“ఏదీ ‘ఆఁ’ అను…”
చెప్పినట్టే ‘ఆఁ’ అని నోరు తెరిచాను. నేనేమీ శ్రీకృష్ణుడిలా మట్టి తినలేదు. ఆ వయసు కూడా కాదు. మా అమ్మ యశోదమ్మ అసలే కాదు. నా నోట్లో విశ్వం కనిపించలేదు. ‘బాపురే పదునాల్గు భువన భాండంబులు’ అని చూసినవాళ్ళూ ఆశ్చర్యపోలేదు.
“నాలుకమీద పాచి తప్ప మరేమీ లేదు” మాట విని, ‘ఊర్ధ్వలోకాలూ అధోలోకాలూ వుంటాయా మరి’ అని నేనూ నవ్వుకున్నాను.
“పిల్లాడు భయపడకుండా నవ్వుతున్నాడు…”
“వయసుకొస్తున్నాడు కదా? అలాగే వుంటుంది…”
నవ్వుతూ మాట్లాడుకుంటున్నవాళ్ళనీ వాళ్ళచేతుల్లోవున్న సరంజామాని చూసి చెప్పకేం భయం వేసింది. ప్రోత్సహిస్తూ యెవరో భుజం తట్టారు. “ఏం కాదు, సున్తీ చేసినట్టు… జెస్ట్… అయిపోతుంది… అయిపోయింది…” టప్మని నాలుక ముందరి భాగం కట్ చేసేశారు. నాలుకకు యేదో పూశారు. మంట లేదు, మొద్దుబారినట్టుగా వుంది.
నాకేం జరుగుతూవుందో బోధ పడలేదు. నా అయోమయం చూపులు చూసి మా అమ్మా నాన్నా ‘మేం అందరం చేయించుకోలేదూ?’ అన్నట్టు నోళ్ళుతెరచి అపూర్వంగా చూపించారు. ‘మేం మీ వయసు దాటే వచ్చాం’ అన్నట్టు చూశారు చుట్టూ చేరిన పెద్దలైన బంధుమిత్రులు.
“అప్పుడే అయిపోలేదు, విడతల వారీగా కొద్దికొద్దిగా తీసేస్తాం…” అంటూ వచ్చినవాళ్ళు తమ సరంజామాని సర్దుకుంటున్నారు.
“నాలుక లేకుండా యెలాగో?” నాకర్థం కాలేదు.
“నాలుక అనేది తినే పదార్ధం రుచి చూడడానికే తప్ప యిలాంటి ప్రశ్నలు అడగడానికి కాదు. నిజం చెప్పాలంటే అలా ప్రతిదాన్నీ ప్రశ్నించకుండా వుండడానికే యీ పని…”
“అసలు మాకీ కత్తిరింపులు పని పెట్టకుండా యెవరి నాలుకని వాళ్ళు ఆకురాయి పెట్టి అరగదీసుకుంటే, మీరు ‘వుత్తమపౌరులు’ అవుతారు… దేశం ‘శాంతికాముక దేశం’ అవుతుంది…”
చాలామంది పెద్దలు తలలు వూపారు.
“పోతే, యెదవ నాలుక పోయింది, తలపోవడం కంటే నాలుకపోవడం పెద్ద విషయమేమీ కాదు. ఇంక లైఫ్ లాంగ్ పీస్ ఫుల్గా వుంటుంది. మళ్ళీ యెప్పుడైనా యెక్కడైనా ‘బెబ్బెబ్బే’ అని అంటే, మళ్ళీ మీకు టైమొచ్చినట్టు… ఆపై మేమొచ్చినట్టు… అర్థం చేసుకోండి”
చెపుతూనే మరికొందరు నడీడువాళ్ళ సగంకోసిన నాలుకలు మరికాస్త కత్తిరించారు. కత్తిరించారు అనడంకన్నా స్వయంగా ముందుకొచ్చిమరీ కత్తిరించుకున్నారు అనడమే సరైనది. వయసు మల్లేలోపు అందరికీ మొత్తం నాలుకలు విడతలువారీగా పూర్తిగా తీసేస్తున్నారు. ‘నరాలు లేని నాలుక యేదైనా మాట్లాడుతుంది’ అనే సామెత యిప్పుడు దాదాపు కనుమరుగైపోయింది. ‘నోట్లో నాలుక లేదు’ అనే సామెత మాత్రమే యెంచక్కా మిగిలిపోయింది.
‘మా పిల్లలకీ పెనిమిటికీ యెవరికీ నోట్లో నాలుక లేదు తెలుసా?’ అని అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు.
నా బాల్యదశ దాటి కౌమారదశలోకి అడుగుపెడుతున్నప్పుడు వొక్కొక్కటీ అర్థమయ్యాయి. ఈ రెండు దశల్లోనే నా సగం నాలుకని కత్తిరించేశారు.
ఇన్నాళ్ళు పెద్ద కులాలవాళ్ళ మగపిల్లలకి వొడుగో గిడుగో వుండేది, అలాగే ఆడపిల్లలకి పైటవెయ్యడమో వాణీవెయ్యడమో వుండేది. దాని స్థానంలో ‘నాలుక కత్తిరింపు’ పండుగలు ఘనంగా బాజాభజంత్రీలతో జరుపుకుంటున్నారు. కిందికులాలవాళ్ళకి వారసత్వంగా నాలుకలు యేనాడో అణిగిపోయినా తిరిగి మొలకెత్తకుండా వున్న నాలుకే కాదు, కొండనాలుక కూడా కత్తిరించేశారు.
నాలుక కత్తిరించిన విషయం ఆధార్లో అప్ డేట్ చేసుకొనేందుకు అందరికీ ఆన్ లైన్ అవకాశం కల్పించారు. ఎటువంటి ప్రభుత్వ ప్రైవేటు వుద్యోగాలకైనా ‘నాలుక కత్తిరింపు’ తప్పనిసరి చేశారు.
నాలుక అనేది వొక ‘కుక్కమూతి పిందె’గా దేశ నాయకులు అభివర్ణించారు. కుక్కమూతి పిందె వుంటే యెంత… వూడితే యెంత… అని అనుకోకుండా దేశంపట్ల విధేయతా ప్రేమకలిగినవాళ్ళు వూడగొట్టుకోవడమే నిజమైన దేశభక్తిగా పేర్కొన్నారు.
అసలు యీ నాలుక కత్తిరింపులు అనేవి… కంటే కళ్ళు పీకి- వింటే చెవుల్లో సీసం పోసిన సనాతన రోజులనుండీ వుందని చరిత్రకారులు తమ గ్రంధాలలో రాశారు. కొండనాలుక సాగి కిందనున్న నాలుకని తాకినప్పుడు దగ్గు ఆగకుండా వస్తుందని, దాన్ని నిరోధించడానికి గడ్డ వుప్పుతో కొండనాలుకని గట్టిగా అదిమే వారని… ఆ ఆనవాళ్ళు యిప్పటికీ పల్లెల్లో కనిపిస్తాయని మరికొందరు రాశారు. అయితే అది కొండనాలుక కాదని అసలు నాలుక అని మేధావులు కాలానుగుణమైన మార్పులతో అనుసంధానించి మరింత స్పష్టపరిచారు.
అంతా సవ్యంగా సాగుతోన్న సమయంలోనూ ‘మీకేనా నాలుకలు? మాకొద్దా?’ అని అడిగినవాళ్ళ నాలుకలు కాదు, తలలే తెగిపోయాయి. అది ‘నాలుకా తాటిమట్టా?’ అనే సామెత అలాంటివాళ్ళను వుద్దేశించే పుట్టింది అని భాషా శాస్త్రవేత్తలు చెప్పారు కూడా. అదలా వుంచితే, నాలుక కలిగివున్నవారంతా వొత్తినే తాము నాలుకలు కలిగి లేమని, అందుకు యెంతో సాధన చేశామని చెప్పుకొచ్చారు. అనేక పరీక్షల్లో నెగ్గుకొచ్చామని చెప్పారు. ఆకలేసినా నొప్పికలిగినా ‘అమ్మా’ అని అనకుండా వున్నామని చెప్పారు. పక్కవాడు తగలబడిపోతున్నా ‘అయ్యో’ అని కూడా అనలేదని చెప్పారు. కలలు కూలి తలలు తెగుతున్నప్పుడు కూడా కంట్లోంచి చుక్కనీరు కార్చలేదు సరికదా, కళ్ళలో తడో యెర్రజీరో లేకపోవడం తమ నికార్సుతనానికి నిదర్శనమని చెప్పారు. అలా ‘నోట్లో నాలుక లేదు’ అని అనిపించుకున్న కొద్దిమందికి మాత్రమే నాలుకల్ని వుంచుకొనే అవకాశమొచ్చిందన్నారు. కాని నిరంతరం అదో అగ్ని పరీక్షగా మారిందన్నారు. తాము యెప్పుడు యే విధంగా నాలుకను వాడిందీ దగ్గరిలోని పోలీసు స్టేషన్లో నమోదు చేయాల్సివుంటుందన్నారు. కళ్ళుండీ గుడ్డిగా చెవులుండీ మూగగా వున్నామని అందుకు సంబంధించిన వుత్తీర్ణతలతో కూడిన తమ లైసెన్సులను చూపించారు. నాలుకను వేరుగా వాడితే లైసెన్సు రద్దయి నాలుక మొత్తం తొలగించిన వుందంతాలను సయితం చూపించారు.
నే యవ్వనదశలోకి యిలా అడుగు పెట్టానో లేదో వున్న నా సగం నాలుకలో మళ్ళీ సగం కత్తిరించేశారు.
ఇదంతా చూసి ‘నాలుక కలిగి వుండడం యెంత నరకమో కదా?’ అని తమకా బాధ లేదని యెంతగానో సంతోషించారు సామాన్యులు. నాలుక వుంటే రుచి తెలుస్తుందని, తమ రుచీపచీ లేనే లేని బతుకులకు నాలుక అవసరం లేదని వారి పెద్దలు వారికి చెపుతూవచ్చారు. ఇక అసామాన్యులు రుచి అనారోగ్య హేతువని, అంచేత నాలుక కత్తిరించుకొని పేరు తెచ్చుకున్నారు.
‘పుట్టినప్పుడే నాలుకను శస్త్ర చికిత్సద్వారా తొలగించడం మంచిది’ అని కొందరు అహింసావాదులు తమ వాదనల్ని న్యాయస్థానాల్లో వినిపించారు. ‘బొడ్డుతాడు కట్ చేసినట్టే నాలుకను కట్ చేయడానికి కోర్టు అనుమతిని కోరుతూ అభ్యర్ధన’ వినిపించారు. అప్పుడు మనుషులు శబ్దాలద్వారా తమ కార్యకలాపాలను నెరవేర్చుకుంటారని, అది అత్యంత ప్రమాదకరమని, ఆ శబ్దాలను డీకోడ్ చేయడం అన్నివేళలా సాధ్యమయ్యే పనికాదని న్యాయాధిపతి అభ్యంతరం తెలిపి తోసిపుచ్చారు. అటువంటి అనుకూల న్యాయమూర్తులు మూర్తులల్లె యెప్పటికీ వారిస్థానాల్లో నిలిచిపోయారు.
నాలుక లేకపోవడం యెంత శాంతియుతమో చెపుతూ సాహిత్యకారులు తమ సృజనను కొనసాగించి అవార్డులూ రివార్డులూ అందుకున్నారు. నోరులేకపోవడం కన్నా నాలుక లేకపోవడం యెంత గొప్పదో తెలియజేస్తూ కవిత్వం కూడా వచ్చింది. నాలుక లేకుండా వచ్చే శబ్దాలను సంస్కృత పదాలతో అల్లి పద్యకవిత్వం కూడా పునర్జీవించింది.
ఇటువంటి సానుకూల సందర్భంలో న్యాయస్థానాల్లో వొకేసారి అనేకమంది పిర్యాదుదారులు దావాలు వేశారు. అన్నింటినీ వొకేచోట విచారణ జరపాలని అత్యన్నత న్యాయస్థానం తీర్మానించింది. మొత్తం దావాల సారం వొక్కటే, ‘నాలుక లేకపోవడం వల్ల తమని వికలాంగులుగా పరిగణించాలని’. పరిగణించి తమకు రిజర్వేషన్ కల్పించాలని. శరీరంలో యేదో వొక అవయవలోపమో లేకపోవడమో జరిగినప్పుడు వికలాంగులుగా గుర్తిస్తున్నప్పుడు తమని కూడా అదే విధంగా గుర్తించాలని. యువత నివేదనని న్యాయస్థానాలు విచారణకు స్వీకరించాయి.
నాలుకలు లేనివాళ్ళ శాతం భారీగా వుండడంవల్ల రిజర్వేషన్ యిచ్చినా అందరికీ వర్తించినా దానివల్ల యెటువంటి వుపయోగమూ లేదని కొందరు ‘గుస్ గుస్’ శబ్దాలు చేశారు. మరికొందరయితే మనం మరీ డిమాండ్ చేస్తే, నాలుకలు తెగ్గోయడం ఆపి నోళ్ళకే యేకంగా కుట్లు వేస్తారేమోనని తీవ్ర ఆందోళన చెందారు.
నిఘా వర్గాలవారు తమపని తాము చేసుకుపోతున్నారు.
‘నాలుక తలెత్తకుండా చెయ్యడంవల్ల దేశం తలెత్తుకుంటుంది’ అనేది దేశనాయకుల బలమైన సంకల్ప నినాదమయ్యింది.
‘కాని నాలుక కదా? ప్రకృతి సిద్ధంగా దాని పని అది చేస్తే? కథ మొదటికొస్తే?’
‘రాదు. అనుమానం అక్కర్లేదు. యువత కామానికి నాలుగింతలు ముంచి తేల్చే పోర్న్ వుంది. తలిదండ్రులను అప్పులపాలు చేసి ఆత్మహత్యలు చేసుకొనేటన్ని బెట్టింగ్ యాప్లు వున్నాయి. మెదడు తీసి పక్కన పెట్టి చూడగలిగేటన్ని సినిమాలు వున్నాయి. దాహంరేపి తీర్చి తేల్చేటంత మద్యం వుంది. తమని తాము మర్చిపోయి కొత్తలోకాల్లో విహరించేందుకు కావలసినంత డ్రగ్స్, గంజాయి వున్నాయి. అర్థరాత్రిదాక మత్తులో తేల్చే పబ్లున్నాయి. ఇవన్నీ వున్నప్పుడు నాలుక వాడేంత సమయం యెవరిదగ్గర వుంది?’ గూఢచర్యం గుండె విరిచి చెప్పింది.
‘చాలదు, యింకా…?’
‘కులం వుంది. మతం వుంది. దైవం వుంది…’
‘చాలదు, స్పిరిచువాలిటీకి రిలిజియన్ యాడ్ చేయండి. ఆధ్యాత్మికతనూ మతాన్నీ మిళితం చెయ్యండి, విడదీయలేనంతగా. అప్పుడు నాలుక కులం గుద్ద నాకుతుంది. మతం మొ… గుడుస్తుంది. దైవమని దొబ్బిచ్చుకుంటుంది. అప్పుడు నాలుక నోట్లోనే వుంటుంది. అటు యిటు కదిలితే పళ్ళకింద పడి నలిగి చస్తుంది’
నా తలలో తిరుగాడుతున్న దృశ్యాలను చూస్తూ వింటూ వుండగా యెవరో వచ్చి చుట్టుముట్టారు. నా తలను పట్టుకున్నారు. అర్థమయ్యింది. అలవాటుగా ‘ఆఁ’ అన్నాను, నోరు తెరిచి. అంగుటికి అతుకులా అతుక్కొని వున్న నాలుక మొదులు భాగాన్ని కత్తిరించేశారు. నాలుక కిందపడి కొట్టుకుంది. గుండె తాళం వేసింది. పూసిన మందువల్ల నోరంతా మొద్దుబారింది. మాట్లాడడానికి ప్రయత్నించాను.
ఒకటే శబ్దం.
“ష్… ష్…”
(పద్నాలుగేళ్ళ అశ్వమిత్ గౌతమ్ ‘నాలుక’కు యీ కథ అంకితం)




