2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన ఇద్దరు చిన్న కుమార్తెల అడ్మిషన్‌ను రద్దు చేయడంతో, వారు చదువుకు దూరమయ్యారు, దీనివల్ల వారి విద్యాభ్యాసం ఏళ్ల తరబడి నిలిచిపోయింది.
ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతీరామ్ కన్నీటి పర్యంతమయ్యారు. 2021లో ఆయన బెయిల్‌పై ఉన్న సమయంలో, ఆయన కుమార్తెలు ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఎంపికయ్యారు. “పాఠశాల యాజమాన్యం వారిని పంపమని మాకు చెప్పారు. కానీ ఎవరో అక్కడికి వెళ్లి నేను మావోయిస్టునని చెప్పారు. ఆ తర్వాత పాఠశాల అడ్మిషన్ నిరాకరించింది. నా కూతుళ్ల చదువు మూడేళ్లపాటు ఆగిపోయింది,” అని రతీరామ్ చెప్పారు.
సంథాలీ ఆదివాసీ అయిన రతీరామ్, బొకారో జిల్లాలోని డాకాసడమ్ గ్రామంలో నివసిస్తూ, దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య స్థానిక మార్కెట్లలో కూరగాయలు అమ్ముతుంది. ఎనిమిది నెలల జైల్లో ఉన్నాక, రతీరామ్ కు హైకోర్టు నుండి బెయిల్ వచ్చింది., కానీ ఆ అరెస్టు జ్ఞాపకాలు ఆయనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. 2015 జనవరి 14నాడు తెల్లవారుజామున సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బంది తన ఇంటిపై దాడి చేసి, మహువాటాండ్లో ఒక చౌకీదార్‌ను చంపినట్లు తనపై ఆరోపణలు మోపి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, ఆపై స్థానిక పోలీసులకు అప్పగించి తేనుఘాట్ జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బెయిల్‌కు ముందు మరియు తర్వాత కూడా తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని CRPF తన ఇంటిపైన పదేపదే దాడులు చేయడంతో, ఆ వేధింపులు జైలు దాటిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
రతీరామ్ కథనం జార్ఖండ్‌లోని ఒక విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. అక్కడ మావోయిస్టు ఆరోపణలపైన అరెస్టు చేసిన వేలాది మంది ఆదివాసీలు, నిర్దోషులుగా తేలడానికి ముందు ఏళ్ల తరబడి జైలులో గడుపుతున్నారు. ఒక RTI సమాచార హక్కు కింద సేకరించిన సమాధానం ప్రకారం, 2009- 2021 మధ్య కాలంలో ఆ రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద 704 కేసులు నమోదయ్యాయి. వీటిలో 52.3 శాతం ఆదివాసీలు, 23.1 శాతం ఒబిసిలు, 6.7 శాతం దళితులు ఉన్నారు.
సుదీర్ఘ విచారణల ఉచ్చులో చిక్కుకున్న వారిలో హీరాలాల్ తుడు, సూరజ్మణి కూడా ఉన్నారు. వీరిద్దరూ దాదాపు 850 రోజులు జైలులో గడిపారు. జైలులో ఉన్న సమయంలోనే హీరాలాల్ తన తల్లిని కోల్పోయారు. 2018 ఫిబ్రవరిలో బెయిల్ వచ్చిన తర్వాత కూడా, ఆయన కోర్టుల చుట్టూ తిరగడం కొనసాగుతూనే ఉంది.
“నేను 2015 సెప్టెంబర్ నుండి 2018 ఫిబ్రవరి వరకు జైలులో ఉన్నాను. నేను తేనుఘాట్ జైలుకు వెళ్లినప్పుడు నా కుమార్తె వయస్సు కేవలం ఏడు రోజులు మాత్రమే. ఏడాది తిరగకముందే, నా కోసం నిరీక్షిస్తూ నా తల్లి మనస్థాపంతో మరణించింది. కనీసం చివరిసారిగా కూడా నేను ఆమెను చూడలేకపోయాను,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2014 లల్పానియా బస్సు పేలుడు కేసులో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మూడు రోజుల పాటు నిర్బంధించి తనను రోజూ కొట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. విచారించడానికి వచ్చిన గ్రామస్తులకు, తాము ఒత్తిడిలో పనిచేస్తున్నామని, ఇది ఒక చిన్న కేసేనని పోలీసులు చెప్పారు. “ఇది ఒక ‘తేలికపాటి కేసు’ అని, మూడు నెలల్లో బయటకు వచ్చేస్తానని వారు చెప్పారు.” కానీ ఆ ఒత్తిడి త్వరలోనే వేధింపులుగా మారింది. పూర్తిగా చదవనివ్వకుండానే ఒక పత్రంపై సంతకం చేయమని చెప్పి, ఆపై తనను జైలుకు పంపారని ఆయన వివరించారు.
గోమియా బ్లాక్‌లోని తుతిజర్నా గ్రామానికి చెందిన బంధువులైన సూరజ్మణి, హీరాలాల్పైన మావోయిస్టులకు ఆశ్రయం కల్పించారని, ఆయుధాలను నిల్వ చేశారని ఆరోపణలు వచ్చాయి. సూరజ్మణి జైలు నుండి తిరిగి వచ్చేటప్పటికి ఆమె వయస్సు కేవలం 25 ఏళ్లు మాత్రమే; కానీ ఆమె ఒక “జీవచ్ఛవంలా” మారిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హీరాలాల్ ఆమెతో పదేపదే మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె నుండి ఎటువంటి స్పందన రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కుటుంబంలోని ఇతరులకు వివాహాలు జరిగినప్పటికీ, ఆమెకు మాత్రం ఎటువంటి సంబంధాలు రాలేదు. ఆమెపై పడిన ‘మావోయిస్టు’ అనే ముద్ర ఆమె భవిష్యత్తును తుడిచివేసింది.
గోమియా పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 47/14 కింద, వీరిద్దరిపై భారత శిక్షాస్మృతి, ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, ఉపాలోని పలు నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు వారి న్యాయవాది కుందన్ కుమార్ సింగ్ తెలిపారు. 2023లో వీరిద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. తేనుఘాట్ కోర్టులో న్యాయమూర్తి తనతో, “నీ కేసు ముగిసింది. ఇకపై నీ జీవితం మీద దృష్టి పెట్టు; నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకో,” అని చెప్పినట్లు హీరాలాల్ గుర్తు చేసుకున్నారు.
అయితే, ఏళ్ల తరబడి జైలులో గడిపి నిర్దోషులుగా బయటకు వచ్చిన వందలాది మంది ఆదివాసీలకు ‘పరిహారం’ అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండానే మిగిలిపోయింది. జార్ఖండ్‌లోని మావోయిజం సంబంధిత కేసుల్లో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 17, ఉపా సెక్షన్ 13 పదేపదే కనిపిస్తూ ఒకే విధమైన ధోరణిని చూపుతున్నాయి. ఎటువంటి రక్షణలు లేని సెక్షన్ 13ను దుర్వినియోగం చేయడం వల్ల న్యాయవ్యవస్థ మరింత దారుణమైన పరిస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ హెచ్చరించారు.
జార్ఖండ్‌లోని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్న దాని ప్రకారం, మావోయిజం సంబంధిత ఆరోపణలు, ఉపాలోని సెక్షన్ 13ను ఆదివాసీలపై ఒక ఆయుధంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఉపా కేసులను వాదించే సుప్రీంకోర్టు న్యాయవాది అబూబకర్ సబ్బాక్, సెక్షన్ 13 అత్యంత ప్రమాదకరమైనదిగానూ, అస్పష్టంగానూ ఉందని అభివర్ణించారు. “ఒకసారి ఒక సంస్థను నిషేధించిన తర్వాత, ఆ సంస్థ మాజీ సభ్యులను కూడా అదే కోణంలో చూస్తారు. ఉదాహరణకు, అటువంటి వ్యక్తి మీ షాపుకు వచ్చి ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి. కేవలం ఆ లావాదేవీ ఆధారంగా పోలీసులు మీపై ఉపా సెక్షన్ 13ను ప్రయోగించవచ్చు. ఆ తర్వాత, ఆ డబ్బు కేవలం వస్తువుల కొనుగోలు కోసమేనని మీరు కోర్టులో నిరూపించుకుంటూ ఉండాలి.” పోలీసుల జవాబుదారీతనం లేకపోవడమే అసలైన లోతైన నిర్మాణపరమైన సమస్య అని సబ్బాక్ వాదించారు. దుర్వినియోగానికి ఎటువంటి శిక్ష లేనప్పుడు, అది నిర్భయత్వానికి దారితీస్తుందని, ఆ నిర్భయత్వమే తప్పులను పునరావృతం చేయడానికి ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.
సిపిఐ(ఎం) జార్ఖండ్ విభాగం కార్యదర్శి ప్రకాష్ విప్లవ్ సమాచార హక్కు ద్వారా పొందిన డేటా, ఈ నిర్భయత్వం ఎలా పనిచేస్తుందో నొక్కి చెబుతోంది. 2009-2021 మధ్య రాష్ట్రంలో ఉపా కింద నమోదైన 704 కేసుల్లో, 458 కేసులు స్పెషల్ బ్రాంచ్ నుండి రాగా, 248 కేసులు 100 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్ల ద్వారా నమోదయ్యాయి. స్పెషల్ బ్రాంచ్ సంబంధిత 458 కేసుల్లో 378 కేసుల్లో సెక్షన్ 13ను వర్తింపజేశారని విప్లవ్ పేర్కొన్నారు. జార్ఖండ్ ఉపా చట్రంలో ఒకే ఒక్క నిబంధన ఎంత భారీగా ఆధిపత్యం చెలాయిస్తుందో ఇది చూపిస్తుంది. మావోయిస్టు సంఘటనలు జరుగుతున్నాయని లేదా పోలీసుల చర్యలన్నీ అక్రమమని విప్లవ్ అనడం లేదు. కానీ, భూమి, సహజ వనరులపైన నియంత్రణను పెంచుకోవడానికి “మావోయిజం బూచిని”ని చూపించి ఆదివాసులను నిత్యం వేధించడమే అసలైన వాస్తవమని ఆయన వాదించారు. ఈ ధోరణి అత్యధికంగా ఉపా కేసులు నమోదైన పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది.
భారతదేశ ఖనిజ సంపదలో దాదాపు 40 శాతం జార్ఖండ్‌లోనే ఉంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఇనుప ఖనిజ నిల్వలకు చైబాసా నిలయం. టాటా స్టీల్, ఎస్ఆర్ రుంగ్తా గ్రూప్, షా బ్రదర్స్, బి.ఎన్. ఖిర్వాల్ మైన్స్ వంటి ప్రధాన మైనింగ్ కంపెనీలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సమాచార హక్కు డేటా ప్రకారం, పశ్చిమ సింగ్భూమ్లో 187 ఉపా కేసులు నమోదు కాగా, డుమ్కాలో 57, గుమ్లాలో 42 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జిల్లాలు కూడా ఐదవ షెడ్యూల్ కింద పాలించబడే ఆదివాసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలే.
జాతీయ స్థాయిలో ఉపా నిందితులకు సంబంధించిన కులాల వారీ డేటా అందుబాటులో లేదు. 2019లో రాజ్యసభలో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ప్రకారం, 2016-2019 మధ్య 5,922 ఉపా కేసులు నమోదయ్యాయి, కానీ నిందితుల సామాజిక నేపథ్యాన్ని వెల్లడించలేదు. అందుకే జార్ఖండ్ సమాచారహక్కు ఆధారిత డేటా ప్రాముఖ్యత సంతరించుకుంది; ఇది జాతీయ డేటా దాచిపెట్టిన లక్ష్యిత అరెస్టుల ధోరణులను బహిర్గతం చేస్తోంది.
జైళ్ల గణాంకాలు ఒక విస్తృతమైన జాతీయ ధోరణిని సూచిస్తున్నాయి. NCRB నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో 2020 నివేదిక ప్రకారం, భారతదేశంలో 4, 88, 511 మంది ఖైదీలు ఉండగా, అందులో 3,71,848 మంది విచారణలో ఉన్న ఖైదీలు. ఈ విచారణలో ఉన్న ఖైదీలలో 73 శాతం మంది ఆదివాసీ, దళిత, ఒబిసి సామాజిక వర్గాలకు చెందినవారు కాగా, 20 శాతం మంది ముస్లింలు. జార్ఖండ్ జనధికార్ మహాసభ నిర్వహించిన సర్వే ప్రకారం, పోలీసులు పేదలను, ఆదివాసులను తరచుగా మావోయిస్టు సంబంధిత కేసుల్లో ఇరికిస్తున్నారని, వారు నిర్దోషులుగా తేలడానికి ఏళ్లు పడుతోందని వెల్లడించింది. 2022 నివేదికలో, బొకారోలోని గోమియా, నవాడిహ్ బ్లాకులలోనే 31 మంది ఇటువంటి కేసులను ఎదుర్కొంటున్నారని, వీరిలో చాలా మందిపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఆ సంస్థ కనుగొంది. ఈ ధోరణి జార్ఖండ్ దాటి కూడా కొనసాగుతోంది. 2022 జూలైలో, సుక్మాలోని బుర్కాపాల్ దాడికి సంబంధించి ఐదేళ్లపాటు జైలులో ఉన్న 121 మంది ఆదివాసీలను దంతేవాడలోని ఎన్ఐఎ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది ఉపా వంటి కఠినమైన చట్టాల కింద పోలీసుల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కి చెందిన న్యాయవాది షాలిని గేరా ఇలా అంటున్నారు: “మావోయిజం తీవ్రంగా ఉన్న సౌత్ బస్తర్ డివిజన్లో (సుక్మా, దంతేవాడ, బీజాపూర్), అమాయక ఆదివాసీలే అతిపెద్ద లక్ష్యాలుగా మారారు. జగదల్పూర్ లీగల్ ఎయిడ్ ఆర్గనైజేషన్ 2005 నుండి 2012 వరకు 1,446 కేసులను విశ్లేషించింది. వీటిలో ఎక్కువ భాగం మావోయిజం సంబంధిత కేసులే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీటిలో 96 శాతం మంది నిర్దోషులుగా విడుదలయ్యారు; మావోయిస్టు కేసులో ఒక్క శిక్ష కూడా పడలేదు. అయినప్పటికీ, అరెస్టు అయిన వారు ఎటువంటి తప్పు చేయకపోయినా సగటున మూడు నుండి నాలుగు సంవత్సరాల పాటు జైలులో గడిపారు.”
పోలీసులు పటిష్టమైన కేసులను నిర్మించడంలో విఫలమైనప్పుడు, ప్రాసిక్యూషన్‌ను సిద్ధం చేయడానికి తరచుగా “సిగ్నేచర్ సెక్షన్లను” ఆశ్రయిస్తారని గేరా చెప్పారు. వీటిలో IPC సెక్షన్లు 147, 148, 149, ఆయుధ చట్టం సెక్షన్లు 25, 27, పేలుడు పదార్థాల చట్టం సెక్షన్లు 3, 4, 5 ఉన్నాయి.
జార్ఖండ్‌లో ఆదివాసీలు తమ రాజ్యాంగ హక్కులను వినియోగించుకుంటున్నప్పుడు కూడా నిరంతరం అనుమానాలకు గురవుతున్నారు. దీనికి ‘పత్తల్గఢి’ ఉద్యమం ఒక ముఖ్య ఉదాహరణ. 2017-18లో చైబాసా, ఖుంటిలోని ఆదివాసీలు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని అప్పటి బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అప్పటి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, దీని వెనుక విదేశీ శక్తుల మద్దతు ఉందని ఆరోపించాడు.
సుమారు 30 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, అందులో దాదాపు 200 మంది పేర్లను చేర్చి, మరో 10,000 మందిని “తెలియని నిందితులు”గా పేర్కొన్నారు. దేశద్రోహం తదితర కఠినమైన సెక్షన్లను ప్రయోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి; ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.
ఈ కేసులో జైలుకు వెళ్లిన 50 ఏళ్ల సుఖ్రామ్ తన అనుభవాలను ఇలా గుర్తు చేసుకున్నారు: “నన్ను ఒక నెల రోజుల పాటు సెల్లో ఉంచారు. ఆ గది 12 అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పు ఉండేది. మేము అక్కడే పడుకున్నాము, అక్కడే తిన్నాము; అక్కడే మరుగుదొడ్డిని ఉపయోగించాము. ఒక నెల తర్వాత నన్ను జైలు బ్యారక్‌కు మార్చారు. అక్కడ నేను రెండున్నర ఏళ్లు ఉన్నాను.” ఆయన గొంతు దుఃఖంతో మూగబోయింది, కాసేపు ఆగి ఆయన ఇలా ప్రశ్నించారు, “నన్ను సెల్లో పెట్టడానికి నేను చేసిన తప్పేమిటి?” 2018 ఆగస్టు 12న అర్ధరాత్రి 2 గంటలకు ఖుంటిలోని పాత్రాస్ టోలీ నుండి పోలీసులు తనను తీసుకెళ్లిన రాత్రిని సుఖ్రామ్ ముండా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆ అరెస్టు ఆయన కుటుంబ జీవితాన్ని తలకిందులు చేసింది. ఆయన పెద్ద కుమారుడు సుఖ్నాథ్ పదో తరగతి తర్వాత చదువు మానేశాడు. కోర్టుల చుట్టూ తిరగడానికి పశువులను అమ్మేశారు, భూమిని కుదువ పెట్టారు; పొదుపు చేసుకున్న డబ్బునంతా ఖర్చు చేశారు. ఈ ప్రక్రియలో రెండు పందులు, రెండు ఎద్దులు, రెండు మేకలు; 18,000 రూపాయల నగదును ఆయన కుటుంబం కోల్పోయింది.
జార్ఖండ్‌లో పెద్ద సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉండటం; మావోయిజం ఆరోపణలను పోగొట్టుకోవడానికి చాలామంది సుదీర్ఘ న్యాయపోరాటాలు చేస్తున్న నేపథ్యంలో, ఉపా దుర్వినియోగంపై జరుగుతున్న చర్చలకు జార్ఖండ్ కేంద్రబిందువుగా మారింది. 2020 అక్టోబర్‌లో భీమా కోరెగావ్ కేసులో 84 ఏళ్ల సామాజిక కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు కావడం, ఆపై కస్టడీలోనే ఆయన మరణించడం తర్వాత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ చట్టం దుర్వినియోగంపైన గళమెత్తారు. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీల కోసం పనిచేసిన స్వామిని అరెస్టు చేయడం ద్వారా, అసమ్మతిని అణిచివేయడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు.
అయినప్పటికీ, ఒక వైరుధ్యం కొనసాగుతూనే ఉంది. ఆదివాసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఇటువంటి కేసులలో విచారణలో ఉన్న ఖైదీలలో ఆదివాసీలే అత్యధికంగా ఉన్నా, ఉపా చట్టం విషయంలో సోరెన్ ఎటువంటి ఖచ్చితమైన రాజకీయ నిబద్ధతను ప్రకటించలేదు. ఎన్సిఆర్బిగణాంకాల ప్రకారం, 2019- 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉపా కింద 10,440 మంది అరెస్టు కాగా, కేవలం 335 మందికి మాత్రమే శిక్ష పడింది; అంటే దీని శిక్షా రేటు కేవలం 3.2 శాతం మాత్రమే. సోరెన్ పదవీకాలంలో జార్ఖండ్‌లో ఉపా కింద అరెస్టులు తగ్గాయని అదే గణాంకాలు సూచిస్తున్నాయి, అయితే పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఈ తగ్గుదల ఇంకా ఎక్కువగా ఉంది. మాజీ IPS ఐపిఎస్ అధికారి, మంత్రి అయిన రామేశ్వర్ ఉరావ్ మాట్లాడుతూ, ఈ చట్టం ఆదివాసీలపై తరచుగా దుర్వినియోగం అవుతోందని, చార్జిషీట్లు ఏళ్ల తరబడి ఆలస్యమవుతున్నాయని, దిగువ కోర్టులలో బెయిల్ లభించడం అసాధ్యంగా మారుతోందని చెప్పారు. దీనివల్ల నిరుపేద నిందితులు తాము భరించలేని ఖర్చులతో కూడిన హైకోర్టులను ఆశ్రయించవలసి వస్తోందని ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక సమగ్ర విధానపరమైన దృక్పథాన్ని అనుసరించాలని ఉరావ్ సూచించారు. “ఆదివాసీ ప్రాంతాలలో నక్సలిజం ఒక సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు, మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు అంతమయ్యే దశలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ప్రతి కేసును విడిగా సమీక్షించాలి. సాక్ష్యాధారాలు బలహీనంగా ఉండి, నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం ఉన్న చోట, అటువంటి వారిని విడుదల చేయాలి. ఇది కేవలం జార్ఖండ్ మాత్రమే కాదు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా చేయాలి.” తన సర్వీసు కాలంలో తాను చూసిన అనేక కేసులలో, మావోయిస్టుల ఒత్తిడి మేరకు వారికి ‘వంట చేసి పెట్టడం’ తప్ప, నిందితులుగా ఉన్న ఆదివాసీలు చేసిన ఇతర ‘నేరం’ ఏమీ లేదని ఉరావ్ జోడించారు.
21 జనవరి 2026
ఎమ్‌డి అస్ఘర్ ఖాన్ ఝార్ఖండ్ లో సీనియర్ కరస్పాండెంట్
https://www.outlookindia.com/national/voices-from-prison-half-freedom
తెలుగు: పద్మ కొండిపర్తి




