(భారత విప్లవోద్యమంలో అత్యుత్తమ విప్లవకారిణి కా. నవత అమరత్వం తర్వాత 2016 జులై లో అమరుల బంధుమిత్రుల సంఘం ప్రచురించిన పుస్తకానికి రాసిన ముందుమాట ఇది. మొదట ఈ పుస్తకం పేరు ఆదర్శవీర వనిత కామ్రేడ్ నవత. అచ్చుకు వెళ్లే క్షణాన కామ్రేడ్ అమ్మగా మారింది. ఫిబ్రవరి 5వ తేదీ గడ్చిరోలీలో జరిగిన దాడిలో నవత జీవన సహచరుడు కా. ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అమరుడయ్యాడు. ఆ ఇద్దరి స్మృతిలో ఈ వ్యాసం పునర్ముద్రణ ..వసంతమేఘం టీం)
ఆరోజు కామారెడ్డిలో బస్సు దిగే సరికి ఉదయం పది గంటలైంది.
అక్కడి విలేఖర్లకు ఫోన్ చేసి సంగోజివాడికి ఎలా వెళ్లాలని అడిగాం. వాళ్లు చెప్పినదాని ప్రకారం బస్టాండు నుంచి బయటికి వచ్చి ఒక ఆటో మాట్లాడుకున్నాం.
కా. సులోచన అలియాస్ నవత కుటుంబాన్ని ముందు పలకరించి, అటునుంచి అటే ఇస్రోజివాడికి కూడా వెళ్లాలి. అది ఆమె అత్తగారి ఊరు. వాళ్లను కూడా పలకరించి రావాలని అనుకున్నాం.
గత ఏడాది బంధుమిత్రుల సంఘం ఆవిర్భావ దినం సందర్భంగా మూడో మహా సభల్లో జెండా ఎత్తబోతుండగా కా. నవత అమరత్వ వార్త మాకు చేరింది. మొదటి రోజు స్థూపం దగ్గర రోజంతా అమరుల బంధుమిత్రుల దు:ఖాన్ని పంచుకొని కన్నీటి వరదల్లో కలగలసిపోయి ఉన్నాం. రెండో రోజు ఆ దు:ఖం నుంచి ఇంకా తేరుకోకుండానే మూడో దశ ఆపరేషన్ గ్రీన్హంట్కు వ్యతిరేకంగా జరగాల్సిన బహిరంగ సభకు వందలాదిగా అమరుల కుటుంబ సభ్యులు, విప్లవాభిమానులు వచ్చారు. అమరుల నెత్తుటి జెండా ఎత్తబోతున్న సమయంలో కా. నవత అనారోగ్యంతో విప్లవోద్యమంలో అమరురాలైందనే సమాచారం వచ్చింది.
వేలాది మంది అమరత్వ దు:ఖాన్ని పంటి బిగువునపట్టి ఎర్రజెండా ఎగరేసినట్లుగానే కా. నవత అమరత్వాన్ని ఎత్తిపట్టాం. ఒక తీరని దు:ఖంలో నుంచి మరో దు:ఖంలోకి విస్తరించి పిడికిలి ఎత్తి నిలబడటమే అమరులకు ఇచ్చే నివాళి కదా. విప్లవోద్యమం తరపున నవత స్మృతిలో కా. వరవరరావు ఎర్రజెండా ఎగరేశారు.
అమర్హై కా.నవత అనే నినాదాలు మిన్నంటాయి.
దు:ఖాన్ని దిగమింగుకుంటూనే అమరుల రక్త సంబంధీకులు, బంధుమిత్రులు బూటకపు ఎన్కౌంటర్లకు, గ్రీన్హంట్కు వ్యతిరేకంగా పోరాడదామని నినదించారు. ఆ సందర్భంగా మావోయిస్టు పార్టీ పంపిన అమరత్వ సందేశాన్ని చదివి, నిజామాబాద్ విప్లవోద్యమంలో ఎందరో వీరుల పాత్రను గుర్తు చేసుకొని ప్రేరణ పొందాం. అందరినీ ప్రభావితం చేయగల ఆదర్శ గెరిల్లా కా. నవత.
అమరత్వంతోనే ఆమెతో నా అనుబంధం మొదలైంది. నాకే కాదు, అమరులు బంధుమిత్రుల సంఘంలోని కార్యకర్తలందరికీ ఇలాంటి అనుభవం ద్వారనే పరిచయం. విప్లవకారులు తమ అమరత్వం తర్వాతే మన మనసుకు పూర్తిగా దగ్గరవుతారు. ఉద్యమంలోకి వెళ్లక ముందు వాళ్ల వ్యక్తిగత జీవితం దగ్గరి నుంచి విప్లవోద్యమంలో వాళ్లు నిర్వహించిన పాత్ర దాకా అప్పుడే మాకు తెలియడం మొదలవుతుంది. నవత గురించి మావోయిస్టు పార్టీ పంపిన సంతాప సందేశంలో ఆమె విప్లవ జీవితంలోని అనేక కోణాలు తెలిశాయి. ఉద్యమంలోకి వెళ్లక ముందు సంగోజివాడిలో, ఇస్రోజివాడిలో ఉన్నప్పటి ఆమె జీవితం తెలిసింది.
అమరులను వాళ్ల తల్లిదండ్రులు, బంధు మిత్రులు గుర్తు చేసుకుంటూ దు:ఖిస్తారు. వాళ్ల గురించిన జ్ఞాపకాలు పంచుకుంటారు. వాటి ద్వారా మాకు ఆ అమర వీరుల జీవితం దగ్గరవుతుంది. అవన్నీ వింటూ ఉంటే వాళ్లు మాకు చాలా దగ్గరి మనుషులని అనిపిస్తుంది. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్లుగా ఉంటుంది. కా. నవత విషయంలో కూడా మాకు అట్లే అనిపించింది. అందునా ఈమె తల్లిగా బిడ్డలతోపాటు విప్లవోద్యమంలోకి వెళ్లింది కదా.
కామారెడ్డి నుంచి సంగోజివాడి గ్రామం 12 కిమీ. చెట్లు చేమలు దాటి, పచ్చని చేన్ల మధ్య నుంచి ఆ ఊరికి చేరుకున్నాం. ఆ రోజు నవత అమరత్వం గురించి పత్రికల్లో వచ్చింది. అందువల్ల ఊళ్లో అడగ్గానే నవత వాళ్ల ఇల్లు మాకు చూపించారు.
అదో పెంకుటిల్లు. ముందు గదిలో ఆడవాళ్లు కూర్చొని ఏడుస్తూ కనిపించారు. ఒకరిద్దరు మగవాళ్లు ఉన్నారు. మమ్మల్ని, మాతో ఉన్న విలేఖర్లను చూసి భయంభయంగా మగవాళ్లు బయటికి వెళ్లిపోయారు.
ఒక్కసారిగా ఏడుపులు ఆగిపోయాయి. గోడకు ఓ మూల సులోచన తల్లిదండ్రులు కావచ్చు కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటున్నారు.
మా గురించి చెప్పి, మిమ్మల్ని పలకరించడానికి వచ్చామని అన్నాం. మా వైపు వాళ్లు వింతగా, భయంగా చూస్తూనే కూచోమని కుర్చి బల్ల చూపించారు. ఏనాడో దూరమైపోయిన బిడ్డ కోసం రోదిస్తున్న వాళ్ల దగ్గర ఇలాంటి పలకరింపు మాటలు, పరామర్శలు చేయవలసి రావడం బంధుమిత్రుల సంఘం సభ్యులకు ఒక విషాదకరమైన బాధ్యత.
‘నవతక్క అమ్మనా?’ అని పెద్దామెని చూపించి అడిగాం.
ఇంకా మేమేదో మాట్లాబోయాం. కానీ వాళ్ల గత చేదు అనుభవాలు ఎలాంటివో మరి.
దానికి మిగతా వాళ్లు ఏమీ స్పందించలేదు కాని, ఆమెనే గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ అవునని తలూపింది.
శవాన్ని కూడా తేలేకపోయామనే దు:ఖాన్ని వాళ్లతో పంచుకున్నాం. నవత చెల్లెలు మాట్లాడుతూ .. ‘ఆయన్ను కట్టుకున్నప్పటి నుంచి ఆమెకు అన్నీ కష్టాలే. ఆమె సుఖపడింది లేదు, మేం సుఖంగా ఉన్నది లేదు..’ అన్నది.
అవును కదా సుఖ సంతోషాలకు సగటు మనుషులకు చాలా మామూలు లెక్క లేవో ఉంటాయి. అవి న్యాయమైనవి. వాటికి కూడా నోచుకోకపోతే వాళ్లు తట్టుకోలేరు. అదీ సులోచన సహచరుడు ఎన్నుకున్న మార్గం, చివరికి ఆ మార్గంలోనే ఇద్దరు బిడ్డల తల్లిగా సులోచన వెళ్లిపోయి నవతగా మారడం.. ఇవన్నీ సగటు మనుషులకు కష్టం. ఆమె ఆ ఇంట తొలిచూలు బిడ్డ. మెట్టినింట బాధ్యత గల కోడలు. రైతాంగ మహిళ. స్వతహాగా బీడీలు చుట్టి బతికిన కార్మికవర్గ పుత్రిక. ఆమె సహచరుడు కా. ప్రభాకర్ మాటల్లోనే చెప్పాలంటే ఆయన హదయంలో విరిసిన మల్లియ. ఇన్నింటితోపాటు ఆ ముగ్గురు బిడ్డలకు తల్లి. ఒక విప్లవకారుడికి సహచరి అయినందుకు ఆమె ఆ రోజుల్లో చెల్లించుకున్న మూల్యం సామాన్యమైనదేమీ కాదు.
ఆమె బయట ఉన్న రోజుల్లో పడిన బాధలు వాళ్ల మాటల్లోనే అర్థమవుతున్నాయి. రాజ్యం ఆమె జీవితంతో ఎంత చెలగాటమాడిందో తెలుస్తున్న కొద్దీ గుండె తరుక్కుపోతోంది. పెద్దామ్మాయి వికలాంగురాలు. ఆమెను, మిగతా ఇద్దరు బిడ్డల్ని పెంచడానికి నవత అష్టకష్టాలు పడింది. వికలాంగురాలైన కూతురు మరణించాక ఉద్యమంలోకి వెళ్లింది. ఆమెలో ఎంత పోరాటం ఉన్నదో, ఎంత దు:ఖం ఉన్నదో ఆమె జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది.
అక్కడున్న వాళ్లందరూ తమ వలపోతలో భాగంగా ఆమె గురించి ఎన్నో చెప్పుకొచ్చారు. వాళ్లు సులోచనపడ్డ కష్టాలు గుర్తు చేసుకున్నారు. ప్రభాకర్ అజ్ఞాతానికి వెళ్లిపోయాక ఆయన హదయంలోని మల్లియ ఆయన ఎడబాటుకు ఎంతగా విలవిల్లాడిపోయిందో. ఆమె ఎంత పోలీసు నిర్బంధం అనుభవించిందో వాళ్లు చెప్పారు.
‘ఆయన అట్ల వెళ్లిపోయినా సులోచన బిడ్డల్ని కనిపెట్టుకొని ఉండిపోవచ్చు కదా. ఎవరైనా అట్లే చేస్తారు. కానీ తను అట్ల ఉండలేకపోయింది. బిడ్డల్ని కూడా వదిలేసి ఆయన దగ్గరికే వెళ్లిపోయింది. వాళ్లేం పిల్లలో.. వాళ్లు అందరి పిల్లల్లాగా ఉండకుండా తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లిపోయారు..’ అని కుటుంబసభ్యులు అన్నారు.
ఆ మాటలతో నాకు సులోచన నా మనసును తాకింది. ఆమె అర్ధం కావడం మొదలైంది.
ప్రజల కోసం భర్త, భర్తను అనుసరిస్తూ బైటనే ఉంటూ నిర్బంధం మధ్యనే కార్యకర్తగా ఎదిగి ఉద్యమంలోకి వెళ్లిపోయిన భార్య, తీవ్ర నిర్బంధంలో అజ్ఞాత విప్లవకారుల పిల్లలుగా తల్లిదండ్రులను వెతుక్కుంటూ విప్లవోద్యమంలోకి వెళ్లిపోయిన కొడుకు, కూతురు.
ఒకే సమాజంలో ఒకే కాలంలో మన మధ్య పుట్టి పెరిగిన మనుషులు వీళ్లు. ఈ సమాజాన్ని అర్థం చేసుకొని, ఇక్కడ ఉంటే తాము అనుకున్న పని చేస్తూ బతకలేమని నలుగురూ వేర్వేరు సందర్భాల్లో ఒకే నిర్ణయం తీసుకున్నారు. అయినా కుటుంబం విచ్ఛినం కాకుండా ఎలా కాపాడుకోగలిగారు. కుటుంబ సభ్యులందరి మధ్య ఎంత భావసారూప్యత? ఇలా కుటుంబ సభ్యులందరినీ తనలో ఇమిడ్చుకుంటున్న విప్లవోద్యమం ఎంత గొప్పదో కదా.
తల్లి అమరత్వం తర్వాత సులోచన కుమారుడు ఈ పుస్తకం కోసం రాసిన ఒక రచనలో ఇలా రాశాడు.
‘ఒకనాడు తండ్రికి ఎడమై తల్లి ప్రేమలోనే తండ్రిని చూసుకుంటూ బతికాం. ఇప్పుడు తల్లికి శాశ్వతంగా దూరమై నాన్నలోనే తల్లిని చూసుకుంటున్నాం. అమ్మమ్మా… మేం కఠోరమైన యుద్ధంలో ఉన్నామే. నీవు బిడ్డకు దూరమైనట్లే మేం తల్లికి దూరమయ్యాం. ఈ దోపిడీ వ్యవస్థ కారణంగానే అమ్మకు దూరం కావాల్సి వచ్చాం. అమ్మ మాకు కనిపించదు. ఈ దు:ఖాన్ని ఇలా అక్షరాలతో పంచుకోవడం అసాధ్యం. ఇంటికాడే కాదు విప్లవంలోనూ అమ్మను చాలా గాఢంగా ప్రేమించాం. తలుచుకుంటే మేం ఒంటరయ్యామా అనిపిస్తోంది. అమ్మ స్పర్శ మాయమైంది. చూపుకు అందకుండా పోయింది. చిన్నప్పుడు అమ్మ కొంగుపట్టుకొని మారాం చేసిన రోజులు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మాకు బాల్యంలోని ఇలాంటి ఒకటి రెండు మధురమైన గుర్తులు తప్ప ఏం మిగిల్చిందే ఈ రాజ్యం. మనసు తడిసి ముద్దయిపోతోంది. అమ్మ లేదని అంగీకరించడం కష్టంగా ఉంది.
విప్లవకారులుగా, ఒక విప్లవకారిణి బిడ్డలుగా అమ్మ అమరత్వం అత్యున్నతమైనదని మేం గుర్తించాం. దండకారణ్య ప్రజలూ గుర్తించారు. అందుకే ఆమ్మ అంతిమయాత్రను దగ్గరుండి జరిపించారు…వాళ్లతో దు:ఖాన్ని పంచుకున్న మేం వాళ్లలోనే అమ్మను పొందగలిగాం.. ’ అని రాశాడు.
ఒక మామూలు గృహిణి సులోచన నవతగా మారిన తీరు, ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న తీరు, సమాజంపట్ల, కుటుంబం పట్ల ఆమె బాధ్యత పడ్డ తీరు, సొంత ఆస్తి పునాదిగా ఉండే కుటుంబాన్ని ఉద్యమపరం చేయడం ఆమెలాంటి అరుదైన వ్యక్తులకే సాధ్యం. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నవత జీవితాన్ని, చైతన్యాన్ని ప్రకటిస్తున్నాయి.




