ఈ కాలపు అవసరం ఈ పుస్తకం
(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న పాణి శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం - విప్లవోద్యమం పుస్తకానికి ప్రచురణకర్తలు రాసిన ముందుమాట ) ఈ పుస్తకాన్ని వర్తమాన తెలుగు మేధా సంప్రదాయంలో అత్యవసరమైన, ప్రాసంగికమైన, కీలకమైన రచనగా పరిగణించడానికి మూడు కారణాలున్నాయి.ఒకటి, ఇది ఒక వాదనల సంకలనం. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని, సమాజంలో నెలకొని ఉన్న హింస తగ్గి శాంతి ఏర్పడాలని ఆకాంక్షలు వినిపిస్తున్న సందర్భంలో వ్యక్తమవుతున్న అనేక వాదనలను, అభిప్రాయాలను మదింపు చేసి విప్లవోద్యమం వైపు నుంచి ఒక వాదన వినిపిస్తున్న పుస్తకం ఇది. రెండు, ఇది ఒక ఆశావాదపు ప్రకటన.