ఆదివాసి హక్కుల ఐక్యవేదిక 24 ఆగస్టున వరంగల్‌లో తలపెట్టిన శాంతి చర్చల సభ పోలీసుల అనుమతి లేక ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆశాభంగము అయ్యింది. అంత విస్తృతమైన ప్రచారం జరిగి సభ జరగకపోవడమే రెండు తీర్ల భావనకు కారణమైంది. కొంతకాలం క్రితం కాకతీయ యూనివర్సిటీలో పిడిఎస్యు విద్యార్థులు తలపెట్టిన శాంతి చర్చల సదస్సును కూడా పోలీసులు జరగనివ్వలేదు. ఇది వరంగల్ మీద కేంద్రీకరించిన పోలీసులు అతి జాగ్రత్తనా, రాష్ట్రవ్యాప్త హక్కుల హననానికి దారితీస్తుందా. పర్యావరణ విధ్వంసం వల్ల కురుస్తున్న వానల్లో కకావికలమవుతున్న తెలంగాణ ప్రజలు ఇటువంటి స్థితి గురించి స్థిమితంగా ఆలోచించే స్థితి లేకపోవచ్చు గాని అందువల్ల శాంతి చర్చలు జరిగి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక శక్తులు ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించి చర్చించుకునే అవకాశం కేంద్ర స్థానం నుంచి తొలగితే, నిరంతరం ప్రజల మనసుల్లో చోటు చేసుకునే అంశం కాకుండాపోతే ఈ అభివృద్ధి నమూనా భౌతికంగానూ, భావ పరంగానూ దళారీ పాలకుల చేతుల్లో అమలు చేస్తున్న విధ్వంసం మరింత ప్రమాదకరంగా విజృంభిస్తుంది. తాత్కాలిక ఉపశమనాల గురించి కాదు ప్రజల జీవన సంక్షోభాన్ని పరిష్కరించే శాంతి గురించి ఏం చేయగలమో ఆరంభమైన శాంతి చర్చల ప్రక్రియ ఆగిపోకూడదు.
ఉత్తరాఖండ్ నుంచి జమ్మూ కశ్మీర్ నుంచి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ దాకా ముంచెత్తుతున్న వరదల్లో ఒకవైపు మైదాన ప్రాంత ప్రజలు ప్రకృతి విధ్వంస ఫలితాలకు పరితపిస్తుంటే పొర్లి పొంగుతున్న నదులను, వరదలను తుఫానులకు కూలుతున్న చెట్లను ఖాతరు చేయకుండా తమకున్న సకల సాంకేతిక విజ్ఞాన సౌకర్యాలతో అర్ధ సైనిక బలగాలు మాత్రం తూర్పు మధ్య భారత విప్లవోద్యమ స్థావరాలైన ఆదివాసి ప్రాంతాల్లో గహనాటవుల్లో గాలింపు చర్యలు, ఎన్కౌంటర్లు కొనసాగిస్తూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మనం ఎప్పుడూ వినే బీజాపూర్, సుకుమా, దంతేవాడ, నారాయణపూర్, మాడ్ వంటి బస్తర్ ప్రాంతాలే కాదు రాయపూర్‌కు ఎడంగా ఉండే రాజనంద్గాఁవ్ లో కూడా ఎన్కౌంటర్ జరిగి ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు అమరులైన విషయం మన కర్నూలు జిల్లా వడ్ల రామాపురం చిన్నన్న అందులో ఒకరు కాకపోతే మనకు తెలిసేది కాదు. ఆమాత్రమైన అమరుల స్మరణలో మళ్లీ మనం శాంతి చర్చల గురించి కొంత మధనపడే, కొంత మాట్లాడుకునే కలయిక సాధ్యమైంది. అటువంటి ఒక పెద్ద ఎన్కౌంటర్ గడిచిరోలి జిల్లా కోపర్షి అడవుల్లో జరిగి నలుగురు మావోయిస్టులు అమరులయ్యారు. అది ఆగస్టు 28 బుధవారం రోజు మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దుల్లో భాంమ్రాగడ్ ఏరియాలో ఉన్న కాపర్షా అడవుల్లో జరిగింది.
కంపెనీ నెంబర్ 10 గా ప్రసిద్ధమైన గట్టు స్థానిక నిర్మాణ దళం (ప్లాట్ పార్టీ కమిటీ) సభ్యులు ఫార్మేషన్లో ఒకచోట క్యాంపులో ఉన్నారని ఆగస్టు 25న సమాచారం అందితే సిఆర్పిఎఫ్ నాయకత్వంలో ప్రభుత్వం ఎంత సాయుధ బలగాలను తరలించిందో ఇరవై సి`60 పార్టీలు, 20 వేగవంత యాక్షన్ టీంలు (క్యూ ఏ టి) మొత్తం 550 మంది కమాండోలు ఆగస్టు 25న అడిషనల్ ఎస్పి (ఆపరేషన్స్) ఎం. రమేష్ నాయకత్వంలో బయలుదేరారు. భారీ వర్షాలు కష్టతరమైన గహనాటవి ప్రాంతం. 25 కిలోమీటర్లు అడవికి అడ్డం పడి పది పర్వతాలు దాటి, 48 గంటలు నడిచి 27 ఆగస్టున అక్కడికి చేరుకున్నారు. మావోయిస్టు క్యాంపు దగ్గరికి చేరుకొని ఎనిమిది గంటలు నిర్విచక్షణగా ఈ 550 మంది కాల్పులు జరిపితే నలుగురు మావోయిస్టులు నెలకొరిగారు.
అమరులైన మావోయిస్టులు కంపెనీ 10 కి చెందిన సీనియర్ ప్లాట్ ఫాం నెంబర్ 1 మూలుపడ (41) క్రాంతి అలియాస్ జమున రైమా హతామీ (32) జ్యోతి కుంజుం(27) ఆహిరి ఎల్ఓసి, మంగి మడకమ్ (22) గట్ట ఎల్ఓసి.
కంపెనీ నెంబర్ 10 మీద తలపెట్టిన ఆపరేషన్‌లో ఇది మొట్టమొదటి విజయమని పోలీసులు చెప్పుకున్నారు. ఎందుకంటే బస్తర్ ప్రాంతంలో హెడ్మా నాయకత్వంలో ఉన్న కంపెనీ 1 వలెనే భాంమ్రాగఢ్ ప్రాంతంలో మాలుపడా నాయకత్వంలో ఉన్న కంపెనీ 10 చాలా శక్తివంతమైంది అని నీలోత్పల్ చెప్పాడు. అందువల్లనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ (స్పెషల్ ఆపరేషన్స్)డాక్టర్ చేరింగ్ దోద్జీ, యాంటీ నక్సలైట్స్ ఆపరేషన్ ఐజి సందీప్ పాటిల్ డిఐజి గడ్చిరోలీ అజయ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో ఈ దాడి నిర్వహించామని గర్వంగా చెప్పుకున్నారు. అధికారులు పెద్ద జాబితా ప్రకటించారు.
గడ్చిరోలి జిల్లాలో 2021 నుంచి నిరంతరం ఇటువంటి గాలింపు చర్యలు దాడుల వలన 91 మంది మావోయిస్టులు మరణించారని, 128 మంది అరెస్టయ్యారని, 75 మంది లొంగిపోయారని కూడా ప్రకటించారు.
వీళ్ళందరికి అందరూ ఆదివాసులే.
ఇన్ని వివరాలు భీకరమైన ఎదురుకాల్పులు జరిగి ఒక క్యాంపులోని ఫార్మేషన్‌ను ధ్వంసం చేశామని చెప్పారు. కానీ ఇందులో ఒక పురుషుడు, ముగ్గురు స్త్రీలు ఉండడాన్ని బట్టి వాళ్ళు ఉన్న రహస్య స్థావర సమాచారం ద్రోహి వల్ల తెలిసి ఇంత దూరం వెళ్లి పట్టుకుని చంపారని అర్థమవుతున్నది. వారి శవాల ఫొటోలు ప్రకటించ లేదు. రక్త బంధువులకు తెలిపినట్లు లేదు.
అడవి, చెట్లు, మనుషులను కూల్చి స్టీల్ ప్లాంట్లు, కార్పొరేట్ మైనింగ్ కోసం ఈ విధ్వంసానికింకా సాల్వాజుడుం రద్దయిందని అమిత్ షా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నాడు.
29.08.2025