నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా తేదీ 18 న టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో చాకలి కులస్థులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి మొదలగు వారు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారు. రెండు నెలల పసిపాపను కాళ్ళతో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డ పాప 21 వ తేదీన చనిపోయింది. రెడ్లు చేసిన ఈ క్రూరమైన దాడిని మానవత్వం కలవారందరూ ఖండించాలి. హంతకుల పై మర్డర్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేయాలి. రాష్ట ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచి తగు రక్షణను, ఒక కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందించాల్సిందిగా, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా, హంతకులను శిక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, దాడులకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచాల్సిందిగానూ పోరాడాలి.
దాడికి మూలాలు:
చాకలి కులస్థుల పై ఈ దాడి జరిగిన కుమ్మెర గట్టు స్థలంలో ప్రతి సంవత్సరం మల్లన్న స్వామి జాతర పది రోజుల పాటు జరుగుతుంది.ప్రతి రోజు పది వేల మంది జాతర ముగిసే నాటికి లక్ష మంది భక్తులు పాల్గొంటారు.ఇక్కడి పనులన్నీ క్రింది కులాల ప్రజలు చేస్తుండగా సామాజిక,రాజకీయ పెత్తనం, ఆర్ధిక దోపిడి మాత్రం రెడ్డి కులస్థులది.భక్తులు తమ విశ్వాసాల ప్రకారం పూజాదికాలలో వాడే అగరుబత్తులు,కొబ్బరి కాయల వ్యాపారంతో పాటు చిరు వ్యాపారస్తులకు షెల్టర్లు, తాగు నీరు, మూత్ర శాలలు, మరుగు దొడ్డి వసతుల ఏర్పాటు పేరిట జరిగే దందాలో రెడ్లు డబ్బుల వసూళ్లకు పాల్పడుతుంటారు.టెండరు పేరుతో గ్రామ పంచాయతీ నిధి క్రింద కొంత డబ్బు జమచేస్తూ భక్తులు చిరు వ్యాపారస్థుల వద్ద బలవంతంగా వసూలు చేస్తుంటారు.రాజకీయ నాయకుల,అధికారుల అండ వల్ల చేసిన దోపిడీ సొమ్ముతో రెడ్లు బాగా బలిసి పోయారు.అగ్రకుల అహంకారంతో అన్ని కులాల శ్రామిక ప్రజల పై బూతులు తిడుతూ నిరంతరం దౌర్జన్యం చేస్తుంటారు. ఈ వరుసలో జరిగిందే ఈ దాడి, పసి బిడ్డ హత్య.
దేశంలో జరుగుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలోని నిచ్చెన మెట్ల (బ్రాహ్మణీయ) కుల వ్యవస్థ మూలాన ప్రతి రోజూ ఏదో ఒక చోట దళిత బహుజనులపై అగ్రకులాల దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి ఏటేటా పెరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో , బస్తీలో అంటరానితనం, కుల వివక్షత అమలు జరుగుతుంది. ప్రభుత్వం కులవ్యవస్థకు అండగా నిలిచి, దాని ఆధారంగానే అధికారంలోకి వచ్చి కొనసాగుతున్నంది. రాజకీయ, అధికార యంత్రాంగం కుల భావజాలంతో వర్ధిల్లుతుంది. కుల దురహంకారాన్ని, కులతత్వాన్ని పెంచే సంస్కృతి ఫాసిస్టు ఆర్య బ్రాహ్మణవాదుల ద్వారా పధకం ప్రకారం పెంచి పోషించబడుతుంది. వీటన్నింటినీ నియంత్రించే, కట్టడిచేసే లేదా నిర్మూలించే అవగాహన కానీ అందుకు సంబంధించిన వ్యవస కానీ లేదు. పైగా వీటి పునాది పైననే మన వ్యవస్ధ మనుగడ సాగిస్తున్నందు వల్ల దాడులు, హత్యలు , హత్యాచారాలు పెరుగుతున్నాయి. కాబట్టి
మన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంసృతిక వ్యవస్థ కులం పునాదుల పై నిర్మించబడిందని గుర్తించి, దాని మౌలిక మార్పు కోసం పోరాడుతూనే నేటి అగ్రకుల అహంకారంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి దళిత బహుజన ప్రజాస్వామిక శక్తులు నిర్ధిష్ట కార్యాచరణతో ఉద్యమించాలి. దాడులు జరిగిన తరువాత పోరాడడం కంటే అందుకు ముందుగానే మేల్కోవాలి. దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచాలని ఉద్యమించాలి. ముఖ్యంగా అణగారిన కులాల పై దాడులకు, దోపిడికి కారణంగా ఉన్న కుల వ్యవస్థను రద్దు చేయాలని అందుకు అవసరమైన ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఉద్యమించాలి. కుల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పిన పెరియార్ బోధనలను, కుల నిర్మూలన ప్రాతి పదికన పోరాడాలన్న అంబేద్కర్ బోధనలను పెడ చెవిన పెట్టిన ఫలితంగా నష్టం జరిగిందని నేటి తరం గ్రహించి కుల ప్రాతిపదికన గాకుండా కుల నిర్మూలన ప్రాతిపదిక పై దళిత బహుజనులందరూ ఐక్యమై పోరాడాలి.




