“కవితలు చెప్పుకునే వేళ కాదిది, కాళ్లు కడుక్కునే వేళ కూడా కాదు, ఇది ఒక శిశ్నచ్చేద సమయం “ నిజమే ఇది ఒక విపత్కర కాలం మొన్నటి వరకు వాడి గురి అంతా అడవుల మీదే అనుకున్నాం. అడవుల్ని నాశనం చేసీ అక్కడి సహజ వనరుల్ని మొత్తంగా పెట్టుబడి వర్గాలకు అందించడమే వాళ్ళ లక్ష్యమన్న భ్రమల్లో ఉన్నాము. మనిషీ తత్త్వాన్ని వేర్లతో సహా పెకిలించాలనే ఉద్ధేశంతో ఇక్కడి మనుష్యుల్ని కులాలుగా,మతాలుగా, జాతిగా, ప్రాంతంగా ఎన్ని రకాలుగా విడగొట్టుకుంటూపోవాలో అన్ని రకాలుగా విభజిస్తూ వస్తున్నారు. అలా విభజించడానికి విద్వేషాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు.వెళ్ళే దారిలో కనిపించేవన్ని వాళ్ళు పంచే విద్వేషానికి మాధ్యమాలుగా చేసుకున్నారు.ఇప్పుడు వాళ్ళు మనిషిని మనిషిగా చూడడం మానేశారు.ఆవుల్నిచూసినంత పవిత్రంగా కాకపోయినా మనుషుల్ని మనుషులుగా పలకరించండంటూనే, ధర్మోరక్షతిరక్షితః మనిషిని గౌరవించలేని ధర్మం దేనికని ఆ మనువాదులకు పెను సవాలును విసురుతున్నారు ఈ బుద్ధిజీవులు.
ప్రకృతి సంపద దోపిడీ లక్ష్యంగా మొదట వాళ్ళు దండకారణ్యం మీద పడ్డారు.అమాయకపు ఆదివాసులను నక్సలైట్లని, మావోయిస్టులనిఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేస్తూ వస్తున్నారు. అక్కడ తమ దోపిడికి ఎక్కడ అడ్డం వస్తారనే ఒకే ఒక్క భయంతో పసి పిల్లల నుండి మొదలు అడ్డు వచ్చిన ఆదివాసులను మట్టు పెట్టుకు రావాడనికి దేశంలో ఎన్ని రకాల సైనిక దళాలు ఉన్నాయో అన్నిటినిగూడెలాల్లో దింపింది రాజ్యం. దేశం కోసం ధర్మం కోసం అనిచెపుతూనే ఈ దేశ మూలవాసుల మీద యుద్ధానికి దిగింది. ఇది దండకారణ్యంలో రాజ్యం చేస్తున్న వికృత చర్య.
మానవారణ్యంలో రూపం మార్చుకున్న దాడి రాజ్యం నేర్పించిన ఉచ్చ నీతిని ఒంటబట్టిచ్చుకున్న భక్తుల ప్రవర్తన ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ మొద్దుబారిపోతాం. ఎక్కడో మారుమూల కుగ్రామం కాదది ఈ దేశం నడిబొడ్డున ఉన్న మధ్య ప్రదేశ్ లో జరిగిన సంఘటన అది. ఆ విషయం బయటి సమాజానికి తెలిసేందుకు వారం అయ్యింది.ఈ వార్త యావత్ మానవాళిని కదిలించింది. ప్రధాన నగరాల్లో జరిగిన సంఘటనలే బయటికి రావడానికి ఇంత సమయం పడుతుంది అంటే మారుమూల గ్రామాల్లో జరిగే ఇలాంటి ఘటనలు ఎన్నో బయటకి పొక్కకుండాపోయాయో. మనం మన ఇంటి పక్కన గోడనో లేదంటే, మనం పని చేసే చోటనో, మనం ప్రశాంతంగా కూర్చునేచోటనో వాసన కొడతుందని “ ఇచ్చట మూత్రం పోయారాదు” అని రాసుకుంటాం. ఎవరైనా అతిక్రమించి పోస్తే జుర్మాన వేస్తాం. అలాంటిది ఒక మనిషి మరో మనిషి మీద ఉచ్చ పోశాడని తెలిసీ చూస్తూ ఊరుకున్నామె తప్ప మనమేం చేశాము. నిజంగా ఒక మనిషి మరో మనిషి మీద ఉచ్చ పొయ్యటం అంటే ఏమిటో తెలుసా మానవత్వాన్ని విచ్ఛిన్నం చేయడమే.బహుశా అందుకే
ఇందులో ఓ కవి ..
‘ ఇచ్చట మూత్ర విసర్జన నిషిద్ధం’
అనే బోర్డులు మొహాన కట్టుకుని
గర్వంగా తలెత్తుకుతిరుగుదాం ‘ అని గర్వంగా అనాలి అంటూనే సాటి మనిషిని మనిషిగా చూడనందుకు సిగ్గుపడండి అంటాడు.
అయినా రాళ్లల్లో దేవుడిని చూసే వాడికి ఏం తెలుసు. మనిషి విలువ. మనిషి ఊపిరి తీవ్రత. వాళ్ళకు తెలిసింది ఒక్కటే కదా. మనుషులంటే వాళ్లకు అధికారం ఎక్కడానికి ఉపయోగపడే మెట్లనే భ్రమలో ఉన్నారు. అయిన వాళ్ళకి తెలియని నిజం ఏమిటంటే ఎదో ఒక రోజు ఆ మౌనం యుద్ధ మేఘ గర్జనై వాళ్ల కుర్చీలను తుత్తునియలు చేయగలదని వాళ్లకేం తెలుసు. వాళ్లు గుర్తించని ఇంకో విషయమేమిటంటే అనాదిగా వారు పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నా నిచ్ఛేనమెట్ల వ్యవస్థను కూలదోసేందుకు మరింత దృఢంగా ముందుకు వస్తున్నారు అనేది వాళ్ళకి ఇంకా చేరని నిజం. దాని కోసం ప్రజానీకం ఎంత బలంగా నిలబడుతున్నారు అనే దానికి నిదర్శనమే ఈ 49 మంది కవుల బహిరంగ ప్రకటన.
ఒక్క కమలమే
మలమూ మూత్రము
విసర్జన చేస్తోందని ….దేశం గత దశాబ్ద కాలంగా ఎంత కంపు కొడుతుందోచెబుతూనే, ఉచ్చ పోయడం దాని తర్వాత ప్రజల ముందు క్షమించమంటూ కాళ్లు కడగడం లాంటి నాటకాలు వాళ్ళకు మాత్రమే చెల్లినవి అంటున్నాయి కింది కవిత పంక్తులు
ఉచ్చ పోయడం
కాళ్లు కడగడం
రెండూ వాడి వ్యూహాలే…..ఇలా వాడి పన్నాగాన్ని బట్ట బయలు చేయడమే కాకుండా ప్రస్తుతం మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు…
ఉద్యమాలని, రాస్తారోకోలనిచేసేదేమీ లేదు
తప్పు చేసినోడికి తిరిగి ఉచ్చపోసుడే!
అని ముల్లును ముల్లుతోనే తీయాలని హిత బోధ చేస్తున్నారు. కాని మనం గమనించాల్సిన విషయం ఇంకోకటి ఉంది. శత్రువు నీతి తప్పుతున్నాడు అనే మనం వాని మీద యుద్ధానికి సిద్ధమయ్యాము. మనం నీతి తప్పొద్దు.
తప్పు చేసినోడికి తిరిగి ఉచ్చపోసుడే! అని ప్రకటన చేస్తున్న మనం ప్రతిదాడిగా విసర్జించాలని చెప్తున్నాం. కాని ఎక్కడ ఉచ్చ పోయాలనేది చెప్పడం మన దృక్పథం ఏమిటి, మనం ఎటు వైపు నిలబడ్డాం అనేది నిర్ణయించబడుతుంది.మనిషి పరిమళాన్ని ప్రేమించడం, మనిషి తత్వాన్ని గౌరవించడం మాత్రమే తెలిసిన మనం, విసర్జించాల్సింది వాడి ముఖం మీద కాదు. తరతరాలుగా మనిషిని మనిషిగా చూడని వాని భావాజాల మీద, అనాది కాలం నుండి మనుషుల్ని విభజించాలనే వాని కుతంత్రం మీద. అలా చేసినప్పుడే మనిషి వైపు నిలబడ్డట్టు. లేదంటే శత్రువుకి మనకి తేడా లేనట్టే. కాబట్టి మనం ప్రతిదాడి చెసే మార్గంలో కూడా స్పష్టత ఉండాలి.
మెర్సీ మార్గరెట్ సంపాదకత్వలో వచ్చిన ‘ఉచ్చల జలధి తరంగ’లో ఉన్న ప్రతీ కవిత్వం మనిషిగా మనిషివైపు నిలబడడం ఎంత అవసరమో తెలియజేయడమే కాకుండా కొన్ని వేల ఏళ్ళుగా వాళ్ల మస్తిష్కాల్లో పేరుకుపోయిన ద్వేషాన్ని నిరసిస్తూ రాసినవి అన్ని. ఇందులో ఉన్న వ్యాకరణ తప్పొప్పులను పక్కన పెట్టి అందరు తప్పక చదవాల్సిన ఆవశ్యకత ఉంది.