ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు.  మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల జిజ్ఞాసులమే. ఎంత బిగ్గరగా మాట్లాడగలమో అంతే సున్నితంగా, సునిశితంగా మాట్లాడగల వాళ్లం.  ఏకకాలంలో తక్షణ ప్రతిస్పందనలు గల మానవులమూ, దీర్ఘకాల అవధిలో చరిత్రను చూడగల  ఆలోచనాపరులమూ.

కానీ ఒక్కో సందర్భం కొందరిని  స్థిమితంగా ఉండనీయదు. లోతునూ, విస్తృతినీ వెతకనీయదు. ఏరోజుకారోజు  ప్రకటనలు చేయాల్సిందే. ఎవరితో, ఎందుకు తలపడుతున్నామో తెలియకుండా వాదనకు దిగాల్సిందే. ఏ మాట అర్థమేమిటో, ఫలితమేమిటో తెలుసుకోకుండా చర్చించాల్సిందే. నిరాశ నుంచి నిర్ధారణలకూ,  అతిశయ సూత్రీకరణలకూ అంతే ఉండదు లేదు. 

సరిగ్గా మనం ఇలాంటి మేధో వాతావరణంలో ఉన్నాం.  విప్లవోద్యమం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ సమయం దీన్నే రుజువు చేస్తున్నది. మామూలుగానైతే మానవ విషాదం మన గొంతును గాంభీర్యం చేస్తుంది. ఎంత ఉద్వేగానికిలోనైనా ఆలోచనాత్మకం చేస్తుంది. ఇతరులతో లోతైన మాటలు పంచుకొనేలా చేస్తుంది. మన పూర్వ వాదనలు ఏవైనా సరే, భౌతిక పరిస్థితుల గురించి ఎరుక పెంచుతుంది. విమర్శనాత్మక సంభాషణకు సిద్ధం చేస్తుంది.

ఇవాళ దీనికి వ్యతిరేక దిశలో కొందరు మేధావులైనా ఉన్నారు.

అంతిమ యుద్ధంలో విప్లవకారులనే కాదు. విప్లవ పంథానే తుడిచిపెట్టాలని ఫాసిస్టులు  అనుకుంటున్నారు.  ఇంత కాలం విప్లవోద్యమం ఆచరించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధం తప్పని విద్రోహులు అంటున్నారు. సాయుధ పోరాటం వల్లనే విప్లవోద్యమానికి ఇన్ని అనర్థాలు వచ్చాయని మేధావులు అంటున్నారు. ఈ ముగ్గురూ   ఒక్కటి కాదు. కానీ ఇదొక భావజాల కూడలి. అనేక ప్రజాస్వామిక రాజకీయాలకూ, ఉద్యమాలకూ ఉమ్మడి ప్రాంతంగా ఉన్న విప్లవోద్యమం చుట్టూ ఇన్ని ఆలోచనలు. 

ఇందులో అంతా అయిపోయిందనే వాళ్లు ఉన్నారు. మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలనే వాళ్లున్నారు. కానీ ఎక్కడ ఆరంభమైందీ ఎవ్వరూ చెప్పడం లేదు. భారత ప్రజలు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నదీ పట్టించుకోవడం లేదు. అసలు దీర్ఘకాలిక ప్రజాయుద్ధమంటే ఏమిటో కనీసంగా తెలుసుకొని మాట్లాడటం  లేదు. పైగా ఇక అది నడవదని మాత్రం అంటున్నారు.

ఆ పక్క నుంచి ఫాసిస్టులు ఈ పోరాట మార్గాన్ని బతకనీయమని భీకరమైన దాడి చేస్తున్నారు. ప్రపంచం మారిపోయిందని అంటున్న విద్రోహులు ‘లొంగుబాటు’ను ఈ కాలపు నుడికారంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక ప్రజాయుద్ధమంటే ఏమిటో మరొకసారి మౌలికంగానే ఆలోచించాలి. ఇన్నేళ్ల ఆచరణలో    భారత విప్లవోద్యమ పంథా ఎట్లా రూపొందిందీ చెప్పాలి. ఆ అవసరం తీర్చడానికే ఈ పుస్తకం తీసుకొస్తున్నాం.

 చైనా విప్లవోద్యమంలో మావో ఈ పంథాను ఆవిష్కరించి ఇప్పటికి సుమారుగా వందేళ్లు. అప్పటి చైనా రాజ్యానికంటే ఇప్పటి భారత రాజ్యం అత్యంత బలశాలి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వెల్లువలో సరికొత్త దోపిడీ రూపాలతో భారత బ్యురాక్రటిక్‌ దళారీ పెట్టుబడి బలపడుతున్నది. వీటిని  ఎదుర్కొంటూ, గెలుపు ఓటముల గతితర్కంలో అంతిమ విజయం సాధించడానికి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అవసరం పెరిగింది. దారుణ అణచివేత వల్ల, విద్రోహాల వల్ల తాత్కాలికంగా విప్లవోద్యమం తీవ్రమైన నష్టాలకు గురికావచ్చు. ఈ అన్ని అనుభవాల నుంచి నేర్చుకుంటూ సర్వశక్తివంతంగా తిరిగి లేచి నిలబడ్డానికి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం తప్పదనే చారిత్రక సత్య ప్రకటన చేయడానికే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం.          

విప్లవోద్యమం చేరుకున్న ఈ వర్తమాన దశను నిశితంగా అంచనా వేయాలంటే అది నడిచి వచ్చిన దారిని తిరిగి చూడాలి. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు తగినట్లు అది ఎట్లా అభివృద్ధి చెందుతూ పురోగమించిందో పరిశీలించాలి. అసాధారణ విజయాలతో, అనన్యమైన త్యాగాలతో, స్ఫూర్తిదాయకమైన ప్రభావాలతో  కొనసాగిన విప్లవోద్యమం ఇప్పుడు తీవ్రమైన  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దీన్ని కొందరు విప్లవ పంథా ఎదుర్కొంటున్న సవాల్‌గా భావిస్తున్నారు. చరిత్రపట్ల వినయంగా, సమాజంపట్ల బాధ్యతగా వర్గపోరాటం గురించిన ఎరుకతో మాట్లాడవలసిన సమయం ఇది. అలాంటి చర్చకు దోహదం చేపేలా భారత విప్లవోద్యమ పంథా గురించిన విశ్లేషణ వ్యాసాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం.  చదవండి, చర్చించండి.  

Leave a Reply