“సార్ అతను చచ్చిపోయేట్టు వున్నాడు. మనం కొట్టిన దెబ్బలకు అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్”

కానిస్టేబుల్ పరాంకుశం కంగారు మాటలకి డి.ఎస్.పి వజేరా చిరాకుగా మొహం పెట్టాడు.

2 డిసెంబర్ 2002, సోమవారం మధ్యాహ్నం 3:45 కు, బిజీగా ఉన్న ముంబై దగ్గరి ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో బస్సు సీటు కింద గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన బాంబు పేలింది. బస్సు వెనుక భాగంలో బాంబు ఉంచారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఘట్కోపర్ చివరి స్టాప్ కావడంతో, బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే దిగిపోయారు. తిరుగు ప్రయాణానికి ప్రయాణికులు ఇంకా బస్సులోకి ప్రవేశించలేదు. అందువల్ల ప్రాణ నష్టం తక్కువుగా జరిగింది.

ఆ బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తూ యాసిన్ అనే ముస్లిం యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి వారం రోజులు అవుతుంది. ప్రజలకి, మీడియాకి తెలియకుండా అతన్ని ఒక ప్రత్యేకమైన చీకటి గదిలో ఉంచి చావ కొడుతున్నారు. పేలుళ్లకు అతనిని బాధ్యుడిని చేస్తూ ఒప్పుకోలు పత్రాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు వేధిస్తున్నారు.

వజేరా 1999 లో పోలీస్ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో డీఎస్పీ స్థాయి అధికారిగా చేరాడు. అతని పోస్టింగ్ మొదట్లోనే గడ్చిరోలి జిల్లా లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వేయబడింది. అతను తొందరగా ప్రమోషన్ పొందాలనే ఉత్సాహంలో ఉండే వ్యక్తి. దాని కోసం అతను ఒక దగ్గరి మార్గాన్ని ఎంచుకున్నాడు.

నక్సలైట్ల పేరుతో సాధారణ ప్రజలను కాల్చి చంపడం మొదలుపెట్టాడు. ఎన్కౌంటర్ అనే కట్టు కధలని చెప్పి, అందులో భాగంగా నక్సలైట్లు చనిపోయారని మీడియాని, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసేవాడు. అనుకున్నట్టుగానే అతను ఆక్సిలరీ ప్రమోషన్ సాధించాడు.

ప్రమోషన్ తీసుకొని ముంబై శివార్లలోని ధానే కు బదిలీ అయ్యాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా దేశంలోనే గొప్ప పేరు పొందాడు. అతని స్ఫూర్తితో చాలా మంది సినిమా దర్శకులు సినిమాలు కూడా తీసి కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టారు.

తాజాగా అతను పనిచేస్తున్న ప్రాంతంలో బాంబు పేలుడు జరిగింది. అతని మీద రాజకీయ నాయకుల, పై అధికారుల ఒత్తిడి అధికమైంది. ఉగ్రవాదుల్ని ఎలా పట్టుకోవాలో అతనికి తెలీదుగానీ, తొందరగా కేసు ఎలా ముగించాలో మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే సంఘటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే అతను నిందితులను పట్టుకుంటాడని అతని సర్వీస్ రికార్డు చెబుతుంది.

అందుకనే బాంబు పేలుళ్లు తనే చేశానని ఒప్పుకోమని ముస్లిం యువకుడైన యాసిన్ ను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. అతను ఎక్కడ చనిపోతాడనే భయంతో స్టేషన్ లోని పోలీసులు వణికిపోతున్నారు. ఎట్టకేలకు పోలీసులు విజయం సాధించారు. అతను చిత్రహింసలకు భయపడి తెల్ల కాగితం మీద సంతకం చేసాడు. కానీ అతన్ని కోర్టు ముందర హాజరు పరిచే లోపలే అతను చనిపోయాడు.

అతని బంధువులు, మైనారిటీ సంఘాలు ప్రభుత్వానికి, పోలీసులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిపాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. పాపాలకు ప్రాయశ్చిత్తం ఈ భూమి మీద కాకుండా వేరే లోకాల్లో ఉంటుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చేసిన తప్పులు కొండంత నిజంగా భవిష్యత్తులో కనిపిస్తాయని వజేరా విషయంలో నిజమైంది.

2004లో కమిటి తన నివేదికను ఇచ్చింది. చిత్రహింసలకు గురి చేయటం వల్లే ముస్లిం యువకుడు లాకప్ లో చనిపోయాడని ప్రభుత్వం నియమించిన కమిటీ వెల్లడించింది. అంతే కాకుండా దానికి వజేరా ను బాధ్యుడ్ని చేస్తూ అతనితో పాటు 13 మంది పోలీసులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాజకీయంగా ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కోవడంతో తప్పనిసరి పరిస్థితిలో వెంటనే సస్పెండ్ ఉత్తర్వులు ఇచ్చింది.

వజేరాకు ఎటూ పాలుపోలేదు. అతను స్వయంగా ఎంచుకున్న హింసా మార్గం అతని కెరీర్ ని మింగేసింది. పరమపద సోపాన పటంలో పాము మింగినట్టు కిందకు జారిపడ్డాడు. కానీ అతను నిరుత్సాహ పడలేదు, కుంగిపోలేదు. నిచ్చెన మెట్లను ఎక్కేదానికి తిరిగి ప్రయత్నించాడు.

2007లో తనను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. కానీ అతన్ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా, తన అవసరాల కోసం మార్చిన పార్టీ, అధికారంలో లేకపోవటంతో అతని అభ్యర్థన తిరస్కరించబడింది.

త్వరగా డబ్బు, అధికారం, కీర్తి సంపాదించాలంటే ఈ వ్యవస్థలో రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి బ్యూరోక్రాట్ గా ఉండటం. రెండోది రాజకీయంగా ఎదగడం. మొదటిది విఫలం కావడంతో వజేరా రెండోదాన్ని ఎంచుకున్నాడు. 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి శివసేన లో చేరాడు.

గతంలో శివసేన ప్రభుత్వంలోనే అతను పైకి ఎదిగి రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదుల పేరిట ఎన్కౌంటర్లో హతమార్చాడు. అందువల్ల అతన్ని శివసేన పార్టీ ఆదరించింది. 2019లో మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ ఐక్య కూటమి అధికారంలోకి వచ్చింది. 2020 లో కరోనా దేశాన్ని ఓ కుదుపు కుదిపింది.

ఈ క్రమంలో ప్రజల్ని కాపాడటానికి ప్రత్యేక పోలీసు బలగం అవసరమనే వాదనను శివసేన ప్రభుత్వం వినిపించింది. అందుకుగానూ 2020 జూన్ 5న వజేరాను కీలకమైన ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారిగా నియమించింది.

శివసేన తన రాజకీయ ప్రత్యర్థులను మట్టు పెట్టడానికి అతన్ని నియమించిందని అన్ని ప్రతిపక్ష పార్టీలు అప్పుడు గగ్గోలు పెట్టాయి.

ఉదయం 5:30 అవుతోంది. ముంబాయి అప్పుడే మంచు కౌగిట్లో నుంచి చిన్నగా విడి వడుతోంది. అది ముంబై నగరంలోని అలమౌంట్ రోడ్ లోనే 27 అంతస్తుల భవనం. అందులో సూర్యుడు దాగి ఉన్నట్టుగా, ఆ భవనం మితిమీరిన కాంతితో వెలిగిపోతూ ఉంది. ఆ ఇంటి ముందర ఒక స్కార్పియో ఆగింది.

ఆ బండిని అక్కడ పార్కు చేసిన డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. ఆగి ఉన్న వాహనాన్ని గమనించటానికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులకి గంట పట్టింది. వాళ్ళ అప్రమత్తమై వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు తనిఖీ చేస్తే అందులో పేలుడు పదార్థాలు దొరికాయు.

అంతేకాకుండా ప్రపంచంలోనే సహస్ర కోటీశ్వరుల జాబితాలో అగ్రభాగాన ఉన్న ఆనంద్ ని బెదిరిస్తూ రాసిన లేఖ కూడా వాళ్ళు కనిపెట్టారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచల నాన్ని సృష్టించింది.

మార్చి ఐదో తారీకున, ధానే సమీపంలోని ఒక మురికి కాలువ పక్కన ఒక మృతదేహాన్ని స్థానిక ప్రజలు కనుగొన్నారు. శవాన్ని గుర్తుపట్టిన వారు, అది కిరణ్ అనే నగల వ్యాపారిదని చెప్పారు. ఆశ్చర్యంగా ఆనంద్ ఇంటి ముందర పార్కు చేసిన స్కార్పియో కిరణ్ పేరిట రిజిస్టర్ అయి వుంది. అయితే అతను ఫిబ్రవరి 17నే తన స్కార్పియో కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దేశ రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయి. కేంద్రంలో ఉన్న అధికార వర్గానికి మహారాష్ట్రలో ఉన్న అధికార పార్టీకి మధ్య చాలా గొడవలు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని కేంద్ర ప్రభుత్వం అనేక కుతంత్రాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ హత్య, పేలుడు పదార్థాలున్న స్కార్పియో, జరుగుతున్న వరుస నాటకీయ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంది.

మహారాష్ట్ర డి జి పి ఆఫీస్ ముందు ఒక ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఆగింది. అందులో నుండి ముగ్గురు సూటు బూటు వేసుకున్న వ్యక్తులు కిందకు దిగారు. వారు నేరుగా డిజిపి ఆఫీస్ తలుపులు తోసుకుని వెళ్లి డీజీపీ ముందర, అతని అనుమతితో సంబంధం లేకుండా అతని ఎదురుగ్గా వున్న కుర్చీల్లో కూర్చున్నారు.

“మీరెవరు” డిజిపి సీరియస్ గా అడిగాడు

“ఎన్ ఐ ఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నాపేరు రాణా ప్రతాప్” అందులో బాస్ గా ఉన్న వ్యక్తి డిజిపికి సమాధానమిచ్చాడు.

” సంతోషం. అయితే మీకు ఇక్కడ ఏం పని” డిజిపి సూటిగా చూస్తూ అడిగాడు.

“ఏం లేదు. దేశ ఆర్థిక మూలాలును దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నట్లు మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అందులో భాగంగానే పెట్టుబడిదారు డైన ఆనంద్ ను చంపేందుకు కుట్ర పన్నారు. ఆ దర్యాప్తు ఇక్కడ జరుగుతుంది కదా” అతను అడిగాడు.

” అవును. ఇది మేము చూసుకుంటాం. మీకు సంబంధం లేని విషయం. అయినా ఉగ్రవాద కోణం ఉంటేనే మీరు దర్యాప్తు చేయాలని చట్టం చెబుతోంది కదా. ఇందులో ఉగ్రవాద కోణం ఉందని మా దర్యాప్తులో తేలలేదే” డీ జీ పీ సీరియస్ గా అన్నాడు.

” తీహార్ జైల్లో ఉన్న ఒక ఖైదీ మాకు చెప్పాడు. అతను యాసిన్ భత్కల్ కు సహచరుడు. మీకు తెలిసే ఉంటుంది. యాసిన్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు” రాంప్రతాప్ డి జి పి కళ్ళల్లోకి సీరియస్ గా చూస్తూ అన్నాడు.

” అరే. ఒక ఖైది చెప్పాడని మీరు ఈ కేసును మీ ఇష్టం వచ్చినట్టు మీ పరిధిలోకి తీసుకుంటారా” ఆశ్చర్యంగా అడిగాడు డిజిపి.

వాళ్ళు ఏం మాట్లాడకుండా తమ చేతిలో ఉన్న ఉత్తర్వుల కాయితాన్ని డిజిపికి ఇచ్చారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మార్చి 12న రంగంలోకి దిగింది. వజేరాతో సహా పలువురు అధికారులను, స్థానికులను, ఆనంద్ ని విచారించింది. వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. కిటకిటలాడుతున్న మీడియా ప్రతినిధులతో ఆ గది నిండిపోయింది. ఎన్ఐఏ ఏం చెబుతుందనే ఉత్కంఠతో వారు ఎదురు చూస్తున్నారు. రామ్ ప్రతాప్ గ్లాసుడు మంచినీళ్లు తాగి గొంతు సవరించుకుంటూ గంభీరంగా మాట్లాడటం ప్రారంభించాడు.

” పారిశ్రామిక వేత్త ఆనంద్ ఇంటిముందర పేలుడు పదార్థాలతో ఆగిన వాహనం కిరణ్ అనే నగల వ్యాపారిది. అంతకు ముందు, అంటే కొన్ని రోజుల ముందు వరకూ అ స్కార్పియో వజేరా నియంత్రణలోనే ఉంది. అది దొంగలించ బడిందనే తప్పుడు ఫిర్యాదును వజేరా ప్రోద్బలంతోనే, కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజానికి కిరణ్, వజేరాకి చాలా కాలంగా సన్నిహితుడు. అందుకే మేము ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారి అయిన వజేరా ను అరెస్టు చేస్తున్నాం “

” సార్, అంటే కిరణ్ ని వజేరానే హత్య చేసారంటారా” ఒక మీడియా ప్రతినిధి బిగ్గరగా అడిగాడు.

ఇంతటితో ప్రెస్ మీట్ ముగిసింది అన్నట్టుగా ముగ్గురు అధికారులు లేచి ఆ గది నుండి బయటకు వెళ్లిపోయారు. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేదు.

మహారాష్ట్ర ప్రభుత్వం, వజేరా అరెస్టుతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐ ఎ ద్వారా తమపై పెత్తనం కొనసాగించాలని చూస్తోందని వాళ్ళకి అర్థం అయింది. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పెద్దఎత్తున పార్టీ ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ఆనంద్ మొదటివాడు.

దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయు. ఆనంద్ నుండి పెద్ద ఎత్తున ఆ ఎన్నికలకి నగదు బదిలీ కాకూడదనే రాష్ట్రంలోని అధికార పార్టీ అతన్ని ఇరకాటం లో పెట్టాలని ప్రణాళిక వేసింది. కానీ దానికి పై ఎత్తుగా కేంద్రంలో అధికార పార్టీ ఎన్ఐ ఎ ను రంగంలోకి దించి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది.

కేంద్రంలో ఉన్న అధికార పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్న ఒక నాయకుడు ముంబై పోలీస్ కమిషనర్ ని తనను కలవాల్సిందిగా ఆదేశించాడు. నేరుగా ఢిల్లీకి ఫ్లైట్లో లో వెళ్లిన అతను రహస్యంగా ఆ నాయకుడిని కలిశాడు.

” మీ శక్తి సామర్థ్యాలను మీ రాష్ట్ర ప్రభుత్వం సరిగా గుర్తించడం లేదనే విషయం నాకు తెలుసు. మీరు నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి. మీ అంకిత భావాన్ని గుర్తించి మేము మిమ్మల్ని కేంద్ర సర్వీసులకు తీసుకోవాలి అనుకుంటున్నాము. అందుకోసమే మిమ్మల్ని మేము పిలిపించడం జరిగింది”

“సార్ మీకు ధన్యవాదాలు. కానీ నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను” అతి వినయంగా పోలీస్ కమిషనర్ అడిగాడు.

చిరునవ్వులు కొనసాగిస్తున్న రాజకీయ నాయకుడు చిన్నగా అసలు విషయం చెప్పాడు.

“ఏం లేదు చిన్న విషయమే. మీరు నేను చెప్పినట్టు చేయండి. అంతకుమించి ఏమీ మీ దగ్గర్నుంచి ఆశించం”

మరుసటి రోజు ఢిల్లీ నుండి తిరిగివచ్చిన ముంబై పోలీస్ కమిషనర్ పురంధర్ రాష్ట్ర హోం మంత్రి పై తీవ్రమైన విమర్శలు చేస్తూ మీడియాతో మాట్లాడాడు.

“నేను రాష్ట్ర హోం మంత్రి కనుసన్నల్లోనే పని చేశాను. అయితే హోం మంత్రి ముంబైలో ఉన్న రెండు వేల బార్ అండ్ రెస్టారెంట్ ల నుండి నెల మామూలుగా సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి తనకు అప్పగించాలని కోరాడు. అందుకు నేను తిరస్కరించాను. అందుకే నన్ను అప్రధానమైన శాఖకు బదిలీ చేశారు. నా నిజాయితీకి, క్రమశిక్షణకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఇది. నేను వినమ్రంగా ఈ బహుమతిని స్వీకరిస్తున్నాను” అతను ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని కంటి వెంట కన్నీళ్ళు కిందకు జారాయు.

ఈ ఆరోపణ మరుసటి రోజు పత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జరిగాయి. నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కేంద్రంలోని అధికార పార్టీ డిమాండ్ చేసింది.

ఈ పరిణామాలు ప్రజల్లో గందరగోళం నెలకొల్పాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పోలీస్ అధికారులు అసలు నేరస్థులకు అండగా నిలబడటం, సాధారణ ప్రజలను అనుమానితుల పేరుతో అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేయటం ఇవి సాధారణంగా జరిగేవే. ఇది ప్రజలకు తెలిసిందే.

అయితే రెండు రాజకీయ పార్టీల మధ్య అధికార పీఠం కోసం జరుగుతున్న ఘర్షణ ప్రజాస్వామ్యాన్ని అవహేళనకు గురిచేసింది. ఈ ఘర్షణలో బ్యూరోక్రాట్లు బలవుతున్నారు. అలా బలవకుండా ఉండడానికి కొంతమంది ఏదో ఒక పార్టీకి మద్దతుగా మారిపోతున్నారు. ముంబై పోలీసులకు ఎన్ఐఎ కు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. అలాగే కేంద్రంలోనూ, రాష్ట్రంలో ఉన్న రెండు రాజకీయ పార్టీల మధ్య కూడా వైరుధ్యం పెరిగింది. తీవ్రమైన వైరుధ్యాలు ఘర్షణలుగా రూపాంతరం చెందాయు.

అందులో భాగంగానే అధికారం కోసం అనేక రకమైన కుయుక్తులు జరుగుతున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అతి బలమైన ఆయుధంగా ప్రచారం చేయబడింది. రాజకీయ పార్టీలను నమ్ముకున్న ప్రజలు చివరికి ఎవరికో ఒకరికి అధికారాన్ని గత్యంతరం లేక అప్పగిస్తున్నారు.

జైల్లో ఉన్న వజేరాను కలవడానికి అతని న్యాయవాది వెళ్ళాడు.

“మీకు, ముంబై పోలీస్ కమీషనర్ కు మంచి సంబంధాలు వున్నాయి కదా. అతని పరిధి లోనిదే కదా ఆనంద్ కేసు. అందులోను మీ ఇద్దరి ఆఫీసులకి మధ్య దూరం కేవలం 200 అడుగులే. మరి ఎన్ ఐ ఎ అతన్ని ఎందుకు విచారించలేదు. ఇప్పటికి మీకు అసలు విషయం బోధ పడి ఉంటుందనుకుంటున్నా” న్యాయవాది సీరియస్ గా అడిగాడు.

“మొత్తం వాస్తవాలు నాకు చెపితే గాని, నేను మిమ్మల్ని బయటకు తీసుకురాలేను” న్యాయవాది అన్నాడు.

” మీకు తెలియని విషయాలు నా దగ్గర లేవు. నేను ప్రభుత్వం ఏం చెపితే అది చేయాలి. అందులో కొన్ని చట్ట పరిధిని మించి ఉంటాయి. మీకు తెలియంది కాదు. నేను ఇప్పుడు నోరు విప్పితే ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడుతుంది” వజేరా నింపాదిగా చెప్పాడు. అతను జైలు ఊచలకు భయపడే రకం కాదని న్యాయవాదికి తెలుసు.

” మీ మీద ఉపా కేసు పెట్టారు” న్యాయవాది నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో “నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్షా ” అనే వ్యంగం వుంది.

“ఇప్పుడు సమస్య కేసులది కాదు. నేను చేయాల్సిన పనులు చాలా వున్నాయి. నన్ను త్వరగా బెయులు మీద రప్పించే ప్రయత్నం చేయండి. కేసుల కథ ప్రభుత్వం చూసుకుంటుంది” వజేరా తాను బోనులో వున్నా పులే అన్న చందాన మాట్లాడాడు.

” ఈ రాజకీయ వేడి తగ్గేంత వరకు, కొన్నాళ్ళు మీరు జైలులో ఉంటేనే బాగుంటుందని పెద్దాయన భావిస్తున్నాడు” న్యాయవాది నవ్వుతూ అన్నాడు.

” ఎన్నాళ్ళు” వజేరా గొంతు సన్నగా వణికింది.

” ఇంతకీ మీ స్నేహితుడు కిరణ్ ఎలా చనిపోయాడు. మిమ్మల్ని నమ్మి రంగం లోకి దిగిన అతన్ని మీరు కాపాడలేక పోయారా ” న్యాయవాది ప్రశ్నించాడు.

వజేరా మౌనం వహించాడు.

” కిరణ్ కి పట్టిన గతే మీకు పట్టదనే గ్యారంటీ ఏమన్నా ఉందా ” న్యాయవాది నర్మ గర్భంగా అంటూ వెళ్లి పోయాడు.

వజేరా నుదిట మీద చెమటలు పట్టాయ్. అతను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా నిచ్చేస్టుడై నిలబడి పోయాడు.

Leave a Reply