కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ,
చివర ఆలోచనల్నీ కలిగించాలి.
మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి.
– ఆరుద్ర
ఆధునిక కథపుట్టుకకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ గత నాలుగుదశాబ్దాల కథాప్రయాణంలో ‘కథ’ విస్తృతమైంది. కథాసాహిత్యం ఏ సాహిత్య ప్రయోజనాలకోసం ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొత్తతరం కథకులు ముందుకొస్తున్నారు. వైవిధ్యమైన కథావస్తువుల్ని కథాసాహిత్యానికి పరిచయం చేస్తున్నారు. ఆధునిక కథ ఆవిర్భావం సమాజాన్ని సంస్కరించే ఉద్దేశ్యంతో కథావస్తువులు వచ్చాయి. ఇప్పుడలా కాదు వొక ఘటననూ, వొక జాతి సంస్కృతిని దాని తాలూకూ విలువల్ని, లేదా వివక్షల్ని, వర్తమాన ఆధునిక సమాజం ఎదుర్కొంటున్ని నైతికమానవతావిలువల పతనాన్ని, నాగరిక సమాజపు పోకడల్ని కథలుగా రాయడం కథాసాహిత్యంలో కీలకమలుపుగా భావించాలి. ఒక ఘటననూ ప్రత్యేకమైన దృక్కోణం నుండి చూసి వ్యక్తీకరించే కథకులు తెలుగు కథాసాహిత్యానికి గొప్ప ఆస్తిగా వస్తున్నారు. సంక్లిష్టమైన సామాజిక పరిస్థితులను కథల్లో చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జీవితగాథల్ని చెప్పడం కంటే జీవనప్రయాణంలో ఏరులై పారుతున్న కన్నీటి కథాక్షరాలను కథానిర్మాణానికి పేరుస్తున్నారు.
ఈ డప్పు కథల సంకలనంలో మొదటి బహుమతిగా ఎంపికైన కథ పేరు కూడా డప్పు. ఇది కళాత్మకమైన కథ. దళితజీవన సంస్కృతిలో భాగమైన కథ. వర్తమాన దళితకతల్లో ఇది వైవిధ్యమైనది. ఈ కథనిండా దళితజీవితం పారుతుంది. డప్పుసుట్టే కథ తిరగడమన్నది కథకు బలాన్నిచ్చింది. సాంబయ్య జీవితం డప్పుమయం. అదే అతని ప్రపంచం. ఆ డప్పుకొట్టే సాంబయ్య మాత్రం కొడుకును గొప్ప స్థానంలో పెట్టాడు. కాలం వల్ల వచ్చిన మార్పులు, తన స్థితి అన్నీ సాంబయ్య కొడుకు సుభాకర్‌ను ప్రభావితం చేస్తాయి. ఈ కథలో సాంబయ్య పాత్రను కథకులు గొప్పగా మలిచారు. పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. కథలో కొత్త ఇతివృత్తాన్ని తీసుకుని కొత్తగా చెప్పడం,కథ కొత్త రచనాశిల్పంతో పాఠకుణ్ణి ఆకట్టుకోవడం ఈకథను ఉన్నతస్థానంలో నిలబెట్టగలిగింది. ఇది దళిత కథే అయినా సామాజిక జీవితాన్ని చెప్పగలిగింది. ఈ కథ వల్ల దళితులు ముఖ్యంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన వారి సాంస్కృతిక వారసత్వంగా కొనసాగుతున్న డప్పుతో ముడిపడిన జీవితం ఎలా ఉందో చెప్పబడిరది. ఈ కథ చదివితే ఆలోచన సరళమై ఆచరణాత్మకంగా జాతి చేయవలసిన కృషి బోధపడుతుంది.
ఈ సంకలనంలోని కథలు సంక్షిప్తత, సమగ్రత సాధించడంలో విజయం సాధించాయి. ఏ కథైనా పాఠకుడికి సందేశం ఇవ్వడానికి రాయడం వల్ల ప్రయోజనం కంటే ఆ కథను అద్యంతమూ ఆసక్తితో చదివించడమే ప్రధానం ఆ కథే పదికాలాలు నిలిచిపోతుంది. అటువంటి కథలే ఈ సంకలనం నిండా ఉన్నాయి. ఈ మాటలు ముఖస్థుతికోసమో పొగడ్తకోసమో చెప్పడం లేదు. సమకాలీన సమాజం నుండి కథావస్తువుల్ని ఎంచుకొని సార్వకాలీనంగా కథల్ని కథకులు మలిచారు. ఇందులో కథలన్నీ వాస్తవ జీవితాలకు అద్దం పడతాయి. సమగ్రంగా చెప్పడమే కాక ప్రతి కథలో ఊహించని మలుపులుంటాయి. పాఠకుణ్ణి వేలుపట్టుకుని కథలతోటలోకి నడిపిస్తాయి. అందుకే మొదట ఉదహరించినట్లు గత నాలుగు దశాబ్దాల కాలం నుండి వస్తువిస్తృతి, సామాజిక జీవితాల చిత్రణ, ఆర్థికపీడన, సాంస్కృతి విధ్వంసం చెప్పగలిగింది. ఆ మార్పు ఈ కథాసంకలనంలో స్పష్టంగా కనబడుతుంది. అలాగే కథలో ఆయా ప్రాంతాలకు అనుగుణమైన యాస, మాండలికం ఈనాటి కథలకు గొప్ప సొగసులనిస్తున్నది. ఇంకా చెప్పాలంటే నేటి తెలుగు కథ మానవ జీవితంలోనే అన్నీ పార్శ్వాలను రికార్డు చేస్తున్నది. ఇది సత్యం.
ఇక ఈ సంకలనంలో రాకాసి గీతలు కథ వర్తమాన రాజకీయవ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఫ్రభుత్వాలే మనతూ పూటకొకనాటకాలు ఆడుతున్నాయి, ఇంకా నాటకాలెందుకు? అని వొక పాత్రలో.. అంతర్మధనంగా చెప్పడం పాలకులవైఖరిని స్పష్టంగా చెప్పగలిగింది. ఈ కథ మనిషిమూలాలను శోధిస్తుంది. అభివృద్ది పేరుతో చేసే విధ్వంసాలను తద్వారా వలసబతుకుల జీవితాలు బుగ్గిపాలవుతున్న పేదల బతుకులపై పాలకులు పంజా ఎలా విసురుతారో కథకులు బాగా చెప్పారు. ఒక ద్రావిడ సంస్కృతిని నిర్మించుకుని జీవిస్తున్న జీవం ఉన్న వూరు అంటూ చెప్పడంతో కథకులు కథను ఎంతబాగా నడిపించారో తెలుస్తుంది. వనరులదోపిడి, కార్పోరేట్ల కోసం ప్రభుత్వాలు ఎన్ని కుటుంబాలనైనా వీధిన పడేస్తాయి..ఎంత మంది బతుకుల్నైనా చిధ్రం చేస్తాయనే నిదర్శనంగా ఈ కథ సాగడం వల్ల ఈ కథ వర్తమాన కథాసాహిత్యంలో ఎంత వైవిధ్యంగా ఉందో తెలుస్తుంది. ఇలాంటి కథలే ఈ వర్తమాన కథాసాహిత్యానికి అత్యవసరమని భావిస్తున్నాను.
ఈ సంకలనంలో శుభపరిణామం కథ తక్కువ కథనంతో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించిన కథ. సున్నితమైన కథావస్తువుతో సాగిన కథ. పనిమనిషి కూతురు డాక్టరవ్వడం, మన దగ్గర పనిచేసే మనుషుల్ని చిన్నచూపు చూడకూడదని చిన్న చిన్న ఘటనలను సృష్టించి చక్కటి కనువిప్పు కలిగేలా, సాటిమనుషుల పట్ల ప్రతివొక్కరు ఎలాంటి వైఖరికలిగి వుండాలో ఈ కథ చెబుతుంది. కథ చదువుతున్నప్పుడు వొకదశలో కళ్ళలో నీళ్ళు అప్రయత్నంగా రాలిపడ్తాయి. కథను ఒక లక్ష్యంవైపు నడిపించారు. కథలో ప్రతిపదమూ, ప్రతీ వాక్యమూ లక్ష్య ప్రయోజనాన్ని శోధిస్తూ సంక్షిప్తతపాటిస్తూ సాగడం ఈ కథ ప్రత్యేకత. వర్తమాన సమాజంలో శక్తివంతమైన కథావస్తువని అనిపించింది.
ఈ సంకలనంలోని కథలు తెలుగు కథావైవిధ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి. కథల్లో సమకాలీన సమాజం స్పష్టంగా కనబడుతున్నది. ఈ కథలు చదువుతున్నంతసేపూ ప్రతికథ ఒక దృశ్యకావ్యంగా పాఠకులకు కనబడుతుంది. కథనంలో వైవిధ్యత, కథాశిల్పం ప్రతికథలో సాగుతుంది. ప్రతి కథలో సమాజం ఎలా అల్లుకుని వుందో, సమాజం ఎలా ప్రయాణం చేస్తుందో వాస్తవిక జీవితాలను పరిచయం చేస్తూ కథలు సాగడం ఈ సంకలనం సాధించిన అతి పెద్దవిజయం. కథల ద్వారా లోకాలు ఆవిష్కృతమౌతాయని ఎక్కడో చదివిన విషయం గుర్తుకువస్తున్నది.
ఉత్తమమైన కథాసాహిత్యాన్ని సృష్టించడానికి జీవితం నుంచి గొప్ప ప్రేరణ ఉండాలని కొడవటిగంటి కుటుంబరావు అంటారు. అలాంటి ప్రేరణతోనే ఈ కథకులు గొప్ప కథలను రాసి ఈ సంకలనంలో చోటు సంపాదించారు అని చెప్పకతప్పదు. ఇక ఈ సంకలనంలో ఇతర కథల విషయానికొస్తే నల్లమల్లెచెట్టు అనే ఆఫ్రికన్ కథ ఉత్తమ పురుషలో సాగుతుంది. నేనేతప్పు చేయలేదని చెప్పడం దేనికి అనే సందేహం వస్తుంది. కథ కవితాత్మకంగా సాగడం కథకు బలాన్నిచ్చింది. అందర్నీ ఆకట్టుకునేలా సాగిన లౌక్యం కథ ఈ సంకలనంలో భిన్నమైన కథావస్తువుగా కనబడుతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సివచ్చినపుడు స్త్రీచైతన్యానికి గొప్ప ఆయుధంగా నిలిచిన కథ మే‘స్త్రీ’. కథాశీర్షికతోనే కథ విజయం సాధించింది. అలాగే శారా దిగ్రేట్ కథ సినీమాలా పరిణతి చెంది కలలా ముందుకెళ్తుంది. ఈ రెండు కథలు కొత్త ఆలోచనల్ని రేకేత్తిస్తాయి. ఈ సమాజంలో స్త్రీచైతన్యం అనివార్యమని, స్త్రీ ఎలా మోసపోతుందో, ఎలా జాగ్రత్త పడాలో చెప్పే కథ. ఆ చేత్తో ఇచ్చి అనే కథ భిన్నమైన కథావస్తువుగా మనకు అనిపిస్తుంది. ఈ కథ చదువుతుంటే చీప్‌లిక్కర్ వాడవాడలా దొరుకుతుంటే ఇంకా సారా అమ్మకాలున్నాయా అనే సందేహం వస్తుంది. తిరుగుబాటు ఓ అభ్యాసం వర్తమాన సమాజంలో కార్మికహక్కులు ఎలా కాల రాయబడుతున్నాయో యాజమాన్యాలవైఖరితో శ్రమదోపిడి ఎలా సాగుతుందో చెప్పే కథ. ఈ సంకలనంలో స్థానం సంపాదించుకున్న ఈ కథ కార్మికులను చైతన్యపరచడంలో సఫలమైంది. కార్మికుల నేపథ్యంలో సాగిన మరొక కథ సమ్మయ్య మరికొందరు. బొగ్గగని కార్మికుల కష్టాలను చెప్పిన కథ. ఇది వైవిధ్యంగా సాగిన కథ.
ప్రేమామృతం శీర్షికతో సాగుతున్న ఈ కథ ఆధునిక కథాసాహిత్యంలో వైవిధ్యమైన, గొప్ప కథావస్తువు, కథాశిల్పంతో సాగింది. బ్రెయిన్ చిప్ ట్రీట్మెంట్ అన్న సరికొత్త వైద్యవిధానాన్ని పరిచయం చేసిన కథ. కథ చాలా సృజనాత్మకంగా సాగుతుంది.బ్రెయిన్లో జెల్ నింపడం కొత్తగా అనిపించింది.మూడునాలుగు దశాబ్ధాల క్రితమే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్మనీలో జరిగినట్లు వార్తలొచ్చాయి. మనదేశంలో ఈ మధ్య హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినట్లు వార్త ప్రచురితమైంది. కథల్లో ఈ తరహా కొత్తవస్తువుతో రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రైతు బతుకు ముఖచిత్రంగా సాగిన కథ విత్తనాలు. విత్తన కంపెనీ మాయాజాలాన్ని సూటీగా ప్రశ్నించిన కథ. కార్పోరేట్ల విషపు ఆలోచనల్ని బట్టబయలు చేసే కథ. రైతు చైతన్యం దిశగా కథ సాగుతుంది. బహుళజాతి కంపెనీల మోసపూరిత కుట్రల్ని కథనంలో బాగా చెప్పగలిగిన కథ. పోరాటంతో ఏదైనా సాధించవచ్చని చెప్పే కథ. విత్తనాల హక్కులు రైతులవే అనే సందేశం కథ ఇస్తుంది.ఈ సంకలనంలోని మరొక రైతు కథ రెండేళ్ళ కష్టం.నష్టపోతున్న రైతుజీవితాన్ని చక్కగా చెప్పన కథ. రైతునేఫథ్యంలో సాగిన మరొక కథ గిట్టుబాటు. మట్టిని నమ్ముకున్నోడికి మట్టేమిగులుతుందిరా, మన పంట మనం అమ్ముకుంటే ఐదుపైసలు సేతిలో పెడతాడు, ఆడు అమ్మితే ఐదులచ్చిలు దోచుకుంటాడు ఇదేం న్యాయం రా అని వొక పాత్రలోని వొకమాటతోనే కథ వందశాతం విజయం సాధించింది. ఈఒక్కమాట చాలాదా కథ చక్కటి కథనంతో సాగిందని చెప్పడానికి..
ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలు, కార్పోరేట్ మాయాజాలంలో విద్యావ్యవస్థ ఎలా సర్వనాశనం అవుతున్నదో, ఈ మాయలో సహజమైన సృజనను ఎలా కోల్పోతున్నారో పుట్టని కొడుక్కి దాయాదివాటా అనే కథ చెబుతుంది. ఈ కథ అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతుంది.వర్తమాన రాజకీయవ్యవస్థలో రాజకీయాలు, మతము ఎంత ప్రభావితం చేస్తాయో క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఎలా ఉంటాయో అధ్భుతమనే కథనంతో సాగిన కథ మూర్ఖత్వం.ఇందులో మతమూ రాజ్యమూ, స్త్రీలమీద ఎలాంటి పెత్తనం సాగిస్తుందో ఈ కథ చెబుతుంది.
ఈ సంకలనంలోని కథకులందరూ తెలుగు కథాసాహిత్యానికి ప్రామిస్డ్ రైటర్స్‌గా నిలబడతారు. ఉభయరాష్ట్రాల్లోని కథకులందరినీ ఈ సంకలనం ఒకగూటికి చేర్చడంలో సఫలమైంది. ఈ కథకులందరూ ఉత్తమ కథాసాహిత్యాన్ని సృష్టించారు. ఈ కథలు వర్తమాన జీవితాలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి.