1. కొత్తకాదు

ఎన్ని ఆటుపోట్లు
ఎన్ని సంక్షోభాలు
ఎంత నిర్బంధం
ఎంత రక్త దారపోత

ఆటుపోట్లను అధిగమించి
సంక్షోభాలను చిత్తుచేసి
నిర్బంధాన్ని బడ్డలుకొడుతూ
త్యాగాలతో ఎరుపెక్కింది

నక్సల్బరీలో ముగిసిందన్నారు
శ్రీకాకుళంలో మొదలుకాలేదా..
శ్రీకాకుళంలో
వెనకడుగు వేసిందనుకుంటే
సిరిసిల్ల, జగిత్యాలలో
జైత్రయాత్ర కాలేదా..
జంగ్ సైరనూదలేదా..?

నల్లదండులు, నయీమ్ ముఠాలు
గ్రీన్ హంట్ లు, సల్వాజుడుంలు
ఆపరేషన్ ప్రహార్లు,
ఆపరేషన్ సమాధాన్ లు,
అన్నిటిని ప్రజా యుద్ధంతోనే
ఎదుర్కోలేదా..
జనతన సర్కార్ లను ఏర్పరచలేదా..?

లొంగుబాట్లు, కుంగుబాట్లు
వెన్నుపోట్లు, వెనకడుగులు
ఇవేవీ కొత్తకాదు
ప్రతీది ఒక గుణపాఠమే
గుణపాఠం నుండే కదా
విప్లవ పురోగమనం
ఖచ్చితంగా పురోగమిస్తాం
పురోగమిస్తూ విస్తరిస్తాం.


2. అడవి

వెన్నుపోటుతో అడవి
కుంగిపోతుంది
దోసుకునే దోపిడిగాళ్లకు
దారి చూపుతున్న
ద్రోహులను చూసి దుఃఖిస్తుంది.
తన ఒడిలోని బిడ్డలను
ఒక్కొక్కరిని కూల్చుతుంటే
తల్లికోడిలా తల్లడిల్లుతుంది.
తేదీలను బెట్టి
తుడిచేస్తామంటూ
కుట్రదారులు, పెట్టుబడిదారులు
ఒక్కటై వస్తూ ఉంటే
తన బిడ్డల త్యాగాలతో
తడిసిన అడవి
సగర్వంతో ఎర్రబడి
పోరుకు సై అంటున్నది
వాడు చిగురించే
ఆకులను తుంచేస్తే
నేను మళ్ళీ
గర్జించే గన్నులను
కంటానంటున్నది.

Leave a Reply