సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు.

2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా అయింది. వాటిలో 13 సార్లు జస్టిస్ సుందరేష్ బెంచ్ ముందుకు వచ్చింది. నాలుగు సార్లు, జాబితా చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ చేయలేదు. స్వేచ్ఛ కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు, అటువంటి న్యాయపరమైన బద్ధకం సాధారణ ఆలస్యం లాగా కాకుండా ఉద్దేశపూర్వక రూపకల్పనలాగా కనిపించడం ప్రారంభమవుతుంది.

నాగ్‌పూర్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది గాడ్లింగ్ భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఆరున్నర సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నారు. అయితే, అతని ప్రస్తుత బెయిల్ పిటిషన్, 2016లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఇనుప ఖనిజం తీసుకెళ్తున్న అనేక వాహనాలను నిషేధిత సంస్థ మావోయిస్టు పార్టీకి చెందిన వ్యక్తులు తగలబెట్టిన ఘటనకు సంబంధించిన కేసుది.

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్ట్ బెయిల్‌పై విడుదల అవుతాడని భయపడి జూన్ 2018 నుండి కస్టడీలో ఉన్న గాడ్లింగ్‌ను 2019 జనవరి లో భీమా కోరేగావ్ కేసు లో పోలీసులు అరెస్టు చేశారు. 2023 ఫిబ్రవరి లో, 2016 కేసులో అతని బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. నేటికి, ఈ కేసులో అరెస్టు చేసిన ఏడుగురు నిందితులలో ఆరుగురికి బెయిల్ మంజూరు అయింది. సమానత్వం ఉండి ఉంటే గాడ్లింగ్ విడుదలై ఉండేవాడు.

అయితే, 2023 ఆగస్టు లో బాంబే హైకోర్టు బెయిల్ తిరస్కరణను సవాలు చేస్తూ గాడ్లింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటి నుండి, చాలాసార్లు వాయిదా పడింది. ప్రతి విచారణ నిరాశపరిచే విధంగా ఊహించదగిన నమూనాను అనుసరించింది: రాజ్యం కౌంటర్ (ప్రతిస్పందన) దాఖలు చేయడానికి ఎక్కువ సమయాన్ని అడుగుతుంది – కోర్టు ఒప్పుకుంటుంది, కేసును మరొక తేదీకి వేసేస్తుంది.

కానీ జస్టిస్ సుందరేష్ తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ సంవత్సరం జూలై 18న, కేసును విచారణకు జాబితా చేయమని గాడ్లింగ్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని విన్నప్పుడు విషయాలు వేడెక్కాయి. జస్టిస్ సుందరేష్ ప్రతిస్పందన చాలా మంది పరిశీలకులను దిగ్భ్రాంతికి గురిచేసింది: నాలుగు నెలల తర్వాత బెయిల్ విషయాన్ని 2025 నవంబర్ లో జాబితా చేయాలని కోర్టు ఆదేశించింది! పూర్తి న్యాయపరమైన ఉదాసీనతతో కూడిన కాఫ్కేసిక్ దృశ్యం ప్రదర్శితమైంది.

జస్టిస్ సుందరేష్ కోర్టులో ఇది ఒకేసారి జరిగిన సంఘటన అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అలా కాదు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో గాడ్లింగ్ కేసులో జాబితాలు, న్యాయపరమైన ఆదేశాల తేదీని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ విషయాన్ని విచారించడానికి బెంచ్ ఊగిసలాడే స్పష్టమైన నమూనా కనబడుతుంది.

కేసు నడిచే విధానాన్ని  అర్థం చేసుకోవడానికి కొంత నిలకడైన ఆసక్తి అవసరం. 2023 ఆగస్టులో గాడ్లింగ్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒక నెల లోపే, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అతని అప్పీల్‌పైన నోటీసు జారీ చేసింది.

2023 జూలైలో, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన జస్టిస్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం, భీమా కోరెగావ్ నిందితులు, కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వ్స్, అరుణ్ ఫెర్రీరా ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది; వీరిద్దరూ చట్టవ్యతిరేక  కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద నేరాలకు పాల్పడినందుకు 2018 ఆగస్టు నుండి జైలులో ఉన్నారు. బోస్ తీర్పు ప్రకారం, ఇద్దరిపై “విశ్వసనీయమైన ఆధారాలు” లేవు.

2023 నవంబర్ 29నాడు జస్టిస్ బోస్ ధర్మాసనం రాజ్యాన్ని తన కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రెండు వారాల తర్వాత ఈ విషయాన్ని జాబితా చేసింది. కానీ రాజ్యం కౌంటర్ దాఖలు చేయలేదు. బెంచ్ జనవరి 2024 ప్రారంభం వరకు గడువునివ్వడానికి అనుమతించింది. రెండు వారాల తర్వాత కేసును జాబితా చేయాలని ఆదేశించింది.

ఈ విషయం జాబితా చేయలేదు కాబట్టి, గాడ్లింగ్ న్యాయవాది 2024 ఫిబ్రవరి 1నాడు జస్టిస్ బోస్ ముందు కేసు గురించి ప్రస్తావించారు; 2024 మార్చి 6నాడు జాబితా చేయడానికి ఆదేశించారు. జాబితా చేసినప్పటికీ, ఆ రోజు ఈ కేసును తీసుకోలేదు. బోస్ 2024 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.

జస్టిస్ సుందరేష్‌ వచ్చారు. 2024 జులై 9నాడు  గాడ్లింగ్ న్యాయవాది జస్టిస్ సుందరేష్ బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు; వారు అదే నెలలో అప్పీల్‌ను లిస్ట్ చేయడానికి అంగీకరించారు. ఈ విషయం విచారణకు వచ్చినప్పుడు, రాజ్యం ఇంకా తన కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయలేదు, ఇప్పటికే రెండుసార్లు అలా చేయడంలో విఫలమైంది. బెంచ్ పొడిగింపును అనుమతించింది కానీ ఒక నెల లోపాలే కేసును జాబితా చేయాలని ఆదేశించింది.

ఆ తర్వాత రాష్ట్రం తన కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆలస్యం చేయడం, వరుసగా వాయిదాలు వేయడం జరిగింది. 2024 ఆగస్టు 21నాడు  రాజ్యం మళ్ళీ తన కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్నది. విశేషమేమిటంటే, బెంచ్ మరోసారి అభ్యర్థనను అంగీకరించింది; మరో రెండు వారాల సమయం ఇచ్చింది; సెప్టెంబర్ 11ని తదుపరి తేదీగా నిర్ణయించింది.

ఈ సమయానికి, రాజ్యం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక వారం గడువును దాటి దాదాపు తొమ్మిది నెలలు అయినప్పటికీ కోర్టు అంతులేని ఓపికను ప్రదర్శించింది.

జస్టిస్ సుందరేష్ బెంచ్ సెప్టెంబర్ 11న కేసును చేపట్టలేకపోయింది. ఆ తర్వాత ఈ అంశం కాజ్ లిస్ట్ నుండి అదృశ్యమైంది. సెప్టెంబర్ 30న గాడ్లింగ్ న్యాయవాది చేసిన ప్రస్తావన మేరకు, జస్టిస్ సుందరేష్ ఒక నెల తర్వాత కేసును జాబితా చేయమని ఆదేశించారు కానీ ఆ తేదీన దానిని చేపట్టలేకపోయారు.

తరువాత నవంబర్‌లో , రాజ్యం తన కౌంటర్ దాఖలు చేయడానికి మళ్ళీ వాయిదాను కోరితే జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ఒక వారం సమయాన్ని మంజూరు చేసింది. 2024 డిసెంబర్ 4నాడు  రాజ్యానికి తన అఫిడవిట్ దాఖలు చేయడానికి రెండు వారాల పొడిగింపు ఇచ్చినప్పుడు ధర్మాసనం ఓపిక సన్నగిల్లినట్లు అనిపించింది, ఇది “చివరి అవకాశం” అని హెచ్చరించింది. విచారణను 2024 డిసెంబర్ 18కి వాయిదా వేసింది.

అయినా రాజ్యం కౌంటర్ దాఖలు చేయలేదు; ధర్మాసనం 2025 జనవరి రెండవ వారానికి వాయిదా వేసింది. చివరగా, ఈ వాయిదా తర్వాతి రోజు, మహారాష్ట్ర రాజ్యం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ సమాధానం ఇప్పుడు రికార్డులో ఉన్నది కాబట్టి , చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బెయిల్ అప్పీల్‌ను నిర్ణయించడానికి కోర్టు ముందుకు సాగుతుందని ఆశించవచ్చు. అయినప్పటికీ, వాయిదా చక్రం ఇంకా విచ్ఛిన్నం కాలేదు.

మరో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గాడ్లింగ్ తన జీవితంలో ఆరు సంవత్సరాలనుంచి విచారణా ఖైదీగా  ఉన్నాడు. ఈ విషయం 2025 జనవరి రెండవ వారంలో కూడా విచారణకు రాలేదు. జనవరి 30న, గాడ్లింగ్ న్యాయవాది మరోసారి ప్రస్తావించిన తర్వాత, రాజ్యం వాయిదా కోరింది. జస్టిస్ సుందరేష్ దానికి అంగీకరించి, “వచ్చే వారానికి” నెట్టాడు.

ఫిబ్రవరి 6 నాడు క్లుప్తంగా విచారణ జరిగి బెంచ్ గాడ్లింగ్ న్యాయవాదులను కొన్ని పత్రాలను దాఖలు చేయమని చెప్పి కేసును దాదాపు రెండు నెలల తర్వాత, మార్చి 27కి వాయిదా వేసింది. అర్థవంతమైన విచారణకు వేదిక సిద్ధమైంది; లేదా అలా అనిపించింది.

మార్చి 27న, బెయిల్ అప్పీల్‌ను బెంచ్ చేపట్టింది. కానీ మరోసారి, ఒక విధానపరమైన చిక్కు తలెత్తింది: ఇప్పుడు గాడ్లింగ్ దాఖలు చేసిన వాటికి ప్రతిస్పందనగా “అదనపు పత్రాలను” దాఖలు చేయడానికి రాజ్యం సమయం కావాలంది; కోర్టు ఉదారంగా మరో రెండు వారాల గడువును మంజూరు చేసింది.

ఈ కేసును రెండు వారాల తర్వాత, అంటే దాదాపుగా ఏప్రిల్ మధ్యలో లేదా జాబితా చేయాల్సి ఉంది. కానీ, ఏమీ జరగలేదు. ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ కేసు కోర్టు డాకెట్‌లోకి తిరిగి రాలేదు. వారాలు నెలలకు మారాయి; జాబితాలోకి రాలేదు.

గాడ్లింగ్ న్యాయవాదులు విచారణను రిజిస్ట్రీ షెడ్యూల్ చేసేలా పదేపదే ప్రయత్నించారు;  ప్రస్తావన మెమోలను దాఖలు చేయడానికి కూడా ప్రయత్నించారు, కానీ రిజిస్ట్రీ నిరాకరించింది, దీనిని “సాధారణ విషయం” అని పేర్కొంటూ ప్రత్యేక లేదా అత్యవసర జాబితాకు హామీ ఇవ్వలేదు.

ఈ సమయంలో, జస్టిస్ సుందరేష్ బెయిల్ అప్పీల్‌ను విచారించడంలో విఫలమవడం స్పష్టంగా కనిపిస్తోంది. జూలై 18న, గాడ్లింగ్ బెయిల్‌ను బొంబాయి హైకోర్టు తిరస్కరించినప్పటి నుండి రెండు సంవత్సరాలుగా బాధపడుతున్నందున, అతని న్యాయవాది బెంచ్ ముందు జాబితా చేయని మౌఖిక ప్రస్తావన చేశారు; కేసును జాబితా చేయాలని అభ్యర్థించారు. అయితే, జస్టిస్ సుందరేష్ ఈ విషయాన్ని 2025 నవంబర్ లో జాబితా చేయమని ఆదేశించాడు, “ఒక రోజు కూడా స్వేచ్ఛను కోల్పోవడం – ఆ ఒక్క రోజు కూడా చాలా ఎక్కువ” అనే కోర్టులో తరచుగా పునరావృతమయ్యే న్యాయ తత్వాన్ని పక్కన పెట్టాడు.

ఇలాంటి ఆర్డర్ గురించి  ఎవరైనా ఏమంటారు? ఉత్తమంగా చెప్పాలంటే, ఇది స్వేచ్ఛ పట్ల తీవ్రమైన ఉదాసీనతను ప్రకటిస్తోంది అనాలి. చెడ్డగా చెప్పాలంటే, ఇది ఉద్దేశపూర్వకంగా వదిలేస్తోంది అనాలి; రాజకీయంగా సున్నితమైన కేసులో న్యాయపరమైన సహకారాన్ని దెబ్బతీస్తుంది. జస్టిస్ సుందరేష్ విచారణను ఆలస్యం చేయడమే కాదు – విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైలు శిక్షలో ఉన్న వ్యక్తిపై క్యాలెండర్‌ను ఆయుధంగా చేసుకుని, రాజ్యంతో కలిసి ఉల్లాసంగా నడుస్తున్నట్లుగా, శిక్ష రూపంగా ఆ జాప్యాన్ని కొనసాగించడాన్ని ఎంచుకున్నాడు.

నిందితుడు ఇప్పటికే ఏడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించినప్పుడు,  నాలుగు నెలల తర్వాత బెయిల్ విషయాన్ని విచారణకు నిర్ణయించడం న్యాయపరమైన నిర్బంధం కాదు. ఇది ప్రక్రియగా ముసుగు వేసుకున్న న్యాయపరమైన క్రూరత్వం.

అలా చేయడం ద్వారా, “మావోయిజం” అనే రాజకీయ కళంకాన్ని కలిగి ఉన్న కేసులను ఎదుర్కొన్నప్పుడు, ఉన్నత న్యాయవ్యవస్థ తన స్వంత పూర్వాపరాలను పక్కన పెట్టడానికి, తన స్వంత రాజ్యాంగ వాక్చాతుర్యాన్ని విస్మరించడానికి శాశ్వత నిర్బంధం కోసం రాజ్యం చేస్తున్న డిమాండ్‌కు తన మౌనాన్ని, మద్దతును ఇవ్వడానికి ఎలా సిద్ధంగా ఉందో జస్టిస్ సుందరేష్ బహిర్గతం చేశారు. అలా చేయడం ద్వారా, జస్టిస్ సుందరేష్ తన కోర్టు “శిక్షగా ప్రక్రియను” సహించడమే కాకుండా దానిని అమలు చేస్తుందని చూపించారు.

దిగ్భ్రాంతి చెందిన గాడ్లింగ్ న్యాయవాదులు మూడు రోజుల తర్వాత జస్టిస్ సుందరేష్ ముందు ముందస్తు తేదీకి సవరణ కోరుతూ జాబితా చేయని విషయాన్ని ప్రస్తావించారు. జూలై 18న ఉత్తర్వు జారీ అయింది కాబట్టి, పిటిషనర్ తేదీని ముందుకు తీసుకురావాలని అనుకుంటే అందుకోసం  లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని జస్టిస్ సుందరేష్ అన్నారు.

రెండు రోజుల తర్వాత దరఖాస్తు దాఖలు చేసారు. అది జాబితా అవుతుందని ఎదురుచూసారు; కానీ అవలేదు. ఆగస్టు ప్రారంభంలో ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించినప్పుడు, జస్టిస్ సుందరేష్ గాడ్లింగ్ న్యాయవాదిని రిజిస్ట్రీకి లేఖ దాఖలు చేయాలని చెప్పారు.

ఆగస్టు 8న, సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ఈసారి భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ ముందు ఈ కేసును ప్రస్తావించారు; ఆయన ఈ కేసును ఆగస్టు 11న జాబితా చేస్తామని హామీ ఇచ్చారు.

ఆగస్టు 11న జస్టిస్ సుందరేష్ కోర్టులో ఈ కేసు ప్రస్తావనకు వచ్చింది. ఆశ్చర్యకరంగా, గాడ్లింగ్ ఇప్పటికే చేపట్టిన బాధాకరమైన ప్రక్రియలను తగ్గించడానికి దగ్గరి తేదీని ఇచ్చి  ప్రధాన విషయాన్ని విచారిస్తామని అనడానికి బదులుగా, తేదీని ముందుకు తేవాలన్న దరఖాస్తును మొదట విచారిస్తామని జస్టిస్ సుందరేష్ ప్రకటించారు.

ముందస్తు విచారణ కోసం దరఖాస్తు ఇప్పుడు ఆగస్టు 26కి జాబితా చేసారు.

ఈ క్రూరమైన నమూనా గాడ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. భీమా కోరెగావ్ కేసులో సహ నిందితుడు, యువ పరిశోధకుడు మహేష్ రౌత్ బెయిల్ పిటిషన్‌ నెలల తరబడి సుప్రీంకోర్టులో ఇరుక్కుపోయింది. గాడ్లింగ్ పేరు లాగే అతని పేరు కూడా అంతులేని “జాబితా చేయబడవలసిన” సంకేతాలు, కారణం లేకుండా వాయిదాల నీడలో ఉంది. సహేతుకమైన ఆదేశం ద్వారా తిరస్కరించడం కాకుండా, మౌనం ద్వారా తిరస్కరించడం అనే కొత్త శిక్షా విధానంలో  కోర్టు పరిపూర్ణత సాధించినట్లు అనిపిస్తోంది.

గాడ్లింగ్ లాగా కాకుండా, రౌత్ ఇప్పటికే 2023 సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు నుండి బెయిల్ పొందాడు. అతనిపై ఉపా చట్టం కింద  ఆరోపణలు నిజమని నమ్మడానికి న్యాయమూర్తులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయినప్పటికీ, జాతీయ దర్యాప్తు సంస్థ అప్పీల్‌ చేస్తే సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును వెంటనే నిలిపివేసింది; – నేటికీ అలానే ఉన్నది. ఈ విషయం కూడా జస్టిస్ సుందరేష్ ధర్మాసనం ముందు ఉంది. గాడ్లింగ్ కేసు మాదిరిగానే అలవాటైన బద్ధకంతో ముందుకు సాగింది.

సెప్టెంబర్ 2020 నుండి కస్టడీలో ఉన్న మరో సహ నిందితురాలు జ్యోతి జగ్‌తప్ కేసు కూడా మెరుగుపడలేదు. ఆమె బెయిల్ పిటిషన్‌ను కూడా అదే బెంచ్ ముందు పూడ్చేసారు; తాకలేదు, అదే నత్త వేగంతో కొనసాగుతోంది.

నమూనా స్పష్టంగా ఉంది: రాజకీయ సున్నితత్వంతో కళంకం చెందిన కేసులు జస్టిస్ సుందరేష్ కోర్టులో దుమ్ము కొట్టుకుపోతాయి; నిందితులు జైలులో చనిపోతారు.

వ్యత్యాసాన్ని పరిగణించండి. ఆగస్టులో, జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం, వీధి కుక్కలపై సుమోటో  (స్వయంగా దాఖలైన) కేసులో, ఢిల్లీలో వీధి కుక్కల బెడదను పరిష్కరించాలనే నిజమైన ఉద్దేశ్యంతో ఒక ఆచరణాత్మకం కాని ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు తక్షణమే ఒక ఆగ్రహాన్ని ప్రేరేపించింది – మధ్యతరగతి వ్యతిరేకత, తీవ్రమైన ఆగ్రహం, స్వేచ్ఛ ను మరింత తీవ్రంగా కోల్పోయినప్పుడు కూడా ఎదురుచూడని పౌర ఆగ్రహానికి చెందిన మొత్తం రంగస్థలం తయారైంది.

కుక్కలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలతో ఉన్న వైరుధ్యాన్ని “పరిష్కరించడానికి”. కేవలం రెండు రోజుల్లోనే, భారత ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. వేగం ప్రశంసనీయం. కోర్టు వేగంతోనూ ఉద్దేశ్యంతోనూ వ్యవహరించింది, అది కోరుకున్నప్పుడు, రాత్రిపూట కూడా కదలగలదని చూపించింది. మానవులు విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నప్పుడు కూడా అదే అత్యవసరాన్ని చూపిస్తే!

చీఫ్ జస్టిస్ గవాయి, మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌గా, స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్‌లను విచారించడానికి శాశ్వత “మానవ హక్కుల బెంచ్”ను ఎందుకని ఏర్పాటు చేయలేరు? గాడ్లింగ్, రౌత్, జగ్‌తప్ కేసులను వినడానికి స్పష్టంగా ఆసక్తిని చూపించిన ఆయన జస్టిస్ సుందరేష్ నుండి వాటిని ఎందుకు ఉపసంహరించుకోలేరు? స్వయంగా ఎందుకు వినకూడదు? అన్నింటికంటే ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం నుండి ఎటువంటి రక్షణ కోరుకోనని ప్రకటించారు. అందుకని ఆ కోణంలో ఆయన జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఈ మూడు కేసుల్లో జస్టిస్ సుందరేష్ ప్రవర్తన ఔచిత్యం పైన భయంకరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. బాహ్య పరిగణనలు ఏమైనా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అలా అయితే, అతను చేయగలిగేది కనీసం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తికి తిరిగి ఇచ్చి ఆదేశాల కోసం పంపడమే. ఎటువంటి పురోగతి లేకుండా, అత్యవసరం అని అనుకోకుండా తానే కొనసాగడం, కుట్రపూరితమేమో అనే భావనను మాత్రమే బలపరుస్తుంది.

కుక్కల విధిని నిర్ణయించడానికి రాత్రిపూట బెంచ్‌ను ఏర్పాటు చేయగల కోర్టు, రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బెయిల్ పిటిషన్లను విచారించడానికి ఇష్టపడకపోవడం అనేది దాని స్వీయ నైతిక అధికారాన్ని దెబ్బతీస్తుంది. స్వేచ్ఛ చర్చలకు లోబడి ఉంటుందని, ఆ అత్యవసరం మీరు ఎవరు, మీపై ఏమి ఆరోపణలు ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుందని ఇది పౌరులకు తెలియచేస్తుంది. అది చట్ట నియమం కాదు – ఇది విచక్షణ నియమం, రాజ్యాంగ న్యాయనిర్ణేత కంటే ఖాప్ పంచాయితీ లాంటి కోర్టు.

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను అంత త్వరగా, స్వల్ప కారణాలకు కూడా ఉదారంగా వాయిదాలు వేస్తూ పోతుంటే, రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛ, గౌరవం, న్యాయ ప్రక్రియల వాగ్దానం ఆచరణలో శూన్యమైపోతుంది.

 2025 ఆగస్టు 23

సౌరవ్ దాస్ …చట్టం, న్యాయవ్యవస్థ, నేరం, పాలసీల మీరా రాస్తున్న పరిశోధక జర్నలిస్టు

https://frontline.thehindu.com/columns/supreme-court-surendra-gadling-judicial-apathy-bhima-koregaon/article69968264.ece

Leave a Reply