సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్ మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా కళా విలువల బూచీని చూపి సాహిత్య ఫత్వాలు జారీచేస్తారు. చివరికి రచయితలకు సరైన ప్రాపంచిక దృక్పథం వుండాలని మాట్లాడటం ముందు ముందు దేశద్రోహ నేరమౌతుందేమో! ఇన్ని ప్రమాదాల మధ్య ఎండపల్లి భారతి కొత్త కథల పుస్తకం ‘పచ్చబొట్టు’ గురించి ముచ్చటించుకుందాం.
సిద్ధార్థుడు బుద్ధుడిగా మారడంలో మూడు దశలు ఉన్నాయి. అంతఃపురం వొదిలి సమాజంలోకి చూసిన తర్వాతే తన చుట్టూ ఉన్న పరిసరాల్లోకి దృష్టి సారించిన తర్వాతే మానవ జీవితంలో దుఃఖం వుందని ఆయన గుర్తించాడు. ఇది తొలి దశ. భార్యా బిడ్డల్నీ రాజ్యాన్నీ సమస్తం త్యజించి చాలా కాలం దుఃఖానికి కారణం అన్వేషించాడు. ఇది రెండో దశ. కోరికలే దుఃఖ హేతువు అని బోధి చెట్టు కింద ఆయనకు జ్ఞానం కలిగింది. ఇది మూడో దశ. చేత కలమో మౌసో పట్టిన ప్రతి రచయితా ప్రాథమికంగా యీ మూడు దశలూ అనుభవంలోకి తెచ్చుకోవాలి. సమాజం వైపు చూడాలి, దాని చలనాన్ని గుర్తించాలి, ఆ చలనానికి మూలాల్ని అన్వేషించాలి, గుణాత్మకమైన మార్పుకి అవసరమైన మార్గాలు తెలుసుకోవాలి. లేకుంటే స్వయంగా కట్టుకున్న దంతసౌధాల్లోనో ప్రపంచానికి యెడంగా వొంటి స్తంభపు మేడల్లోనో మగ్గిపోవలసిందే. ప్రజా సంబంధంలో వున్న రచయితల నుంచే సజీవమైన బతుకు కథలు వస్తాయని చెప్పడానికి భారతి నిండు వుదాహరణ.
రచయితగా భారతి తన చుట్టూ వున్న మనుషుల్లో యెన్నో కథలు చూసింది. వారి బతుకుల్లో కష్టాలు చూసింది. సుఖాలు చూసింది. వాటికి కారణాలు తెలుసుకుంది. సమాజంలో కలిగే కదలికలు కనిపెట్టింది. వాటిని కథలుగా కట్టే విద్య నేర్చింది. ఆమె కథల ముడి సరుకు జీవితమే. తొలినాటి ఎదారి బతుకులు దగ్గర్నుంచి ఇటీవలి దేవరహస్యాల వరకూ మట్టి బతుకుల పరిమళమే భారతి రచనల్లో పరివ్యాప్తమై వుంది. అదే ఆమె రచనలకు జీవగఱ్ఱ. సాంద్ర జీవితానుభవం నుంచి పుట్టిన ఆమె రచనల్లో వర్గ దృష్టి వుంది. కుల స్పృహ వుంది ఉంది. కుల వర్గ అసమానతల కారణంగా యెదురయ్యే కష్టాలు కార్పణ్యాలు ఉన్నాయి. ఘర్షణ ఉంది. కానీ ఆమె వాటిని బాహాటంగా ప్రకటించదు. అదంతా అంతర్లీనంగానే వుంటుంది. ఆమెకున్న జెండర్ చైతన్యం మాత్రం రచనల్లో అసంకల్పితంగానే ప్రస్ఫుటమౌతుంది.
అందుకే భారతి కథల్లో స్త్రీ కంఠస్వరం చాలా బలంగా వినిపిస్తుంది. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే దిగువబురుజు పల్లె మాదిగ స్త్రీ స్వరం అది. స్త్రీలు దైనందిన జీవితంలో యెదుర్కొనే సవాలక్ష సమస్యల గురించి యెక్కడా యేదీ దాచుకోకుండా ఆమె స్పష్టంగా మాట్లాడుతుంది. స్త్రీల కథలు వారి మాటల్లోనే వారి భాషలోనే సంభాషణ రూపంలో జెండర్ రాజకీయ పరిభాషల వూసు లేకుండా చెప్పగలదు. అర్బన్ ఫెమినిస్ట్ భాషకు దూరంగా రోజువారీ మాటల్లోనే గ్రామీణ స్త్రీల లైంగికత లోతుల్లోకి వెళ్ళి సమస్యల్ని ఆమె వ్యాఖ్యానించగలదు. వ్యాఖ్యానించటమే కాదు; ఆ సమస్యలకు పరిష్కారాలు సైతం చూపగలదు. అయితే వాటిని ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవళ్ళు చేపట్టవే’ వంటి మాటల్లో చెప్పదు. కథల్లో అట్టడుగు వర్గాలకు చెందిన గ్రామీణ స్త్రీలు తమవైన – తమకు తోచిన పరిష్కారాలు వెతుక్కోగలరు. ఆచరణలో పెట్టగలరు. మామ మీదబడితే పానబీకరాన అరిచి కేకలు పెట్టి వేరు కాపురం పెట్టిన రుప్పిణత్త కథ (ఆల్తీ రొమ్ములు) చూడండి. స్త్రీల దేహాల చుట్టూ అల్లుకుని వున్న మిత్ ని బద్దలుకొట్టాల్సిన అవసరం పట్ల భారతి దృక్పథం యీ కథలో స్పష్టంగా తెలుస్తుంది. శరీరావయావాల్ని కొలతల్లోకి కుదించే పురుష దృష్టికి వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన వాద పటిమ అనన్యం. పసిపిల్లలపై అమలయ్యే లైంగిక దాడికి తమదైన రీతిలో జవాబు చెప్పగల దిటవు వున్న అలివేలు మాటల్లో రచయితగా భారతి క్రోధం బహిర్గతమౌతుంది. స్త్రీల పైకి మగతనాన్ని యెగేసుకుని వచ్చేవారికి Emasculation సరైన జవాబు అంటుంది అలివేలు.
అలాగే పెళ్ళైన వొంటరి స్త్రీగా తన లైంగిక సంబంధాల్ని యెటువంటి కించ లేకుండా ముచ్చట్ల రూపంలో యేకరువు పెడుతూ చెప్పిన చిట్టెమ్మ (యాపకాయంత ఎర్రి) కావొచ్చు, బిడ్డలు లేకపోవడం వల్ల అవహేళనల్నీ అవమానాల్నీ యెదుర్కొన్న కనకవ్వ (తల పండిన గొడ్రాలు) కావొచ్చు, తన చావు ఖర్చులు తానె జమచేసుకున్న సుబ్బక్క( సావు తెలివి) కావొచ్చు … యీ గ్రామీణ స్త్రీలందరూ తమను నియంత్రిస్తోన్న సామాజిక విలువల్ని తిరస్కరిస్తున్నామన్న స్పృహ వున్నా లేకున్నా తమ జీవితాల్ని తామే దిద్దుకోగల నైపుణ్యం కల్గి వుంటారు. ఆ యెరుక వారిని బతుకు పోరాటంలో విలక్షణంగా నిలుపుతుంది. ప్రీ మ్యారిటల్ రిలేషన్ కి సంబంధించిన ఇతివృత్తంతో నడిచిన ‘పసల గీత’ కథలో మల్లి కూడా తనదైన రీతిలో సమస్యని పరిష్కరించుకుంటుంది. ఇవన్నీ ‘మామూలు బతుకులు’ అని భారతి వువాచ. అవే ఆమె రచనలను నడిపించే యింధనం. ఈ ‘కిటుకు’ ఆమెకు తెలుసు.
భారతి కథల్లో ఆర్థికాంశాల ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది అన్న ఆరోపణను పరాస్తం చేస్తూ అప్పులు పాలైన జీవితాల గురించి రాసిన కథ (రెండో కంటికి తెలియని అప్పు) యీ సంపుటిలో వుంది. మనిషి బలహీనతలను అడ్డుపెట్టుకొని జీవితాలతో ఆడుకునే అప్పుల వడ్డీ వ్యాపారం యిప్పుడు ఆధునిక సాంకేతికత బలంతో స్మార్ట్ రూపం సంతరించుకుని అరచేతిలోకి వచ్చేసింది. కాలక్షేపంగా మొదలైన గేమ్ యాప్ లు ప్రాణాంతకమైన బెట్టింగ్ యాప్ లుగా పరిణమించాయి. అవి లోన్ యాప్ లతో అనుసంధానమై బతుకుల్ని బజారుపాలు చేస్తున్నాయి. పల్లెల్లోకి సైతం పాకిన వీటి మీద అదుపు లేని ప్రభత్వాల వైఫల్యాన్ని భారతి యెండగట్టింది. అలాగే యెన్నికల్లో జరుగుతోన్న అవకతవకల్ని యెత్తిచూపి బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సున్నితమైన వ్యంగ్యంతో విమర్శించింది. ఆ యా సందర్భాల్లో భారతి చేసిన సామాజిక వ్యాఖ్యానాలు ఆమె దృక్పథాన్ని పట్టి ఇస్తాయి.
ఆ విధంగా దిగువ బురుజు మాదిగ పల్లెను నేపథ్యం చేసుకొని వచ్చిన యీ కథలు ఆ ప్రాంతపు సామాజిక సాంస్కృతిక చరిత్రకు అద్దంపడతాయి. అయితే ఆ గ్రామం వొక యూనిట్ గా మొత్తం దేశానికి ప్రతీకగా గోచరిస్తుంది. ‘కదిరి మామ కస్టం’ ఒక వ్యక్తి జీవిత గాథే గానీ వ్యావసాయిక వుత్పత్తి విధానంలో సంబంధాల్లో రెండు మూడు తరాల్లో వచ్చిన పరిణామాల్ని అందులో గమనించగలం.
బుద్ధుడు తనకు కలిగిన యెరుకను పదిమందికి పంచాడు, ప్రచారం గావించాడు. అప్పుడే అతని యెరుక ‘ధమ్మం’గా పరిణమించింది. సాహిత్యం కూడా ప్రయోజనోద్దిష్టమై ప్రచార దశకు చేరుకుంటే అది ధమ్మం అవుతుందేమో! ఎవరు చెప్పగలరు.
సమాజంలో వున్న మోసాన్ని దుర్మార్గాన్ని దోపిడిని భారతి గ్రహించింది. దానిలో మార్పు కోరుకుంది. ఆ మార్పు యెలా వస్తుందో ఆమె యెక్కడా పనిగట్టుకొని చెప్పదు. ఇదంతా యెప్పటికీ యిలాగే వుండదు అనే ఆమె నమ్మకం. తన జీవితకాలంలోనే ఆమె యెన్నో మార్పులు చూసింది. మార్పులకు కారణమైన ఘర్షణ చూసింది. దాన్ని తనదైన దృక్పథం నుంచి తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంది. అయితే ఆ వ్యాఖ్యానం పూనికతో చేసినట్టు వుండదు. అలా చేసి శిల్పాన్ని చెడగొట్టదు. తనకు తెలిసిందే నలుగురికి చెప్పాలని ఆమె ప్రయత్నం. ఆమె కథల్లో ఫిర్యాదు వుండదు గమనించండి. నెత్తిమీది బరువునూ నెత్తిలోపలి బరువునూ యేకకాలంలో వున్నది వున్నట్టుగా చెప్పడమే భారతి ప్రత్యేకత. అలా చెబితే సాహిత్యమవుతుందా అని యెవరైనా అడగొచ్చు. సత్యానంతర కాలంలో నిజం చెప్పడం నేరమైంది. ఆ నేరం చేయడానికి ధైర్యం కావాలి. అది భారతిలో నిండుగా వుంది. ముందు రచయిత యథార్థాన్ని చెబితే అందులో ఏది మంచో ఏది చెడో చదివిన వాళ్ళు తెలుసుకుంటారని ఆమె అభిప్రాయం. ఇది భారతి సాహిత్య ధమ్మం. తిరుపతి కొండలో పావు భాగం ‘మెట్టులు కుట్టే’ మాదిగలదే అన్న ప్రకటన ఆమె సాంస్కృతిక న్యాయం. మరొక సామ్యం కూడా వుంది. బౌద్ధులు ధమ్మ ప్రచారానికి పాళీ ప్రాకృతాలను ఆశ్రయించినట్టు భారతి కథలకు తన స్థానిక భాషనే మాధ్యమంగా చేసుకుంది. జానపద మౌఖిక కథన శైలి ద్వారా వచనానికి అనితరమైన శ్రావ్యతని సాధించింది. అందువల్ల ప్రత్యక్షంగా తాను సంచరించే నేలపైకి మన చేయి పట్టుకుని తీసుకుపోయి అలవోకగా బతుకు ముచ్చట్లు చెప్పినట్టు వుంటుంది ఆమె కథనం. కథలకు వస్తువే కాదు; శిల్పం కూడా జీవితంనుంచే రూపొందుతుంది అని భారతి రచనల ద్వారా మరోసారి నిర్ధారించవచ్చు. భారతి వడ్డించిన యీ ‘కథల కడి’ని పాఠకులకు విందు భోజనంలా అందిస్తున్న పర్స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థకు అభినందనలు.




