(ముంబై నుండి ప్రచురితమయ్యే  మిడ్ – డేలో ఎజాజ్ అష్రాఫ్ ఆరు సంవత్సరాల నుండి రాస్తున్న కాలమ్‌ను ఆపివేశారు. సోమవారం కాలమ్‌లో సమాధి వ్యాసంతో అతను తన కాలమ్ మరణాన్ని ప్రకటించాడు. సీనియర్ జర్నలిస్ట్, ‘భీమా కొరేగావ్: ఛాలెంజింగ్ కాస్ట్’ రచయిత ఎజాజ్ అష్రాఫ్ రాసిన వ్యాసం ఇది – జాన్‌చౌక్ సంపాదకమండలి)

ఎందుకంటే అది ఆఖరి శ్వాస తీసుకుంటోన్న ‘మండే బ్లూస్‌’*కి నివాళులర్పించాలని అనిపిస్తోంది; మీరు ఈ రోజు దాని చివరి విడత చదవడం పూర్తి చేయగానే, అది ఎలాంటి హడావిడీ, విచారమూ లేకుండా కనుమరుగైపోతుంది.

అయితే, నేను నా ఆలోచనలను చాలా వరకు స్వతంత్రంగా వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించిన ‘మిడ్-డే’ పత్రికకు కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతాను. ముఖ్యంగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి శాపం లాంటి నా ఆలోచనలను కూడా వారు ప్రచురించారు. ఈ ప్రభుత్వం, కావలి కుక్క లాంటి చురుకుదనంతో మీడియా కంటెంట్‌ను వాసన చూస్తూ, తనిఖీ చేస్తూ ఉంటుంది. నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే, అది మీ తప్పు కాదు.

చాలా మంది జర్నలిస్ట్ స్నేహితులు అడిగేవారు “ఇదంతా రాయడానికి మీకు ఎలా అనుమతిస్తున్నారు?” అని. ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రశ్న ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ, అప్పుడు నాకు అమెరికన్ జర్నలిస్ట్ ఏ.జే. లీబ్లింగ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి, “పత్రికా స్వేచ్ఛ కేవలం యజమానులకే లభిస్తుంది.” నిజానికి, యజమానులే తమ కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏ మేరకు స్వేచ్ఛ ఇవ్వాలో నిర్ణయిస్తారు. నాకు ఈ రోజు వరకు పూర్తి స్వేచ్ఛ లభించింది.

అయినప్పటికీ, 2014 మే లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, యజమానులకు కూడా పత్రికా స్వేచ్ఛ దక్కడం లేదు. ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయడం ద్వారా నెమ్మది, నెమ్మదిగా ఉక్కిరిబిక్కిరి చేసిన కశ్మీర్ టైమ్స్ యజమాని, సంపాదక జంట అయిన అనురాధ బాసిన్, ప్రబోధ్ జమ్వాల్‌ను అడగండి. ఆ పత్రికను మూసివేయాల్సి వచ్చింది కానీ 2023లో డిజిటల్ ఎడిషన్‌గా తిరిగి వచ్చింది; రోజుకు 52,000 మంది ఆ వెబ్ సైట్‌ను చూస్తున్నారు.

మీడియా దిగ్గజాలకు విరుద్ధంగా, కశ్మీర్ టైమ్స్ కశ్మీర్‌లో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ఈగలాగా ముసురుతూనే ఉంది. దీని ఫలితంగా, రాజ్యం మూసివేసిన జమ్ము కార్యాలయంపై దాడి చేసి, నమ్మశక్యం కాని విధంగా అక్కడ దాచిన ఆయుధాలను కనుగొంది. దాడులకు కారణం – దేశద్రోహ కార్యకలాపాల పరిధిలోకి వచ్చే ఆరోపణలపై విచారణ జరపడం.

సుప్రీంకోర్టు వీధి కుక్కలకు విధించిన శిక్షను (పట్టీ కట్టి కట్టేయడం) అధికారంలో ఉన్నవారు, ప్రజాస్వామ్యానికి మరో వాచ్‌డాగ్ అయిన కశ్మీర్ టైమ్స్‌ కు విధించారు, ఇది ఆ పత్రికకు లభించిన గౌరవప్రదమైన బిరుదు. స్వతంత్ర మీడియాని అణచివేసే మార్గాలు అపరిమితంగా ఉన్నాయి.

తాము స్వయంగా చురుకైన జర్నలిస్టులు కాబట్టి భసీన్, జమ్వాల్ లు యజమానులైనప్పటికీ, వారికి పత్రికా స్వేచ్ఛ లభించలేదు,. ఇలాంటి చురుకైన జర్నలిస్టుల జాతి ప్రమాదంలో పడుతోంది.

చాలా మంది యజమానులు వ్యాపారవేత్తలు. వారు తమ జర్నలిస్టులను సెన్సార్ చేస్తారు; వార్తలను పట్టించుకోరు. దాడులు, పన్ను ఎగవేత కేసులకు భయపడి వారు లొంగిపోతారు. అయితే, వారి మౌనం ప్రభుత్వ ప్రకటనల రూపంలో వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కనీసం వారి విషయంలో, ప్రభుత్వం తన అపరిమిత అధికారాలతో పాటు, మీడియా కలాలను విరిచేయడానికి కొంతవరకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

పెద్ద కార్పొరేట్ దిగ్గజాలకు ఈ సాకు కూడా లేదు, ఎందుకంటే వారు విధానాలను ప్రభావితం చేయడానికి; ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం లబ్ధిదారులుగా తమకు ఏర్పడిన చెడ్డ పేరును సరిదిద్దుకోవడానికి మీడియాలోకి వస్తారు. అధికారాన్ని, డబ్బును కూడగట్టుకోవడానికి మీడియా స్వేచ్ఛను బలివ్వడం ఒక ముందస్తు షరతు. ఇటీవల బీహార్ ఎన్నికలలో చేసినట్లుగా, వారు అధికార పార్టీ తప్పులను కూడా ‘మాస్టర్ స్ట్రోక్’గా చిత్రీకరించడం అనివార్యం.

మోదీ ఇచ్చిన ఆరవ రామనాథ్ గోయెంకా ఉపన్యాసంలో స్పష్టమైనట్లుగా దురాశ, భయాలు కాకుండా, భావజాలం కూడా మీడియాను ప్రభుత్వ స్వరంగా మార్చింది. ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ వ్యవస్థాపకుడు రామనాథ్ గోయెంకాను, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి పోరాడటంతో పాటు, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ఇందిరా గాంధీని వ్యతిరేకించినందుకు కూడా ప్రశంసించాడు.

కానీ, అదే సమయంలో, ఆయన గోయెంకాకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం అయిన భారతీయ జనసంఘ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించాడు; ఆ పార్టీ టికెట్‌పైనే పోటీ చేసి ఆయన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఒక విధంగా, గోయెంకా ఇందిరా గాంధీని వ్యతిరేకించడం పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడటంతో పాటు హిందుత్వాన్ని బలోపేతం చేయడానికి కూడా దోహదపడిందని మోదీ నిరూపించారు.

సాంప్రదాయ మీడియా యజమానులలో ఎక్కువ భాగం సాంప్రదాయకంగా ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ భావజాలానికి మద్దతు ఇచ్చిన సామాజిక సమూహం నుండి వచ్చినవారే. పాత్రికేయ నిష్పక్షపాతానికి, తమ భావజాల ధోరణికి మధ్య చిక్కుకున్న చాలామటుకు మీడియా పరిస్థితి, సమతుల్యత పాటించడానికి ప్రయత్నించే తాడుపై నడిచే కళాకారుడిలా మారింది.

ఈ వైరుధ్యపు ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. మోదీని సామర్థ్యాన్ని పొగిడే కథనాల వల్ల, అలాగే ఆయన పాత చింతకాయ పచ్చడి వ్యాఖ్యలను కూడా ముఖ్యాంశాలుగా చేయడం వల్ల కొద్దిపాటి విమర్శించే కథనాలు కూడా అణచివేతకు గురవుతాయి.

కాంగ్రెస్ పాలన దశాబ్దాలలో, మీడియాలో కాంగ్రెస్ భావజాలం పట్ల కూడా అనుబంధం ఉండేది. ఆ ప్రభుత్వం కూడా మీడియా యజమానులను పార్లమెంట్‌కు పంపింది. దురదృష్టకరం ఏమిటంటే, నెహ్రూ ప్రభుత్వం సంఘ్ ముఖపత్రం ఆర్గనైజర్ , వామపక్ష ప్రచురణ క్రాస్ రోడ్లో రొమేష్ థాపర్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో “సముచితమైన పరిమితుల” నిబంధనను చేర్చింది.

అయినప్పటికీ, తరచుగా రాజీపడినప్పటికీ, పూర్తిగా మాత్రం ఎప్పుడూ తుడిచిపెట్టని పార్టీ అంతర్లీన ఉదారత కారణంగా మొత్తం మీడియా చప్పట్లు కొట్టే గుంపుగా మారలేదు. అరవైల దశకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గనైజర్ పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చింది, ఈ విషయాన్ని అభిషేక్ చౌదరి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్రలో పేర్కొన్నారు.

ఇటీవల పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు టీవీ ఛానెల్‌లను విడిచిపెట్టి సొంత యూట్యూబ్ ఛానెళ్లను ప్రారంభించడం ఆశ్చర్యకరమేమీ కాదు. డబ్బు కొరత కారణంగా వారు విరాళాలపై ఆధారపడవలసి వచ్చినప్పటికీ నిర్భయమైన, నిష్పాక్షికమైన జర్నలిజం ఎక్కువగా డిజిటల్ రంగంలోనే జరుగుతోంది. వారికి కూడా ప్రభుత్వం నుండి తీవ్రమైన దాడులు ఎదురయ్యాయి, వీటిలో అత్యంత తీవ్రమైన దాడి న్యూస్‌క్లిక్ పై జరిగింది, దీనిలో 80 మందికి పైగా ఉద్యోగులు, రచయితలపైన 2023లో ఒక ఉదయం దాడులు జరిగాయి.

ఈ చీకటి కాలంలో, మండే బ్లూస్ ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండటం ఒక అద్భుతం – ఇది ఈ కాలమ్‌కు సరైన సమాధి శిలాశాసనం. ఇది తన ఆఖరి శ్వాసతో వీడ్కోలు చెబుతోంది.

2025 డిసెంబర్ 5

* (“మండే బ్లూస్”వారాంతంలో విశ్రాంతి నుండి పని బాధ్యతలకు మారడం వల్ల కలిగే విచారం, భయం లేదా తక్కువ ప్రేరణ అనే సాధారణ అనుభూతి. తరచుగా ఒత్తిడి, అలసట, చిరాకు వంటివి ఉంటాయి.. ఇది వ్యాధి కానప్పటికీ, ఇది ఉద్యోగ అసంతృప్తి లేదా పని ఒత్తిడికి సంబంధించిన నిజమైన భావోద్వేగ ప్రతిస్పందన)

మిడ్-డే సౌజన్యంతో

హిందీ: మహేశ్ రాజ్‌పూత్

తెలుగు పద్మ కొండిపర్తి

Leave a Reply