ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌హక్కుల సంఘం

20వ రాష్ట్ర మ‌హాస‌భ‌లకు రండి

జ‌న‌వ‌రి 10, 11 2026, తిరుప‌తి

ప్ర‌జలారా!         

ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి హక్కుల కోసం గొంతెత్తడమే లక్ష్యంగా,  తెలుగురాష్ట్రాల్లో గత ఐదు దశాబ్దాలకు పైగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం తన 20వ రాష్ట్రమహాసభల్ని తిరుపతిలో జరుపుకుంటున్నది.

పౌరహక్కుల సంఘం ఆవిర్భవించిన తొలినాళ్ళల్లో రాజ్య హింసకు వ్యతిరేకంగా మాత్రమే పని చేసిన పౌరహక్కుల సంఘం, తరువాత కాలంలో తన కార్యరంగాన్ని విస్తృత‌ పరచుకుని, సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురి అవుతున్న ప్రజల హక్కుల కోసం పని చేయటం ప్రారంభించింది. ముఖ్యంగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల హక్కుల పరిరక్షణ కోసం, పురుష అహంకారానికి, దౌష్ట్యానికి  బలవుతున్న మహిళల హక్కుల కోసం, కార్మికుల, మైనారిటీల హక్కుల కోసం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి, ఆదివాసి ఉద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా సంస్థ తన కార్యాచరణను కొనసాగిస్తున్నది. రాజ్యాంగ బద్ధంగా పాలించడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రచారం చేస్తూ, ఆ ప్రభుత్వాలే ప్రజల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినప్పుడు, వాటిని ఉల్లంఘించినప్పుడు, ప్రజల ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం న్యాయ స్థానాలలో ప్రజల పక్షాన పోరాడుతున్నది. ఈ సందర్భంగా రోజు రోజుకు పెరిగిపోతున్న హక్కుల ఉల్లంఘనల తీరుపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వాటికి వ్యతిరేకంగా గొంతు విప్పాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ఈ క్రింది విషయాల్ని మీతో పంచుకుంటున్నాం. ఇవ్వాళ దేశంలో సామాన్య ప్రజలకు కనీస ప్రాథమిక హక్కులు నిరాకరించ బడుతున్న తీరు చాలా ఆందోళన కరంగా వుంది. సమాజంలో అట్టడుగు ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచి, వారికి గౌరవ ప్రదమైన బ్రతుకుబాటను కల్పించాల్సిన ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, వారికి వివిధ పథకాల పేరుతో తాయిలాల్ని పంచుతూ, వారిని బానిసలుగా మార్చుకుంటున్నారు.   ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా మేడిపండు చందంగా తయారైంది. ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్యాన్ని కబళించడానికి జరుతున్న ప్రయత్నాల్ని చూస్తున్నాం. ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి, ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకుని కుల, మత ప్రాతిపదికన పౌరసమాజంలో విద్వేషాల్ని రెచ్చగొడుతూ అధికారంలో కొనసాగడాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలనే ఆర్ ఎస్ ఎస్   భావజాలానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎక్కడా కనిపించని ఆర్ ఎస్ ఎస్  నాయకులకు పెద్దపీట వేస్తూ వారే దేశభక్తులనే ప్రచారం ఊపందుకుంది. చివరకు జాతిపిత గాంధీని చంపిన గాడ్సేనే నిజమైన దేశభక్తుడనే భజరంగ్‌ దళ్‌ ప్రచారంపై ప్రభుత్వాధినేతలు కనీసం నోరు విప్పడంలేదు. చివరకు మహాత్మాగాంధీ పేరుతో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పధకం పేరును సైతం ”జి రామ్‌ జి”గా ఒక హిందూ దేవుడి పేరు వచ్చేటట్లుగా మార్చడం లౌకిక ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్దం. ఇక మనరాష్ట్రంలో ‘చేగువేరా’నే నాకు ఆదర్శం అని రాజకీయాల్లో అడుగుపెట్టిన ‘పవన్‌ కళ్యాన్‌’ ‘సనాతన ధర్మ’ పరిరక్షకుడి అవతారం ఎత్తాడు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సమర్థించే సనాతన ధర్మం, కుల మతాలకు అతీతంగా ఈ దేశంలోని పౌరులందరూ సమానమనే రాజ్యాంగస్ఫూర్తికి విరుద్దం కాదా? ఒక పురావస్తు శాఖ ఆధీనంలో వుండే ఒక గుడి విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిజి. గవాయి ఏదో కామెంట్‌ చేశాడని, ఒక సనాతన న్యాయవాది చెప్పు విసిరితే, ఈ దేశ ప్రధాన మంత్రి గాని, హౌంమంత్రి గాని కనీసం దాన్ని ఖండించలేదంటే, వీరి వైఖరి ఏంటో అర్థం అవుతున్నది. అదే చర్యకు ఈ దేశంలో ఒక ముస్లిం పాల్పడివుంటే, వీరి ప్రతిచర్యలు ఎలావుండేవో ఊహించడానికే భయమేస్తుంది.  రాజ్యాంగ స్వతంత్ర వ్యవస్థలై ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే బి.జె.పి. ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకుంది. న్యాయ వ్యవస్థ సైతం తన స్వతంత్ర దృక్పథాన్ని కోల్పోతున్న పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులు ఈ ఆందోళనకు తావిస్తున్నాయి. నిన్నటికి నిన్న రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లులను కాలపరిమితి లేకుండా గవర్నర్లు పెండింగులో పెట్టుకునే విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విఘాతమే కాకుండా, ఫెడరల్‌ వ్యవస్థకు గొడ్డలి పెట్టు. భీమా కోరేగావ్‌ కుట్రకేసులో ఏడు సంవత్సరాలు గడచిపోయినా ఇప్పటికే బెయిల్‌ రాకుండా ఇంకా ముగ్గురు హక్కుల కార్యకర్తలు జైళ్ళలోనే మగ్గుతున్నారు. జె.ఎన్‌.యు. విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ కూడా 5 సం||లు గడచిపోయినా జైళ్ళోనే ఉన్నాడు. ఇంలాంటి వాళ్ళు వందలాది మంది వివిధ రాష్ట్రాల్లో బెయిల్‌కు సైతం నోచుకోకుండా జైళ్ళల్లో మగ్గుతున్నారు. 2017లో ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఉన్నావ్‌’ గ్రామంలో మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన అప్పటి బిజెపి ఎంఎల్ ఎ  కుల్‌దీప్‌సింగ్‌ సెగార్‌కు ఢిల్లీ ట్రయల్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే, నిన్నటికి నిన్న ఢిల్లీ హైకోర్టు, అప్పీలుపై విచారణ ముగిసే వరకు శిక్షను నిలిపివేస్తూ అతనికి బెయిల్‌ ఇచ్చింది. ఇతనిపై అత్యాచార భాదితురాలు కోర్టుకి వెళ్ళివస్తుంటే ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని యాక్సిడెంటుకు గురిచెయ్యడం వల్ల అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణానికి కారకుడయ్యాడు. బాధితురాలి తండ్రి పోలీస్‌ కస్టడీలో హత్యకు గురయ్యాడు. ఇలాంటి వాడికి బెయిల్స్‌ ఇస్తున్న కోర్టులు, యుఎపిఎ  కేసులో ప్రొ|| సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తే. ఆ తీర్పును నిలిపివేస్తూ అతను జైలు నుండి విడుదల కాకుండా ఈదేశ అత్యున్నత న్యాయస్థానం అడ్డుపడింది. ఫలితంగా అప్పటికే 5 సం||లకు పై అన్యాయంగా జైల్లో ఉన్న సాయిబాబాగారు మరో 2 సం||లు పైగా జైల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. చివరకు నిర్దోషిగా విడుదలైనా, జైల్లో ఆరోగ్యం పాడైపోవడం మూలంగా 6 నెలల కాలంలోనే చనిపోయాడు. దీన్నిబట్టి మేధావులపై, హక్కుల ఉద్యమకారులపై ప్రభుత్వము మోపుతున్న అక్రమ కేసుల్లో, చివరికి వారికి బెయిల్‌ మంజూరు చేసే విషయం కూడా న్యాయస్థానాలు ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకుని, బెయిల్‌ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రభుత్వాల ప్రభావం ఎంత వుందో మనం అర్థంచేసుకోవచ్చు. మన నిరసనల్ని వ్యక్తపరచడం ఒక ప్రాథమిక ప్రజాస్వామిక హక్కు. ఇటీవల ప్రధానమంత్రిని విమరిస్తున్న వ్యంగ్య చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అతనిపై కేసు నమోదు చేస్తే, అందులో ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, బెయిల్‌ నిరాకరించడమే కాక, భావప్రకటనా స్వేచ్చను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని, నేటి ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే, ఈ ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు కోర్టుల్లో కూడా భద్రత లేదనే విషయం అవగతమౌతున్నది.     మరోవైపు దేశంలోని సహజ వనరుల్ని కార్పొరేట్‌ కంపెనీలో ధారాదత్తం చేయడంలో అందరికన్నా ముందున్న మోడి సర్కార్‌. అందుకు అడ్డుగా   ఉన్న మావోయిస్టు పార్టీని తుదముట్టించాలనే సంకల్పంతో, ఆపరేషన్‌ కగార్‌ పేరున మావోయిస్టు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని దుర్మార్గంగా బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపుతున్నది. కాల్పుల విరమణను ప్రకటించి, చర్చలకు సిద్దమని ప్రకటించినా, వారితో చర్చలు జరపమని దేశంలోని అనేక పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు విజ్ఞప్తి చేసినప్పటికీ, రాజ్యం అత్యంత క్రూరంగా మానవ హననానికి పాల్పడుతున్నది.  ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసం లక్ష్యాలను ప్రకటించి అందుకోసం పనిచేస్తాయి. కానీ కేంద్రప్రభుత్వం 2026 మార్చికల్లా దేశాన్ని ‘నక్సల్‌ ముక్తభారత్‌’గా చేస్తామని, మావోయిస్టులను  తుదముట్టిస్తామని, తాము ప్రమాణం చేసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ దేశంలో ఫలానా తేదీకల్లా నిరుద్యోగం లేకుండా చేస్తాం. పేదరికం లేకుండా చేస్తా అని ప్రకటించి, అందుకోసం పనిచేస్తే ఈ దేశ ప్రజలందరూ సంతోషిస్తారు కదా? మావోయిస్టు పార్టీ అండ వున్నా లేకపోయినా, వేలాది సైనిక బలగాల నడుమ ఇటీవల చత్తీస్‌ఘడ్‌లో స్థానిక ఆదివాసీలు శాంతియుతంగా మైనింగ్‌ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇటీవల ఆరావళి పర్వతశ్రేణుల్లో మైనింగ్‌ వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు కదం తొక్కడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల్ని ఐక్యంగా ఎదిరించినపుడు మాత్రమే మన హక్కుల్ని మనం కాపాడుకోగలం.         

కార్పొరేట్ల అభివృద్ధి వల్ల సామాన్య ప్రజలకు జరిగేదేమీ వుండదన్న వాస్తవాన్ని మరుగుపరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తామే తీసుకెళుతున్నామని తమ గోడి మీడియా ద్వారా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. మరోవైపు మొత్తం పాలనా వ్యవస్థ ముఖ్యంగా రెవిన్యూ మరియు పోలీసు యంత్రాంగం మొత్తం రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే ప్రశ్నించాలి. అతి కొద్దిమంది మాత్రమే ప్రశ్నిస్తే, వాళ్ళ నోళ్ళు మూయించడం ఈ పాలకులకు చాలా సులువు. కాబట్టే ప్రజా హక్కుల కోసం గొంతెత్తే వారికి అండగా నిలవడం మన అందరి బాధ్యత. ఇదే కాలంలో ప్రభుత్వాలపై అసంతప్తి, అసమ్మతి ప్రజల్లో రోజు రోజుకు ఎక్కువవుతున్నది. ఈ అసమ్మతిని అత్యంత క్రూరంగా అణచివేయడానికి, ఉపా చట్టానికి మరింత పదును పెట్టి, బెయిళ్ళకు కూడా వీలులేకుండా, దేశంలో మేధావుల్ని, హక్కుల కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని, రచయితలను, కళాకారులను ఏళ్ళ తరబడి నిర్బంధిస్తున్నది. మోడీ ప్రభుత్వం, ఎన్ ఐ ఎ,  సిబిఐ, ఈడి  లాంటి ధర్యాప్తు సంస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తూ మాట్లాడేవారి గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూనే  ఉన్నాం.          

అంతిమంగా ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాథమిక హక్కులు ఉనికికే పెద్ద ప్రమాదం ముంచుకొన్నాడనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన ముందు తరాల వాళ్ళు పోరాడి సాధించుకున్న హక్కుల్ని పరిరక్షించుకోవాలంటే, ఈ దేశంలో అన్నిమతాల, అన్నికులాల ప్రజలు సామరస్యంగా, శాంతియుతంగా మనుగడ సాగించేందుకు. ఈ దేశాన్ని ఒక లౌకిక ప్రజాతంత్ర రాజ్యంగా పరిరక్షించుకొని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలంటే, ప్రజాస్వామిక వాదులందరూ కలసి కట్టుగా, హక్కుల పరిరక్షణ కోసం నడుం బిగించాల్సిన చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఈ సందర్భంగా హక్కుల ఉద్యమాలకు మరింత చేయూతనిస్తారని, మా ఈ ప్రయాణంలో మా సంస్థ జనవరి 10, 11 తేదీలలో తిరుపతిలో రెండురోజుల పాటు జరుపుకుంటున్న 20వ రాష్ట్రమహాసభల్ని జయప్రదం చేసి హక్కుల ఉద్యమానికి బాసటగా నిలుస్తారని ఆశిస్తున్నాం.

కార్యక్రమం

జనవరి 10, 2026 శనివారంతొలి సమావేశం        :

ఉ|| 10 గం||ల నుండి 1 గం|| వరకు

అధ్యక్షత:వేడంగి చిట్టిబాబు, అధ్యక్షులు, పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌

తొలిపలుకులు:రాఘవశర్మ (సీనియర్‌ జర్నలిస్టు) ఆహ్వాన సంఘం అధ్యక్షులు

వక్త         :జస్టిస్‌ చంద్రకుమార్‌,                 రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి

అంశం :భారత రాజ్యంగం – ప్రజాస్వామ్య పాలన

వక్త         :హిమాంశు కుమార్‌, ప్రముఖ గాంధేయవాది

అంశం :కాషాయీకరణ – లౌకిక ప్రజాస్వామ్యం

వక్త         : ప్రొ|| హరగోపాల్‌, సీనియర్‌   పౌరహక్కుల సంఘం నాయకులు

అంశం :               వికసిత్‌ భారత్‌ – పౌరహక్కులు

భోజన విరామం               :1 గం|| నుండి 2 గం||ల వరకు

మలి సమావేశం:            2 గం||ల నుండి 5 గం||ల వరకు

అధ్యక్షత: చిలుకా చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి,పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌

వక్త         :బేలా బాటియా, సామాజిక ఉద్యమకారిణి, న్యాయవాది

అంశం: కార్పొరేటీకరణ-ఆదివాసీల మనుగడపై ప్రభావం

వక్త         :క్రాంతిచైతన్య (పౌరహక్కుల సంఘం, ఉభయరాష్ట్రాల సమన్వయ కర్త

అంశం :పౌరహక్కుల ఉద్యమ గమ్యం – గమనం           

సౌహార్ధ ప్రతినిధుల సందేశాలు

ఊరేగింపు:         5 గం||ల నుండి 6 గం||ల వరకు                                          

ప్రజా కళామండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సాంస్కృతిక కార్యక్రమాలు కలవు.                    

జనవరి 11 ఆదివారం : జనరల్‌బాడి (సభ్యులకు మాత్రమే)

Leave a Reply