రజాస్వామిక విప్లవం అంటేనే వివిధ వర్గాల ఐక్య సంఘటన అయినప్పుడు, అటువంటి ఐక్య సంఘటనను నిర్మించడంలో టోటల్‌గా విప్లవ పార్టీ పెద్దగా విజయాలు సాధించలేదనే టాక్ వింటూ ఉంటాం. కానీ గణేష్ మాత్రం గొప్ప ఐక్య సంఘటనావేత్త. అతన్ని కలవడానికి చదువుకున్న వారు, ఉద్యోగులు, స్థానిక బుద్ధి జీవులు నిరంతరం వస్తూ ఉండేవారు. అటువంటి అందరి ఆలోచనలను సలహాలను ఆయన పరిగణనలోకి తీసుకునేవాడు. ఎక్కడైనా చిన్న అతివాద తప్పు జరిగి మన ఐక్య సంఘటన లో కలిసివచ్చే మిత్రులకు ఏమాత్రం నష్టం కలిగినా దానిని సకాలంలో సరిదిద్ది, కేడర్లను ఎడ్యుకేట్ చేసి, తను నాయకత్వం వహించే ప్రాంతాల్లో అట్టి ఐక్య సంఘటనను నిరంతరాయంగా కొనసాగేలా చూసేవాడు. ఆ విధంగా పోరాట ప్రాంతాలలో అనేక సెక్షన్ల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఉద్యమాన్ని నిరంతరం విస్తరింప చేసేవాడు.
విషయాలను విశ్వ జనీనత నుండి ప్రత్యేకత్వంలోకి, నిర్దిష్టత్వం నుండి సాధారణత్వంలోకి అనువదించుకోవడం చేసేవాడు. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, బూర్జువా రాజకీయాల తీరుతెన్నులు, ప్రపంచ ప్రజల పోరాట రూపాలు, పోరాట ప్రాంతాల్లో, శత్రు నిర్బంధంలో వస్తున్న మార్పులను అనునిత్యం అధ్యయనం చేసేవాడు.
అలా గొప్ప రాజకీయవేత్తగా తాను ఎదుగుతూ అందరినీ ఎదిగించడంతోపాటు ఉద్యమంలోని అనేక రంగాలను విప్లవీకరించేవాడు దీని వెనుక అతను కష్టపడి అభివృద్ధి చేసుకున్న శ్రామిక వర్గ భావజాలమే, పీడిత ప్రజా అనుకూల దృక్పదమే, ప్రధానంగా ఉన్నది తన దృష్టిలోకి వస్తున్న ప్రాపంచిక విషయాలన్నింటిలోనూ రెల్లును పొల్లును వేరు చేస్తూ, వర్గ పోరాట రాజకీయాలను ఉన్నత స్థానంలో నిలబెట్టడములోనే పాక హనుమంతు ప్రత్యేకత ఉన్నది.
అతని నాయకత్వంలో వివిధ పార్టీ కమిటీలు, నిర్మాణాలు, ప్రజాసంఘాలు, జనతన సర్కార్లు నిరంతరం కళకళలాడేలా కదలికలో ఉండేలా చేయడంలో అతనికి ప్రత్యేక ఆర్గనైజింగ్ టాలెంట్స్ ఉండేవి. ప్రజలను సమీకరించడం, సంఘటితం చేయడం, వారిలోని పోరాట శక్తిని ప్రేరేపించడం, ఇనుమడింపజేయడంలో తన కేడర్ల చేత కూడా అంతే స్థాయిలో ప్రజా చైతన్యాన్ని వారి శక్తిని ఉద్దీపింప చేయడంలో పాక హనుమంతుది అందెవేసిన చేయి.
పార్టీ అంతర్గత నిర్మాణాలలో అనేక విషయాలలో అతను ఒక రోల్ మోడల్ గా ట్రెండ్ సెట్టర్‌గా ఉండేవాడు అదే సమయంలో ప్రజా సంఘాలలో కూడా పిల్లలు పెద్దలు అందరూ అతన్ని అనుసరించడం, అనుకరించడం కూడా చేసేవారు ఉదాహరణకు ఒక ప్రముఖ పోరాట కేంద్రమైన గ్రామములో జరుగుతున్న జంతన సర్కార్ మీటింగులో ఒక జటిల సమస్య ముందుకు వచ్చినప్పుడు, గణేష్ అన్న ఉంటే ఈ సమస్యను ఎలా పరిష్కరించేవాడో అని ఆలోచించి అటువంటి నిర్ణయాన్ని తీసుకునేవాళ్లు.
ఉయికె గణేష్ మహిళా పక్షపాతి, ఆదివాసీ ప్రాంతాలలోని ఆడపిల్లలు, మహిళల ఇబ్బందులను అతను డీప్ గా స్టడీ చేశాడు. వారి ఉన్నతికై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. అందువల్ల గణేష్ అన్న తమ గ్రామానికి వచ్చాడని తెలియగానే పోలోమని అన్ని వయసుల మహిళలు వచ్చి ఆయనను చుట్టుముట్టి ఆయన యోగక్షేమాలను తమ బాగోగులను ఆయనతో పంచుకొంటూ తమ కష్టాలను చెప్పుకునేవారు. దండకారణ్యంలో ముఖ్యంగా పశ్చిమ బస్తర్‌లో, దశాబ్దాల పాటు ఆయన నాయకత్వంలో పార్టీలోకి, దళాలలోకి, వేలాదిగా రిక్రూట్లు జరిగితే యువకులతో పాటు పోటీపడి యువతులు కూడా భారీ ఎత్తున రిక్రూట్ అయిన సందర్భాలు రెగ్యులర్‌గా కనబడతాయి.
ఉయికె గణేష్ గొప్ప పర్యావరణవేత్త, పర్యావరణం దాని పరిరక్షణ విషయాలలో అతనికి చాలా పట్టు ఉంది. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మనకు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆచరణలో కూడా అతను ఎక్కడ ఉన్నప్పటికీ ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రజలతో కలిసి విడివిడిగా కూడా అనేక రకాల మూలికల మరియు పండ్ల మొక్కలను నాటడం, నాటించడం చేసేవాడు. ఆయా సందర్భాలలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ చేసిన అటవీ పరిరక్షణ (జంగల్ బచావో) కమిటీల నియామక తీర్మానాల వెనుక ఆయన కృషి కూడా ఉంది. ఒక గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ప్రస్తుతం మరియు రాబోయే ఆహార అవసరాల కొరకు వారికి ఎంత భూమి కావాలి అలాగే ఊరు ఉమ్మడిగా కూడా కొంత భూమిని వదిలి మిగిలినదంతా అటవీ భూ సంపదగా పరిరక్షించబడేలా కాలానికి అనుగుణంగా దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ గ్రామ గ్రామాన అటవీ రక్షణ (జంగల్ బచావో) కమిటీలు ఉండాలని తీర్మానాలు చేసింది. ఈ విధానాలలో కామ్రేడ్ గణేష్ ది కూడాప్రముఖపాత్ర ఉంది. అలాగే అటువంటి తీర్మానాలు అన్ని పకడ్బందీగా అమలు అయ్యేలా చూడడంలో గణేష్ చాలా శ్రద్ధ వహించాడు.హిడ్మా అమరత్వం తర్వాత సోషల్ మీడియా లో అనేక ఫోటోలు వీడియోలు వచ్చాయి. వాటిలో ప్రధానమైనవి ఉత్తర చత్తీస్గడ్ ప్రాంతమంతా బోడిగుట్టలు దుమ్ము ధూళితో కనబడుతుండడం, అలాగే దక్షిణ ఛత్తీస్గడ్ ప్రాంతంలో ఆకుపచ్చని గుట్టలు లోయలు మైదానాలు కనబడడం జరుగుతుంది. మావోయిస్టు ఉద్యమం ఉండడం వల్లనే ఇక్కడి పర్యావరణం పరిరక్షించబడిందనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. వీటన్నింటి వెనక గణేష్ అన్న మరియు అతని సహచరుల కృషి పట్టుదల చాలా ఉంది.
వర్గ యుద్ధాన్ని నడపాలంటే చదువు, విజ్ఞానం, చైతన్యం చాలా అవసరం. అందుకొరకు తాను ఎప్పుడో మధ్యలో వదిలేసిన డిగ్రీ చదువు వద్దనే ఆగిపోకుండా, అంతకు లక్ష రెట్ల విజ్ఞానాన్ని చైతన్యాన్ని ప్రోది చేసుకున్నాడు. అందుకుగాను నిరంతరం వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక పుస్తకాలను పత్రికలను ఎన్నింటినో అధ్యయనం చేస్తూ గొప్ప విద్యావంతుడిగా ఆయన జీవితమే ఒక విప్లవ పాఠశాలగా ఎదిగి వచ్చాడు. అయినా ఒదిగి ఉండడమే ఆయన ప్రత్యేకత. ఇటువంటి విద్యను విజ్ఞానాన్ని తన ప్రజలకు అందించేందుకు ఆలోచన తపన ప్రత్యేక దృష్టి ఆయనకు ఉండేది దానికి కార్యాచరణ రూపమే మొదట్లో చెప్పుకున్నట్లు రకరకాల పాఠశాలలు ఆశ్రమాలు నిరంతరం నడిచే ఏర్పాటు చేశారు దాని ఫలితంగా గణేష్ నాయకత్వం వహించే ప్రాంతాలలో ప్రజల ప్రజాసంఘాల కేడర్ల చైతన్యం కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండేది. దానికి తోడు అనేక ముఖ్యమైన రాజకీయ విషయాలను పరిణామాలను సూక్ష్మ రూపంలోకి మార్చి ప్రజల భాషలో కథలు కథలుగా చెబుతూ ప్రచారంలో పెడుతూ ఉండడం వల్ల కూడా అట్టి ప్రజల పోరాట నైతిక శక్తి చాలా ఉచ్చ స్థాయిలో ఉండేది.
అట్టి కథల్లో సామ్రాజ్యవాద దోపిడీ అణచివేతలు, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాద క్రూరత్వం, ప్రపంచీకరణ పేరుతో భూగోళమంతట అది చేస్తున్న అన్యాయాలు, ఇలాంటివి ఉండేవి. ఇటువంటివి ప్రపంచంలో ఏ మూల జరిగినా వాటిని స్థానికీకరణ చేసి లోకల్ కేడర్లకు ప్రజల లెవల్ వరకు చెప్పేవాడు. ఉదాహరణకు వర్ణ వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా నాయకత్వంలో జరిగిన దక్షిణాఫ్రికా స్వాతంత్ర పోరాట సమర్థకుడు బిషప్ డెస్మాండ్ టూ టూ అన్నమాటలు. “వాళ్లు నా దేశం వచ్చారు, నా చేతికి బైబిల్ ఇచ్చారు, ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా చేతిలో బైబిల్ ఉంది, నా దేశం వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది.” వంటి చారిత్రాత్మక విషయాలు దండకారణ్య ప్రజల పోరాట పటిమను నిరంతరం పదును పెట్టేలా అందరినీ ఎడ్యుకేట్ చేసేవాడు.
ఉయికె గణేష్ బహుభాషా కోవిదుడు, రోజువారీగా ఇంగ్లీషు డైలీ పేపర్ ‘ది హిందూ’ చదివేవాడు. భారతదేశ అంతరాత్మను, గత చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ఉర్దూ రావడం తప్పనిసరి అని గుర్తించి, మొదట అతడు పట్టణాలలో ఆర్గనైజర్ గా ఉన్నప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒక ఉర్దూ పండితుని వద్దకు క్రమశిక్షణగా వెళ్లి నేర్చుకున్నాడు. అతని వద్ద ఉర్దూ సాహిత్యం కూడా ఉండేది. ఇదేవిధంగా విప్లవ అవసరాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనేక భాషలు నేర్చుకున్నాడు. తను ముందు నుండే ప్రభాత్ తదితర పత్రికలకు వ్యాసాలు, రిపోర్టులు రాస్తున్నప్పటికీ, 2000 సంవత్సరం నుండి జంతన సర్కార్ల అవసరాల రీత్యా స్థానిక పత్రికలు-స్థానిక భాషల్లోనే నడపాలని తీర్మానించడంతో, అతను విప్లవ జర్నలిస్టుగా “పితూరి” (తిరుగుబాటు), “మిడుంగూర్” (నిప్పు రవ్వ) తదితర పత్రికల సంపాదకుడుగా కూడా అత్యంత చైతన్య పూరితమైన బాధ్యతలు నిర్వహించాడు. ఒక విశాల ప్రాంతానికి అంతా బాధ్యుడిగా ఉండి వందల రకాల పనులతో సతమతమవుతున్నా సకాలంలో అట్టి పత్రికలు ప్రజల చేతికి అందేలా చాలా శ్రద్ధ పెట్టేవాడు. అందుకొరకు అదనపు కష్టాన్ని అనుభవించేవాడు.
పాక హనుమంతు ఒక అంతర్జాతీయ విప్లవకారుడు. తన ఆలోచనా ప్రపంచం చాలా విశాలమైనది. ఆ చైతన్యంతోనే అతను ఎంత పెద్ద పనులైనా అవలీలగా చక్కదిద్దేవాడు. ఉద్యమం పెరుగుతున్న కొద్దీ పి ఎల్ జి ఏ, జంతన సర్కార్ల అవసరాలు పెరిగేవి. అందుకు అనుగుణంగా ఒక ఆర్కిటెక్ట్ లాగా ప్లాన్ చేసుకొని తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, లాజిస్టిక్స్ ను డెవలప్ చేసేవాడు. అతని అమరత్వం గురించి హిందుస్థాన్ టైమ్స్ పత్రిక “అతనొక సున్నితమైన విప్లవకారుడు-కానీ అతని వ్యూహాలు పని విధానం చాలా కఠినమైనవని”(ప్రమాదకరమైనవని). పేర్కొంది. కామ్రేడ్ హనుమంతు గురించి మీడియాలో గాని బయట గాని ఎక్కువగా తెలియదు. కారణం అతడు చేసేది ఎక్కువ ప్రచారం చాలా తక్కువ. అందుకు కూడా అతని విశాల అంతర్జాతీయ దృక్పథమే కారణం. ఒకవేళ మన పోరాట ప్రాంతాలను పరిశీలించడానికి, అధ్యయనం చేయడానికి స్వదేశీ, విదేశీ మేధావులు ఎవరైనా రాదలచుకుంటే వారికి కూడా ఆదరంగా ఆతిథ్యం ఇచ్చి తిరిగి వారి వారి ప్రాంతాలకు క్షేమంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయగల సామర్థ్యం, ఓపిక ఆయనకు ఉండేది.
అందుకే ఆయన కగార్ నరమేధాన్నీ, అంతర్గత విద్రోహుల కుట్రలనూ, హీనమైన సాయుధ లొంగుబాట్లనూ కాలదన్నాడు. అంతే కాదు అతను విప్లవోద్యమం లో చేరిన నాడే నాటి తెలంగాణ సాయుధ పోరాట విరమణ ను అత్యంత స్పష్టంగా నిరసించినటువంటి హనుమంతన్న తన చివరి రోజుల్లో సమస్త విద్రోహాలు తేటతెల్లమై చావు తన ముందుకు వచ్చి నిలబడ్డా అంతిమ శ్వాస వరకు ప్రజలను విప్లవోద్యమాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు.
పాక హనుమంతు సాధించిన ప్రధాన విజయం ఏమిటంటే, అతని భావజాలం ఇప్పుడు వేలాది లక్షలాది మంది ప్రజలలోకి సజీవంగా చొచ్చుకు పోయింది. ఫీనిక్స్ పక్షికి మరణం లేదు. ఇప్పుడు ఈ పుల్లెంల గ్రామంలో కూడా మనం దహనం చేసిన చోట దాని ఆనవాళ్లు లేవు. అంటే గణేష్ అన్న మళ్లీ ఫీనిక్స్ పక్షి లా ఎగిరిపోయి తిరిగి ప్రపంచ ప్రజలకు ప్రజాయుద్ధ రాజకీయాలను చేరువ చేసేందుకు, భారత దేశ విముక్తి కోసం, జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం ఒక్క గెరిల్లా జోన్ పోతే అనేక గేరిల్లా జోన్ల నిర్మాణం కోసం, లక్షలాది గ్రామ రాజ్య కమిటీలను వేలాది హిడ్మాలను తయారు చేసే పనిలో తిరిగి అతడు నిమగ్నం అయిపోయాడు.
జోహార్ పాక హనుమంతన్న !!
అమర్ రహే కామ్రేడ్ ఉయికె గణేష్ అన్న !!
అమర వీరులకు జోహార్లు !!
అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తాం !!
లడాయి జీడన ఇత్యకే మామూలు అయ్యో, నెత్తురు పోంగనాస్కే ఎదురు తర్గన కీకే ఆఖరితె లడాయి జీడిత.




