భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే కాకుండా వివిధ రంగాలలో(వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అధిక జనాభా కలిగిన వ్యవసాయక దేశాలలో ఒకటిగా, విభిన్న శ్రామిక శక్తి కలిగిన దేశంగా, నిరుద్యోగ రేట్‌ ఆర్థిక వృద్ధి, దేశ అభివృద్ధిపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోంది. పిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగం రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం ఉండగా జూన్‌ 2025 నాటికి 5.6 శాతానికి పెరిగింది. మన దేశంలో నిరుద్యోగం పెరగడానికి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆంక్షలు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు అనాలోచితంగా హేతురహితంగా విధించిన సుంకాలు నిరుద్యోగాన్ని మరింత పెంచే ప్రమాదం ఉంది. భారత్‌లో నిరుద్యోగం గ్రామీణ ప్రాంతం కంటే నగరాల్లో అధికంగా ఉంది. ఏటా కోటి ఏభై లక్షల మంది ఉద్యోగార్థులు అదనంగా వచ్చి చేరుతున్న దేశంలో నిరుద్యోగాన్ని అంతమొందించడం ఆషామాషీ చర్యలతో సాధ్యమయ్యేది కాదు. 

లోక్‌నీతి సిఎస్‌డిఎస్‌ (2024) లోక్‌సభ ఎన్నికల కోసం జరిపిన విస్తృత సర్వేలో 62 శాతం మందికి ఉద్యోగాలు దొరకడం లేదని వాపోయారు. సర్వే చేసినవారిలో ఎక్కువగా ముస్లీంలు (67 శాతం) ఉద్యోగావకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి మాదిరిగానే హిందువులలోని ఎస్సీలు(58 శాతం), బిసీలు (63 శాతం) ఎస్టీలు (57 శాతం) నిరుద్యోగంలో మగ్గుతున్నారని సర్వే వివరించింది. అగ్రవర్ణాల్లో 57 శాతం మంది ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్నట్టు చెప్పారు. అదే సమయంలో వారిలోని 12 శాతం మందికి సులభంగానే దొరుకుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ఉద్యోగం మరింత కష్టంగా ఉంటోంది. అందువల్ల పేద, మధ్యతరగతి యువతకు నాణ్యమైన విద్య నేర్పించి ఆధునిక ఉపాధి వ్యాపకాలకు అవసరమయిన ప్రత్యేక నిపుణతలు చేకూర్చవలసి ఉంది. అందుకే విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం బాగా పెరగాలని ఆర్థికవేత్తలు పదేపదే చెబుతున్నారు. ప్రైవేటు స్పర్శతో పులకించిపోతున్న పాలకులకు ఇది రుచించడం లేదు.

 ఇన్సిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్‌ రిపోర్ట్‌ 2024 ప్రకారం, భారతదేశ శ్రామిక జనాభా 2011లో 61 శాతం నుండి 2021లో 64 శాతానికి పెరిగింది, ఇది 2036 నాటికి  65 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్న యువత శాతం 2022లో 37 శాతానికి తగ్గింది. స్థిరమైన ఉద్యోగ వృద్ధిని పెంపొందించడానికి దేశం యొక్క భవిష్యత్తు శ్రేయస్సును భద్రపరచడానికి నిరంతర అప్రమత్తత, ప్రభావవంతమైన విధాన చర్యలు కీలకమైనవి. నిరుద్యోగం అనే సవాళు మనల్ని వదిలిపోదు. అది మరింత తీవ్రమవుతోంది. 2020-21 అత్యంత దారుణమైన కొవిడ్‌ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం గరిష్ట స్థాయి నుండి నిరుద్యోగం, 2024కి గణనీయంగా 3.2 శాతంకి తగ్గింది. కానీ ఇప్పుడు, అది మళ్ళీ పెరిగిపోతోంది. జూన్‌ 2025కి ప్రభుత్వం నిర్వహించే నెలవారీ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం భారతదేశ నిరుద్యోగ రేటు 5.6 శాతంకి పెరిగింది, ఇది అంతకుముకందు మే నెలలో ఉన్న 5.1 శాతం కంటే 05 శాతం ఎక్కువ.

స్వతంత్ర థింక్‌ ట్యాంక్‌ సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సియంఐఇ) నిరుద్యోగిత రేటును 7.0 శాతంగా ఉంచినందున ఇది సాంప్రదాయిక సంఖ్య కావచ్చు. సరళంగా చెప్పాలంటే, నిరుద్యోగి అంటే చురుకుగా ఉద్యోగం వెతుక్కునే వ్యక్తి, మహారాష్ట్రలో, దాదాపు ఒక సంవత్సరం క్రితం పోలీసు ఉద్యోగాల కోసం జరిగిన నియామకాలలో కానిస్టేబుళ్లు, డ్రైవర్లు, పోలీసు బ్యాండ్‌ సభ్యులు మరియు జైలు సిబ్బందికి సంబంధించిన 17,471 పోస్టులకు 17.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిరుద్యోగం భారీ ఎత్తున తాండవిస్తుంటుంది. అందుచేత జనసామాన్యం ఉద్యోగాల కోసం కలగనరు. కాయకష్టం చేసి కడుపు  నింపుకునేవారే ఎక్కువ. దేశ కార్మిక శక్తిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఆధునిక సాంకేతికత ప్రజల నిత్యజీవితాల్లో ఉనికిని పెంచుకున్న కొద్దీ సంప్రదాయ వృత్తులు నాశనమైపోవడం తెలిసిందే. వ్యవసాయం గిట్టుబాటుకాక దాని అనుబంధ వృత్తులు కూడా చతికిలబడి పల్లెల నుంచి పట్టణాలకు నగరాలకు వలసలు ముమ్మరించి చాలాకాలమయింది. 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించినప్పటికీ పేద దేశంగానే కొనసాగుతుందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఈ మధ్యనే తెలిపారు. తలసరి ఆదాయంలో మనం ప్రపంచంలో 139వ స్థానంలో ఉన్నామని, అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమాఖ్య వ్యవస్థ వర్ధిల్లి, రాష్ట్రాలు బలంగా ఉండాలని, చట్టబద్ధ పాలన నెలకొనాలని, స్వతంత్ర వ్యవస్థలుండాలని సుబ్బారావు గుర్తుచేస్తున్నారు.

2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. పదకొండు ఏళ్లల్లో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే నిరుద్యోగిత ఎందుకు కట్టలు తెంచుకుంటుంది? స్టార్టప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా నినాదాలు గాలిలోనే ఉన్నాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలూ, టీ అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందకే వస్తుందనే స్థాయికి ప్రధాని, బిజెపి పెద్దలు భాష్యాలు చెప్తున్నారు. ఈ చర్య నిరుద్యోగులను అపహాస్యం చేయడమే. ఇప్పటివరకు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల గురించే విన్నాం. ప్రస్తుతం నిరుద్యోగుల ఆత్మహత్యలూ సంభవిస్తున్నాయని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో గణాంకాలు తెలుపుతున్నాయి. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్నరణాలకు పాల్పడటం సమాజానికి చేటు. దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 66 శాతం ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాది కల్పించకుండా తప్పుడు కబుర్లతో కాలం గడుపుతోంది.

ఉద్యోగాలు దొరక్కపోవడంతో విసిగిపోయిన కోట్లాది నిరుద్యోగులు దుర్భరమైన ఆర్థిక బాధలను తట్టుకోడానికి స్వయం ఉపాధులను ఆశ్రయిస్తున్నారని స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా-2023 నివేదిక నిగ్గుదేల్చింది. కార్మికులకు విశేషంగా పనులు కల్పించగల తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి మోడీ ప్రభుత్వం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పథకాలను ప్రారంభించింది. విచిత్రమేమిటంటే ఇవి వచ్చిన తర్వాత 2016-2021 మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు సగానికి పడిపోయాయి. ఆత్మనిర్భర్‌, అచ్చేధిన్‌ అంటూ నిత్యం బాకాలూదుతుంటే  దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు బ్రిటీష్‌ పాలనలో కంటే గత పదేళ్ళలోనే ఎక్కువని ప్రపంచ అసమానతల లాబ్‌ తరపున ఇటీవల అధ్యయనం జరిపిన నలుగురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నిర్ధారించారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందనేది ఇండియాలో రుజువు కావడం లేదని, ఉన్నత చదువులు చదివే కొద్దీ కొలువు దూరమవుతున్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని వీరిలో 65 శాతం మంది చదువుకున్నవారేనని ఈ నివేదిక వెల్లడిరచింది. నిరుద్యోగుల్లో విద్యావంతులు 2000లో 18 శాతం కాగా 2022లో 35 శాతానికి పెరిగారు. 2024 చివరి నాటికి 39 శాతానికి చేరారు.

భారతదేశంలో నిరుద్యోగిత గురించి నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) కీలక వివరాలను ప్రకటించింది. నిరుద్యోగ రేటు అనేది కార్మిక శక్తిలో నిరుద్యోగుల శాతాన్ని సూచిస్తుంది. ఇది 25వ పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) ద్వారా వెల్లడైంది.

మహిళల నిరుద్యోగ రేటు : పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగ రేటు అక్టోబర్‌-డిసెంబర్‌ 2024లో 8.1 శాతానికి తగ్గింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.6 శాతం ఉండగా, జూలై-సెప్టెంబర్‌ 2024లో 8.4 శాతం నమోదైంది. పురుషులలో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అక్టోబర్‌-డిసెంబర్‌ 2024లో స్థిరంగా ఉంది. ఈ క్రమంలో గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రేటుతో పోలిస్తే ఇది మాత్రం మారలేదు. జూలై-సెప్టెంబర్‌ 2024లో పురుషుల నిరుద్యోగ రేటు 5.7 శాతంగా ఉంది. ఈ నివేదిక  ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత స్థితి కొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది. అయితే మహిళల నిరుద్యోగ రేటు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా సమాన అవకాశాలను అందించవచ్చు.

కార్మిక శక్తి : ఈ నివేదికలో మరో కీలక అంశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి ప్రస్తుత వారపు స్థితి (సిడబ్య్లూఎస్‌)లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అక్టోబర్‌-డిసెంబర్‌ 2024లో 50.4 శాతానికి పెరిగింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 49.9 శాతం ఉండగా, జూలై-సెప్టెంబర్‌ 2024లో కూడా ఇది 50.4 శాతం స్థాయిలో ఉంది. కార్మిక శక్తి అనేది వస్తువులు, సేవల ఉత్పత్తికి ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి అందించే జనాభాలోని ఒక భాగం. ఇందులో ఉపాధి పొందినవారు, నిరుద్యోగులు ఇద్దరూ ఉంటారు.

తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం :  పిఎల్‌ఎఫ్‌ఎస్‌ 2024 రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగిత రేటు 24 శాతం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘బీమార్‌’ రాష్ట్రాలుగా పేర్కొనే అత్యంత వెనకబడ్డ రాష్ట్రాల కంటే ఎ.పి.లో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ రాష్ట్ర ప్రజలను, యువతను కలవరపరిచే విషయం. విభజిత రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, కడప ఉక్కు, పోర్టులు, ఇతర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ సర్కారు ఇవ్వకుండా ద్రోహం చేస్తోంది. ప్రస్తుత టిడిపి, గత వైసిపి ప్రభుత్వాలు అడగట్లేదు. మోడీ ఎంచుకున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఉపాధి రహిత భారతాన్ని నిర్మిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని బిజెపి సర్కారు సుతరాం అంగీకరించదు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఆశ్రితులకు అమ్ముతోంది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. దాంతో కొత్త ఉద్యోగాలేమోకానీ, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలో రెండు లక్షలకు పైన ఉద్యోగాలు నియామకాల్లేక ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.

పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2024 ప్రకారం 15-59 సంవత్సరాల వయస్సు గలవారు 5.1శాతం, 15-29 సంవత్సరాల వయస్సు గల యువతకు 16.1 శాతం నిరుద్యోగిత ఉన్నట్లు తెలిపింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదికలో 15-29 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 30.3 శాతం, పురుషుల్లో 18.3 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. ది హిందూ మే 2025లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2015తో పోలిస్తే ఉపాధి అవకాశాలు యువతకు 9శాతం తగ్గాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగం జాతీయ సగటు 10.2 శాతం కంటే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగానికి మొదటి దోషి బిజెపి అయితే రెండవ దోషి ఇక్కడ ఏలిన, ఏలుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మారాలి. విధానాల మార్పు పోరాటాలతోనే సాధ్యం. ఈ తర్కాన్ని యువత గ్రహించాలి.

దశాబ్ధ కాలంగా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ శాఖాల్లో  ఖాళీగా ఉన్నాయని భావిస్తున్న 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రధానికి చేతులు ఎందుకు రావడం లేదు? కంటి తుడుపుగా 60, 70 వేల నియామక పత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ రంగం బలపడకూడదు,  ప్రైవేటు రంగం బలహీనపడకూడదు అనే సిద్ధాంతంతో ఎంతకాలం ఇలా ఈ దేశాన్ని పీడిస్తారు? కార్పొరేట్‌ యజమానులకు ప్రభుత్వం రూ. 16 లక్షల కోట్ల మేరకు రాయితీలు కల్పించినట్టు ప్రతిపక్షం లెక్క చెబుతున్నది. ఆ సొమ్ముతో నిరుద్యోగ నిర్మూలనకు, గరిష్ట స్థాయిలో యువశక్తి సద్వినియోగానికి పటిష్ట వ్యూహ రచన చేయలేరా? నిరుద్యోగ నివారణకు తక్షణం ప్రభుత్వాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి తగిన విద్యను రూపొందించి అమలు చేయాలి. స్థిరమైన వృద్ధి-  స్థిరమైన డిమాండ్‌ను ప్రోత్సహించే ఆర్థిక విధానాలను అమలు చేయాలి. ప్రభుత్వం అనుసరించిన అనుచిత ఆర్థిక విధానాల వల్ల 2014-15కు 2023-24కు మధ్య దేశంలోని పై స్థాయిలో ఉన్న ఒక్క శాతం మంది ఆదాయ వాటా పెరుగుదల ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత అత్యధికమని తేలింది. ఈ నేపథ్యంలో అతి సంపన్నులపై సంపద పన్ను విధించాలని నిపుణుల నుంచి వస్తున్న విజ్ఞతాయుతమైన సూచన పాలకులు స్వీకరించేలా యువత ఒత్తిడి తేవాలి.

Leave a Reply