ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు.
ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది; మోదీ అనుచరులు కాశీ, మధుర, సంభాల్ తదితర దేవాలయాల నిర్మాణానికి ప్రణాళికలు వేయడం ప్రారంభించారు.
రాముడి నుండి ప్రేరణ పొందాలని పిలుపునిస్తూ, ముస్లిం రాజులు కలిగించిన గాయాలను ప్రస్తావిస్తూ, ఇది మనలో ఆత్మన్యూనతా భావాన్ని, శాశ్వత వలసవాద మనస్తత్వాన్ని సృష్టించిన లార్డ్ మెకాలే స్థాపించిన విద్యా వ్యవస్థ గురించి కూడా ప్రధానమంత్రి చర్చించాడు.
దేవాలయాల నిర్మాణం ద్వారా శతాబ్దాల నాటి గాయాల బాధ తగ్గిందని ఆయన చెబుతున్నప్పటికీ, మరోవైపు భారతదేశ సామాజిక, ఆర్థిక సూచికలు వేగంగా క్షీణిస్తున్నాయి. అంతేకాక, ప్రపంచ స్థాయిలో మతపరమైన, భావవ్యక్తీకరణ, పత్రికా స్వేచ్ఛతో సహా ఇతర కొలమానాలలో భారతదేశ స్థానం మరింత దిగజారుతోంది.
సుమారు అదే సమయంలో, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి అనుచరులు డిసెంబర్ 6వ తేదీన శౌర్య దినోత్సవం జరుపుకోవడం గురించి చర్చించుకుంటున్నారు. సంఘ్ పరివార్ బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు అది. ఈ రోజును మోదీకి చెందిన విశ్వ హిందూ పరిషత్ సహచరులు శౌర్య దివస్‌గా జరుపుకుంటారు. వారి దృష్టిలో, బాబర్ ఆలయాన్ని పడగొట్టి, ఆ స్థలంలో మసీదును నిర్మించాడనే ‘కల్పిత కథనం’ హిందువులకు ఒక గాయం వంటిది.
ఈ కథనం సుప్రీంకోర్టు తన తీర్పులో సరైంది కాదని చెప్పింది, భారత పురావస్తు సర్వే పరిశోధనల వాస్తవ విశ్లేషణ నుండి కూడా ఈ నిర్ధారణకు రాలేము.
రామలల్లా విగ్రహాలను బాబ్రీ మసీదులో ఉంచడం ఒక నేరం అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. డిసెంబర్ 23-24 అర్ధరాత్రి వేళ శ్రీరాముడు మసీదులో ప్రత్యక్షమయ్యారని చూపించే ఒక వీడియోను విహెచ్పి/ ఆర్ఎస్ఎస్ కోర్టుకు సమర్పించాయి.
ప్రఖ్యాత డాక్యుమెంటరీ చిత్రం ‘రామ్ కే నామ్’లో, ఆనంద్ పట్వర్ధన్ మహంత్ రామ్ శరణ్ దాస్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో దాస్, తాను మరికొంత మందితో కలిసి అక్కడ విగ్రహాన్ని ఉంచినట్లు, తరువాత అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైనట్లు చెప్పారు. ఆయన ప్రకారం, విగ్రహాలను ఉంచడానికి అత్యంత పెద్ద సహాయం అందించింది జిల్లా మేజిస్ట్రేట్ కే.కే. నాయర్; ఈయన తరువాత బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ నుండి ఎంపీ అయ్యారు.
మసీదు కూల్చివేతకు సంబంధం ఉన్న వారందరూ దోషులేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. వీరిలో దేశ విభజనకు నాయకత్వం వహించిన లాల్ కృష్ణ అద్వానీ, ఎం.ఎం. జోషి, ఉమా భారతి కూడా ఉన్నారు. వీరికి శిక్ష పడలేదు. అద్వానీ రథయాత్ర సాగిన మార్గమంతా ముస్లిం వ్యతిరేక హింస జరిగింది. మసీదు కూల్చివేసిన తరువాత, దేశంలోని అనేక ప్రాంతాలలో మళ్లీ తీవ్రమైన మైనారిటీ వ్యతిరేక హింస జరిగింది; దీని భయంకరమైన రూపాన్ని ముంబై, సూరత్, భోపాల్‌లో చూసాం.
హింసా, దాని ఫలితంగా జరిగిన రెండు విశ్వాసాల విభజన ద్వారా బీజేపీకి అపూర్వమైన ఎన్నికల లాభం చేకూరింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో కేంద్రంలో దాని ప్రభుత్వం ఏర్పడింది. తరువాత, పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనంతరం, ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు), అభివృద్ధి, విదేశాల నుండి నల్లధనం తిరిగి తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి రూ. 15 లక్షలు పంపిణీ చేయడం; ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానాలతో మోదీ అధికారంలోకి వచ్చాడు.
ఆ వాగ్దానాలన్నీ కేవలం మాటల గారడీ అని మోదీ సైన్యంలో ఉపసేనాపతి అయిన అమిత్ షా స్వయంగా అంగీకరించాడు. దేశంలోని సామాన్య ప్రజలు భయంకరమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నారు; ఉచితంగా లభించే 5 కిలోల రేషన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రభుత్వ కీర్తిని గానం చేసే మీడియా విస్తృతంగా ప్రచారం చేసిన – సంఘ్ పరివార్ సృష్టించిన కథనం – సమాజంలో ఒక పెద్దదైన, విభిన్న వర్గాన్ని లోతుగా ప్రభావితం చేసినందుకు ప్రధానమంత్రి సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మోదీ భారతదేశంలో రామరాజ్యం ప్రారంభమైందని చెప్పవచ్చు.
మోదీ రాజకీయం ప్రధానంగా మాటల గారడీ. భగవాన్ రాముడిని వేర్వేరు వ్యక్తులు తమ తమ దృక్కోణాల నుండి చూశారు. కబీర్ ఆయనను అణువణువునా వ్యాపించిన ఒక భావంగా పరిగణించారు.
ఇరవయ్యవ శతాబ్దపు గొప్ప హిందూ అయిన మహాత్మా గాంధీ 1929లో ఇలా అన్నారు, “రామరాజ్యం అంటే నా ఉద్దేశ్యం హిందూ రాజ్యం కాదు, దైవిక రాజ్యం, దేవుని రాజ్యం… నాకు రామ్- రహీమ్ ఇద్దరూ సమానమే. సత్యం, సదాచారాలను తప్ప మరే దేవుడిని అంగీకరించను… రామరాజ్యపు ప్రాచీన ఆదర్శం నిస్సందేహంగా నిజమైన ప్రజాస్వామ్యం, దీనిలో అత్యంత నిస్సహాయ పౌరుడు కూడా సుదీర్ఘమైన; ఖరీదైన ప్రక్రియ లేకుండా త్వరగా న్యాయం పొందవచ్చు.”
మోదీ రామరాజ్యం, రహీం అనుచరుల పట్ల ద్వేషంపై ఆధారపడింది. అది న్యాయ భావనకు వ్యతిరేకం. అయోధ్య కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ‘ప్రజా విశ్వాసం’పై ఆధారపడింది, బాబ్రీ మసీదు ఉన్న చోటే శ్రీరాముడు జన్మించాడనే విపరీతమైన ప్రచారం ద్వారా ఈ విశ్వాసాన్ని సృష్టించారు. 1885లో తన తీర్పులో ఆ స్థలం సున్నీ వక్ఫ్ బోర్డు ఆస్తి అని కోర్టు చెప్పినప్పటికీ ఇది జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన అయోధ్య కేసు తీర్పు, బాబ్రీ మసీదును రామమందిరాన్ని కూల్చివేసి నిర్మించారనడానికి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి, చట్టంపైన కాకుండా దేవుడు కలలో తనకు ఇచ్చిన ఆదేశాలపైన ఆధారపడింది.
మన దేశం ఒక లౌకిక రాజ్యం. మతపరమైన కార్యకలాపాలను మత గురువులకు వదిలివేయాలి. కానీ మన జీవసంబంధం లేని ప్రధానమంత్రి పాలకుడు; పూజారి కూడా. ఆయన యోగి; ప్రభుత్వం కూడా. ఈ సందర్భంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ ఆలయాన్ని భారత రాష్ట్రపతిగా కాకుండా తన వ్యక్తిగత హోదాలో ప్రారంభించారని పునరుద్ఘాటించడం సముచితంగా ఉంటుంది.
మహాత్మా గాంధీ శిష్యుడైన నెహ్రూ, భాక్రా-నంగల్ ఆనకట్టను ప్రారంభిస్తూ “ఆలయం” అనే పదానికి పునర్నిర్వచనం ఇచ్చారు. ఆనకట్టలు ఆధునిక భారతదేశ దేవాలయాలని ఆయన అన్నారు. కానీ మన నేటి పాలకులకు, దేవాలయాల నిర్మాణం ఒక జాతీయ ప్రాజెక్టుగా మారింది. మనం ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకకూడదని ఆర్ఎస్ఎస్ అధిపతి చెప్పినప్పటికీ, సరిగ్గా అదే పని నిరాటంకంగా కొనసాగుతోంది.
శతాబ్దాలుగా అట్టడుగున ఉన్న వర్గాలకు న్యాయం చేయాల్సిన పని అసంపూర్ణంగా ఉంది. భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని స్థాపించే మార్గంలో నడవాలని నిర్దేశించే రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలకులు బలహీనపరచాలని చూస్తున్నారు.
2025 డిసెంబర్ 6
హిందీ: అమరీశ్ హర్దేనియా
తెలుగు: పద్మ కొండిపర్తి
(రచయిత ఐఐటీ బాంబేలో బోధించారు; సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజంకు చైర్పర్సన్.)




