వాళ్లు
నిప్పు రవ్వలు
వాళ్లు
వెలుగు దివ్వెలు
వాళ్ళు
నీటి ఊటలు
వాళ్ళు
స్వచ్ఛ చెలిమలు
వాళ్ళు
ఉప్పొంగిన
నదీ ప్రవాహాలు
వాళ్లు
పోటెత్తిన
సంద్రపు అలలు
వాళ్ళు
తీరంతో
విరామమెరుగక
తలపడుతున్న
తుఫాను హోరులు
వాళ్ళను గురించి
ఏమని చెప్పేది
ఎంతని చెప్పేది
వాళ్ళు లేని
కాలాన్ని..
ఎలా
ఊహించేది..
వాళ్ళు
ఉండని
లోకాన్నీ..
వాళ్ళు
లేరన్న
స్పృహను..
ఎలా
భరించేది..
వాళ్లు
రారన్నా
వార్తను
ఎలా
తట్టుకునేది?!!
తూరుపు
అరుణిమలు
వాళ్ళు..
తొలిపొద్దు
వేకువలు
వాళ్ళు..
ఛిద్రమైన
మా బతుకు
గాయాలకు..
ఆత్మీయ
లేపనాలు వాళ్లు..
బూడిదై పోయిన
మా బువ్వా..
ఇళ్ళూ..ఇడుపుల్లో..
ఉబికి వస్తున్న
పొగల నడుమ..
గుక్కపట్టి
ఏడుస్తున్న
మా బిడ్డలను
వొళ్ళోకెత్తుకుని
భుజం తట్టి
ఓదార్చుతున్న
ఆరని సెగలు వాళ్ళు..
పచ్చ పచ్చని
అడవుల్లో
హా హా కారాలు లేపి
నెత్తుటి
జలపాతాలు
పొంగిస్తున్న
హంతక పాలనా
మృగాల వేటలో..
చెదిరి పోని
మా విశ్వాస
స్వప్నాలు వాళ్ళు..
వాళ్ళు
ఎక్కడికి పోతారు
మా గుండెల్లో
గూడు కట్టుకు ఉన్నోళ్లు..




