తెలుగు సాహిత్యంలో సైన్స్ ఆధారిత రచనలు చాలా అరుదు. మరీ ముఖ్యంగా ఒక నిర్దిష్ట సైన్స్ సబ్జెక్టును (ఇక్కడ మైక్రోబయాలజీ & ఆంకాలజీ) కేంద్రంగా చేసుకొని, ఫిక్షన్ రూపంలో అందంగా అల్లిన నవలలు దాదాపు లేవని చెప్పవచ్చు (ఉంటే నన్ను కరెక్ట్ చేయండి). అలాంటి ఖాళీని ‘సు’ అద్భుతంగా నింపేసింది. ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు – తెలుగు సాహిత్యంలో సైన్స్-ఫిక్షన్ జానర్‌కు ఒక బలమైన పునాది వేసిన మైలురాయి.
చదువుకున్న సబ్జెక్టును సాహిత్యంలో రాయడం అంటే సులువైన పని కాదు. దానికి సబ్జెక్టుపై లోతైన పట్టు, శాస్త్రీయ ఖచ్చితత్వం, అదే సమయంలో పాఠకుడికి ఆసక్తికరంగా చెప్పగలిగే నేర్పు – మూడూ కావాలి. డా. ప్రసన్నకుమార్ గారు ఈ మూడింటినీ అద్భుతంగా కలిపారు. 118 అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు ప్రచురించిన శాస్త్రవేత్తగా, ఆయనకు క్యాన్సర్ సెల్ లైన్స్, సెల్ కల్చర్ టెక్నిక్స్, ఆల్ఫాటాక్సిన్స్ వంటి విషయాలు కేవలం థియరీ కాదు – రోజూ ల్యాబ్‌లో చేతులతో చేసే పనులు. ఆ అనుభవం పుస్తకంలోని ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది.
క్యాన్సర్ సెల్స్ ఎంత వేగంగా పెరుగుతాయో ల్యాబ్‌లో పనిచేసిన వాళ్లకు మాత్రమే పూర్తిగా అర్థమవుతుంది – 48-72 గంటలకోసారి మీడియా మార్చాల్సి వస్తుంది, ట్రిప్సినైజేషన్ చేయాల్సి వస్తుంది, కొన్ని సెల్స్‌ను -80°Cలో ఫ్రీజ్ చేసి స్టోర్ చేయాల్సి వస్తుంది. ఆ వేగంతోనే క్యాన్సర్ మన శరీరంలోనూ వ్యాపిస్తుంది. అందుకే ఇప్పటిదాకా క్యాన్సర్‌కు ‘పూర్తి నివారణ’ మందు రాలేదు – ఇమ్యూనోథెరపీ, CAR-T సెల్ థెరపీలతో జీవితాన్ని పొడిగించగలుగుతున్నాం, కానీ రోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోతున్నాం.
ఈ నవలలోని ప్రధాన పాత్ర – ఒక శాస్త్రవేత్త – తనకే క్యాన్సర్ వచ్చినప్పుడు తన సెల్స్‌ను ఫ్రీజ్ చేయమని చెప్పడం, మరణానంతరం కూడా ఆ సెల్స్ ల్యాబ్‌లో జీవించి ఇతరుల పరిశోధనకు ఉపయోగపడుతున్నాయనే ఊహ – నిజ జీవితంలోని హెలా సెల్ లైన్ (Henrietta Lacks) కథను గుర్తు చేస్తుంది. హెలా సెల్స్ లేకపోతే పోలియో వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్, ఎన్నో ఔషధాలు రాలేవు. ఆమె 1951లో మరణించినా ఆమె సెల్స్ ఈ రోజు వరకూ ప్రపంచ ల్యాబ్‌లలో జీవించి ఉన్నాయి. ఆ విషయం ఇప్పటికీ కోట్ల మందికి తెలియదు – అది మన సైన్స్ అవగాహనలో ఉన్న లోటును సూచిస్తుంది.
లైఫ్ సైన్సెస్ విద్యార్థులకు ఈ పుస్తకం చదవడం తప్పనిసరి అనిపిస్తుంది. ఎందుకంటే మన కాలేజీలు, యూనివర్సిటీలు టెక్స్ట్ బుక్ జ్ఞానం మాత్రమే ఇస్తున్నాయి – శాస్త్రీయ ఆలోచన, రిసెర్చ్ మైండ్‌సెట్, ఎథిక్స్ – ఇవన్నీ మనం సొంతంగా నేర్చుకోవాల్సిందే. ‘సు’ ఆ దిశలో ఒక మంచి మార్గదర్శి.
ప్రతి సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో సైంటిఫిక్ పుస్తకాల కోసం తవ్వుతూ ఏమీ దొరక్కపోతే వచ్చే నిరాశ ఈ ఏడాది ‘సు’ చేతిలో పడ్డప్పుడు పోయింది. ఇక ఇతర శాఖల్లోనూ – ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యూరోసైన్స్, AI – ఇలాంటి ఫిక్షనైజ్డ్ నవలలు తెలుగులో వస్తే ఎంత బాగుంటుందో!
ప్రచ్ఛాయ పబ్లికేషన్స్ ఈ అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చినందుకు, డా. ప్రసన్నకుమార్ గారికి, అద్భుతమైన అనువాదం అందించిన రంగనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
‘సు’ – తెలుగు సైన్స్ సాహిత్యంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
ఈ పుస్తకాన్ని ప్రతి లైఫ్ సైన్సెస్ విద్యార్థీ, పరిశోధకుడూ చదవాల్సిందే!
మూలం: ప్రసన్న సంతేకడూర్
అనువాదం: రంగనాథ రామచంద్రరావు
ప్రచ్చాయ నుండి ప్రచురితం
సమీక్షకుడు ఎం.ఎస్.సి. మైక్రోబయాలజీ




