సుమారు 11 సంవత్సరాల క్రితం, 2008 నవంబరులో, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని గది నంబర్ 22 లో “సామ్యవాదం, ఫాసిజం, ప్రజాస్వామ్య పదాల ఆర్భాటం- వాస్తవం” అనే అంశంపైన సెమినార్ నిర్వహించారు. సెమినార్ ముఖ్య వక్త విశ్వవిద్యాలయంలో అరబిక్ భాషా ప్రొఫెసర్, కశ్మీరీ ముస్లిం ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ. ఈ అంశంపై గిలానీ కంటే మెరుగ్గా మాట్లాడగలిగే మరొకరు బహుశా దేశంలో లేరు.
2002 లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ఆయన “వహించిన పాత్రకు”గాను కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. మీడియా విచారణ జరిపి, కోర్టు తీర్పు రాకముందే గిలానీని ఉగ్రవాదిగా ప్రకటించింది. కానీ, ఆ తరువాతి మూడు సంవత్సరాలలో, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆయనను అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదల చేసేసాయి.
ఆ సెమినార్లో, అణచివేత ప్రభుత్వ యంత్రాంగం తనపై మోపిన ఆరోపణలు, మతతత్వంపైన గిలానీ తన అభిప్రాయాలను చెప్పాల్సి ఉన్నది.
ఎత్తైన వేదికపై ఉంచిన ఒక పెద్ద బల్ల వెనుక గిలానీతో పాటు 21 ఏళ్ల ఉమర్ ఖలీద్ కూర్చున్నాడు. 2016లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన వివాదం తర్వాత ఖలీద్‌పై కూడా దేశద్రోహం ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరితో పాటు వేదికపై రామచంద్రన్ కూడా ఉన్నారు; ప్రస్తుతం ఆయన ‘ది ట్రిబ్యూన్’ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.
గిలానీ వేదికపైకి వెళ్లి కూర్చోగానే, ఒక విద్యార్థి ఆయన దగ్గరకు వచ్చి ముందుకి వంగాడు. అతను గిలానీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు అనిపించింది. ఆ విద్యార్థి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సభ్యుడు. గిలానీపై రెండుసార్లు ఉమ్మివేశాడు. గిలానీ ఆశ్చర్యపోయి, తన కుర్చీలో కుంగిపోయారు.
ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఇది ముందే పన్నిన కుట్ర. ఆ తరువాత ఎబివిపి సభ్యులు గిలానీని, ఇతర వక్తలను గట్టిగా అరుస్తూ తిట్టడం మొదలుపెట్టారు. గిలానీ ధైర్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎబివిపి సభ్యులు గదిలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు; కొందరు వ్యక్తులు వక్తలపైన దాడి కూడా చేసారు. ఆ సమయంలో ఎబివిపి అధ్యక్షురాలుగా ఉన్న నూపుర్ శర్మ (తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసింది) వచ్చి, గిలానీ విశ్వవిద్యాలయంలో తన అభిప్రాయాన్ని చెప్పడానికి వీలు లేదని ప్రకటించింది.
ఈ సంఘటన వీడియో మీడియాకు చేరింది; టైమ్స్ నౌ ఛానెల్ ‘న్యూస్ అవర్’ కార్యక్రమం యాంకర్ అర్నబ్ గోస్వామి గిలానీ, నూపుర్ శర్మలను తన షోకు ఆహ్వానించాడు. ఆ సమయంలో గోస్వామి ఈ రోజులాగా హిందూ జాతీయవాది కాదు. 2014లో బీజేపీ గెలిచిన తర్వాతే గోస్వామి హిందూ జాతీయవాదిగా మారాడు.
“ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక అసహ్యకరమైన చర్య దృశ్యాన్ని చూడండి, ఇందులో ఒక విద్యార్థి ఎస్.ఎ. ఆర్ గిలానీపైన రెండు సార్లు ఉమ్మివేశాడు. ఇది చూసి దేశమంతా దిగ్భ్రాంతి చెందింది” అని గోస్వామి అన్నాడు.
గిలానీ అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదలయ్యారని గోస్వామి పదేపదే చెప్పాడు. “విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా ఈ సంఘటన నన్ను కలచివేసి, భయపెట్టింది. ఇది నిరసన తెలియజేయడానికి ఏ రకమైన పద్ధతి?” అని అంటూ గోస్వామి, నూపుర్‌ను గిలానీకి క్షమాపణ చెప్పాలన్నాడు.
గిలానీ తాను మాట్లాడే సమయం వచ్చినప్పుడు, శర్మ స్వయంగా న్యాయ విద్యార్థిని అని రెచ్చగొట్టినట్లుగా నూపుర్‌కు గుర్తు చేసాడు.
అందుకు సమాధానంగా “నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, దేశం మొత్తం మీపైన ఉమ్మివేయాలి, దేశం మొత్తం మీపైన ఉమ్మివేయాలి” అని శర్మ దూకుడుగా అన్నది.
తను చదువుతున్న విశ్వవిద్యాలయం ప్రొఫెసర్పైన దేశం మొత్తం ఉమ్మివేయాలని అనుకుంటున్నది అనే చెప్పగలిగే శర్మకున్న ఆత్మవిశ్వాసం ఆ సమయంలో నెలకొన్న వాతావరణానికి సాక్ష్యం. 9/11 న అమెరికాలో జరిగిన దాడి తరువాత, ఉగ్రవాదం పేరుతో ఇస్లాం వ్యతిరేక భావాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి; హిందూ జాతీయవాదుల నిఘంటువులో స్థానం సంపాదించింది. కేవలం ఉగ్రవాది అనే ఆరోపణ మాత్రమే ప్రజలను రాక్షసులలాగా చూపించడానికి సరిపోయింది. ఇప్పుడు ముస్లింలపైన ఉమ్మివేయడం, ఎటువంటి రుజువు లేకుండా వారిని అరెస్టు చేయడం, వారిని కొట్టడం, హింసించడం, చివరికి వారిని కాల్చివేయడం కూడా ఆమోదయోగ్యమైంది. 2001 నుండి అక్టోబరు 2019 లో గుండెపోటుతో మరణించే వరకు, గిలానీ ఒక్క ఆరోపణ కూడా రుజువు కాకుండా ఈ అఘాయిత్యాలను ఎదుర్కొన్నారు. ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదలైన తరువాత, గిలానీ మానవ హక్కుల కార్యకర్తగా మారి, రాజకీయ ఖైదీల స్వేచ్ఛ కోసం పనిచేయడం ప్రారంభించారు.
గిలానీ విడుదల కోసం చేసిన ప్రచారంలో పాల్గొన్న రచయిత్రి అరుంధతి రాయ్ ఇలా చెప్పారు, “నేను ఎప్పుడూ ఆయనను అత్యంత ధైర్యవంతుడు; తేజస్సు గల వ్యక్తిగా గుర్తుంచుకుంటాను. ఆయన ఎప్పుడూ తనలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారికోసం పనిచేశారు.”
గిలానీ భారతీయ రాజ్య వ్యవస్థ దురాగతాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన భారతదేశపు రాజకీయ ఖైదీ. ఆధునిక రాజ్య వ్యవస్థ ఒక సాధారణ వ్యక్తిని దేశ భద్రతకు ముప్పుగా ఎలా చిత్రీకరించగలదో; ‘గోదీ మీడియా’ (తమకు అనుకూలమైన మీడియా) రాజ్యం చేసే ఈ చర్యను ఎలా ఆమోదయోగ్యంగా చేస్తుందో నిరూపించడానికి ఆయన జీవిత కథ సరిపోతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా పెద్ద అన్యాయాలు ఎలా చేయగలవో కూడా ఇది రుజువు చేస్తుంది.
గిలానీ 1969లో జన్మించారు. ఆయన కశ్మీర్‌లోని ఒక ప్రముఖ కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి సయ్యద్ అబ్దుల్ వలీ ఉల్లా షా గిలానీ ఒక మత సంస్కర్త, ఆయన కశ్మీరీ ముస్లింలలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేశారు. నూపుర్ శర్మ వంటి వారు ఏమనుకున్నా, గిలానీ ఇస్లామిక్ మత మౌఢ్యానికి వ్యతిరేకమైన వాతావరణంలో పెరిగారు.
గిలానీ యుక్తవయస్సుకు వచ్చిన 1980- 1990ల కాలంలో కశ్మీరీ యువకులు భారత రాజ్య వ్యవస్థపైన నమ్మకం కోల్పోయి ఆయుధాలు పట్టడం మొదలుపెట్టారు. గిలానీ వివాహం చేసుకున్నారు, కానీ తన భార్య ఆరిఫాను కశ్మీర్లో వదిలి, బోధనా వృత్తి కోసం లక్నోకు, ఆ తర్వాత ఢిల్లీకి వచ్చారు. ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా, తిరుగుబాటు వ్యతిరేక చర్యల పేరుతో జరుగుతున్న క్రూరత్వాల గురించి వినేవారు; ఏ కశ్మీరీ ముస్లింను కూడా వదలలేదు.
1990ల ప్రారంభంలో, భద్రతా బలగాలు ఆయన సోదరుడు బిస్మిల్లాను పట్టుకుని హింసించాయి. న్యాయవాది నందితా హక్సర్ తన పుస్తకం ‘ఫ్రేమింగ్ గిలానీ, హ్యాంగింగ్ అఫ్జల్’ (‘గిలానీని కేసులో ఇరికించడం, అఫ్జల్‌ని ఉరి తీయడం’)లో, బిస్మిల్లాను తలకిందులుగా వేలాడదీసి, నీళ్ళు నింపిన బకెట్లో ముంచేవారని తెలిపారు. ఆ తర్వాత అతను మింగిన నీటిని కక్కే వరకు అతని కడుపుపైన కొట్టేవారు. అలా హింసించిన తర్వాత అతన్ని మంచుదిమ్మ పైకి విసిరేసేవారు. తరువాత, బిస్మిల్లా ‘మాన్యుఫ్యాక్చరింగ్ టెర్రరిజం: కాశ్మీర్ ఎన్కౌంటర్స్ విత్ ది మీడియా అండ్ ది లా’ (ఉగ్రవాద తయారీ; మీడియా, చట్టాలతో కశ్మీర్ భేటీ)అనే పుస్తకాన్ని రాశారు. తమకు ఎంతో బాధాకరమైన అనుభవం ఉన్నప్పటికీ, అన్నదమ్ములు ఇద్దరూ ప్రజాస్వామిక నియమాలకుల విధేయులుగా ఉన్నారు. హక్సర్ ఇలా వ్రాశారు, “ఢిల్లీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, గిలానీ తన తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కశ్మేర్ లోయ చరిత్ర, వర్తమానాల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించేవాడు. ఈ యువ కశ్మీరీ విద్యార్థి రాష్ట్ర నాయకులను కశ్మీర్ గురించి మాట్లాడటానికి ఆహ్వానించడం గూఢచార సంస్థల దృష్టిలో పడి ఉంటుందని హక్సర్ భావిస్తున్నారు.
“కాలం గడిచింది; గిలానీ 2000 సంవత్సరంలో జాకిర్ హుస్సేన్ కాలేజీలో లెక్చరర్‌గా మారారు; ముఖర్జీ నగర్లో టెర్రస్‌పై ఉన్న అద్దెకు తీసుకున్న ఇంట్లో భార్య, మూడేళ్ల కొడుకు ఆతిఫ్తో కలిసి ఉండేవాడు. ఆయన ఏడేళ్ల కూతురు నుస్రత్ కశ్మీర్‌లోనే చదువుకుంటోంది.
2001 డిసెంబర్ 13నాడు ఐదుగురు వ్యక్తులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంలో భారత పార్లమెంట్‌లోకి చొరబడ్డారు. ఐదుగురు మరణించారు. తరువాతి రెండు రోజుల్లోనే పోలీసులు ఈ కేసును పరిష్కరించామని ప్రకటించారు. ఈ దాడిలో గిలానీ, మహ్మద్ అఫ్జల్ గురు, అతని సోదరుడు షౌకత్ హుస్సేన్ గురు, షౌకత్ భార్య అఫ్సాన్ గురు (పెళ్లికి ముందు ఈమె పేరు నవజ్యోత్ సంధు) పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు గిలానీని ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా ప్రకటించారు.
గిలానీని వెంటనే అరెస్టు చేశారు. ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన వ్యక్తులు గిలానీని తలకిందులుగా వేలాడదీసి, అరికాళ్ళపై కర్రలతో కొట్టేవారు; నిరంతరం తిట్టేవారు. ఆ తర్వాత, ఆయన స్పృహ కోల్పోయే వరకు మంచు గడ్డపైన పడుకోబెట్టి కొట్టేవారు. చేతులకు సంకెళ్ళు వేసి, పోలీసు స్టేషన్‌లోని చల్లటి నేలపై పడేసేవారు. ఆయన కాళ్ళను గొలుసులతో టేబుల్‌కు కట్టి, ఆయన పిల్లలకు ఇదంతా చూపించేవారు. అబద్ధపు నేరాన్ని ఒప్పుకోకపోతే, ఆయన భార్యపై అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారు.
అఫ్జల్, షౌకత్లకు విరుద్ధంగా గిలానీ నేరాన్ని అంగీకరించలేదని, అందుకే ఆయన అసాధారణ వ్యక్తిగా నిలిచారని అరుంధతి రాయ్ నాకు చెప్పారు.
ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆరు నెలల్లో ఎస్.ఎన్. ఢింగ్రా న్యాయమూర్తిగా ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసారు. ఆయన నలుగురు నిందితులను దోషులుగా ప్రకటించారు. గిలానీ, అఫ్జల్, షౌకత్లకు రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం, కుట్ర ఆరోపణలపై ఉరిశిక్షను, అఫ్సాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను విధించారు.
2001లో గిలానీ అరెస్టు తర్వాత ఆగ్రహించిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆయన సహచరులు, స్నేహితులు ఈ కేసులో డిఫెన్స్ తరపు న్యాయవాదిగా న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త నందితా హక్సర్‌ను నియమించారు. హక్సర్ బృందం దీని కోసం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది; గిలానీని రక్షించడానికి రజనీ కోఠారి, సురేంద్ర మోహన్, అరుంధతి రాయ్, సామాజిక కార్యకర్త అరుణా రాయ్, సినీ నిర్మాత సంజయ్ కక్, సంపాదకుడు ప్రభాష్ జోషి వంటి వ్యక్తులతో కూడిన 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యక్తులు గిలానీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు.
దిగువ కోర్టులో ఓటమి పాలైనప్పటికీ, ఈ బృందం తమ ప్రచారాన్ని మరింత బలోపేతం చేసి, అద్భుతమైన న్యాయ పోరాటం చేసింది. ఈ బృందం ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినప్పుడు, హక్సర్, తదితరులు రామ్ జెఠ్మలానీని తమ బృందంలో చేర్చుకున్నారు, ఆయన అప్పటికే అధికారంలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కొద్దికాలం పాటు న్యాయమంత్రిగా పనిచేశారు. ఈ బృందం భారతదేశం అంతటా సంతకాల సేకరణ కార్యక్రమాలు, పోస్టర్ల ప్రదర్శనలు, బహిరంగ సభలను నిర్వహించింది. ప్రధాన స్రవంతి మీడియా పోలీసు ప్రకటనలను చూపిస్తుండగా, ఈ ప్రచారం ప్రజల ముందు వాస్తవాన్ని వెల్లడించింది. ఈ కేసు గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాక, ఉగ్రవాద నిరోధక చట్టం ద్వారా పౌర స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల గురించి కూడా ఈ క్యాంపెయిన్ ప్రజలను హెచ్చరించింది. ఈ చట్టాన్ని పార్లమెంటుపై దాడి జరిగిన మూడు నెలల్లోనే రూపొందించారు. గిలానీ కోసం నిర్వహించిన ఈ ప్రచారం ‘పోటా’ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు వేదికగా మారింది.
జెఠ్మలానీ నేతృత్వంలో జరిగిన న్యాయ పోరాటానికి ప్రజా అవగాహనా క్యాంపెయిన్ బలం చేకూర్చింది; దీని కారణంగా ఢిల్లీ హైకోర్టు గిలానీకి విధించిన మరణశిక్షను రద్దు చేసింది; అఫ్సాన్ను కూడా అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదల చేసింది. రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసిన ఆరోపణలపైన మరణశిక్ష పడిన వ్యక్తి నిర్దోషిగా విడుదలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
“విచారణ ప్రారంభం కాకముందే తనకు కఠిన శిక్ష విధించాలని జాకిర్ హుస్సేన్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్, ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షురాలు సాస్వతి మజుందార్ డిమాండ్ చేశారని తన విడుదల తర్వాత విన్న గిలానీ ఆశ్చర్యపోయారు. ఈ రెండు ఉపాధ్యాయ సంఘాలలో సభ్యుడిగా ఉండి, తాను ప్రజాస్వామ్య-లౌకిక కార్యకర్తల్లో ఒకడిని అని భావించిన గిలానీని ఇది మరింతగా వేదనకు గురిచేసింది” అని హక్సర్ రాశారు.
పోటా (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్- పోటా) చట్టంపైన దృష్టిని ఆకర్షించడానికి గిలానీ మీడియాను ఉపయోగించుకున్నారు. తన విడుదల తర్వాత ఏర్పాటు చేసిన మొదటి పత్రికా సమావేశంలో, ప్రజాస్వామ్యంలో ఇటువంటి కఠిన చట్టాలకు చోటు లేదని అన్నారు. “రెండు సంవత్సరాల పాటు ఒక అమాయకుడి తలపై మరణశిక్ష కత్తి వేలాడదీయడాన్ని మీరు న్యాయం అంటారా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ పత్రికా సమావేశం గురించి ‘ది హిందూ’ తన నివేదికలో ఇలా రాసింది, “పోలీసులు ఎంత సులభంగా పోటా చట్టాన్ని దుర్వినియోగం చేయగలరో ఆయన విడుదల కేంద్ర బిందువుగా చేసింది.” అప్పటికే దళితులు, ఆదివాసులు, మత మైనారిటీ సముదాయ సభ్యులు, పర్యావరణ, పౌర-స్వేచ్ఛా కార్యకర్తలు ఈ చట్టానికి బాధితులుగా మారారు. 2004 ఎన్నికలలో, ‘పోటా’ను రద్దు చేయడం ప్రతిపక్ష పార్టీల వాగ్దానాలలో ఒకటిగా ఉండింది.
పార్లమెంటుపై దాడి కేసులో గిలానీ, అఫ్సాన్లకు హైకోర్టు ఇచ్చిన విడుదల ఆదేశాన్ని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ అప్పీల్ చేసారు. అయితే, సుప్రీంకోర్టు వారి విడుదలను సమర్థించడమే కాకుండా, షౌకత్ శిక్షను కూడా పదేళ్ల జైలు శిక్షకు తగ్గించింది. దాడి గురించి పోలీసులు సృష్టించిన కథనంలో గిలానీ నిర్దోషిగా విడుదల కావడం వల్ల అనేక అనుమానాలు తలెత్తాయి.
అయినప్పటికి అఫ్జల్‌కు మాత్రమే పై కోర్టులలో ప్రారంభంలో ఇచ్చిన శిక్ష అమలయ్యింది. చాలా మంది అఫ్జల్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలకు ఉన్న తప్పుదారి పట్టించే స్వభావాన్ని సూచించినప్పటికీ, కోర్టు ఆయన శిక్షను సమర్థించింది. దీనిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వచ్చినంత చెడ్డ పేరు బహుశా మరే ఇతర తీర్పుకు వచ్చి ఉండదు. “సమాజపు సామూహిక మనస్సాక్షి సంతృప్తి చెందాలంటే, నేరస్థుడికి మరణశిక్ష విధించాలి” అని సుప్రీంకోర్టు అన్నది.
2013లో అఫ్జల్‌ను ఉరితీయడం కశ్మీర్లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది, అక్కడ ఇప్పటికీ ఆయనను నేరం చేయని అమరుడిగా చూసేవారు ఉన్నారు.
పార్లమెంటు మీద దాడిలో నిజంగా ఏం జరిగింది, దాని వెనుక ఎవరు ఉన్నారనే నమ్మదగిన సమాచారం ఇప్పటికీ మనకు లేదని చాలా మంది కార్యకర్తలు నమ్ముతున్నారు. ఈ విషయంలో కొత్తగా దర్యాప్తు ప్రారంభించడానికి రాజ్యం ఎందుకు ఆసక్తి చూపలేదని నేను అరుంధతి రాయ్‌ని అడిగినప్పుడు, “ఒక వైపు, ఇది ఇబ్బందికరమైన నిజాలను బయటపెడుతుంది; దాని వల్ల రక్తదాహం తీరిపోయింది. అఫ్జల్ గురు ఆత్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. చారిత్రకంగా, ఇటువంటి పాలనలు ఇలాంటి రహస్య సంఘటనల ద్వారా తమ అజెండాను ముందుకు తీసుకువెళ్లాయి” అని అన్నారు ఆమె.
నిర్దోషిగా విడుదలైనప్పటికీ, గిలానీ ఇబ్బందులు తొలగిపోలేదు. 2005 ఫిబ్రవరిలో, నందితా హక్సర్ ఇంటి బయట ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో ఆయనను కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కొన్ని బుల్లెట్లను తీసివేశారు, కానీ ఆయన వెన్నెముకలో ఇరుక్కుపోయిన రెండు బుల్లెట్లను బయటికి తీయడం సాధ్యం కాలేదు. ఆయన భద్రతలో జరిగిన ఈ లోపంపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది; ఆయనకు భద్రత కల్పించాలని ఆదేశించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు సాయుధులను ఆయన రక్షణ కోసం శాశ్వతంగా నియమించారు; వారు రాత్రింబవళ్ళు ఆయన చుట్టు పక్కలనే ఉండేవారు.
“గిలానీని విడుదల చేయండి” అనే క్యాంపెయిన్ రాజకీయ ఖైదీల హక్కులను పరిరక్షించే పనిలో ఉన్న అనేక మంది కార్యకర్తలను ఒకచోట చేర్చింది. జైలులో గడిపిన సమయంలో, ఆయనకు చాలా తక్కువ లేదా ఎటువంటి ఆధారాలు లేకుండానే “మావోయిస్టులు” లేదా “ఉగ్రవాదులు”గా ముద్ర వేసిన అనేక మంది ముస్లింలు, ఆదివాసులు కూడా తారసపడ్డారు. ఈ అనుభవం రాజకీయ ఖైదీల పట్ల ఆయన నిబద్ధతను బలోపేతం చేసింది. తన విడుదలకు కృషి చేసిన కార్యకర్తలతో కలిసి గిలానీ “రాజకీయ ఖైదీల విడుదల కమిటీ” పేరుతో పని చేయడం ప్రారంభించారు.
గిలానీ నా దగ్గరకు తీసుకువచ్చిన అనేకమంది కశ్మీరీల కేసులను వాదించాను. ఆయన చివరిగా తీసుకువచ్చిన కేసు 1996 నాటి జైపూర్ పేలుళ్ళ కేసు; ఇందులో ఫిరోజాబాద్‌కు చెందిన ఒక వైద్యుడికి మరణశిక్ష పడింది” అని ప్రఖ్యాత మానవ హక్కుల న్యాయవాది కామిని జైస్వాల్ నాతో ఇలా అన్నారు.
అరుంధతి రాయ్ ఈ విషయంలో గిలానీ చేసిన కృషిని చాలా ప్రశంసించారు. “జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఆదివాసీల పోరాటాల వంటి ఇతర రకాల పోరాటాల గురించి ఆయన అవగాహన అసాధారణంగా పెరిగింది. తన రాజకీయ ఆచరణ గురించి ఆయన స్పష్టంగా ఉండేవారు. తను ఎవరు? ఇతర ప్రాంతాలలో ప్రజలను కూడా రాజ్యం అణచివేస్తున్నదనే విషయాన్ని గుర్తించడంలో కూడా స్పష్టంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.”
గిలానీతో కలిసి పనిచేసిన ఇద్దరు ముఖ్య కార్యకర్తలు రోనా విల్సన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీ.ఎన్. సాయిబాబా. వీరిద్దరూ గిలానీని విడుదల చేసే క్యాంపెయిన్‌లో భాగమయ్యారు.
గిలానీతో నా మొదటి, ఏకైక భేటీ అనుకోకుండా జరిగింది. 2014 లో నేను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సాహిత్యం కోర్సు చేస్తున్నప్పుడు, నా ప్రొఫెసర్ అయిన సాయిబాబాను మావోయిస్టులతో “సంబంధాలు” ఉన్నాయనే ఆరోపణతో అరెస్టు చేసారు. పోలియో కారణంగా సాయిబాబా తన జీవితంలో ఎక్కువ భాగం వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. నాగ్‌పూర్ జైలులో ఉన్న భయంకరమైన పరిస్థితుల కారణంగా ఆయన మెదడు, వెన్నెముక, మూత్రపిండాలలో తీవ్రమైన సమస్యలు ఏర్పడ్డాయి. 2015 చివరి భాగంలో, వైద్యపరమైన కారణాలపై సాయిబాబా బెయిల్‌పై బయట ఉన్నప్పుడు, నేను ఆయన చికిత్స పొందుతున్న ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కలిశాను.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తాపత్రిక కోసం ఆయన కేసు గురించి రాశాను. నేను సాయిబాబాతో మాట్లాడుతుండగా, గిలానీ రైఫిల్ పట్టుకున్న ఇద్దరు గార్డులతో పాటు ఆసుపత్రి గదిలోకి వచ్చారు. గిలానీ భద్రతా సిబ్బంది, నేనూ ఇద్దరు ప్రొఫెసర్లు మాట్లాడుకోవడం వింటూ ఉండిపోయాము.
సాయిబాబా ఆరోగ్యం, ఆయన కేసు గురించి తీవ్రమైన చర్చ జరిగిన తర్వాత, వారి సంభాషణ నాగ్‌పూర్ జైలులో ఖైదీలను ఒంటరిగా ఉంచే కుఖ్యాత ‘అండా సెల్’ అనుభవం వైపు మళ్లింది. ఇద్దరూ తాము అనుభవించిన చిత్రహింసల గురించి ఒకరినొకరు ఆటపట్టించుకోవడం మొదలుపెట్టారు. తన సెల్లో కిటికీలు లేకపోవడం, ఎల్లప్పుడూ చీకటిగా ఉండటం వల్ల సమయం ఎంత అయ్యిందో తెలుసుకోవడం అసాధ్యమయ్యేడని సాయిబాబా వివరించారు.- “నాకు ఆహారం ఇచ్చినప్పుడు సమయం ఎంత అయిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.”
“కనీసం మీకు ఆహారం అయినా దొరికింది కదా,” అని గిలానీ తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ సమాధానమిచ్చారు. ఆయనను అత్యధిక ప్రమాదకరమైన ఖైదీలను ఉంచే తీహార్ జైలు సెల్లో ఉంచారు; అక్కడ కిటికీలు కూడా లేవు. “వారు నన్ను బట్టలు లేకుండా ఉంచారు; చాలా రోజులు నాకు ఆహారం ఇవ్వలేదు. కానీ నేను కూడా సమయాన్ని గుర్తుంచుకునేవాడిని. గార్డులు మారినప్పుడు, వారు తమ తుపాకీ తూటాల మ్యాగజైన్‌ను ఖాళీ చేయాల్సి వచ్చేది. ఆ మ్యాగజైన్ చేసే ‘టిక్-టాక్’ శబ్దమే నా గడియారం.” (సాయిబాబాకు 2017లో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది; అప్పటి నుండి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య సమస్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ దానిపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు. 2024 మార్చి నెలలో విడుదలయ్యాక చికిత్స పొందుతూ 2024 అక్టోబర్ 12 నాడు మరణించారు – అను)
సాయిబాబా అరెస్టు; దోషిగా నిర్ధారణ అయినప్పటి నుండి, రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాడేవారిపైన తీవ్రమైన దాడులు జరిగాయి. సాయిబాబా విడుదలకు సంబంధించిన క్యాంపెయిన్‌లో భాగమైన రోణా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ ఇద్దరినీ 2018లో భీమా కోరేగావ్‌లో జరిగిన హింస తర్వాత అనుమానాస్పద ఆరోపణలపైన అరెస్టు చేసారు. గత సంవత్సరం అరెస్టు అయిన ఇతర మానవ హక్కుల కార్యకర్తలలో షోమా సేన్, మహేష్ రౌత్, సుధీర్ ధావలే, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నోన్ గోన్సాల్వేస్, వరవర రావు, గౌతమ్ నవలఖా ఉన్నారు. హనీ బాబు ఇంటిపైన ఇటీవల దాడి జరిగింది. హనీ బాబు నాకు ఢిల్లీ యూనివర్సిటీలో బోధించారు; సిఆర్‌పిపి మీడియా కార్యదర్శిగా ఉన్నారు. సిఆర్‌పిపి అధ్యక్షుడైన గిలానీ మరణంతో క్షేత్ర స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ పనులలో ఒక రకమైన శూన్యత ఏర్పడింది.
“ప్రతి ఒక్కరూ జైలులోనే ఉన్నారు. మీరు అకస్మాత్తుగా చుట్టూ చూస్తే ఖాళీ కుర్చీలు కనిపిస్తాయి” అని రాయ్ నాతో అన్నారు
2016 ఫిబ్రవరి 9నాడు అఫ్జల్ గురు ఉరితీత మూడవ వార్షికోత్సవం సందర్భంగా, హత్యకు నిరసనగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిలానీ పాల్గొన్నారు. గురు అమాయకుడని గిలానీ ఎల్లప్పుడూ బలంగా నమ్ముతూ, బహిరంగంగా చెబుతుండేవారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు గిలానీపై దేశద్రోహం కేసును మోపారు. ఆయనను అరెస్టు చేస్తే ఒక నెల జైలులో గడపవలసి వచ్చింది.
అదే రోజు, అప్పుడే హిందూ జాతీయవాదిగా మారిన అర్ణబ్ గోస్వామి, గిలానీ అరెస్టును సమర్థిస్తూ ‘ది న్యూస్అవర్’లో ఒక గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాడు.
“ఈ వ్యక్తి ఎస్.ఎ.ఆర్. గిలానీ ప్రమాదకరం,” అని గోస్వామి గట్టిగా అరుస్తూ చెప్పాడు. “ఇప్పుడు మీరు ఎస్.ఎ.ఆర్. గిలానీని విడిచిపెడితే, గిలానీని ఈ దేశంలో స్వేచ్ఛగా వదిలిపెడితే, అది అస్సాంలో వేర్పాటువాదానికి మద్దతు ఇచ్చేవారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సమానం అవుతుంది; అంటే ఉల్ఫా చర్యలను నైతికంగా సమర్థించడం అవుతుంది. ఎస్.ఎ.ఆర్. గిలానీని ఈ దేశంలో స్వేచ్ఛగా వదిలిపెడితే, అది ఖలిస్తానీ వేర్పాటువాదులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమానం అవుతుంది, అంటే బబ్బర్ ఖల్సా పనులను సమర్థించడం అవుతుంది. అందుకే ఎస్.ఎ.ఆర్. గిలానీ ఇకపై ఎక్కువ కాలం జైలులోనే ఉండాలని నేను నమ్ముతున్నాను… ఈ గిలానీనే ఒక ఉగ్రవాదిని అమరవీరుడు అన్నాడు. ఈ గిలానీనే భారత వ్యతిరేక, దేశ వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నాడు.”
2008లో గిలానీకి మద్దతు ఇచ్చిన ఈ సెలబ్రిటీ యాంకర్ నూట ఎనభై డిగ్రీలు తిరిగిపోయాడు.
చాలా మంది జర్నలిస్టులు ప్రారంభంలో చేసినట్లుగా, గోస్వామి కూడా ప్రభుత్వం రూపొందించిన భాషను, పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. 2014 నుండి, పెరుగుతున్న హిందూ జాతీయవాద ఆధిపత్యం, ఎవరిని మానవత్వం నుండి దూరం చేయవచ్చో నిర్ణయించడానికి విస్తృత ప్రమాణాన్ని అందించింది. ఒక్కసారి “ఉగ్రవాది” అనే ముద్ర పడితే చాలు, మానవత్వానికి ఉండే పరిధి కుంచించుకుపోతుంది, ఇప్పుడు “దేశ-వ్యతిరేకి” అనే చిన్న ముద్ర కూడా దానికి సరిపోతుంది. జాతీయ గీతం వస్తున్నప్పుడు నిలబడటానికి నిరాకరించడం కూడా గొడవకు సరైన కారణంగా మారవచ్చు; ఇంట్లో మాంసం (అది ఆవు మాంసం అయినా కాకపోయినా) ఉండటం దళితులు లేదా ముస్లింలకు ప్రాణాంతకం కావచ్చు. గతంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన స్రవంతి మీడియా, ఇప్పుడు దేశ-వ్యతిరేకులకు వ్యతిరేకంగా మారింది.
మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇకపై కేవలం చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, భద్రతా బలగాల ప్రత్యేక హక్కు మాత్రమే కాదు. నేను కామిని జైస్వాల్‌ను కస్టడీలో చిత్రహింసలు, మరణాల గురించి అడిగినప్పుడు, ఆమె ఇలా అన్నారు, “ఇప్పుడు వీధుల్లో కొట్టి చంపడం జరుగుతోంది. ఇక జైళ్లలో ఏం జరుగుతుందో మీరు ఊహించవచ్చు.”
నేడు భారత ప్రభుత్వం మానవ హక్కుల భావనపైన యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులను, గృహమంత్రి అమిత్ షా మానవ హక్కులను పాశ్చాత్య భావనగా ఖండించిన ప్రకటన సందర్భంలో చూడాలి. ఇది హక్కుల విషయంలో ఈ హిందూ-జాతీయవాద ప్రభుత్వం అనేక కఠిన ఇస్లామిక్ దేశాల మాదిరిగానే ఉందని సూచిస్తుంది.
నిరంకుశత్వం, అణచివేత, దాదాపు మరణానికి చేరువైనప్పటికీ, అమానుషత్వంతో నిండిన ఈ యుగంలో గిలానీ తన మానవత్వాన్ని కాపాడుకున్నారు. భారత రాజ్యంపైన లేదా తనను శత్రువుగా చూసేవారిపైన ఆయన తన హృదయంలో ద్వేషాన్ని పెంచుకోలేదు. అయినప్పటికీ, ఆయన జీవితాంతం రాజ్యమూ, మీడియాలోని దాని అనుచరవర్గమూ అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఒక వ్యక్తిగా ఆయనపైన గురిపెట్టింది. ఉగ్రవాది అనే ముద్ర వేయలేనప్పుడు, ఆయనను దేశవ్యతిరేకిగా ముద్ర వేశారు. ఆయనపై మోపిన ఆరోపణలు, చల్లిన బురద కోసం కాదు కానీ న్యాయం, మానవ హక్కుల పట్ల ఆయనకున్న నిర్భయ నిబద్ధత కోసం గిలానీని గుర్తుంచుకోవడం చాలా అవసరం:.
28 అక్టోబర్ 2019
MARTAND KAUSHIK is an associate editor at The Caravan.
https://caravanmagazine.in/politics/unscathed-humanity-professor-sar-geelani-hindi




