ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక, రాజకీయ సూత్రాలు జీవితాన్వేషణకు దారి చూపగలవు. జీవితాన్నీ, సమాజాన్నీ ఉన్నతీకరించే సాధనాలుగా ఉపయోగపడగలవు.  ఇది పరిమితి కాకపోగా,  విస్తృతికి అవకాశం ఇస్తుంది. దీన్ని ఎంతగా గ్రహించగలం?   పరస్పర విరుద్ధతల మధ్య సాగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ఎరుక ఒక్కటే మనం ఎటో ఒక వైపు కొట్టుకపోకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఎన్ని వాదనలైనా చేయవచ్చు.

మానవాచరణను కేంద్రం చేసుకున్నవాళ్లు వాద వివాదాల్లో పై చేయి కోసం ప్రయత్నించరు. వాదనలు తప్పేవి కాదు కాబట్టి  తలపడాల్సిందే. అంత మాత్రాన ఒకానొక అనుభవ శకలం నుంచే నిర్ధారణ చేయాలనుకోరు.  నింపాదిగా, నిండుదనమైన భావనలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. దీనికి పాండిత్యం అక్కర లేదు. మన కళ్ల ముందున్న వాస్తవ స్థితిలోని లోతును, దానిలోని హేతువును గ్రహిస్తే చాలు. తెలుగు మేధో ప్రపంచం ప్రతిసారీ ఈ విషయంలో పరీక్షను ఎదుర్కొంటోంది. చాలా విచిత్రంగా మావోయిస్టు ఉద్యమంలోని సంక్షోభ సందర్భం తెలుగు మేధో రంగంలో దాగి ఉన్న సంక్షోభాన్ని కూడా మరోసారి బైట పెట్టిందా? అనే విచారం కలుగుతున్నది. ఈ రెంటికీ ప్రత్యక్ష సంబంధం లేనట్లు అనిపిస్తుంది. కానీ మావోయిస్టు ఉద్యమ సంక్షోభం దాని సొంత సమస్య కాదు. సమాజ మార్పు కోసం జరుగుతున్న ఒక ప్రయోగం కాబట్టి, ఒక అన్వేషణ కాబట్టి ఆలోచనా రంగం కూడా దానికి ప్రతిస్పందిస్తున్నది. ఆ ఉద్యమం తన సంక్షోభాన్ని ఎట్లా ఎదుర్కొంటుందనేది పూర్తిగా వేరే విషయం. దాని మీద  మేధావుల వైఖరులు ఆందోళన కలిగిస్తున్నాయి.

విప్లవోద్యమంలో ఇద్దరు నాయకులు సాయుధ పోరాట విరమణ పేరుతో లొంగిపోయిన సందర్భంలో జరుగుతున్న చర్చలు ఇంకోలా ఉండి ఉంటే బాగుండేది.  కొందరైనా గౌరవనీయ ప్రజాస్వామికవాదులు విచిత్ర వాదనలు చేస్తున్నారు.  అవన్నీ విప్లవోద్యమ సంక్షోభ సందర్భంలోనివే కావచ్చు. కానీ సాయుధ పోరాటం కొనసాగాలనే ఆకాంక్షను పనిగట్టుకొని ఎదుర్కోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఆరంభం కాగానే ఆయుధాలు వదిలేసి వీలైనంత తొందరగా వచ్చేయమని స్వాగతించినవాళ్లే ఎక్కువ. అదీ ఒక అవగాహనే.   అది చెప్పే హక్కు వాళ్లకు ఉంటుంది. అంత మాత్రాన సామాజిక మాధ్యమాల్లో  సాధారణ విప్లవాభిమానుల స్పందనల మీద  ఈ ప్రజాస్వామికవాదులకు  కోపం వచ్చింది. సాయుధ పోరాటం కొనసాగాలని కోరుకున్న విప్లవ మేధావుల మాటలను  వేళాకోళం చేశారు. రచనల్లోనో, ప్రసంగాల్లోనో ఒక పోరాట రూపంగా సాయుధ పోరాట అవసరం చెప్పడమే అభ్యంతరం అయిపోయింది. ఇంత సంక్షోభవేళలో కూడా ఈ  మాట చెబుతున్న వాళ్ల సంగతి ఎట్లాగూ పోలీసులు చూసుకుంటారు కదా? అనైనా కాస్త నింపాదిగా ఉండాల్సింది. ఏనాడూ సాయుధ పోరాటం చేయనివాళ్లు, దాని సాదకబాదకాలు తెలియని వాళ్లు, భద్ర జీవితాన్ని గడిపేవాళ్లు ఎట్లా ఆ పోరాట రూపాన్ని బలపరుస్తారనే నైతిక ప్రశ్న లేవదీశారు. ఎవరి ప్రాణాలోపోతే, వాళ్లను కీర్తించి పబ్బం గడుపుకుంటారనే దాకా వెళ్లారు. దాని కోసమే  విప్లవమంటే త్యాగమనీ, ఆయుధమనీ నిర్ధారించారనే ఆరోపణ చేయడానికి కూడా వెనుకాడలేదు. విప్లవాన్నీ  అమరత్వాన్నీ  సమానం చేయడానికే సాయుధ పోరాట పంథాను బలపరుస్తున్నారనే దాకా వెళ్లారు.

ఒక రాజకీయ పోరాట రూపం మీద ఎంత అభ్యంతరమైనా ఉండవచ్చు. అది కేవలం వ్యతిరేకత అయితే ఎట్లా? చరిత్రతో, తాత్వికతతో సంబంధం లేని నైతిక చర్చ చేయవచ్చునా? అనే సందేహం వీళ్లకు కలిగి ఉంటే బాగుండేది. సాధారణ ప్రజలు, అభిమానులు, దురభిమానులు అటూ ఇటూ ఏమైనా మాట్లాడే ఆస్కారం ఉంది. కానీ ఆలోచనారంగానికి చెందిన వాళ్లు కూడా పైపై స్పందనలే వినిపించారు. ఆవేశకావేశాలతో మాట్లాడారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని కోరుకున్నవాళ్లకు తమకంటే భిన్నమైన రాజకీయ విశ్వాసాలు ఉన్న వాళ్లతో అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నామని అనిపించకపోవడం ఆశ్చర్యకరం కదా. తమ ఆగ్రహానికి అర్థం ఏమిటో, తమ వైఖరికి మూలం ఏమిటో పట్టింపు లేకపోవడం వల్ల సామాజిక గతిశీలతలో వేర్వేరు పోరాట రూపాల ప్రాధాన్యతను విస్మరించారు.

ఇంతా చేసి సాయుధ పోరాట సమర్థకులు ఏం చెప్పారు? రాజ్యం సాయుధంగా బలపడుతున్నప్పుడు ప్రజా పోరాటాలకు ఉనికి ఏమిటి? అన్నారు. అన్ని పోరాట రూపాల్లాగే సాయుధ పోరాటమూ చరిత్ర నియమమనీ, నిర్దేశమనీ చెప్పారు. దాన్ని ప్రజా పోరాట అనుభవాల్లోంచీ, రాజ్య స్వభావంలోంచీ వివరించారు. అంతే కదా. చరిత్ర ఎందుకు ఇట్లా నడుస్తున్నదో ఎవరైనా మాట్లాడవచ్చు.  అది నిజం కాదని భావిస్తే,  చరిత్రలోకి వెళ్లి మౌలిక మార్పులకు దారి తీసిన పోరాటాలను వివరించవచ్చు. దానికి అవసరమైన రాజకీయార్థిక, సాంస్కృతిక చర్చలోకి వెళ్లవచ్చు. సమాజం వేగంగా  మారుతున్నది కాబట్టి, ఏ  పోరాటరూపాలు  పనికి రావో, ఏవి అనుసరించదగినవో తేల్చి చెప్పవచ్చు. ప్రజాస్వామ్యమనే గంభీరమైన భావనను ప్రభుత్వ పరిధిలోకి కుదించకుండా, ప్రజలు ఏ పోరాట రూపాన్ని అనుసరిస్తే ప్రజాస్వామికమో చెప్పి ఉండాల్సింది. పదే పదే ‘ప్రజాస్వామిక పోరాట పద్ధతుల’ గురించి మాట్లాడటమంటేనే సాయుధ పోరాట రూపం అప్రజాస్వామికమని అర్థం కాబట్టి ఆ సంగతైనా చెప్పి ఉండాల్సింది.  ఆయుధం పట్టుకోవడం ఆధునిక పద్ధతి కాదని చెప్పినవాళ్లు ఈ కాలమంతా ఏ పోరాట రూపం శాశ్వతంగా స్వీకరించదగినదో సూచించి ఉండాల్సింది. ఈ చర్చలోకి వెళ్లి ఉంటే మావోయిస్టు ఉద్యమానికేమోగాని, మన సమాజానికి చాలా మేలు జరిగేది.

సాంకేతికత పెరిగింది కాబట్టి సాయుధ పోరాటాలు ఇక నడవవు అనే మాట నిజమే అయితే ప్రజాస్వామిక పోరాటాలనబడే వాటికి అస్సలే అవకాశం ఉండదు. ప్రజలు, ఉద్యమాలు ‘ప్రమాదకరమైన’ పద్ధతులు వదిలేసి, ‘ప్రజాస్వామికంగా’ నడుచుకోవాలని మనం చెప్పగలమేగాని ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉండాలని నిర్దేశించలేం కదా. వ్యవస్థలు సూత్రబద్ధంగా, మానవీయంగా నడిచేలా చేయలేం కదా. పైగా ప్రజలు సాయుధ పోరాటాలపట్ల ఆసక్తి లేని కాలం వచ్చిందనీ, అలాంటి మార్పులు జరిగిపోయాయనీ అనగలం. ఈ మాటను ధృవీకరించడానికి ఎంత సామాజిక, రాజకీయార్థిక పరిశోధన చేయాలి? ఎంత మౌలికస్థాయికి వెళ్లి నిర్ధారించాలి?

కానీ ‘ప్రజాస్వామిక’ పోరాటాలనబడే వాటికి కూడా కనీసమైన చోటు లేదని ప్రజా జీవితంలో నానాటికీ రుజువు అవుతోంది. ప్రభుత్వాలు మన కోసం లేవనీ, మన సమస్యలను పరిష్కరించవనే భావన ప్రజల కామన్‌సెన్స్‌లో ఏనాడో భాగమైపోయింది. ఇది నిజమో, కాదో తెలుసుకోడానికి కాస్త ఓపిగ్గా ప్రజల  అనుభవంలోకి వెళ్లాలి.  వేగంగా మారుతున్న సామాజిక వాస్తవికతలోకి వెళ్లి వివరించాలి. ఈ పనుల్లో ఏ కొన్ని చేసినా బాగుండేది. కాకపోగా మావోయిస్టు పార్టీలో కొందరు లేవదీసిన సాయుధ పోరాట విరమణ నష్టదాయకమని చెప్పడమే ఈ తరహా మేధావులకు కోపం తెప్పించింది. చరిత్రలోంచి, రాజ్య స్వభావంలోంచి, రాజకీయార్థిక మూలాల్లోంచి, ప్రజల పోరాట సంస్కృతిలోంచి చేసిన విశ్లేషణ అసహనానికి లోను చేసింది. దేనికంత నిందాపూర్వకంగా మాట్లాడారు? ఒక సామాజిక సమస్యను, ప్రజా పోరాట రూపాన్ని అంత నైతిక స్థాయికి దేనికి తీసికెళ్లారు? సాయుధ పోరాటాన్ని బలపరుస్తున్న వాళ్లు జీవితంలో ఎన్నడూ సాయుధ పోరాటం చేయనట్లే, ఆయుధం వదిలి ప్రజాస్వామిక పోరాటాలను  అనుసరించాలని మావోయిస్టులకు చెప్తున్నవాళ్లు ఎన్నడూ ఆ పోరాటాల్లో క్రియాశీల కార్యకర్తలు కాదు. నాయకులు కాదు. అప్పుడు ప్రజలు ప్రజాస్వామికంగా పోరాడాలని చెప్పే అవకాశం తమకు కూడా లేనట్లే కదా.   ఎవరు చెప్పినా, చెప్పకపోయినా, ప్రజలు తమకు చేతనైన, తాము ఎంచుకున్న పోరాట రూపాన్ని ఆశ్రయిస్తారు. దాన్ని పరిస్థితులు, చైతన్యం నిర్ణయిస్తారు. ఇవేవీ పట్టించుకోకుండా, సాయుధ పోరాటం మీద తాము లేవదీసిన నైతిక వాదన ఇంత ప్రమాదకర స్థాయికి వెళుతుందని కూడా ఈ మేధావులు  అనుకున్నట్లు లేదు. ఇక్కడి దాకా వెళ్లాలా? ఇట్లాంటి చర్చ అవసరమా? దాని వల్ల  ప్రయోజనం ఏముంటుంది? 

అటూ ఇటూ ఎంత చర్చ జరిగినా చివరికి సాయుధ పోరాటం కొనసాగించాల్సింది మావోయిస్టులే కదా. వాళ్ల మౌలిక విధానంలో భాగంగా మునపటిలా చట్టబద్ధ పోరాటాలు,  సాయుధ పోరాటాలు ఏ మేరకు చేయగలరోగాని, ఆయుధాలు దించేది లేదని ఇప్పటికి ఒకటికి రెండుసార్లు వాళ్లు ప్రకటించాక, ఇంకెవరి నైతికత దగ్గరికో ఈ చర్చను తీసికెళ్లడం వల్ల ప్రయోజనం ఏముంది? ప్రస్తుత సంక్షోభం ఇన్నేళ్ల మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా వైఫల్యాన్ని  సూచిస్తున్నదనే ఔత్సాహిక ప్రకటన ఎవ్వరైనా చేశారనే అనుకుందాం. అంత మాత్రాన చరిత్రలోంచి సాయుధ పోరాట రూపం రద్దయిపోతుందా? ప్రజా జీవితంలోంచి మాయమవుతుందా? బహుశా ఈ అంతర్గత సంక్షోభం ఎంత నష్టపరిచినా, సామాజిక సంక్షోభం మరింతగా వికటించి మావోయిస్టుల  సాయుధ పోరాట మార్గాన్ని ముందుకు తోస్తుందేమో. అక్కడి దాకా ఎందుకు? ధర్నాలు, ఊరేగింపులు, సమ్మెలు, నిరసన దీక్షలు, నిరాహార పోరాటాలు నిత్యం దేశంలో కొన్ని వందల చోట్ల విఫలమవుతూనే ఉన్నాయి కదా? ప్రభుత్వం తాను ఇవ్వవలసినవీ, రాజ్యాంగం ఆదేశిస్తున్నవీ అమలు చేయమనే కనీస డిమాండ్ల మీద ప్రజలు ఎంచుకున్న ఈ  పోరాట రూపాలన్నిటినీ రాజ్యం ఎంత దురుసుగా, దుర్మార్గంగా విఫలం చేస్తున్నదో మనకు తెలియనిది కాదు.  అంత మాత్రాన ప్రజలు ఆ పోరాటాలు చేయకుండా తప్పుతున్నదా?  ప్రజా జీవితంలోంచి ఆ పోరాట రూపాలు అదృశ్యమయ్యాయా? నిరుపయోగమని నిర్ధారణ అయిందా? ఈ పోరాట క్షేత్రం  నానాటికీ ఎంత  కుంచించుకపోయినా,  ఈ చట్టబద్ధ పోరాట రూపాలు ఎంత బలహీనపడినా చరిత్రలోంచి తొలగిపోతాయా?  ఈ పోరాట రూపాలపై  అమలవుతున్న హింసను  చూసి ప్రజలు వీధుల్లోకి రావడం ఆగిపోయారా? సంక్షుభిత సమాజమే నిత్యం ప్రజలను ఎక్కడో ఒకచోట ఆందోళన చేయకుండా వదిలిపెట్టడం లేదు కదా.  ఏదైనా అంతే. ఈ మాట తెలుసుకోడానికి సామాజిక వాస్తవికత, దాని మార్పులు అర్థమైతే చాలదూ. ఒక వేళ ఈ పోరాట రూపాలు నిరుపయోగమని చెప్పడానికైతే ఆ వాస్తవికతను, దానిలోని చలనాలను చాలా లోతుగా విశ్లేషించాల్సిందే. ఆ పని చేయకుండా ఏ నిర్ధారణకూ రాకూడదు.

సాయుధ పోరాటం విషయం కూడా అంతే. ఇంత చిన్న విషయం తెలుసుకోకుండా రాగద్వేషాలతో, అతిశయాలతో, ముద్రలు వేసే ధోరణితో మాట్లాడితే ఎట్లా? కగార్‌ చుట్టుముట్టు యుద్ధం వచ్చి పడిరదనీ, విప్లవోద్యమంలోనే కొందరు రాజ్య ప్రేరితంగా సాయుధ పోరాటం విరమించారనీ, కాబట్టి ఇక ఆ పోరాట రూపం  నడవదనీ ఎట్లా అనగలరు?

అణచివేత తగదని ప్రభుత్వానికి చెబితే ఎటూ వినదు కాబట్టి, మావోయిస్టులకైనా చెబుదామని అనుకోవచ్చు. తద్వారా ప్రాణహాని తగ్గుతుందని  ఆశించవచ్చు. ఈ మానవతా వైఖరితో ఎన్ని సూచనలైనా చేయవచ్చు.  కానీ ఇది సాయుధ పోరాటం నడిచే కాలం కాదని చెప్పడానికి తగిన విశ్లేషణ ఈ మేధావుల్లో ఎవ్వరూ ఇవ్వలేదు. సాయుధ పోరాటం కొనసాగాలని కోరుకున్న వాళ్ల మీద విసుగూ, విసుర్లూ తప్ప.

Leave a Reply