భారతదేశంలో సాయుధ పోరాట ప్రాంతాలలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని మహిళా విప్లవకారులు రాసిన 20 చిన్న కథల సంకలనం వియ్యుక్క (గోండి భాషలో “వేగుచుక్క”) ప్రతిబింబిస్తుంది. తాను ప్రకటించిన గడువుతేదీకి ముందరే మావోయిజంను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇది ప్రచురితమవడం ఒక వైచిత్రం.
ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ఈ విప్లవకారులను దండకారణ్య అడవులను “తెగుళ్ళ” లాగా వ్యాపిస్తున్న “భయంకరమైన ఉగ్రవాదులు” అని అంటూ వారిని తలలో పేలలాగా “దువ్వేసెయ్యాల్సిన” వారిగా చిత్రీకరిస్తుంటే, వియ్యుక్కలోని కథలు వారిని తాము పనిచేసే ఆదివాసీల పట్ల కరుణను, సున్నితత్వాన్ని కలిగినవారిగానూ సమర్థులుగానూ తెలివైన, అంకితభావంతో కష్టపడి పనిచేసే వ్యక్తులుగా వర్ణిస్తాయి.
మావోయిస్టు విప్లవకారులు రాజకీయాల పట్ల, ప్రజల వ్యక్తిగత జీవితాల పట్ల గల తమ వైఖరిలో సృజనాత్మకంగానూ సర్వతోముఖంగానూ ఉన్నారని కూడా చూపిస్తాయి. ఒక విషాద వ్యంగ్యమేమిటంటే, ఈ పుస్తకాన్ని నేను చదువుతున్న సమయంలోనే, ఈ పుస్తకంలో రెండు కథలు రాసిన రచయిత్రి గుమ్మడివెల్లి రేణుక జీవితాన్ని మార్చి 29నాడు బస్తర్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ అంతం చేసింది.
మావోయిస్టు పార్టీలో ప్రముఖ కార్యకర్త అయిన రేణుక గెరిల్లా ఉద్యమంలో చేరిన ఒక న్యాయవాది. ఒక సృజనశీల రచయిత్రి. బి.డి దమయంతి, మిడ్కో అనే కలం పేర్లతో విప్లవ పత్రికల కోసం అనేక చిన్న కథలు, వ్యాసాలను రాసింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి అతి కొద్ది జీతాలను ఇచ్చి అర్ధ సైనిక బలగాలతో పాటు పనిచేయడం కోసం పోలీసు యంత్రాంగం ఆదివాసీ యువతను ప్రత్యేక పోలీసు అధికారులుగా చేర్చుకొన్న న, ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమం సల్వా జుడుమ్ గురించి కూడా ఆమె ఒక చిన్న పుస్తకం రాసింది.
ఆదివాసీ సముదాయాన్ని సల్వా జుడుమ్ రాజ్యం చేపట్టిన పథకానికి మద్దతు ఇచ్చేవారుగానూ వ్యతిరేకించేవారుగానూ విభజించింది. గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను క్యాంపుల్లో నింపింది. ఎన్నో విధాలుగా కష్టాలకు గురిచేసిన, అతి క్రూరంగా మానవహక్కులను ఉల్లంఘించిన ఈ సల్వాజుడుమ్ వ్యవస్థను రద్దు చేయాలని 2011లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
విప్లవ గ్రూపులు ప్రచురించిన తెలుగు, గోండి, హిందీ పత్రికల నుండి సంపుటిల సేకరణగా ప్రచురితమైన ఆరు వియ్యుక్క సంపుటిలలోంచి ఎంపిక చేసిన 20 కథలను ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. వారు తమ అజ్ఞాత జీవితానుభవాలను అన్వేషించే విధానం, విప్లవకర హింస, న్యాయం గురించి వివాదాస్పద విషయాలను చర్చించడం; ఆదివాసీల జీవితాల పట్ల ఉండే భావుక కల్పనలను తొలగించడం; సాహిత్య అంశాల సరిహద్దులను విస్తరించడం లాంటి విషయాల్లో మార్క్సిజం, ఫెమినిజం లేదా సామాజిక ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ కథలు ప్రత్యేకమైనవి; మనోహరమైనవి.
ఈ రచయితలలో చాలామంది పరివర్తనలో ఉన్న ఒక బీజరూప సమాజాన్ని (ఇప్పుడు క్రూరమైన రాజ్య అణచివేత మొగ్గలోనే చిదిమేవేస్తోంది) వర్ణించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ కథలు ఒక ప్రచారంలాగా అనిపించవచ్చు; ఆ సమాజాన్ని సృష్టించే కృషిలో ఉన్న గెరిల్లాల పోరాటాలను, తాము పనిచేస్తున్న ఆదివాసీ ప్రజల కష్ట సుఖాలను వర్ణించారు. వీరిలో చాలా మంది ఈ పరివర్తనకు నాయకత్వం వహిస్తున్నారు
ఈ మహిళా గెరిల్లా రచయితల గురించి ఐరిష్ విప్లవకారులను డబ్ల్యూ. బి. ఈట్స్ చేసిన వర్ణనలో చెప్పాలంటే “భయంకరమైన అందాలకు జన్మనిచ్చారు”; ఎందుకంటే పరివర్తనా ప్రక్రియ కష్టమైనదీ బాధాకరమైనదీ అయినప్పటికీ అందమైనదాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రచయితల విశ్వాసాల ఈ ప్రమాణాల్లో అనేక రకాల ఇతివృత్తాలు, నిగూఢ చర్చ, దొంతరలలో ఉండే అర్ధాలు, సూక్ష్మ భేదాలు ఉన్నాయి.
మహిళా కార్యకర్తలు మోసే అదనపు భారం మావోయిస్టు ఉద్యమం గురించి మాత్రమే కాకుండా, దానిలో మహిళల పాత్ర గురించి కూడా వియ్యుక్క ఒక సంభాషణగా సాగుతుంది. స్త్రీవాద విమర్శకురాలు ఎలైన్ షోవాల్టర్ విశ్లేషణను ఉదాహరణగా తీసుకుంటే, భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం వల్ల ప్రభావితమైన మహిళా గెరిల్లాల, ఆదివాసీ మహిళా చైతన్యానికి సంబంధించిన ఒక తెలియని ప్రపంచాన్ని అన్వేషించే మహిళల దృక్కోణం వియ్యుక్క. సాహిత్యంలో చాలా అరుదుగా వ్యక్తమయ్యే ఒక తెలియని క్షేత్రం ఉందని, స్త్రీవాద విమర్శకులకు సంబంధించి మహిళల రచనల ద్వారా ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చిందనే వాదనను 1981లో రాసిన ‘అడవిలో స్త్రీవాద విమర్శ’ అనే ఒక ప్రధాన వ్యాసంలో షోవాల్టర్ చేసింది.
ఈ సందర్భంలో, ఒక విధేయతకలిగిన కుమార్తెగా, భార్యగా లేదా తల్లిగా తమ పాత్రను పోషించాలనే తమకు తాము అంతర్లీనం చేసుకొన్న పితృస్వామిక ఆలోచనా ప్రక్రియను సవాలు చేయడంలో ఆదివాసీ మహిళలు, ఆదివాసేతర కార్యకర్తలు విప్లవ మార్గంలో ముందుకు సాగే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. అంతేకాకుండా, ఈ ఉద్యమ అణచివేతకు రాజ్యం చేస్తున్న నిర్దాక్షిణ్య ప్రయత్నాలు వారి వ్యక్తిగత జీవితానికి, స్వేచ్ఛకు మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి.
మహిళా గెరిల్లాలు, వారు కలిసి పనిచేస్తున్న ఆదివాసీ మహిళల మనస్సులలో ఉన్న సందేహాలు – భయాలు- ఆశలు; ఆ భయాలను అధిగమించడానికి వారు చేసే పోరాటం, వారి భావోద్వేగ అశాంతి, వారి ధైర్యసాహసాలు మొదలైనవి ఈ సేకరణలో ఒక తెలియని అంశాన్ని రూపొందిస్తాయి. అదే సమయంలో, మాతృత్వం, స్త్రీ-పురుష సంబంధాలు, కుటుంబాల అసాధారణ అనుభవాలు కథలలో ఉన్న జెండర్ ఇరుసుకి పదును పెడతాయి.
మహిళా కార్యకర్తలు అదనపు భారాన్ని ఎదుర్కొంటున్నారు. వర్గ, కుల, రాజ్య, భూస్వామ్య శక్తులు, ఇతర దోపిడీ, అణచివేత వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా వారు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలి. పురుష కార్యకర్తలు ఈ పోరాటంలో మద్దతునిస్తూ, పాల్గొంటున్నప్పటికీ, తల్లిదండ్రుల ఒత్తిడి, బలవంతపు పెళ్ళికి వ్యతిరేకంగా కుటుంబంతో అయినా లేదా సాయుధ పోరాట సమయంలో పితృస్వామిక రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడేటప్పుడు అయినా మహిళలు మాత్రమే తమ వ్యక్తిగత పోరాటాన్ని అనుభవిస్తారు.
వియ్యుక్కలో జెండర్ రాజకీయాలు:
కుయి తెగకు చెందిన బుద్రి అనే మహిళ కువి భాషలో వసుధకు చెప్పిన ఆత్మకథ “నేను ఎందుకు గెరిల్లానయ్యానంటే?”. తాత కష్టపడి సంపాదించిన భూమిని మునసబులు లాక్కోగా మిగిలిన భూమిని తండ్రి సాగు చేసేవాడు. మునసబు బెదిరింపులు భరించలేక ఆమె తాతలు తమ కుటుంబాలతో వేరే ఊరికి వెళ్లిపోతారు; బుద్రి తండ్రి, మామలు మావోయిస్టులతో ఉన్నారని బుద్రికి తెలుస్తుంది. అనుకోకుండా ఒకసారి తండ్రిని కలిసినప్పుడు నారాయణపట్నలో బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతరులు పెద్ద ఎత్తున ఆదివాసుల భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారని, దాని గురించి ప్రభుత్వం ఏమీ చేయడం లేదనీ ఆమెకు వివరిస్తాడు. సాంప్రదాయ వైద్యంతో తాత చికిత్స చేయడానికి ప్రయత్నించడం, తన అన్నా, గ్రామంలోని ఇతరులు జ్వరంతో చనిపోవడాన్ని కూడా ఆమె గమనిస్తుంది. ప్రభుత్వం తన ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని కూడా ఆమె అర్థం చేసుకుంటుంది.
మావోయిస్టులు మునసబును ఎదుర్కొని, ప్రజల భూమిని తిరిగి ఇప్పించిన తరువాత బుద్రి తండ్రి కుటుంబాన్ని తమ ఊరికి తీసుకువెళతాడు. ఇప్పుడు అక్కడ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి; వాటిలో పాడే పాటలు బుద్రికి చాలా ఇష్టం. తల్లి, అమ్మమ్మల కోరికలకు విరుద్ధంగా ఆమె క్రమంగా సాంస్కృతిక కార్యకర్తగా మారుతుంది; తన అక్క తరువాత తానూ తిరుగుబాటుదారులలో చేరుతుంది.
నిత్య అనే కలం పేరుతో ఉప్పగంటి నిర్మల @ నర్మద అక్క గడ్చిరోలి ప్రాంత నేపథ్యంలో రాసిన కథ“బాలి”. నర్మద 2019లో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ అరెస్ట్ అయింది. ముంబైలోని బైకుల్లా జైలులో నిర్బంధంలో ఉన్న ఆమె 2022 ఏప్రిల్ 9న జ్యుడిషియల్ కస్టడీలో ఆసుపత్రిలో మరణించింది.
అనేక మంది మేధావులు, కళాకారులు ఆదివాసీ సమాజ సమానత్వ నిర్మాణాన్ని ఆదర్శవంతమైనదిగా చిత్రిస్తున్నప్పటికీ, ఈ కథ గోండి సమాజంలో ఉన్న పితృస్వామ్యాన్ని వెలికితీస్తుంది. మావోయిస్టు ఉద్యమం కూడా దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. డాక్టర్ బి. డి. శర్మ కూడా తన రచనలలో ఎత్తిచూపిన బస్తర్‌లోని ఆదివాసులలో జరిగే బలవంతపు వివాహాల సాంప్రదాయం గురించి ఈ కథ చర్చిస్తుంది.
తాను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేదన్న కారణంతో తండ్రి బాలిని క్రూరంగా హింసిస్తాడు. ఆమె చదువుకున్నది కాబట్టి తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలనుకుంటుంది. తన తండ్రి కొట్టడాన్ని, పెట్టే హింసను అనేక విధాలుగా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుంది; కానీ చివరికి ఆమె తండ్రి నెగ్గుతాడు. వైవాహిక జీవితం నుండి తన స్నేహితురాలి ఇంటికి పారిపోతుంది; అక్కడ ఆమె స్నేహితురాలి తల్లి ప్రస్తుత భర్త కంటే మెరుగైన మరొక అబ్బాయిని వివాహం చేసుకోవాలని సూచిస్తుంది. అయితే, తండ్రి ఆమెను జీపులో ఎత్తుకెళ్ళి తిరిగి అత్తగారింటి దగ్గర దిగబెడతాడు.
అక్కడ ఓ రోజు బాలి నది ఒడ్డున అంట్లు తోముతున్నపుడు, ఇద్దరు మహిళా దళ సభ్యులను కలిసే అవకాశం వస్తుంది. వెంటనే వారితో తన దుఃఖాన్ని వెళ్లబోసుకుంటుంది. ఆదివాసీ సమాజంలోని పితృస్వామిక ఆచారాలకు వ్యతిరేకంగానూ, గోండు మహిళలకు విత్తనాలు విత్తడానికి, ధాన్యం కల్లంలోకి వెళ్లడానికి అనుమతి లేకపోవడాన్ని గురించి, బహిష్టు సమయంలో “కుర్మలోను” అని పిలిచే ప్రత్యేక గుడిసెకు పరిమితం కావడం గురించి, బలవంతపు వివాహాల ఆచారం గురించి విప్లవ జనతన సర్కార్ అధ్యక్షుడు మాట్లాడబోయే సమావేశానికి ఆమెను పిలుస్తారు.
విప్లవ కమిటీ బాలీ వివాహాన్ని రద్దు చేసినట్లు ప్రకటించి, ఆమె ఒంటరిగా జీవించడానికి లేదా తాను ఎంచుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛనిస్తుంది. దళం ఊరు విడిచివెళ్ళేటప్పుడు చిన్న సంచి సర్దుకొన్న బాలి తన కోసం ఆగమని చెప్తుంది.
ఇతర కథలు కూడా ఈ అంశాలను అన్వేషిస్తాయి. బి. అనురాధ రాసిన ‘దికు’ గ్రామీణ ప్రాంతాల్లో వివాహాలు, లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించడంలో జార్ఖండ్‌లోని మహిళా ఉద్యమం, మహిళా గెరిల్లాల పాత్రను వివరిస్తుంది. తాయమ్మ కరుణ రచించిన “వివాహం” అనేది ఒక సహజమైన విషయమని భావించే ప్రాంతాలలో మహిళలకు ఉన్న ఒంటరిగా ఉండే హక్కును సమర్థిస్తుంది.
నిత్య రాసిన ‘రామ్‌కో’, వసుధ రాసిన ‘ఎన్కౌంటర్’ కథలు రెండింటిలోనూ రాజ్య బలగాలు చుట్టుముట్టినప్పుడు మహిళా గెరిల్లాలు, ఆదర్శప్రాయమైన సాహసాన్ని మాత్రమే కాకుండా, తెలివితేటలు, సమయస్ఫూర్తిని కూడా ప్రదర్శించి అరెస్టుకాకుండా తప్పించుకున్న నిర్దిష్ట సందర్భాలను వర్ణిస్తాయి.
“ఇద్దరి మధ్యా నలిగిపోవడం” అనే ప్రధాన స్రవంతి వ్యతిరేక కథనాలు
తాము పోలీసుల తీవ్రమైన హింసకు గురవుతున్నప్పటికీ న్న పోలీసులను పక్కదారి పట్టించి, దళ సభ్యులను, భూగర్భ కార్యకర్తలను రక్షించిన గ్రామస్తులు, గోండు సముదాయానికి చెందిన ప్రజల విశ్వాసాన్ని, మద్దతును తెలియచేసే కథలు ఉన్నాయి. పరారీలో ఉన్న తన అన్నను కాపాడటానికి ఒక చిన్న పిల్లవాడు పడిన కష్టాలను అనల రాసిన “లేత చేతులు” వివరిస్తుంది. అలాగే భారతి రాసిన “ఒక అరెస్టు కథ”లో పోలీసుల నుంచి దళం తప్పించుకుని వెళ్ళడానికి తగిన సమయం దొరకడానికి వారికి హెచ్చరికగా కేకలు వేస్తూ ఇద్దరు బాలికలు తాము చిత్ర హింసలను అనుభవిస్తారు.
తమ గ్రామంపై దాడి చేసి, ప్రతిదీ సర్వనాశనం చేసిన తరువాత, ప్రజలు తమ బంగారు ఆభరణాలను దాచిపెట్టినట్లుగా ఒక వృద్ధ ఆదివాసీ దంపతులు తాము జాగ్రత్తగా దాచిపెట్టిన ఎర్రజెండాను తవ్వి తీయడాన్ని వివరించే ఒక సున్నితమైన కథ శ్వేత రాసిన ‘ఎర్ర జెండా’. ప్రధాన స్రవంతి సంభాషణలో రాజ్య యంత్రాంగమూ మావోయిస్టుల మధ్య “నలిగిపోయే”(సాండ్విచ్ సిద్ధాంతం”) వారిగా; దోపిడీకి, బెదిరింపులకు గురిఅవుతున్నవారిగా ఆదివాసీలను వర్ణించే జర్నలిస్టులు, రచయితల రచనలకు (రెండింటిమధ్య నలిగిపోవడం) ప్రత్యామ్నాయంగా ఈ కథలు ఉంటాయి.
‘ధిక్కారం’లో అసిఫా ఒక అహింసాయుత తిరుగుబాటును వివరించడానికి ప్రత్యేకంగా మనసుకు హత్తుకునే ఒక స్త్రీ రూపాన్ని ఉపయోగిస్తుంది; ఇది వెంటనే మహాశ్వేతా దేవి రచించిన ‘ద్రౌపది’ కథను గుర్తుకు తెచ్చింది. ఒక గ్రామాన్ని ఛిన్నాభిన్నం చేసిన తరువాత, పోలీసు ఒక శిశువును పైకెత్తుతాడు. అనారోగ్యంతో ఉన్న ఆ శిశువును తీసుకొనేందుకు తల్లి పెనుగులాడుతున్నప్పుడు, అసలు నీకు పెళ్లయిందా? నీ బిడ్డేనా అని అంటూ నువ్వే తల్లివి అని నిరూపిస్తేనే బిడ్డను తిరిగిస్తాననేటప్పటికి కోపంతో రెచ్చిపోయిన సోమారి కోపంగా తన రొమ్ములను బయటికి తీసి వాడి మొహాన పాలను చిమ్ముతుంది.
తల్లిదండ్రులు సల్వా జుడుంలో చేరిన ఒక గెరిల్లా మహిళ మృతదేహానికి గౌరవప్రదంగా అంతిమసంస్కారం జరపాలనే ఉద్దేశ్యంతో, మృతదేహాన్ని తన కుమార్తెదేనని భీమే “ఆమె నా కుమార్తె” అని మిడ్కో రాసిన కథలో పట్టుబడుతుంది. పద్మకుమారి రాసిన ‘ముగ్గురు తల్లులు’ అనే పుస్తకం, ఎన్కౌంటర్లలో పిల్లలు చనిపోయిన తల్లుల మనోభావాలను, మృతదేహాలను సేకరిస్తున్నప్పుడు వారు ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనను వివరిస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మొదటి పేజీ కథనంలో వచ్చిన బీజాపూర్‌కు చెందిన 19 ఏళ్ల జ్యోతి హేమ్లా పోర్టా క్యాబిన్ స్కూల్లో (ఛత్తీస్‌గఢ్‌లో తాత్కాలిక నిర్ణాణాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలు) చదువుకున్న తర్వాత మావోయిస్టుల్లో చేరింది. 2025 ఫిబ్రవరి 9న ఇంద్రావతి నేషనల్ పార్కులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆమె మరణించింది; ఇందులో రేణుక అలియాస్ మిడ్కోతో సహా 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మేధావులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఈ ఉద్యమం అన్ని ప్రాణాలు కోల్పోవాల్సినంత విలువైనదేనా అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
వియ్యుక్కలో మహిళా గెరిల్లా రచయితలు ఈ సమస్యలను కొన్ని రకాలుగా చర్చించడానికి ప్రయత్నించారు. మావోయిస్టుల బాల సంఘాలు, సంచార పాఠశాలల గురించి షహిదా రాసిన ‘ఎర్ర బాల సైనికులు’ కథనం. మావోయిస్టుల ప్రత్యామ్నాయ ప్రభుత్వం (జనతన సర్కార్ అని పిలుస్తారు) పర్యవేక్షిస్తున్న బీజరూపంలో ఉన్న సమాజం పిల్లలకు ప్రత్యామ్నాయ విద్యను, దృక్పథాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామంలోని వృద్ధులకు సాయం చేయాల్సిన వారి బాధ్యతను నొక్కిచెప్పే ఈ విద్యపైన పిల్లలకు ఉన్న ప్రేమను ఆమె కథ వివరిస్తుంది.
హిందుత్వ పెరుగుదల, మరణశిక్ష:
తాయమ్మ కరుణ “ఆదివాసీలు- అంటరానితనం” రాసిన కథ పెరుగుతున్న హిందూత్వ భావజాలం ఆదివాసీ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఒక సున్నితమైన పరిశోధన. ఒక బాబా అటవీ ప్రాంతంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ, గోండు సముదాయ ప్రజలను హాజరు కావాలని, తమను తాము సంస్కరించుకోవాలని ఆహ్వానిస్తూంటాడు. ఫలితంగా, శాకాహారులైన, మద్యపానం చేయని ఆదివాసీలు, అలా కాని కుటుంబాలమధ్య అగాధాన్ని, మొత్తం గ్రామాన్నే విభజిస్తాడు. దాంతో కోపంవచ్చిన స్థానిక దళం ఒక శివుడి గుడిని కూల్చివేసింది. ఆ తర్వాత దళంతో జరిగిన సమావేశంలో గ్రామస్తుల ఆందోళన, వారిలో పార్టీ పట్ల కలుగుతున్న అపనమ్మకాన్ని గమనించిన పార్టీ నాయకత్వం గుడిని కూల్చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని దళ సభ్యులను, వారి ద్వారా ప్రజలను సున్నితంగా ఒప్పిస్తారు. బాబా జోక్యం వల్ల జరిగిన మంచి చెడుల గురించి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.
ఉదాహరణకు, మద్యపానం చేయడంపై స్వీయ నియంత్రణను ప్రజలకు బోధించడంలో బాబా బహుశా వారి కంటే విజయవంతం అయ్యాడు; కాని మాంసాహారులను “అంటరానివారు”గా మార్చడం ద్వారా, అతను మూల ఆదివాసీ సంస్కృతిని, పద్ధతులను నాశనం చేస్తున్నాడు. గ్రామస్తులను తాము అపార్థం చేసుకున్నామని స్థానిక దళం ఒప్పుకున్న తరువాత వారి మధ్య సామరస్యత కుదిరింది. మావోయిస్టు పార్టీ తన విధానంలో సరళంగా ఉంటుందని ఈ కథ చెబుతుంది.
అదేవిధంగా, మిడ్కో రాసిన “శిక్ష”లో మరణశిక్షకు ఒక గతితార్కిక విధానం ఉంటుంది. సల్వా జుడుమ్లో (గోండిలో శాంతి యాత్ర) చేరిన బోక్లు, మంగల్ అనే ఇద్దరు గ్రామీణ యువకులు తరువాత పశ్చాత్తాపపడతారు.
బోక్లు, మంగల్ గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు గ్రామస్తుల్లో చాలా మంది వారిని చంపేయాలనుకుంటారు. ఇతర సల్వా జుడూమ్ వాళ్ళతో (ఈ ఇద్దరు కాదు) అత్యాచారానికి గురైన గులారి అనే యువతి వారు తన కొడుకును తాకడానికి కూడా ఒప్పుకోదు. దళాలు, జనతన సర్కార్ సమావేశమై ఈ విషయాన్ని చర్చించి, జుడుమ్లో చేరిన చాలామందిని పోలీసులు మనసు మళ్లించడం వల్ల జుడుమ్లో చేరారు; అయినా తమ సముదాయానికే చెందినవారే కాబట్టి వాళ్ళను శిక్షించకుండా వదిలేయాలని నిర్ణయిస్తారు.
అయితే, గ్రామ ప్రజలు సామాజిక బహిష్కరణ చేయడం కారణంగా, ఆ ఇద్దరికీ బతకడానికి పని లేదా తిండి దొరకక, అడవుల వెంబడి తిరుగుతుంటే , సల్వాజుడుమ్లోకి తమను చేర్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆదివాసీ భూస్వామి కనపడితే చంపేస్తారు.. వారు గ్రామానికి తిరిగి వస్తారు, కానీ అలా పారిపోయినందుకు మళ్లీ ప్రజల కోపాన్ని ఎదుర్కుంటారు. తాము చంపిన, రక్తం కారుతున్న గోండి భూస్వామి తలని గ్రామస్తులకు చూపించినప్పుడు మాత్రమే వారిని క్షమిస్తారు. బోక్లు, మంగల్లు ఇంతటి హింసాత్మక చర్య ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన స్థితికి నెట్టినందుకు మావోయిస్టు నాయకత్వ గ్రామస్తులను విమర్శిస్తుంది.
క్రూరమైన అణచివేత తిరుగుబాటుకు మాత్రమే దారితీస్తుంది
అంకిత రాసిన ‘చరిత్ర మునుముందుకే’ అనే చివరి కథలో, ఉద్యమం వెనుకతట్టు పట్టిన సమయంలో ఒక మహిళా గెరిల్లా తన ఆలోచనలను అన్వేషిస్తుంది. పార్టీని గట్టిగా సమర్థించిన గ్రామస్తులు ఇప్పుడు పోలీసుల ఒత్తిడికి గురై రాజ్య ప్రచారాన్ని అనుసరిస్తున్నారు. ఉద్యమంలో మరొక ప్రాంతంలో పనిచేసే తన జీవన సహచరుడిని, వాస్తవికత ఆధారంగా భావోద్వేగాలు ఉండాలని అతను చెప్పడాన్ని గుర్తుచేసుకుంటుంది. క్రూరమైన అణచివేత తిరుగుబాటుకు మాత్రమే దారితీస్తుంది, విప్లవాజ్ఞులు మళ్ళీ మండుతాయి; ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే అని ఆమె గ్రహిస్తుంది.
మహిళలు రాసిన, మహిళా కేంద్రీకృత కథలతో ఉన్న ఈ సేకరణలో మావోయిస్ట్ ఉద్యమంలో పితృస్వామిక ఆలోచన, ఆచరణల అనుభవం, దానిపైన పార్టీలో జరిగిన అంతర్గత పోరాటం అనే అంశం తప్పిపోయింది. ఇంకా అనువాదం కాని కథల విస్తృత సేకరణలో బహుశా ఈ సమస్య గురించి ఉండవచ్చు. మావోయిస్టు ప్రాంతాల్లో మిలిషియా, గెరిల్లా సైన్యం, ప్రజా సంఘాల్లో మహిళల సమీకరణ భారీగా ఉందని, సైనిక, సంస్థాగత నైపుణ్యాలలో మహిళలు పురుషులను అధిగమించారని చూపించడానికి చాలా సాహిత్యం అందుబాటులో ఉంది.
ఏదేమైనా, తొలి రోజుల్లో, మహిళలు పార్టీలో చేరడం, ఆమోదమూ, పదోన్నతి మొదలైనవాటి కోసం పోరాటం చేసి ఉండాలి. గెరిల్లా జోన్ లోని పురుష-స్త్రీ సంబంధాలలో ఉండే జెండర్ క్రియాశీలత అన్వేషణ కూడా పాఠకులకు ఆసక్తి కలిగించే అంశంగా ఉండి ఉంటుంది. బహుశా మరిన్ని అనువాదాలు, మరిన్ని అనుభవాల కథలు వెలుగులోకి వస్తే విప్లవ మహిళల రచనలకు కొత్త కోణాలను జోడిస్తాయి.
తెలుగు తెలియని వ్యక్తిగా, గోండీ అసలే తెలియని వ్యక్తిగా, ఈ కథలను అనువాదాలుగా నేను అంచనా వేయలేను. సమకాలీన కథా రచనలో భారతీయ సంప్రదాయంలో చాలా భాగం అయిన వాస్తవికత లేదా సామాజిక వాస్తవికతల సాధారణ చట్రంలో పెట్టడంలో, సామాజిక అవగాహన ఉన్న పాఠకులని చదివించడంలో వియ్యుక్కలో చేసిన కథల ఎంపిక సఫలమవుతుంది.
కవిత్వంలాగానే కథలు కూడా ఒక అంశాన్ని క్లుప్తంగా చెప్పడం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి కథలు ఒక అంశాన్ని వివిధ కోణాల్లో చర్చించగలుగుతాయి. సాంప్రదాయకంగా చిన్న కథలు చివరలో ఒక మెలికను ఉపయోగించుకుంటాయి; ఇది సాధారణంగా సమకాలీన రచనలో కనబడదు; వియ్యుక్క కథలు కూడా కొన్నిసార్లు దీనిని ఉపయోగిస్తాయి; కొన్నిసార్లు ఆలోచనను ప్రేరేపించే వర్ణనలు లేదా కథనాలుగా పనిచేస్తాయి.
ఆసక్తికరమైన పాత్రలను, మనోహరమైన పరిస్థితులను రూపొందించిన ఈ కథలు పట్టణ పాఠకులకు తెలియని ఒక వాతావరణాన్ని చాలా సజీవంగా సృష్టించగలిగాయి. అయితే, మావోయిస్టు ఉద్యమంపై ఆసక్తి లేని సాధారణ పాఠకులకు ఈ కథలు ఎలా ఉపయోగపడతాయనేది కాలమే నిర్ణయించాలి.
షోమా సేన్ ఒక విశ్రాంత ప్రొఫెసర్. తన విద్యార్థి దశ 1970 లనుండి సామాజిక కార్యకర్త. రచనల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ జెండర్ అంశాలు, ప్రజాస్వామిక హక్కులు ఆమె శ్రధ్ధ చూపించే అంశాలు.
2025 ఆగష్టు 1
(ఆరు సంపుటాల తెలుగు కథల నుంచి 20 కథలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి ప్రచురించారు.)