కొందరిలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అద్భుతం ఉంటుంది. వాటి ముందు ఎవరంతకువారు వినయంగా, ప్రియంగా, గౌరవంగా ఉండిపోవాల్సిందే. అలాంటివారిలో కర్నూలు రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు సార్ ఒకరు. ఆయనను ఎవరైనా ‘సుబ్బరాయుడు సార్’ అనే అంటారు. ఆయనలోని నైతిక విలువలకు, మానవతా చైతన్యానికి, రాయలసీమ అభివ్యక్తికి దక్కిన గౌరవం అది. ఆయన సమక్షంలో ఎవరైనా సరే సౌకర్యంగా మెలగడానికి కారణం ఆయన నమ్రత, నెమ్మదితనం. తనకు ఇరిగేషన్ మాత్రమే తెలుసని, ఈ ప్రపంచం చాలా విశాలమైనదని, అందులో ఎన్నో సమస్యలు, అధ్యయనాంశాలు ఉంటాయనే ఎరుక పుష్కలంగా ఉన్న మేధావి ఆయన. తాను తుంగభద్ర, కృష్ణా నదీజలాల సాంకేతిక నిపుణుడిని మాత్రమేననీ, ఈ సమాజాన్ని రాజకీయాలు, ప్రజా ఆకాంక్షలు, ఉద్యమాలు నడిపిస్తాయనీ, వాటిలో ప్రవేశం ఉన్న వాళ్ల మాటలు వినాలనే శ్రద్ధ ఉన్న సుగుణశీలి. కొందరిని నానా..అని ప్రేమగా పలకరించేవారు. మరి కొందరిని గౌరవంగా సార్.. అనేవారు. కర్నూలుకు వచ్చే రాయలసీమవాదులకు, సాహిత్యకారులకు ధర్మపేట పక్కన ఉండే సూర్యా ఆపార్ట్‌మెంట్‌లో ఉండే ఆయన ఇంటికి వెళ్లడం ఒక ఉద్యమాచరణ.
రాయలసీమకు ఇవ్వడానికి కృష్ణానదిలో నీళ్లెక్కడ ఉన్నాయి? అన్నీ పంచేశారుగా.. అని కోస్తా ప్రాంత ప్రగతిశీలవాదులు కూడా కొందరు అంటారు. సుబ్బరాయుడుసార్ ఈ కూట కథనాన్ని తల్లకిందుల చేశారు. తుంగభద్రలో ఏటా ఎంత నీటి ప్రవాహం ఉన్నదీ చెప్పి, కృష్ణా నదిలో కలిసి సముద్రం పాలవుతున్న జల గణాంకాలు వెలికి తీశారు. వెరసి కృష్ణా నదిలో నీళ్లున్నాయి.. కానీ ఆంధ్రా పాలకులు ఇవ్వడం లేదనీ, కేటాయించిన నీరు నిలువ చేసుకొనే నిర్మాణాలు చేపట్టలేదనీ, మొదలు పెట్టిన పనులు కూడా దశాబ్దాలుగా పూర్తి చేయకుండా నీరు కాజేస్తున్నారనే సరికొత్త సీమ నీటి కథనాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ వాదనలో సాంకేతిక నిపుణుడిగా ఆయన వెలికితీసిన గణాంకాలు రాయలసీమ నీటి ఉద్యమాన్ని కొత్త దశలో తీసికెళ్లి పునర్నిర్మించాయి.
తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యతిరేకంగా కోస్తా, రాయసీమ పాలకవర్గాలు లేవదీసిన సమైక్య ఉద్యమమనే ఊబి నుంచి సీమను బైట పడేయడానికి జరిగిన ప్రజాస్వామిక ప్రయత్నంలో సుబ్బరాయుడుసార్ ప్రతిపాదించిన నీటి ప్రాజెక్టులు పోరాట పతాకాలుగా, నినాదాలుగా మారాయి. సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల జలాశయం వంటి ప్రతిపాదనలు ఆయన మానస పుత్రికలు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఆయన కాలికి చిన్న గాయమై, అదే శాశ్వత వైకల్యానికి గురి చేసింది.
అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకటికి రెండుసార్లు మృత్యుముఖంలోకి వెళ్లి వచ్చారు. అయినా ఆయన సీమ జలకాంక్ష చల్లారలేదు. రాయలసీమ నీటి పారుదల వ్యవస్థను దెబ్బతీయడానికి, సీమ ప్రజల డిమాండ్లను పక్కన పెట్టడానికి రాజకీయ రంగంలో ఏ వైపు నుంచి ఏ ప్రయత్నం జరగకుండా ఆయన మేధ, హృదయం నిరంతర కాపలా కాసేవి. సీమకు వ్యతిరేకంగా ప్రభుత్వం నుంచి ఏ దురాలోచన వచ్చినా రాయలసీమ ప్రజాసంఘాలకు, పాత్రికేయులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కోసారి ఉద్యమ పనులు ముందుకు వెళ్లడం లేదని ఆవేదన చెందేవారు. నిరాశకు గురయ్యేవారు. సభలకు వస్తుండే రోజుల్లో సీమ ప్రాజెక్టులు ఎంత అవసరమో, హేతుబద్ధమో వివరించి, అలసిపోయి, ప్రభుత్వం వీటిని చేపట్టకుంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సిందే.. అని ఆగ్రహంగా అనేవారు. ఆచితూచి, నెమ్మదిగా, మెత్తగా మాట్లాడే సుబ్బరాయుడుసార్‌కు ప్రభుత్వం మీద తరచూ కోపం వచ్చేది. నిజానికి ఆయనకు రాయలసీమ రాష్ట్ర నినాదంతో ఏకీభావం లేదు. కానీ అది రాయలసీమ సమస్యలకు పరిష్కారం కాకతప్పదేమో అనే ఎరుక ఉండేది. ఎప్పుడన్నా విప్లవ రాజకీయాల గురించి మాట్లాడితే, శ్రద్ధగా వినేవాడు. ఎప్పుడన్నా చాలా వినయంగా ‘నాకు వాటి గురించి తెలియదు నానా. కానీ మీరు మంచివాళ్లని నా నమ్మకం, మీరు ప్రజలకు మంచే చేస్తారు..’ అనేవారు.
సుబ్బరాయుడుసార్‌కు చాలా మందిలాగే దేవుడి మీద నమ్మకం ఉండేది. కానీ ఆయన దేవుడ్ని బహిరంగ జీవితంలోకి తెచ్చేవారు కాదు. గుండ్రేవుల ప్రాజెక్టు కట్టకపోతే, సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలి.. రాయలసీమ ప్రజలనును ఆ దేవుడు కాపాడాలి.. అనే మాట ఆదాటున దొర్లినా వెనక్కి తీసుకొనేవాడు. ప్రజలు పోరాడి సాధించుకోవాలి.. అనేవాడు. ప్రజా జీవితంలోని విలువలు, తర్కం తెలిసి బుద్ధిజీవి ఆయన.
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మూడు రోజులు కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టాడు. దాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ విద్యావంతుల వేదిక ధర్నా నిర్వహించింది. దాన్ని ప్రారంభిస్తూ సుబ్బరాయుడుసార్ ‘పాలమూరుకు నీళ్లు ఇవ్వవద్దు అనడం అన్యాయం. రైతులు ఎక్కడైనా రైతులే..’ అనే వైఖరి తీసుకున్నారు. రాయలసీమ ఉద్యమంలో పని చేసే అన్ని సంస్థల గురించి ఆయనకు కచ్చితమైన అంచనాలు ఉండేవి. ‘మీరు ఎన్నికల రాజకీయాలకు, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటారు కాబట్టి, మీరే కొంచెం గట్టిగా రాయలసీమ కోసం పని చేయాలి..’ అని రాయలసీమ విద్యావంతుల వేదిక సభ్యులతో అనేవాడు.
మనుషులు నిండుగా, ఆత్మగౌరవంతో బతకాలనీ, రాయసీమ పల్లె జనాలు పంటలు పండిరచుకొని హాయిగా బతకాలనీ, లక్షల సంఖ్యలో వలసలు ఆగిపోవాలని, పిల్లలు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలనీ కోరుకొనేవారు. ‘నావి చాలా చిన్న కోరికలు కదా, అయినా చాలా ముఖ్యం..’ అనేవారు. ఒక ఇంజనీర్‌గా పదవీ విరమణ తర్వాత కూడా తన ప్రాంతం పట్ల ప్రేమను చూపడానికి, సీమ ఉద్యమానికి పెద్ద దిక్కుగా మారడానికి ఆయనలోని మానవతా విలువలే కారణం. ప్రాంతంపట్ల ప్రేమ, మరే ప్రతిఫలాపేక్ష లేని అంకితభావం, ఒక రకమైన ఉద్వేగస్వరం..బహుశా రాయలసీమ ఆధునిక చరిత్రలో పప్పూరి రామాచార్యులు తర్వాత మళ్లీ అట్లాంటి మూర్తిమత్వం సుబ్బరాయుడుసార్‌లో చూడవచ్చు.
ఆయన ఇంటికి ఏ ఉదయం పూట వెళ్లినా హాల్లో ఒక దృశ్యం కనిపించేది. టేబుల్ మీద పెద్ద పెద్ద చార్టులు వేసుకొని, వాటిని పరిశీలిస్తూ, లెక్కలు వేస్తూ ఉండేవారు. ఎవ్వరైనా అట్లా వెళ్లితే ఆయనకు నిజంగా పండగే. సీమ నీటి పారుదల వివరాలు ధారాపాతంగా మాట్లాడేవారు. కొత్త కొత్త ఆలోచనలు పంచుకొనేవారు. ఆయన హాల్లో టీఎంసీలు, క్యూసెక్కులు అని మాట్లాడుతోంటే, లోపలి గదిలో ఆయన జీవన సహచరి సరస్వతి గారు సంగీత విద్యార్థులకు పాఠాలు నేర్పిండేవారు. ఆయన గొంతులోని గణాంకాలు, ఆమె గొంతులోని గమకాలు కలిసి ఆ ఇంట ఒక అద్భుత వాతావరణం నిండిపోయేది. ఆమె కర్నూలు శారదా సంగీత కళాశాలలో అధ్యాపకురాలు. పదవీ విరమణ తర్వాత కూడా సంగీతం నేర్పించడం ఆమెకు చాలా ఇష్టమైన పనిగా ఉండేది.
వృద్ధాప్యం వల్ల పదే పదే ఆనారోగ్యంపాలవుతూ కూడా సీమ భవితవ్యం గురించి కలలుకనే సుబ్బరాయుడు సార్ కనుచూపు కదలికలు ఈ నెల 13న ఆగిపోయాయి. ఆయన భవిష్యత్ స్వప్నాలు మాత్రం సచేతనంగా తప్పక వాస్తవ రూపం ధరిస్తాయి.