అప్పటికే నడవబట్టి మూడు గంటలవుతోంది. అందులో గుట్టలు ఎక్కడం. శరీరమంతా పులిసి పోయినట్టుగా ఉన్నది. విపరీతమైన చెమటలు. పిక్కలన్ని గట్టిగ అయిపోయి గుట్ట దిగడం ఇంకా కష్టంగా ఉంది.

సాధారణంగా దిగడం సులువు అనుకుంటారు కానీ దిగడమే చాలా కష్టం. అదీ గుట్ట ఎక్కిన వెంటనే మళ్లీ కిందకు దిగడమంటే ఇంకా కష్టం. బరువంతా మోకాళ్ల మీదనే పడ్తది. మరీ క్రాస్‌గా దిగాల్సి వస్తె, కాళ్లు వణుకుతుంటాయి. అసలు కాళ్లకు బలమే లేనట్టు ఎక్కడ పడిపోతామో అనిపిస్తది.

ఇప్పుడేందో పిక్కలు పట్టేసినట్టు ఉన్నాయి. నరాలు దగ్గరికి గుంజుకపోతున్నట్టు అనిపిస్తోంది.

‘‘ఇంకా ఎంత దూరం రాజ్‌మన్‌’’ అడిగింది రీతు.

నిజానికి ఈపాటికి వూరు చేరాల్సింది. తన వల్లనే లేట్‌ అయ్యింది.

‘‘ఇంకో అరగంట’’ బదులిచ్చాడు దళ కమాండర్‌ రాజ్‌మన్‌.

అరగంట కాస్తా ముప్పావు గంట అయ్యింది. రీతు పరిస్థితి చూసి ఆమె కిట్టును వేరేవాళ్లకు ఇచ్చాడు రాజ్‌మన్‌.

తమ కిట్టును వేరేవాళ్లకు ఇవ్వడానికి సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. విధిలేక ఇవ్వడమే. తమ బరువు కాకుండా వేరేవాళ్ల బరువును మోయడం అంటే ఎవరికైనా ఇబ్బందే. ఎంత పని చేయడానికైనా, ఎంత బరువు మోయడానికైనా సిద్ధపడేవారు దళంలో ఒకరిద్దరైనా ఉంటారు. వారి వల్లనే దళం సజావుగా నడుస్తుంటుంది.

రీతు బయటి నుంచి వచ్చింది. మొదట్లో దళంతోపాటు నడవడం కష్టమయ్యేది. దానికి తోడు రోజూ స్నానం లేకపోవడం మరింత ఇబ్బందిగా వుండేది. నిద్ర సరిపోక పోవడం అన్నింటికంటే పెద్ద ఇబ్బంది. టైమ్‌ దొరికితే నిద్ర పోదామన్నట్టుగా ఉండేది. తర్వాత్తర్వాత దళ జీవితానికి అలవాటుపడింది. అడవికి వచ్చి మూడేండ్లైనా ఇప్పటికీ అలవాటుపడని విషయం ‘పీరియడ్స్‌’.

పీరియడ్స్‌ రావడానికి ముందు, వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ టైమ్‌లో సెంట్రీలు చెయ్యడం మరీ ఇబ్బందిగా ఉండేది. రీతుకి నడుము నొప్పి, కాళ్లు గుంజడమే ఉండేది. కానీ దేవెకి, సబితకి విపరీతమైన కడుపునొప్పి కూడా ఉండేది. వుండలు చుట్టుకపోయేవారు. ఆ టైమ్‌లో వారికి సెంట్రీ డ్యూటీ నుంచి,  ఊర్లకు పోవడం వంటి పనుల నుంచి మినహాయింపు ఇచ్చేవాడు రాజ్‌మన్‌.

అమ్మాయిలు వెళ్లి వారి పరిస్థితి చెప్పినప్పుడు పనుల నుంచి మారు మాట్లాడకుండా మినహాయింపు ఉంటుంది. కొత్తగా దళంలోకి వచ్చినవారు, లేదా సరిగా అర్థం చేసుకోని ఒకరిద్దరు జెంట్‌ కామ్రేడ్స్‌ మాత్రం గులిగేవారు – పని నుంచి తప్పించుకోవడానికి ‘ఇదో సాకు’ అని.

నిజానికి ఎంత నొప్పి ఉన్నా పోటీపడి పనిచేస్తారు మహిళా కామ్రేడ్స్‌. ఇతర్లకు భారం కాకుండానే చూసుకునేవాళ్లు. ఇక తప్పదు అనుకుంటేనే తమ బాధను చెప్పేవాళ్లు. తమకు ‘పీరియడ్స్‌’ వచ్చాయని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతారు ఆదివాసీ కామ్రేడ్స్‌.

ఆదివాసీ సమాజంలో పీరియడ్స్‌ వచ్చినప్పుడు ఊరి పూజారి కంటబడటం చాలా నేరం. పీరియడ్స్‌ వస్తే ఊరికి దూరంగా ఉన్న గుడిసెలో ఉండాల్సి వచ్చేది. ఆ అయిదు రోజులు అడవిలోనే తిరిగేవారు. ఒకవేళ పూజారి కంటబడితే పంచాయితీ పెట్టి, దండుగలు వేసేవాడు. పూజారికి వారి మీద కోపం ఉంటే కనపడకపోయినా కనబడ్డారని దండుగ వేసేవాడు. కొన్నిసార్లు అతనికి ఆ అమ్మాయి మీద కాంక్ష కలిగి, ఆ అమ్మాయి ఒప్పుకోనప్పుడు కూడా పూజారి దండుగ వేసేవాడు.

ఆ నేపథ్యం నుంచి వచ్చినవారు కాబట్టి తమకు నెలసరి వచ్చిందని చెప్పుకునే వారు కాదు. చెప్పుకున్నారూ అంటే వారికి భరించలేనంత నొప్పి వుండి వుంటుంది.

ఇప్పుడు పీరియడ్స్‌ గురించి చెప్పగానే పనుల నుంచి కమాండర్లు మినహాయింపు ఇస్తున్నారు కానీ, మొదట్లో ఇలా ఉండేది కాదు. ఈ పరిస్థితి రెండు వేల సంవత్సరం నాటికి చాలా వరకు మారింది. దానికి కారణం పార్టీనే. దళాలు పెరిగాయి. అమ్మాయిల రిక్రూట్‌మెంట్‌ పెరిగింది. రైతుకూలీ, మహిళా, బాలల సంఘాలు బలంగా పనిచేస్తున్నాయి. పునరుత్పత్తికి సంబంధించి క్లాసులు పెట్టి మరీ అర్థం చేయించింది పార్టీ. ఆ తర్వాత దళాల్లో చాలా వరకు మార్పు వచ్చింది.

కిట్లు దించుకోగానే రీతు వెళ్లి రాజ్‌మన్‌కు చెప్పింది. ఆ రోజు కిచెన్‌ డ్యూటీ రీతుదే వుండె. ఆ డ్యూటీని వేరేవాళ్లకు వేసాడు.

పీరియడ్స్‌ సమయంలో వాడుకోవడానికి మూడు నెలలకు ఒక లుంగీ ఇస్తారు. దానిని చింపి దస్తీల మాదిరిగా తయారు చేసుకుంటారు. మూడు నెలలు కాగానే వాటిని పడేసి, కొత్త లుంగీని తెప్పించుకుంటారు. మొదట్లో అవే క్లాత్‌లను చాలా కాలం వాడేవారు. ఎలర్జీ లాంటి సమస్యలు ఎదురయ్యాయి. డాక్టర్లతో క్లాసులు జరిగినప్పటి నుంచి ఇలా మూడు నెలలకు ఒక లుంగీని మహిళలు తెప్పించు కుంటున్నారు. అలాగే అదనంగా నెలకు సగం డెట్టాల్‌ సోప్‌ను – నెలసరి గుడ్డలు ఉతకడానికి మహిళా కామ్రేడ్స్‌కి ఇస్తున్నారు.

పీరియడ్స్‌కు ఉపయోగించిన క్లాత్‌ అని తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లుంగీ ముక్కలను చింపి, దస్తీలకు కుట్టినట్టుగా చుట్టూ కుడతారు. దస్తీలుగా కూడా లుంగీలను చింపిన ముక్కలనే వాడతారు కాబట్టి దస్తీలకు, వీటికి పెద్ద తేడా తెలిసేది కాదు. డెట్టాల్‌ సోప్‌, లేదా లైఫ్‌బోయ్‌ సోప్‌తో ఉతికితే ఈ బట్టల మీద ఒక్క మరక కూడా కనిపించేది కాదు.

వీటిని ఆరేయడం మరో పెద్ద సమస్య. ముఖ్యంగా వానాకాలంలో చాలా ఇబ్బంది. బస్తర్‌లో మంచి అడవి, కొండ ప్రాంతం కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. వానాకాలంలో ఉతికిన తడిబట్టలనే ఆదివాసీ మహిళా కామ్రేడ్స్‌ తమ నడుములకు చుట్టుకునేవారు. బయట ఆరేస్తే ఆరవు. క్యాంపుల్లో అయితే టెంట్‌ లోపల ఆరేయాలి. రెగ్యులర్‌గా ఊర్లు తిరిగే సమయం అయితే, పొయ్యి దగ్గర కూర్చుని ఆరబెట్టుకోవాలి. అక్కడ కూచుని ఆరబెట్టుకుంటే, అందరికీ కనిపిస్తది. అదో సిగ్గు. కాబట్టి నడుముకే చుట్టుకునేవారు. శరీరపు వేడికి అవి పొడిగా అయ్యేవి. ఆ ఐదు రోజులు నడుముచుట్టూ ఎప్పుడూ పచ్చిగానే ఉండేది. అందునా దళంలో రోజూ స్నానం కూడా ఉండదు కాబట్టి, కొందరికి ఎలర్జీలు కూడా వచ్చేవి. అర్థం చేయిస్తుండటంతో ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. నిప్పు దగ్గర ఆరబెట్టుకుంటున్నారు.

రాత్రి పూట తప్పని పరిస్థితుల్లో టెంట్‌లో ఆరేసేవాళ్లు. దాంతో హడావుడిగా ఉతకడం వల్లనో, ఎందువల్లనో కానీ కొన్నిసార్లు కవుసు వాసన వెదజల్లేది. పురుష కామ్రేడ్స్‌ మనసులో ఏమన్నా అనుకునేవారో లేదో తెలియదు కానీ… పైకి మాత్రం ఏమీ అనేవారు కాదు. కనీసం ముఖాన్ని కూడా చిట్లించినట్టు రీతు ఎప్పుడూ చూడలేదు.

ఈ గొడవంతా లేకుండా న్యాప్‌కిన్స్‌ వాడొచ్చు. కానీ, కెమోప్లేజ్‌ కావు. వాటిని గుంతలు తీసి పూడ్చాలి. వాటిని తీసుకొచ్చే సమయంలో చెకింగ్‌లో దొరికితే, అవి దళం దగ్గరకే తీసుకుపోతున్నారనే విషయం తెలిసిపోతది. ఎందుకంటే, స్థానిక మహిళలు న్యాప్‌కిన్స్‌ వాడరు. తెచ్చేవారి ప్రాణాలకూ ప్రమాదం. కాబట్టి లుంగీలనే వాడేవారు. అదీగాక స్థానిక ప్రజలకు భిన్నంగా ఉండకూడదు అనేది పార్టీ నిర్ణయం. పేద మధ్యతరగతి వారి జీవనం పార్టీలో వుండేది. ప్రతీ పైసాకు పూచీపడాలని పార్టీ అర్థం చేయిస్తుంది.

కిచెన్‌ డ్యూటీ నుంచి మినహాయింపు దొరకగానే అప్పటికే నిలబడే ఓపిక లేని రీతూ తన ‘కవర్‌’కి దగ్గరలో పాలిథిన్‌ పరుచుకుని పడుకుంది. రెండు గంటలు గడిచింది. సమయం తొమ్మిది గంటలు కావస్తుంది. పూల్‌బత్తి టిఫిన్‌ తీసుకువచ్చి రీతూని లేపింది. ఏందో ఎన్నడూ లేనంత మైకంగ, ఒళ్లంతా దెబ్బలు కొట్టినట్టుగా వుంది రీతూకి. లేచి కొద్దిసేపు అట్లాగే కూర్చుంది.

‘‘దీదీ, మొఖం కడుక్కోవడానికి నీళ్లు తెచ్చి ఇవ్వనా?’’ అడిగింది పూల్‌బత్తి.

‘‘అయ్యో… వద్దు పూలబత్తీ’’ అని లేచింది.

టిఫిన్‌ ప్లేట్‌ మీద ఆకు కప్పి వెళ్లిపోయింది పూల్‌బత్తి.

ముఖం కడుక్కుని వచ్చి టిఫిన్‌ తిని కిచెన్‌ దగ్గరకి వచ్చి పొయ్యి మంట దగ్గర కూర్చుంది రీతూ.

అప్పటికే అక్కడ దళం వాళ్లు ఛాయ్‌ తాగుతున్నారు. కిచెన్‌ డ్యూటీలో వున్న సంపత్‌  ‘‘గ్లాస్‌ ఇవ్వు దీదీ, ఛాయ్‌ పోస్త’’ అన్నాడు.

గ్లాస్‌ తేలేదని చెప్పడంతో తన గ్లాస్‌లో ఛాయ్‌ పోసి రీతూకి ఇచ్చాడు.

దళంలో ఎవరి గ్లాస్‌, ప్లేట్‌ వారిదే. చాలా శుభ్రతను పాటిస్తారు. అడగకుండా ఎవరి వస్తువును తీసుకోరు.

అక్కడే కూర్చుని తాగింది. కొంచెం తేలిక అయ్యింది రీతుకి.

ఊరి నుంచి వచ్చిన జనంతో రాజ్‌మన్‌ పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ ఖాళీగా వుండడు. కమాండర్లకు కిచెన్‌, సెంట్రీ డ్యూటీల నుంచి మినహాయింపు వుంటుంది. కానీ ఆయన కమాండర్‌ అనేగానీ అన్ని పనులకు ముందుంటాడు.

రీతు అక్కడికి వెళ్లింది. ‘ఇప్పుడు బాగానేనా రీతు దీదీ’ అన్నట్టు కండ్లతోనే పలకిరించిండు రాజ్‌మన్‌. పర్వాలేదు అన్నట్టు నవ్వింది రీతు. అక్కడే వున్న ఓ మొద్దు మీద కూచుని, జనం చెప్పేది వింటోంది.

‘‘పోలీసులు ఏమైనా తిరుగుతున్నారా’’ రాజ్‌మన్‌ అడిగాడు.

‘‘ఈ మధ్య రాలేదు దాదా. ఓ పది పదిహేను రోజుల కింద పక్క వూరి వరకు వచ్చి వెళ్లిపోయారు. సంతలో మాత్రం ఎవరెవరు ఏ వస్తువులు కొంటున్నారని మామూలు మనుషుల్లెక్క వుండి చూస్తున్నారట’’ జనంలోంచి బుద్రాలు చెప్పాడు.

ఆదివాసీలు ఎంతసేపైనా, ఎంత వృద్ధులైనా మోకాళ్ల మీద కూచుంటారు. కింద రాయో, రప్పో లేకపోతే అలా కూచోవడం వాళ్లకు చాలా సహజం.

ఇంతల డిప్యూటీ కమాండర్‌ మంగ్డూ వచ్చి సెంట్రీకి వెళ్లాలని రీతూకి చెప్పాడు.

‘‘వెళ్లగలవా దీదీ’’ రాజ్‌మన్‌ అడిగిండు. వెళ్తాను అని తల ఊపి లేచింది.

నిజానికి రీతూకి నిలబడే ఓపిక లేదు. సెంట్రీ డ్యూటీ అంటే సాధారణంగా నిలబడే చెయ్యాలి. శత్రువు వచ్చినప్పుడు ఫైరింగ్‌ చెయ్యడానికి అయినా, రిట్రీట్‌ అవ్వడానికి అయినా నిలబడితేనే ఈజీ. ఓపికలేనప్పుడు ఒకరిద్దరు కూచుని చేస్తారు. కానీ ఎవరైనా చూస్తే కమాండర్‌కి చెప్తారు. మీటింగ్‌ అయినప్పుడు ఇదో విమర్శ కూడా. కూచుని చెయ్యడంలో వున్న అననుకూలతలను మళ్లీ వివరిస్తాడు కమాండర్‌. ఈ విషయం తెలిసినా కొన్నిసార్లు అట్లా సెంట్రీలో కూర్చుంటారు. అది అంతే.

మంగ్డూలో కొంత పితృస్వామ్య భావజాలం వుంటుంది. మహిళా కామ్రేడ్స్‌ పనుల నుంచి తప్పించుకోవడానికి ఈ పీరియడ్స్‌ను సాకుగా తీసుకుంటారని అనుకుంటాడు. ఈ విషయం స్క్వాడ్‌ ఏరియా కమిటీ (సాక్‌) మీటింగ్‌లోనూ రెండు మూడుసార్లు ఎత్తి చూపాడు. జిల్లాకమిటీ మెంబర్‌ ప్రభాకర్‌ వివరించినప్పటికీ మంగ్డూలో పెద్ద మార్పు రాలేదు. ఇప్పుడు నోటితో అనడు కానీ మనసులో అదే వుంటుంది. ఒకసారి ‘సాక్‌’ మీటింగ్‌లో రీతూ కూడా అతనికి ఈ విషయమై అర్థం చేయించాలని చూసింది. కానీ అతను మధ్యలో అడ్డుకుని సంభాషణ కొనసాగనివ్వలేదు. ఈ విషయంలో ఎంతమంది చెప్పినా మంగ్డూలో మార్పు రాలేదు. బహుశా అతనికి మహిళా కామ్రేడ్స్‌పై కూడా మనసులో ఎక్కడో కొంత తక్కువ భావననే ఉన్నది.

మంగ్డూ నిరసన చూపులను భరించడం కష్టం అనుకుని కిట్టు తీసుకుని సెంట్రీకి వెళ్లింది రీతూ. పది దాటినా సూర్యుడు ఇంకా పైకి రాలేదు. బాగా పొగమంచు కమ్మేసింది. దగ్గరలో ఉన్నవే సరిగా కనిపించడం లేదు.

తర్వాత సెంట్రీకి దేవె వచ్చింది.

రీతూ సెంట్రీ పోస్టు నుంచి రిలీవ్‌ అయ్యి, పక్కనే పారుతున్న దొడ్డ (వాగు)లో పీరియడ్‌ క్లాత్‌ ఉతుక్కోవడానికి వెళ్తూ, దేవెకి చెప్పింది. అప్పటికి పొగమంచు విచ్చుకుంది. కానీ ఎండలో తీవ్రత లేదు.

దేవె పొగాకును చేతిలో నలుస్తోంది, నోట్లో పెట్టుకోవడానికి. ఉత్తర బస్తర్‌లో ఒకరిద్దరు మహిళా కామ్రేడ్స్‌ ఈ అలవాటును మానుకోలేకపోయారు. స్థానిక మహిళల్లో పొగాకు తినడం సహజం.

ఆ ప్రాంతంలో రాళ్లు లాంటి ఏ అడ్డూ లేకపోవడంతో వాగు నిశ్శబ్దంగా, నిలకడగా ప్రవహిస్తోంది. బట్టలు ఉతుక్కుంటున్న రీతూ… ఏదో అలికిడి అయినట్టు అనిపిస్తే కుడిపక్కకు తిరిగి చూసింది. సెంట్రీ వున్నది కూడా అటువైపే. సెంట్రీ చుట్టూ పొదలున్నాయి కాబట్టి సెంట్రీలో వున్న మనిషి కనిపించడం లేదు. సెంట్రీకి ఆ పక్క నుంచి పోలీసులు రౌండప్‌ చేస్తున్నారు.

ఉతుకుతున్న బట్టలను అక్కడే పడేసి, బెండింగ్‌ పొజిషన్‌లో సెంట్రీ పోస్టులో వున్న దేవెకి విషయం చెప్పాలని వెళుతోంది రీతూ. అవసరమైతే ఆమెకు సపోర్ట్‌గా కూడా వుండాల్సి వుంటుంది. నీళ్లకి కొద్ది దూరంలో పెట్టిన కిట్టును, వాటర్‌ డబ్బాను అక్కడే వదిలేసింది. వాటి కోసం వెళితే సమయం మించి పోవచ్చు. ఫైరింగ్‌ ఓపెన్‌ అయితే దేవె దగ్గరకి వెళ్లడం కుదరకపోవచ్చు.

రీతూ సెంట్రీవైపు రావడాన్ని పోలీసులు చూడనే చూశారు. ఎవరూ చూడకపోతే వారి ఇన్‌చార్జి కాషన్‌ ఇచ్చేవరకు అంటే… ఒక రౌండ్‌ తూటా కాల్చేవరకు గమ్మున రౌండప్‌ చేస్తునే వుంటారు. రీతును గమనించడంతో ఫైరింగ్‌ ఓపెన్‌ చేశారు. నోట్లో పొగాకు పెట్టుకుంటూ పోలీసులను చూసిన దేవె వారికంటే కొన్ని సెకన్ల ముందే ఫైరింగ్‌ ఓపెన్‌ చేసింది. ఒక్క అంగలో దేవె దగ్గరకి చేరుకుంది రీతు. ఇద్దరి దగ్గర త్రీనాట్‌త్రీ తుపాకులున్నాయి.

దళానికి మరోవైపు నుంచి కూడా పోలీసులు ఫైరింగ్‌ చేస్తూ దూసుకు పోతున్నారు. సెంట్రీ దగ్గరి నుంచి ఫైరింగ్‌ వినిపించగానే క్షణాల్లో అందరూ కవర్లలోకి వెళ్లిపోయారు. జనాన్ని క్రౌన్‌ పొజిషన్‌లో పడుకొమ్మని, లేవవద్దని, లేస్తే తూటాలు తగులుతాయని చెప్తూనే రాజ్‌మన్‌ బెండింగ్‌ పొజిషన్‌లో కవర్‌ దగ్గరికి వెళ్తున్నాడు. ఏం చేయాలో తోచక నిలబడి వున్న కొత్త కామ్రేడ్‌ దస్రును రెక్క పట్టుకుని గింజుకుంటూ తన వెంట తీసుకు పోయాడు.

ఫైరింగ్‌ జరిగితే ‘అస్సాల్ట్‌ టీం’ను ప్రధానంగా లీడ్‌ చెయ్యాల్సింది డిప్యూటీ కమాండరే. ఒక్క మహిళల విషయంలో తప్ప ఏ విషయంలోనూ మంగ్డూని వంక పెట్టడానికి వుండదు.

రాజ్‌మన్‌ మిగతా కామ్రేడ్స్‌ను తీసుకుని ఫైరింగ్ చేస్తూ రిట్రీట్‌ అయ్యాడు. పోలీసుల తూటాలకు తగలనంత దూరం వెళ్లిపోయారు.

రీతూ, దేవె ఫైరింగ్‌ చేస్తూ దళం ఉన్నవైపు రిట్రీట్‌ అవుతున్నారు. వీరికి సపోర్ట్‌గా మంగ్డూ మరో కామ్రేడ్‌ జూరుని తీసుకుని వీరున్న వైపు వచ్చాడు. ఈ నలుగురు పోలీసులను ఎదుర్కొంటున్నారు. మంగ్డూ లీడ్‌ తీసుకుని, వేరేవైపు రిట్రీట్‌ చేయిస్తున్నాడు.

దళం వైపు వెళ్తే పోలీసులంతా ఒక్కవైపే కాన్‌సంట్రేషన్‌ చేస్తారని, కాబట్టి మనల్ని వేరేవైపు రిట్రీట్‌ అవ్వమని రాజ్‌మన్‌ చెప్పాడని, ‘ఆర్‌వీ’ ప్లేసులో కలుసుకుందామని మంగ్డూ ఫైరింగ్‌ చేస్తూనే చెప్పాడు. జనరల్‌గా ఫైరింగ్‌లో విడిపోకుండా ఉండటానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఒకరికొకరు చూస్తూ కలిసికట్టుగా రిట్రీట్‌ అవుతారు.

దళం అంతా దూరం వెళ్లిపోవడంతో అటువైపు ఉన్న పోలీసు ఫోర్స్‌ కూడా వీరి వైపు తిరిగింది. నిజానికి వెనకగా వున్న ఆ పోలీసు బ్యాచ్‌ ఫైరింగ్‌ చేసినా తూటాలు తగలవు. కానీ వెనక వస్తున్న తమ బ్యాచ్‌ను చూసుకొని ముందున్న పోలీసులు దూసుకు వస్తున్నారు. ఈ క్రమంలో మంగ్డూ కాలుకు మొద్దు తగిలి పడిపోయాడు. లేచేలోపల తూటా కుడి చెయ్యి భుజంలోంచి వెళ్లిపోయింది. బొళ్లున రక్తం చిమ్ముతోంది. చేతిలోంచి నుంచి జారి కిందపడిపోయిన తుపాకిని వెంటనే ఎడమచేతిలోకి తీసుకున్నాడు. కానీ ఫైరింగ్‌ చెయ్యలేని స్థితి. మంగ్డూతో పాటు వచ్చిన జూరుకి ఇది మొదటి ఫైరింగ్‌. అదీగాక కొత్త కామ్రేడ్‌. ‘కవర్‌ ఫైరింగ్‌’ చేస్తున్నాడు కానీ మంగ్డూ పరిస్థితిని చూసి ఆందోళనపడుతున్నాడు.

గమనించిన రీతూ, దేవెలు…. మంగ్డూకి కొంచెం దగ్గరలోకి వచ్చారు.

‘‘మంగ్డూ… జూరుని తీసుకుని నువ్వు రిట్రీట్‌ అవ్వు. మేము వచ్చి కలుస్తాం. జూరు… మంగ్డూని జాగ్రత్తగా చూసుకో’’ చెట్టు కవర్‌లోకి వెళ్తూ అంది రీతూ.

దేవె, రీతూ ఫైరింగ్‌ చేస్తూ మంగ్డూ, జూరు రిట్రీట్‌ అవ్వడానికి అవకాశం కల్పించారు.

రెండోసారి కూడా ‘మ్యాగజైన్‌’లో తూటాలు అయిపోవచ్చినవి.

మంచినీళ్లు ఉన్నయా అని దేవెకి సైగ చేసింది ఆయాసపడుతూనే రీతూ.

ఉన్నవి అని తన భుజానికి ఉన్న వాటర్‌ డబ్బా ఊపింది దేవె. మూడు లీటర్ల చిన్న వాటర్‌ క్యాన్‌ తెల్లగా వుంటుంది కాబట్టి, దానిచుట్టూ ‘కెమోప్లేజ్‌’ కావడానికి డ్రెస్సులు కుట్టించుకునే ముదురు ఆకుపచ్చ బట్టను కుట్టింది.

ఓ పెద్ద చెట్టు దగ్గరకి వచ్చాక దేవె తన బాటిల్‌ను రీతూకి ఇచ్చింది. గట గట రెండు గుటకలు తాగింది. అసలు ఆ బాటిల్‌ నీళ్లన్నీ తాగాలన్నంత దాహంగా వుంది. కానీ అంత ఆయాసంలో నీళ్లు తాగకూడదని అడవిలో వుండే కామ్రేడ్స్‌ అందరికీ తెలుసు. ట్రైనింగ్‌లో భాగంగా మొదట్లోనే చెప్తారు. ముఖ్యంగా ఈ విషయం మొదట కోస దాదానే రీతుకి చెప్పాడు.

పరిగెత్తడం వలన, ఫైరింగ్‌లో ఎట్లాగూ వుండే టెన్షన్‌ వల్ల… బ్లీడింగ్‌ ఎక్కువ అవుతోంది రీతూకు. పీరియడ్‌ క్లాత్‌ అంతా తడిసిపోయి, ప్యాంట్‌ కూడా ముద్ద అవుతోంది. దేవెకి కూడా తన కిట్టును తీసుకునే సమయమే లేకుండె. అందువల్ల దేవె దగ్గర కూడా క్లాత్‌ లేదు.

పోలీసులు ఎక్కువ దూరం రాలేక, అలసటతో నెమ్మదించారు. అంత లోపలికి  పోలీసులు రావడమంటేనే సాహసం. గ్రామాలన్నిటిలో పార్టీ సంఘాలున్నాయి. ఈ మధ్యనే ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు పోలీసులు. అందువల్లనే దళం ఆచూకీ తెలిసి, లోపలికి రాగలిగారు.

ఫైరింగ్‌ చేసినా తూటాలు తగలనంత దూరం రిట్రీట్‌ అయ్యారు దేవె, రీతూలు. దీంతో ఫైరింగ్‌ ఆపి, తుపాకులను చేతుల్లో పట్టుకుని మంగ్డూ రిట్రీట్‌ అయినవైపు పరిగెత్తుతున్నారు. కొద్ది దూరం వెళ్లేసరికి మంగ్డూ, జూరు కనిపించారు. మంగ్డూ చెట్టుమొదలుకు ఆనుకుని కూచున్నాడు. రక్తం ఇంకా కారుతూనే వుంది. జూరు ఇంకో చెట్టును ‘కవర్‌’ చేసుకుని అలర్ట్‌గా నిలబడి చుట్టూ చూస్తున్నాడు.

దూరం నుంచే దేవె, రీతులను గమనించిన జూరులో ఆందోళన ఒక్కసారిగా ఎగిరిపోయింది. దగ్గరికి వచ్చిన వారికి మంగ్డూ పరిస్థితి అర్థమైంది. షర్ట్‌ విప్పి, ఇవ్వమని జూరుకి చెప్పింది రీతూ. అతను షర్ట్‌ ఇవ్వగానే మంగ్డూ భుజానికి కట్టింది. తల వంచుకుని కట్టు కట్టించుకుంటున్న మంగ్డూ… రీతూ ప్యాంటు అంతా నెత్తురుతో తడిచిపోయిన విషయం గమనించాడు. ఆమెకి కూడా తూటా తగిలిందేమో అని మొదట ఆందోళనపడ్డాడు. అడగాలనుకునే లోపే ఆమె పీరియడ్స్‌లో వుందని గుర్తుకు వచ్చింది. మొదటిసారి మంగ్డూ మనసులో బాధ అన్పించింది.

దాహంగా వుందని మంగ్డూ చెప్పడంతో ఒక్క గుక్కెడు నీళ్లు మాత్రమే నోట్లో పోసింది దేవె. గాయాలతో వున్నప్పుడు కూడా నీరు తాపించవద్దని చెప్తారు. మంగ్డూని విపరీతమైన నీరసం ఆవహిస్తోంది. నడవలేకపోతున్నాడు. గమనించిన దేవె, రీతూ మొఖాలు చూసుకున్నారు.

‘‘మంగ్డూ దాదా నిన్ను ఎత్తుకుంట. నీ తుపాకిని రీతూకి ఇవ్వు’’ అంది దేవె.

దేవె స్థానిక ఆదివాసీ అమ్మాయి. ఎత్తుగా, బలంగా వుంటుంది.

బరువులు మోయడంలో రీతు చాలా బలహీనురాలు. జూరు కూడా మోయలేడు. అందునా మంగ్డూ బలిష్టంగా వుంటాడు.

ఆడవాళ్లతో మోయించుకోవడం ఇబ్బంది అనిపించింది మంగ్డూకి. అదీగాక పురుషులతో సమానంగా చెయ్యలేరని మహిళల పట్ల అప్పటివరకు మనసులో కొంత చులకన భావన. వద్దని చెప్పి కొద్ది దూరం నడిచాడు కానీ వల్ల కాలేదు. కూలబడిపోయాడు.

ఏమీ అడగకుండా మంగ్డూ చేతిలోని తుపాకిని రీతు తీసేసుకుంది. మంగ్డూ కూడా మారు మాట్లాడలేదు.

జోలె కట్టి మోసుకుపోతే బాగుండేది. కానీ తమ ఎవరి దగ్గర కిట్లు లేవు.

దేవె… మంగ్డూని అమాంతం ఎత్తి ఎడమ భుజం మీద వేసుకుని, కుడిచేతిలో తన తుపాకిని పట్టుకుంది. ఎందుకనో… మంగ్డూ కండ్ల నుంచి నీళ్లు దుంకినవి.

జూరు ముందు నడుస్తున్నాడు. చుట్టూ చూసుకుంటూ అలర్ట్‌గా వెళ్లమని చెప్పింది రీతూ.

మంగ్డూని మోస్తూ మధ్యలో దేవె నడుస్తోంది.

మంగ్డూ తుపాకిని భుజానికి వేసుకుని, తన తుపాకిని అలర్ట్‌గా చేతిలో పట్టుకుని చుట్టూ గమనిస్తూ వెనకాల నడుస్తోంది రీతూ. ప్రస్తుతం ప్రమాదం వెనక నుంచే వుంది కదా!

మంగ్డూ తెలియకుండానే నొప్పితో మూలుగున్నాడు. దేవె కూడా ఆయాస పడుతోంది. మంగ్డూని ఎత్తుకోవడానికి జూరు ప్రయత్నించాడు కానీ లేపలేక పోయాడు. ఈసారి కుడి భుజం మీద మంగ్డూని వేసుకుని, ఎడమ చేతితో తుపాకి పట్టుకుంది దేవె. 

అప్పటికే ఫైరింగ్‌ మొదలయ్యి రెండు గంటలు దాటింది. సమయం దాదాపు మధ్యాహ్నం రెండున్నర గంటలు కావస్తోంది.

రీతూకి చాలా అనీజీగా వుంది. ప్యాంటు తడిచిపోగా కాళ్లవెంట కారుతున్న నెత్తురు ఎడమ కాలి బూటులోకి దిగుతోంది. దాంతో ప్లాస్టిక్‌ బూట్‌ వూరుకూరికే జారిపోతోంది – బస్తర్‌లో ముండ్లు అనేవే లేకపోవడం వల్ల ప్లాస్టిక్‌ బూట్లు వాడతారు. ఇంకోవైపు బట్ట తొడలకు కోసుకుపోతోంది. తీసి పడేద్దామనిపించింది కానీ నీళ్లు దొరికితే ఉతికి, తడిదే అయినా వాడుకోవచ్చు కదా అనుకుంది. దళం కలుస్తుందో, లేదో. కలిసేంత వరకు నమ్మకంగా ఉండలేరు. అదీగాక ఫైరింగ్‌లో ఎవరవన్న కిట్లు తెచ్చారో, లేదో…

కొద్దిగా ఆగమని చెప్పి, బూటులోంచి పాదాన్ని తీసి నేలకు రాసింది. ఆకులతో బూటు లోపల తుడిచింది. గమనించిన జూరు చిన్నవాడే అయినప్పటికి తన జేబులోంచి దస్తీ తీసి రీతుకి ఇచ్చాడు. కృతజ్ఞతగా చూసి, తీసుకుంది. పక్కకి వెళ్లి మార్చుకుని వచ్చింది. ప్రాణం కొంచెం హల్కగా అన్పించింది. తడిచిన బట్టను ఆకులో చుట్టి, జేబులో పెట్టుకుంది.

ఇంకో గంటలో ‘ఆర్‌.వీ.’ ప్లేసుకు చేరుకున్నారు. అప్పటికే వీరి కోసం అందరూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ఎవరికీ ఏమీ కానందుకు ఊపిరి తీసుకున్నారు. ఫైరింగ్‌ జరిగిన విధానం గురించి ఒకరికొకరు గుసగుసగా చెప్పుకుంటున్నారు.

మంగ్డూకి వెంటనే టాబ్లెట్స్‌ ఇచ్చాడు రాజ్‌మన్‌. పడుకోబెట్టి తొంటికి ఇంజక్షన్‌ ఇచ్చాడు. భుజానికి ఉన్న గాయాన్ని పరిశీలిస్తూనే దేవెను వివరాలు అడుగుతున్నాడు.

చేతులు కలిపేటప్పుడే రీతు పరిస్థితిని గమనించిన దళ సభ్యురాలు రాజె తన కిట్‌లో వున్న ప్యాంట్‌ను తీసి రీతుకి ఇచ్చింది. రాజెను తోడు తీసుకుని నీళ్ల దగ్గరికి పరుగు పరుగున వెళ్లింది రీతు.

‘‘బొక్కలకు తగిలినట్టు ఉంది. ప్రస్తుతానికి కట్టు మాత్రమే కడుతున్న. వెంటనే బయటకు పంపడానికి ప్రయత్నిస్తా. పంపే వీలు లేకపోతే లోకల్‌ డాక్టర్లకు చూపించాలి’’ మంగ్డూతో చెప్పాడు రాజ్‌మన్‌.

‘రీతూ… దేవె…’ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ మంగ్డూ మత్తులోకి జారుకున్నాడు. మంగ్డూ ఏం చెప్పాలనుకుంటున్నాడో రాజ్‌మన్‌కు అర్థమైంది. మెచ్చుకోలుగా అక్కడే వున్న దేవె వైపు చూశాడు.

One thought on “బలహీనులు?

  1. విప్లవోద్యమం మహిళల శారీరక, ప్రాకృతిక ఇబ్బందులను ఎంత సున్నితంగా పరిష్కరిస్తుందో.. ఆధిపత్య స్వభావం కలిగిన పురుషులను కూడా ఎలా ప్రాక్టీసులోనే మార్చివేస్తుందో హృద్యంగా చెప్పిన కథ ఇది. ఈరోజు విప్లవోద్యమం వరుస ఎన్ కౌంటర్లతో, వరుస లొంగుబాట్లతో ప్రచండ తుపాను వెల్లువలో రెపరెపలాడుతోంది. కానీ ఇన్ని దశాబ్దాలక్రమంలో స్త్రీపురుషులు సమానంగా కలిసి చేసిన పోరాటంలో ఎన్ని మానవీయ విలువలను ఉద్యమం ప్రతిష్టించగలిగిందో బయట ప్రపంచంలో ఎవరికీ తెలీదు. తాయమ్మ కరుణ తాజా కలం నుంచి వచ్చిన ఈ కథ ఉద్యమ క్రమంలో మనుషులు ఎలా పరివర్తన చెందగలరో గొప్పగా చెప్పింది. ఒక్క అక్షరంలో కూడా అతి శయోక్తికి తావులేకుండా పాత్రల మధ్య మాటలతోనే నవీన విలువలను ఎత్తి చూపించిన గొప్ప కథ ఇది. ఇది రక్తప్లావిత ఆచరణ క్రమంలో స్త్రీ పురుషుల మధ్య పెనవేసుకున్న బంధాలు, మారుతూ వచ్చిన ఆలోచనల గురించిన అపూర్వ మైన సహజాత కథ. తప్పక చదవగలరని ఆశిస్తూ…

Leave a Reply