తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వారి వారి కోణాల్లోంచి దృక్పథాల్లోంచి విమర్శ రాస్తున్నారు. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, కథ గూర్చి విమర్శ రాసేటప్పుడు మాత్రం అనేక చర్చలు మొదలౌతున్నాయి. కవిత్వాన్ని తీసుకుంటే పదునైన విమర్శ ఏది? అన్నప్పుడు భిన్నవాదనలొస్తున్నాయి. వాస్తవానికి కవిత్వమిలాగే ఉండాలనే ఎవరూ నిర్థారించకపోయినా హృదయాన్ని మీటే కవిత్వానికి కొన్ని సంగతులైతే నిర్ణయించుకున్నారు. ఇందులో కవిత్వ నిర్మాణసూత్రాలైన వస్తువు, శిల్పం, ఎత్తుగడ, అభివ్యక్తి, భావుకత, సాంద్రత, రూపం, సారం ఇలా ఎన్నైనా చెబుతారు. ఈ క్రమంలోరాసే విమర్శను సమీక్ష , పరామర్శ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీటన్నింటి అర్థమొక్కటే. కవిత్వం గూర్చి విమర్శ రాసేటప్పుడు విమర్శకులు ప్రగతిశీలవాదులైతే వారు ఏ విమర్శ రాసినా అందులో  ప్రగతిశీలత ఉందా లేదా అని చూస్తారు. లేదంటే ఇతర విమర్శకులు, వారి వారి మస్తిష్కంలో నిర్మితమైన భావజాలానికి అనుగుణంగా ఉంటే అదే తరహా కవిత్వనిర్మాణాన్ని వెతికి మరీ విమర్శ రాస్తారు. విమర్శ రాసే విమర్శకుడి భావజాలానికి అనుగుణంగా రాస్తూ వర్తమాన విమర్శ ప్రయాణం సాగుతున్నది. అసలు కవిత్వవిమర్శ అన్నది సముద్రమంత విశాలమైంది, మనసంత విస్తృతమైంది. వొక కవి కవిత్వ సంపుటాన్ని విమర్శ చేస్తే ఆ కవి హృదయాన్ని ఆవిష్కరించవచ్చు.  ఉదాహరణకు ఒక కవి కవిత్వాన్ని తీసుకుని కవిత్వప్రయాణాన్ని విశ్లేషించుకుందాం. వీటన్నింటి గూర్చి చర్చించాలనుకున్నప్పుడు దానికి ఉదాహరణగా విల్సన్‌రావు కొమ్మవరపు కవిత్వం నాగలి కూడా ఆయుధమే కవిత్వం మనకు అనేక విమర్శమూలాలను పట్టిస్తుంది. ఈ కవిత్వమొచ్చి రెండేళ్లు పైనే అయ్యింది. ఎందుకిప్పుడు చర్చించాలంటే  ఆ కవిత్వంలోని గాఢత పైన పేర్కొన్న నిర్మాణసూత్రాలు ఏ కోణంలో చూసినా దానికి అనుగుణంగా ఆ కవిత్వం నిర్మితమైంది. మస్తిష్కపథంలోంచి నిష్క్రమించని కవితావాక్యాలు ఈ కవిత్వంలో కవిత్వపాఠకుణ్ణి పలకరిస్తాయి. అందుకే ఈ కవిత్వపు లోతుల్ని చూసే క్రమంలో వొక్కొక్కటి పరిశీలిద్దాం.

వస్తువు:

‘సాహిత్యం వస్తువుకు తగిన విధంగా లేనప్పుడూ, వస్తువుకు అతీతంగా సాహిత్యం ఉన్నప్పుడూ రూపానికి విలువేలేదు’

      `కారల్‌ మార్క్స్‌

విల్సన్‌రావు కొమ్మవరపు కవిత్వంలో వస్తువును పరిశీలించాలనుకున్నప్పుడు వస్తుప్రాధాన్యతనే తీసుకుని చర్చద్దాం. నాగలి కూడా ఆయుధమే అనే కవిత తీసుకుంటే కవితా శీర్షిక చదివిన వెంటనే పాఠకుడికి ఆ కవి దేన్ని వస్తువుగా తీసుకుని కవితలో చెబుతున్నారో ఊహించవచ్చు. అదీ చూద్దాం..

సంఘర్షణ మాకేమీ కొత్త కాదు /శ్రమకు ప్రతిఫలంగా /కలలే మిగులుతున్నప్పుడు /కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు /నిత్యం మట్టికి మొక్కడమొక /సహజాతం మాకు/భూమికీ ఒక గుండె ఉందని/ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక/దాని ఊపిరితో ఊపిరి కలిపి/ఒక జ్వలనచేతనలో/నాలుగు చెమట చుక్కలు/ధారపోయకుండా ఉండలేము/అలసటెరుగని దుక్కిటెద్దులు/నెమరేతకూ దూరమై /భద్రత లేని సాగుతో/అభద్ర జీవితం గడుపుతున్న/నిత్య దుఃఖిత సందర్భాలు!/ఆకలి డొక్కలు నింపే/చట్టాలు చేయాల్సిన చట్టసభలు/భూమి గుండెకు ఊపిరి పోయడం/ఒక మానవోద్వేగమని తెలియక/నాగలిని నిలువునా చీల్చేస్తున్నప్పుడు/అభివృద్ధి ఎరుగని చట్టాలన్నీ/దారం తెగిన పతంగుల నాట్య విన్యాసాలే!/ఇప్పుడు/నాగలి ఒంటరి కాదు/నాగలి ఒక సమూహం/నాగలి ఈ దేశపు జీవితం/నాగలి ఉత్పత్తికి జీవం/నాగలే మా సర్వస్వం/ఇప్పుడు నాగలే మా ఆయుధం..!

పై కవితలో పంక్తుల్ని మాత్రమే తీసుకోక మొత్తం తీసుకోవడానికి ప్రధానంగా ఈ కవిత నేను మొదట చెప్పినట్లు  వస్తుప్రాధాన్యతనే కాదు, కవిత్వమంతా వస్తు,శిల్ప వైవిధ్యాలే కాకుండా సమగ్రంగా పరిశీలిస్తే, రూప, సార విశేషాలన్నీ ఈ కవిత్వంలో ఉంటాయి. వస్తువు మాత్రమే కవిత్వం కాదు. శిల్పం మాత్రమే కవిత్వం కాదు. వస్తువు, శిల్పం రెండూ ముఖ్యమే. కవితకు ఇంకా బలాన్నివ్వాలంటే పైన పేర్కొన్న నిర్మాణ సూత్రాలన్నీ ఉండాల్సిందే. అయితే నిబంధనేమి కాదు. కనీసం వస్తుశిల్పాలు అనివార్యమన్నమాట. అయితే ఈ తరహా కవిత్వం ఎలా పురుడుబోసుకుంటుందని యోచిస్తే కవి సామాజిక జీవితం, కవి పడే సంఘర్షణ వెరసి ఏర్పడ్డ కవి భావజాలం. ఈమూడు విషయాలు కవితకు గొప్ప వస్తుశిల్పాలనందిస్తాయి.  పై కవితలో కవికి రైతు వస్తువు. రైతు బతుకు వస్తువు. రైతు గూర్చి తెలుగు కవిత్వంలో వేల కవితలొచ్చి వుండొచ్చు. ఇంతకంటే గొప్పగా చెప్పివుండొచ్చు కానీ, విల్సన్‌రావు కవిత్వాన్ని చూసిన కోణం, కవిత్వదృక్పథం అతనికి రైతుపట్ల, రైతు జీవితం పట్ల సానుభూతొక్కటే కాదు..రైతు లేనిదే ఈ భూమికి బతుకే లేదని చెప్పడం వస్తువుకే కాదు కవితకుండాల్సిన సమగ్ర కవిత్వ నిర్మాణాలన్నింటికీ సాధించారు. ఆ సూత్రాలే ఆ కవితకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ కవితను వస్తుకోణంలో మాత్రమే చూశారని మాత్రం అనుకోవద్దు. ఇందులో ఇతరత్రా  శిల్పసౌందర్యాలు లేవని కాదు. వస్తురూపాల్లో వస్తువుది నిర్ణాయకపాత్ర అని మార్క్సిజం చెబుతున్నందున ఈ దృక్ఫథంలోంచి మాత్రమే వస్తువును చూడటం జరిగింది. ఈ కవిత్వం చదివినపుడు కవి ఆ దిశలోనే తన ప్రయాణం సాగిస్తున్నారని కూడా మనకు అర్థమౌతుంది. కవుల సాహిత్యప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. కొంతమంది భాష మీద ప్రేమతో సాహిత్యంలోకి వస్తారు. ఇంకొందరు సాహిత్యం మీద మమకారంతో సాహిత్యంలోకి వస్తారు. రాస్తున్న క్రమంలో సాహిత్యం మీద, భాషమీద రెండిరటిపై ప్రేమ పెంపొందించుకుని తన మార్గాన్ని నిర్దేశించుకుంటారు. ఇక్కడ భాషొక్కటే ప్రధానం కాదు. అలాగని సాహిత్యమొక్కటే ప్రధానం కాదు. ఈ రెండూ జోడుగుర్రాల్లాంటివి. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ ప్రయాణం భిన్నమౌతుంది. ఇందులో కొంతమంది పేరుప్రఖ్యాతల కోసం పాలకపక్ష కవులౌతారు. కొంతమంది ప్రజలజీవితమే అజెండాగా ప్రజాపక్ష కవులౌతారు. ఈ ప్రపంచానికి కావాల్సింది మాత్రం ప్రజాపక్ష కవులే. ఈ కవి మాత్రం ప్రజాపక్ష ప్రగతిశీలకవి అని ఈ సంపుటి తీర్పునిస్తుంది. ఈ క్రమంలో ఈ కవి రాసిన కవిత్వంలో యుద్ధరహిత ప్రపంచం కోసం..! అనే కవితలో శిల్పం చూద్దాం…

మనసంతా ప్రశ్నల తుఫాను హెరు/పదునెక్కుతున్న ఆలోచనలన్నీ /తమకుతామే గర్భవిచ్ఛిత్తి చేసుకుంటున్న విషాదహోరు/జ్ఞాపకాలు వేగంగా నడుస్తున్నాయి/సమాధానం దొరకని ప్రశ్నలా నేను/ఊపిరితిత్తులనిండా చీకటి కందకాలు /మెదడు అణువణువునా/తూనీగ రెక్కల గూళ్ళు/నాలో- జీవనదులు ప్రవహిస్తున్నాయి/మంచుపూలు పరిమళిస్తున్నాయి/నెమలిపింఛంలా పురివిప్పిన పాటలు/పండుగలు చేసుకుంటున్నాయి/నాలోని ఊహల కెరటాలు ఒడ్డుకు చేరి/ఒకదానితో ఒకటి పెనవేసుకొని కలబడుతుంటే/విడదీయలేని ప్రాణమున్న గండశిలలా నేను/ఒక చిన్న ఆశ నాలో పొటమరించింది/ఆలోచనల దీర్ఘ నిద్రదుప్పటి దులిపింది/గాఢ సుషుప్తిలో నన్ను మెలిపెట్టి/మెలికల్లో పెట్టిన చిక్కుముడులను విప్పింది/కరిగిపోతున్న నిశిరాతిరిలో/నన్ను నేను నిలువెత్తు జెండాగా ఎగరేసుకొని/యుద్ధరహిత ప్రపంచం కోసం/స్వాగత గీతం పాడుతున్నాను.

పై కవిత చదివినపుడు శిల్పం ఎలా దృశ్యమై కనబడుతుందో గమన్ణిచవచ్చు. కొమ్మవరపు విల్సన్‌రావు కవిత్వం పదునుగా ఉండాటనికి కారణం పాఠకుడి హృదయాన్ని చేరడానికి ఈ కవి మంటలా మండిపోతారు. మాటలతూటాలను మనసనే అంబులపొదిలో నింపుకుని పేలుస్తారు. ఆ తూటాల శిల్పవిన్యాసం వైవిధ్యంగా సాగుతుంది. పాఠకుణ్ణి సులభంగా చేరుకోడానికి శిల్పం వొక సాధనం కూడా. దాన్ని ఎప్పుడో అధిగమించేశారు. సాధించేశారు. లోతుల్లోకి వెళ్ళి చూడాలంటే శిల్పం లేనిదే ఎంత గొప్ప సాహిత్యమైనా రాణించదు. చాలా మంది శిల్పం అనీ, శైలీ అని ప్రస్తావిస్తూ వుంటారు. భాషాశాస్త్రం అనుసరించి  శిల్పం, శైలీ ఈ రెండూ ఒకేదాతువు నుండి ఏర్పడ్డాయి. కుందుర్తి ఆంజనేయులు శిల్పాన్ని ‘ధర్మప్రవృత్తి నియమమైనదియు, ఏకాగ్రతా మూలకమైనదియునగు కర్మకౌశలమగు భావము’ అన్నారు. అందుకే శిల్పానికి శైలికి భేధం వుంటుంది. శైలి అయ్యిందల్లా శిల్పం కాదు. శైలి వొక నడకమాత్రమే. దాన్ని శిల్పం అనుకుంటారు. కానీ శిల్పం, శైలికి అవినాభావసంబంధం వుంటుంది. అపుడే కవిత ప్రజలకు చేరుతుంది. పై కవిత గమనిస్తే మనం ఇప్పుడు ఉటంకించిన విషయాలన్నీ అందులో కనబడ్తాయి. కవి కొమ్మవరపు విల్సన్‌రావు శిల్పాన్ని  శైలినీ అన్వయిస్తూ సాధికారికత సాధించారు. అందుకే ఈయన కవిత్వంలో శిల్పమెక్కడా విఫలమవ్వదు.

రూపం..సారం

వస్తురూపాల గూర్చి, సారం గూర్చి ఈ మధ్య కవిత్వలోకంలో చర్చసాగుతూ ఉంది. వస్తువు లేకుండా రూపం       ఉండదు. వస్తువును ఆకర్షించేది రూపమే. అయితే శిల్పం కూడా ప్రదానమనే విషయాన్ని విస్మరించలేము. వస్తువుకు అతీతంగా రూపానికి విలువలేదని మార్క్స్‌ అంటారు. వస్తువును వదిలేసి సామాజిక బాధ్యత లేకుండా రూపంతో కసరత్తులు చేసే రచనల్ని కవిత్వాన్ని మార్క్సిజం ఒప్పుకోదు. గమనించాల్సి విషయమేమంటే రూపవాదాన్ని మార్క్సిజం తిరస్కరిస్తుంది గానీ, రూపాన్ని కాదని ప్రసిద్ద విమర్శకులు డా.బి.సూర్యసాగర్‌ అంటారు. ఈ కవిత్వంలో కవి రూపం సారం పై ప్రత్యేకశ్రద్ధ పెట్టారు. దీనికి ఉదాహరణగా ఈ నాగలి కూడా ఆయుధమే అనే కవితా శీర్షికతో ఉన్న కవితను చూద్దాం.

సంఘర్షణ మాకేమీ కొత్త కాదు/ శ్రమకు ప్రతిఫలంగా /కలలే మిగులుతున్నప్పుడు/కలగనటమే ఒక దుశ్చర్య ఐనప్పుడు/ నిత్యం మట్టికి మొక్కడమొక/సహజాతం మాకు/భూమికీ ఒక గుండె ఉందని/ ఆ గుండెలో కొంత తడి ఉందని తెలిసాక/దాని ఊపిరితో ఊపిరి కలిపి/ఒక జ్వలనచేతనలో/నాలుగు చెమట చుక్కలు/ధారపోయకుండా ఉండలేము./అలసటెరుగని దుక్కిటెద్దులు/నెమరేతకూ దూరమై/భద్రత లేని సాగుతో/అభద్ర జీవితం గడుపుతున్న/నిత్య దుఃఖిత సందర్భాలు!/ఆకలి డొక్కలు నింపే/చట్టాలు చేయాల్సిన చట్టసభలు/భూమి గుండెకు ఊపిరి పోయడం/ఒక మానవోద్వేగమని తెలియక/నాగలిని నిలువునా చీల్చేస్తున్నప్పుడు/అభివృద్ధి ఎరుగని చట్టాలన్నీ/దారం తెగిన పతంగుల నాట్య విన్యాసాలే!/ఇప్పుడు/నాగలి ఒంటరి కాదు/ నాగలి ఒక సమూహం/నాగలి ఈ దేశపు జీవితం/నాగలి ఉత్పత్తికి జీవం/నాగలే మా సర్వస్వం/ఇప్పుడు నాగలే మా ఆయుధం..! కవి ఈ కవితలో వస్తుశిల్ప,రూపసారాన్ని ఎంత గొప్పగా నడిపించారు. వస్తువును ఎన్నుకోవడంలోనే కవికి ఈ సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో తెలిసిపోతుంది. ఇవాళ రైతులు వ్యవసాయానికే దూరమౌతున్నస్థితిని చూస్తున్నాం. రైతురాజ్యాన్ని కార్పోరేట్లు ఆక్రమించేస్తున్నారు. పంటపొలాల్ని వదిలి వసలెళ్ళిపోతున్నాడు. పల్లెల్లో బిక్కుబిక్కుమంటూ ముసలిజీవాలు బతుకులీడుస్తున్నాయి. కవి కొమ్మవరపు విల్సన్‌రావు ఈ కవితలో సామాజిక వస్తువును సాహిత్యవస్తువుగా తీర్చిదిద్దారు. అలాగే వస్తురూపాల ఐక్యత, సంఘర్షణ విశదీకరించి ఈ కవితను కవిత్వీకరించారు. అందుకేనా ఈ కవితాశీర్షికను కవిత్వసంపుటికి శీర్షికగా పెట్టుకున్నట్లున్నారు. ఎందుకిలా చేయగలిగారు? ఎందుకిలా రాయగలిగారన్నప్పుడు కవికి గొప్ప ఆశయం ఉండితీరాలి.

కవితాశీర్షికలు`ఎత్తుగడ

ఈ సంపుటిలో ఉన్న 69 కవితల శీర్షికలూ భిన్నంగానే ఉంటాయి. స్వప్నశిశువు, పద్యానికి పూచిన పువ్వు, డెజావు, మట్టి స్వప్నం, భూమి చూపు, ఆకలియాత్ర, ఆశల మొక్క ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీది భిన్నమైందే. ఏ కవితై పాఠకుణ్ణి చదివంచేది మొదట శీర్షిక తర్వాత ఎత్తుగడ. ఈ రెండూ బాగుంటే ఇక వస్తువు చూసేవాళ్ళు వస్తువు, శిల్పం చూసేవాళ్ళు శిల్పం, దృశ్యం చూసేవాళ్ళు దృశ్యం ఏది అవసరమో దాన్ని ఆ కవితలోంచి ఏరుకుంటారు. ఈ కవి కవిత్వంలో ఎత్తుగడలు పదికాలాలు నిలిచేలా ఉంటాయి. ఈ సమీక్షాకాలమ్‌ పరిధి, పరిమితి దృష్ట్యా అన్నింటిని అన్నింటిని పేర్కొనడం సాధ్యం కాదు గానీ..కొన్నింటిని మాత్రం పరిశీలిద్దాం.

ఈ రోజెందుకో/ఒళ్ళంతా చిత్తడి చిత్తడిగా ఉంది(ఒళ్ళు సానబెట్టుకుందాం)

ఏ అచ్ఛాధనా లేదు/ఇప్పుడిప్పుడే మొలిచిన దేహంపై..(అనివార్యం)

దేహమంతా నలుపు రూపెత్తాక/పున్నమి చంద్రుడు కూడా నాకు నల్లగానే కనిపిస్తున్నాడు(నల్లచంద్రుడు)

పొద్దుతోపాటే/ పడమరకు వాలిపోతున్న ఆలోచనలు(నిక్షిప్తరాగాలు)

ఇప్పుడు మనిషే/చెట్టులా చరిత్ర సృష్టిస్తున్న కాలం కదా!(చివరిరోజుపై చెరగని సంతకం)

కవి చూస్తున్నకోణం అతడి దృక్ఫథం మీద ఆధారపడి వుంటుంది. కవి జీవితానుభవాలు గొప్ప కవిత్వ సృజనకు దారితీస్తాయి.  కవి కొమ్మవరపు విల్సన్‌రావు సమాజాన్ని చూస్తున్నదృష్టికోణం భిన్నమైంది. ఈ కవి ద్రష్ట కాగలిగారంటే కారణం అతడు అనుభవాల మంటల్లో మండారు కాబట్టి కవిత్వపు మంటల్ని రగిలించగలుగుతున్నారు. పైన కవిత్వపు ఎత్తుగడలు పరిశీలిస్తే కవిత్వం గుండెల్ని తాకేలా రాశారనడంలో సందేహం లేదు.

దృశ్యం:

ఏ కవితైనా మనం చదివినపుడు కనురెప్పల్ని వొక భావచిత్రం పలకరించాలి. హృదయాన్ని ఆ భావచిత్రదృశ్యం రెటీనాపై కనబడాలి. అటువంటి కవిత్వమే కవిత్వమౌతుంది. ఆ దృశ్యం ఎలా వుంటుందో ఈ కవిత్వంలో చూద్దాం.

యుద్ధరహిత ప్రపంచం కోసం..!

మనసంతా ప్రశ్నల తుఫాను హోరు/పదునెక్కుతున్న ఆలోచనలన్నీ/తమకుతామే గర్భవిచ్ఛిత్తి చేసుకుంటున్న విషాదహోరు/జ్ఞాపకాలు వేగంగా నడుస్తున్నాయి/సమాధానం దొరకని ప్రశ్నలా నేను/ఊపిరితిత్తులనిండా చీకటి కందకాలు మెదడు అణువణువునా/ తూనీగ రెక్కల గూళ్ళు/నాలో- జీవనదులు ప్రవహిస్తున్నాయి/మంచుపూలు పరిమళిస్తున్నాయి/నెమలిపింఛంలా పురి విప్పిన పాటలు/ పండుగలు చేసుకుంటున్నాయి/నాలోని ఊహల కెరటాలు ఒడ్డుకు చేరి/ఒకదానితో ఒకటి పెనవేసుకొని కలబడుతుంటే/విడదీయలేని ప్రాణమున్న గండశిలలా నేను/ఒక చిన్న ఆశ నాలో పొటమరించింది/ఆలోచనల దీర్ఘ నిద్రదుప్పటి దులిపింది/గాఢ సుషుప్తిలో నన్ను మెలిపెట్టి/మెలికల్లో పెట్టిన చిక్కుముడులను విప్పింది/కరిగిపోతున్న నిశి రాతిరిలో/ నన్ను నేను నిలువెత్తు జెండాగా ఎగరేసుకొని/ యుద్ధ రహిత ప్రపంచం కోసం/స్వాగత గీతం పాడుతున్నాను.

కవి ఈ ప్రపంచం నుండి ఏం కోరుకుంటున్నారు. ఈ ప్రపంచం ఎలా ఉండాలని కలలు గంటున్నారు. ఆలోచనలు పదునెక్కడమేమిటి? ఇది కదా కవిత్వమంటే. ఇది కదా శిల్పమంటే. ఇలాంటి కవిత్వం కదా వర్తమాన కవిత్వసమాజానికి కావలసింది. అందుకే ఈ కవిత్వం అందరూ చదవాలి. కాదు కాదు ఈ కవి రాసిన ప్రతీ కవితావాక్యాన్ని మస్తిష్కంలో భద్రపరచుకోవాలి.

Leave a Reply