తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని వాళ్లెవరుంటారు? అలాంటి సందర్భం మరి.
ఎంత అద్భుత జీవితం! ఆయన చుట్టూ చేరి గభాల్న ఏదో ఒక మాట అనడం, రాయడం సాధ్యమయ్యేదేనా?
చనిపోయింది వ్యక్తిమాత్రుడు అయితే గుణగానం చేసి సర్ది చెప్పుకోవచ్చు
ఇది ముగింపు అయితే ఇంకేమీ లేదని నిరాశతో సరిపెట్టుకోవచ్చు.
మావోయిస్టుపార్టీ కేంద్ర కార్యదర్శి అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశ ప్రజలు గడించిన పోరాట అనుభవం. వాళ్ల ఆచరణలో నిగ్గుదేలిన జ్ఞానం. భవిష్యత్తులోకి విస్తరించే చారిత్రక సత్యం. మావోయిస్టు సేనానిగా, రాజకీయ మార్గదర్శిగా నంబళ్ల కేశవరావు లెక్కలేనంత మంది పోరాటకారులను తయారు చేశాడు. చరిత్ర ఒక దశలోంచి మరో దశలోకి మళ్లడానికి దేశాన్ని సమాయత్తం చేశాడు. భారతదేశాన్ని ప్రపంచ ప్రజల పోరాట చరిత్రలో అంతర్లీనం చేశాడు. మానవత చేరుకోవలసిన అత్యంత సహజమైన, అత్యున్నతమైన స్థాయిలోకి సమాజాన్ని ఎత్తిపట్టాడు.
దీని కోసం ఆయన ఈ దేశ ప్రజల పోరాటతత్వాన్ని అధ్యయనం చేశాడు. అద్భుతమైన యుద్ధశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. ఈ నేలకు, ఈ నైసర్గిక ప్రత్యేకతలకు తగిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని అట్టడుగు నుంచి నిర్మించాడు. భారతదేశపు ఆధునిక రాజ్య స్వభావాన్ని ఎరిగిన రాజకీయ సైనిక రణతంత్రాన్ని రచించాడు. అతి మామూలు ప్రజలే రాజకీయవేత్తలుగా, సైనికులుగా, సాంస్కృతిక యోధులుగా తయారుకాగల పంథాను వాస్తవం చేశాడు. రాజ్యం ఎంత అమానుషంగా తయారైనా, లోలోపలి నుంచి హింసాత్మకంగా పని చేస్తున్నా, విప్లవ రాజకీయాలు లేకుండా, విముక్తి సైన్యం లేకుండా ఉత్పత్తిదాయకమైన ప్రజలు తమదైన చారిత్రక ప్రపంచాన్ని గెలుచుకోలేరని తేల్చి చెప్పాడు.
నక్సల్బరీ వెనుకంజ తర్వాత తిరిగి ఊపిరి పోసుకున్న విప్లవ విద్యార్థి, యువజన, రైతాంగ ప్రజా పోరాటాలు కేశవరావును తీర్చిదిద్దాయి. ఆ తర్వాత తనలాంటి అనేక మందితో కలిసి ఆయన దేశవ్యాప్త విప్లవ నిర్మాణాన్ని సిద్ధం చేశాడు. విప్లవం చేయగల తెగువ, త్యాగం, చారిత్రక దృష్టితో ఈ దేశానికి సరిపోయే నిర్దిష్ట పంథాను తిరుగులేని విధంగా ఆచరణలో నిరూపించాడు. వేల ఏళ్లుగా ఈ దేశ ప్రజల అట్టడుగు ప్రజలు కంటున్న కల సాకారం కాగలదని భరోసా ఇచ్చాడు. దీర్ఘకాలిక ప్రజా యుద్ధంలో పుట్టి, దాన్ని సాంతం అర్థం చేసుకొని, ఆచరిస్తూ ప్రజా యుద్ధంలోనే నేలకొరిగాడు. విప్లవోద్యమ అగ్రనాయకుడిగా ఎర్ర సైనికుల మధ్య, కార్యకర్తల మధ్య, ప్రజల మధ్య చిరకాలం జీవించి అమరుడైన అరుదైన ఉదాహరణ ఆయన. బహుశా ప్రపంచ విప్లవోద్యమంలోనే ఈ కోణంలో కేశవరావు ప్రత్యేకమైన నమూనా.
ఒక ఇంటర్వ్యూలో ‘విప్లవ యుద్ధం ఆత్మరక్షణ స్థితి నుంచి దీర్ఘకాలిక ప్రజా యుద్ధంగా మారుతుంద’ని ఆయన అన్నాడు. మనలాంటి దేశాల్లో దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారానే విప్లవం విజయవంతమవుతుందనేగాక, అది మన దేశకాలాలకు తగినట్లు ఉంటుందని కూడా ఆయన అన్నాడు. మన సమాజపు అభివృద్ధి దశనుబట్టి, ప్రజల సాంస్కృతిక స్థాయినిబట్టి, వాళ్ల భాగస్వామ్యాన్నిబట్టి, రాజ్యం పని తీరునుబట్టి, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులనుబట్టి ప్రజా యుద్ధ ఆచరణ ఉంటుందని స్పష్టం చేశాడు.
ఆయన చాలా కాలంపాటు మావోయిస్టు సేనానిగా, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా భారత విప్లవోద్యమాన్ని నిలబెట్టడానికి , విస్తరింపచేయడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. 2018లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టేనాటికి దేశంలో ప్రజాయుద్ధానికి, ఫాసిస్టు కార్పొరేట్ యుద్ధానికి మధ్య సంఘర్షణ తీవ్రమైంది. ఇరవై ఒకటో శతాబ్దపు విప్లవోద్యమాల్లోనే మావోయిస్టు ఉద్యమం గణనీయమైన విజయాలతో, అనేక ఎదురుదెబ్బలతో సహా ముందంజ వేయడానికి పెనుగులాడుతున్న సమయం అది. రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక, నాగరికతా కోణాల్లో వందల వేల వైవిధ్యభరిత ప్రజా సమూహాల ఆకాంక్షలను గుర్తించి భిన్న పోరాట రూపాల్లో సమీకరించేందుకు సమాయత్తమైన కాలం కూడా అదే. ఈ దేశంలోని సకల ప్రత్యేకతలను గుర్తించి, ప్రజలను ప్రజాస్వామిక ఉద్యమాల్లోకీ, తద్వారా వర్గయుద్ధంలోకి సమీకరించడానికి సిద్ధమైన రోజులవి.
సాయుధ పోరాటాలకు, చట్టబద్ధ పోరాటాలకు మధ్య సమన్వయం సాధించడంలో మొదటి నుంచి విప్లవోద్యమానికి ఒక రకమైన మెలకువ ఉన్నది. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడ్డాక అంతక ముందటి రెండు విప్లవ పార్టీలకు ఈ విషయంలో ఉన్న అనుభవం అంతా కలిసి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక కొత్త పోరాటాలు ముందుకు వచ్చాయి. సమాజమంతా విప్లవం గురించి లోతైన ఎరుక కలిగింది. చైతన్యం, భావోద్వేగాలు, కఠోరమైన ఆచరణ, సునిశితమైన ఆలోచనలతో మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా బలమైన ఆకర్షణాశక్తిగా మారింది. విప్లవోద్యమంలోని చాలా సైద్ధాంతిక సమస్యలకు పరిష్కారం పోరాట రూపాల్లో ఉంటుంది. వర్గపోరాట దశ, తీవ్రత రాజకీయ సమీరణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మావోయిస్టు ఉద్యమం ఇలాంటి అనేక అనుకూలాంశాలను ప్రజాయుద్ధంగా అభివృద్ధి చేసింది.
‘ప్రజలపై ఆధారపడి చేసే యుద్ధంలో ఒక క్రమబద్ధత, నిర్దిష్టత, స్పష్టత, సంకల్పబలం, సమిష్టితత్వం, క్రమశిక్షణ, నైపుణ్యం, ఉన్నతమైన చైతన్యం కావాలి’ అని కేశవరావు పైన చెప్పిన ఇంటర్వ్యూలోనే అన్నాడు. వీటితోపాటు సాంకేతికత, శిక్షణ గురించి కూడా చెప్పాడు. విప్లవ రాజకీయాల వెలుగులో సాగే ప్రజాయుద్ధం నిరంతరం అభివృద్ధి కావాల్సి ఉంటుంది. దానికి ప్రజలను అనేక వైపుల నుంచి పెద్ద ఎత్తున సిద్ధం చేయాలి. ఆచరణలో ప్రజాపంథా అంటే అదే. ఈ మార్గంలో అత్యంత నిర్దిష్ట`సాధారణ అవగాహనలతో దేశాన్నంతా ముట్టుకుంటున్న మావోయిస్టు ఆచరణను చూసి కార్పొరేట్ శక్తులు ఆందోళన చెందాయి. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని సృజనాత్మకత, మిలిటెన్సీ తప్పక సైనిక రంగంలో కూడా ప్రతిఫలించింది. దీంతో ప్రజాయుద్ధం మీద కార్పొరేట్ యుద్ధం విరుచుకపడిరది. మావోయిస్టు ఉద్యమ నిర్మూలన కార్పొరేట్ల లక్ష్యమైంది. దీని కోసం లక్షల సైనిక బలగాలను విప్లవోద్యమ ప్రాంతాల్లో మోహరించారు. అత్యంత క్రూరమైన పద్ధతుల్లో అణచిత పద్ధతులు అనుసరిస్తున్నారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని కనీస ప్రజానుకూల విషయాలను కూడా కాలరాస్తున్నారు. ఇది ఇవాళ అంతర్యుద్ధ రూపాన్ని తీసుకున్నది. ఇందులో భాగంగా కేశవరావును కేంద్ర ప్రభుత్వం వెంటాడి హత్య చేసింది. విప్లవోద్యమంపట్ల భరోసాతో ఈ అమానుషాన్ని విమర్శించారు. కార్పొరేట్ యుద్ధాన్ని కేంద్రం చేసి ఈ హింసను ప్రశ్నించాలి. అప్పుడే దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం అర్థమవుతుంది.
ఇందులో సాధారణ ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. పైగా పెద్ద ఎత్తున చుట్టుముట్టి హత్యాకాండకు పాల్పడుతున్నది. బసవరాజును హత్య చేసి శాంతి, పురోగతి సాధిండంలో ముందుకు వెళుతున్నామని ప్రధాని అన్నాడు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాంతి కావాలని విప్లవకారులు కోరుకున్నారు. మావోయిస్టు నిర్మూలనతోనే శాంతి స్థాపన జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. యుద్ధానికే కాదు, శాంతికి కూడా వర్గ దృక్పథం ఉంటుందనడానికి ఇంతకంటే ఏం కావాలి? కేశవరావు హత్య దు:ఖకరమేగాని, నిరాశాపూరితం కాదు. కమ్యూనిస్టు జీవితం, మరణం ప్రజల మధ్యే అని ఆయన మరోసారి ఉత్తేజకరంగా నిరూపించాడు. యాభై ఏళ్ల జీవితాన్ని దీర్ఘకాలిక ప్రజా యుద్ధానికి ధారపోశాడు. శతృవు ఆయన జీవితాన్ని తుడిచేశాడుగాని, విప్లవం విజయవంతమయ్యే దాకా ఆయన తిరుగులేని సందేశాన్ని ఇచ్చి వెళ్లాడు. ఇది కేవలం ఆశావాదం కాదు. సమర్థనావాదం కాదు. విప్లవోద్యమ గత`వర్తమానాల్లో నిరూపణ అయిన సత్యం. ఒకప్పటి కంటే విప్లవ అవకాశాలు ఉధృతమైన తరుణంలో భవిష్యత్‌లోనూ నిగ్గుదేలే వాస్తవం.
చదవాల్సిన విశ్లేషణ
Please subscribe me for Vasantha Meghan.com