చిటారు కొమ్మ
చేతులు జార్చిన
మిఠాయి పొట్లం
తేనెతుట్టెగ రాలి
అడవి ఎదనంత
కప్పేసినట్టు..

ఉమ్మడి శ్రమలే
విరగబూసి
గదిగదిగూడి
గర్భం దాల్చి
మకరందమంతా
కలపొదిగినట్టు..

కళ్ళు కాగడాల్ జేసుక
కమ్మిన తేనీగలు
ఝుమ్మను నాదాల
సెంట్రి గాసినట్టు…

ఏమిటా జనమూ
లేసెనా రణమూ
వేలకు వేలూ
కూడెనా గణమూ

బస్తరు తెగువది
ఆదివాసి దండది
బాసగూడ పసల్ గూడ
సిలువేరూ సాకేడు

సుట్టెన్ని గూడ్యాలో
సుట్టేసి వొచ్చినయ్
బతుకుల్ని గూల్చేటి
క్యాంపు లొద్దన్కుంట

డ్రోన్ల నెక్కు బెట్కుంట
పానాలు దీసుకుంట
బాంబ్లెయ్య లేదంటు
ఝూట కూతలతోని

రోడ్లేసే సాకుల్తో
రైఫిల్లు డంపేసి
గుండెల్ల గురిబెట్టి
గరిజనుల గాల్చేసి

ఎవర్నేమ్ నమ్మిస్తవ్
వో ఝూటి సర్కార్
దునియంత దెల్సెలే
నీ యాపరేషన్ ప్రహార్

రాసి వున్నది నీకు
రాలిపోవుడు రాత
రాసులాడు తుండవు
రగతాలు పారిచ్చి

కలిగంజి కుండల్లు
పగిలేసి సల్లుడూ
ఆకులలం కొంపల్లు
అగ్గిబెట్టి ముర్వుడూ

ఏయుధ్ధ నీతంటవో జ్ఞానం
యారాజ ధర్మంరా శీలం
నీ బతుకంత దొంగదాడే
జనతన్ల సేతుల్నేమూడే

పొద్దస్తమానమూ పొర్లినా
పొట్టకూ బట్టకే తేలేని తండ్రి
మావొ వాది ఎట్లాయే రోరీ
గర్భమైరాలే నాతల్లి నక్సలా!?

అయితింగ గానిలే
నేనుగూడ నక్సలే..
ఏడొక్లాసే సద్వుతుండ
ఎట్లైతె అట్లాయె ఆదారె నేను..

రాసుకో…రాసుకో…
కెమర కెమర సూస్కో..
బాసగూడ నాఊరు..!
బస్తరు నాబడి..!!

One thought on “బస్తరు నా బడి..!!

  1. 👍✊
    Maa Satyam
    బళ్ళారి
    సంతాల్ రాసిన
    ” బాస గూడ నా ఊరు…! బస్తర్ నాబడి” కవితా శీర్షిక ప్రతీకాత్మకంగా నిరంతర పోరాట గమనాన్ని తెలియజేస్తూన్నది. అక్కడి గ్రామీణ ప్రాంతాల పేర్లు, తెలంగాణ మాండలిక జనపద మట్టి వాసన పరిమళం తో… బస్తర్ నాబడి అంటే జనతన సర్కార్ లో నిర్మాణమవుతున్న ఒక నూతన మానవుడు. నేడు ఆ మానవుడి వైపు ప్రపంచంలోని విప్లవోద్యమ పార్టీలన్నీ కూడా
    ఎంతో ఆశాజనకంగా చూస్తున్నాయి.
    ప్రస్తుత నిర్బంధ కాలంలో అనేక రకాల సమస్యలతో నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతన్న వారికి బలమైన
    ఈ చరణాలు
    ” నేను గూడ నక్సలే… ఏడో క్లాసే సద్వుతుండ ఎట్లయితే అట్లాయె ఆ దారె నేను…” స్ఫూర్తిదాయకమైన
    ముగింపు.

Leave a Reply