గడిచిన జూలై నెలలో బొంబాయి హైకోర్టు, స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు రెండు బాంబు పేలుళ్ల కేసుల్లో రెండు ఆసక్తి దాయకమైన తీర్పులు ఇచ్చాయి. రెండిరట్లోనూ ప్రాసిక్యూషన్‌ ముద్దాయిలు నేరం చేశారని నిరూపించలేకపోవడం వల్ల నిర్దోషులుగా విడుదలయ్యారు. మొదటిది 7/11 వరుసగా రైళ్లలో బాంబులు పేలిన కేసు. అందులో 189 మంది చనిపోయారు. వందలాదిమంది గాయపడ్డారు. అది 2006 జూలై 11న జరిగింది. ఏ.టి.ఎస్‌. గా పిలిచే యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఈ కేసులో విచారణ చేపట్టింది. 19 సంవత్సరాలు హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఇందులో ఒకరు 2017 లోనే నిర్దోషిగా విడుదలై మిగతా 12 మంది మహారాష్ట్రలో పూనే, నాగపూర్‌, నాసిక్‌ జైళ్లలో ఉన్నారు. వీళ్లలో మోకా (మహారాష్ట్ర ఆర్గనైజ్డ్‌ కోఆర్డినేటెడ్‌ క్రైమ్‌ విచారణ) చట్టం కింద మోకా స్పెషల్‌ సెషన్స్‌ కోర్టు ఐదు మందికి ఉరిశిక్షలు, ఏడుగురికి కఠిన యావజ్జీవ శిక్షలు విధించింది. వాళ్లలో ఉరిశిక్షలు పడినవారు: 1. కమల్‌ మొహమ్మద్‌ అన్సారీ(50) నాగపూర్‌ జైల్లో 2021లో కోవిడ్‌తో మరణించాడు. 2. మహమ్మద్‌ ఫైజల్‌ అతావుర్‌ రహ్మాన్‌ షేక్‌ (50) ఎరవాడ జైలు, పూనే. 3. ఏ జె షామ్‌ సిద్ధికీ (42) 4. నవీద్‌ హుస్సేన్‌ ఖాన్‌ రషీద్‌ (44) 5. అసీఫ్‌ ఖాన్‌ బషీర్‌ ఖాన్‌ (52) ఎరవాడ జైలు, పూనే.

జీవిత ఖైదు పడిన వాళ్ళు : 1. మజీద్‌ మహమ్మద్‌ షఫీ (46) 2. తన్వీర్‌ అహ్మద్‌ మహమ్మద్‌ ఇబ్రహీం అన్సారీ 3. షేక్‌ మహమ్మద్‌ అలీ (55) 4. మహమ్మద్‌ సాజిద్‌ మురుగబ్‌ అన్సారీ.. (47) 5. ముజిమ్మిల్‌ అతావుర్‌ రహ్మాన్‌ షేక్‌ (40) 6. సుహేల్‌ మహమూద్‌ షేక్‌ (55) 7. జమీర్‌ అహ్మద్‌ లతీఫ్‌ రహ్మాన్‌ షేక్‌ (50) ఈ 5G7R12 మందిలో హైకోర్టు తీర్పు వచ్చిన రోజే 8 మంది విడుదలయ్యారు. ఒకరు కమల్‌ అహ్మద్‌ జైల్లోనే చనిపోయాడు. పైజల్‌ పై మరో కేసు ఉన్నందున విడుదల కాలేదు.

ఈ తీర్పు జూలై 21, 2025న వెలువడిరది. ఈ వార్త ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో 6, 7 పేజీల్లో వచ్చింది. ఈ బొంబాయి ట్రైన్‌ బాంబు బ్లాస్ట్‌ కేసు విచారణ చేపట్టిన ఎటిఎస్‌ చీఫ్‌ రఘువంశి కె.పి. ఈ కేసు విషయంలో స్టేట్‌ సుప్రీంకోర్టులో అపీల్‌ చేయాలని వెంటనే ప్రకటన ఇచ్చాడు. ఈ తీర్పు షాకింగ్‌ గా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వెంటనే మీడియాతో చెప్పాడు. దీనిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామన్నాడు.

“మాకందరికీ ఇది షాకింగ్‌ తీర్పు. ఎందుకంటే కింది కోర్టు ఇదే చార్జిషీటు, ఇతర డాక్యుమెంట్ల మీద ఆధారపడి ఇదివరకే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేనింకా చదవలేదు. మేము సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం. నేను ఇప్పటికే దీని గురించి లాయర్లతో మాట్లాడాను అన్నాడు. బిజెపి నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి చంద్రశేఖర్‌ బవాకులే రాష్ట్ర ప్రభుత్వం ఇది సమీక్షించి సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే నిర్ణయం తీసుకుంటుందన్నాడు. బిజెపి సీనియర్‌ నాయకుడు కిరిత్‌ సోమయ్య నేర విచారణతో పాటు న్యాయం విషయంలో నిర్వహణలో సమస్యలు ఉన్నంత మాత్రాన న్యాయం నిరాకరించ బడకూడదన్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయంలో ఒక స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం (ఎస్‌ఐటి) వేసి, బలమైన న్యాయ నిపుణుల పానెల్‌ వేసి సుప్రీంకోర్టును కదిలించాలని కోరాడు. శివసేన నాయకుడు సంజయ్‌నిరుపమ్‌ కూడ మళ్లీ విచారణ జరిపి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్‌ చేయాలన్నాడు.

అదే రోజు మహారాష్ట్ర ప్రభుత్వం (స్టేట్‌) సుప్రీంకోర్టులో అపీల్‌ చేసి స్టే కోరింది. సుప్రీంకోర్టు 25న ఈ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి నిర్దోషులుగా విడుదలైన వారి విషయంలో విడుదలను అనుమతించింది.

మహారాష్ట్రలోని మాలేగాఁవ్‌ (నాసిక్‌ కు ఈశాన్య దిక్కున ఉన్న పట్టణం)లో ప్రెషర్‌ కుక్కర్‌ బాంబు పేలుడు కేసులో “ముద్దాయిలపై బలమైన అనుమానమే కానీ, రుజువు చేయలేకపోయారని 2008 మాలేగాఁవ్‌ బాంబు పేలుళ్ల కేసులు ముద్దాయిలందరిని నిర్దోషులుగా ప్రకటించింది. జూలై 31, 2025న ముంబైలోని స్పెషల్‌ జడ్జి సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఒక మోటార్‌ సైకిల్‌ కు కట్టిన ప్రెషర్‌ కుక్కర్‌ 2008 సెప్టెంబర్‌ 29న మాలేగాఁవ్‌లో పేలింది. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో రంజాన్‌ రోజుల్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ కేసును మొదట ఎటిఎస్‌ చేపట్టింది. అప్పటి రఘువంశ్‌ చేతిలో నుంచి ఎటిఎస్‌ చీఫ్‌ గా హేమంత్‌ కర్కరే నియమితుడయ్యాడు. మోటార్‌ సైకిల్‌ నెంబర్‌ని బట్టి ప్రగ్యా ఠాకూర్‌ తదితరులను ముద్దాయిలుగా భావించారు. వాళ్లందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు (6) మరణించారు. వంద (100) మంది గాయపడ్డారు. అందరికి అందరూ ముస్లింలే. బొంబాయి రైలు పేలుళ్లలో మరణించిన వారిలో ఫస్ట్‌ క్లాస్‌ కంపార్ట్మెంట్లలో పేలుళ్లు జరిగి 159 మంది అన్ని మత విశ్వాసాలు కలవారు మరణించారు. వందల సంఖ్యలో అన్ని మతాలవారు గాయపడ్డారు.

ఇందులో అభినవ్‌ భారత్‌ అనే హిందూ అతివాద సంస్థకు చెందిన సభ్యులు, నాయకులు వారు. మాజీ బిజెపి ఎంపి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ (సాధ్వి అని కూడా అంటారు) 2. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ 3. మేజర్‌ రమేష్‌ ఉపాధ్యాయ (విశ్రాంత సైన్యాధికారి) 4. అజయ్‌ రోహిత్కర్‌ 5. సమీర్‌ కులకర్ణి 6. సుధాకర్‌ చతుర్వేది 7. సుధాకర్‌ ద్వివేది.

2008లో ఏ టి ఎస్‌ చీఫ్‌ గా హేమంత కర్కరే నియమింపబడి ప్రగ్యా ఠాకూర్‌ పేర రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారు సైకిల్‌ నెంబర్‌ ను బట్టి తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇందులో అభినవ్‌ భారత్‌కు సంబంధించిన హిందూ అతివాద సంస్థ సభ్యులందరిపై కేసు నమోదు చేశారు.

2016లో ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ చేపట్టింది. 2017 నాటికే, అంటే 7, 8 సంవత్సరాలు మాత్రమే జైల్లో ఉండి వీళ్ళందరూ బెయిల్‌ పై విడుదలయ్యారు.

‘‘టెర్రరిజంకు మతం ఉండదు. ప్రపంచంలో ఏ మతం కూడా హింసను ప్రబోధించదు ‘‘అని స్పెషల్‌ కోర్టు జడ్జి లాహోటి తీర్పులో రాశాడు గాని అభినవ్భారత్‌ సంస్థ వీడి సావర్కర్‌ స్థాపించి, గాంధీ హంతకుడైన నాథూరామ్‌ గాడ్సే అన్న కూతురు పునరుద్ధరించింది.

సావర్కర్‌ సాయుధ పోరాటం చేయడానికి 1904లో స్థాపించిన 1947లో స్వాతంత్రం లభించింది గనుక అవసరం తీరిందని ఈ సంస్థను 1952లో రద్దు చేశాడు.  ఈలోగా ఆయన అండమాన్‌ జైలు నుంచి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వానికి పలుమార్లు క్షమాపణ పత్రాలు రాసి, హిందువులకు బ్రిటిష్‌ వలస సామ్రాజ్యవాదులు కాదు ముస్లింలు ప్రధాన శత్రువులని హిందువుల కోసం హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని పిలుపు ఇచ్చాడు. ఆయన ప్రోత్సాహంతోనే 30 జనవరి 1948న నాథూరామ్‌ గాడ్సే గాంధీని బిర్లా ప్రార్థనా మందిరం, ఢల్లీిలో కాల్చి చంపాడు. అభినవ్‌ భారత్‌ను రద్దు చేసిన సావర్కర్‌ తర్వాత గతంలో ఆ సంస్థలో పనిచేసిన వాళ్లందరినీ భారత సైన్యంలో చేరవలసిందిగా పిలుపు ఇచ్చాడు. ఆ విధంగా ఆయన అన్న నారాయణ సావర్కర్‌ కోడలు హిమాని సావర్కర్‌, కొంతమంది మేధావులు, చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలతో కలిసి 2006లో అభినవ్‌ భారత్‌ ని పునరుద్ధరించింది.

ఈ సంస్థకు అధ్యక్షురాలైన హిమాని సావర్కర్‌ నాథూరామ్‌ గాడ్సే పెద్దన్న గోపాల్‌ గాడ్సే కూతురు కూడా సైన్యంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న పురోహిత్‌ ఈ అభినవ్‌ భారత్లో క్రియాశీల పాత్ర నిర్వహించాడు.

2016లో బెయిల్‌ పొందాక మళ్లీ ఆయన ఉద్యోగంలో చేరాడు. ఉపాధ్యాయ రిటైర్‌ అయ్యాడు. ప్రగ్యా భారతి బిజెపి టికెట్‌ మీద 2019లో భోపాల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపి అయ్యింది.

ఈ విషయాలన్నీ మీడియాలో విస్తృతంగానే వచ్చాయి. ఈ కేసు గురించి తులనాత్మకంగా కూడా వీక్షణం సంపాదకుడు ఎన్‌ వేణుగోపాల్‌ తన ఎఫ్‌ బి లోను ‘‘సాక్షి’’లోనూ రాసి ఉన్నాడు.

ఇందులో మీడియా దృష్టికి కూడా ప్రముఖంగా రాని విషయం మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు వలెనే మాలేగాఁవ్‌ బాంబు పేలుడు 2008లో జరగగానే ఇందులో చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్లు ముస్లింలే అయినా, అప్పటికే రెండు సంవత్సరాలుగా బొంబాయి వరుస రైలు పేలుళ్ల కేసులో 2006 నుంచి అరెస్టయి జైల్లో ఉన్న ఇద్దరితోపాటు, సిమీ (స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలు ఎనిమిది మంది మీద ఈ కేసు పెట్టారు. ఆ ఇద్దరూ ఎతెషామ్‌ కుతుబుద్దీన్‌ సిద్ధికీ, అసిఫ్‌ఖాన్‌ బషీర్‌ఖాన్‌, ఎతెషామ్‌ అరెస్ట్‌ అయ్యే సమయానికి ముంబై లో కుర్లాలో పబ్లిక్‌ సింగ్‌ హౌస్‌ నడుపుతూ మహారాష్ట్ర సివి అధ్యక్షుడిగా ఉన్నాడని పోలీసుల ఆరోపణ.

అసిఫ్‌ ఖాన్‌ బషీర్‌ఖాన్‌ జలగావ్‌కు చెందిన సివిల్‌ ఇంజనీర్‌, ఆయనను కూడా సిమీ బాధ్యునిగా చూపారు.  2008లో ఎటిఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే ఈ రెండు కేసులను కూడా విచారిస్తున్న క్రమంలో మాలేగాఁవ్‌ కేసులో అభినవ్‌ భారత్‌ సభ్యులను ముద్దాయిలుగా  అరెస్టు చేసిన తర్వాత సిమీ సంస్థకు చెందిన ముద్దాయిలు అందరూ నిర్దోషులుగా ప్రకటింపబడ్డారు కానీ పైన పేర్కొన్న ఇద్దరు బొంబాయి వరుస రైలు పేలుళ్ల కేసులో అండర్‌ ట్రయల్స్‌ గా కొనసాగుతూ 2015 లో మోకా కింద ఉరిశిక్ష కు కూడా గురయ్యారు. వీరిలో అసిఫ్‌ ఖాన్‌ బషీర్‌ ఖాన్‌ బొంబాయి పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన మరో ముద్దాయి ఫైజల్‌ తో పాటు భీమా కోరేగావ్‌ ఎల్గార్‌ పరిషత్‌ కేసులో పూనే పోలీసులు అరెస్ట్‌ చేసిన వారితో 2018 అక్టోబర్‌, నవంబర్‌ల నుంచి ఫా ఁసీఘాట్‌లో వి.వి. వర్నన్‌ గోన్‌సాల్వెస్‌లను కూడా ఉంచారు. భీమా కోరేగాఁవ్‌ కేసును 2020 జనవరిలో ఎన్‌ఐఏ చేపట్టి 2020 ఫిబ్రవరి ఆఖర్న వీరందరిని ముంబై తలోజా జైలుకు తరలించేదాకా ఈ ఇద్దరు ఆ వార్డులో ఉన్న 20, 25 మందితో పాటు ఈ ఇద్దరితో కూడా సెల్స్‌లో ఉన్నారు. ఈ ఇద్దరి గురించి వి.వి. తాను ఈ జైల్లో తెలుగు చేసిన గుల్జార్‌ అనుమానిత కవితలు ‘అనువాదకుని అంతరంగం’లో ఇలా రాశాడు 15 ఆగస్టు 2024.

‘గుల్జార్‌ ఈ కవితలు ఉర్దూకు దగ్గరగా ఉండే హిందుస్థానీలో రాశాడు. ఇంకా ముందుమాట అయితే దేవనాగరి లిపి కావచ్చు కానీ, ఉర్దూలోనే రాసి ఉర్దూలోనే సంతకం చేసాడు. ముందు మాటతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందుస్థానీ కవితల్లోని నాకు తెలియని ఉర్దూ మాటలకు ఎరవాడ జైల్లో వరుస పేలుళ్ల కేసుల్లో (ఈ కేసుల్లో నిందితుల గురించి వచ్చిన బేగునా ఇన్నోసెంట్స్‌ పుస్తకంపై వైర్‌లో ఆనంద్‌ తేల్‌తుంబ్డే చేసిన సమీక్ష తెలుగు అనువాదమైనా చదివే ఉంటారు) ఉరిశిక్ష పడి మమ్మల్ని ఉంచిన పా (సి ఘాట్‌ సురక్ష బ్లాక్‌) లో ఉన్న ఆసిఫ్‌, పైజల్‌ అనే ఇద్దరు రాజకీయ ఖైదీలు అర్థాలు చెప్పి నాకీ అనువాదంలో ఎంతో సహకరించారు అని రాశాడు. (జూలై 2023) .

2024 లో వెలువడిన కాజీ నజ్రుల్‌ ఇస్లాం ‘‘విద్రోహి’’ కాజీ నజ్రుల్‌ ఇస్లాం జీవితం సాహిత్యం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వాళ్లువేసిన పుస్తకంలో ఇలా రాశాడు.

ఎరవాడ జైల్లో ఖురాన్‌ సంబంధమైన, ఇస్లామిక్‌, అరబిక్‌ సంప్రదాయాలకు చెందిన ప్రతీకలను వివరించి, అర్థం చెప్పి సహకరించిన ఫైజల్‌, ఆసిఫ్‌ లు బొంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడి వాళ్ళతో పాటు మేము ఫాఁసి ఘాట్‌ లో ఉండడంవల్ల సాధ్యమైంది. వాళ్లవి ఏ విశ్వాసాలైనా కావచ్చు కానీ వాళ్లు ఈ కేసులో బేగునా (నిర్దోషులు) అనే విషయం ముస్లిం సమాజానికి మాత్రమే కాదు, ప్రజాస్వామిక వాదులందరికీ తెలుసు. వారికి నా కృతజ్ఞతలు చేరే అవకాశం లేదని రాశాడు.

ఈ తీర్పు మీద ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ఏమీ స్పందించలేదు గానీ మాలేగాఁవ్‌ కేసులో అభినవ్‌ భారతి సంస్థకు చెందిన అందరికందరూ నిర్దోషులుగా విడుదలైన సందర్భంగా ఈ కేసులో మొదలు అరెస్టు అయిన 8 మంది సిమీ కార్యకర్తలు, నాయకులపై పెట్టిన కేసులో అందరికందరినీ డిస్చార్జీ చేసిన స్పెషల్‌ కోర్ట్‌ తీర్పుపై ఐదేళ్ల కింద హైకోర్టుకు అపీల్‌ చేసి ఉన్నామని, దానిని త్వరిత గతిని చేపట్టమని హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని చెప్పాడు. (ఎక్సిపిడైట్‌ చేయమని కోరుతున్నామన్నాడు. డిశ్చార్జి అయినందువల్ల ఆరుగురు సిమీ కార్యకర్తలు బయటికి వెళ్లిపోయారు. ఆసిఫ్‌తో పాటు మరొక ముద్దాయి మాలేగాఁవ్‌ కేసులో డిశ్చార్జి అయిన బొంబాయి వరుస పేలుళ్ల కేసుల్లో కొనసాగి ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాతనే విడుదలయ్యారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇటు మాలేగాఁవ్‌ కేసులో కూడా ముంబై హైకోర్టులో ముద్దాయిలుగా న్యాయం కొరకు నిరీక్షించాలి.

అయితే ఎటిఎస్‌ చేతుల నుంచి 2011లో మాలేగాఁవ్‌ కేసులు తన చేతుల్లోకి తీసుకున్న ఎన్‌ఐఏ మాత్రం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి విశ్లేషించినాకనే అపీల్‌కు పోయే విషయం నిర్ణయిస్తామన్నది. ‘మా చేతికి ఇంతవరకు హైకోర్టు తీర్పు రాలేదు. ఏ గ్రౌండ్స్‌ పై ముద్దాయిలను నిర్దోషులుగా భావించారు విశ్లేషించాల్సి ఉంది, ఆ కారణాలను బట్టి తర్వాత తీసుకునే చర్యలను నిర్ణయిస్తాం’ అన్నది.

బొంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో 12 మంది ముద్దాయిలను హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేస్తే తీర్పు వినగానే సుప్రీం కోర్టుకు పోతామన్న ప్రభుత్వం, మాలేగాఁవ్‌ కేసు సెషన్స్‌ కోర్టు కొట్టివేయగానే హైకోర్టుకయినా అపీల్‌ చేయకపోవడం ద్వంద్వనీతి అన్నాడు ఆల్‌ ఇండియా ఎంఐఎం మహారాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్‌ఏ ఇమ్తియాజ్‌ జలీల్‌.

అంతకన్నా మనం గమనించవలసింది`యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ నుంచి ఎన్‌ఐఏ 2011 లో ఈ కేసు తీసుకున్నాక కూడా 2017 దాకా స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా పనిచేసిన రోహిణీ శాలియన్‌ స్పందన, మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరి మారిన ద్వంద్వ నీతిని బయటపెట్టింది. 2014 ఎన్నికలలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాగానే 2015 నుంచి ఎన్‌ఐఏ తనమీద ఈ కేసును కొంచెం మందకొడిగా సాగనివ్వమని తన మీద ఒత్తిడి పెట్టడం ప్రారంభించిందని చెప్పింది.

‘‘తీర్పు ఇట్లా వస్తుందని నాకు తెలుసు. మీరు నిజమైన సాక్ష్యాన్ని కోర్టు ముందు పెట్టకుంటే తీర్పు ఇంకెలా వస్తుంది. కోర్టులో అంతిమంగా సాక్ష్యాన్ని పెట్టింది నేను కాదు. 2017 నుంచి నేను స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా తప్పుకున్నాను. చాలాకాలం నుంచే ఇటువంటి తీర్పు వస్తుందని నాకు తెలుసు. మొదలు రికార్డు చేసిన సాక్ష్యాలు కాకుండా వేరే తీరు సాక్ష్యాలను ప్రవేశపెట్టిన తర్వాత ఏమైనా జరగవచ్చు. ఎన్‌ఐఏ ప్రకారం మొదటి సాక్ష్యులు అబద్ధం. ఎందుకంటే మెజిస్ట్రేట్‌ కోర్టులో 164 కింద ఎటిఎస్‌ రికార్డ్‌ చేసిన సాక్షులను కాకుండా తాము మళ్లీ విచారణ చేపట్టి రికార్డు చేసిన సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టింది ఎన్‌ఐఏ. ఈ కొత్త సాక్ష్యం ఆధారంగా ఈ తీర్పు వచ్చింది. అందుకే ఈ తీర్పు గురించి నేను నిరాశ కూడా చెందలేదు. ఇటువంటివి రొటీన్‌ గా జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా జరుగుతుండడం (పై నుంచి ఒత్తిడి రావడమని) (సున్నితమైన స్పందనను మొద్దు బారుస్తుంది. ఎవరు సత్యం బయటికి రావాలని అనుకోరు. మేము చాలా కష్టపడి పని చేస్తాం. కానీ కొందరు మమ్మల్ని పనిచెయ్యద్దంటారు. ఇది చివరికి ఎవరి వైఫల్యం అనాలి? ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. ఈ ప్రభుత్వం ఇట్లా జరగాలని కోరుకున్నది. అది తాను పరిపాలించే పద్ధతిలో పరిపాలిస్తుంది అన్నది.

ఎటిఎస్‌ చీఫ్‌గా హేమంత్‌ కర్కరే హిందూ అతివాద సంస్థ అభినవ్‌ భారత్‌ సభ్యులను ఇందులో ముద్దాయిలుగా చూపి, మోటార్‌ సైకిల్‌ నెంబర్‌, ప్రెషర్‌ కుక్కర్‌ ఆధారంగా ప్రగ్యా ఠాకూర్‌ను ఇతర సైనిక అధికారులను అరెస్టు చేసి విచారణ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మాలేగాఁవ్‌ పేలుళ్లకు వ్యతిరేకంగా, అందులో ముస్లిం ముద్దాయిలను చూపినందుకు మద్దతుగా సంఘపరివార్‌ సంస్థలన్నీ బొంబాయిలో ప్రదర్శనలు చేస్తున్నాయి. అభినవ్‌ భారత్‌ సభ్యులను అరెస్ట్‌ చేయగానే ఆ ప్రదర్శనలు ఇందుకు కూడా నిరసనగా మరింత తీవ్రమయ్యాయి. పైగా ప్రగ్యా ఠాకూర్‌ తనను స్త్రీ, సాధ్వి.. అని కూడా చూడకుండా హేమంత్‌ కర్కరే చాలా హీనమైన చిత్రహింసలకు గురిచేశాడని, ఇంతటి పాపానికి శిక్ష అనుభవించి తీరుతాడని ‘శపించింది’.

ఎటిఎస్‌ చీఫ్‌ గా కర్కరే 2008 జనవరిలో పదవి చేపట్టాడు. అదే నవంబర్‌ నెలలో మాలేగాఁవ్‌ పేలుళ్లకు, అభినవ్‌ భారతి సభ్యుల అరెస్టుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న గుంపును తన సిబ్బందితోపాటు అదుపు చేస్తున్న అత్యున్నత అధికారి అయిన ఏటిఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరేను ఆ గుంపు నుంచి ఎవరో దుండగుడు కాల్చి చంపాడు. మొదట మాలేగాఁవ్‌ కేసులో 8 మంది ముస్లిం ముద్దాయిలను జైల్లో పెట్టిన రఘువంశి మళ్లీ ఎటిఎస్‌ చీఫ్‌ అయ్యాడు.

‘హేమంత్‌ కర్కరేను ఎవరు చంపారు?’ అని బొంబాయి పోలీస్‌ కమిషనర్‌గా కూడా చేసిన ముషార్రాఫ్‌ అనే పోలీసు అధికారి Who killed karkare అని పుస్తకం రాశాడు. కర్కారే కూతురు కూడా తండ్రి గురించి తన జ్ఞాపకాలు రాస్తూ తన తల్లి తాను కుటుంబం కూడ ఆయన సమర్థుడు, నిష్పక్షపాతి అయిన పోలీసు అధికారి అయినందుకే హత్యకు గురయ్యాడని రాసింది. హేమంత్‌ కర్కరే చంద్రపూర్‌ ఎస్పీగా చేసి నప్పుడు నక్సలైట్ల విషయంలో కూడా చట్టబద్ధంగా వ్యవహరించి సాయుధంగా ఎదురుపడిన సందర్భాల్లో తప్ప కాల్పులు జరపలేదని, అయితే గాలింపు చర్యలకు చాలా ధైర్యంగా సిబ్బందితో పాటు పోయేవాడని పేరు ఉంది. మాలేగావ్‌ తీర్పు స్పెషల్‌ కోర్ట్‌ జడ్జి లాహోటి టెర్రరిజానికి మతం ఉండదన్నాడు కానీ సంఘపరివార్‌ హిందువులు అధర్మ నిధనం చేసే వాళ్లే కానీ టెర్రరిస్టులు కారని బాహాటంగానే చెప్తుంది. 2014లో మోడీ ప్రధాని, అమిత్‌ షా హోం మంత్రి అయ్యాక హిందువులు టెర్రరిస్టులు కాజాలరని అధికారికంగానే ప్రకటిస్తున్నారు. గోల్వాల్కర్‌ ప్రకారమైతే ముస్లింలు, కమ్యూనిస్టులు మాత్రమే శత్రువులు. కనుక సహజంగానే అభినవ్‌ భారత్‌ ని హిందూ టెర్రరిస్ట్‌ సంస్థగా గుర్తించి దాని సభ్యులను అరెస్ట్‌ చేయడంతో అప్పటికి ఆ కేసులో ముస్లింలను ముద్దాయిలుగా చూపారు గనుక ముస్లిం సమాజం భయానికి గురై ఉన్నది. బిజెపి మాత్రమే కాకుండా శివసేన కూడా పట్టు వల్ల, ప్రభావం వల్ల ఆయన భావజాల రీత్యా చాలా ఒత్తిడికి గురై, చాలా సమర్థుడు, నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడనుకున్న పోలీసు అధికారి, బొంబాయి కమిషనర్‌. పంజాబ్‌ డిజిపిగా కూడా చేసి రిటైర్‌ అయిన రెబెరో దగ్గరికి వెళ్లి తానేమైనా తొందరపాటుగా వ్యవహరించానా అని అడిగాడట. నువ్వు క్షేత్రస్థాయిలో దొరికిన ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో వ్యవహరిస్తున్నావు. ఏ ఒత్తిడికీ లోను కావలసిన అవసరంలేదని చెప్పాడట.

కనుక హేమంత్‌ కర్కరే హత్యతోనే మాలేగాఁవ్‌ కేసులో తీర్పు ఏం రాబోతున్నదో అందులోనూ తీర్పు వచ్చే సమయానికి కేంద్రంలో మోడీ, షాలే కాదు, మహారాష్ట్రలో బిజెపి ఫడ్నవీస్‌,(నాగపూర్‌) ముఖ్యమంత్రికి, శివసేన షిండే, ఎన్‌సిపి అజిత్‌ పవార్ల అలయన్స్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు మాలేగాఁవ్‌ స్పెషల్‌ కోర్టు తీర్పు ఆశ్చర్యమేమీ కాదు గాని బొంబాయి హైకోర్టు బొంబాయి వరుస పేలుళ్ల కేసులో 12 మంది ముస్లింలను విడుదల చేయడమే ఇక్కడి సమాజానికే కాదు, ప్రభుత్వానికి కూడా మింగుడు పడలేదు. విడుదలయితే అయ్యారు గానీ వాళ్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఇంకా ముద్దాయిలే.

అయితే ముగ్గురు న్యాయ నిపుణులు ఈ కేసులో ముద్దాయిలను పోలీసులు చిత్రహింసలు పెట్టి ఒప్పుకోలు పత్రాలు తీసుకున్నారని, అసంబద్ధమైన సాక్షాలను ఇప్పించారని ప్రాసిక్యూషన్‌ అనైతికంగా వ్యవహరించిందని భావించినప్పుడు 19 సంవత్సరాలు సుదీర్ఘకాలం జైల్లో ఉన్నవారికి నష్టపరిహారమైన ఇప్పించి ఉండవలసింది కదా. అట్లాగే ఆ పోలీసు అధికారులపై ఆరోపణలను విచారించి శిక్షించాలి కదా అని బొంబాయి హైకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ పియుసిఎల్‌ ఉపాధ్యక్షుడు మిహిర్‌ దేశాయి వెంటనే స్పందించాడు. సరిగ్గా ఇదే సమయంలో సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్‌ ఆనంద్‌ గ్రోవర్‌ వాదించిన కశ్మీర్‌లో ఒక కస్టోడియల్‌ మరణం కేసును ఆ పోలీస్‌ అధికారులపై కేసు పెట్టి అరెస్ట్‌ చేసి విచారించమని సిబిఐ కి ఆదేశాలిస్తూ ఆ మృతుని కుటుంబానికి తర్వాత ఏ బై లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదైనా హైకోర్టు చేయాల్సింది అని మిహిర్‌ దేశాయ్‌ బొంబాయి వరుస పేలుళ్లలో నిర్దోషులుగా విడుదలైన వారి విషయంలో చెప్పాడు.

మన క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌లో ఉన్న అసమన్యాయం గురించి, అంటే ఈ రెండు కేసుల్లో ప్రాసిక్యూషన్‌ నిర్వహించిన విచారణ, వాదనలు ఎంత వివక్షపూరితంగా ఉన్నాయో చూపుతూ సుప్రీంకోర్టు అడ్వకేట్‌ ఎం ఆర్‌ సయ్యద్‌ ఆగస్టు 14న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లో రాశాడు.

ఈ రెండిరటి కన్నా శక్తివంతమైన విధంగా వివక్ష, గురించి 19 ఆగస్టు మంగళవారం రోజు ఎ టేల్‌ ఆఫ్‌ టు ఆక్విటల్స్‌ A tale of two acquittals  రోహిణీ భట్‌ అనే సుప్రీంకోర్టు అడ్వకేట్‌ రాశాడు.

చట్టమనేది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే వారి చేతిలో ఆయుధం అయిపోయిందని రాసాడాయన. ఇంతకు ఎవరు బాంబులు పేల్చలేదా! చనిపోయిన వారు ఎట్లా చనిపోయారు? ఎవరి విడుదల రాజ్యానికి అవసరం? ఎవరిది కాదు అని ప్రశ్నించాడు.

అన్నటికన్నా, తీవ్రంగా ఎవరిని చిత్రహింసలు పెడితే ప్రభుత్వానికి అవి చిత్రహింసలు అనిపిస్తాయి అని.

శరీరమంతా బట్టల లోపలికి జిర్రపురుగులను వదిలి, పురుషుల లోదుస్తులలోనికి ఎలుకలను వదిలి, నోరు బలవంతంగా తెరిపించి అట్లా ధారగా నీళ్లు పోస్తూ హింసించడం హింస కాదా? కుటుంబాలను బెదిరించి, బాలీవుడ్‌ సినిమాల్లో వలే దృశ్యాలు, శబ్దాలతో భయపెట్టి చేయడం టార్చర్‌ కాదా. వీటనన్నిటినీ బొంబాయి హైకోర్టు తీర్పులో ప్రస్తావించింది.

మాలేగావ్‌ కేసులోనేమో ప్రాసిక్యూటర్‌ రోహిణి కేసును మందకొడిగా నడపవలసిందిగా ఎన్‌ఐఏ చెప్పిందని ఆమె హైకోర్టులో కూడా అఫిడవిట్‌ వేసింది. కనుక ఈ వివక్షకు ముద్దాయిల మతాల పట్ల వైఖరి కారణం కాదా అంటాడు.

మిహిర్‌ దేశాయి, ఎం. ఆర్‌. షంషాద్‌ అభిప్రాయాలు కాకపోయినా రోహిణి భట్‌, సుప్రీంకోర్టు న్యాయవాది అభిప్రాయం (19 ఆగస్టు 2025) టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తమైన (హైదరాబాద్‌, విజయవాడతో సహా) ఎడిషన్స్‌లో వస్తుంది గనుక చదవవలసిందిగా ఇంగ్లిష్‌ తెలిసిన పాఠకులకైనా విజ్ఞప్తి చేస్తూ ఈ పోలిక ముగిస్తాను. ఇప్పుడు ఇంక మాలేగాఁవ్‌ కేసులో సెషన్స్‌ కోర్టు తీర్పుపై కూడా మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లదు. వాళ్లు ఏడు ఎనిమిది ఏళ్లే జైల్లో ఉన్నారు. 19 ఏళ్లు జైల్లో ఉన్న ముస్లింలు మాత్రం ఇంకా ముద్దాయిలే! ఇదీ న్యాయం.

22 -08-2025

తాజా కలం: బొంబాయి వరుస రైలు బ్లాస్ట్‌ల కేసులో ఉరిశిక్ష పడిన మొదటి ముద్దాయి కమల్‌ అహ్మద్‌ అన్సారీ (50 ఏళ్లు) 2021లో కోవిడ్‌తో నాగపూర్‌ జైల్లో మరణించాడు అని పైన పేర్కొనడం జరిగింది. తన వంటి విశ్వాసాలు కలవారు ముద్దాయిలుగా (నిందితులు) గా మరణిస్తే అటువంటి వాళ్ళు యూఏపిఏ కింద ‘టెర్రరిస్ట్‌’ ముద్రతో విచారింపబడకూడదని ఫాదర్‌ స్టాన్‌ స్వామి విషయంలో జేసూట్స్‌ అందరి పక్షాన 2021 లో ముంబైలోని ఫాదర్‌ ఫ్రేజర్‌ బొంబాయి హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం అది పియుసిఎల్‌ అఖిలభారత ఉపాధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది చేపట్టినట్లు మనకు తెలుసు. అయితే బొంబాయి హైకోర్టు ఇంకా దానిపై విచారణ ప్రారంభించలేదు.

2006లో అరెస్టయి 2015లో ఉరిశిక్ష పడిన కమల్‌ అహ్మద్‌ అన్సారీ 2021లో కోవిడ్‌తో మరణించి, ఇప్పుడు 2025 జూలైలో నిర్దోషిగా ప్రకటింప బడిండు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు నిన్న ఆగస్టు 31న నాగపూర్‌లో జరీపట్కో గోరీ దగ్గరికి వచ్చి బొంబాయి హైకోర్టు ఈ కేసులో అందరితో పాటు అతనిని నిర్దోషిగా ప్రకటించిన తీర్పు చదివి వినిపించారు.

ఆగస్టు 31 ఆదివారం రోజు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు 19 సంవత్సరాల తర్వాత నిర్దోషిగా ప్రకటించబడి, నాలుగు సంవత్సరాల క్రితం మరణించిన తమ రక్త బంధువు జ్ఞాపకార్థం ఆయన గోరి దగ్గర నిలబడినారు. ఇందుకోసమే ప్రత్యేకించి ఢల్లీి నుంచి ఆయన తమ్ముడు జమాల్‌ అహ్మద్‌ వచ్చి ఆ గోరి చెంత కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ కేసులో 2015 లోనే నిర్దోషిగా విడుదలైన ఒకే ఒక్క ముద్దాయి అబ్దుల్‌ వహీద్‌ షేక్‌ ఇంత కాలానికి కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది కానీ, ఆయన కోల్పోయిన పదహారు సంవత్సరాలు తిరిగి వస్తాయా? ఆయన పిల్లలు ఆయన లేకుండానే పెరిగారు. ఆయన భార్య ఈ 19 ఏళ్లు ఈ అవమానపు నీడలోనే జీవించాల్సి వచ్చింది అన్నాడు.

అబ్దుల్‌ వహీద్‌ షేక్‌ ఒక మదర్సాలో టీచరుగా 2001లో ఈ కేసులో అరెస్టయ్యాడు. 2017లో నిర్దోషిగా విడుదల అయ్యే కాలానికి ఎంఏ ఎల్‌ ఎల్‌ బి చేశాడు. విడుదలయ్యాక కూడా అదే మదర్సాలో టీచర్‌గా చేస్తూ ఈ కేసులో అందరూ నిర్దోషులే ( బేగునా) అని ఉర్దూలో పుస్తకం రాసి (అది ఇంగ్లిషు, మరాఠీ మొదలు చాలా భాషల్లోకి అనువాదం అయింది) మిగతా ముద్దాయి లందరి కోసం పోరాడుతూ అందుకోసమే వెబ్సైట్‌ నిర్వహిస్తున్నాడు. నేర శిక్షా స్మృతి పై పిహెచ్‌డి చేసి ఇప్పుడు డాక్టర్‌ అబ్దుల్‌ వహీద్‌ షేక్‌ అయ్యాడు.

మరణించిన పదేళ్లకు ఉరిశిక్ష నుంచి విముక్తి పొంది నిర్దోషిగా ప్రకటింపబడిన కమల్‌ అహ్మద్‌ అన్సారీని 2006లో బొంబాయి పోలీసులు బీహార్‌లోని మధుబనీలో అరెస్ట్‌ చేశారు. అప్పటికికాయన రోజు కూలీగా పని చేస్తూ, భార్య, ఐదుగురు పిల్లలను పోషించుకోవడానికి ఒక చిన్న చికెన్‌ షాప్‌ పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మేవాడు. జైల్లో 16 ఏళ్లు గడిపాక కోవిడ్‌తో 2015లో నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో ఫాస్రిఘాట్‌లో మరణించాడు. సంపాదించే భర్త అరెస్ట్‌ తో భార్య కూడా ఐదుగురు పిల్లలతో నాగపూర్‌కు వచ్చి ఏ పని దొరికితే ఆ పని చేస్తూ పిల్లలను, తనను పోషించుకుంటూ ఎన్నో అగచాట్లు పడడమే కాదు, సామాజికంగా ఇంత అనుమానాన్ని (నేరస్తుని భార్యగా) అవమానాన్ని భరించాల్సి వచ్చింది. అయినా హిందూ సమాజం ఈ తీర్పును ఆమోదించలేదు.

1 సెప్టెంబర్‌ 2025

Leave a Reply