ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి కారణం లాభాపేక్షతో కూడిన సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా అని, బీజాపూర్, దండకారణ్యాలలో మావోయిస్టుల జనతన సర్కార్ల రూపంలో ఉన్న పాలనా నమూనాలాంటి ప్రత్యామ్నాయ ప్రజా అభివృద్ధి నమూనాను మనం నిర్మించుకోవాలని నిరసనకారుల్లో ఒకరు మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాలుష్యం సంక్షోభానికి గల నిజమైన మూలాలను, వాటిని అంతం చేయగల ఏకైక పరిష్కారాన్ని వారు సరిగ్గా, ఖచ్చితంగా ప్రకటించారని మేము భావిస్తున్నాము. మా పత్రిక నాల్గవ సంచికలోని ‘ప్రజల ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా, మధ్య భారతదేశంలో పాలన’ అనే వ్యాసాన్ని మా వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నాం. ఈ వ్యాసాన్ని చదివి, ప్రజలు, ప్రకృతి కోసం ఏ అభివృద్ధి నమూనా నిజంగా స్థిరంగా ఉందో తమకు తామే నిర్ణయించుకోవాలని మేము పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. (నజరియా పత్రిక సంపాదకులు)
మధ్య భారతదేశంలో జనతన సర్కార్ల (ప్రజా ప్రభుత్వాలు) స్థాపన ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని లోతుగా మార్చివేసింది. గణనీయమైన ఆదివాసీ జనాభా ఉన్న ప్రాంతాలలో ప్రారంభమైన ఈ స్థానిక పాలనా వ్యవస్థలు అణగారిన వర్గాల అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భూ సంస్కరణలను అమలు చేయడం, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడం, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, జనతన సర్కార్లు జీవన పరిస్థితులు, ఆర్థిక అవకాశాలు, జెండర్ సంబంధాలలో చెప్పుకోదగ్గ మెరుగుదలను సులభతరం చేసాయి.
నజరియా పత్రిక ఈ జనతన సర్కార్ల పరిధిలో నెలకొల్పిన ప్రత్యామ్నాయ ప్రజల అభివృద్ధి నమూనాను పరిశోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నమూనా దేనికి వ్యతిరేకంగా ఉంది? సూరజ్‌కుండ్ పథకం, కార్పొరేటీకరణ, సైనికీకరణలు దేనిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం ఈ పరిశోధన ఉద్దేశ్యం.
దీని కోసం, మేము వరవర రావు గారి ‘జనతన సర్కార్’ పై చేసిన కృషిని, భూపతి రచించిన ‘గడ్చిరోలిలో రెండు దశాబ్దాలలో విప్లవాత్మక మార్పులు’ అనే రచనను [ఈ రచనలో ఉన్న విషయాన్ని మేము సమర్థిస్తున్నప్పటికీ, భూపతి అలియాస్ సోను అంటే మల్లోజుల వేణుగోపాల రావు ప్రస్తుతం విప్లవోద్యమ ద్రోహి; అతని ప్రస్తుత రాజకీయ మార్గాన్ని మేము ఖచ్చితంగా సమర్థించము – ఎడిటర్], వియుక్క కథల సంకలనం లోని ‘బస్తర్‌లో వివిధ వర్గాలు – మా వైఖరి’; పాణి (2017) రాసిన ‘జనతన రాజ్యం’; అమిత్ భట్టాచార్య (2021) రచించిన ‘తలకిందులైన ప్రపంచం: మావోయిస్టు ఉద్యమం ద్వారా మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తీసుకువచ్చిన ప్రాథమిక మార్పులు’ అనే రచనలను అధ్యయనం చేసి, ఉపయోగించుకున్నాము.
భారతదేశాన్ని తరచుగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పొగడుతూ ఉంటారు. ఇది “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు” పనిచేసే వ్యవస్థ. అయితే, 1947లో అధికారం బదిలీ అయినప్పటి నుండి, ఈ ఆదర్శం తరచుగా తన వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమైంది. భారతదేశంలోనూ, విదేశాలలోనూ ఉన్న చాలా మంది పౌరులు బూర్జువా ప్రజాస్వామ్య సంస్థల—అంటే న్యాయస్థానాలు, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం—అసమర్థత, అవినీతి కారణంగా వాటి పట్ల నిరాశ చెందారు. నీరు, విద్యుత్ లాంటి కనీస సేవలు కూడా అనేక ప్రాంతాలలో నిత్యమూ నిరాశ, నిరసనలకు మూలంగా ఉన్నాయి. భారతదేశ జనాభాలో ముఖ్యమైన భాగంగా ఉన్న ఆదివాసీ సముదాయాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అనేక ఆదివాసీ రైతాంగ ప్రాంతాలలో, రాజ్య ప్రజాస్వామిక వ్యవస్థలు, కనీస వైద్య సేవలు కూడా దాదాపుగా లేవు. సంవత్సరాలుగా, ఈ సముదాయాలు కనీస సౌకర్యాలు, అవకాశాలు లేక, “ఆధునిక” ప్రపంచం నుంచి విడిగా ఉండిపోయాయి.
అయితే, ఇటీవలి సంవత్సరాలలో కొన్ని ఆదివాసీ ప్రాంతాలలో విశేషమైన మార్పు కనిపించింది. అనేక ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు భారత రాజ్యం నియంత్రణ నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడుతూంటే, మధ్య భారతదేశం, కొన్ని తూర్పు రాష్ట్రాలలోని ఆదివాసీ రైతులు భిన్నమైన మార్గాన్ని అనుసరించారు. వారు తమ సొంత “ప్రజల ప్రభుత్వాలను” ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
ఒకప్పుడు దేశంలో అత్యంత “వెనుకబడిన”, “అనాగరిక” ప్రాంతాలుగా పరిగణిచిన ప్రాంతాలలో ఈ “ప్రజల ప్రజాస్వామ్యం” ఉద్భవించింది. కాలక్రమేణా, ఇది వివిధ రూపాలలో, వేర్వేరు స్థాయిలలో అభివృద్ధి చెంది, ఆచరణలో మరింత నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రజాస్వామ్య నాటకాన్ని మాత్రమే ప్రదర్శించే భారత రాజ్యపు లోపభూయిష్ట ప్రజాస్వామిక వ్యవస్థలలాగా కాకుండా, ఈ ప్రజల ప్రజాస్వామ్యం మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ సిద్ధాంత మార్గనిర్దేశనంలో చేసిన సామూహిక పరిపాలన, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలపై పనిచేస్తుంది.
ఈ ప్రజల ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ జనతన సర్కార్. ఈ ప్రభుత్వాలు భారతదేశ ప్రజల విస్తృత ప్రయోజనాలకు నిజంగా అనుగుణంగా ఉండే పాలనా నమూనాగా, చివరికి దేశం అంతటా స్థాపించే అవకాశం ఉన్న ప్రజల అధికార ప్రాథమిక దశను సూచిస్తాయి. భవిష్యత్ సామ్యవాద రాజ్యం ఎలా ఉండవచ్చనే ఒక సంగ్రహావలోకనాన్ని అందిస్తూ జనతన సర్కార్లు సైనిక సంస్థలతో సహా వ్యవసాయం, సంస్కృతి, విద్య, వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించాయి.
భారత రాజ్యం నుండి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటున్నప్పటికీ, జనతన సర్కార్లు స్థిరత్వాన్ని, వృద్ధిని ప్రదర్శించాయి; మరింత ఉన్నతమైన స్వయం-పాలనా రూపాల వైపు పయనిస్తున్నాయి. భారత రాజ్యం చేసిన స్వీయ పంచాయతీ రాజ్ షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం, 1996 (పెసా) ద్వారా ప్రకటించిన నిజమైన స్వయం-పాలనా రూపానికి ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. పెసా చట్టం కింద జనతన సర్కార్లను చట్టబద్ధమైన ఆదివాసీ స్వయం-పాలిత రూపాలుగా గుర్తించడానికి బదులుగా, భారత రాజ్యం ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్‌లు, సైనిక పాలనను ఉపయోగించి ఈ ప్రభుత్వ రూపాలపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ప్రభుత్వాలలో పాల్గొనేవారిని, నిర్వాహకులను నిషేధిత మావోయిస్ట్ పార్టీ సభ్యులుగా ముద్ర వేసింది.
సహకార సంఘాలు; వ్యవసాయంలో మార్పులు
సహకార సంఘాల భావన గురించి భారతదేశంలో పరిపాలనా యంత్రాంగ, విద్యాపర వర్గాలలో తరచుగా చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు పత్రికా కథనాలు ఈ రంగంలో ప్రభుత్వ విజయాలను కీర్తిస్తాయి. అయితే, ప్రభుత్వ సహకార శాఖ అవినీతితో నిండిపోయిందనే వాస్తవాన్ని విస్తృతంగా అంగీకరిస్తున్నారు. అధికారిక గణాంకాలు కాగితంపైన అద్భుతంగా కనిపించినప్పటికీ, వాస్తవం చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, దండకారణ్యం అటవీ ప్రాంతాలలో జనతన సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సహకార అనుభవం సామూహిక, అవినీతి రహిత ఉత్పత్తికి నిజమైన నమూనాను అందిస్తుంది.
వియుక్క బుక్స్ కొరకు ఒక క్షేత్ర పరిశోధకుడు సంకలనం చేసిన నివేదిక ప్రకారం, ఈ ప్రాంతం ఒక నదీ తీరం వెంబడి ఉంది. ఉత్పత్తి పద్ధతుల పరంగా సాపేక్షంగా అభివృద్ధి చెందలేదు. ఇది ధనిక, మధ్యతరగతి, పేద రైతుల మిశ్రమ నివాసంగా ఉంది. ఎద్దులు, నాగలి వంటి సాంప్రదాయ వ్యవసాయ పనిముట్లను సాధారణంగా ఉపయోగిస్తున్నప్పటికీ, అందరికీ అవి అందుబాటులో లేవు. ప్రధాన పంటలలో వరి, కందులు , వివిధ రకాల చిరుధాన్యాలు ఉన్నాయి.
పేరు చెప్పని ఈ ప్రాంతంలో, పొలాలను కలిపి దున్నడంతో సామూహిక వ్యవసాయ పని ప్రారంభమై, క్రమంగా ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు విస్తరించింది. మొదట్లో, పని బృందాలు పొలాలను సిద్ధం చేయడానికి, చెరువులు తవ్వడానికి, చేపలను పెంచడానికి, విత్తనాలు నాటడానికి, భూమిని దున్నడానికి, చిన్న బావులు తవ్వడానికి ఏర్పాటు చేసారు. ఈ బృందాల విజయం స్థానిక జనాభాకు ప్రేరణనిచ్చింది. సామూహిక పనిలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. సముదాయం నిర్మించిన బావులు, చెరువులు, మిగులు పంటలు, చేపలను అమ్మడం ద్వారా చెప్పుకోదగ్గ ఆదాయాన్ని సంపాదించాయి.
ప్రజలలో అవగాహన, ఉత్సాహం పెరగడంతో, ఆదివాసీలు జనతన సర్కార్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇది సామూహిక వ్యవసాయ పనిని మరింత వ్యవస్థీకృతం చేసింది, ఉత్పత్తిని పెంచింది. వ్యవసాయ పద్ధతులలో గుర్తించదగిన మెరుగుదల అయింది. పశువులు, వ్యవసాయ పనిముట్లను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి సామూహిక విధానం వీలు కల్పించింది.
దండకారణ్యంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో (పరిశోధకుడు పేరు చెప్పలేదు) కొన్ని ముఖ్యమైన విజయాలు:
• జనతన సర్కార్ 260 పశువులను కొనుగోలు చేసి, పేద రైతులకు పంపిణీ చేసింది.
వరి, నువ్వులు, కందులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో సహా 540 క్వింటాళ్ల విత్తనాలను అందించింది.
• 70 కొత్త ఇళ్లను నిర్మించి, మరో 350 ఇళ్లను మరమ్మత్తు చేసింది.
• కరువు సమయంలో, జనతన సర్కార్ ప్రభావిత జనాభాకు రూ. 25,000 సహాయ నిధిని అందించింది.
మొత్తంగా, స్థానిక భూస్వాముల నుండి, పారిపోయిన వారి నుండి, ప్రజల శత్రువుల నుండి 1,436 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమిలో, 1,057 ఎకరాలు 482 కుటుంబాలకు పంపిణీ చేసారు; 310 ఎకరాలు జనతన సర్కార్ కోసం కేటాయించారు; 65 ఎకరాలు మిలీషియాకు కేటాయించారు.
మరిన్ని వివరాలు ఏమంటే, ఈ నిర్దిష్ట ప్రాంతంలోని దిగువ-స్థాయి సర్కార్లలో ఒకటి 5 కిలోల వరి, మొక్కజొన్నను విజయవంతంగా సాగు చేసింది. కూరగాయల సాగు అంతగా విజయవంతం కానప్పటికీ, సహకార కమిటీ అనేక గ్రామాలలోరూ. 1,200 విలువైన 2 క్వింటాళ్ళ, 25 కిలోల విత్తనాలను పంపిణీ చేయగలిగింది. వారు కొత్త ఇళ్లను కట్టుకున్నారు. పాత వాటిని మరమ్మత్తు చేసారు.
సహకార కార్యకలాపాలు, విప్లవకర చైతన్యమూ పెరగడం వల్ల సాంప్రదాయక జెండర్ పాత్రలలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. గతంలో, మహిళలకు విత్తనాలు నాటడం లేదా వరిపంటని ఉంచిన కళ్ళాల్లోకి వెళ్ళడం వంటి కొన్ని వ్యవసాయ పనుల నుండి దూరంగా పెట్టేవారు. క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ (కెఎఎమ్ఎస్) ఈ అడ్డంకులను ఛేదించే బాధ్యతను తీసుకుంది. సామూహిక కార్యకలాపాల, జనతన సర్కార్ల స్థాపనకు ముందే ఈ సంస్థ మహిళల సమస్యలను పరిష్కరిస్తోంది. ఇప్పుడు, ఈ పాత మూఢనమ్మకాలు చాలా వరకు తొలగిపోవడంతో, కెఎఎమ్ఎస్ మహిళలను జనతన సర్కార్ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం పైన దృష్టి పెట్టింది.
వారపు మార్కెట్లలో అమ్మే అటవీ ఉత్పత్తుల ధరలను నియంత్రించడంలో కూడా జనతన సర్కార్ జోక్యం చేసుకుంది. సామూహిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం నుండి రాజ్యహింస, సల్వాజుడుం సాయుధ ముఠా బాధితులకు మద్దతును అందిస్తుంది. అదనంగా, ఈ ఆదాయాల నుండి రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు సమకూరుస్తుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ఫాసిస్ట్ సల్వాజుడుం క్యాంపెయిన్ గ్రామీణ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అణచివేతను పెంచింది. సల్వాజుడుం ప్రారంభించిన హింస ఎంత క్రూరంగా ఉన్నదంటే రాజ్య మద్దతుగల ఈ సాయుధ ముఠా సామూహిక అత్యాచారాలు, హత్యలు, గ్రామాలను తగలబెట్టడాన్ని భారత సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. నందిని సుందర్ & ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ కేసులో ఈ వ్యవస్థపైన నిషేధం విధించింది. ఇది ఆదివాసీ రైతులకు సముదాయ రక్షణ యంత్రాంగాల ద్వారా ఆత్మరక్షణకు మార్గాలను ఏర్పరచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న గ్రామ మిలీషియాలు మరింత చురుకుగా మారాయి. కొత్త మిలీషియా ప్లటూన్లు ఏర్పడ్డాయి. చాలా మంది యువతీ యువకులు పూర్తికాలం మిలీషియా సభ్యులుగా మారారు; ఆదివాసీ సముదాయంలో కొత్త ఐక్యతా భావాన్ని సృష్టించారు.
మొదట్లో, జనతన సర్కార్ మిలీషియాలకు సదుపాయాలు కల్పించింది, అయితే అవి త్వరగా స్వయం సమృద్ధి సాధించాయి. వ్యవసాయ ఉత్పత్తిలో, ఆదాయాన్ని సంపాదించడంలోకూడా పాలుపంచుకోవడం ప్రారంభించాయి. పరిశోధకుడు వెళ్ళిన ఈ నిర్దిష్ట ప్రాంతంలో, మిలీషియాలు నువ్వుల పంటల నుండి రూ. 10,000 ఆదాయాన్ని సంపాదించాయి. 1,500 క్వింటాళ్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేసాయి. ఈ ప్రాంతంలో సహకార ప్రయత్నాలు వడ్రంగుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసాయి. వీరు వ్యవసాయ సీజన్‌కు ముందు గ్రామ గ్రామాలు తిరుగుతూ, అన్ని వ్యవసాయ పనిముట్లు మంచిగా పని చేసే స్థితిలో ఉండేలా చూస్తారు. జనతన సర్కార్ కొలిమిలను, అవసరమైన లోహాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తుంది.
పశువుల పంపిణీలో అమలుచేసిన ఒక సృజనాత్మక విధానంలో, రైతులకు పంపిణీ చేసిన పశువులకు పుట్టిన దూడలను ఉంచుకోవడానికి జనతన సర్కార్ అనుమతిస్తుంది. బదులుగా, వారు సంవత్సరానికి 20 కిలోల ధాన్యాన్ని తిరిగి చెల్లించాలి. ఈ పరస్పర సహకార ఏర్పాటు నిరంతరాయంగా పశువుల సరఫరాను నిర్ధారిస్తుంది; సముదాయ దీర్ఘకాలిక వ్యవసాయ అవసరాలకు మద్దతు ఇస్తుంది.
పశువులతో పాటు, జనతన సర్కార్, ప్రత్యేకించి సల్వాజుడుం ప్రచారం సమయంలో పశువులను కోల్పోయిన వారికి, మేకలు , కోళ్లను కూడా పంపిణీ చేసింది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి చేపపిల్లల ప్యాకెట్లను కూడా పంపిణీ చేసింది. అమరవీరుల, రాజ్య హింస బాధితుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది.
జనతన సర్కార్ కు చెందిన అభివృద్ధి కమిటీ స్థానిక మార్కెట్లలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి స్థానిక ప్రజల నుండి మహువా , చీపుర్లు వంటి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది.
ఈ సమయంలో, జనతన సర్కార్ ఉప-కమిటీ అయిన అటవీ పరిరక్షణ కమిటీ స్థిరమైన అటవీ నిర్వహణను నిర్ధారిస్తుంది. సముదాయాలు సంచార జీవనం గడిపినప్పుడు అలవాటుగా ఉండిన విచక్షణారహిత చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఇప్పుడు, స్థిరపడిన గ్రామాలలో, అటవీ పరిరక్షణ ఒక ప్రాధాన్యత. చెట్లను నరకాలనుకునే ఎవరైనా కమిటీ నుండి అనుమతి పొందాలి. కమిటీ నిర్మాణ సామాగ్రి, వ్యవసాయ ప్రయోజనాలు లేదా ఇతర అవసరాల కోసం దాన్ని పరిశీలిస్తుంది. అనధికారిక చెట్ల నరికివేతకు సాధారణంగా జరిమానా విధిస్తుంది.

శాస్త్రీయంగా నిర్వహించే సహకార కార్యకలాపాలు సముదాయానికి గణనీయమైన ప్రయోజనాలను అందించగలవని జనతన సర్కార్ అనుభవం నిరూపిస్తుంది. ఇది ప్రభుత్వ సహకార కార్యక్రమాలలోని లోపాలను కూడా బహిర్గతం చేస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక వనరులు, ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ అవి విఫలమవుతున్నాయి. దండకారణ్యంలోని ఈ “వెనుకబడిన” అటవీ ప్రాంతాలలో సహకార ఉద్యమం సాధించిన విజయం ఇతర ప్రాంతాలకు ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.
జీవన పరిస్థితులలో మెరుగుదలః
జనతన సర్కార్ల రాక జీవన పరిస్థితులలో గణనీయమైన మెరుగుదలను తెచ్చిపెట్టింది. వాటి స్థాపనకు ముందు, చాలా గ్రామీణ సముదాయాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొనేవి. వారి ఆహారం ఉదయం గంజి, ఉడికించిన ఉలవల వంటి ప్రాథమిక ఆహార పదార్థాలకు; సాయంత్రం అతి తక్కువ పరిమాణంలో అన్నానికి మాత్రమే పరిమితం అయ్యేది. ప్రజల ప్రభుత్వాల క్రింద భూ సంస్కరణలు, మెరుగైన వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెట్టడం వలన ఆహార భద్రత గణనీయంగా పెరిగింది. ఇప్పుడు, కుటుంబాలు మరింత పోషకమైన , వైవిధ్యభరితమైన ఆహారాన్ని ఆస్వాదించడం ప్రారంభించాయి, ఇందులో రోజుకు రెండుసార్లు అన్నం, సాయంత్రం మరింత బలవర్ధకమైన భోజనం ఉన్నాయి.
ఆహారంతో పాటు, వినియోగ వస్తువుల అందుబాటు, వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో, ప్రజలు విప్ప, పూసు వంటి స్థానిక విత్తనాల నుండి తీసిన నూనెను తక్కువగా ఉపయోగించేవారు. ఆదాయాలు పెరగడం, మార్కెట్ అనుసంధానం పెరగడం వలన, పారాచూట్ కొబ్బరినూనె వంటి శుద్ధి చేసిన నూనెలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ధనవంతుల విలాసంగా ఉన్న టీ, ఇప్పుడు చాలా మందికి ఒక సాధారణ వినియోగ వస్తువుగా మారింది, ఇది మెరుగైన జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది.
కూరగాయల రకాలు , వినియోగం కూడా గణనీయంగా పెరిగాయి. వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు వంటి సాంప్రదాయ కూరగాయలు ప్రాచుర్యంలో ఉండగా, కాలీఫ్లవర్ , ముల్లంగి వంటి కొత్త రకాలను ప్రవేశపెట్టారు. స్థానిక చెరువులలో చేపల పెంపకం ఒక సాధారణ ఆచరణగా మారింది. ఇది అదనపు ప్రోటీన్ వనరును అందించడం ద్వారా ఆహారంలో వైవిధ్యాన్ని, స్థానిక ఆదాయాన్ని పెంపొందించింది.

ప్రజా ప్రభుత్వాల ఆధ్వర్యంలో గృహ పరిస్థితులు స్పష్టంగా మెరుగుపడ్డాయి. ఈ మార్పులకు ముందు, చాలా కుటుంబాలు తరచుగా మరమ్మత్తులు అవసరమయ్యే, వాతావరణ పరిస్థితుల వల్ల త్వరగా పాడయిపోయే పూరిగుడిసెల్లో నివసించేవారు. పెరిగిన ఆర్థిక స్థిరత్వం, ఇళ్ల నిర్మాణానికి దొరికిన మద్దతుతో, చాలా మంది మరింత మన్నికైన ఇటుక ఇళ్లకు మారారు. ఈ మార్పు నివాస పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన జీవన వాతావరణాన్ని కూడా అందించింది. స్టీల్ పాత్రలు , వ్యక్తిగత భోజన ప్లేట్లు వంటి గృహోపకరణాల లభ్యత ఈ మెరుగుదలలను మరింత స్పష్టం చేసింది.
ఆర్థిక పురోగమనాలుః
జనతన సర్కార్ల కింద వచ్చిన ఆర్థిక మార్పులు కూడా అంతే పరివర్తనాత్మకంగా ఉన్నాయి. సంస్కరణలలో భూ పునఃపంపిణీ కీలకమైనదిగా ఉండి, భూ యాజమాన్య విధానాలను గణనీయంగా మార్చింది. ఈ పునఃపంపిణీ వల్ల చాలా మంది భూమి లేని రైతులకు భూమి అందుబాటులోకి వచ్చింది, అదే సమయంలో జనాభాలో 50% కంటే ఎక్కువ మంది అదనపు భూమి నుండి ప్రయోజనం పొందారు. భూమి అందుబాటు పెరగడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచింది. రైతులు తమ సాగు విస్తీర్ణాన్ని పెంచుకున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ప్రారంభించారు.
స్థానిక వడ్డీ వ్యాపారులు, భూస్వాములు వంటివారు అమలు చేసే సాంప్రదాయ దోపిడీ పద్ధతులు తగ్గడం మరొక ముఖ్యమైన మార్పు. భూ సంస్కరణలు అమలు చేయడం, వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం వల్ల దోపిడీ ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటం తగ్గింది.
ట్రాక్టర్లు, ఇతర ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం పెరగడం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. తద్వారా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి, దిగుబడిని పెంచడానికి వీలు కల్పించింది.
ఆర్థిక సంస్థలకు మెరుగైన అందుబాటు ద్వారా కూడా ఆర్థిక సాధికారత బలోపేతం అయింది. బ్యాంకులు , అప్పునిచ్చే సౌకర్యాలు చిన్న రైతులకు మద్దతు ఇవ్వడంలో మరింత చురుకుగా పాల్గొన్నాయి. విత్తనాలు, ఎరువులు, పరికరాల కోసం అవసరమైన రుణాలను అందించాయి. ఈ మద్దతు రైతులు తమ కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడానికి, ఉత్పాదకతను పెంచడానికి వీలు కల్పించింది. ఖర్చు చేయడానికి మిగిలే ఆదాయం పెరగడం, సైకిళ్లు, రేడియోలు, టీవీలు, మోటారు సైకిళ్లు వంటి వినియోగ వస్తువుల కొనుగోలు పెరగడంలో ప్రతిబింబించింది.
సాంస్కృతిక, సామాజిక మార్పులుః
ప్రజా ప్రభుత్వాల స్థాపన ముఖ్యంగా జెండర్ సంబంధాలలో గణనీయమైన సాంస్కృతిక , సామాజిక మార్పులకు కూడా ఉత్ప్రేరకంగా నిలిచింది. క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన్ వంటి మహిళా సంఘాలు జెండర్ సమానత్వం కోసం కృషి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. వారి ప్రయత్నాలు సమాన పనికి సమాన వేతనం హామీ ఇచ్చే విధానాలను అమలు చేయడానికి దారితీశాయి. ఇది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసింది. సాంప్రదాయ జెండర్ ప్రమాణాలను సవాలు చేసింది.

రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం ఒక ముఖ్యమైన మార్పును సూచించింది. మహిళలు రాజకీయ సంస్థలలో చేరడం, గెరిల్లా కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు. ఇది వారి అభిప్రాయాలకు, హక్కులకు మరింత గౌరవాన్ని పెంచింది. ఈ మార్పులు ఇంటి విషయాల వరకు విస్తరించాయి. ఇక్కడ ఆస్తిపైనా, పిల్లలపైనా మహిళల హక్కులు మరింత గుర్తింపు పొందాయి.
గతంలో మహిళలను దుర్బల స్థితిలో ఉంచిన సామాజిక ఆచారాలను కూడా సంస్కరించారు. ఉదాహరణకు, కొన్నిసార్లు వేధింపులకు వేదికగా ఉన్న సాంప్రదాయ గోటుల్ నృత్యం మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేలా సంస్కరించారు. ఈ సంస్కరణలు మహిళల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. సమాజ జీవితంలో వారి పాత్రను మెరుగుపరిచాయి.
ముగింపుః
మధ్య భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల స్థాపన జీవన పరిస్థితులు, ఆర్థిక అవకాశాలు, జెండర్ సంబంధాలలో లోతైన మెరుగుదలను తీసుకువచ్చింది. భూ సంస్కరణలు, ఆర్థిక సాధికారత, సామాజిక సమానత్వ కార్యక్రమాల ద్వారా, ఈ స్థానిక పరిపాలనా నిర్మాణాలు అణగారిన వర్గాల జీవితాలను మార్చాయి. ఆహార భద్రత, గృహ వసతి, వినియోగ సంస్కృతిలో పురోగమనాలు ఈ సంస్కరణల సానుకూల ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. అదనంగా, జెండర్ సంబంధాలలో, సామాజిక ఆచారాలలో మార్పులు ఈ ప్రజల ప్రభుత్వాలు సులభతరం చేసిన విస్తృత సామాజిక పరివర్తనలను నొక్కి చెబుతున్నాయి.
సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఈ పరిపాలనా నిర్మాణాల అనుభవాలు ఇలాంటి సందర్భాలలో స్థిరమైన అభివృద్ధి , సామాజిక న్యాయాన్ని సాధించడానికి విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. భారత రాజ్యాంగం కూడా, దాని ఐదవ షెడ్యూల్ కింద, పెసా చట్టం-1996 ద్వారా వాస్తవరూపం దాల్చాల్సిన జనతన సర్కార్ల రూపంలో ఆదివాసీ స్వయం-పాలనకు ప్రేరణను ఇస్తుంది.
“ఈ డిమాండ్లు ఊహాజనితమైనవిగానూ, విప్లవాత్మకంగానూ అనిపించవచ్చు; కానీ వాటిలో అసాధారణమైనది ఏమీ లేదు. వీటిలో చాలా వరకు భారత రాజ్యాంగ పరిధిలోనే ఉన్నాయి… [కానీ] పాలక వర్గాల కరడుగట్టిన ఏజెంట్లు, -భారతదేశ జనాభాలో కేవలం ఐదు శాతానికి మాత్రమే పరిమితమైనవారు, మిగిలిన 95 శాతం ప్రజల ప్రయోజనాల గురించి ఎప్పటికీ ఆలోచించలేరని మనకు తెలుసు. ప్రజలు తిరగబడి, తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తే తప్ప లేదా వారి సొంత పోలీసు, ఇతర సాయుధ బలగాలలో తిరుగుబాట్లు చెలరేగితే తప్ప, వారు ఈ రాజ్యాంగపరమైన డిమాండ్లను కూడా అంగీకరించరు,” అని ఆజాద్ ఈ పరిస్థితి గురించి వివరించారు.
బూర్జువా ప్రజాస్వామిక భావనలు మోసపూరిత బాహ్యరూపంగా ఉన్న దేశంలో, జనతన సర్కార్లు చట్టబద్ధమైన ప్రజల ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. కార్మికులు, ప్రతినిధుల సోవియట్లలో, యానాన్లోని చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో మొట్టమొదట కనిపించిన అదే ప్రజల ఆకాంక్షలను, రాజకీయాలను అవి సూచిస్తున్నాయి.
లెనిన్ సోవియట్ల గురించి బహిరంగంగా ఇలా అన్నారు, “బూర్జువా ప్రభుత్వంతో పాటు, మరొక ప్రభుత్వం… కార్మికవర్గం, రైతాంగం …తో కూడిన ప్రభుత్వం ఉద్భవించింది. ఇది ప్రస్తుతానికి బలహీనంగా, ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, నిస్సందేహంగా వాస్తవంగా ఉన్న, ఎదుగుతున్న ప్రభుత్వం—అదే కార్మిక, సైనిక ప్రతినిధుల సోవియట్లు.”
లెనిన్ క్లుప్తంగా ఇలా ముగించారు, “ప్రతి విప్లవంలో ప్రాథమిక ప్రశ్న రాజ్యాధికారం గురించే. ఈ ప్రశ్న అర్థం కాకపోతే, విప్లవానికి మార్గనిర్దేశం చేయకపోవడమే కాకుండా, విప్లవంలో తెలివైన భాగస్వామ్యం కూడా ఉండదు.”
2025 నవంబర్ 30
REFERENCES
1. Paani (2017). Janathana Rajyam, Virasam Publication.
2. Amit Bhattacharaya (2021). The World Turned Upside Down. Foreign Languages Press.
3. Azad. Maoists in India: Writings & Interviews. (2010). Charita Impressions.
https://www.marxists.org/archive/azad/2010/azad_book.pdf
4. V.I. Lenin (1917). The Dual Power. Marxists Internet Archive.
https://www.marxists.org/archive/lenin/works/1917/apr/09.htm




