ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్య నుండి, నోయిడా, గ్రేటర్ నోయిడా అంతటా పారిశ్రామిక, గృహ కార్మికులు పదివేల సంఖ్యలో స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాన్ని కనీసం ₹20,000 కు పెంచి సమయానికి చెల్లించడం, వారాంతపు సెలవులతో కూడిన 8 గంటల పని దినం, అదనపు పని గంటలకు (ఓవర్‌టైమ్) రెట్టింపు వేతనం, భద్రత, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయడం మొదలైనవి వారి ప్రధాన డిమాండ్లు.
సమ్మె చేసినందుకు వెయ్యి మందికి పైగా కార్మికులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు; వందలాది మందిపైన ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేసి అరెస్టు చేసారు. ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలు, పెట్టుబడిదారీ శక్తుల ముందు కార్మిక వర్గ అస్థిరతను మరింత తీవ్రతరం చేశాయి; ఈ కార్మికులలో అత్యధికులు నోయిడాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు1. ఉద్యోగులను తమ ఇష్టానుసారం తొలగించే అధికారాన్ని ఈ చట్టాలు ఫ్యాక్టరీ యజమానులకు ఇస్తాయి; నిరసన తెలపడానికి చాలా ముందుగా నోటీసు ఇచ్చి ముందస్తు అనుమతి తీసుకోకపోతే, ఆ నిరసనలను నేరంగా పరిగణిస్తారు; దీనికి తోడు ఎల్‌పిజి ధరలు కిలోగ్రాముకు ₹350-500 లేదా అంతకంటే ఎక్కువగా పెరగడం; హర్యానా ప్రభుత్వం కార్మికుల సమ్మెల తర్వాత కనీస వేతనాన్ని 35% పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ విస్తృత సమ్మెలకు ప్రేరేపక అంశాలుగా మారాయి.
మజ్దూర్ బిగుల్‌తోసహా వివిధ కార్మిక సంఘాలు, సంస్థల కార్యకర్తలను కూడా ఈ సమ్మెలలో అరెస్టు చేశారు2. ఈ నిరసనల్లో అదుపులోకి తీసుకున్న లేదా అరెస్టు చేసిన కార్మికులందరినీ, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భారత దేశం తనను తాను ప్రజాస్వామ్య దేశంగా పిలుచుకుంటే, అది కేవలం పాలక వర్గాల కోసం మాత్రమే కాకుండా ప్రజలందరి కోసం పనిచేయాలి; ఆ విధంగానే ప్రవర్తించాలి.
ఏప్రిల్ 13 నాటికి ఈ సమ్మెలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వందలాది మంది కార్మికులు ఫ్యాక్టరీల్లోకి చొచ్చుకెళ్లారు; నోయిడాలోని మదర్సన్ ప్లాంట్‌లో సీనియర్ సిబ్బందిని లోపల బంధించి, తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనేక ప్రాంతాల్లో ఫ్యాక్టరీ యజమానులకు, యాజమాన్యానికి చెందిన వాహనాలను తగులబెట్టారు; కార్ల అద్దాలను ధ్వంసం చేసారు; ఫ్యాక్టరీ ఆస్తులను ధ్వంసం చేసారు; తగులబెట్టారు. విపుల్ మోటార్స్ సర్వీస్ సెంటర్‌లో దాదాపు 20-25 వాహనాల అద్దాలు, ఫ్రేములు ధ్వంసమయ్యాయి. రోడ్లను దిగ్బంధించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది; దీనివల్ల పోలీసులతో ఘర్షణలు జరిగాయి.
ప్రభుత్వం దీనికి స్పందిస్తూ ఎనిమిది కంపెనీల పిఎసి, ఆర్‌ఎఎఫ్ బలగాలను మోహరించింది; మదర్సన్ ప్లాంట్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను మోహరించారు. సమ్మె చేస్తున్న కార్మికులపైన, మహిళలపైన కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు; బాష్పవాయువు ప్రయోగించారు, రోడ్లను ఖాళీ చేయించడానికి బారికేడ్లను ఉపయోగించారు3. బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టుశక్తులు, వారికి వత్తాసు పలికే మీడియా, ఈ సమ్మెలను పాకిస్తాన్ ప్రేరేపించిందనే అర్థం లేని కుట్ర సిద్ధాంతాలను అల్లడం ప్రారంభించాయి. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది ‘నక్సలిజాన్ని పునరుజ్జీవింపజేసే’4 ప్రయత్నం అని అన్నాడు. అసలు చనిపోని దానిని ‘పునరుజ్జీవింపజేయడం’ ఎలా సాధ్యం? అని మేం ప్రశ్నిస్తున్నాం.
ఈ పరిణామాల మధ్యనే మజ్దూర్ బిగుల్ “సమ్మె ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి శాంతియుతంగా ఏకం కండి, కార్మిక ఉద్యమంపైనా, ఉద్యమ కార్యకర్తలపైనా ‘నక్సలిజం’, ‘ఉగ్రవాదం’ అనే తప్పుడు ఆరోపణలు చేయడానికి యోగి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకండి!” అనే పేరుతో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన మొదటి నుండీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది: సమ్మెలను శాంతియుతంగా, చట్టబద్ధంగా, కేవలం ఆర్థిక డిమాండ్లకే పరిమితం చేయాలనుకునే ‘కార్మిక కార్యకర్తకు’ (భవిష్యత్తులో ట్రేడ్ యూనియన్ అధికారి కావాలనుకునే వ్యక్తికి); దోపిడీకి, అవమానానికి గురై కసితో ఉన్న ‘శ్రామిక రాశికి’ మధ్య ఉన్న భారీ సామాజిక అగాధాన్ని ఇది చూపిస్తోంది.
మనుగడ సాగించలేని స్థితికి చేరుకున్నాక, కార్మికులు తమకు దగ్గరగా ఉన్న అధికార కేంద్రాలపైన మొదటి దెబ్బ తీస్తారు: ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవడం, యంత్రాలను తగులబెట్టడం, కార్లను ధ్వంసం చేయడం వంటివి చేస్తారు; సహజంగానే, పోలీసులు తాము చేపట్టిన చర్యలకు తగిన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. చట్టబద్ధతే తమ పోరాటానికి గమ్యంగా భావించే, రాజ్యానికి కలిగించే ఆర్థిక ఆటంకం ఒక్కటే కార్మిక ఉద్యమానికి సరిపోతుందని నమ్మే; ప్రభుత్వం ప్రభుత్వంలా ప్రవర్తిస్తున్నందుకు దానిని ఒక ప్రత్యేకమైన తీవ్రతతో విమర్శించే ‘బిగులైట్’ల కంటే, ఫ్యాక్టరీ యజమాని లేదా ప్రభుత్వం నుండి అనుమతి కోసం వేచి చూడకుండా, వర్గ సమాజం వల్ల కలిగే రోజువారీ ఒత్తిడి నుండి పుట్టిన సహజ ప్రవృత్తితో సమ్మె చేసే అసంఘటిత కార్మికులకు మరింత చొరవ, స్పష్టత ఉంటుంది.
“మనం మన ఉద్యమాన్ని క్రమశిక్షణతో, వ్యవస్థీకృత పద్ధతిలో నడపాలి. యజమానులను- యాజమాన్యాన్ని నిజంగా ఇబ్బంది పెట్టే అంశం – సమ్మె. ఎందుకంటే సమ్మె అంటే – పని ఆగిపోవడం; వారి దోపిడీ చక్రం నిలిచిపోవడం. ఇది తప్ప వారికి మరేదీ పట్టదు. మన సమ్మె విజయవంతంగా కొనసాగాలంటే, మనం ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు లోనుకాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పూర్తిగా శాంతియుత పద్ధతిలో నిరసనలను, ప్రదర్శనలను నిర్వహించడం చాలా అవసరం.”6
ప్రస్తుత ఉద్యమం నిజంగానే అసంఘటితమైనదని—అంటే ఆకస్మికంగా తలెత్తిందని—ప్రభుత్వం దీనిని అణచివేయడానికి తీవ్ర ఆసక్తితో ఉందనే రెండు విషయాలను వారు చేసిన ఈ ప్రకటన అంగీకరిస్తోంది. అంతేకాకుండా, సమ్మెలు “అరాచకం” స్థాయికి ముదిరేంత వరకు వేచి ఉండి, ఆ తర్వాతే అణచివేతను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంటోంది.
ఈ సమ్మెను దేశవ్యాప్త కార్మిక నిరసనగా మార్చడానికి ఈ ముందస్తు షరతు స్వయంగానే ఉల్లంఘించరానిదని బిగుల్ అభిప్రాయపడుతోంది. అంటే “హింసాత్మక విప్లవం లేదా చట్టవిరుద్ధమైన పద్ధతుల కంటే చట్టబద్ధమైన మార్గాల ద్వారానే సోషల్ డెమోక్రసీ మెరుగ్గా వర్ధిల్లుతుంది” అని, “పార్టీ తదుపరి పని ఓట్లను నిరంతరం పెంచుకోవడానికి కృషి చేయడం లేదా పార్లమెంటరీ కార్యకలాపాల ద్వారా నెమ్మదిగా ప్రచారం సాగించడం”7 అనే బెర్న్‌స్టెయిన్ తరహా పాత, కుళ్ళిన ట్రేడ్ యూనియన్ తర్కం నుండి ఇది వచ్చింది. ఒకవేళ కార్మిక వర్గంలో ఒక విభాగం ఈ శాంతియుత ధోరణిని ధిక్కరించాలని ఎంచుకుంటే, వారు దానిని వెలుపలి వ్యక్తులు చేసిన విధ్వంసంగా లేదా ఎవరో రెచ్చగొట్టే గూఢచారి (ఏజెంట్ ప్రొవోకేటర్) చేసిన పనిగానో ముద్ర వేస్తారు — ఇది సరిగ్గా వత్తాసు పలికే వార్తా సంస్థలు, ఫాసిస్ట్ రాజకీయ నాయకులు అనుసరించే తర్కం లాంటిదే.
అంతేకాకుండా, వారు “శాంతియుత సమ్మె”ను కేవలం ఒక లక్షణంగా కాకుండా, ఒక నిబంధనగా నొక్కి చెబుతున్నారు: “ఇది కార్మికులకు-యజమానులకు-యాజమాన్యానికి మధ్య ఉన్న విషయం. పోలీసులు రెచ్చగొట్టడం వల్ల అల్లరి మూకలు ఏదైనా తప్పుడు చర్యకు పాల్పడితే తప్ప, ఈ కార్మిక వివాదంలో పోలీసులకు ఎటువంటి పాత్ర లేదు. పోలీసులు లేకుండా, యజమానులు-యాజమాన్యం చివరికి మీ డిమాండ్లను వినడానికి విధిగా అంగీకరిస్తారు.”
మజ్దూర్ బిగుల్ ఇంత అమాయకత్వంతో దీన్ని నమ్ముతుందని మేము అనుకోవడం లేదు. అయితే భారత దేశ వర్గ స్వభావాన్ని అర్థం చేసుకునే స్థాయి సామాన్య ప్రజానీకానికి లేదని అది భావిస్తుండాలి, లేదా తన పిరికితనాన్ని సమర్థించుకోవడానికి వారిని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నమైనా చేస్తూండాలి.
ఇక్కడ భారత రాజ్యాన్ని ఫ్యాక్టరీ యజమానులైన పాలకవర్గం నుండి వేరుగా ఉన్న ఒక తటస్థ సంస్థగానూ, పోలీసులు ఈ వర్గ పాలనలో భాగం కానట్లుగానూ చిత్రీకరిస్తున్నారు. ఇది అణచివేతను నివారించడానికో లేదా ఐక్యతను కాపాడటానికో ఇచ్చిన ఒక ఎత్తుగడ సూచన కాదు; ఇది కార్మిక ఉద్యమం సరైన మార్గంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన ఒక సాధారణ సూత్రంగా — ఒక వ్యూహాత్మక నిర్దేశంగా చెబుతున్నారు. ఫలితంగా, ఇది రాజ్య తర్కాన్ని ప్రతిబింబిస్తూ, చట్టబద్ధమైనవిగా భావించే పోరాట రూపాల చుట్టూ ఒక నిర్ణాయక సరిహద్దును ఏర్పరుస్తుంది.
కమ్యూనిస్టుల పోరాట రూపాలకు సంబంధించిన లెనినిస్ట్ అవగాహన నిజానికి ఆ క్షణంలోని వాస్తవ పరిస్థితిని వివరంగా పరిశీలించడంపైన ఆధారపడి ఉంటుంది —వారు ఎల్లప్పుడూ దాని వెనుక దాక్కోని; ఏదైనా సవరణను “ఆ సమయానికి అనుగుణంగా తీసుకున్న ఎత్తుగడ”గా వర్ణించవచ్చు — కానీ లెనినిజం ఎక్కడా కూడా చట్టబద్ధతకు, శాంతివాదానికి అటువంటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆపాదించలేదు.
వారు ఎక్కడా శ్రామిక వర్గ అంతిమ లక్ష్యం గురించి ప్రస్తావించలేదు. ఇటువంటి వాదనల గురించి ఏంగెల్స్ ఇలా పేర్కొన్నారు: “క్షణిక ప్రయోజనాల కోసం గొప్పవైన, ప్రధానమైన విషయాలను మరచిపోవడం; తదుపరి పరిణామాలతో సంబంధం లేకుండా తక్షణ విజయం కోసం పోరాడటం; ఉద్యమ భవిష్యత్తును వర్తమానం కోసం త్యాగం చేయడం ‘నిజాయితీ’గా అనిపించవచ్చు, కానీ అది ఎప్పటికీ ‘అవకాశవాదం’గానే మిగిలిపోతుంది; ఈ ‘నిజాయితీ గల’ అవకాశవాదం బహుశా అన్నింటికంటే ప్రమాదకరమైనది!”8. దీనికి విరుద్ధంగా, బోల్షెవిక్ కమ్యూనిస్టులకు, సమ్మెలు అనేవి ఒక ‘యుద్ధ పాఠశాల’. వీటిని వర్గ స్పృహతో నడిపించినప్పుడు, శత్రువు ఎవరు? తమ దోపిడీకి ఏ వర్గం బాధ్యత వహిస్తుంది? అనే విషయం కార్మికులకు సామూహికంగా అర్థమవుతుంది.
కార్మికుడికి చట్టాలు తెలియవు; ప్రభుత్వ అధికారులతో, ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారితో అతనికి ఎటువంటి సంబంధం ఉండదు; దీనివల్ల అతను తరచుగా అవన్నీ (ప్రభుత్వ ప్రచారాన్ని) నమ్ముతుంటాడు. అప్పుడే ఒక సమ్మె మొదలవుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, పోలీసులు, తరచుగా సాయుధ బలగాలు ఫ్యాక్టరీ దగ్గర ప్రత్యక్షమవుతాయి.
అప్పుడు కార్మికులకు తాము చట్టాన్ని ఉల్లంఘించామని తెలుస్తుంది: యజమానులు సమావేశమై, కార్మికుల వేతనాలను ఎలా తగ్గించాలో బహిరంగంగా చర్చించడానికి చట్టం అనుమతిస్తుంది; కానీ కార్మికులు ఉమ్మడి ఒప్పందానికి వస్తే మాత్రం వారిని నేరస్థులుగా ప్రకటిస్తారు!
చట్టాలు కేవలం ధనికుల ప్రయోజనాల కోసమే ఉన్నాయని; ప్రభుత్వ అధికారులు ఆ ప్రయోజనాలనే కాపాడుతారని; శ్రామిక ప్రజల నోళ్లు నొక్కేస్తున్నారని; తమ అవసరాలను తెలియజేయడానికి అనుమతించడం లేదని కార్మికులు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. తన కోసం సమ్మె చేసే హక్కును, కార్మిక పత్రికలను ప్రచురించే హక్కును, చట్టాలను రూపొందించే, వాటి అమలును పర్యవేక్షించే జాతీయ అసెంబ్లీలో పాల్గొనే హక్కును పోరాడి సాధించుకోవాలని కార్మిక వర్గం గ్రహిస్తుంది… ప్రతి సమ్మె ప్రభుత్వం తమ శత్రువనే అవగాహనను కార్మికులలో బలోపేతం చేస్తుంది; ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపైన పోరాడటానికి కార్మిక వర్గం తనను తాను సిద్ధం చేసుకోవాలని నేర్పిస్తుంది.
అందువల్ల, సమ్మెలు కార్మికులకు ఐక్యంగా ఉండడాన్ని నేర్పిస్తాయి; తాము ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడగలమని చూపిస్తాయి; ఫ్యాక్టరీ యజమానుల వర్గానికి, నిరంకుశ పోలీసు, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా యావత్ కార్మికవర్గం చేసే పోరాటం గురించి ఆలోచించడాన్ని సమ్మెలు కార్మికులకు నేర్పిస్తాయి. ఈ కారణంగానే సోషలిస్టులు సమ్మెలను “యుద్ధ పాఠశాల” అని పిలుస్తారు; ప్రభుత్వ అధికారుల పెత్తనం నుండి, అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ బంధనాల నుండి యావత్ ప్రజల, శ్రమించే వారందరి విముక్తి కోసం తమ శత్రువులపై యుద్ధం చేయడం కార్మికులు నేర్చుకునే పాఠశాల అది. – వి ఐ లెనిన్9
అయితే, పరిశ్రమలను స్తంభింపజేసే భారీ సమ్మె కూడా దానంతటదే కార్మికులకు రాజకీయ అధికారాన్ని తెచ్చిపెట్టదు; పైగా, పెట్టుబడీదారీ వ్యవస్థలో సమ్మెలు అనేవి సహజంగా, పునరావృతమయ్యే ప్రక్రియలు మాత్రమే.
పాలకవర్గం కేవలం ఉత్పత్తి కొనసాగడంపైనే ఆధారపడదు — అది ప్రభుత్వం, దాని యంత్రాంగం, సైన్యం, పోలీసులు, బ్యాంకులు, తనకూ సామాన్య ప్రజలకూ మధ్య వారధిగా పనిచేసే మొత్తం వ్యవస్థపైన నియంత్రణను కలిగి ఉంటుంది.
సమ్మెలు అనేవి ‘యుద్ధ పాఠశాల’ మాత్రమే; అవే యుద్ధం కాదు. ప్రభుత్వ అధికారం కార్మికుల చేతుల్లో లేనంత కాలం, పెట్టుబడిదారీ వర్గం నష్టాలను భరించగలదు; వారు ‘రిజర్వ్ లేబర్’ (అదనపు కార్మికులు) పై ఆధారపడగలరు, ఉత్పత్తిని వేరే చోటికి మార్చగలరు, వస్తువులను దిగుమతి చేసుకోవచ్చు లేదా సమ్మెలు ముగిసే వరకు వేచి చూడగలరు.
మరీ ముఖ్యంగా, అణచివేతను ప్రారంభించడానికి ప్రభుత్వానికి కార్మికుల నుండి ఎటువంటి ‘ప్రేరేపణ’ అవసరం లేదు. మన గాంధేయవాద ట్రేడ్ యూనియన్ నాయకుల కంటే ప్రభుత్వానికి తన చట్టాలు, రాజ్యాంగంపైన తక్కువ గౌరవం ఉంటుంది; అణచివేతకు ఏదైనా సాకు కావాలంటే అది అబద్ధాలను కూడా సృష్టించగలదు; ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు అలా చేసింది కూడా.
‘మజ్దూర్ బిగుల్’ చేసిన ప్రకటన, డ్యూరింగ్‌ను ఏంగెల్స్ ఎగతాళిగా విమర్శించిన దానికంటే దారుణంగా ఉంది: “దోపిడీ ఆర్థిక వ్యవస్థను కూలదోయడానికి బహుశా హింస/బలం అవసరం కావచ్చు అనే అవకాశాన్ని అతను కేవలం నిట్టూర్పులు, మూలుగులతో మాత్రమే అంగీకరిస్తాడు — దురదృష్టవశాత్తు, ఎందుకంటే బలప్రయోగం చేసే ఎవరినైనా అది నైతికంగా దిగజార్చుతుంది. ప్రతి విజయవంతమైన విప్లవం అందించిన అపారమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రేరణ ఉన్నప్పటికీ ఇది జరుగుతుంది!”10 — మజ్దూర్ బిగుల్ అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా బలప్రయోగం అవసరం కావచ్చు అనే విషయాన్ని కూడా అంగీకరించదు; ఎందుకంటే వారి దృష్టిలో అది ‘నక్సలిజం’.
- అనువాదం : కె. పద్మ
ఫుట్ నోట్స్:
Excerpted from ‘May Day and the Struggle on the Ideological Field’.
<https://nazariyamagazine.wordpress.com/2026/05/01/may-day-2026/#ref-mzdbglstmnt>
1 T. K. Rajalakshmi. What noida’s worker strikes tell us about the labour codes’ broken promise. Frontline.
2 Noida workers’ protest: Lawyers, activists allege ’witchhunt’ by UP police, illegal detentions, false narratives. The Wire.
3 Noida protest highlights. India Today.
4 Was noida workers’ protest hijacked? The Times of India.
5 Mazdoor bigul statement dated 13 april.
6 Ibid.
7 Eduard Bernstein. Evolutionary socialism. (1899).
8 Friedrich Engels. Critique of the draft of the Erfurt programme. (1891).
9 V. I. Lenin. On strikes. Rabochaya Gazeta. (1899).
10 Friedrich Engels. Anti-dühring, part II: Political economy, IV. Theory of force. (1877).




