పుస్తకాలను చదవకుండా పుస్తకాలను తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు.
ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా.. అలా.. పుస్తకాలను ఇతరులకు అందచేస్తూ ఉంటే చాలా పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి వెడుతూ ఉంటాయి. చాలా విలువైన పుస్తకాలను మనం ఎలాగూ ఎవరికీ ఇవ్వలేం కాబట్టి.
*
పుస్తకాల భద్రత గురించి అనేకమందికి అనేక చిత్ర విచిత్రమైన అనుభవాలు ఉంటాయి. ఇక పుస్తకాల దొంగల గురించి, అడిగి కానీ, అడగకుండా గాని పుస్తకాలు తీసుకు వెళ్ళి ,తిరిగి ఇవ్వని వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మనం చదవని పుస్తకాలు, మనం పోగొట్టుకున్న పుస్తకాలు మనకు అంతులేని దుఃఖాన్ని ఆవేదనను మిగులుస్తాయి. కొన్ని పుస్తకాలను మనం జీవితాంతం వెతుకుతూనే ఉంటాం. కొన్ని పుస్తకాలు మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పుస్తకాలు కలల్లోకి వచ్చి కలవరపెడతాయి కూడా.
*
పిల్లలకు పుస్తకాలు అంటే భయం పోగొట్టాలి. పాఠ్య పుస్తకాలే కాకుండా అందుబాటులో ఉన్న బహుళ ప్రయోజనకరమైన ఎన్నో పుస్తకాలను వాళ్లకు చిన్నప్పటినుండే పరిచయం చేయాలి. ఇంట్లో పెద్దవాళ్లు చదువుతూ ఉంటే పిల్లలకు కూడా పుస్తకాలు చదవడం అలవాటు అవుతుంది.దేనికైనా ఇంట్లో ముందు పుస్తకాలు ఉండాలి కదా. ఎలాగైనా సరే పుస్తక ప్రపంచాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు దగ్గర చేయాలి.
*
మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకాలతో నడక , పుస్తకం కోసం నడక, ఊరూరా గ్రంథాలయాలు…గ్రంథాలయాలను కాపాడుకోవాలనే నినాదాలతో అనేక ఉద్యమాలు ఊపందుకున్నాయి.
పుస్తకాలు మనల్ని మాట్లాడిస్తాయి. ఆలోచింపచేస్తాయి, చైతన్య పరుస్తాయి. మరింత ఉన్నతంగా ప్రవర్తించడాన్ని నేర్పిస్తాయి. కొత్త చూపును కొత్త భాషను కొత్త మాటను కొత్త శక్తిని కొత్త ప్రేరణ ను అందిస్తాయి. వ్యక్తి పట్ల జీవితం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండటాన్ని నేర్పిస్తాయి.
కొందరు సాహితీమిత్రులను తమతో మాటాడిన పుస్తకాల గురించి అడిగాను. వాళ్లిలా స్పందించారు. ఈ సంచికలో వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు పుస్తకాలకు సంబంధించి వాళ్ళ అనుభవాలను, ఎన్నో అద్భుతమైన విషయాలను చెప్పారు.
రచయిత్రి, సాహిత్య విశ్లేషకురాలు వి ప్రతిమ ఇలా అంటున్నారు.
1.. ఎటువంటి చదువుల ఒత్తిడి లేని కాలంలో, నా బాల్యం గడవడం ఒక బ్లిస్….. బడినుండి రాగానే హోంవర్క్ లు లేని సాయంత్రం, అనుకునో, అనుకోకుండానో పుస్తకం నా నేస్తం అయింది….
నా స్నేహితురాలు యశోద తండ్రి ఆనాటికే మా ఇంటి పక్కన లెండింగ్ లైబ్రరీ ఒకటి నడిపేవాడు…. ప్రతిరోజు మా నాన్న ఇచ్చే పది పైసలు ఆయనకు ఇచ్చి రోజుకొకటి, ఆదివారమైతే రెండు పుస్తకాలు చదివేసేదాన్ని…… ఆయన తన ఐదు మంది పిల్లల్ని “చదవండిరా… ఆ పిల్లని చూసి నేర్చుకోండిరా” అంటూ కోప్పడేవాడు.. అదొక మెచ్చుకోలు అని కూడా నాకు అర్థం అయ్యేది కాదు…
ఆ రోజుల్లోనే రంగనాయకమ్మ “స్త్రీ” సీరియల్ గా వచ్చేది.
అలా అనేక డిటెక్టివ్ నవలల తో పాటు రంగనాయకమ్మ, కౌసల్యాదేవి, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల రావు….అర్ధమయినా కాకపోయినా చలం, శ్రీశ్రీ ఇలా ఒకటని కాదు ఎన్నెన్నో….ఆవిధంగా చదవడం ఒక వ్యసనం గా మారింది.
అలా ఆ లెండింగ్ లైబ్రరీ ఈ ప్రపంచానికి కొత్త ద్వారాలు తెరిచిందని నేననుకుంటాను…
2.. అలా విస్తృతంగా చదువుతూ, చదువుతూ ఏదో ఒక క్షణంలో రాయడం మొదలు పెట్టాను అనుకుంటా….. మొదట కవిత్వంతో మొదలై క్రమంగా కథల్లోకి మారడంతో ఎక్కువగా కథలు చదువుతూ యద్దనపూడి, మాదిరెడ్డి వంటి వారి నుండి నడవాల్సిన దారి అర్థమై గురజాడ, శ్రీపాద, చలం, శ్రీశ్రీ కొకు.. మధురాంతకం రాజారాం, చాసో వంటి వారిని చదువుతూ కథా సంపుటాలు, సంకలనాలు ఎక్కువగా కొనేదాన్ని….
అదే సమయంలో మధురాంతకం రాజారాం గారి పరిచయం, స్నేహం లభించడం మరొక బ్లిస్…..
బయట మార్కెట్లో దొరకని ఎన్నో పుస్తకాలు తిరుపతిలో నరేంద్ర దగ్గరకి వెళ్లి తెచ్చుకుని చదివి, మళ్ళీ ఇచ్చేసే దాన్ని…… ఆ విధంగా మధురాంతకం నరేంద్ర గారి లైబ్రరీ మరో ద్వారాన్ని తెరిచింది…..
పుస్తకాలు భద్రపరచడం అంటే ప్రత్యేకమైన పద్ధతి ఏం లేదు కానీ… కథలు,కవిత్వం,, నవల,నాటకం, వ్యాసాలు ఇట్లా విడివిడిగా ఒక్కొక్క షెల్ఫ్ లో సర్దుకుంటాను… జాగ్రత్త కోసం కలరా ఉండలేకాక పి.సత్యవతి గారు నాకు మరొక మార్గం చెప్పారు… దాన్ని పాటిస్తాను.
3 చదవాలనుకుని, చదవలేకపోయిన పుస్తకాలు చాలానే ఉన్నాయి…. అందులో ప్రధానంగా చెప్పదగినది “బ్రదర్స్ కరమజోవ్”
మిల్స్ అండ్ బూన్ నవలలు తప్ప ఆంగ్లంలో లోతైన సాహిత్యం చదివే ధైర్యం చేయలేదనే చెప్పాలి…
ఆ క్రమంలో ఇటీవల కుమార్ కూనపు రాజు గారి ప్రయత్నంతో తెలుగులోకి వచ్చిన పుస్తకాన్ని దొరికిoచుకోవడానికి సమయం పట్టింది…. అది నా చేతికి వచ్చి కూడా మూడు నెలలు దాటింది.. ఇంతవరకు చదవలేకపోయాను….. చదువుతాను….
4.. ఇది చాలానే పెద్ద లిస్టు ఉంది
కానీ ఇటీవల పోగొట్టుకున్న రెండు పుస్తకాల గురించి చెప్తాను…. చరిత్ర నిర్మాతలుగా స్త్రీల విజయాలను శ్రమకోర్చి, సేకరించి “మహిళావరణం” అన్న పెద్ద పుస్తకం తీసుకొచ్చారు, ఓల్గా, వసంత కన్నాబిరాన్, కల్పనా కన్నాభిరాన్… దానికి వాళ్లు ముగ్గురు కలిసి ఒక విస్తృతమైన, విలువైన ముందుమాట కూడా రాశారు…. “సామాన్యుల సాహసం” అని.
ఆ పుస్తకం ఒకసారి నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఓల్గా కుటుంబ రావులు సంతకాలు చేసి మరీ ఇచ్చారు …
ఆ పుస్తకం ‘ఇదిగో ఇప్పుడే ఇస్తానని’ తీసుకెళ్లి ఒక రచయిత మళ్లీ నాకు చేర్చలేదు ఇప్పటికీ
అలాగే విశ్వేశ్వరరావు గారు ప్రచురించిన శ్రీశ్రీ మహాప్రస్థానం పెద్ద పుస్తకం కూడా నా వద్ద మాయమైంది.
5. ప్రత్యేకంగా ఒకటి అని చెప్పలేను కానీ ఎప్పుడు నాకు మనసుకి కష్టం అనిపించినా నాకిష్టమైన కవిత్వం, ఎక్కువగా స్త్రీల కథలు చదువుతూ ఉంటాను…. నా లైబ్రరీ నాకు ప్రాణ సమానం.
6 మా ఇంట్లో ఒక ప్రక్కన ఒక కుర్చీ, దాని పక్కనే చిన్న టీపాయిమీద నేను చదవాల్సిన పుస్తకాలు పేర్చి ఉంటాయి….
ఎక్కువ భాగం అక్కడ, అప్పుడప్పుడు బయట మొక్కల్లోనూ చదువుకుంటూ ఉంటాను…. సమయం మాత్రమే సమస్య.ఎక్కువసార్లు ప్రయాణాల్లో పుస్తకాలు చదువుతూ ఉంటాను…. అది కూడా సరైనదని చెప్పలేo.. ఎందుకంటే విస్తృతమైన జీవితాన్ని పరిశీలించడానికి ప్రయాణం ఒక మార్గం… పుస్తకంలో పడితే అది సాధ్యం కాకపోవచ్చు…. కార్లలో కాకుండా బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించమనీ, జీవితాలను పరికించమని మధురాంతకం రాజారాం గారు నాకు నేర్పారు…
“ప్రతీ కథ రాసే ముందు సమాజాన్ని పరికించడం కాదు…. సమాజాన్ని నిశితంగా మనం పరిశీలిస్తూ… సమాజ సందర్భాలని ఫాలో అవుతూ ఉన్నట్లయితే, మనం కథలు రాసే క్రమంలో.. అవి మన కథల్లో చోటు చేసుకుంటాయి.” అని సింగమనేని నారాయణ గారు తెలిపారు…… చుట్టూ ఉన్న సమాజాన్ని చరిత్ర కోణంలో పరిశీలించడం అలవాటయింది…..
ఒక విషయాన్ని చెప్పడానికి వెనుక,, ఒక అంశాన్ని రాయడానికి వెనుక…. ఎలా సాహిత్య పునాది, తాత్విక పునాది, రాజకీయ పునాది ఉంటాయో, ఎంతెంత అధ్యయనం అవసరమో ఓల్గా రచనలు నేర్పిస్తే….. ఈ కుటుంబాల్లో, సమాజంలో స్త్రీ యొక్క స్థానాన్ని ఎట్లా అంచనా వేయాలో, ఎలా అధ్యయనం చేయాలో…. మనం ఎంతో మామూలు విషయాలనుకునే పనుల్లో స్త్రీలు తమ మీది అధికారాన్ని వదులుకొని, తమను తాము కోల్పోవడం లోని అసలు రాజకీయాన్ని పి. సత్యవతి కథలు అర్ధం చేయించాయి….
ఈ క్రమంలో చాలా అనువాదాలు కూడా చదవడం జరిగింది…ఇలా రాయడం కంటే,, చదవడమే నాకు వ్యసనం అయింది….
7 నా కథలు చదివి, ఆ కథల్లో తాము ఐడెంటిఫై అయ్యామంటూ పాఠకులు చెప్పినప్పుడు చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది….
“కవులేం చేస్తారు? గోడలకు చెవులిస్తారు. మూగవాడికి మాటలను ఇస్తారు..” అలా మూగబోయిన బాధిత స్త్రీలకు, బాధిత నిర్వాసితులకు, సమస్యా యుతమైన జీవితానికి మాటనివ్వడం కోసం… చీకటి కోణాల్లోకి వెలుగు ప్రసరించేలా రచనలు చేయాలన్నదే నా ఆకాంక్ష…అన్నిటికంటే ముఖ్యంగా నన్ను నేను చీకటి దారుల్లోకి జారిపోనివ్వకుండా కాపాడుకోవడం కోసo మాత్రమే రాసానేమో అనిపిస్తుంది….
*
కవి, ఉపన్యాసకుడు, విమర్శకుడు సుంకర గోపాలయ్య ఇలా అంటున్నారు.
1.
పుస్తకం అంటే మొట్టమొదట చూసిన ఒకటవ తరగతి తెలుగు పుస్తకం తెలుసు. అక్షరాలు చదవడం వచ్చాక మా ఇంట్లో ఉన్న బట్టి విక్రమార్క కథలు చదివాను.
ఆ తర్వాత వచనంలో ఉన్న మహాభారత కథలు చదివినట్టు గుర్తు. ఇక మా ఊరికి ఒకే ఒక బస్సు వచ్చేది ఆ బస్సులో ఈనాడు పేపర్ వచ్చేది నాలుగవ తరగతి నుంచి వార్తా పత్రిక చదవడం అలవాటు. అట్లా అందులో వచ్చే అంశాలు సినిమా వార్తలు క్రికెట్ వార్తలతో పాటు ఆదివారం సంచికలో వచ్చే చిన్న కథ చదవడం ఆనందంగా ఉండేది.
2.
పుస్తకాలు చదవడం నెల్లూరు సండే మార్కెట్ లో మణి బుక్ స్టాల్ లో. కవిత్వం రాయడం ప్రారంభమైన తర్వాత కొనడం ప్రారంభించాను. కవిత్వ వార్షికలు కథా వార్షికలు కొని చదివే వాణ్ణి. ఆ తర్వాత కవిత్వం రాయడం వ్యాసాలు రాయడం ప్రారంభమయ్యాక చాలామంది కవులు పుస్తకాలు పంపేవారు. వాటిని కవిత్వం కథ విమర్శ నవల ఇలా విభజించుకుని ఇంట్లో భద్రపరిచాను.
3.
ఈ జాబితా అయితే చాలా ఉంది. కొన్ని చరిత్రత్మక పుస్తకాలు చదవాలని ఉంది. యక్షగానానికి సంబంధించిన పుస్తకాలు సేకరించాలని ఆలోచన ఉంది.
4.
సాధారణంగా పుస్తకాలు పోగొట్టుకోను, గాని ఒకసారి బస్సులో శివారెడ్డి పీఠకల పుస్తకం పోగొట్టుకున్నాను.
5.
అబ్దుల్ కలాం ఒక విజేత ఆత్మకథ, ఎవరికీ తలవంచకు పుస్తకాలు చాలా ఇష్టం. ఇక కవిత్వం అయితే ఆ జాబితా చాలా పెద్దగానే ఉంది. కథా వార్షిక సంకలనాలు కూడా నేను ఎక్కువగా చదువుతూ ఉంటాను.
6.
ఎప్పుడు ఖాళీగా ఉన్నా, కళాశాల సమయంలో అయినా ఇంట్లో అయినా ప్రయాణాల్లోనైనా నేను పుస్తకాలు విపరీతంగా చదువుతాను.
7.
పుస్తకం మనల్ని చాలా మెరుగుపరుస్తుంది కొత్త కొత్త లోకాలను పరిచయం చేస్తుంది. ముఖ్యంగా ఆత్మ కథలు జీవిత చరిత్రలు మన ఆలోచనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అలాగే మన రచనా విధానంలో కూడా పుస్తకాలు చదవడం వల్ల మార్పులు వస్తాయి.
*
కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పల్లిపట్టు నాగరాజు ఇలా అంటున్నారు.
1.
నాకు పుస్తకాలు మొదటిగా నా పాఠశాల ప్రాథమిక విద్యలో పరిచయమయ్యాయి. అప్పట్లో నేను చదువుకునే రాజగోపాలపురం లో పంచాయతీ లైబ్రరీ ఉండేది. అక్కడ బాలల సాహిత్య పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు, పురాణాల పుస్తకాలు, భూగోళ శాస్త్ర పుస్తకాలు ఇలా అనేక రకాల పుస్తకాలు ఉండేవి. వాటిలో మనకు నచ్చినవి ఒకటి/ రెండు రూపాయలు కట్టి తీసుకెళ్లి చదివేసి భద్రంగా తిరిగి ఇచ్చేస్తే మళ్లీ మన రెండు రూపాయలు మనకు ఇచ్చేవాళ్ళు.ఇలా నేను కూడా ఒకటి రెండు సార్లు తీసుకెళ్లిన జ్ఞాపకముంది.అలాగే అప్పట్లో వచ్చే వార్తా పత్రికలకు ఆదివారం అనుబంధంగా వచ్చే పుస్తకాలు ఎక్కడ దొరికినా దాచుకునే వాన్ని, మా నాయినమ్మతో కూడా సినిమాకెళ్తే అక్కడే బయట అమ్మే సినిమా పాటల పుస్తకాల కొనుక్కుని వాటిని నోట్సులో రాసుకోవడం, స్కూల్లో పోటీలు పెట్టినప్పుడు పాడే వాన్ని, ఇక అప్పట్లో బాల భారతి అనే పత్రిక వచ్చేది పక్ష పత్రికో, మాసపత్రికో.. దాని వెల ఐదు ,ఆరు రూపాయలు ఉండేది.అవకాశం ఉన్నపుడు ఎక్కడైనా పుస్తకాల బంకుల్లో కొనుక్కునే వాణ్ణి. ఇదే తరువాత అలవాటుగా మారింది.
నేను హైస్కూల్లో చదివేటపుడే మా క్లాస్మేట్ సుమతి వాళ్ళ నాన్న ఉషశ్రీ గారి వచన రామాయణం చదువుతుటే చూసి ,అడిగి తెచ్చుకుని చదివి తిరిగి ఇచ్చేసాను. క్లాసులు మారినప్పుడల్లా అన్నీ పుస్తకాల్ని వదికేసుకున్నా తెలుగుపుస్తకాల్ని మాత్రం భద్రంగా దాచుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికీ నా చిన్నప్పుడు నుంచి కూడబెట్టుకున్న పుస్తకాలు కొన్ని నా వద్ద ఉన్నాయి. మరో సంగతి ఏమిటంటే మా నాయిన వీధినాటకాలు వేసేవాడు. ఆయన చదువు రాకపోయినా నాటకంలో ఆయన పాత్రకు సంబంధించిన దురువులు, పద్యాలు, సూర్ణికాలు నోటు పుస్తకాల్లో నాటకం నేర్పే వాతేరు దగ్గర రాయించి పెట్టుకునే వాడు. అప్పుడప్పుడు నన్ను చదివి చెప్పమనే వాడు. నేను వాటిని చదివి చెబితే ఆయన రాగం,తాళం గుర్తు తెచ్చుకుని పాడుకునేటోడు. అవి కూడా చదవడం వల్ల, పురాణ కథల్ని నాటికీయ పద్దతిలో అర్ధంచేసుకునే అవకాశం దక్కింది.
నా ఇంటెర్మెడియట్ లో మొదటిసారి మూడొందలో, నాలుగొందలో స్కాలర్షిప్ వస్తే ఆ డబ్బులో యాభై రూపాయలు తీసుకుని నేను చేసిన మొదటిపని ఒక చిన్న భగవద్గీత పుస్తకం, చిన్న నీతి శాస్త్రమనే సంస్కృత శ్లోకాల పుస్తకం కొనుక్కోవడమే. మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చేసాను. అప్పట్లో భారత రామాయణ పుస్తకాల గురించి ఎక్కువ ఆసక్తి ఉండేది.
నా చిన్నప్పటి నుంచే పుస్తకాలతో నా అనుబంధం సాగుతోంది. ఇప్పటికీ యాడకి బోయినా పుస్తకాలు కనబడితే ఏదో ఒకటి తీసుకోకుండా ఇంటికి రాను.అయితే పుస్తకాలు ఎంపికలో నా పద్ధతి మారింది మాత్రం నా డిగ్రీ విద్య తరువాతే.
నా కాలేజి విద్య నుంచి ప్రత్యేకంగా సాహిత్య పత్రికల్ని కొని చదివి దాచుకునే అలవాటు ఎక్కువైంది. ఆయా పత్రికల ఆదివారం అనుబంధాలతోపాటు, స్వాతి,ఆంధ్రభూమి,విపుల, చతుర వంటి పక్ష,మాస పత్రికల్ని కొని,వాటితోపాటు ఉచితంగా ఇచ్చే నవలల్ని,నవలికల్ని ఏక బిగిన చదవడం అలవాటు అయింది. తిరుపతి విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్ హౌస్ కి తరచూ వెళ్లడం,అక్కడ మెంబర్షిప్ తీసుకొని మరీ పుస్తకాల్ని కొనేవాణ్ణి. ముఖ్యంగా ప్రగతిశ్రీల,అభ్యుదయ సాహిత్యం విరివిగా కొనేవాణ్ణి. ఇటు డిగ్రీ స్పెషల్ తెలుగు పాఠ్యపుస్తకాలు, అటు వివిధ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే పోటీల్లో గెలుపొందినపుడు కాలేజి వారు ఇచ్చిన రామకృష్ణ మఠం వారి రచనలు, స్వామి వివేకానంద ప్రసంగాల పుస్తకాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుస్తకాలు నా బట్టల బ్యాగుల కంటే పుస్తకాల పెట్టెలు పెద్దవి. హాస్టల్ లో రూమ్మేట్స్ కూడా ఎందుకురా ఇన్ని పుస్తకాలు అని విసుక్కునే వారు. నిరుద్యోగ జీవితంలో బ్యాచిలర్ గా ఉన్నపుడు కూడా రూం మారాలంటే నా పుస్తకాల గురించే పెద్ద పనిగా ఫ్రెండ్స్ మాట్లాడేవారు. అలా పుస్తకాలు నా జీవితంలో భాగంగా మారిపోయాయి.
2.
బుక్ ఎగ్జిబిషన్స్ ద్వారా, కవులు,రచయితల దగ్గరికి వెళ్లినా పుస్తకాలు తెచ్చుకోవడమే. కొన్ని సాహిత్య పత్రికలకి చందాలు కడతాను. అలా తెచ్చుకున్న పుస్తకాలు ఊళ్ళోను, నాతోనూ ఉన్నాయి. యాడకి బోయినా బ్యాగులో ఏదో ఒక పుస్తకం ఉండాల్సిందే. బస్సులో పోతూ వస్తూ చదవాల్సిన పుస్తకాలు పూర్తి చేస్తూ ఉంటాను. కవులు రచయితలు ఆత్మీయంగా పంపే పుస్తకాలు చదివాక సెల్పుల్లో భద్రపరుస్తాను. వాటిని అమ్మ జాగ్రతగా చూస్తూ వుంటుంది. అప్పుడప్పుడు శుభ్రం చేస్తూ “వాడికి పుస్తకాలంటే ప్రాణమమ్మా! అవేమైనా అయితే వాడికి కోపమొస్తాది.మళ్లీ గొడవ చేస్తాడుష అంటుంటాది .దీనికి ఒక బలమయిన కతుండాది. నేను కాలేజి చదివేటప్పుడు జరిగిందా కత. చిన్నప్పటినుంచి దాచుకుంటా వస్తావుండే పుస్తకాలు, కొన్ని అట్టపెట్టల్లో, కొన్ని గోతాల్లో కట్టి ఇంట్లో ఒక మూల పెట్టుకుని వుంటిమి.అప్పుడు మాది తలుపుకూడా సరిగ్గా లేని పూరిల్లు. మట్టి గోడలు. చెదులు యాడనుంచి వచ్చాయో కాని గోతాల్లోపల జొరబడి, పెట్టెల్లోకి చేరి చానా పుస్తకాలు కొరికి తినేసాయి. వాటిలో నేను హైస్కూలో చదువేప్పుడు రాసుకున్న పేరిడీ పాటలు, అరకొరా పద్యాలు, ఇష్టంగా రాసుకున్న డైరీలు కూడా సగం సగం పోయినాయి.సాహిత్య పత్రికలు,పేజీలు నవలలు కూడా పాడైపోయాయి. చాలా ఏడ్చేశాను.ఇంట్లో నానా రచ్చ చేసాను. అప్పటి నుంచి మాయమ్మ ఒక చిన్న పేపరు కూడా పారేయదు. నాకు చూపి జాగ్రత పరుస్తుంది. ఇపుడు నా సహచరి కూడా పుస్తకాల్ని బలే జాగ్రత పరుస్తుంది.పుస్తకాలు లెక్కలేకుండా చూడ్డం, పాడు చేయడం నేను కళ్ళతో చూళ్ళేను.
పని చేసే బళ్లోనూ లైబ్రరీ పుస్తకాలను పిల్లలకు ఇవ్వడం,జాగ్రత్తపరచడం చేస్తుంటాను. చదివిన పుస్తకాలపై విద్యార్థులు మాట్లాడేలా పురికొల్పుతుంటాను. ఊరూరికి లైబ్రరీ వుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది.
3.
సేకరించలేకపోయిన పుస్తకాలు చాలా వున్నాయి. అయితే జాషువా గారి అన్నీ రచనలు సేకరించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా ఇంకా అది పూర్తి కాలేదు. జాషువా రచనలు కొన్ని మాత్రమే చదివాను.అలాగే పూలే అంబేద్కర్ రచనలు అన్నీ సేకరించాలని ఉంది.
4.
నేను కర్నూల్లో తెలుగు పండిట్ శిక్షణలో ఉన్నపుడు కేశవరెడ్డి గారి నవలలు అన్నీ ఒక సెట్ కొని పెట్టుకున్నా. అవి మిత్రులు కొందరు తీసుకున్నారు. మళ్లీ తిరిగి ఈయలేదు. తరువాత విడిగా కొన్ని కొన్నా గాని అన్నీ లేవని తలుచుకుంటా ఉంటా. త్వరలో కొనాలి. అలాగే గోర్కీ గారి అమ్మ పాతది వుండే ఎవరో తీసుకున్నారు. మళ్లీ ఇవ్వలేదు.
ఈ మధ్య ఎవరికైనా పుస్తకాలు ఇస్తే రాసిపెట్టుకుంటున్నాను.
5.
క్లుప్తంగా చెప్పడం కష్టం.చాలా పెద్ద లిస్టు ఉంది. ప్రగతిశీల సాహిత్యం. అని ఒక మాటలో ముగిస్తాను. ప్రస్తుతమైతే బాలగోపాల్ గారి రచనలు, త్రిపురనేని మధుసుధనరావు విమర్శ, అంబేద్కర్ రచనలు, బహుజన సాహిత్యం తరచూ చదువుతూ వున్నాను.
6.
నేను చదువుకునే రోజుల్లో లైబ్రరీని ఎక్కువ ఆశ్రయించేవాణ్ణి, ఖాళీ సమయాన్ని ఏదో ఒక నవల పూర్తి చేయడానికి ఉపయోగించేవాణ్ణి. ఇపుడు ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి వస్తూ ఎక్కువగా బస్సులోనే చదువుతున్నా. ఒక్కసారిగా రాత్రిపూట ఇంట్లో పిల్లలు పడుకున్నాక కొంత చదివి పడుకుంటాను.
7. నాకు పుస్తకాలు చదువుతూ ఉండటం వల్ల సమాజంతో కలిసి దగ్గరగా బతుకుతున్నట్టు ఉంటుంది. పుస్తకాలు చదివే వాడిగా, కొంత రాస్తున్న వాడిగా సమాజాన్ని అర్థం చేసుకోవడంలో పుస్తకాలు కీలకమైన పాత్ర వహిస్తాయి అని చెప్పగలను. మనం జీవిస్తున్న కాలాన్ని ,మన గతాన్ని, భవిష్యత్తును వ్యాఖ్యానించేవి పుస్తకాలే కదా! మెరుగైన జీవన ప్రమాణాలు గల, ఆలోచనలు గల, చైతన్యం గల సమాజ నిర్మణంలో పుస్తకాల పాత్ర ఉన్నతమైందని భావిస్తాను.
*
పుస్తకాలు లేకపోతే తాము ఇలా ఉండేవాళ్ళం కాదని అందరూ అంటున్నారు. నిజమే.! మనం చదివే పుస్తకమే మన వ్యక్తిత్వం.
*
మరికొన్ని మాట్లాడే పుస్తకాల గురించి, తదుపరి సంచికలో..




