సాయంకాలం

సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.
    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.
    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.
    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.
    ‘ఎలా అనుకున్నారు? సర్‌’ యోగక్షేమాలు ఆరా తీస్తున్న మిత్రుడిలా అడిగాడు.
    నేను అంతకంటే కొంచెం గట్టిగా నవ్వాను.
    ఈలోగా ఆ వరండాలో కంప్యూటర్‌ పక్కన ఉండే టీపాయ్‌ పైన ఉండే కాగితాల మీదికి కొందరు పడిపోయారు. వెనుక ఉండే పుస్తకాల రాక్‌ మీదికి ఇంకొంత మంది వెళ్లిపోయారు.
    ఈ అలికిడికి లోపలి నుంచి లత వచ్చింది. ఒక క్షణం కళ్లింత చేసి చూసి, జుట్టు సరి చేసుకుంది. పక్కనే ఉన్న వాటర్‌ క్యాన్‌ మీది గ్లాస్‌తో కాసిన నీళ్లు పట్టుకొని తాగింది.
    ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఏమేం చేస్తుంటారు? ఎన్ని గదులు ఉంటాయి.. వగైరా అడగడం మొదలు పెట్టారు. మా ఇద్దరి ఫోన్లు లాగేసుకున్నారు.
    ‘నేను ఆఫీసుకు వస్తాననుకుంటారు కదా. ఎడిషన్‌ లేటవుతుంది. ఫోన్‌ చేసి చెప్తా..’  అన్నాను.
    ‘చేయండి..’  అని నా ఫోన్‌ ఇచ్చారు. నేను మా ఇన్‌చార్జికి డయల్‌ చేశాను. ఆయన లైన్‌లోకి రాకముందే ఒకతను ఫోన్‌ లాక్కొన్నాడు. ‘హలో.. ఈ రోజు సార్‌ ఆలస్యంగా వస్తారు..’ అని చెప్పేసి టపీమని పెట్టేశాడు. ఆ తర్వాత స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.
    ‘ఈ ఇల్లు సొంతమా? ఇంతక ముందు ఎక్కడ ఉండేవారు?’ అని మొదలు పెట్టారు.
    లతే ముందుకు వచ్చి చెబుతోంది.
    అలా అడుగుతూ, వింటూ వాళ్లు లోపలికి కదిలారు. వరండాలోంచి అవతలి గదిలోకి పోడానికి లత అడ్డం ఉంటే, మేడం పక్కకు జరగండి అన్నారు.  నేనూ వాళ్లతోపాటు నడిచా.
    ఈ అలికిడికి హాల్లో పడుకొని ఉన్న అమ్మ లేచింది. ఇంట్లో ఎప్పుడూ  జనాలు ఉంటారు కదా. అలాగే వచ్చి ఉంటారని ఆమె పట్టించుకోలేదు. ఈలోగా కొందరు మా బెడ్‌ రూంలోకి కూడా వెళ్లారు. ఎక్కడ ఏం లాగిపడేస్తారో.. అని నేను అటువెళ్లబోయాను.
    అమ్మ కాస్త విసుగ్గా.. ‘బాబూ..సుందరయ్యగారు అప్పుడనగా వచ్చారు. కాఫీ అయినా ఇచ్చేది లేదా? అంత పెద్ద కామ్రేడ్‌ వస్తే..అస్తమానం ఆ కంప్యూటర్‌ ముందు కూర్చొని రాసుకోవడమేనా?’ అని అరిచింది.
    అమ్మకు అదో అలవాటు. నేను ఇంట్లో ఉంటే ఏదైనా నన్ను ఉద్దేశించే అంటుంది. అలా అంటూ  చరచరా ఆ గుంపును తప్పించుకొని వంట గది వైపు కదిలింది. అమ్మ నడుస్తూ ఉంటే కొంచెం  ఊగుతుంది. కొత్తవాళ్లయితే ఎక్కడ పడిపోతుందో అనుకుంటారు.
    నేను తలతిప్పి చూశాను.
    అక్కడ ఒకలాంటి కలకలం మొదలైంది. అందులో కంగారు కూడా.  అప్రయత్నపూర్వక సంచలనమేదో హాల్లో జరిగింది. అటూ ఇటూ అప్రమత్త చూపుల వేడి ప్రసరించింది.
    ‘అయ్యో అత్తయ్యా సుందరయ్యగారెక్కడ ఉన్నారు? మీరు ఇటు రండి..’ అని లత అమె చేయిపట్టుకొని మంచం వైపు నడిపించింది.
    ఆ కొద్ది క్షణాల్లోనే వాళ్లంతా ఆయన ఆరా కోసమే చూస్తుండగా.. అమ్మ ‘అదిగో ఆ రూంలో ఉన్నారుగా..’ అని బాత్‌ రూం పక్కన ఉండే స్టోర్‌ రూం వైపు చేయి చూపించింది.
    వాళ్లలో కొందరు ఆ రూం మీదికి పోయారు.
    అమ్మ మంచం మీద కూర్చుండిపోయింది.
    ఆ గదికి గొళ్లెం పెట్టలేదు.  తలుపు దగ్గరికి వేసి ఉంది.  వెళ్లినవాళ్లలో ఒకతను  అలికిడి కాకుండా జంటిల్‌గా  తీద్దామనుకున్నట్లుంది. ఇంకొకరు ధనేల్‌ మంది వైలెన్స్‌ ప్రదర్శిద్దామనుకుంది. ఆ రెండూ కాకుండా అదోలా ఆ తలుపు తెరుచుకుంది.
    నేను బెడ్‌ రూంలోంచి బైటికి వచ్చాను. విచిత్రం ఏమంటే అక్కడ నేనొక్కడినే ఉన్నా. మిగతా వాళ్లంతా ఆ కొద్ది క్షణాల్లోనే  హాల్లోకి వచ్చారు. ఆ స్టోర్‌ రూం హడావిడిలో ఉన్నారు.
    అందులో ఒక   మంచం, అంతగా ఉపయోగపడని పాత పుస్తకాల ర్యాక్‌, బియ్యం సంచిలాంటివేవో పెట్టుకుంటాం. తలుపు తీయగానే ఖాళీ మంచం.. నేనూ సుందరయ్యగారి కోసం చూస్తున్నానా? కొంపదీసి!  దుమ్ముపట్టి, నిరాదరణగా ఉన్న గదిలో భరించలేని కాంట్రాస్ట్‌ కనిపించింది.
    వాళ్లు దూసుకెళ్లి మంచం కింద చూశారు. ర్యాక్‌ వెనక తొంగి చూశారు. బియ్యం బస్తాను కదిలించారు.
    ‘ఎవరూ లేరే..’ అని నన్ను అడిగారు.
    ‘ఉంటే కనిపిస్తారు కదా?’ అని నేను ఎదురు ప్రశ్న వేశాను.
    లేడని నిర్ధారించకున్నారు.
    అమ్మ మంచం మీద లోపలికి జరిగి గోడకు దిండు ఆనించుకొని ఇదేమీ పట్టించుకోకుండా కొంచెం ఒరిగింది.
వాళ్లలో కొందరు మళ్లీ బెడ్‌ రూంలోకి వెళ్లారు. పరుపు ఎత్తి కింద ఏముందో అని చూశారు. కొందరు మంచం మీదికెక్కి అటక మీద ఉంటే పుస్తకాలు, కాయితాల డబ్బాలు కిందికి దించి చూస్తున్నారు. బట్టలు పెట్టుకొనే కప్‌బోర్డు తీశారు.  బట్టలు అటూ ఇటూ తిప్పేసి వెతికారు. కొన్ని బట్టల వరుసలు కింద పడిపోయాయి. అన్నీ వెతికి మళ్లీ మట్టసంగా ఎత్తిపెట్టారు.
    లత హాల్లోనే ఉంది. హాల్లోని పుస్తకాల ర్యాక్స్‌ కొందరు గాలిస్తుంటే, కొందరు బైటి గదిలో ఒక్కో కాయితం తీసి పరికిస్తున్నారు. నేను అక్కడేం చేస్తున్నారో అని అటూ ఇటూ తిరుగుతున్నా.
    ఇంతలో యూనిఫాంలో ఉండే పోలీసులు నలుగురు గ్రిల్‌ తీసుకొని వచ్చారు. వాళ్లు రాగానే మొదటి బ్యాచ్‌లో ఒకాయన వెళ్లి  గ్రిల్‌ గొళ్లెం పెట్టేశాడు.  బైటి నుంచి ఎవ్వరూ రాకుండా. లోపలి నుంచి పోకుండా.  
     వాళ్లలో మా ప్రాంతపు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఉన్నాడు. రాగానే నన్ను చూసి నవ్వాడు.  కలెక్టరేట్‌ పక్కనే వాళ్ల స్టేషన్‌. అక్కడ  ధర్నాలు జరిగినప్పుడల్లా కనిపిస్తుంటాడు.
    అమ్మ వాళ్లను చూసింది. ఆత్రంగా కుడి చేయి ఊతం మీద లేస్తూ.. ‘బాబూ.. పోలీసులు వచ్చార్రా.  పార్టీ కాయితాలు ఒక్కటి కూడా కనిపించకుండా తీసిపెట్టు..’ అని నాకేసి చూస్తూ గట్టిగా అరిచింది.  
    అంతే. వాళ్లు అలర్ట్‌ అయిపోయారు. ఇల్లంతా జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. ఎర్రట్టలు, స్వేచ్ఛా ప్రతీకలు, ఆగ్రహ ప్రకటనలు, జనం గుంపులు కనిపించిన పుస్తకాలన్నీ ఓ పక్క గుట్టగా పడేస్తున్నారు. ఏ పుస్తకం ఎక్కడ అచ్చయిందీ, అందులో ఏముండేదీ తెలుగు రాని వాళ్లు వచ్చిన వాళ్లను అడిగి తెలుసుకుంటున్నారు. విడి కాయితాలు ఒక్కొక్కటే తీసి తీక్షణంగా చూస్తున్నారు. చేతి రాత కాయితాలయితే మరీ.
    ఆ కాయితాలెక్కడ అని నన్ను అడుగుతారేమో అనుకున్నా. అడగలేదు. వెతికితే దొరుకుతాయి కదా అనుకున్నట్లుంది.
    అమ్మ ఆందోళనపడుతోంది. లేచి అటూ ఇటూ తిరగబోతోంటే లత ‘ఏంకాదు.. మీరు కూర్చోండి..’ అని మంచం దగ్గరికి తీసికెళ్లింది. శాంతపరిచింది. అయినా ఆమె ఉద్వేగం తీరలేదు. లత నీళ్లు తెచ్చి ఇచ్చింది. అమ్మ తాగకుండా పక్కనపెట్టేసింది. ఆమె బాగా డిస్ట్రబ్‌ అయిపోయింది.
    అమ్మకు బాగోదనే సంగతి డాక్టర్‌కు, మా ఇద్దరికే తెలుసు. ఇంకెవరితో అనం.  అలా చెప్పడం ఆమె గౌరవానికి భంగం అని మా అభిప్రాయం.  మాలో మేం కూడా నోరు తెరిచి ఆమెకు బాగోదని అనుకోం. అమ్మకు  పాత విషయాలే అప్పుడప్పుడూ గుర్తుకొస్తుంటాయి. ఇప్పటివి ఏవీ ఎక్కవు.
    ఒక్కోసారి పొద్దున్నే కాఫీ తాగి అరగంటయ్యాక ‘నాకు కాఫీ ఇవ్వలేదే’ అంటుంది.
    ‘ఇందాకే తాగావు కదా’ అంటే.. అట్లనా .. అని మౌనంగా ఉండిపోతుంది.  లేదా  మీరు నన్ను పట్టించుకోవడం లేదు.. అన్నట్లు   చీరె చెంగు భుజం నిండా కప్పుకొని బుంగమూతి పెట్టి నేలకేసి అలకగా చూస్తుండిపోతుంది. ఏదైనా చేయవచ్చు. కాఫీ మళ్లీ తెచ్చిస్తే ఒకసారి మౌనంగా తాగుతుంది. మరోసారి ‘వద్దులే..’ అని పక్కన పెట్టేస్తుంది.
    వీళ్ల వ్యవహారం  ఇప్పుడయ్యేది కాదని నేను హాలు మధ్యలోకి కుర్చీ లాక్కొని కూర్చుండిపోయాను.
    రెండు గంటలు, మూడు గంటలు .. సోదా నడుస్తోంది. చాలా నిశ్శబ్దం. వాళ్లలో వాళ్లు కూడా మాట్లాడుకోవడం లేదు. పుస్తకాలు, కాగితాలు లాగిపడెయ్యడమే పని. వాటిలో ‘ప్రమాదకర’మైనవన్నీ తీసి పెట్టుకుంటున్నారు. ఏదో డౌట్‌ వస్తే పిలుస్తున్నారు. నేనో, లతో వెళ్లి చెబుతున్నాం.
    ఫొటోలు, సీడీలు, మిత్రులు రాసిన ఉత్తరాలు, మీటింగ్‌ల్లో మాట్లాడటానికి చేసుకున్న ప్లానింగ్‌ పేపర్లు, రాయాలనుకున్న వాటికి సిద్ధం చేసుకున్న నోట్స్‌లు, ముఖ్యమైన పేపర్‌ కటింగ్స్‌… అలా అన్నీ వాళ్లు తెచ్చిపడేస్తుంటో, తీసి తీసి చూస్తుంటే.. ఇవన్నీ మనింట్లోనే ఉన్నాయా? అనిపించింది. ఎన్ని అద్భుత జ్ఞాపకాలు, వాటిలో ఎన్ని కన్నీళ్లు, ఎన్ని భావోద్వేగాలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఆలోచనా తరంగాలు.. ఇన్ని దాగి ఉన్నాయా?  మనుషులు తమను తాము భద్రపరుచుకోడానికి అక్షరాలు తప్ప ఇంకే సొరుగులు ఉంటాయి?  
    ఇంతకూ ఈ సంగతి బైటికి పొక్కిందా? లేదా? అనే ఆలోచనలో పడ్డాను.
    అమ్మ మళ్లీ లేచింది. అప్పటికల్లా ఇల్లంతా తుఫాను తాకిడికి గురైనట్లు ఉంది. పుస్తకాలు, కాయితాలు మేట వేసినట్లు కనిపిస్తోంది. లేచి స్టోర్‌ రూం వైపు తొంగి చూసింది. వాకిట్లో పుస్తకాల గుట్టలు..
    ‘బాబూ.. నా పాటల పుస్తకంరా. దాన్నీ తీసికెళ్లిపోతున్నారా? రేపు మేడే మీటింగ్‌లో  పాడాలి. ఆ పుస్తకం లేకుంటే నాకు  పాటలు గుర్తురావడం లేదు.. ’ అని ఏడుపు గొంతుతో అన్నది. చిన్న పిల్ల మారాంలా అన్నది.
    మళ్లీ అందరూ తిరిగి చూశారు. ఆ పుస్తకం కోసమేనా? అన్నట్లు సీరియస్‌గా గాలింపులో పడ్డారు.
    అమ్మ మురిపంగా, ఇష్టంగా పాడే పాటలన్నీ ముత్యాల్లాంటి అక్షరాలతో ఏనాడో రాసి పెట్టుకుంది. ముట్టుకుంటే కాయితాలు నుసి అయిపోయేలా తయారైంది. అమ్మకు ఎప్పుడు గుర్తుకొస్తుందో చెప్పలేం. అడగ్గానే తీసి ఇవ్వాలి. ఈ మధ్య చాలా ఏళ్లయింది మర్చిపోయి. ఆ మధ్య దేని కోసమే వెతుకుతోంటే కనిపించింది. పాత అట్ట తీసి కొత్తగా అట్టవేసి దులిపి పెట్టాను. ఎక్కడ పెట్టానోమరి. ఈ గందరగోళంలో ఏమైపోయిందో. ఇప్పుడు దాని గురించి అమ్మకు ఏమీ చెప్పలేను. ఉందిలే అనే భరోసా కూడా ఇవ్వలేను.
    నేనేమీ చెప్పకపోయే సరికి లోపల్లోపల గొణుక్కొంటూ కూర్చుండిపోయింది. నేను అటే చూస్తుండిపోయాను. అమ్మ చెంపల మీద కన్నీళ్లు. బాగా బాధపడుతోంది. ఈ మధ్య అమ్మ ప్రవర్తనలో అలక, కోపం, బాధ కనిపిస్తున్నాయి కానీ, అవి హృదయం లోతుల నుంచి రావడం లేదు. దీనికి ఒకింత నేను సంతోషిస్తుంటాను. కానీ ఇప్పుడు మాత్రం ఆమె మనసులో అలజడి రేగుతున్నట్లుంది.
    ‘పాటల పుస్తకం తీసకపోతే ఎట్ల?’ అని చిన్నగా అనుకున్నట్లుంది.
    నాకు పూర్తిగా వినపడలేదు. లత వెళ్లి చీర చెంగుతో కన్నీళ్లు తుడిచింది. చెదిరిపోయిన జుట్టును సవరించింది. కాసేపు అట్లనే విచారంగా కూర్చుండిపోయింది. అప్పుడప్పుడు కూర్చొని కూడా మగత నిద్రలోకి వెళ్తుంది. ఇప్పుడలాంటి స్థితిలో ఉంది.
    రాత్రి ఎనిమిది గంటలైంది. అన్నీ మూటలు కట్టుకున్నారు.  సంతకాలు పెట్టించుకున్నారు. పుస్తకాల గుట్టలు దాటుకొని వెళ్తోంటో అమ్మ మళ్లీ లేచింది.
    ‘నా పాటల పుస్తకం రా.. ఇప్పుడెట్లా..’ అని నా వైపు చూస్తూ వాళ్ల వైపు చేతులు సాచి ఆగమన్నట్లు వెనుకే పోయింది.
    వాళ్లు గేటు తీసుకొని వెళ్లిపోయారు.
    0    0    0
    మళ్లీ అదే ప్రశ్న.
    అదే జవాబు
    ఇంకో ప్రశ్న. మొదటి దాని చుట్టే.
    ‘మాకే సంబంధాలు లేవు…’ పదే పదే అదే సమాధానం చెబుతోంటే వాళ్లకు మాత్రం విసుగు రాదూ.
    విశాలమైన హాలు. ఏసీ. కెమేరాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కదా. టేబుల్‌కు ఆ వైపు  దూర దూరంగా నలుగురు ఆఫీసర్లు. ఇటు నేను. ఎంత ప్రశాంతమంటే లోపల ఏం ఆలోచించుకొనేదీ బైటికి వినిపించేలా ఉంది. భావోద్వేగమో, అలసటో, విసుగో.. ఏదైనా ఇట్టే పసిగట్టేలా ఆ వాతావరణం ఉందా? అనిపించింది. మనమేమిటో తెలియకూడని వాళ్లకు తెలిసేలా ఉండటమే ఒక అభద్రత.
    మళ్లీ సంబంధాలు లేవనే సమాధానం.
    విచిత్రం.. మానవ సంబంధాల పట్ల ఆర్తితో ఉండమని  చెప్పే నేను  సంబంధాలపట్ల తృణీకరణను ప్రదర్శించడం  ఏమిటి? అవి ఏ సంబంధాలైనా సరే. సంబంధాలు లేవు.. లేవు.. అని నేను అనడం! ఉన్నాయని వాళ్లు ఒప్పించాలనుకోవడం!
    మొత్తానికి ఈ లోకం సంబంధాల చుట్టూ మల్లగుల్లాలు పడుతోందన్నమాట.
    ఆ క్షణాన కూడా అమ్మ గుర్తుకొచ్చింది.  ఏ పురా జ్ఞాపకం మొదలడమైనాసరే ఆమెకు ఎవరితోనైనా సంబంధాన్ని ప్రకటించుకోవడమే. దాన్ని తలుచుకొని ఒకసారి దు:ఖపడుతుంది. ఎంత మంచి మనుషులు! అని సంభ్రమానికి లోనవుతుంది. ఒక్కోసారి వాళ్లతో తన పరిచయాన్ని వైన వైనాలుగా చెబుతుంది. ఇప్పుడామెకు వాటిని పదిలపరుచుకొనే శక్తి లేదు. ఏదైనా కాసేపే. ఆ తర్వాత దాన్నుంచి బైటికి వచ్చేస్తుంది. మర్చిపోతుంది. ఖాళీగా ఉన్నట్లనిపిస్తుంది. మళ్లీ ఎప్పుడో. అట్లా  ఏది గుర్తుకు వచ్చినా అదొక సంబంధమే అయి ఉంటుంది.
    ఇలాంటప్పుడే సంబంధాల్లో లేనివి ఏవీ  మనుషుల చుట్టూ ఉండవనిపిస్తుంది.
    ‘నా మీద పెట్టిన కేసుకు మీ ప్రశ్నలకు  ఏ సంబంధం లేదే?’  అని నేనూ సంబంధాల ప్రశ్నే వేశాను.
    ‘మీ ఆలోచనలకూ, మాకూ సంబంధం ఉంది’
    ‘ఆ కేసులో ఏ నేరమూ లేదు’
    ‘అందులో ఆలోచనలు ఉన్నాయి’
    ఆకర్షణీయమైన ముఖాల నుంచి కరకు ప్రశ్నలు.
    గంటలు గడిచి పోతున్నాయి.
    మధ్యలో   ‘టీ తాగుతారా సర్‌..’ అని ఆఫర్‌ చేశారు. కొంచెం తేలికపరుస్తూ సంభాషణలోకి లాక్కెళ్లారు. మళ్లీ తమకు కావాల్సిన చోటికి తీసికెళ్లారు. కొన్ని డజన్ల మంది వ్యక్తుల గురించి ఆడిగారు.
    తెలుసా? ఎలా తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు?
    తెలిసిన వాళ్ల గురించి నింపాదిగా, యథాలాపంగా తెలుసు.. తెలుసు అని చెప్తూ పోతుంటే మధ్యలో తెలియని వాళ్ల పేర్లు..
    వాళ్లూ తెలుసు అంటానని.
    ఆ మహా భవంతిలోకి అడుగుపెడుతున్నప్పుడే నా తెలివిడికి ఇదొక పరీక్ష కదా అనిపించింది. మన పాదాల అలికిడే మనకు వినిపించే ప్రశాంతత. అది చాలదూ. ఇంకో భయహేతువు ఉండాలా? ఎటు చూసినా నలుగురు కనిపించలేదు.
    ‘టిఫిన్‌ చేశారా?’ అనే పలకరింపుతోనే మాటలు మొదలయ్యాయి.
    అమ్మ గురించి అడిగారు. చెప్పాను.
    ‘ఆమె కూడా కామ్రేడా?’ సూటిగా చూస్తూ ఒకాయన అడిగాడు.
    ‘కామ్రేడ్‌ అమ్మ’
    ఆ మాటకు అర్థం ఏమిటి? అన్నట్లు లోతుగా మిగతా అందరూ చూశారు.
    ఈ నడమ అమ్మ బాగా సతాయిస్తోంది. అలసటనిపిస్తోంది.  కానీ ఇప్పుడామె గురించి మాట్లాడుతోంటే నాకే తెలియని నిండుదనం !
    మళ్లీ సంబంధాల గురించే ప్రశ్నల పరంపర.    
    ‘సంబంధాలు లేకుంటే వాళ్లు చనిపోయినప్పుడే ఎందుకు కవిత్వం రాస్తారు, వ్యాసాలు రాస్తారు? మా వాళ్లు చనిపోయినప్పుడు ఎందుకు రాయరు?’
    ‘సాహిత్యం ఏ చావునూ, హత్యాఘటనను సమర్థించదు’
    ‘మరి వాళ్లనే అమరవీరులని పొగుడుతారు కదా’
    ‘మీ వాళ్లను  ప్రభుత్వమే అమరవీరులంటుంది కదా’
    దాన్ని ఇక కొనసాగించదల్చుకున్నట్లు లేదు. ‘మీరు ఏ పత్రికలో పని చేస్తారు?’ అని అడిగారు.
    ఆ విషయం అడగడం మూడోసారి.
    చెప్పాను.
    ‘అది ఏ పార్టీకి దగ్గరిగా ఉంటుంది?’
    చెప్పాను.
    ‘మరి మీలాంటి వాళ్లకు ఉద్యోగం ఎలా ఇచ్చారు?’
    దీనికి ఏం సమాధానం చెబుతాం. పైగా అది ఇచ్చిన వాళ్ల సమస్య. నేనెందుకు చెప్పాలి? మౌనంగా ఉండిపోయాను.
    మళ్లీ వేరే ప్రశ్నలు. అటు ఇటూ తిరిగి ఉద్యోగం దగ్గరికే. ఊరుకుండిపోయాను. వదిలిపెట్టలేదు.   నాలుగోసారి. ఐదోసారి. విసుగొచ్చేసింది.
    ‘రచయితగా నాకున్న గుర్తింపు వల్ల ఇచ్చారు?’
    ‘అదీ.. మీరు బైట రచయితలుగా, మేధావులుగా గుర్తింపు తెచ్చుకొని క్రిమినల్స్‌ను సపోర్ట్‌ చేస్తున్నారు.  మీ ఆలోచనలే క్రైమ్‌’
    మధ్యాన్నం మూడు గంటలైంది. దేనికో ఒక్కొక్కరే బైటికి వెళ్లిపోయారు. ఆ హాలులో నేను ఒక్కడినే.
    కిటికిలోంచి బైటికి చూపు సారించాను. ఆఫీసు ప్రాంగణంలో పచ్చని మొక్కలు, ఏపుగా పెరుగుతున్న సస్య సౌందర్యం. ఇంకా అవతలికి చూస్తే అంతా కొండలు గుట్టలు.
    ఊరికి దూరంగా  ఆఫీసు కట్టుకున్నారు. లేచి కిటికీ దగ్గరికి వెళ్లాను. అటూ ఇటూ, సుదూరంగా పెద్ద పెద్ద భవంతులు. ఇంతకూ ఈ నేర పరిశోధన వ్యవస్థ ఊరికి దూరంగా ఈ బిల్డింగ్‌లో ఉందా? ఈ వ్యక్తుల మీద ఆధారపడి ఉందా? ఉదయం నుంచి కొన్ని గంటల సంభాషణలో నాకేం అర్థమైందంటే.. ఇది కేవలం సోదాలు, దాడులు, అరెస్టులు, నేర పరిశోధనలు, నేర జాబితాల తయారీకి సంబంధించిందే కాదు. ఇది ఎవరో దఖలు చేసిన అధికారం మీద పని చేస్తున్నదే కాదు. ఒక బలమైన ఐడియాలజీ మీద నిర్మాణమైంది కదా! అనిపించింది.
    మళ్లీ వచ్చి నా సీట్లో కూర్చున్నాను. టేబుల్‌ మీద ఉండే బాటిల్‌ తీసుకొని కాసిని నీళ్లు తాగేశాను. రాబోయే మరిన్ని ప్రశ్నలను ఊహిస్తూ గడిపాను.
    కాసేపయ్యాక మళ్లీ వచ్చారు. మొదలు పెట్టారు.
    సంబంధాల గురించిన చర్చ అంతా ఆలోచనల మీదికే వెళుతోంది. చాలా నాజూకుగా, స్మార్ట్‌గా సాగే వ్యవహారం లోపల ఎంత క్రౌర్యం ఉంది?
    విసుగు తెప్పించారు. ‘నాకు అలాంటి ఆలోచనలు ఉన్నాయి. వాటి మీద నమ్మకం  ఉంది’ అనేశాను.
    ‘అదే నేరం. మీ ఆలోచనలతోనే వాళ్లు బలపడుతున్నారు. ఈ దేశ ప్రజల లక్షల కోట్లు ఖర్చు పెట్టి, మేం వేలాది మంది ప్రాణాలు బలిపెట్టినా వాళ్లను స్మాష్‌ చేయలేకపోతున్నాం. మీరు యాంటీ పీపుల్‌’
    ఆ భాష నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎట్లయితేనేం వీళ్లూ ప్రజల దగ్గరికే వచ్చారన్నమాట.
    రాత్రి ఎనిమిదైంది.
    ఇక ముగుస్తుందేమో అనుకున్నాను.
    ఈ ముగింపు ఎలా ఉండబోతోంది? బహుశా సంబంధాల మీద సంతకం పెట్టించుకుంటారు కావచ్చు. కనీసం వేరే వాళ్లకు సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోలు తీసుకుంటారు కావచ్చు. లేదా ఇక మీద చదవను, రాయను, ఆలోచించను అని సంతకం తీసుకుంటారు కావచ్చు. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చేస్తారు కావచ్చు..
    వెంట రెడీగా తెచ్చుకొని  కుర్చీ పక్కనే పెట్టుకున్న నా బట్టల బ్యాగు మీదికి చేయి వెళ్లింది.
    ‘ఇక వెళ్లండి. మళ్లీ పిలిచినప్పుడు రావాలి..’ అన్నారు.
    0    0    0
    సెక్యూరిటీని దాటుకొని బైటి గేటు దగ్గరికి వచ్చాను. సెల్‌ ఆన్‌ చేశాను. లత నుంచి ఐదారు మిస్‌డ్‌ కాల్స్‌. ఆదుర్దాగా డయల్‌ చేశాను.
    మొదటి మాటగా ‘అయిపోయింది. నో ప్రాబ్లెం’ అన్నాను.
    మధ్యాన్నం నుంచి ఫోన్‌ చేయమని అత్తయ్య ఒకటే గొడవ పడుతోంది. పాటల పుస్తకం తీసుకొని రమ్మని..ఒకసారి మాట్లాడు..’ అని అమ్మకు ఇచ్చింది.
    దాని గురించి ఏం చెప్పాలి?  ఇప్పుడు ఏదో ఒకటి చెప్పవచ్చు. అది మర్చిపోతే సరే. గుర్తు పెట్టుకుంటే ఇక దాని మీదే ఉంటుంది.. ఎలా అనుకుంటూ హలో అమ్మా.. అన్నాను.
    కానీ ఆమె దాని గురించి మాట్లాడలేదు.
    ‘బాబూ.. ఒక్కరి పేరు కూడా చెప్పొద్దురా. నువ్వు చెబితే వాళ్లను చంపేస్తారు..’ అని వలవల ఏడుస్తోంది.
    నాకు దు:ఖం అగలేదు. తమాయించుకోడానికి రెండు నిమిషాలు పట్టింది.
    ఆ తర్వాత ఉదయం నుంచి అనుభవించిన ఒత్తిడి అంతా ఎగిరిపోయి తేలికపడ్డాను.

Leave a Reply