పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్‌డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగబద్ధ పాలన ఉండాలి తప్ప, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కనుసన్నలలో జరిగేది  కాదు. భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలే (ధర్మకర్తలే) తప్ప యజమానులు కారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిపై ఎవరికి హక్కు పత్రం (అధికార పత్రం) ఉందో వారే యజమాని. చిన్న రైలు మార్గం నిర్మించి, దాని ద్వారా రవాణా చేస్తామని చెబుతున్నారు. సరే, దాని కోసం కూడా దారి కావాలి కదా. ఇక్కడ అంతా చెట్లు, మొక్కలే ఉన్నాయి. అంటే, చెట్లను నరకడం ఖాయం. సార్, ఇక్కడ బహిరంగ విచారణ జరగాలి. నీరు, అడవి, గని, భూమిపై ఇంకొకరి ఆధిపత్యం ఉండకూడదు. మేము యజమానులం, ఇక్కడే యజమానులుగా ఉంటాం. మా ఆస్తిని మేము ఇవ్వదలచుకోలేదు. భూమి కింద ఉన్నదానిపై మీకు యాజమాన్య హక్కు లేదు, అందుకే మీరు నిరసన తెలపలేరని కలెక్టర్ గారు చెప్పారు. అందుకే నేను కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఆ సమతా తీర్పుని,  2013 సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు ఇచ్చిన భూ యజమానుల తీర్పు పత్రాలను పంపాను. మా గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు ఎలాంటి ఒత్తిడికి లోను కారు; ఏ గ్రామస్తుడూ ఒత్తిడికి లొంగడు. పరిపాలనాధికారులు తమ విషయం చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి.

నమస్తే, నా పేరు హర్‌పాల్, మీరు THA 24 చూస్తున్నారు. రాయ్‌గఢ్‌లోని ధర్మ్‌జగఢ్‌లో జరగబోయే ప్రజా విచారణ (ప్రజా విచారణ తేదీ, సమయం మరియు వేదిక గురించి తగిన ప్రచారం ఇచ్చిన తర్వాత, అభిప్రాయాలను నిర్ధారించుకోవడానికి, ప్రభావిత ప్రాంతంలో ప్రజా విచారణ జరుపుతారు) పైన ప్రజలు నిరంతరం వ్యతిరేకత తెలుపుతూనే ఉన్నారు. ప్రతిపాదిత ప్రజా విచారణను రద్దు చేయాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం, రాయ్‌గఢ్ కలెక్టర్‌ను కలవడానికి వందలాది మంది ప్రజలు వచ్చారు. అదానీ ఉద్యోగులు, స్థానిక అధికారులు/ప్రజల మధ్య చర్చలు జరుగుతాయని, ఆ చర్చల తర్వాత ప్రజా విచారణ జరగాలా లేక రద్దు చేయాలా అనేది స్పష్టం చేస్తామని స్థానికులకు 24 గంటల సమయం ఇచ్చారు. అయితే, మూడు పంచాయతీలు, నాలుగు గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఆ గ్రామ ప్రజలు ప్రజా విచారణను నిర్వహించాలనుకుంటున్నారని పరిపాలనాధికారుల వైపు నుండి ఒక ప్రకటనను విడుదల చేసారు.

ఇప్పుడు ఈ విషయంలో కొత్త మలుపు వచ్చింది. గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు స్థానిక ఎమ్మెల్యే లాల్‌జీత్ సింగ్ రాథియా, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలతో కలిసి ప్రతిపాదిత ప్రజా విచారణను వ్యతిరేకిస్తున్నారు. అదానీకి ప్రజా విచారణను నిర్వహించడం సులభం కాదు. పరిపాలనాయంత్రాంగం బలగాలను మోహరించి ప్రజా నిర్వహించినా, అదానీకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది.

చూడండి, వినండి, స్థానికులు ఏమి చెబుతున్నారో. ఖచ్చితంగా, మేము 16వ తేదీన రాయ్‌గఢ్ వెళ్ళాము. అక్కడ, 22వ తేదీన మళ్ళీ కురంగా హైస్కూల్ మైదానంలో సమావేశం జరపాలని నిర్ణయం తీసుకున్నాము. దాని కొనసాగింపుగానే ఈరోజు సమావేశం జరిగింది. నిన్న జనపద్ పంచాయతీలో ఉపవిభాగాధికారి (ఎస్‌డిఒ) నిర్వహించిన సమావేశం బహుశా తప్పుడు పద్ధతిలో జరిగింది.

ప్రభుత్వానికి, పరిపాలనాధికారులకు, కలెక్టర్‌కు, ఎస్.డి.ఎం.కు మాట్లాడాలని ఉంటే, గ్రామానికి రావాలి, గ్రామ ప్రజల మధ్య మాట్లాడాలి. అప్పుడే మేము భూమి ఇవ్వాలనుకుంటున్నామా లేదా అనే దానిపైన చర్చ జరుగుతుంది. ఈ రోజు మేము ఏ విధంగానైతే గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా కూర్చున్నామో, అలాగే ఐక్యమత్యంగా ఉండి దీన్ని చూసుకుంటాము. మా ఎన్.జి.ఓ. సోదరులు రాజేష్ త్రిపాఠి, రాజేశ్వర్ కామ్ గారు కూడా వచ్చి అందరికీ వివరించారు.

“మేము కూడా వీరితో పాటు, ఆత్మవిశ్వాసంతో ఇక్కడి ప్రజలతో, ఇక్కడి గ్రామ పంచాయతీలోని ప్రతినిధులందరూ, ఈ ప్రాంత గ్రామాల ప్రజలు సభ్యులు, ఇక్కడి ఎమ్మెల్యే ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇక్కడ ప్రజా విచారణ (జన సునవాయి) జరగాలని, అలాగే ఏ రకంగానూ నీరు, అడవి, భూమి పైన వేరే వారి అధికారం ఉండాలని మేము కోరుకోవడం లేదు. మేము ఇక్కడికి యజమానులం, యజమానులుగానే ఉంటాం. మా ఆస్తిని మేము ఇవ్వదలుచుకోలేదు. నిన్న ఒక వార్త వచ్చింది, దాన్ని చూసి ప్రజలు, ‘గ్రామ సభకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, గ్రామ సభ జరగాలి’ అని అనుకోవడం మొదలుపెట్టారు.

ఇది ఎక్కడో ఒకచోట తప్పుదారి పట్టించే సమాచారం అవుతుందా? ఖచ్చితంగా, మా గ్రామ పంచాయతీ ప్రతినిధులు ఏ విధమైన ఒత్తిడికీ లోనవ్వరు. ఏ గ్రామీణుడు కూడా ఒత్తిడికి లోనవ్వడు. పరిపాలన (అడ్మినిస్ట్రేషన్) తమ అభిప్రాయాన్ని చెప్పదలుచుకుంటే, ఇక్కడ మాట్లాడాలి. మా ప్రత్యేక గ్రామ సభ ఆమోదించిన తీర్మానం మేరకు, గతంలో ప్రభుత్వం ఆమోదించిన అన్ని ప్రజా విచారణలు, ఇతర అధికారాలను రద్దు చేయాలని కోరుతూ మేము కలెక్టర్‌కు 22వ తేదీన ఒక దరఖాస్తు కూడా ఇచ్చాం.

రద్దు చేసే చర్యలు ప్రభుత్వమూ, పాలనా యంత్రాంగమూ  తీసుకోవాలి. ప్రజలు కోరుకుంటున్నది ఇదే. నవంబర్ 11న జరగబోయే ప్రజా విచారణను రద్దు చేయాలని మేము గ్రామ సభ నిర్వహించాం; అందులో తీర్మానం కూడా తయారు చేసి, ఆమోదించాం. దానిని అక్టోబర్ 22న రాయ్‌గఢ్‌లోని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాం..”

’24 గంటల తర్వాత మేము ఏదైనా నిర్ణయం తీసుకుని చెబుతాము’ అని”కలెక్టర్ గారు 24 గంటల సమయం అడిగారు. అందుకని నిన్న జిల్లా పరిషత్ విభాగంలో ఉన్న మా సామరస్ సింఘా గ్రామం నుండి, పురంగ పంచాయతీ నుండి, తెందుమూడి నుండి సర్పంచ్, ఉపసర్పంచ్ లను పిలిచారు. ఇప్పుడు వారి మధ్య ఏం చర్చ జరిగింది, ఏం జరగలేదు అనేది మాకు తెలియదు సార్. కానీ మాకు ఇంతే తెలుసు, మేము మా భూమిని అదానీకి ఇవ్వదలుచుకోలేదు. ఈనాటి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకొన్నాం.

కంపెనీ ఏమంటుందంటే, చెట్లను నరకం, నిర్వాసిత్వం జరగదు, భూసేకరణ కూడా ఉండదు అంటోంది. ఈ విషయంలో మీరేమంటారు సార్? చెట్లు నరకకుండా వారు ఎక్కడ తమ టెంట్ వేసుకుంటారు? ఎక్కడ నుండి త్రవ్వకం ప్రారంభిస్తారు? ‘మేము భూమి కింద ఉన్న బొగ్గును తీసుకుంటాం’ అని వారు అంటున్నారు. సరేనా? బొగ్గును తీస్తాం. మరి త్రవ్వకం పైనుండి మొదలుపెడతారా లేక కింద నుండి తవ్వుకుంటూ పైకి వస్తారా చెప్పండి. దారి అయితే కావాలి కదా.

సరే, రైలు వేస్తామన్నారు. చిన్న రైలు వేసి, దానిలో రవాణా పనులు చేస్తామని చెబుతున్నారు. సరే. దానికోసం కూడా దారికావాలి కదా. చుట్టూ అంతా చెట్లు, మొక్కలే ఉన్నాయి. అంటే, చెట్లు నరకడం ఖాయం సార్. అవును, కాబట్టి చెట్లు, మొక్కలు నరకబోము అనే మాట ఏ విధంగానూ వర్తించదు. చెట్లు నరకడం ఖాయం.

చాలా తక్కువ ప్రాంతంలో, 17 హెక్టార్లలో త్రవ్వకం చేస్తామని కంపెనీ అంటోంది. మిగతా సంగతేంటి సార్? 17 హెక్టార్లు అంటున్నారు. సరే. అటవీ శాఖ భూమి మొత్తం పోతుంది. మరి అటవీ శాఖ భూమి అంటే అర్థం ఏమిటి? అందులో చెట్లు, మొక్కలు ఉన్నాయి. అందుకే కదా దాన్ని అడవి అని పిలుస్తున్నారు.”

“మరి ఎలా నరకకుండా ఉంటారు చెప్పండి? అక్కడి భూమే పోటోంది.  చెట్లు నరకము అని అంటున్నారు. ఎలా నరకకుండా ఉంటారు?

కంపెనీ అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతోంది, ఏమంటారు సార్?

వారు చేయాలనుకున్న అభివృద్ధిని లిఖితపూర్వకంగా, ఏయే అభివృద్ధి జరగబోతోందో మాకు ఒక ప్రమాణ పత్రం రాసి ఇవ్వమనండి; ఆ తర్వాత అభివృద్ధి జరుగిందో లేదో మేం చూస్తాం.. మాకైతే ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు.

చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చోట్ల జరిగింది. నేను కూడా వెళ్ళాను, ఇక్కడి కాల్ కోస్, గేరా కూడా వెళ్ళాను. అది మన ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని (కోల్‌మౌస్), అక్కడికి కూడా వెళ్ళాను. ఆసియాలోనే అతిపెద్ద బొగ్గు గని కదా అది.

అయితే, అక్కడ నిన్న ఒక సంఘటన జరిగింది.

అవును, లాఠీఛార్జ్ జరిగింది. అవును సార్; మేం లాఠీలు, కర్రలు పట్టుకొని వెళ్ళలేదు కదా. వారు తమ హక్కు అడగడానికి వెళ్ళారు. ‘మీరు మా స్థలాన్ని తీసుకున్నారు కాబట్టి, దానికి బదులుగా మాకు నష్టపరిహారం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి’ అని అడిగారు. వారు ఏమైనా తప్పుగా మాట్లాడారా? వారిపై లాఠీఛార్జ్ జరిగింది సార్. కొందరు ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు, అంటే ఎంతగా కొట్టారు అంటే, నేలపైన పడిపోయారు. పడ్డవారిని ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్లో, జైల్లో బంధించారు. వాళ్ళు కేవలం తమ హక్కుని అడగడానికి వెళ్లారు అంతే.

ప్రభుత్వం నిన్న ఒక వార్త నడిపింది, ‘గ్రామస్తులు ప్రజా విచారణకు అంగీకరించారు’ అని. ఇదేమిటంటారు? ఇది మాలో మాకు గొడవలు పెట్టడానికి చేసిన కుట్ర అనిపించదా? సార్, ఇది కేవలం భేదాలు సృష్టించి పాలించే విధానం తప్ప మరోటి కాదు. బ్రిటీష్ వారి కాలంలో మాదిరిగా, ప్రజలను రెచ్చగొట్టడానికి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఏమీ జరగలేదు. ‘అవును, ఇలా మాట్లాడాము, ఒప్పందం జరిగింది’ అని మాత్రమే చెబుతున్నారు.

ఆ అమాయకుల తప్పు ఏమీ లేదు. అసలు విషయం ఏమిటో వారికే తెలియదు. అదే చర్చ జరుగుతోంది. సార్, సర్పంచ్, ఉపసర్పంచ్ లు వెళ్ళారు, ‘ఒప్పందం జరిగింది’ అని చెబుతున్నారు. కానీ సర్పంచులకు అసలు విషయం ఏమిటో కూడా తెలియదు. వారు చెప్పింది విని, తిరిగి వచ్చేశారు. మన సర్పంచ్, ఉపసర్పంచ్ లు అంతగా చదువుకున్నవారు కాదు కదా సార్, రాజ్యాంగంలో ఏముంది, ఏముండాలి అనేది వారికి తెలిసి, ఇతరులకు చెప్పడానికి. మన ఎస్డీఎం సార్ పెసా చట్టం గురించి చెప్పారు. వారికి దాని గురించి సమాచారమే లేదు, మరి ఎలా సమాధానం చెప్పగలరు చెప్పండి? తల అడ్డంగానో, అవుననో ఊపకుండా ఉంటారా సార్?

సార్, అసలు విషయం ఇదే. గ్రామస్తులను బుద్ధిలేనివారిగా చూస్తున్నారు. కదా? గ్రామస్తులు చదువుకోలేదు కాబట్టి, వీరిని ఎలా బురిడీ కొట్టిస్తే, అలా వీరు మా వలలో పడతారని అనుకుంటున్నారు.

నవంబర్ 11న జరగబోయే ప్రజా విచారణను ఎలా ఆపుతాం సార్? మాకు ఎంత వీలైతే అంతవరకు వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తాం. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా మేము వెళ్తాం. చూడండి, అసలు విషయం ఏంటంటే, ప్రజలు వస్తేనే ప్రజా విచారణ జరుగుతుంది. కదా?

“ఒకవేళ ప్రజలు రాకపోతే, ప్రభుత్వ అధికారులు తమకు తామే’ఈ ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు’ అని తీర్మానాన్ని ఆమోదించుకోవచ్చు. ఆ తర్వాత మేము ఏమీ చేయలేము. ఒకవేళ అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటే, మేము వెళ్లి, గట్టిగా వ్యతిరేకిస్తాం. మా ప్రయత్నం మేరకు, ప్రజా విచారణ జరగకుండా, రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము.

నవంబర్ 11న, ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా విచారణ నిర్వహించడానికి ఉత్తర్వు జారీ చేసింది. దీని కారణంగా ఈ మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇవి షెడ్యూల్డ్ ప్రాంతాలు.

ఇవి ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలు. ఇక్కడ పెసా వంటి చట్టం కూడా అమలులో ఉంది. కాబట్టి, ఇక్కడ గ్రామ సభ అంగీకారం లేకుండా, ప్రభుత్వం ఎలాంటి పర్యావరణానికి సంబంధించిన ఎలాంటి  ప్రజా విచారణను నిర్వహించలేదు. ఇందుకోసం ఇక్కడి గ్రామ సభ తీర్మానాన్ని ఆమోదించి, పరిపాలనా యంత్రాంగానికి పంపింది. ‘మేము మా ప్రాంతంలో ఎలాంటి ప్రజా విచారణనూ కోరుకోవడం లేదు’ అని తీర్మానంలో స్పష్టం చేసింది.

‘మేము మా గ్రామానికి చెందిన అటవీ భూమి అయినా లేదా రెవెన్యూ భూమి అయినా, అదానీకి గానీ, ఏ ఇతర కంపెనీకి గానీ ఇవ్వదలుచుకోలేదు’. అంటే, మేము మా నీరు, అడవి, భూమికి యజమానులుగానే కొనసాగాలని కోరుకుంటున్నాము.

ఒకవైపు ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు అభివృద్ధి పేరుతో, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి, గనులు తవ్వి, వారిని నిర్వాసితులను చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ ఒకేతాటిపైకి వచ్చారు.”

“దీనికి సంబంధించి, ఈ రోజు మళ్లీ ఇక్కడ పురుంగాలో, మూడు గ్రామాలకు చెందిన ప్రజలందరూ వేల సంఖ్యలో ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు. నన్ను కూడా పిలిచారు. ఇక్కడికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. వీటిని చూస్తే, ఈ ప్రజా విచారణను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నాకు అనిపిస్తోంది. కలెక్టర్ గారు వెంటనే రద్దు చేయాలి.

రాజ్యాంగం ప్రకారం రూపొందించబడిన చట్టం… గత రోజుల్లో చూసినట్లుగా, పెసా చట్టం కింద గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఉన్నత స్థాయి ప్రజా విచారణను రద్దు చేశారు. ఎందుకంటే రాజ్యాంగపరంగా చట్టాన్ని అమలు చేయాలి. దీనిని ఏ దృష్టితో చూడాలి? దీన్ని పాటించాలా?

ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగ పాలన ఉండాలి, కానీ ఏ పరిశ్రమల యజమాని సూచనల మేరకో ప్రభుత్వం పనిచేయకూడదు. దేశం మొత్తం మీద ఈ రోజు అదానీ సూచనల మేరకు ఇక్కడి ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో మీరంతా చూస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం బస్తర్ అటవీ ప్రాంతంలో 350 ఎకరాల భూమిని అదానీకి ఇచ్చేశారు, ఆ అడవిని నరకడానికి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నిరంతరం అడవులను నరుకుతున్నారు.

రాయ్‌గఢ్‌లో, మన తమనార్ ప్రాంతంలో నిరంతరం పెద్దపెద్ద ఆందోళనలు ఎలా జరుగుతున్నాయో చూడండి. అడవులు నరకేస్తున్నారు. అక్కడ ప్రజలను నియంతృత్వ ధోరణితో అరెస్టు చేస్తున్నారు; పోలీసు తుపాకీల మొనపై ప్రజలను అరెస్టు చేశారు. అందులో నేను స్వయంగా అరెస్టు అయ్యాను. అక్కడ ప్రాంతీయ ఎమ్మెల్యే కూడా తన కార్యకర్తలతో పాటు అరెస్టు అయ్యారు. కాబట్టి, ఈ విధంగా నియంతృత్వ ధోరణితో ఇక్కడ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోంది. దీనికి వ్యతిరేకంగా దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, ఈ ప్రాంత ప్రజలందరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం ఉంది.

2006లో, కర్ణాటకకు సంబంధించిన ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆ భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలు (నిర్వాహకులే) మాత్రమే, యజమానులు కాదు. ఆ భూమిపై ఎవరికి అధికార పత్రం ఉంటుందో వారే యజమాని. కాబట్టి, భూమి కింద ఉన్నది, పైన ఉన్నది రెండింటికి కూడా వారే యజమానులు.”

“మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, 2002లో ఈ దేశంలో ఒక సమత తీర్పు (సమతా జడ్జ్‌మెంట్) వచ్చింది. అది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. అందులో చాలా స్పష్టంగా చెప్పినది ఏంటంటే, ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో, ఆదివాసీల సంరక్షణ, వారి సంస్కృతి, వారి పోషణ, వారి సహజ వనరులపైన ఉన్న యజమాన్యపు హక్కులు ఆదివాసీ సమాజానికే చెందుతాయి.

నేను చాలా మందికి సమత తీర్పు ఆదేశం కాపీని ఇచ్చాను. ఇక్కడి ప్రజలు 23వ తేదీన కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, కలెక్టర్ గారు ‘భూమి లోపల ఉన్న భాగంపైన మీకు యజమాన్యపు హక్కు లేదు. కాబట్టి మీ వ్యతిరేకించలేరు’ అని అన్నారు. అందుకని ఆ సమత తీర్పును, భూమి యజమాన్యపు హక్కులకు సంబంధించి 2013 సెప్టెంబర్ 5న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని  కూడా నేను ఈ రోజు కలెక్టర్ గారికి పంపాను.

ఆ నిర్ణయాన్ని మీరందరూ గూగుల్‌లో చూడవచ్చు. ఆ తీర్పు చాలా స్పష్టంగా ఉంది. మీడియా వ్యక్తులు కూడా దానిని చూడాలి; అలాగే యువత కూడా దానిని చదివి, ప్రజలకు వివరించాలి – ‘ఇవి మన హక్కులు’ అని.

ఎవరైనా, సబ్-డివిజనల్ ఆఫీసర్ అయినా లేదా కలెక్టర్ అయినా, మేము వారితో మాట్లాడేటప్పుడు, ఆ ఆదేశాల కాపీలను తీసుకువెళ్లి వారితో చెప్తాం, ‘సార్, ముందు మీరు ఇది చదివి మాకు వినిపించండి. ఆ తర్వాత ఇందులో ఏది రాసి ఉంటుందో, దాన్ని మేము కూడా పాటిస్తాం, మీరు కూడా పాటించండి’ అని.”

2025 అక్టోబర్ 26

రాయ్‌ఘడ్ న్యూస్; హర్‌పాల్ సింగ్; ఖుంటే టి హెచ్‌ఎన్ 24

తెలుగు ప్రతి: పద్మ కొండిపర్తి

Leave a Reply