వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది. ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.
వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు.
వందేమాతర గీతాన్ని పాడకపోతే ఈదేశాన్ని విడిచి వెళ్ళండి అనే నినాదాలు మాటున భారత సమాజం ముందుకు నడిచింది. ఈ గీతం వెనుక ఉన్న సాంస్కృతిక సారాన్ని 150 ఏళ్ల తర్వాత ఎలా చూడాలి? అంచనా వేయాలి? శతాబ్దమున్నర కాలంగా జరిగిన వాద, ప్రతి వాదాల మాటేమిటి? ఈ గీతం లోని హిందూ ప్రతీకలను ఎలా చూడాలి.
రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన కొన్ని సవరణలతో వందేమాతరం దేశభక్తి గీతంగా ఆమోదం పొందింది. బకించంద్ర ఆనందమఠంలోని ఈ రచన వెనుక ఉద్దేశాలు ఉన్నాయని అనలేం. ఆనాడు ఆ రచయిత మీద హిందూ భావజాల ప్రభావాలు సహజం. తర్వాత కాలంలో సంఘ పరివార్ ఉద్దేశాలను ఆపా దిస్తుంది. భారత దేశ ప్రజలు మత విద్వేషాల దగ్గర లేరు. రాజకీయ కోణంలో ట్యూన్ చేయబడుతున్నారు. వర్త మానంలో వందేమాతరంపై చవకబారు చర్చ కూడా ఇదే.
జాతీయోద్యమ కాలం ప్రజల విశ్వాసాలను ఏకం చేసింది. వివాదాలు వున్న చోట చర్చల ద్వారా ఒకే అభిప్రాయం వచ్చిన కాలమిది. అందుకే వందేమాతరంలో కొన్ని సవరణలు చేసి భారత ప్రజలు పాడుకునే రోజు వారి గీతమైంది.ఇటీవల సంఘ పరివార్ పాలనా కాలంలో ఈ చర్చ ముందుకు వస్తుంది.
భారత పార్లమెంట్ గతంలోకి పరిభ్రమిస్తుంది. వర్తమాన కాలపు సమస్యలు చర్చకు రాకుండా వలస కాలపు ముందటి పాలనా తీరును,సాంస్కృతిక అంశాలను అధికార మార్పిడి అనంతర పాలనా తీరును చర్చిస్తున్నది. పన్నెండేళ్ల బిజెపి పార్లమెంటులో ఎక్కువ సమయం దీనికే ఖర్చు చేసింది.
హిందూ, ముస్లింల మధ్య ముగిసిన వివాదాలను వర్తమానంలో చర్చిస్తున్నది. వివాదాస్పదమైన సాంస్కృతిక అంశాలను చర్చించి హిందూ సమూహాన్ని కూడగట్టే సంఘ పరివార్ ద్వేష పూరిత ఆలోచనలకు కొనసాగింపుగా నేటి రాజకీయాల నడక ఉంది.
వందేమాతరం ప్రజలు, పాడుకునే పాటగా రూపుదిద్దుకునే క్రమంలో అనేక వాద, ప్రతివాదాలు జరిగాయి. చివరకు రాజ్యాంగ సభ ప్రజల అభిప్రాయాలను, సందేహాలను గమనిస్తూ ఆమోదించిన విషయం వర్తమాన చర్చ అవుతుంది. గీతంలో దేశభక్తిని ప్రేరేపించే అంశాలు కన్నా హిందుత్వ సంస్కృతికి ప్రాధాన్యత ఉన్నది. ఇది ఆనాటి పాలకవర్గ ఆలోచనా తీరుకు సరిపడనిది. ఠాగూర్ అభిప్రాయాలతో కొన్ని వాక్యాలు తొలగించి వందేమాతర గీతం దేశభక్తి గీతంగా ఆమోదం పొందింది.
నిజానికి వర్తమాన భారతదేశ స్థితి ఏమిటి? పన్నెండేళ్ల మోది పాలనా కాలంలో సమస్త రంగాల వైఫల్యతలలో భారత సమాజం నడుస్తుంది. ప్రజల అసంతృప్తి, అసమ్మతి ఎన్నికల రూపంలో మార్చబడుతుంది. పాలనా వ్యవస్థకు ప్రజల జీవన విధానం మధ్య వైరుధ్యం ఉన్నది. అసంతృప్తుల భారతదేశం కేవలం విమానాల కొరత దగ్గరే ఆగలేదు. వరుసగా భారత దేశంలో జరుగుతున్న పాలనాపరమైన లోపాలు ప్రజల గమనంలో భాగమైనాయి. అదే సమయాన సంస్కృతి, దేశభక్తి ప్రధానమైన అంశాలుగా మారాయి. ముఖ్యంగా ముస్లిం సమూహంను ఒంటరి చేసి అస్థిరతకు గురిచేసే తేడాలు కొనసాగుతున్నాయి.
భారతదేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలుగా విడిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ముస్లింలు ఈ దేశంలో భారతీయ ముస్లింలుగా జీవించడానికి ఒకానొక మానసికతను సిద్ధం చేసుకున్నారు. ఈదేశ నిర్మాణంలో భారతీయులు చేసిన శ్రమ మెజారిటీ హిందుత్వలో లేదు. ముస్లిం సమాజం తన అస్తిత్వాన్ని ధ్రువ పరుచుకుంది. కేవలం అధికారం కోసం ఈ దేశంలో విభజిత రాజకీయాలు సంస్కృతిక పరమైన అంశాలు మతపరమైన విషయాలు చర్చకు వస్తున్నాయి. ప్రజల మధ్య లేని విభేదాల కల్పన ద్వారా అధికారం కోసం సంఘ పరివార్ రోజువారి చర్చగా మాట్లాడుతున్నది.
మొత్తం ఈ పరిణామాలు వెనుక ఏమున్నది. భారత దేశ సాంస్కృతిక భిన్నత్వంలో కాషా యికరణ అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. 150 ఏళ్ల క్రితం ముగిసిన వందేమాతరం వివాదం భారతదేశ బహుళత్వం దగ్గర మాట్లాడుతున్నది.
ఇప్పుడు ఈచర్చ చేయడం వెనుక భారతీయ జనతా పార్టీకి రెండు ప్రధానమైన ఆలోచనలు ఉన్నాయి.. బెంగాల్, ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఈగీతం ద్వారా ముస్లిం సమూహాన్ని హిందూ సమూహం నుండి దూరం చేసే విభజన ప్రక్రియకు తెరతీసింది. కోట్లాదిమంది ప్రజల మధ్య కలగలిసిన అనుబంధం బిజెపి ఓట్ల రాజకీయాలలో వేరు పడుతున్నది.
భారతదేశ ప్రజాస్వామ్య కొనసాగింపులో ప్రజల సంస్కృతిక వైవిధ్యాలు కలగలిసిపోయాయి.ప్రజల మానసికతలో మతం, దేవుడు వ్యక్తిగతం అనే నెమ్మదితనానికి భారత ప్రజలు అలవాటు పడ్డారు అన్నిటికంటే బతుకు తెరువు ముఖ్యమని కొట్లాది భారతీయుల నమ్మిక చిన్నదేమి కాదు. భారతీయతలో ఇమిడిపోయిన అనేక అంశాలు ప్రజాస్వామ్యం ఆవల చర్చ చేయబడుతుంది. ఈ దేశాన్ని విద్వేషితల మనుషుల హృదయాలను ముక్కలు చేసి రాముడిని భారతదేశ నమూనా చేసారు. దేవతలను సాంస్కృతిక ప్రతీకలుగా కథానాయకులుగా ప్రచలితం చేస్తున్నారు.
బాబ్రీ మసీదు విధ్వంసం చేసి అధికారంకు వచ్చారు. అధికార సుస్థిరత కోసం గుజరాత్ లో ఊచకోతకు తలపడ్డారు.ఈదేశ భారతీయ హిందూ, భారతీయ ముస్లిం, భారతీయ క్రైస్తవం ఇంతకంటే నిజాయితీ స్వరం ఏమున్నది. వందేమాతరం కొన్ని తరాలు పాడాయి. అదే స్థితి మొత్తం కొనసాగిస్తుంది. గతంలో జీవించడం కంటే వర్తమానంలో జీవించడం- భవిష్యత్తు వైపు చూడటం భారతప్రజల అంతరంగంలో ఉన్నది.వారి మధ్య మతపరమైన విభజనకు పాలకవర్గాలే కారణం. ఇది ఈదేశపు ప్రజాస్వామ్యతలో హిందుత్వ రాజకీయ క్రీడ వందేమాతరం..




