( రాయసీమ విద్యావంతుల వేదిక మూడో బులిటెన్కు రాసిన ముందుమాట. జనవరి 4న కర్నూలులో జరగనున్నఆర్ వి వి రాష్ట్ర మహాసభలో ఆవిష్కరణ)
చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని బీడు నేలలకు అందివ్వగల ప్రాజెక్టుల ప్రతిపాదనలు తయారు చేస్తుండేవారు. వాటిని పట్టుకొని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లేవారు. అంతకుమించి ప్రజా జీవితంలోకి రాలేదు.
అప్పట్లో రాయలసీమ గురించి ఆలోచిస్తుండిన పిడికెడు మంది వ్యక్తులకు కూడా సుబ్బరాయుడుగారు తెలియదు. సమైక్య ఉద్యమంలోని పెడ ధోరణిని వ్యతిరేకిస్తూ, రాష్ట్రమే విడిపోతే సీమ ప్రజలు తమ ప్రాంత సమస్యల మీద పోరాడాలిగాని, సమైక్యవాదంలో కొట్టుకపోకూడదని రాయలసీమ విద్యావంతుల వేదిక ఆరంభమైంది. కానీ రాయలసీమ ప్రాంతీయ సమస్యల గురించి మాట్లాడే పోరాట వాతావరణం ఆనాటికి లేదు. మేధోపరమైన భూమిక కూడా లేదు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
1980ల నాటి రాయలసీమ ఉద్యమ నాయకులు పూర్తిస్థాయి ఓట్ల రాజకీయ నాయకులయ్యారు. వాళ్లే పాలెగాళ్లయ్యారు. సీమ ప్రజా జీవితానికి ప్రతిబంధకంగా తయారయ్యారు. ఆ తర్వాత సీమకు జరిగిన అనేక విద్రోహాల్లో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములయ్యారు. అట్లాగే ఆనాటి మేధావులు కూడా ఆ దశ రాయలసీమ ఉద్యమం తర్వాత ఒట్టిపోయారు. సీమ అస్తిత్వ సమస్యలకు అవసరమైన సరికొత్త రాజకీయ, భావజాల వాతావరణం నిర్మించాలనుకోలేదు.
ఈ లోపాలను, పరిమితులను, ఖాళీలను 1990లలో ఒక దశాబ్దంపాటు విప్లవ, ప్రగతిశీల శక్తులు భర్తీ చేయడానికి ప్రయత్నించాయి. భూస్వామ్య సాయుధ ముఠాల వ్యతిరేక ఉద్యమం; కరువు, వెనుకబాటుతనం, నీటి వాటాలో వివక్షలకు వ్యతిరేకంగా సాగిన సీమ ప్రాంతీయ ఉద్యమం ఒక సరికొత్త రాజకీయ, రాజకీయార్థిక, సాంస్కృతిక భూమికను రాయలసీమ ఉద్యమానికి అందించాయి. అనేక కారణాల వల్ల ఆ రెండు ఉద్యమాలు ఆగిపోయాయి.
తిరిగి 2014 నాటికి సమైక్య ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా ఆరంభమైన సీమ ప్రాంతీయ ఆలోచనల ముందు రెండు తీవ్రమైన సమస్యలు ఉండినవి. ఒకటి: అనేక ప్రయత్నాలు, అర్థాంతర విరమణలు, సీమ నాయకుల విద్రోహాల తర్వాత తిరిగి రాయలసీమ ఆకాంక్షలను ఉద్యమంగా తీర్చిదిద్దగల ప్రజానుకూల వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం ఎట్లా?. రెండు: ప్రస్తుత రాయలసీమ ఉద్యమ దశకు అవసరమైన భావజాల వాతావరణాన్ని, ప్రజలతో కనెక్ట్ కాగల బౌద్ధిక వాదనలను సమకూర్చుకోవడం ఎట్లా? ఇందులో మొదటి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రెండోదాని గురించి రాయలసీమ ఆలోచనాపరులు మధన పడుతున్నప్పుడు సుబ్బరాయడుగారు అందుబాటులోకి వచ్చారు.
ఈ విడత రాయలసీమ ఉద్యయం ఇప్పటికీ ఒక ప్రజా పోరాటంగా మారి ఉండక పోవచ్చుగాని, సుమారు గత వందేళ్ల సీమ అస్తిత్వ వాదనలు పరిణత దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యమైనది నీటిపారుదల రంగం. అప్పటి దాకా మిగులు జలాల మీద ఆధారపడిన సీమ ఉద్యమ వాదనలు ఈ దశలో పూర్తిగా మారిపోయాయి. కృష్ణా బేసిన్లో నీటికి కొరత లేదనీ, పంపకాల్లోనే అన్యాయం జరుగుతున్నదనీ, నీరు నిల్వ చేసుకొనే రిజర్వాయర్ల నిర్మాణంలో వివక్ష ఉన్నదనీ, మౌలికంగా ప్రభుత్వ అభివృద్ధి విధానమే సమస్యాత్మకమనే కొత్త వాదనను ఈ విడత రాయలసీమ ఉద్యమం సంతరించుకుంది.
సీమ ఉద్యమంలోని ఈ దశకు అత్యవసరమైన ఈ మేధో పునాదిని అందించినవారు సుబ్బరాయుడుగారు. ఆ రకంగా ఆయన రాయలసీమ ప్రజా జీవితంలో, ప్రజా పోరాటంలో దీపధారి. నిర్ధారిత విషయాలను మళ్లీ మళ్లీ చెప్పడం, విశ్లేషించడం, ప్రచారశక్తిగా మార్చడం కూడా ఉద్యమాల్లో అవసరమే. కానీ ఒక కొత్త కథనాన్ని తయారు చేసి, ఆ వైపు ప్రజలు ఆలోచించేలా చేయడం, ఉద్యమాలకు అవసరమైన కొత్త ఆలోచనా ప్రపంచాన్ని నిర్మించడం కొద్ది మందికే సాధ్యం. అలాంటి చర్చా ప్రారంభకుల పాత్రకు వైతాళిక స్వభావం ఉంటుంది. సుబ్బరాయుడుగారు రాయలసీమ నీటి పారుదల రంగంలో సరిగ్గా అలాంటి పాత్ర నిర్వహించారు. ఆయనతో పరిచయం ఉన్న వాళ్లు సుబ్బరాయుడిగారికి అంతటి ఉద్యమ ఎరుక ఉందని అనుకోరు. కానీ ఆయన నీటి పారుదల ఆలోచనలకు ప్రస్తుత సామాజిక, చారిత్రక సందర్భంలో ఆలాంటి స్వభావం సమకూరింది. ఆ సంగతి ఆయనకూ అంతకముందు తెలియకపోవచ్చు.
దీనికి ఉదాహరణ సిద్ధేశ్వరం అలుగు ప్రతిపాదన. చరిత్రలో రాయలసీమకు జరిగిన ఒక పెద్ద విద్రోహానికి సవరణ కాకపోయినా, ఆనాడు నిర్మించాల్సిన సిద్ధేశ్వరం ప్రాజెక్టు దరిదాపుల్లోనే సుబ్బరాయుడుగారు అలుగు ప్రతిపాదన చేశారు. ఈనాటికీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ విడత రాయలసీమ ఉద్యమానికి సిద్ధేశ్వరం అలుగు ఊపిరి పోసింది. రాయలసీమ ఉద్యమ భావజాలం నిర్మాణం కావడంలో అలుగు పోరాటం పాత్ర గణనీయమైనది. అట్లా సుబ్బరాయుడుగారి ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఈ కాలపు రాయలసీమ ఉద్యమానికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాయి. ఇది నిస్సందేహంగా 1980లనాటి రాయలసీమ ఉద్యమానికంటే గుణాత్మకంగా భిన్నమైన దశ. సీమ ఆకాంక్షల చుట్టూ న్యాయబద్ధ వాదన ఒక కొత్త ఒరవడిని అందుకున్నది.
సుబ్బరాయుడుగారు ఇంత ప్రభావశీలమైన వ్యక్తిగా సీమ ఉద్యమంలో మారుతారని ఆయన జీవించి ఉన్న రోజులకంటే మరణానంతరమే ఎక్కువగా అనిపిస్తోంది. సుమారు వందళ్ల రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ పోరాట చరిత్రలోకి వెళ్లి ఇలాంటి కృషి చేసినవాళ్ల కోసం వెతికితే పప్పూరి రామాచార్యులు కనిపిస్తారు. ఆయనకు ఉన్న అవకాశాల వల్ల, అవగాహనల వల్ల విస్తృత మేధో రంగంలో పని చేసి ఉండవచ్చు. కానీ సీమ కోసం ఆలోచించడం, పని చేయడం తప్ప మరే ప్రతిఫలం, ప్రాపకం కోరుకోని నైతికతలో రామాచార్యులుకు సరితూగగల వ్యక్తి సుబ్బరాయుడుగారు. కనీసం సొంత గుర్తింపు కూడా కావాలని ఆయన అనుకోలేదు. తాను ప్రతిపాదించిన సీమ ప్రాజెక్టుల అవసరం చెబితే చాలని, వాటిని ముందుకు తీసికెళ్లితే చాలని అనుకొనేవారు. ఆయన తన నైతికత వల్ల వ్యక్తిగా రాయలసీమ ఉద్యమానికి చేసిన దోహదంతోపాటు ఏ ఉద్యమంలోనైనా పని చేసేవారికి నమ్రత, నిస్వార్థం, మానవత తప్పనిసరనే సందేశాన్నీ ఇచ్చారు.
ఆయనకు రాయలసీమ మీద ఉన్న ప్రేమ సంకుచితమైనది కాదు. ఆయన ఆలోచనల వెనుక, కృషి వెనుక ఉన్నది మానవీయత. సీమ కరువుకాటకాల్లో అల్లాడిపోతోంటే వందల టీఎంసీల నీరు వృథా అవుతున్నదనే వ్యథ ఆయనను కుంగదీసేది. తక్కువ ఖర్చుతో, తక్కువ ముంపుతో, నీరు పల్లమెరుగు అనే పద్ధతిలో, పర్యావరణ సమస్య తలెత్తకుండా ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. మిగతా క్షామ ప్రాంతాలపట్ల, నీటి పంపకాల్లో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా అన్యాయానికి గురైన ప్రాంతాలపట్ల ఆయనకు సమాదరణ ఉండేది. ప్రజలు ఎక్కడైనా ప్రజలే, వాళ్ల సంక్షేమానికి లోటు రాకూడదనే న్యాయ భావన ఆయనను నడిపించింది.
సుబ్బరాయుడుగారు రాయలసీమ విద్యావంతుల వేదికకు అత్యంత సన్నిహితుడు. పెద్దదిక్కు. శ్రేయోభిలాషి. ఆయన మనసెరిగి, ఆయన ఆకాంక్షలను గౌరవించి, ఆయనతో విద్యావంతుల వేదిక సంబంధాలు నెరపింది. ఆయన తనకు ఆత్మీయ ఆలోచనాపరుడని వేదిక గర్వంగా చెప్పుకుంటుంది. ‘మన రాయలసీమ’ ఆయన కృషిని, జ్ఞాపకాలను తలచుకుంటూ ఇష్టంగా, ఒక చిన్న ప్రయత్నంగా ఈ సంచికను మీకు అందిస్తోంది. ఇందులో సుబ్బరాయుడుగారి స్మృతి వ్యాసాలు, ఆయన, ఆయన సహచరి పాత్రలుగా ఉండే కథ (పునర్ముద్రణ), రాయలసీమ సమస్యలపై వ్యాసాలు, కవితలు, పాట, నివేదికలు, కరపత్రం ఉన్నాయి. చదవండి. రాయలసీమ ఉద్యమంలో భాగం కండి.




