కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది. దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత, పేదరికం, మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, ప్రజాస్వామ్య హక్కుల క్రమబద్ధమైన సంకోచం, ఇవన్నీ పరస్పరం సంబంధం లేని పరిణామాలు కావు. వీటిని ఏ రకంగా చూసినా ఒక విధాన దిశలో సాగుతున్న రాజకీయ, ఆర్థిక నిర్ణయాల ఫలితాలు. కార్పొరేట్ లాభాలను అభివృద్ధిగా చూపుతూ, శ్రమజీవుల జీవితాలను పక్కకునెట్టే ఈ మార్గమే దేశాన్ని నేడు ఈ దుస్థితిలో పడేసింది.
కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన 2014 మే 26 మొదలుకుని 2026 జనవరి 15వ తేదీ నాటికి మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాల ఐదు నెలల ఇరవై రోజుల కాలం పూర్తయింది. మూడోసారి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రధాని పీఠం మీద కూర్చున్న మోడీ, పాలనలో మునుపెన్నడూ లేనివిధంగా దేశ ఆర్థిక పరిస్థితి పాతాళంలోకి దిగజారింది. అడ్డూ అదుపు లేకుండా ప్రజలపై మోయలేని పన్నుల భారం పెరిగింది. తొంభై శాతం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ప్రజా సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తున్నది. రైతులు, శ్రామికవర్గ పేదలకు ఇచ్చే రాయితీలకు మాత్రం కోత పెడుతున్నది. అలాగే ఈ మధ్యకాలంలో రైతులు, కార్మికులు, గ్రామీణ పేదల పొట్ట కొట్టే కొత్త చట్టాల్ని రూపొందించింది. నూతన విత్తన చట్టం, కార్మికుల కోడ్స్ అమలు నోటిఫికేషన్, ఉపాధి హామీ చట్టం రద్దు స్థానంలో వికసిత్ భారత్-జి రామ్ జి చట్టం- 2025 వంటివి.
ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థలను హోల్‌సేల్‌గా ఆశ్రితులకు అప్పనంగా అమ్మేస్తున్నది. దేశ విదేశీ అప్పులు గత డిసెంబర్ 31 నాటికి 200 లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఫెడరల్ విధానానికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను తమ చేతుల్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరుచడం, బిజెపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరించడం యథేచ్ఛగా కొనసాగుతున్నది. తమ విధానాలను ప్రశ్నించి వ్యతిరేకించే వారిపై దేశద్రోహ ముద్రవేసి జైళ్లలో నిర్బంధిస్తున్నది. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, తమ పార్టీకి ఓటు వేయరని భావించే ప్రజల ఓట్లను ‘సర్’ పేరుతో తొలగిస్తున్నది. అవసరం లేకున్నా అగ్రరాజ్యాల ఒత్తిడితో వ్యవసాయ ఉత్పత్తులతో సహా అనేక సరుకులను దిగుమతి చేసుకుంటున్నది. దీనివలన పదకొండు లక్షల కోట్ల రూపాయల వాణిజ్య లోటుతో దేశ ఖజానాకు నష్టం జరుగుతోంది.
దేశీయ ఉత్పత్తులతో సాగుకు అవకాశం ఉన్నా వ్యవసాయ ఉత్పత్తులతో సహా అనేక సరుకులను దిగుమతి చేసుకోవడం వలన మన వ్యవసాయానికి నష్టం వాటిల్లుతోంది. రైతు నష్టపోయి అప్పుల పాలవుతున్నాడు. ఉదాహరణకు, చాలారకాల పండ్లు, కూరగాయలు, పామాయిల్ సాగుకు దేశంలో అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడి రైతులను ప్రోత్సహించకుండా విదేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నది. అలాగే విత్తన చట్టం ద్వారా అనేక రకాల విత్తనాలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టింది. దీనివలన రైతాంగం స్వదేశీ విదేశీ కంపెనీల విత్తనాలను సేద్యానికి వాడుకోవాల్సి ఉంటుంది. దేశంలోని అనేక ప్రాంతాలలో రకరకాల విత్తనాలను సాగుచేసే తెలివిగల రైతాంగం ఉన్నది. తెలంగాణ ప్రాంతం నుంచి విదేశాలకు ఇరవై రకాల విత్తనాలను ఎగుమతి చేస్తున్న పరిస్థితికి మోడీ ప్రభుత్వం తెచ్చిన విత్తనచట్టం బ్రేక్ వేసింది.
మందగమనంలో పారిశ్రామికోత్పత్తి :
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మందగించింది. ప్రజల ఆదాయాలు సన్నగిల్లడంతో డిమాండ్ పడిపోవడంతో అంతిమంగా పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముఖ్యంగా విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు అత్యంత పేలవమైన డిమాండ్‌ను చవి చూశాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ 0.4 శాతానికి మందగించింది. కేంద్ర గణాంకాల శాఖ (ఎన్ఎస్ఒ) విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఐఐపి 0.4 శాతానికి పరిమితమై ఏడాది కనిష్ట స్థాయిని చవి చూసింది. ఐఐపిలో ప్రధానమైన తయారీ రంగం 2025 అక్టోబర్‌లో 1.8 శాతం పెరుగుదలతో సరిపెట్టుకుంది. గతేడాది ఇదే నెలలో తయారీ రంగం 4.4 శాతం వృద్ధిని సాధించింది. ఇదే నెలలో మైనింగ్ ఉత్పత్తి మైనస్ 0.9 శాతంగా ఉండగా.. గడిచిన అక్టోబర్‌లో రెట్టింపై మైనస్ 1.8 శాతానికి క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి 2024 అక్టోబర్‌లో మైనస్ 2 శాతంగా ఉండగా.. 2025 అక్టోబర్‌లో మరింత పతనమై మైనస్ 6.9 శాతానికి కుంచించుకుపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం 2.4 శాతానికి తగ్గగా.. ఏడాది క్రితం 2.9 శాతం పెరుగుదల ఉంది. కన్య్సూమర్ డ్యూరెబుల్స్ ఉత్పత్తి 4.4 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలో 23 పరిశ్రమల విభాగాల్లో 9 మాత్రమే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్-అక్టోబర్ కాలంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి 2.7 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో 4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
నత్తనడకన తయారీ రంగం :
దేశీయ తయారీ రంగంలో ఆశించిన స్థాయిలో ఊపు కన్పించడం లేదు. ఎస్ అండ్ పి గ్లోబల్ సంస్థ రూపొందించిన తాజా హెచ్ఎస్బిసి ఇండియా మాన్యుఫాక్చరింగ్ పిఎంఐ సూచీ ప్రకారం గత రెండు సంవత్సరాలుగా ఈ రంగంలో విస్తరణ నెమ్మదించింది. దేశీయంగా డిమాండ్ లేకపోవడం, ఫలితంగా అనేక సంస్థలు ఉత్పత్తిని కుదించుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత నవంబర్‌లో 56.6గా ఉన్న సూచీ డిసెంబర్లో 55.0కు పడిపోయింది. 2023 డిసెంబర్ తర్వాత సూచీలో ఇది కనిష్ట స్థాయి అని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ త్రైమానిసక కాలంలో మనదేశం ఎనిమిది శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసుకుంది. అయితే తయారీ రంగంలో ఈ వేగం కన్పించడం లేదు. వృద్ధిలో వేగం లేనప్పటికీ గత సంవత్సరం తయారీ రంగం పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నదని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా తెలిపారు. గత రెండేళ్ల కాలంలో తయారీ రంగంలో ఉపాధి సూచీ కనిష్ట స్థాయికి పడిపోయింది. నియామకాలు దాదాపుగా నిలిచాయి. వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించింది. విదేశాల నుంచి డిమాండ్ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. పైగా కొన్ని భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించడంతో ఎగుమతుల వృద్ధి కూడా 14 నెలల కనిష్ట స్థాయికి చేరింది. బలహీనమైన రూపాయి ఎగుమతులను పెంచలేకపోతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిడులు స్థిరంగా ఉన్నాయి.
కుదేలైన వ్యవసాయ రంగం :
ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్‌గా నిలుపుతానని, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని రకరకాల పేర్లతో వాగాడంబరం ప్రదర్శించారు తప్ప ఆచరణలో ఆవగింజంత మేలు జరగలేదు. దేశీయ ఉత్పాదకరంగం కుదేలైంది. అధికారిక లెక్కల ప్రకారమే అనేక చిన్న మధ్యతరహా పరిశ్రమల మూతతో ‘మేక్ ఇన్ ఇండియా’ డొల్లతనం స్పష్టమైంది. వంటనూనెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పంచదార, మాంసం, తృణధాన్యాలు పాల ఉత్పత్తులకు దేశీయంగా మోడీ ప్రభుత్వం చేయూతనివ్వడం లేదు. ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో 2004లో ఎం.ఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఆ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులకు మద్దతు ధర, రుణ పరపతి సౌకర్యం విస్తృతం చేసి సబ్సిడీలందిస్తే విదేశీ వాణిజ్య లోటు తగ్గేది. అభివృద్ధి చెందిన అమెరికాలో రైతులకు భారీ సబ్సిడీలు అందిస్తున్నారు. కానీ, నూట నలభై కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార మందిస్తున్న రైతుల కోసం ప్రభుత్వ సాయమేమీ లేదు. దేశంలో కీలకమైన వ్యవసాయ రంగం మీద రైతులతో సహా యాభై రెండు శాతం, పరోక్షంగా పది శాతం మంది బతుకుతున్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటుకాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఉపాధి ఉసురు తీసే ‘వి బి జీ రామ్ జీ’ చట్టం :
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వంద రోజులు ఉపాధి కల్పించడానికి 2005లో చట్టంగా వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వి బి జీ రామ్ జీగా మార్పు చేస్తూ తాజాగా పార్లమెంటులో చట్టం చేశారు. గతంలో దేశవ్యాప్తంగా అమలైన ఈ పథకం ద్వారా చిన్న రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు జీవనం సాగిస్తున్నారు. 2025 లెక్కల ప్రకారం గ్రామీణ ఉపాధి హామీ ద్వారా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో కోటి పది లక్షల మంది, తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులుగా నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం పనిదినాలలో అరవై శాతం పైగా మహిళలు పాల్గొంటున్నారు. ముప్పయి వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇదివరకటి ఉపాధి చట్టం ప్రకారం తొంబై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం ఉంది. కొత్తగా వచ్చిన ‘రామ్ జీ’ పథకానికి కేంద్రం తన వాటాను అరవై శాతానికి కుదించింది. రాష్ట్ర వాటాను నలబై శాతానికి పెంచింది.
ఇదివరకు గ్రామీణ ఉపాధి పనిహక్కు అనేది చట్టబద్ధంగా ఉంది. ఇప్పటి జీ రామ్ జీ లో ఆ అవకాశం లేదు. పని కల్పించడం, నిలిపివేయడం మోడీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీన్ని కొన్ని జిల్లాలు, మండలాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసే మార్పులు కొత్త పథకంలో ఉన్నాయి. ఈ క్రమంలో మార్పు చేసిన ఉపాధి హామీ పథకానికి రాష్ట్రాల వాటాను పెంచడంతో ఆశించిన లక్ష్యం నీరుగారిపోతుంది. వ్యవసాయం పనులు లేనికాలంలో, ఈ పథకం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్న లక్షలాది వ్యవసాయ కార్మికులు, చిన్న రైతుల కుటుంబాలతో పాటు సిబ్బంది భవిష్యత్తు అగమ్యగోచరంగా పరిణమిస్తుంది. యేటా రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తానని బిజెపి చేసిన వాగ్దానాన్ని తిరగేసి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్రామీణ కార్మికుల ఉపాధిని తొలగించే ప్రమాదం జీ రామ్ జీ పథకంలో పొంచి ఉంది.
స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల అనుకూల విధానాలు :
ప్రధాని మోడీ దేశంలో వందల సంఖ్యలో ఉన్న పెట్టుబడిదారుల కుటుంబాల ఖజానా నింపే విధంగా సామాన్య ప్రజల జీవితాలను పాతాళంలోకి తొక్కే ఆర్థిక విధానాలు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ అనుకూల విధానాల వలన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో నలభై శాతం పైగా జాతీయ సంపద పోగైంది. బిజెపి అధికారంలోకి వచ్చింది మొదలు బడా పారిశ్రామిక వేత్తలు వాణిజ్యవేత్తల లాభాలు విపరీతంగా పెరిగాయి. 2015-2024 మధ్యకాలంలో భారీ పరిశ్రమలకు సంబంధించి, పార్లమెంట్ సాక్షిగా 9,26,947 కోట్ల రూపాయల రుణాలను పాతబాకీలుగా ప్రకటించారు. 2020-2024 కాలంలో కార్పొరేట్ సంస్థల నుంచి రావలసిన 3,67,261 కోట్ల రాబడిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
2020లో కేంద్రం ఆమోదించిన నాలుగు లేబర్‌కోడ్‌లతో కార్మికుల జీవితాలను పారిశ్రామిక సంస్థలకు తాకట్టు పెట్టే కార్యక్రమం మొదలైంది. కార్మికుల సంక్షేమం కోసం, బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1926లో చేసిన ట్రేడ్ యూనియన్ హక్కులు నాలుగు లేబర్ కోడ్లతో ప్రమాదంలో పడ్డాయి. ఎనిమిది గంటల పని దినం నుంచి పది, పన్నెండు గంటల పని దినం కావాలని కార్పొరేట్ శక్తులు చేస్తున్న ప్రచారం పట్ల మోడీ ప్రభుత్వం మిన్నకుంది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారుల అనుకూల విధానం స్పష్టమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు రోజవారీ కనీస వేతనం 465 రూపాయలుగా కేంద్ర లేబర్ కమిషన్ ప్రకటించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ వేతనంతో కార్మికుల కుటుంబాలు పిల్లల చదువులు, జీవనభృతికి జీవన్మరణ సమస్య ఎదుర్కోక తప్పదు.
ప్రైవేటు రంగంలో కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తనవంతుగా రూపాయి కూడా చెల్లించకుండా యాజమాన్యాల నుంచే దాన్ని జమ చేయించాలని చట్టం చేసింది. దీనివల్ల యాజమాన్యాలు తమ వాటా సొమ్మును కూడా కార్మికుడి వేతనం నుంచే కోత కోసే అవకాశం ఉంది. 25 ఏండ్ల నుంచి 30 ఏండ్లు ఒకే సంస్థలో పనిచేసి రిటైర్ అయిన కార్మికునికి ఇ.పి.ఎస్ పేరున ఇస్తున్న పింఛన్ అత్యధిక మందికి మూడువేల రూపాయలకు మించడం లేదు. ఈ పింఛన్‌ను తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని కార్మికులు మొరపెట్టుకుంటున్నా మోడీ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కాని ఎన్‌పిఎస్, యుపిఎస్ పేరుతో కార్మికులు తమ జీవితకాలంలో జీతం నుంచి పొదుపు చేసుకున్న సొమ్మును మాత్రం షేర్ మార్కెట్లో కార్పొరేట్లకు పెట్టుబడిగా పెడుతోంది.
దేశాన్ని అప్పులకుప్పగా మార్చిన మోడీ :
ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ కార్పొరేట్ శక్తులకు కల్పతరువుగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పులకుప్పగా మార్చింది. ఇటీవల (నవంబర్ 2025లో) రాజ్యసభలో సిపిఐ(ఎం) ఎంపీ శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, రాబోయే కాలంలో దేశ ప్రజల భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా పరిమణించబోతుందో అర్థమవుతుంది. 2020-21లో మొత్తం అప్పులు 121.86 లక్షల కోట్లు కాగా, 115.71 లక్షల కోట్లు స్వదేశీ రుణం, 6.15 లక్షల కోట్లు విదేశీ రుణం ఉండగా 2025లో 177.20 లక్షల కోట్లు స్వదేశీ రుణం,8.74 లక్షల కోట్లు విదేశీ రుణం ఉంది. మొత్తం మీద 2025-26 బడ్జెట్ అంచనా ప్రకారం దేశ రుణభారం 200.16 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని తెలిపింది. ఇదిలా ఉండగా 2021లో వడ్డీ చెల్లింపులు 6.80 లక్షల కోట్ల రూపాయలు కాగా 2024-25లో ఇది 11.16 లక్షల కోట్లకు పెరిగింది.
ప్రధాని మోడీ ప్రవచిత ‘మేకిన్’ ఇండియాలో పదుల సంఖ్యలో ఉన్న కార్పొరేట్ వర్గాలు ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోతుండగా కోట్లాదిమంది కార్మికులు, కర్షకులు, వివిధ వృత్తుల సామాన్య ప్రజలు, ఉద్యోగ వర్గాలు దారిద్య్రపు అంచులకు చేరే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా సమాజంలో అసమానతలను పెంచి పోషిస్తోంది. ధనవంతులు కుబేరులుగా తేలుతుండగా, పేదలు మరింత కటిక దారిద్య్రంలో మునుగుతున్నారు. అలాగే 2014లో డాలర్‌తో 60 రూపాయలు విలువ కలిగిన మన రూపాయి, 2025 నవంబర్‌లో డాలర్‌కు 90.80కి పతనమైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో డాలర్‌కు వంద రూపాయలుగా మన కరెన్సీ దిగజారే గడ్డుకాలం ఏర్పడనుంది. కొత్త ఏడాదిలోనైనా పేద, ధనికుల అసమానతలు మారాలి. ప్రజామోద పాలన సాగాలి. లేనిపక్షంలో సమస్త వర్గాల ప్రజలు సంఘిటతమవ్వాలి. మోడీ, సర్కార్ అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టాలి.
కుబేరుల సంఖ్య పెరుగుతున్నా, ప్రపంచంలో పేదరికం మాత్రం పోవడం లేదు. ఈనాటికీ ప్రపంచంలో అత్యధిక శాతం మంది అత్యల్ప ఆదాయంతో జీవిస్తూ, జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు లేక చెట్ల క్రింద, ఫుట్‌పాత్‌ల మీద, మురికి వాడల్లోను అత్యంత దుర్భరం జీవితం గడుపుతున్నారు. ప్రజలు తినడానికి తిండిలేక, త్రాగడానికి పరిశుభ్రమైన నీరు లేక అలమటిస్తున్నారు. ఎందుకింత ఆర్థిక అంతరాలు? దీనికి పరిష్కారమేమిటి? ప్రపంచంలో పేదరికంలో ప్రజలు మగ్గిపోవడానికి అవినీతి జాడ్యమే చాలావరకు కారణమని చెప్పక తప్పదు. అక్రమార్జనతో ధనికులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని అనేక గణాంకాలు సూచిస్తున్నాయి. ఎన్నో జీవితాలు ఆర్థిక లేమితో చితికిపోయి, అల్లాడి పోతున్నాయి. అవినీతిలేని చోటంటూ ఎక్కడా లేదు. నీతికి గుక్కెడు గంజి దొరకదు. గజం జాగా కరువు. అవినీతికి ఆద్యంతాలు కనిపెట్టడం కష్టతరం. పేద, ధనిక, వర్ధమాన దేశాలన్నింటిలో అన్ని రంగాల్లో అవినీతి తాండవిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఒక మిశ్రమ చిత్రాన్ని చూపుతోంది, ఒకవైపు బలమైన వృద్ధి, మరోవైపు అసమానత పంపిణీ ఉంది. నిర్మాణాత్మక సమస్యలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సంక్షోభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి, ఆర్థిక వ్యవస్థకు నిరంతర సంస్కరణలు అవసరం.




