జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’
అక్రమ కేసులో జైల్లో ఉన్న కేరళకు చెందిన రాజకీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.










