(*విప్ల‌వోద్య‌మంపై విషం క‌క్కుతున్న విద్యార్థి ప‌రిష‌త్ ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టండి* అనే పేరుతో రాడిక‌ల్ విద్యార్థి సంఘం 1984లో ప్ర‌చురించిన పుస్త‌కంలోని ఒక వ్యాసం ఇది- వ‌సంత‌మేఘం టీం)

తరతరాల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటాలపై తీవ్రమైన దమనకాండను ప్రయోగించి అణిచి వేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం సి.ఆర్.పి బలగాలను దింపగా మరో వంక ఆరెస్సెస్ ,బిజెపి, ఎబివిపిలు ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలిచి విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ రైతుకూలీలపై, విద్యార్థి యువజనులపై పాశవికమైన దాడులకు పాల్పడుతున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలలో ఈ ఫాసిస్టు మూకల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది. భూస్వాముల పక్షాన నిలిచి గ్రామాలలోనూ,  దొంగవ్యాపారులు, మార్వాడీ సేట్లకు దన్నుగా నిలబడి బస్తీలలోనూ ఈ ఫాసిస్టు గూండాలు స్వైరవిహారం చేస్తున్నారు. అధికారవర్గం చంకలోచేరి, కళాశాలలు పాఠశాలల్లో,  సమస్యల సాధనకోసం పోరాడే విద్యార్థులపై విరుచుక పడుతున్నారు. ఇలా మొత్తంగా విప్లవోద్యమంపైనే విషాన్ని విరజిమ్ముతున్నారు.

ఈ దుర్మార్గమైన దాడులను, ప్రచారదాడిని బలోపేతంగా తిప్పికొట్టడానికి కార్మికులు, రైతాంగం, విద్యార్థి యువజనులు ఉద్యోగులు, మేధావులు, ప్రజా స్వామికవాదులు ఒక్కరనేమిటి యావన్మంది ప్రజలు ఆర్.యస్.యస్, బి.జె.పి, ఎ.బి.వి.పిల అసలు రంగును తెలుసుకోవాలి. వాటి మతోన్మాదం ఎంతటి విపత్తుకు దారి తీయగలదో గుర్తెరగాలి. ఆ గూండా సంస్థల ఫాసిస్టు స్వభావాన్ని గ్రహించాలి. తద్వారా మాత్రమే విప్లవోద్యమానికి ఎదురు నిలిచి ఈ సంస్థలు విసురు తున్న సవాలును ఎదుర్కోగలం.విప్లవోద్యమాన్ని కాపాడుకుని పురోగమించ గలం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆర్.యస్.యస్) ఒక ఫాసిస్టు సంస్థ. అది విప్లవోద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి బద్ధశత్రువు. ఇదివరలో జనసంఘ్ గా వుండి అటు తరువాత జనతాలో దూరి ఈనాడు భారతీయ జనతాపార్టీగా (బిజెపి) అవతారమెత్తిన  ఆ పార్టీ ఆర్.యస్.యస్ కు రాజకీయ వేదిక. ఆ పార్టీ కై నా దాని అనుబంధ సంస్థయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కైనా మార్గ దర్శకత్వం వహించే సిద్ధాంతాల సరంజామాను ఆర్.యస్.యస్ అందిస్తుంది. కనుక ఎబివిపి, బిజెపిల నిజస్వరూపం తెల్సుకోవాలంటే ఆర్.యస్.యస్. ప్రబో ధించే విషయాలను శాస్త్రీయంగా పరిశీలించాలి.

దోపిడీ వర్గాలు తమ పాలనను సజావుగా సాగించుకోవడానికి పీడిత ప్రజలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం మొదలుకొని ప్రతి అవకాశాన్ని జార విడుచు కోకుండా వాడుకుంటాయి. ప్రజలు సంఘటిత పడకుండా చూస్తూ ఒక సెక్షన్ ప్రజలపై మరో సెక్షన్ ప్రజలను రెచ్చగొడ్తాయి. తామే అసలు శత్రువన్న విషయాన్ని కనుమరుగు చేయ ప్రయత్నిస్తాయి. ఇందుకోసం ప్రత్యేక సంస్థలను నిర్మిస్తాయి. ప్రజల మధ్య విబేధాలను రెచ్చగొట్టడానికి అవి  ఏ నినాదాలతో ముందుకు వచ్చినప్పటికీ చివరకు అవి ప్రజాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో నిర్మించబడే సంస్థలే. ఆర్.యస్.యస్ సరిగ్గా అలాంటిదే. ఆర్.యస్.యస్ అన గానే అది ముస్లిం వ్యతిరేక సంస్థ అని మనకు తెలుస్తుంది. అయితే అక్కడితోనే మనం ఆగిపోతే ఆర్. యస్. యస్ నిజస్వరూపం మనకు అర్థమవదు.ఆరెస్సెస్ ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంతో ప్రారంభమై దాని చాటున భూస్వామ్య సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడే సంస్థ. ఆరెస్సెస్ భారత బడాబూర్జువా పాలకవర్గాల విస్తరణవాదాన్ని హిందూ మతోన్మాద పదజాలంతో సమర్థిస్తూ సామ్రాజ్య వాదులకు దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని గొప్పగా కొనియాడుతూ దోపిడీ వర్గాల ప్రయోజనాలను ఈడేర్చే సంస్థ. ఆరెస్సెస్ విప్లవోద్యమాన్ని ప్రజాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ప్రజలలో చీలికలు కల్పించే మత కల్లోలాలను రెచ్చగొట్టడం మొదలుకొని విప్లవ ప్రజానీకం పై అమానుషమైన భౌతికదాడులు సాగించేందుకు దోపిడీ వర్గాల చేతుల్లో ఒక ఆయుధంగా ఉపకరించే ఫాసిస్టు సంస్థ.స్వాతంత్ర పోరాట కాలంలో దీని చరిత్రంతా బ్రిటిష్ వారితో మిలాఖతై ప్రజలను చీల్చిన చరిత్రే. జాతీయ ప్రజాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీసిన చరిత్రే.

మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం వలస ఏదేశాలన్నింటా  జాతీయ విముక్తి పోరాటాలు ప్రభంజనంలా సాగాయి. 1917లో జయప్రదమయిన మహత్తర సోషలిస్టు విప్లవం స్వాతంత్ర పోరాటాలను ఎంతగానో ఉత్తేజపరిచింది. మనదేశంలో కూడా జాతీయోద్యమం మిన్నంటుతూ సాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, దాని మిత్రరాజ్యాలు కలిసి టర్కీ సుల్తాన్ను పదవీచ్యుతుణ్ణి చేయడం భారతీయ ముస్లింలకు ఆగ్రహావేశాలను తెప్పించింది. 1919-22 మధ్యకాలంలో సాగిన ఖిలాఫత్ ఉద్యమంలో స్వాతంత్ర పోరాటంలోకి ఒక కొత్త స్రవంతి వచ్చి కలిసింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా సాగిన జాతీయాందోళన భారత ప్రజలందర్నీ సమానంగా సృశించింది, హిందూ ముస్లిం ప్రజలు ఉభయుల్నీ రాజకీయ కార్యాచరణలో ఒక్కటిగా బంధించింది. ఆనాడు ఆర్య సమాజ నాయకు డొకరిని ఢిల్లీ జుమ్మా మసీదులో ప్రసంగించడానికి ముస్లింలు ఆహ్వానించారంటే, హిందూ ముస్లింల మధ్య ఎంతటి సుహృద్భావం ఏర్పడిందో గమనించవచ్చు. ఖిలాఫత్ ఉద్యమం, అదే కాలంలో కొనసాగిన సహాయ నిరాకరణోద్యమం ఒక దానిలో ఒకటి పెనవేసుకుని నడిచాయి. ప్రజలంతా సమైక్యంగా కదిలితే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో నిరూపించిన కాలమది. అయితే ఈ ప్రజా విజృంభణ బ్రిటిష్ వారిని ఎంతగా కలవరపరిచిందో బడా బూర్జువా భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెసు నాయకుడు గాంధీని కూడా అంతగానే గడగడ లాడించింది. చౌరీచౌరా సంఘటనతో భీతిల్లిపోయి సామ్రాజ్యవాదులకు దాసోహం పలుకుతూ గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించాడు. పెనుమంటలపై చన్నీళ్ళు గుమ్మరించాడు. ఒక్కసారిగా జాతీయోద్యమంలో నిస్పృహ ఆవరించింది. హిందువులు ముస్లింలు ఏకమైతే ఎటువంటి పరిణామాలను ఎదుర్కో వలసివస్తుందో స్వానుభవంలో తెలుసుకున్న బ్రిటిష్ వారు జాతీయోద్యమంలో ఏర్పడిన నిస్పృహను ఆసరా చేసుకుని హిందూ ముస్లింల సమైక్యతను దెబ్బతీయడానికి కుతంత్రాలు పన్నారు. సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను ఈడేర్చుతూ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తూ ఇరుమతాల్లోని మతోన్మాదులు రంగప్రవేశం చేశారు.

ఫలితంగా 1923 తరువాత పదే పదే మత కలహాలు చెలరేగాయి. ఈ పరిస్థితులలోనే 1925లో హిందూమతోన్మాద సంస్థ ఆరెస్సెస్ ఏర్పడింది. డాక్టర్ ‘కేశవబలీరాం హెడ్గెవార్ దాని సంస్థాపకుడు. ఆరెస్సెస్ దృష్టిలో స్వాతంత్ర సముపార్జన అంటే దేశం నుండి ఎటువంటి రాజీలకు తావు లేకుండా బ్రిటిష్ వాడు వెళ్ళిపోవడం కాదు, ముస్లింలు వైదొలగిపోవడం. దేశానికి పట్టిన పీడ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వల్లకాదు, ముస్లింలవల్ల అని.  ఆరెస్సెస్ ఏర్పడిన నాటి నుండి స్వాతంత్ర పోరాటాన్ని బలహీనపరుస్తూ అనేక చోట్ల మతకల్లోలాలు రెచ్చగొట్టబడ్డాయి. జాతీయోద్యమానికి బలమైన కేంద్రాలయిన మహారాష్ట్ర తదితర ప్రాంతాలలోనే కలహాలు రెచ్చగొట్టబడటం గమనార్హం.

1947 లో బ్రిటిషువారి కుయుక్తుల మూలంగా దేశవిభజన జరిగింది. అయితే దేశవిభజనకు కారణం ముస్లింలేనంటూ ఆర్.ఎస్.ఎస్ మతోన్మాదులు దుమారాన్ని రేపి మతకలహాలను ప్రేరేపించారు. ప్రజలరక్తం ఆనాడు ఏరులై పారింది.

ఇట్లా ఆరెస్సెస్ బ్రిటిషు వారి కాలంలో ప్రజలను చీల్చడానికి, జాతీయ ప్రజాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీయడానికి సామ్రాజ్యవాదుల చేతుల్లో ఒక పరికరంగా ఉపయోగపడింది. ఆరెస్సెస్ భావాలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి హిందూ మతోన్మాదానికి మచ్చుతునకలు. ఆరెస్సెస్ నేతలు తమ సంస్థను ఒక సాంస్కృతిక సంస్థగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. కర్రతిప్పడం తదితర ఆటలతో యువకులను ఆకర్షించి హిందూమతోన్మాద విషాన్ని రంగరించి పోస్తారు. చరిత్రను ఆసాంతం వక్రీకరించి వారి లేత మనసుల్ని కలుషితం చేస్తారు. తమ శాఖల ‘కార్యకలాపాల్లో కృత్రిమ యుద్ధాలను నిర్వహించి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలో వారినెలా మట్టుబెట్టాలో తర్ఫీదు యిస్తారు. కమ్యూనిజంపట్ల పీడిత ప్రజానీకం పట్ల ఏహ్యభావాన్ని కలుగ చేస్తారు.

ఆరెస్సెస్ కు బైబిల్ లాంటిది వాళ్ల సర్ సంఘ్ చాలక్ ఎమ్.ఎస్ గోల్వాల్కర్ రాసిన “పాంచజన్యం” (బంచ్ ఆఫ్ ధాట్స్)ను పరిశీలిస్తే దాని భావాలు ప్రజా తంత్ర ఉద్యమానికి ఎంతటి ముప్పో తెలుస్తుంది. జర్మన్ జాతి ప్రపంచంలో ఉత్కృష్టమైన జాతి అని జర్మన్ యువతను రెచ్చగొట్టిన హిట్లర్ లాగే హిందూమతం ప్రపంచంలో అత్యున్నతమైనదని గోల్వాల్కర్ చెబుతాడు. (ఆయనను స్వామీజీ, గురూజీ, మహర్షి అని ఆరెస్సెస్ వాళ్ళు పిలుస్తారు). ఆయనగారి దృష్టిలో మన దేశ సరిహద్దులు ఉత్తరాన కాశ్మీరు, దక్షిణాన కన్యాకుమారి, ఇరుప్రక్కలా అరేబియా సముద్రం, బంగాళాఖాతం కాదు. అంతకంటే చాలా విశాలమైనది. అదెంత విశాలమైనదో ఆ ప్రబుద్ధుడి మాటల్లోనే చూడండి…

“మన పూర్వులు మన పుణ్యక్షేత్రాలలో కొన్నింటిని హిమాలయ పర్వతోత్తర భాగంలో నెలకొల్పారు. తద్వారా ఆ ప్రాంతాలను మన సజీవ సరిహద్దులుగా చేశారు. టిబెట్టు అంటే త్రివిష్టపం మన నాయకమ్మన్యులు దాన్నొక చైనారాష్ట్రం అంటున్నారు. దేవ భూమి, జగదీశ్వరుడైన పరమేశ్వరుడి నివాస స్థలమైన కైలాసం. మన పుణ్యనదులైన గంగా, సింధు, బ్రహ్మపుత్రల జన్మస్థానంగా పరిగణింపబడే మానస సరోవరం పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం”. ఇలా సాగిసాగి స్వామిజీ ఏం చెబుతాడంటే మన మాతృదేశ చిత్రాన్ని ఊహించుకుంటే హిమవంతుడు (హిమాలయాలు) తన రెండు చేతులనూ పశ్చిమాన ఆర్యన్ (ఇరాను) వద్ద, తూర్పున శృంగపురం (సింగపూర్) వద్ద రెండు సముద్రాల్లోనూ ముంచినట్లు, మాతృదేవి పవిత్ర చరణాల మ్రోల దక్షిణ సముద్రం చెంత లంక (సింహళం) అనే పద్మ పత్రం ఉంచినట్లూ కానవస్తుంది. ఈ చిత్రం ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రజల మానసిక పటలాలపై సముజ్వలంగా నిరంత రాయంగా వెలుగొందేలా చెయ్యబడింది…. దాన్ని ముక్కలు చెయ్యడమన్న భావమే మనకు భరింపరానిది.

మరి మనమిప్పుడు ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే “ఈ ప్రపంచంలో విజయవంతమైన జీవిత తత్వ మంతా వీర భోగ్యా వసుంధరీ (రాజ్యం వీర భోజ్యం)అన్న పదంలో ఇమిడి వుంది” అని ఆయనంటాడు. వీరుడిదే రాజ్యమని దీని అర్థం. బలప్రయోగంతో ఇరుగుపొరుగు దేశాలను ఆక్రమించి వాటిని “మాతృ భూమి”లో విలీనం  చేయాలంటాడీ మహర్షి. లేకపోతే మన మగతనానికెంత అవమానమని వాపోతాడు. “ప్రస్తుత రాజకీయ సరిహద్దులే మన మాతృదేశ సమగ్ర స్వరూపాన్ని తెలిపే ఎల్ల లనుకున్నా పునశ్చరణ చేసినా మన అంతరాత్మను మనం మొద్దు బార చేసుకున్న వాళ్ళమే అవుతాం. మన మగటిమికెంత అవమానం: మన తెలివికెంత అపచారం” అని తనను తెలివికల వాడికింద జమకట్టు కుంటాడు. ఇది తెలివిని తెలపదు సరికదా, చావు తెలివిని, పచ్చి మతోన్మాదాన్ని, అతినగ్నమైన ఫాసిజాన్ని, విస్తరణవాద తత్వాన్ని స్పష్టపరుస్తుంది. గోళ్వాల్కర్ బోధనలు  కేవలం ముస్లింలకు, ముస్లిం దేశమైన పాకిస్తాన్ కు మాత్రమే వ్యతిరేక మయినవి  కాదని, అది ముస్లిం వ్యతిరేకతతో ప్రారంభమై హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి తొండముదిరి ఊసరవెల్లిగా మారే ఫాసిజమని అర్థమవుతుంది. లేకపోతే ఇరాన్ తో మొదలుకుని పాకిస్తాన్, శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలను దురాక్రమించాలనే ప్రబోధాలకు వేరే అర్థమేముంది?

ఆనాడు చక్రవర్తులు వారి వందిమాగధులు “రాజ్యం వీరభోజ్యం” అని అనేవారు. ఈనాడు అదే మాటను సామ్రాజ్యవాదులు అంటున్నారు. మన దేశంకూడా రాజ్యం వీర భోజ్యమే అని అంటే అది వీరత్వంకోసం సామ్రాజ్యవాదుల దగ్గరకు పరిగెత్తాల్సిందే.

ఇందిరమ్మ,  రాజ్యం వీరభోజ్యమేనంటోంది.వీరత్వం కోసం రష్యా దగ్గరకు పరిగెత్తుతోంది. ఆరెస్సెస్ గురూజీ అమెరికా దగ్గరకు వెళ్దామంటాడు. అమెరికా నుండి ఆయుధాలు సంపాదించా లంటాడు. “మనకు అమెరికా నుండి సహాయం వచ్చింది. దాన్ని గురించి…. ఒక్క మంచి మాట అన్నపాపాన పోలేదు. కనీసం యిప్పుడైనా, కృతజ్ఞతా పూర్వకంగా ఒక్కగానొక్క మాటైనా చెప్తాం” అని అంటూ అమెరికాపట్ల తన స్వామిభక్తి పరాయణత్వాన్ని చాటు కుంటాడు. “అణుబాంబు ఉత్పత్తికి సిద్ధాంతపరము, పాండితీ ప్రదర్శకమూ అయిన సంకోచాలేవీ అడ్డం రాకుడద”ని సెలవిస్తాడు. ఇలా అమెరికా నుండి ఆయుధాలను తెచ్చుకుని, అణుబాంబులు తయారుచేసి ఇరుగుపోరుగు దేశాల పై వేసి వాటిని దురాక్రమిద్దా మంటాడు. “ఈ మధ్య మన దేశంలో అలీన విధానమనీ  మన్ననీ మశానమనీ ఏవేవో తెగ విన్పిస్తున్నాయ”ని చిరాకుపడ్తాడు. మన దేశం చుట్టూ ఎన్నో ఇతర దేశాలున్నాయి…. అవన్నీకూడా మన దేశానికొక విధంగా శత్రువులు కాగల దేశాలేన”నని ఉద్ఘాటించి కాశ్మీరు సమస్యలో పాకిస్తాన్ “జోక్యం” గురించి “ఇది దుస్సహంగా తయారైంది. తాడోపేడో తేల్చుకోవాలి ఈ సమస్యనిలా నాన నివ్వరాదు. ఈ సమస్యనొక కొలిక్కి తేవాలి. దీన్ని శాశ్వతంగా తేల్చిపారెయ్యాలి” అని ఆగ్రహాన్ని ప్రకటిస్తాడు. “1965 యుద్ధంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ లోని లాహోరు, రావల్పిండి, కరాచీని పట్టుకోవాల్సింది” అని ప్రభుత్వానికొక సలహా అందిస్తాడు. టిబెట్ విషయంలో ఏం చెబుతాడో చూడిండి:

“దలైలామా ఈనాడు మన మధ్య వున్నాడు…. టిబెట్ విముక్తి విషయంలో  మనకిదొక అనుకూలాంశం, దలైలామాను తన ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని టిబెట్ స్వాతంత్రాన్ని ప్రకటించు కోనివ్వండి. ఆయన తనదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించడానికి మనము ఆయనకు చెయ్యగల సహాయమంతా చెయ్యాలి.”

ఇలా సాగిపోతుంది మహర్షి ప్రబోధనల ప్రవాహం. మాట వరుసకి ఇరుగు పొరుగు దేశాలపై దురాక్రమణ యుద్ధానికై కావలసిన ఆయుధాలు అమెరికా నుండి తెచ్చుకుందా మనుకున్నా  ఆ సామ్రాజ్యవాద దేశం విధించే షరతులతో మన మాతృదేశం తాకట్టు పెట్టబడుతుంది. అయితే ఈ విషయం జోలికి ఆయనపోడు. దురాక్రమణ యుద్ధాలకోసం సామ్రాజ్యవాదులకు దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని అమ్ముకోవడానికి ఈ మహర్షి సంసిద్ధమే. అంతేకాదు ఇప్పటికే దేశం సామ్రాజ్యవాదులకు వంగి వంగి సలాములు చేస్తున్న అవమానకరమైన సంగతిని ఆయన ఎత్తడు. సామ్రాజ్యవాద విష సంస్కృతిపై విరుచుకపడడు. సామ్రాజ్యవాదం ఈనాడు ప్రపంచ మానవాళికి ముప్పుగా తయారయిందన్న విషయాన్ని కనుమరుగు చేస్తూ ఇరుగు పొరుగు దేశాలను మన శత్రువులుగా ముందుకు తెస్తాడు.వాటితో మైత్రిని వ్యతిరేకిస్తాడు. వాటిని కబళించి వేయాలంటాడు.

ఇవన్నీ ఫాసిస్టు స్వభావాన్ని స్పష్టపరిచే ప్రేలాపనలు కాక మరేమిటి ?

భూస్వామ్య విధానాన్ని కాపాడే ఆరెస్సెస్ మతోన్మాదులకు,సామ్రాజ్య వాదులకు దోస్తీ ఎలా ఏర్పడిందనేది ప్రధానమైన ప్రశ్న: మన హైందవ సంస్కృతి అత్యున్నత మైన దంటూ భూస్వామ్య సంస్కృతిని ఆకాశానికెత్తే ఆరెస్సెస్, సామ్రాజ్యవాద సంస్కృతి అంటే అపారమైన ప్రేమాభిమానాలు కల్గి ఉన్నదెందుకనేది ప్రధానమైన ప్రశ్న. సామ్రాజ్యవాదులతో ఆరెస్సెస్ కున్న సంబంధ బాంధవ్యాలు,ప్రేమానురాగాలు తమాషాగా ఏర్పడ్డవికావు. అవి యాదృచ్ఛికమైన వంతకంటే కావు. సామ్రాజవాదులు తమ దోపిడి యధేచ్ఛగా సాగడానికి మూడవ ప్రపంచ దేశాలను వ్యావసాయిక దేశాలుగానే వుంచుతూ వాటిని అభివృద్ధి కానీయకుండా అదిమి పడ్తున్నారు. అవి అర్థవలస అర్ధభూస్వామ్య దేశాలుగా వుండడం,సామ్రాజ్యవాదుల కవసరం. దీనివల్ల ఆయా దేశాలలో లాభపడేది భూస్వాములు,బడా బూర్జువాలే తప్ప మరొకరు కాదు. మనదేశంలో భూస్వామ్య విధానం కాపాడ బడాలని కోరుకునే వాడెవడైనా సామ్రాజ్య వాదులతో అంటకాగక తప్పదు. తన రక్షణకు ఆ బందిపోట్ల పై ఆధారపడక తప్పదు. ఈ పరిణామమే సామ్రాజ్యవాదులకు ఆరెస్సెస్ మధ్య మిలాఖత్ కూ దారితీసింది.భూస్వామ్య విధానాన్ని అనుక్షణం కాపాడుతూ సామ్రాజ్య వాదులకు సేవలు చేసే వీళ్లకు ప్రజల ప్రయోజనాలంటే  చుక్కెదురు. ప్రజల జీవన పరిస్థితుల మెరుగుదల పైన గోళ్వాల్కర్ సుభాషితాలను చూడండి…

“మనం కూడా ఎండమావిలో నీళ్ళకోసం తెల్లవాళ్ళవలె ఆశయాల వేట తమకంలో పడి జీవన ప్రమాణాలు పెంచాలి” అన్న నినాదాన్ని పునశ్చరణ చెయ్య నారంభించాం. అంటే ఏమిటన్న మాట? జీవితానికి సంబంధించిన భౌతిక విష యాలకు నానాటికీ ఎక్కువ దాసులం కానారంభించా మన్నమాట. వేరే మాటల్లో చెప్పాలంటే మనిషి తనలోని పశువుకు అంత కంతకూ ఎక్కువగా బానిస  అవుతున్నాడన్న మాట. పశుత్వానికి పట్టం కట్టినందు వల్లనే స్వార్థబుద్ధి, యీర్ష్యా సూయలు యీనాడిలా సర్వతో ముఖంగా స్వైర విహారం చేస్తున్నాయి”.

మరేం చేయాలి? (వ్యవసాయకూలీలు కూలీరేట్లు పెంచమని) సమ్మెలు చేయ కూడదు. రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర అడక్కూడదు. కార్మికులు ఉద్యోగులు జీతాలు పెంచమని కోరకూడదు. విద్యార్థులు తమ వసతుల కోసం పోరాడకూడదు. ఇవన్నీ ఈర్ష్యాసూయలకు, పశుత్వానికి చిహ్నాలు. అందరమూ కలసిపని చేస్తూ పోవాలి. భూస్వాములు, పెట్టుబడిదారులు రోజు రోజుకు లావెక్కుతూ వారిష్టమున్నంత ముట్ట జెప్తారు. మాకిది సరిపోవడం లేదని అడిగిన శ్రామికుడు పశువు. బొర్రబాగా పెంచి ఎకసెక్కంగా మెక్కే భూస్వాములు పెట్టుబడిదారులేమో మనుషులు. వీళ్ళకే మోక్షమూ గట్రా లభిస్తాయి. పశువులకు నరకం సంప్రాప్తిస్తుంది. “ఫలితం గురించి ఆలోచించకు కర్మ చేయడమే నీ విధిష అనే దోపిడీ దొంగల గీతోపదేశమే యిదంతా. అంతేకాదు గోల్వాల్కర్ ఇంకా ఇలా చెప్తాడు. “సంక్షేమ రాజ్యమని చెప్పుకుంటూ మన ప్రభుత్వం శక్తిని, అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకుని విద్యా, వైద్యసదుపాయాలు, సామాజిక జీవితం, ఉత్పత్తి, పంపిణి మొదలైన జీవనరంగాలన్నీ తన ఛత్రచ్ఛాయల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ వున్నది. ఆ విధంగా ప్రభుత్వమే మానవుని కార్య కలాపాలన్నీ గుత్తకొంటే ఇంక వ్యక్తి ఏ పనీ చెయ్యడానికీ ప్రేరణలేకుండా బానిస మాత్రమే అయిపోతాడు” అని ఇప్పటికే ఈ దోపిడీ ప్రభుత్వం నామ మాత్రంగా నిధులను కేటాయిస్తూ అంతంత మాత్రంగానే వున్న విద్య వైద్య సదుపాయాలను కూడా పూర్తిగా పెట్టుబడిదారులకు వ్యాపారులకు ఒప్పచెప్పాలంటాడు. ప్రజలకు వున్న ఆ కొద్దిపాటి సౌకర్యాలను కూడా హుళక్కి చేయాలంటాడు.చివరకు ఉత్పత్తి పంపిణీలను కూడా పూర్తిగా వ్యక్తులకు (బూర్జువాలకు, భూస్వాము లకు) అప్పగించాలంటాడు. నామ మాత్రంగాకూడా ప్రభుత్వం ప్రజాసంక్షేమం  గురించి అవి చేస్తాం యివి చేస్తామని అనకూడదు. దానివల్ల మేలుకంటే కీడు జరుగు తుందని ప్రబోధిస్తాడు. “సామాన్య ప్రజానీకానికి ఉన్నత జీవనస్థాయి గురించి చెవి నిల్లుకట్టుకుని అదేపనిగా వాగ్దానాలు చేస్తున్నారు…. పడేపదే వాగ్దానాలు చేయడంవల్ల ప్రజల్లో నిస్పృహకల్గి, కల్లోలానికి దారితీస్తుంద”ని చెప్పడమే గాక సంస్కరణల వల్ల ప్రజలలో విప్లవ భావాలు ధృఢపడుతాయని చెబుతూ “సామ్యవాద భావప్రచారాలను మన దేశంలో విఫలం చేయడానికి ప్రయత్నాలనేకం జరుగుతున్నాయి. వినోభాజీ ప్రారంభించిన భూదాన ఉద్యమం కమ్యూనిస్టు ప్రభావాన్ని పోగొడుతుందని కొందరు భావిస్తున్నారు. కాని తద్విరుద్ధంగా దానిలో వున్నటువంటి “దున్నేవానికే భూమి” అనే కమ్యూనిస్టు నినాదం వల్లను, ఆయన అనుచరుల్లో దూరదృష్టిలేని కొందరు “మీ అంతట మీరు భూమి నివ్వక పోతే కమ్యూనిస్టులు వచ్చి తీరుతారు. మీకు చెందిందంతా లాక్కుంటారు” అని బెదిరించడం వల్లను సామ్యవాదమే సరియైనదనీ, అదివచ్చి తీరుతుందని … ఈ భావం మాత్రమే ప్రజలలో ఏర్పడుతుంది.” కాబట్టి ప్రజా పోరాటాలను పక్కదారి పట్టిం చేందుకు చేపట్టే వాగ్దానాల నయినా, సంస్కరణలనైనా ప్రభుత్వం ఆవలకి నెట్టేయా లంటాడు. “అసూయ, ద్వేషం, దురాక్రమణ మొదలైన వాటివల్ల కల్గే ఆంతరంగిక సంఘర్షణలను పరిష్కరించడానికి మాత్రమే” ప్రభుత్వ యంత్రాంగం పరి మిత మంటాడు. ఇలా సంపన్న వర్గాలపై “అసూయా ద్వేషాలతో” ప్రజలు చేసే పోరాటాలను ఎటువంటి ఊగిసలాటలకు తావులేకుండా అణిచివేసే, ఇరుగు పొరుగు దేశాలపై దురాక్రమణ యుద్ధాలను నడిపే పచ్చిఫాసిస్టు రాజ్యాంగ యంత్రాన్ని ఆరెస్సెస్ గురూజీ మనకండ్ల ముందు సాక్షాత్కరింప జేస్తాడు.

నియంతయైన హిట్లర్ జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టడమేగాక , ప్రజల మధ్య పెట్టేందుకు కొన్ని సోషలిస్టు కోర్కెలను ముందుకు తెచ్చి,అటు తరువాత ఫాసిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పాడు గానీ గోల్వాల్కర్ మాత్రం ఏకంగా ఫాసిస్టు రాజ్యాంగ యంత్రాన్ని నెలకొల్పడానికి హిందూ మతోన్మాదాన్నే పునాదిగా చేసుకుని హిట్లర్ను మించి పోయాడు. ఆరెస్సెస్ కోరుకునే ఫాసిస్టు ప్రభుత్వపాలన ఎలా వుంటుందో వేరుగా చెప్పనక్కర లేదు. దోపిడీదారుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రజలను అన్ని రకాలుగా పీడించుకు తినడం, దేశాన్ని జాతుల బందిఖానాగా మార్చడం దానిలక్ష్యం.  రాజ్యాంగానికి ఫెడరల్ స్వభావం వుండాలన్న వాదన వింటేనే, గోల్వాల్కర్ మండి పడతాడు. రాజ్యాంగంలో నామమాత్రంగా వున్న ఫెడరల్ స్వభావాన్ని కూడా తిరస్కరిస్తూ  ఆ స్వామీజీ ఏమంటాడో చూడండి. “మన ప్రస్తుత రాజ్యాంగాన్ని తయారు చేసిన వారికి కూడా ఏకాత్మకమైన రాష్ట్రీయ భావనపట్ల ధృఢ విశ్వాసం లేదని, రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వరూపాన్ని చూచినప్పుడు అర్థమవుతుంది. కొన్ని రాష్ట్రాల యొక్క సమాఖ్య అని దీన్ని ఈనాడు అంటున్నారు” అని వాపోతాడు. ఇలా ఆరెస్సెస్  భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కూడా వ్యతిరేకించింది. దాని దృష్టిలో తెలుగు, తమిళ, కన్నడ, మొదలైనవి జాతులు కావు, ఇంతకంటే పచ్చి అభివృద్ధి నిరోధకత్వం మరొకటి వుంటుందా? ఇంత కంటే ప్రజాతంత్ర వ్యతిరేక మయిన ఆలోచన మరొకటి ఉంటుందా? గోల్వాల్కర్ ప్రబుద్ధుడు ఇంకా ఏమంటాడో చూడండి; “నిజానికి ఏకమైన మన జాతీయజీవనాన్ని గతంలో వేర్వేరు రాజ్యా ధి కారాలుగల అనేక భాగాలుగా విడగొట్టడమే – జాతీయ విఘటనకు పరాజయానికి బీజాలను నాటింది. ఈనాటి సమాజ స్వరూపంలో వున్న రాజ్యాంగంలో కూడా అదే విధమైన విఘటన బీజాలు యిమిడి వున్నాయి.”

“ఇవన్నీ దుశ్శకునాలే. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. భాషాప్రయుక్త రాష్ట్రాలు అనే విషపూరిత సిద్ధాంతం ‘స్వయం నిర్ణయాధికారం, విడిపోయే అధికారం’ మొదలైన కోర్కెలను రెచ్చగొట్టింది.” కనుక ఏం చేయాలంటే జాతులు గీతులు జాన్తానై హిందూమతం, హిందూ జాతి పేర్లలో ఒక బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. జాతులు గట్రా అనీ ఏ మాత్రం వెసులుబాటు చూపినా జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుంది. దేశం విచ్ఛిన్నమై పోతుంది. అటువంటి విచ్ఛిన్నకర శక్తులస భరతం పట్టడానికి కేంద్రంలో ప్రభుత్వం పటిష్టంగా వుండాలి. జాతుల పోరాటాలను క్రూరంగా అణిచి పెట్టాలి.ఇదీ గోల్వాల్కర్ ఉపదేశ సారాంశం. ఇదీ జాతుల సమస్యపై ఆరెస్సెస్   ఫాసిస్టులకు ఉండే అవగాహన.

ఇటువంటి అత్యంత క్రూరమైన ఫాసిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పే లక్ష్యంగా మహర్షి గోల్వాల్కర్ హిందూ మతోన్మాదాన్ని వళ్ళు తెలియకుండా రెచ్చగొడ్తాడు. ప్రజాస్వామిక వాదులు సరిగ్గా దేన్ని వ్యతిరేకిస్తారో, దేశ అభివృద్ధికి అడ్డంకిగా నిలచిందని దేన్ని తీవ్రంగా విమర్శిస్తుంటారో ,ఆ కుల వ్యవస్థను పట్టుకుని అకాశాని కెత్తుతాడు. భూస్వామ్య శవ వాసనతో కుళ్ళికంపుకొట్టే మనుస్మృతి సూత్రాలు ఆయనకు శిరోధార్యం. ఆర్ఎస్ఎస్ గురూజీ ఇలా అంటాడు. “హిందూ సమాజమే సర్వశక్తి మంతుడగు పరమేశ్వరుని యొక్క అభివ్యక్తమైన విరాట్ స్వరూపమని. బ్రాహ్మణుడు అతని శిరస్సు, క్షత్రియుడు అతని చేతులు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు ఈ విధమైన చాతుర్వర్ణ వ్యవస్థను కల్గి వున్న ప్రజానీకం అంటే ఈ హిందూ సమాజమే మన భగవంతుడని దీని అర్థంషఅని సెలవిస్తాడు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను ధిక్కరించడమంటే భగవంతుని ధిక్కరించడ మేనని చెబుతాడు. ఇలా భూస్వామ్య దోపిడీని నల్లేరుపై బండి నడకలా సాగించే చాతుర్వర్ణ వ్యవస్థను నిర్లజ్జగా సమర్థించి అగ్రకులాల చంకలో దూరుతాడీ మహర్షి. అగ్రకులాలు హరిజనులపై సాగించే అత్యాచారాల గురించి పల్లెత్తు మాట మాట్లాడడు. కుల వ్యవస్థ బలహీనమవుతే విదేశీయుల ముందు మనం మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుందంటూ, బౌద్ధమతం మూలంగా కులవ్యవస్థ నీరసపడగా దేశం లోని ఈశాన్య ప్రాంతం ముస్లింల దాడులకు తేలికగా లొంగిపోయిందనే వక్రీకరించిన చారిత్రక ఉదాహరణ ముందుకు తెస్తాడు. మరి కుల వ్యవస్థ కట్టుదిట్టంగా-అమలు జరిగిన ప్రాంతాలు బ్రిటిష్ వారు పాలించారనే వాస్తవాన్ని గురించి మాత్రం మాట్లాడడు. చివరకు ఎక్కడ తేలుతాడంటే ఈనాటి ప్రభుత్వం హరిజనుల అభ్యున్నతి కంటూనామ మాత్రంగా యిస్తున్న రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తాడు. మనుస్మృతి హరిజనులకు ఎలాంటి స్థానమిచ్చిందో దానినే కొనసాగించ డానికి తయారవుతాడు. అంతేగాక “చతుర్విధ పురుషార్థ సాధనమనే మన సమగ్ర జీవకల్పన మన సమాజానికొక ప్రత్యేకతను సమకూర్చి దిగ్దిగంతాలు మన కీర్తిని తేజరిల్ల చేసిందని మనం మరవరాదు” అని దోపిడీ వర్గాల సంస్కృతిని పొగుడు

తాడు.చాతుర్వర్ణ వ్యవస్థలోనూ, చతుర్విధ పురుషార్థ సాధనాలలోనూ విరాజిల్లిన హిందూమత ప్రాభవం ముస్లింలు క్రైస్తవులతో కకావికలమవు తోందని ఈ గురూజీ మధన పడిపోతాడు. ఆయన హిందూమతాన్ని పొగడడం కంటే ,ఇతర మతాల వారిని తిట్టిన తిట్లే అత్యధికం. ఈ మతోన్మాది భారతీయ ముస్లింలను క్రైస్తవులను విదేశీయుల క్రింద జమకడ్తాడు. ఈయన వారిని తిట్టని తిట్టులేదంటే అతిశయోక్తికాదు. మచ్చుకు కొన్ని చూడండి:

“అయితే ఇస్లాం క్రైస్తవ మతాల్లోకి మారినవారి మనస్తత్వం ఎట్లావున్నదనేది నేటిప్రశ్న. వారు ఇక్కడ పుట్టారు. సందేహంలేదు. ఇక్కడ పుట్టాం.ఇక్కడి ఉప్పు తింటున్నాం అని వారు అనుకుంటున్నారా? లేదులేదు” అని గోల్వాల్కర్ అంటాడు. “మనదేశంలోని క్రైస్తవ మత ప్రచారక సంస్థలకు, ముస్లింలీగుకు మధ్య ఒక ఒప్పందం కుదిరిందనీ, దాని ప్రకారం వారిద్దరూ కలిసి పని చేయాలనీ పంజాబుకు మణిపూర్ కు మధ్యవున్న గంగా మైదానమంతా ముస్లింలకు చెందేటట్లు, దక్షిణ భారత ద్వీపకల్పం, హిమాలయాలు క్రైస్తవులకు చెందేటట్లున్ను దేశం మొత్తాన్ని వారు పంచుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్త కొద్ది కాలం క్రితం పత్రికల్లో పొక్కింది.” ఇలా ఈ మతోన్మాది హిమాలయ మంత అబద్దాన్ని ప్రజలు నమ్మగలరా లేదా అనే సంశయం ఈషణ్మాత్రం లేకుండా దేశ జనాభాలో మైనారిటీలుగా వున్న వారిపై దుమారాన్ని లేవదీస్తాడు. అంతకంటే అసహ్యకర మైన ప్రచారానికి తలపడుతూ ముస్లింల గురించి ఏం రాస్తాడంటే “మనం నమ్మిన ప్రతీదాన్ని పూర్తిగా వ్యతిరేకించేటంత లోతుగా నాటుకపోయింది వారి విద్వేషం.మనం దేవాలయాల్లో పూజలు చేస్తే వారు వాటిని అపవిత్రం చేస్తారు. మనం భజనలు చేసినా రథోత్సవాలను జరిపినా వారికి కంపరమెత్తుతుంది. గోవులను మనం పూజిస్తే వారు భక్షిస్తారు. పవిత్ర మాతృత్వానికి ప్రతీకగా మనం స్త్రీని ఆరాధి స్తే వారు బలాత్కరిస్తారు.”

కరీంనగర్ లో వీడి శిష్యగణం పద్మ అనే అమ్మాయిని ఎత్తుకపోయి చెప్పనలవికాని వేధింపులకు గురిచేశారు. అవమానాల పాల్టేశారు. ఆ ఘాతుకం గురించి పత్రికలన్నీ రాశాయి. స్త్రీలపట్ల ఆరెస్సెస్ ఫాసిస్టు సంస్థకుండే “ఆరాధన”భావమేమిటో ఈ సంఘటన చెప్పకనే చెబుతుంది.వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదులలోని కళాశాలల్లో ఆరెస్సెస్ గూండాలు విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించి రాడికల్స్ చేతుల్లో తన్నులు తిన్న ఘనమైన సంఘటనలు కోకొల్లలు.గ్రామాలలో భూస్వాముల పంచనజేరిన  ఈ గూండాలు రైతుకూలీల భార్యలపై అత్యాచారాలకు పాల్పడితే సంఘ నాయకత్వాన ప్రజలు పంచాయితీలు నిర్వహించి వారికి దేహశుద్ధి చేసిన సంఘటనలు అనేకం వున్నాయి.  ఇటువంటి ఘనమైన చరిత్ర వీళ్లది.“ముస్లింలు స్త్రీలను బలాత్కరిస్తారు” అని రాయడం ద్వారా గోల్వాల్కర్ ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఎంతటి నీచానికైనా పాల్పడగలడని తేలుతుంది. స్త్రీని గొప్పగా ఆరాధించే హిందూమతం తనదని చెప్పుకునే ఈ మతోన్మాది అదే పుస్తకంలో

మరొకచోట “ఈ రోజుల్లో స్త్రీలకు సమానమైన ప్రతిపత్తి యివ్వాలని వారిని పురుషుల బానిసత్వం నుండి స్వతంత్రులను చెయ్యాలని ఒక పెద్ద కోలాహలం ప్రారంభ మయ్యింది” అని వ్యంగ్యంగా విసుర్లు విసురుతాడు.

ఇలా ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథమయిన ‘పాంచజన్యం’ అడుగడుగునా విషాన్ని విరజిమ్ముతూ సాగుతుంది.

వీళ్ల నరనరాన జీర్ణించుక పోయింది ఫాసిస్టు దృక్పథమే తప్ప ప్రజాతంత్ర దృక్పథం కాదు. దేశాభివృద్ధికి ఆటంకంగా తయారయిన భూస్వామ్య విధానాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్న అభివృద్ధి నిరోధక సంస్థ ఆరెస్సెస్ .దోపిడీవర్గాల ప్రయోజనాలను కంటికి రెప్పలా కాపాడుతూ సామ్రాజ్యవాదులతో మిలాఖతై దేశంలో ఫాసిజాన్ని నెలకొల్పడం వీళ్ల లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి హిందూమతోన్మాదాన్ని ప్రజలలో రెచ్చగొడుతూ, ప్రజా తంత్ర ఉద్యమంపై దాడులుచేస్తూ అది ఒక పథకం ప్రకారం తన కార్య కలాపాలను నిర్వహిస్తోంది.

కార్మికులు, రైతాంగం, ఉద్యోగులు తదితర పీడిత ప్రజానీకం యొక్క ప్రయోజనాలకు ఈ ఆరెస్సెస్ ఫాసిస్టుల ప్రయోజనాలకు చుక్కెదురు.

ఎమర్జన్సీలో ఇందిరా ప్రభుత్వదాడికి ఆరెస్సెస్ గురయిందనీ, వేల సంఖ్యలో వీళ్ల కార్యకర్తలు జైళ్ళపాలయ్యారనీ, ప్రజాతంత్ర హక్కుల ఇది పోరాడిందనే వాదనను ముందుకుతెచ్చే ప్రజాస్వామిక వాదులు లేకపోలేదు. అయితే భారతదేశంపై పట్టుకోసం రషా, అమెరికాల మధ్య తీవ్రమవుతున్న పోటీయే ఇందిరాప్రభుత్వం, ఆరెస్సెస్ మధ్య ఘర్షణకు మూలమనే వాస్తవాన్ని ప్రజాస్వామిక వాదులు గ్రహించాలి. అంతేకాదు, దేశంలో దోపిడీ వర్గాల పాలనను సజావుగా కొనసాగించడానికి ఇందిరా ప్రభుత్వం అమలు  చేస్తున్న నిరంకుశ చర్యలను బి.జె.పి సమర్థిస్తూనేవుంది. పైపెచ్చు మత కల్లోలాలను సృష్టించి ప్రజాపోరాటాలను ప్రక్క దారులు పట్టించడానికి ఆరెస్సెస్ ఇందిరా కాంగ్రెసులు ఉమ్మడిగా కుట్రలు పన్నుతూనే వున్నాయి. ఇటీవల పంజాబ్ లో అకాలీ ఉద్యమాన్ని మతకల్లోలంగా మార్చి వేయడానికి, సిక్కులపై హిందువులను రెచ్చగొట్టడానికి ఈ రెండుపార్టీల మధ్య ఏర్పడిన సఖ్యత బహిరంగ రహస్యమే.

ఇటువంటి ప్రజాతంత్ర వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగానే ఆరెస్సెస్ ఈనాడు రాష్ట్రంలో విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ దాడులు చేస్తున్నది. దోపిడీవర్గాలకు కొమ్ముగాస్తూ విప్లవ పోరాటాలకు ఎదురు నిలిచి సవాలు జేస్తున్న ఆరెస్సెస్ నిజస్వరూపం ఫాసిజమేనని పీడిత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు గ్రహించాలి.  ఫాసిస్టు శక్తులను ఓడించి విప్లవపోరాటాన్ని పురోగమింప జేయాలి.

Leave a Reply