భారతక్క (ఎండపల్లి భారతి) రచనలో ఊర్లో మనుషుల మధ్యలో ఉండి వాళ్ల మాటలు విన్నట్టు అనుభవమవుతుంది. ఆమె రాత అంత సహజంగా, ఏబ్బేట్టుగా లేకుండా ఉంటుంది – చదువుతుంటే ఊరి గాలి, మాటలు, బాధలు కళ్ల ముందు కనిపిస్తాయి.
భారతక్క పుస్తకం చదివితే సారా కాయడం, అమ్మడం ఊర్లలో ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. ఇది కేవలం తాగుడు సమస్య కాదు – ఇది ఆర్థికం, సామాజికం, రాజకీయం కలిసిన పెద్ద విషాదం.
సారా కాయడం – దాని వాస్తవ రూపం
ఒకప్పుడు సారా సోక్కంగా (సహజంగా, సాంప్రదాయ పద్ధతిలో) తయారు చేసేవారు. కానీ తరువాత లాభం కోసం అడ్డమైన కెమికల్స్, మిథనాల్, పురుగుమందులు, ఇతర విష పదార్థాలు కలిపి చేశారు. ఇది ఎర్ర మందు (లైసెన్స్‌డ్ మద్యం) కంటే చౌకగా దొరుకుతుంది కాబట్టి పేదలు, కూలీలు ఎక్కువగా తాగేవారు. ఫలితంగా ఇంట్లో మొగుళ్లు, తండ్రులు, అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు నాశనమవ్వడం చూసాం.
ఎందుకు సారా అమ్మడం, తాగడం నిషేధించారు? ఎందుకంటే దానికి టాక్స్ లేదు, లైసెన్స్ లేదు. ప్రభుత్వ ఆదాయానికి హాని. కానీ ఈ నిషేధం కేవలం పేపర్ మీదే ఉండేది. దాన్ని ఉపయోగించి రాజకీయ నాయకులు, పోలీసులు, స్థానిక శక్తిమంతులు లాభాలు పొందారనేది చరిత్రలో మాట.
దళితులే ఎందుకు ఎక్కువ బలి అవుతున్నారు?
భారతదేశంలో అనేక సారా ట్రాజెడీలలో మరణించిన వారిలో చాలా మంది దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారే. ఉదాహరణకు తమిళనాడు కళ్లకురిచి (2024)లో 65 మంది మరణించగా వారిలో ఎక్కువ మంది దళితులు, ఆర్థికంగా వెనుకబడిన వారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దీనిపై అనేక కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి.
దళితులు ఎక్కువగా రోజుకూలీలు, భూమిలేని కూలీలు, అతి తక్కువ ఆదాయం ఉన్నవారు. ఎర్ర మందు తాగడానికి డబ్బులు లేవు. సారా చౌకగా దొరుకుతుంది కాబట్టి అదే ఆశ్రయంగా దానిపై రోజువారి వచ్చే కూలి డబ్బులు తాగేసి ఇంట్లో ఆడవాళ్లను కొట్టేవారు దాని వల్ల కుటుంబాలు పరిస్థితి ఇందులో చూడొచ్చు.
దళితులు శతాబ్దాలుగా అణగారిన వర్గం. విద్య, ఉద్యోగాలు, ఆస్తులు తక్కువ. ఒత్తిడి, నిరాశ, బాధల నుంచి తప్పించుకోవడానికి మద్యం ఒక మార్గంగా మారింది. దళిత కాలనీలు, గ్రామాల అంచుల్లో సారా సులభంగా దొరుకుతుంది. స్థానిక శక్తిమంతులు (డామినెంట్ కులాలు) ఈ వ్యాపారాన్ని నడిపించేవారు. దళితులే ప్రధాన కస్టమర్లు.
భారతక్క రాసినట్టు – ఈ సారా ఊరి జీవితంలో భాగమైపోయింది. అది తాగేవాడి శరీరాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని, ఊరిని, మొత్తం సమాజాన్ని నాశనం చేస్తోంది. దీన్ని ఆపాలంటే కుల వివక్ష, ఆర్థిక అసమానతలు తగ్గాలి. ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దళితులు, పేదలు ఇలాగే బలి అవుతూనే ఉంటారు.
పుస్తకం: దొంగ సారా
రచయిత్రి: ఎండపల్లి భారతి
ప్రచురణ సంస్థ: ఛాయ పబ్లికేషన్
రచయిత ఎం. ఎస్. సి మైక్రోబయాలజీ విద్యార్థి




