లోక్‌సభ, రాజ్యసభలు ఇటీవల ఆమోదించిన, కేంద్ర ప్రభుత్వం “పౌర కేంద్రీకృత”మైనవిగా పేర్కొన్న కొత్త క్రిమినల్ చట్టాలు వాస్తవానికి బ్రిటిష్ కాలంనాటి చట్టాలకంటే ఘోరంగా ఉన్నాయి.

నిందితుడి అరెస్టుకు సంబంధించి సుప్రసిద్ధ డికె బసు కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను తొలగించడం మొదలుకొని, గరిష్ట పోలీసు కస్టడీ వ్యవధిని 15 నుండి 90 రోజులకు పెంచడం వరకు, కొత్త చట్టాలు పోలీసులకు అపరిమితమైన అధికారాన్ని ఇస్తాయి. అదే సమయంలో వారి జవాబుదారీతనాన్ని తగ్గిస్తాయి.

ఫిర్యాదులో నేరంగా గుర్తించదగిన అంశం వెల్లడైనప్పటికీ “ప్రాథమిక విచారణ” నిర్వహించడానికి పోలీసులకు అనుమతినివ్వడం ద్వారా మరో  మైలురాయి కేసుగా పిలిచే లలితా కుమారి vs స్టేట్ ఆఫ్ కేసులో ఎఫ్‌ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదుపైన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మరో తీర్పును పలచన చేసింది. రహస్యంగా చంపి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మన దేశంలో అందరికి తెలిసినదే; అలా చేయడాన్ని ఈ నిబంధన మరింతగా ప్రోత్సహిస్తుంది.

భారతీయ న్యాయ సంహితలోని మరో సెక్షన్ 113 – ఇది క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) నుండి “ఉగ్రవాద చర్య”కు ఉన్న  నిర్వచనాన్ని తీసుకున్నది; విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వడం అనే పెద్ద రక్షణను ఈ సెక్షన్ తొలగిస్తుంది.

ఇప్పటికే ఉన్న వాటితో పోలిస్తే బహుశా పది రెట్లు ఎక్కువ కఠినమైన లేదా సమస్యాత్మకమైన అనేక నిబంధనలకు సంబంధించిన వివరణాత్మక జాబితా:

 ‘ఉగ్రవాద చర్య’ నిర్వచనంః

భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, భద్రత లేదా ఆర్థిక భద్రతను బెదిరించే ఉద్దేశ్యంతో లేదా బెదిరించవచ్చు అనే ఉద్దేశ్యంతో లేదా భారతదేశంలో లేదా ఏ విదేశీ దేశంలోనైనా ప్రజలు (లేదా ప్రజల ఏ వర్గంలోనైనా) భీభత్సాన్ని సృష్టించే  ఉద్దేశ్యంతో లేదా ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఉద్దేశ్యంతో లేదా ఉగ్రవాద చర్యను లేదా ఉగ్రవాద చర్యకు సన్నాహక చర్యను నేరుగా లేదా తెలివిగా సులభతరం చేసేందుకు కుట్రపన్నినా లేదా ప్రయత్నించిన లేదా మద్దతుగా మాట్లాడిన లేదా  ప్రోత్సహించిన, సలహా ఇచ్చిన లేదా నేరుగా లేదా తెలివిగా దోహదపడిన ఏ వ్యక్తికైనా సంహితా సెక్షన్ 113 శిక్ష విధిస్తుంది; తద్వారా యుఎపిఎ సెక్షన్ 15 ప్రకారం ఉగ్రవాద చర్య నిర్వచనాన్ని స్వీకరించింది.

అయితే, విచారణను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అవసరం అనే అంతర్లీన భద్రత లేకుండా ఇది జరుగుతుంది. ‘ఉపా చట్టం సెక్షన్ 45(1) కింద ఏర్పాటైన ఒక స్వతంత్ర అధికారం అనుమతి మంజూరు కాకముందే సాక్ష్యాధారాలను పరిశీలించడం తప్పనిసరి అవసరం’ అనే అంశాన్ని ఈ చేరిక వ్యతిరేకిస్తుంది; తొలగిస్తుంది.

నిందితులతో సహా వ్యక్తుల మానవ హక్కులను పరిరక్షిస్తుంది;  వాస్తవిక ప్రక్రియను అనుసరిస్తుంది కాబట్టి “ఒక వడపోసే  సాధనం గానూ, రక్షణ” లాగాను పనిచేస్తుంది కాబట్టి అధికారపు ఉనికి “సురక్షిత రకవచంక్షణ”గా ఉంటుందని 2009 డిసెంబరు 18 నాటి రాజ్యసభ కార్యకలాపాల సమయంలో అప్పటి కేంద్ర గృహ మంత్రి పి చిదంబరం అన్నాడు,..

డికె బసు మార్గదర్శకాలను తొలగించారుః

డికె బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ (1997)కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అరెస్టు చేసినప్పుడు, విచారిస్తున్న అధికారుల గుర్తింపును రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అరెస్ట్ మెమోలో అరెస్టు చేసిన స్థలం, సమయం ఉండాలి. మార్గదర్శకాల ప్రకారం, అరెస్టు చేసినప్పుడు అరెస్టయిన వ్యక్తికి ఏదైనా గాయం తగిలితే వైద్య పరీక్షలు చేయించాల్సి ఉంటుంది; నిర్బంధంలో ఉన్న వ్యక్తి, అరెస్టు చేసిన పోలీసులు సంతకం చేసిన ఒక తనిఖీ మెమోను తయారు చేయాలి .

అరెస్టయిన వ్యక్తికి ప్రతి 48 గంటలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఎఫ్‌ఐఆర్‌తో పాటు అరెస్ట్ మెమో, ఇన్‌స్పెక్షన్ మెమోను మేజిస్ట్రేట్‌కు పంపాలి. ఈ మార్గదర్శకాలను అన్ని పోలీసు స్టేషన్లలో ప్రముఖంగా ప్రదర్శించాలి. ఈ అవసరాలన్నింటినీ సంహితలో తొలగించారు.

పోలీసు కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించారుః

సెక్షన్ 187 పోలీసు కస్టడీకి సంబంధించి మార్పు చేస్తుంది. ప్రస్తుత పాలనా యంత్రాంగం  మొత్తం 15 రోజుల కంటే ఎక్కువ పోలీసు కస్టడీని అనుమతించదు. జ్యుడీషియల్ కస్టడీ మంజూరు చేసిన తర్వాత పోలీసు కస్టడీని నిషేధిస్తుంది. కొత్త సెక్షన్ నిందితులను 60-90 రోజుల నిర్బంధ సమయంలో ఎప్పుడైనా జ్యుడీషియల్ కస్టడీ నుండి తిరిగి పోలీసు కస్టడీకి పంపడానికి అనుమతిస్తుంది. పోలీసు కస్టడీని మొత్తం 90 రోజుల వరకు పొడిగించడానికి కూడా అనుమతిస్తుంది.

రెండవది, ముసాయిదా రూపకల్పనలో ఉద్దేశపూర్వకంగా ఉన్న విశృంఖలత్వం కారణంగా ఇతర నిపుణులు పోలీసు కస్టడీని మునుపటి గరిష్టంగా ఉన్న 15 రోజుల నుండి కొత్త గా 60-90 రోజులకు పొడిగించి ఉండవచ్చు.

కొత్త సెక్షన్ 187(2)లో ఉపయోగించిన పదబంధం ఏమిటంటే, “జుడీషియల్ మేజిస్ట్రేట్ సరియైనది అని భావించినట్లు … నిందితుడిని నిర్భందించడాన్ని, మొత్తంగా 15 రోజులకు మించకుండా, లేదా దఫాలుగా, ప్రారంభ 40 రోజులు లేదా 60 రోజుల నిర్బంధ వ్యవధి 60 రోజులు లేదా 90 రోజులలో ఎప్పుడైనా…”

సమస్యాత్మకమైన భాగం సబ్-సెక్షన్ (3), ఇక్కడ ప్రస్తుత కోడ్ నుండి ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టడం జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్  సెక్షన్ 167(2)(a) ఇలా పేర్కొంటుంది, “…అయితే, మెజిస్ట్రేట్ నిందితుడిని పోలీస్ కస్టడీలో కాకుండా 15 రోజుల కంటే ఎక్కువ కాలం నిర్బంధించడానికి అధికారం ఇవ్వవచ్చు…”

కొత్త సెక్షన్ 187(3)”లో ఉపయోగించిన పదబంధం “మెజిస్ట్రేట్ నిందితుడిని 15 రోజుల కంటే ఎక్కువ కాలం నిర్బంధించడానికి అధికారం ఇవ్వవచ్చు…”; అంతకుముందు ఉన్న “పోలీస్ కస్టడీలో కాకుండా” అనే పదబంధాన్ని తొలగించారు. అందువల్ల, పోలీస్ కస్టడీ 60-90 రోజుల వరకు కొనసాగవచ్చు.

సి.బి.ఐ. వర్సెస్ అనుపమ్ జె. కులకర్ణి (1992) కేసులో, సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది: “మొదటి 15 రోజుల గడువు ముగిసిన తరువాత, దర్యాప్తు కాలంలో తదుపరి రిమాండ్ కేవలం జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలి. ఒకవేళ అదే సమయంలో అతను పాల్పడిన మరికొన్ని నేరాలు, అవి తీవ్రమైనవి కావచ్చు లేదా కాకపోవచ్చు, తరువాత వెలుగులోకి వచ్చినా కూడా, మొదటి 15 రోజుల గడువు ముగిసిన తర్వాత పోలీస్ కస్టడీలో నిర్బంధించడానికి వీలు లేదు.”

పోలీసులముందు ఇచ్చిన వాంగ్మూలాలుః

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో, క్రిమినల్ చట్టంలో, సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌లు (ప్రథమ సమాచార నివేదికలు)లలో, సెక్షన్ 161 కింద పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలలో కూడా సంతకం ఎందుకు ఉండదు  అనేదానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఇటువంటి వాంగ్మూలాలు, ఫిర్యాదులను పోలీసులు తారుమారు చేయడంలో అనుసరించే హానికరమైన పద్ధతులను గుర్తించడమే దీనికి కారణం. ఈ కారణం చేతనే అటువంటి వాంగ్మూలాలను వీడియో తీయడం జరగలేదు.

అఫ్జల్ గురు కేసులో, చివరకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన నిందితుడిని, దర్యాప్తు ప్రారంభ దశలో, ఢిల్లీలోని స్పెషల్ సెల్ అధికారులు కుర్చీకి చేతిసంకెళ్ళతో బంధించి కూచోబెట్టి చుట్టూ నిల్చున్నారు. వీడియోలో సంకెళ్ళు, చుట్టూ ఉన్న అధికారులు కనిపించకుండా ఉండటం కోసం, అతన్ని భుజాల పైభాగం నుండి మాత్రమే వీడియో తీశారు. పార్లమెంటుపై జరిగిన దాడికి తానే సూత్రధారిని అని దేశం ముందు ఒప్పుకునేలా చేశారు.

ఆ తర్వాత ఏర్పడిన ఉద్రేకం అతని విధిని ముద్ర వేసింది. కోర్టు కార్యకలాపాలలో భాగం కాని అటువంటి బహిరంగ ప్రకటనలను పట్టించుకోకుండా ఉండేంత అనుభవం న్యాయమూర్తులకు ఉంటుందని చెప్పినప్పటికీ, ఇది ఆచరణలో కష్టమైన విషయం. విచారకరంగా, న్యాయమూర్తులు కూడా కొన్నిసార్లు, ప్రత్యేకించి నిందితుడు మైనారిటీ వర్గానికి చెందినప్పుడు మూక మనస్తత్వానికి లోనవుతారు. సెక్షన్ 173, వీడియో తీసిన ఫిర్యాదులు మరియు వాంగ్మూలాలకు, అలాగే అటువంటి వాంగ్మూలాలపై సంతకం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

ఎఫ్‌ఐఆర్ నమోదుః

ఈ సెక్షన్, ఒక గురిటించదగ్గ నేరం జరిగినట్లు వెల్లడించినప్పటికీ, ఎఫ్‌ఐఆర్‌ను (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేయకుండా ఉండటానికి; బదులుగా ప్రాథమిక విచారణ నిర్వహించడానికి పోలీసులకు అనుమతినిస్తుంది. పైన పేర్కొన్న కేసులో ప్రాథమిక విచారణను స్పష్టంగా నిషేధించారు. అందువల్ల, నిజమైన ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి నిరాకరించడం, బాధితులను వేధించడం వంటి పోలీసు అధికారుల దురాచారం అతిపెద్ద స్థాయిలో కొనసాగుతుంది.

సోదా-స్వాధీనంః

సెక్షన్ 185, ఇది సోదాలు, స్వాధీనం గురించి వివరిస్తుంది, క్రిమినల్ చట్ట న్యాయశాస్త్రంలో  అత్యంత బలహీనమైన అంశాలలో ఒకటిగా మిగిలిపోయింది.

అంతర్జాతీయ పద్ధతులలో ఒకరి ఆస్తిని సోదా చేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తించిన తరువాత పోలీసులు న్యాయపరమైన ఉత్తర్వు పొందాల్సిన అవసరం ఉంటుంది; కానీ సెక్షన్ 185 లో అలాంటి అవసరం లేదు. చట్టవిరుద్ధంగా సోదా చేసినప్పటికీ, సోదా ఫలితాలు సాక్ష్యంగా ఆమోదయోగ్యమే అనే భారతీయ కేసు చట్టంతో ఇది కలసి, క్రిమినల్ న్యాయశాస్త్రపు పటిష్టతలో ఒక పెద్ద లోపాన్ని సృష్టిస్తుంది.

కార్యనిర్వాహక న్యాయమూర్తిః

తరువాత  చేసిన మార్పు ఏమిటంటే, కార్యనిర్వాహక మెజిస్ట్రేట్  అధికారాలు, విధులను విస్తరించడం. కొత్త సెక్షన్ 95 ప్రకారం, కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌కు “పత్రాలు, ప్యాకేజీలు లేదా వస్తువులను” సోదా చేయడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఆదేశించే అధికారాన్ని ఇచ్చారు. సెక్షన్ 149 ప్రకారం, చట్టవ్యతిరేక సమావేశంలో పాల్గొన్న ఏ వ్యక్తినైనా అరెస్టు చేసి, చెదరగొట్టాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ “సాయుధ బలగాలకు ఆదేశం ఇవ్వవచ్చు. సెక్షన్ 127 కింద, అతను “ప్రచురణలకు” సంబంధించి జోక్యం చేసుకోవచ్చు. సెక్షన్ 166 ప్రకారం, భూ వివాదాల విషయంలో జోక్యం చేసుకోవడానికి, పార్టీలను పిలిపించి, సాక్ష్యాలను స్వీకరించి, వ్యక్తులకు ఉండే అటువంటి భూ హక్కులను నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేయవచ్చు.

తదుపరి దర్యాప్తుః

సెక్షన్ 193 విచారణ అధికారికి, మొదటిసారిగా, కోర్టు ఆదేశం లేకుండానే తదుపరి దర్యాప్తు నిర్వహించడానికి అనుమతిస్తుంది. తద్వారా విచారణలో  ఏదైనా లోపాలు ఉంటే, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాసిక్యూషన్  అదనపు చార్జిషీట్లను దాఖలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

భరణం (నిర్వహణ)ః

భరణం విషయానికి వస్తే, సెక్షన్ 144 అనేది పాత సెక్షన్ 125 లోని తిరోగమన నిబంధనలతో కొనసాగుతుంది. ఈ నిబంధనల ప్రకారం, భార్య “వివాహేతర సంబంధాన్ని” కలిగి ఉంటే, ఆమెకు భరణం ఇవ్వడాన్ని పూర్తిగా నిరాకరిస్తారు.

న్యాయ సహాయంః

సెక్షన్ 341 న్యాయ సహాయం గురించి వివరిస్తుంది. ఇది ఒక ప్రాథమిక హక్కు. ఢిల్లీ, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు, అరెస్టు చేసిన సమయం నుంచే న్యాయ సహాయాన్ని అందించాలని చట్టబద్ధంగా నిర్దేశిస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం, వ్యక్తిని అరెస్టు చేసిన వెంటనే, పోలీస్ స్టేషన్లో నిందితుడిని న్యాయవాది త్వరగా కలవడానికి, మరుసటి రోజు ట్రయల్ కోర్టులో హాజరై బెయిల్ కోరడానికి, అరెస్టును లేదా పోలీసు రిమాండ్‌ను వ్యతిరేకించడానికి వీలుగా, పోలీసులు తప్పనిసరిగా ట్రయల్ కోర్టులు, హైకోర్టులలోని న్యాయ సహాయ కమిటీలకు వెంటనే తెలియజేయాలి.

అయితే, పైన పేర్కొన్న ఈ ముఖ్యమైన నిబంధనలన్నీ సెక్షన్ 341లో లేవు. ఈ సెక్షన్ కేవలం విచారణ ప్రారంభమైన తర్వాత; నిందితుడికి న్యాయవాది ప్రాతినిధ్యం లేదని న్యాయమూర్తి గుర్తించిన తర్వాత మాత్రమే న్యాయ సహాయాన్ని అందించాలని సూచిస్తుంది.

సిక్కుల ఊచకోత, బొంబాయి అల్లర్లు, గుజరాత్ అల్లర్లు మరియు ఇటీవల ఢిల్లీ అల్లర్ల వరకు మతపరమైన అల్లర్ల కేసులలో న్యాయ సహాయం ఎప్పుడూ అందించలేదు. న్యాయ సహాయ హక్కుకు సంబంధించిన ఈ సంకుచితమైన తగ్గింపు సంహితలో కూడా కొనసాగుతోంది. న్యాయ సహాయానికి సంబంధించిన హక్కులను ఉద్దేశపూర్వకంగా , తీవ్రంగా తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా నిరుపేదలు తమ భార్యల నగలు, ఇంటి పాత్రలను అమ్మి ప్రైవేట్ న్యాయవాదులను పెట్టుకోవలసి వస్తుంది.

ఖత్రీ (II) వర్సెస్ బీహార్ రాష్ట్రం (1981) కేసులో, సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది:

“…. నిరుపేద నిందితుడికి ఉచిత న్యాయ సేవలను అందించవలసిన ఈ రాజ్యాంగపరమైన బాధ్యత, విచారణ ప్రారంభమైనప్పుడు మాత్రమే కాకుండా, నిందితుడిని మొదటిసారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు కూడా వర్తిస్తుంది.”

 “ఒక వ్యక్తిని అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వెంటనే అతని వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడుతుంది, ఎందుకంటే ఆ దశలోనే అతనికి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, విడుదల పొందడానికి, అలాగే పోలీస్ లేదా జైలు కస్టడీకి రిమాండ్‌ను ప్రతిఘటించడానికి మొదటి అవకాశం లభిస్తుంది. ఆ దశలోనే నిందితుడికి సమర్థవంతమైన న్యాయ సలహా, ప్రాతినిధ్యమూ అవసరం. ఈ దశలో అతనికి న్యాయ సలహా సౌకర్యాన్ని, ప్రాతినిధ్యాన్ని నిరాకరించే ఏ విధానాన్ని కూడా సహేతుకమైనదిగా, సరసమైనదిగా, న్యాయమైనదిగా చెప్పలేము.”

“అందువల్ల, విచారణ దశలోనే కాకుండా, నిరుపేద నిందితుడిని మొదటిసారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు, అతడిని ఎప్పటికప్పుడు రిమాండ్ చేసినప్పుడు కూడా ఉచిత న్యాయ సేవలను అందించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత రాజ్యం పైన ఉంది అని నిర్ధారించేలా చూడాలి.”

తప్పుడు అరెస్టులు ః

భారతదేశం అంతటా ప్రతిరోజూ వేల సంఖ్యలో పోలీసులు తప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఇది క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఒక శాపం. నేర విచారణకు కారణం లేదా సాక్ష్యం లేదని న్యాయమూర్తులు నిర్ధారణకు వచ్చినప్పటికీ, ప్రబలమైన, శిక్షాత్మక పరిహారం ఇవ్వాలనే  ఉత్తర్వులను విధించడంలో న్యాయవ్యవస్థ పదేపదే విఫలమైంది. అటువంటి తీర్పే అక్షరధామ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది.

చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి, ఎటువంటి కారణం లేకుండా విచారణ జరిపి,  చివరికి ఐదేళ్ల తర్వాత గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదలైన వ్యక్తికి తగిన పరిహారం ఎంత ఉండాలి? ఈ ప్రపంచీకరణ యుగంలో, జైలులో గడిపిన ప్రతి సంవత్సరానికి ఆమెకు కోటి రూపాయల చొప్పున జరిమానా, పెరిగిన పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదా? సంహితలోని సెక్షన్ 399 కేవలం రూ. 1,000 మాత్రమే పరిహారంగా నిర్దేశిస్తుంది!

తప్పనిసరి సమాచారంః

సెక్షన్ 33 గణనీయమైన సంఖ్యలో నేరాలకు సంబంధించి పోలీసులకు తప్పనిసరిగా సమాచారం అందించాల్సిన పరిధిని, విస్తృతిని పెంచుతుంది. ఇది ఒక ఆందోళన కలిగించే సెక్షన్. ఎందుకంటే, అమాయక వ్యక్తులకు నేరం జరిగిన విషయం తెలుసునని, అయినా పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయలేదనే కారణంతో పోలీసులు వారిని వేధించే అవకాశం ఉంది.

పోలీసుల అవినీతి, దౌర్జన్యం, హింస వినియోగం సహజంగానే చట్టాన్ని గౌరవించే పౌరులను పోలీసులకు సహకరించకుండా నిరోధిస్తాయి. అటువంటి సహకారాన్ని పోలీసుల సమూల సంస్కరణల ద్వారా మాత్రమే సాధించవచ్చు, అంతే తప్ప సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని చట్టపరంగా ఆదేశించడం ద్వారా కాదు.

న్యాయవాదుల హక్కులుః

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలు, నిందితుడు చేసిన నేరాంగీకారాలను అతని/ఆమె న్యాయవాది సమక్షంలో నమోదు చేయాలని సెక్షన్ 183 పేర్కొంటుంది. ఇది పైకి ప్రగతిశీలంగా కనిపించినప్పటికీ, దీనికి ముందు “బహుశా/అవకాశం ఉంది” అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఈ సెక్షన్‌ను నిరర్థకం చేస్తుంది. తద్వారా న్యాయవాది లేకుండానే వాంగ్మూలాలు, నేరాంగీకారాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుంది.

వీడియో కాన్ఫరెన్స్ః

సంహితలోని సెక్షన్లు 187, 303, 306, ఇతర సెక్షన్లు, క్రిమినల్ విధానాన్ని నిందితుడిని కోర్టులో హాజరుపరచడానికి బదులుగా వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తున్నాయి. జైలులో ఉన్న నిందితుడికి, అతని/ఆమె కుటుంబ సభ్యులకు ఇది తీవ్రంగా బాధించే అంశం కావచ్చు, ఎందుకంటే తమ ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం వారికి కోర్టు వాయిదాకు తీసుకువచ్చే రోజులలోనే ఉంటుంది. నిందితుడి తరపున న్యాయవాది ఉన్నారనే ఏకైక కారణంతో నిందితుడు కోర్టులో హాజరు కాకపోవడాన్ని అసాధారణమైనదిగా పరిగణించకుండా, అతని/ఆమె గైర్హాజరీలోనే విచారణను కొనసాగించే ధోరణి తరచుగా విస్మరించబడే ఒక తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య.

న్యాయవాదికి సూచనలు ఇవ్వడానికి, జరుగుతున్న విచారణను దగ్గరగా గమనించడానికి, చెప్పుతున్న ప్రతి విషయాన్నీ గమనించడానికి, ప్రతి కోర్టు వాయిదా తేదీన భౌతికంగా  హాజరవడం అవసరమనే విషయం  స్పష్టమవుతోంది. రెండవది, అతని/ఆమె తరఫు న్యాయవాది ఉన్నారనే కారణంతో నిందితుడికి అర్థం కాని భాషలో క్రిమినల్ విచారణలను నిర్వహించడం అనేది మరొక తీవ్రమైన లోపం. కోర్టులో అనువాదకుడినికలిగి ఉండే హక్కును గురించి చాలా తక్కువగా అర్థం చేసుకొంటున్నారు; అరుదుగా అమలు చేస్తున్నారు.

ర‌చ‌యిత‌లు  సీనియర్ న్యాయ‌వాదులు
https://timesofindia.indiatimes.com/india/new-criminal-laws-are-worse-than-what-british-framed-for-india/articleshow/106234096.cms

Leave a Reply