జనవరి 3 వ తేదీ అర్ధరాత్రి వెనుజులా రాజధాని కారకాస్ లోని అధ్యక్ష భవనంపై 200 మంది అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రత్యేక బలగాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన జీవిత సహాచరిని ఎత్తుకెళ్లి అక్రమంగా అమెరికాలో నిర్భంధించారు.ఈ కిడ్నాప్ కు ముందు ఏ అంతర్జాతీయ సంస్థలలో ఏలాంటి చర్చా లేదు.అమెరికా చట్ట సభ కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.1989 లో పనామా దురాక్రమణ తరువాత లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా మిలటరీ చేసిన ఈ దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద దాడిని ఇతర ఖండాల,భూభాగాలలోని జాతుల రాజ్యాలైన కొలంబియా, గ్రీన్ ల్యాండ్, మెక్సికో, క్యూబా,ఇరాన్ మొదలగు దేశాలకు విస్తరిస్తామని హెచ్చరించాడు.ఈ దురాక్రమణ పూరిత దుశ్చర్యలను ప్రపంచ ప్రజలందరూ ఖండించాలి. అక్రమంగా నిర్బంధించిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేయాలి.అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఒక సార్వ భౌమాధికార దేశంపై దాడి చేయడం దేశాల స్వాతంత్రానికి,శాంతికి విరుద్ధమని ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటాలి.మదురో అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ తమ దేశ యువతను నిర్వీర్యం చేస్తూ మాదక ద్రవ్యాల ఉగ్రవాదా (నార్కో టెర్రరిజం) నికి పాల్పడుతున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గత రెండు నెలలుగా వెనుజులా చుట్టూ నావికా దళాలతో మొహరించి వెనుజులా నౌకల పై కవ్వింపు దాడులు చేస్తూ వెనుజులాను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై అర్ధ రాత్రి దొంగ చాటుగా ఈ దురాక్రమణ పూరిత దాడికి పాల్పడింది.డ్రగ్స్,నార్కో టెర్రరిజం అనే దుష్ప్రచారం కేవలం వెనుజులాను దురాక్రమించడానికి అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణ పూరిత వ్యూహంలో ఎత్తుగడ మాత్రమే.ఐక్య రాజ్య సమితి నిబంధన ఆర్టికల్ 2(4) ప్రకారం బలం ప్రయోగం ఆత్మ రక్షణ కోసం మరియు ఐక్య రాజ్య సమితి అనుమతితోనే ఉపయోగించాలి తప్ప అందుకు విరుద్ధంగా దాడి చేయడం నేరపూరిత చర్య.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక నుంచి వెనుజులా ఆయిల్ నిల్లలను వెలికి తీసి అమెరికాకు ఎగుమతి చేస్తామని, వచ్చిన ఆదాయంతో అమెరికా, వెనుజులా ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రకటించాడు. వెనుజులా పై దాడి కానీ, అక్కడి ఆయిల్ నిల్వలను తరలించుకు పోవడం వంటి చర్యలు స్వచ్ఛమైన బందిపోటు చర్యలు. ఈ దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండిస్తూ, బందీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినా ట్రంప్ లెక్క చేయకుండా మరో రెండు వేల సైన్యాన్ని మొహరించి వెనుజులాను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడం తనకు అనుకూలమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండడం అమెరికా దుశ్చర్యలకు నిదర్శనం.
దాడికి కారణం ఏమిటి?
వెనుజులా పై అమెరికా దాడికి కారణం ‘నార్కో టెర్రరిజాన్ని అరికట్టడం’ అని అమెరికా చెబుతున్నది పచ్చి అబద్ధం.దాడికి తక్షణ, దీర్ఘకాలిక ఆర్ధిక, రాజకీయ కారణాలు ఉన్నాయి.వెనుజులాలోని అపారమైన ఆయిల్ నిల్వలను దోచుకోవడం,మొనరో డాక్టరైన్ ను మళ్ళీ నెలకొల్పి అమెరికా ఆధిపత్యాన్ని పునః పతిష్టించడం మరియు లాటిన్ అమెరికా ప్రాంతాల్లో విస్తరిస్తున్న చైనా సోషల్ సామ్రాజ్యవాదుల ప్రభావాన్ని అడ్డుకోవడం పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాదపు తక్షణ కారణాలని పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
అందుబాటులోని సమాచారాన్ని బట్టి వెనుజులా 1995 వరకు ఆయుధాల కోసం అమెరికా పై ఆధారపడింది. ఆ తరువాత కాలంలో జర్మనీ, రష్యాల నుండి కొంత సమీకరించుకున్నా 2000 సంవత్సరం తరువాత ముఖ్యంగా చైనా నుండి దిగుమతి చేసుకుంటుంది. మదురో కాలంలో 2014 నుండి అన్ని రకాల ఆయుధాలను 46 శాతం దిగుమతి చేసుకున్నది. వెనుజులాలో దొరికే లేదా తీసి రిఫైన్ చేయగల ప్రొవెన్ క్రూడ్ ఆయిల్ నిల్వలు చైనా, రష్యా వంటి కొత్త మిత్రులను కలుసుకోవడానికి కారణంగా ఉంది. 2000 సంవత్సరంలో చైనాకు వెనుజులా ఖనిజాల ఎగుమతులు ఒక్క శాతం కాగా 2018 నాటికి 28 శాతానికి చేరుకుంది.దాదాపు ఆయిల్ ఎగుమతులన్నీ చైనాకే వెళుతున్నాయి. 1990 లో అమెరికా నుండి వెనుజులా దిగుమతులు 40 పైగానే నిలకడగా ఉండేవి.అవి 2023 నాటికి దాదాపుగా ఒక్క శాతానికి పడిపోయాయి. మూడవ కారణం ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం పడిపోయాయి చైనా ఆధిపత్యం పెరిగింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో సహాయం, గ్రాంట్స్,అప్పుల రూపంలోని చైనా పెట్టుబడులు 2001-2023 మధ్య కాలంలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 106 బిలియన్ డాలర్లు ఒక్క వెనుజులాలోనే పెట్టబడి చైనా అతి పెద్ద పెట్టుబడిదారుడిగానూ,వెనుజులా లాటిన్ అమెరికా ప్రాంతంలోనే గాక అంతర్జాతీయంగా చైనా పెట్టుబడులు స్వీకరిస్తున్న నాలుగవ అతి పెద్ద దేశంగా మారిపోయింది.170 ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. చైనా పెట్టుబడుల్లో 26 శాతం కీలకరంగాలైన ఎనర్జీ, మైనింగ్, పారిశ్రామిక రంగాల్లో కేంద్రీకరించబడ్డాయి.ఈ విధంగా వెనుజులా ఆర్థిక రంగంలో అమెరికాను వెనుకకు నెట్టేసి చైనా పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తుండడం అమెరికా ఆగ్రహానికి కారణంగా ఉన్నాయి.
అమెరికా నుండి దూరం జరుగుతూ రష్యా,చైనా సామ్రాజ్యవాదుల సహకారంతో చావేజ్ కాలం నుండి మొదలైన సంస్కరణలు మదురో కాలంలో తీవ్రం చేయబడ్డాయి.ఇవన్నీ సోషలిజం పేరుతో చెలామణీ అవుతున్నా వాస్తవానికి ఆ దేశంలోని పేదరికం,నిరుద్యోగం,వలసలను అరికట్టలేకపోతున్నాయి.అయినా కొన్ని సంస్కరణలు చేపట్టి ఆయిల్ సంస్థలను జాతీయం చేశారు. విద్య,వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.చావేజ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా చేసిన కుట్రపూరిత తిరుగుబాటు వెనుజులా పాలకులను మరింత రెచ్చగొట్టింది.
ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే పేరిట నగ్నమైన బందిపోటు లాంటి అమెరికా సామ్రాజ్యవాదానికి దూరం జరిగి చైనా సోషల్ సామ్రాజ్యవాదులకు దగ్గరయ్యారు.ఇవన్నీ బయటికి కనపడే తక్షణ కారణాలుగా ఉన్నా,సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక, రాజకీయ సంక్షోభం అసలైన మూల కారణాలుగా ఉన్నాయి.
వివిధ రంగాల్లో సంక్షోభంలో కూరుకుపోయిన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి ప్రతినిధి అయిన అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి దిగజారి,అతి పెద్ద రుణధాతగా మారి పరిశ్రమల మూసివేతను, నిరుద్యోగితను, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటుంది.రష్యా, చైనాల నుండి తీవ్రమైన పోటిని ఎదుర్కొంటుంది.ఈ పరిణామాలు తక్షణం దాడికి పురికొల్పేలా చేశాయి.సామ్రాజ్యవాదులు తెంపరి ట్రంప్ ను అధ్యక్షుడ్ని చేసి అతని ద్వారా ‘మేక్ అమెరికా గ్రేట్ అగేయిన్, అమెరికా పస్ట్ ‘ అనే పాలసీలను ప్రకటించారు.ఇతర దేశాలపై దిగుమతి సుంకాలు విధిస్తామని, వలసలను అరికడతామని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతామని,మూత పడిన కంపెనీలను పునరుద్ధరణ చేసి ఉత్పత్తిని పెంచుతామని,పెట్టుబడి తరలింపును కట్టడి చేస్తామని,కెనడా, మెక్సికో వంటి దేశాలను కలిపేసుకుంటామని,పనామా కాలువను ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు చేస్తున్న యుద్ధాలను రెచ్చగొట్టడంం, యుద్ధాలు చేయించడం,ఆయుధాలు అందించి లాభాలు పిండుకోవడం వంటి సామ్రాజ్యవాదుల ఆయుధ ఆర్ధిక విధానానికి అనుగుణంగా అనేక ప్రకటనలు చేశారు.అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద దేశాల్లో,పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థిక రంగంలో రక్షణ విధానం, రాజకీయ రంగంలో జాత్యహంకారం,ఫాసిజాలను పెంచుతున్నారు.అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో అమెరికా, రష్యా, చైనా వంటి సామ్రాజ్యవాదుల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసం జరుగుతున్న పోటీ,కొట్లాటలో ఆర్థిక, రాజకీయ, సైనిక కూటములు ఏర్పడ్డాయి.లెనిన్ విశ్లేషణ ప్రకారం సామ్రాజ్యవాద దేశాల మధ్య అసమాన ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి తీవ్రం కావడంతో అనివార్యంగా వాటి మధ్య పారిశ్రామిక ఉత్పత్తి,పెట్టుబడి ఎగుమతి, సరుకుల ఎగుమతి, మార్కెట్ల కోసం,ముడి పదార్థాల సప్లయ్ స్థావరాల కోసం, పెట్టుబడి ఎగుమతి మార్గాల కోసం ఘర్షణలు తీవ్రమైయ్యాయి.తీవ్రమైన పోటీ వల్ల ప్రాంతీయ యుద్ధాలు జరుగుతున్నాయి.రష్యా,ఉక్రెయిన్ ను ఆక్రమిస్తుండగా, చైనా తైవాన్ ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ కు సకల సహాకారాలను అందిస్తూ పాలస్తీనాలోని గాజాతో సహా మధ్య ప్రాచ్యంలో ఏడు దేశాలతో యుద్ధం చేస్తుంది.ఇరాన్ పై గగనతల బాంబు దాడులు చేసింది.ఆఫ్రికన్, ఆసియా దేశాలలో జరుగుతున్న ప్రతి యుద్ధం సామ్రాజ్యవాద ప్రేరేపితమైనవే.నేడు వెనుజులా పై దాడి కానీ ఇతర దేశాలను ఆక్రమిస్తామనే అమెరికా బెదిరింపులు కానీ ఈ ఆధిపత్యం కోసం జరిగే పోటీలో భాగమే.
పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్థలో 1970 నుండి మూడవ దీర్ఘకాలిక సార్వత్రిక సంక్షోభంలో కూరుకు పోయింది.1985-91 మధ్య నుండి అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు విఫలమైయ్యాయి.2008 లో ద్రవ్య పెట్టుబడి సృష్టించిన గృహ రుణాల సంక్షోభం అమెరికన్ సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ మరింత బలహీన పడింది.మధ్య ప్రాచ్యపు ముస్లిం దేశాల ఆయిల్ నిల్వలను దోచుకోవడానికి ఉగ్రవాదం నిర్మూలన పేరుతో యుద్ధాలు చేసినా ఓటమి పాలైంది.డాట్ కమ్ బూమ్ పతనం తరువాత అత్యధిక ఎఫ్.డి.ఐ లు చైనాలోకి ప్రవేశించి అది ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదిగింది.ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగి అమెరికాకు సవాల్ విసిరింది.ఈ నేపధ్యంలో అమెరికా సామ్రాజ్యవాదం ఆధిపత్యాన్ని కోరుకుంటుంది.సామ్రాజ్యవాదులు సంక్షోభం నుంచి బయటపడటానికి ఒక వైపు రేసిజాన్ని,ఫాసిజాన్ని, ప్రాంతీయ యుద్ధాలను ఆశ్రయిస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంలో 3వ,4వ పారిశ్రామిక విప్లవాలని పిలువబడే వాటిని ముందుకు తెచ్చినా సంక్షోభం ముదురుతుందే తప్ప అందులో నుండి బయటపడే మార్గం కనపడడం లేదు.పైగా ఈ విధానాలు కార్మికులను మరింత దోచుకోవడంతో వారి పోరాటాలు పెరుగుతున్నాయి.అమెరికన్ సామ్రాజ్యవాదుల నాటో కూటమి రష్యాకు పోటీగా తూర్పు యూరప్ వైపు విస్తరించడానికి ప్రయత్నిస్తూనే, చైనాకు వ్యతిరేకంగా జపాన్, దక్షిణ కొరియా మొదలగు దేశాలతో కలిసి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్ నర్ షిఫ్ (టిపిపి) అనే వ్యాపార కూటమిని ఏర్పాటు చేసి, తన సామ్రాజ్యవాద అగ్రరాజ్య స్థానాన్ని నిలబెట్టుకొని సంఘటితం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు అమెరికా ఆధ్వర్యంలోని కూటములకు వ్యతిరేకంగా చైనా, రష్యా కేంద్రంగా ఉన్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సి ఇ) ను రక్షణ బ్లాక్ గా బ్రెజిల్, ఇండియా, ఇరాన్, సౌతాఫ్రికా మొదలగు దేశాలతో కలిసి ఉన్న బ్రిక్స్ ను ఆర్ధిక బ్లాక్ గా కొనసాగిస్తూ బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని డిమాండ్ చేస్తున్న చైనా సామ్రాజ్యవాదుల నుండి ప్రపంచ పునర్విభజన కోసం పెరుగుతున్న పోటీ, ఎదురౌతున్న సవాళ్లు అమెరికాకు తీవ్ర నష్టంగా పరిణమించాయి. ‘ఒక బెల్ట్ – ఒక రోడ్డు’అమెరికా సామ్రాజ్యవాదులకు పెద్ద సవాల్. రష్యా నాటో విస్తరణను అడ్డుకుంటూ తన సామ్రాజ్యవాద స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. చైనా దూకుడుగా వ్యవహరిస్తుంది. ప్రాన్స్ జర్మనీలు యూరోప్ లో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి.WTO,IMF, WB, UN వంటి అంతర్జాతీయ దోపిడీ సంస్థలను ఉపయోగించుకొని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలను దోచుకోవడానికి సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ, కుమ్మక్కు కొనసాగుతున్నప్పటికీ చైనా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాల అంతర్జాతీయ వ్యాపార యుద్ధం పరస్పర సహకారం పేరుతో ఆర్థిక, రాజకీయ, సైనిక కూటముల ఏర్పాటు, ప్రాంతీయ యుద్ధాలకు సహాయం, పన్నులు పెంపు రూపంలో తీవ్రమౌతుంది. ఇందువల్ల ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక – రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని పాకృతిక వనరుల లూటీ, ప్రజలపై దోపిడీ మరింత తీవ్రతరమైంది. ఇందువల్ల వారి పోరాటాలు మిలిటెంట్ రూపం తీసుకోనున్నాయి. మన దేశంలో బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం విజృంభించనుంది. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతంలోని మావోయిస్టు నిర్మూలనా యుద్ధం ఈ నేపధ్యంలోనే చూడాలి.ద్రవ్య, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సామ్రాజ్యవాదులు తమ కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలను మార్చడం,వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలు చేపడుతున్నాయి.డబ్బు సరఫరాను పరిమితం చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి పూనుకుంటున్నాయి.ఈ చర్యలతో తిరిగి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి.ఆర్ధిక వృద్ధి తలసరి ఆదాయం క్షీణిస్తున్నాయి.ఫలితంగా నేటి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడకపోగా మరింత తీవ్రతరం అవుతుంది. అది యుద్ధం ద్వారా తప్ప మరో విధంగా పరిష్కారం కాని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అనేక ప్రాంతీయ యుద్ధాలను, దురాక్రమణలను చేస్తుంది. వెనుజులా పై దాడిచేయడం,ఇంకా కొన్ని దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించడం ఇందులో భాగమే.
తేదీ 10-1-2026.

