అన్యాయమైన జైలు శిక్ష కారణంగా కోల్పోయిన సంవత్సరాలతరబడి  భారమైన నిశ్శబ్దాన్ని అబ్దుల్ వాహిద్ షేక్ అనుభవించారు. ముంబైకి చెందిన మాజీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన షేక్, 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న 13 మందిలో ఒకరు. ఆయన తొమ్మిదేళ్లపాటు హై-సెక్యూరిటీ జైలులో గడిపారు. 2015లో ఆరోపణలు అన్నీ తప్పుడువని తేలి, నిర్దోషిగా విడుదలైన మొదటి వ్యక్తి ఆయనే. పదేళ్ల తర్వాత మిగిలిన 12 మంది కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. విడుదలైనప్పటి నుండి, అబ్దుల్ వాహిద్ షేక్ తన అనుభవాన్ని న్యాయపోరాటంగా మార్చుకున్నారు. ఉర్దూలో ‘జైలు సాహిత్యం’  పైన పిహెచ్‌డి పూర్తి చేసి, అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారి తరపున ఒక బలమైన గొంతుకగా నిలిచారు.

ఈ సంభాషణలో, 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో భారత సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను షేక్ విశ్లేషించారు. ఐదుగురు సహ నిందితులకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కు కంటే, ప్రభుత్వ జాతీయ భద్రతా వాదనకే కోర్టు ప్రాధాన్యతనిచ్చిందని షేక్ ఈ తీర్పును విమర్శించారు.

ప్రశ్న: మీరు నిర్దోషిగా విడుదలయ్యే ముందు తొమ్మిది ఏళ్లు జైలులో గడిపారు. వ్యవస్థను లోపలి నుండి చూసిన వ్యక్తిగా, ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురు సహ నిందితులకు కఠినమైన నిబంధనలతో కూడిన బెయిల్ ద్వారా దొరికిన “స్వేచ్ఛ”ను మీరు ఎలా చూస్తారు?

సమాధానం: నేను దీన్ని జైలు గోడల వెలుపల ఉన్న మరొక జైలు అని పిలుస్తాను. మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, షిఫా ఉర్ రెహ్మాన్, ముహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు ఇచ్చిన బెయిల్ చాలా పరిమితమైనది; ఆంక్షలతో కూడుకున్నది. వారు ఢిల్లీ విడిచి వెళ్లకూడదు, వారానికి రెండుసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలి; వారి పాస్‌పోర్ట్‌లు లేదా అఫిడవిట్‌లను ఇవ్వాలి. వారు సాంకేతికంగా బయట ఉన్నప్పటికీ, వారికి  స్వేచ్ఛ ఉన్నదనడం కేవలం ఒక భ్రమ మాత్రమే.

ప్రశ్న: ఉమర్ ఖలీద్ విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా పోలీసు ఛార్జ్ షీట్‌పైన ఆధారపడి ఉంది. బెయిల్ నిరాకరించడానికి ఈ ఆరోపణలనే ప్రాథమిక ఆధారంగా కోర్టు పరిగణించడాన్ని మీరు ఏమనుకుంటున్నారు?

సమాధానం: ఇది తీవ్ర విచారకరమైన విషయం. కోర్టు తన ఉత్తర్వుల్లో పదేపదే ఛార్జ్ షీట్‌ను పరమ సత్యంలా ప్రస్తావించింది. విచారణ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి, ఈ ఆరోపణలను వాస్తవాలుగా కోర్టు పరిగణించకూడదని మేము నమ్ముతున్నాము. ఒకవైపు, అల్లర్లలో ఉమర్ ఖలీద్‌కు ఎటువంటి సంబంధం లేదని ఛార్జ్ షీట్ అంగీకరిస్తూనే, మరోవైపు “రక్షిత సాక్షులు” ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కుట్ర జరిగినట్లు ఆరోపిస్తోంది. ఈ సాక్షులు వాస్తవానికి పోలీసు గూఢచారుల లాగా పనిచేస్తారు. అటువంటి సాక్షుల విశ్వసనీయత ప్రశ్నార్థకమైనప్పటికీ, సుప్రీంకోర్టు వారి స్టేట్‌మెంట్‌లపైన ఆధారపడి బెయిల్‌ను తిరస్కరించింది.

చక్కాజామ్ (రోడ్డు దిగ్బంధనం) నిరసనల్లో ఉమర్ ఖలీద్ పాల్గొన్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది; అదే సమయంలో అల్లర్లతో అతనికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, నిరసనలో పాల్గొన్నవారిని కారం పొడి, రాళ్లు, కత్తులను తయారుగా ఉంచమని చెప్పిన కుట్ర సమావేశాల్లో అతను భాగస్వామి అని అదే ఛార్జ్ షీట్ ఆరోపిస్తోంది. ఈ అంతర్గత వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమర్ ఖలీద్ తనను తాను గాంధేయవాదిగా, రాజ్యాంగంపై నమ్మకం ఉన్న వ్యక్తిగా ఎప్పుడూ చెప్పుకుంటారు; అతను హింసను సమర్థించడు, ఎప్పుడూ హింసకు పాల్పడలేదు.

తీర్పులోని 207వ పేరాలో, సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్‌ను దాదాపు యథాతథంగా ఉటంకించింది. ముస్లిం నిరసనకారులే హింసను ప్రారంభించారని, హిందూ-ముస్లింలు కలిసి ఉన్న చోట హిందువులపై రాళ్లు, కత్తులు, యాసిడ్, పెట్రోల్ బాంబులతో పెద్ద ఎత్తున దాడి చేశారని పేర్కొంది. ఈ ఆరోపణలను నమోదు చేస్తున్నప్పుడు, న్యాయమూర్తి—కేవలం ఛార్జ్ షీట్‌పై ఆధారపడి—ఈ చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం గెరిల్లా యుద్ధం వంటి పరిస్థితిని సృష్టించడం; చివరికి ప్రభుత్వాన్ని పడగొట్టడమేనని గమనించారు. ఈ వాదనలన్నీ పూర్తిగా కేవలం పోలీసులు ఛార్జ్ షీట్‌లో నమోదు చేసినవే.

ప్రశ్న: హింస జరిగిన ప్రదేశంలో ఉమర్ ఖలీద్ లేడని తీర్పు పేర్కొన్నప్పటికీ, బెయిల్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

సమాధానం: ఇది స్థాపిత న్యాయశాస్త్ర సూత్రాలను (జ్యూరిస్‌పృడెన్స్) పూర్తిగా తలకిందులు చేస్తోంది. అతను ఘటన స్థలంలో లేడనే అంశాన్ని కోర్టు అతనికి అనుకూలంగా పరిగణించి ఉండాల్సింది. కానీ దానికి బదులుగా, అతను ఎక్కడో దూరంగా ఉండి దీనిని ప్లాన్ చేసిన “మాస్టర్‌మైండ్” అనే పోలీసు వాదననే కోర్టు అనుసరించింది. అంటే, ఒక నేరం జరిగిన చోట లేని వ్యక్తిని కూడా కేవలం “సమాచారవేగుల”  కథనాల ఆధారంగా నిరవధికంగా జైలులో ఉంచవచ్చని దీని అర్థం. సమాచారకర్తల గుర్తింపును కాపాడాలనే నెపంతో, పోలీసులు తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ల ద్వారా జీవితాలను నాశనం చేయగలరు. సుప్రీంకోర్టుతో సహా మన కోర్టులు ఈ సమాచారాన్ని ఏమీ ప్రశ్నించకుండా స్వీకరిస్తున్నాయి.

ప్రశ్న: పోలీసుల కథనాలపైన కోర్టు ఆధారపడటం గురించి మరికొంచెం వివరిస్తారా?

సమాధానం: 213వ పేరాలో, ఉమర్ ఖలీద్ ‘ధర్నా’కు, ‘చక్కా జామ్’కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించాడని, బృంద సభ్యుల పేర్లను పేర్కొన్నాడని, సరైన సమయంలో అమలు చేయాల్సిన ప్రణాళికను వివరించాడని ఒక రక్షిత సాక్షి పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు నమోదు చేసింది. ఆ సాక్షి స్టేట్‌మెంట్ పూర్తిగా నమ్మదగినది కాదని, దానిని యథాతథంగా తీసుకోకూడదని కోర్టు స్వయంగా గమనించింది. అయినప్పటికీ, ఖలీద్‌ను మాస్టర్‌మైండ్‌గా నిర్ధారించడానికి కోర్టు అదే సాక్షిపైన ఆధారపడింది.

ఢిల్లీ అల్లర్ల సమయంలో తాను అక్కడ ప్రత్యక్షంగా లేనని ఖలీద్ పదేపదే వాదించారు. దీనిని అతనికి ఉపశమనం కలిగించే అంశంగా చూడటానికి బదులుగా, అతను అక్కడ ఉన్నాడని తాము కూడా అనడం లేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్న విషయాన్ని కోర్టు గమనించింది. కానీ, హింసను అతనే ప్లాన్ చేశాడని, ప్రేరేపించాడనే పోలీసుల ఆరోపణను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఈ విధానం “నేరం నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి” అనే ప్రాథమిక న్యాయ సూత్రాలను బలహీనపరుస్తుంది. ఈ మొత్తం కథనం పోలీసు ఇన్‌ఫార్మర్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. వీరి కథనాలు తరచుగా స్వతంత్ర ధృవీకరణ లేకుండానే ఎఫ్‌ఐఆర్‌లకు, అరెస్టులకు దారితీస్తాయి. జర్నలిస్ట్ రవీష్ కుమార్ పేర్కొన్నట్లుగా, ఇటువంటి విధానాలను చారిత్రాత్మకంగా అసమ్మతిని నేరంగా మార్చడానికి దుర్వినియోగం చేసారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనలో నిరసనలు తెలుపుతామని ఖలీద్ ప్రకటించినట్లు ఛార్జ్ షీట్ పేర్కొంది. ఇది నిజమే అయినా, ఒక విదేశీ నాయకుడి పర్యటనలో శాంతియుత నిరసనకు పిలుపునివ్వడం నేరం కాదు. అసమ్మతిని నేరంగా పరిగణించడానికి చట్టపరమైన ఆధారం లేదు; ఒకవేళ దీనిని విస్తృతంగా వర్తింపజేస్తే, భారతదేశంలో జరిగిన లెక్కలేనన్ని చట్టబద్ధమైన నిరసనలపై ఎఫ్ఐఆర్‌లు, జైలు శిక్షలు విధించాల్సి వచ్చేది.

ప్రశ్న: తీర్పులో ఆర్టికల్ 21, ఉపా చట్టంలోని సెక్షన్ 43D(5) మధ్య స్పష్టమైన ఘర్షణ కనిపిస్తోంది. ప్రాథమిక హక్కులు, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల మధ్య సమతుల్యతను కాపాడటంలో కోర్టు పడుతున్న ఇబ్బందిని ఇది ప్రతిబింబిస్తోంది.

సమాధానం: 33వ పేరాలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా సుదీర్ఘ కాలం పాటు జైలులో ఉంచడం, దాని వల్ల వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం గురించి ప్రశ్నించారు. సుదీర్ఘ నిర్బంధాన్ని విడిగా చూడకూడదని, అన్ని సంబంధిత అంశాలతో కలిపి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను ఆర్టికల్ 21ని సెక్షన్ 43D(5) కంటే పైన లేదా కింద ఉంచడం కంటే, ఆర్టికల్ 21 చెల్లకుండా పోతుందా అనే కోణంలో అంచనా వేయాలని ఆయన ప్రశ్న లేవనెత్తారు.

రాజ్యాంగ దృక్పథంలో, ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే ఆర్టికల్ 21 అత్యున్నత స్థానాన్ని ఆక్రమిస్తుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడిన ఉపా చట్టమూ ఆ తరువాత   తీసుకువచ్చిన సెక్షన్ 43D(5) వంటి సవరణలను రాజ్యాంగంతో సమానంగా చూడలేము; అవి ఖచ్చితంగా తక్కువ స్థాయిలోనే ఉండాలి. కాబట్టి, ఈ తీర్పులో ఆర్టికల్ 21ని ఉపా చట్టంతో సమానమైన ప్రాతిపదికన ఉంచడం అనేది అంగీకరించడం కష్టం.

జాతీయ భద్రతా అంశాలలో ఆర్టికల్ 21ని జాగ్రత్తగా (Caution) వర్తింపజేయాలని పార్లమెంటు గమనించినట్లు కూడా కోర్టు ఉత్తర్వు పేర్కొంది. ఇది ఇన్‌ఫార్మర్లు అందించిన తప్పుడు సమాచారమూ లేదా తప్పుడు ఆరోపణల ద్వారా నిర్బంధాన్ని సమర్థించుకోవడానికి అధికారంలో ఉన్నవారు ఉపయోగించే ఒక తెలిసిన కథనాన్ని ప్రతిబింబిస్తోంది. జాతీయ భద్రతకు ఎటువంటి ప్రత్యక్ష ముప్పు లేని సందర్భాల్లో, స్వతంత్ర న్యాయ సమీక్ష కంటే పార్లమెంటు వైఖరిపైనే కోర్టు ఆధారపడటం చాలా ఆందోళనకరం.

తీర్పులోని 51వ పేరాలో, ఆర్టికల్ 21 కేవలం వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రమే కాకుండా, పౌరుల స్వేచ్ఛను, జాతీయ భద్రతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అంటే, ఐదేళ్లుగా జైలులో ఉన్న వ్యక్తి స్వేచ్ఛ కంటే, ఇంకా కేవలం ఆరోపణల దశలోనే ఉన్న జాతీయ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ఇప్పటికే స్వేచ్ఛగా ఉన్నవారి భద్రతను నొక్కి చెబుతున్న కోర్టు, జైలులో ఉన్న వ్యక్తి పట్ల చాలా తక్కువ ఆందోళనను చూపుతోంది.

ఈ విధానం ఆర్టికల్ 21ని బలహీనపరుస్తుంది; సెక్షన్ 43Dని బలపరుస్తుంది. 53వ పేరాలో కోర్టు దీనిని తిరస్కరించినప్పటికీ, ఆచరణలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది: సుదీర్ఘకాలం జైలులో ఉన్నప్పటికీ ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్‌ను నిరాకరిస్తున్నారు. ప్రాథమిక హక్కులను ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి లోబడి ఉంచినట్లు ఇది నిరూపిస్తోంది.

ప్రశ్న: బెయిల్‌కు బదులుగా వేగవంతమైన విచారణను కోర్టు సూచించింది, కానీ ఎటువంటి ఖచ్చితమైన సమయ పరిమితిని విధించలేదు. మీ అనుభవంలో, ట్రయల్ కోర్టులలో ఇది ఎలా జరుగుతుంది?

సమాధానం: నా అనుభవంలో, ఇటువంటి ఆదేశాలు ఒక ప్రహసనం. తమపై పనిభారం ఎక్కువగా ఉందని, ఒకే కేసుకు సంబంధించి రోజువారీ విచారణలు చేపట్టలేమని ట్రయల్ కోర్టులు వాదిస్తాయి. ఒక సంవత్సరంలో విచారణ పూర్తి కాకపోతే ఉమర్ ఖలీద్ మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది, కానీ ఇవి కేవలం డొల్ల వాగ్దానాలు మాత్రమే. మరోవైపు, ప్రాసిక్యూషన్ సాక్షుల వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతుంది, దీనివల్ల సరైన క్రాస్ ఎగ్జామినేషన్ అసాధ్యం అవుతుంది. ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలి, ఎందుకంటే ప్రతి పౌరుడిలో తలెత్తే ప్రశ్న ఏమిటంటే: “ఎంత కాలం వేచి ఉండటం అనేది మరీ ఎక్కువ కాలం అవుతుంది?”

సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణకు ఆదేశించినప్పటికీ, ఖచ్చితమైన గడువును నిర్ణయించడంలో విఫలమైంది. స్పష్టమైన కాలపరిమితి లేకపోతే, అధికారులు విచారణను నిరవధికంగా పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ తీర్పు పౌరులను వారి హక్కుల విషయంలో అనిశ్చితిలో పడేస్తుంది; రాజకీయ కార్యకర్తలు, అసమ్మతివాదుల పట్ల అనుసరించే విధానంపై ఆందోళనకరమైన ముందస్తు ఉదాహరణను (ప్రిసిడెంట్) సెట్ చేస్తుంది.

ప్రశ్న: ఉపా కింద ఉగ్రవాదాన్ని సుప్రీంకోర్టు విస్తృతంగా వివరించడం, ముఖ్యంగా పౌర నిరసనలకు సంబంధించి, వ్యక్తిగత స్వేచ్ఛ, బెయిల్ పొందే అవకాశంపైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది?

సమాధానం: తీర్పులోని 87వ పేరాలో, కోర్టు ఉపా చట్టంలోని సెక్షన్ 15 కింద ‘ఉగ్రవాద చర్య’ నిర్వచనాన్ని పరిశీలించింది. పార్లమెంటు దీనిని “ఏ పద్ధతిలోనైనా”; “మరే ఇతర రూపంలోనైనా” వంటి అసంపూర్ణ పదబంధాలతో అస్పష్టంగా వదిలేసిందని గమనించింది. చట్టాన్ని దాని పరిమితులకు లోబడి వివరించడానికి బదులుగా, కోర్టు దానిని మరింత విస్తరించింది. పాలకుల లేదా పోలీసుల దృష్టిలో శాంతి భద్రతలకు లేదా దేశానికి భంగం కలిగించే ఏ చర్యకైనా ఉగ్రవాద ముద్ర వేసేలా దీనిని మార్చింది. ఇది అత్యంత ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది సాధారణ నిరసనలను కూడా నేరంగా మార్చడానికి, తద్వారా అరెస్టులకు, ఏళ్ల తరబడి జైలు శిక్షలకు దారితీస్తుంది. ఉమర్ ఖలీద్ విషయంలో బాంబు పేలుళ్లు జరగలేదు, ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదు. అల్లర్లను ఒక హిందూ-ముస్లిం కోణంలో చిత్రించారు; ముస్లిం నిరసనకారులను ముప్పుగా చిత్రీకరించారు. దీనిని సామాజిక సమస్యగా గుర్తించి బెయిల్ ఇవ్వడానికి బదులుగా, కోర్టు సెక్షన్ 15ను మరింత విస్తరించింది, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తుంది.

తీర్పులోని 88వ పేరా ఇంకా ముందుకు వెళ్లి, పౌర జీవనానికి లేదా సామాజిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ఏ చర్య అయినా జాతీయ భద్రత కిందికే వస్తుందని పేర్కొంది. అంటే, చట్టాలకు లేదా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేసే శాంతియుత నిరసనలు పౌర దినచర్యకు ఆటంకం కలిగిస్తే, వాటిని ఉగ్రవాదంగా పరిగణించవచ్చు. ఇది అసమ్మతిని తెలిపే ప్రజాస్వామిక హక్కును ప్రమాదంలో పడేసే అత్యంత విస్తృతమైన వివరణ.

సెక్షన్ 15లోని “మరే ఇతర రూపంలోనైనా” అనే అస్పష్టమైన పదబంధాన్ని ‘చక్కా జామ్’లు (రోడ్డు దిగ్బంధనాలు), బైఠాయింపులు, ప్రణాళికాబద్ధమైన ఆటంకాలను చేర్చేలా కోర్టు స్పష్టంగా వివరించింది. దీనిని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం- 1999 (ఎమ్‌సిఒసిఎ)కింద ఉన్న ఒక చట్టపరమైన సమస్యతో పోల్చవచ్చు. ఆ చట్టంలోని ఒక సెక్షన్ ప్రకారం, ఒక వ్యక్తిపై ఆ చట్టం కింద కేసు నమోదై, ఇతర కేసులు కూడా పెండింగ్‌లో ఉంటే, ఎమ్‌సిఒసిఎ విచారణ ముగిసే వరకు మిగిలిన విచారణలన్నింటినీ వాయిదా వేస్తారు.

ఆచరణలో, ఇది సుదీర్ఘకాలం జైలులో ఉండటానికి దారితీసింది. ఎందుకంటే ఎమ్‌సిఒసిఎ విచారణలు ఆలస్యమయ్యేవి; నిందితుడు ఎమ్‌సిఒసిఎ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత కూడా ఇతర కేసుల కారణంగా ఏళ్ల తరబడి జైలులోనే ఉండాల్సి వచ్చేది. జస్టిస్ థిప్సే శాసనానికి ఉన్న ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దీని ఉద్దేశ్యం పౌరులను శిక్షించడం కాదని, ఎమ్‌సిఒసిఎ విచారణకు ప్రాధాన్యత ఇచ్చి దానిని సమర్థవంతంగా ముగించడమేనని స్పష్టం చేశారు. ఇతర విచారణలను అనవసరంగా నిలిపివేయకూడదని; ఆలస్యాలు జైలు శిక్షను పొడిగించకూడదని ఆయన నొక్కి చెప్పారు.

అస్పష్టమైన చట్టపరమైన భాష పౌరులకు అనుకూలంగా మారుతుందా లేదా వ్యతిరేకంగా మారుతుందా అనేది న్యాయపరమైన వివరణ ఎలా నిర్ణయిస్తుందో ఈ ఉదాహరణ వివరిస్తుంది. ఉపా కేసులో, ‘చక్కా జామ్’ వంటి శాంతియుత పౌర నిరసనలను “మరే ఇతర రూపంలోనైనా” అనే నిర్వచనం నుండి మినహాయించి కోర్టు వివరించి ఉండవచ్చు. కానీ దానికి బదులుగా, పౌర నిరసనలను ఉగ్రవాద చర్యలుగా పరిగణిస్తూ ప్రతికూల వివరణను ఎంచుకుంది. సెక్షన్ 15 కి ఉన్న పరిధి; వ్యక్తిగత స్వేచ్ఛపైన దాని ప్రభావం పూర్తిగా న్యాయ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని ఇది నిరూపిస్తుంది. ఈ సందర్భంలో, చట్టబద్ధమైన అసమ్మతిని అణచివేసేలా చట్టాన్ని విస్తరించడానికి ఆ విచక్షణను ఉపయోగించారు.

ప్రశ్న: ఉమర్ ఖలీద్ నిరసనలను జాతీయ భద్రతకు ముప్పుగా చిత్రీకరించడంలో, ఆధారాలను ధృవీకరించకుండా లేదా అహింసా ఉద్దేశ్యాన్ని అంచనా వేయకుండా పోలీసులు చెప్పిన వాదనలపైన కోర్టు ఆధారపడడాన్ని, ఉపా చట్టం కింద చట్టబద్ధమైన అసమ్మతిని వివరించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

సమాధానం: తీర్పులోని 227వ పేరాలో, ప్రతి నిరసన ప్రమాదకరమైనది కాదని లేదా ఉపా కిందకు రాదని స్పష్టం చేయడానికి కోర్టు ప్రయత్నించింది. అయితే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే నిరసనలపైన ఈ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చని పేర్కొంది. ఉమర్ ఖలీద్ చర్యలను ఈ చట్రంలోనే కోర్టు వర్గీకరించింది. అయితే, ఈ కథనం పూర్తిగా పోలీసుల నుండి వచ్చింది. తాను అహింసా మార్గాన్ని అనుసరిస్తానని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ఖలీద్ తన అమరావతి ప్రసంగంతో సహా నిరంతరం చెబుతూనే ఉన్నారు. ఒక వ్యక్తి స్పష్టంగా అహింసకు కట్టుబడి ఉన్నప్పుడు, అది దేశానికి ముప్పుగా ఎలా మారుతుందో అర్థం చేసుకోవడం కష్టం. కోర్టు విధానం ఈ వ్యత్యాసాన్ని తప్పుగా చిత్రీకరిస్తోంది లేదా పోలీసు స్టేట్‌మెంట్‌లను ఎటువంటి ప్రశ్నలు లేకుండా నమ్ముతోంది.

తీర్పులోని 228వ పేరాలో, రాజధానిలో పలు రోడ్లను దిగ్బంధించారని పేర్కొంటూ, ఖలీద్ ఇచ్చిన ‘చక్కా జామ్’ పిలుపును కోర్టు “అత్యంత ప్రమాదకరమైనది”గా పరిగణించింది. అయితే, దీనివల్ల ఎన్ని అత్యవసర సేవలు ప్రభావితమయ్యాయి, అంబులెన్సులు లేదా మందుల సరఫరాలో ఆలస్యం జరిగిందా, లేదా ఏవైనా ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయా అనే కీలక ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేదు. కేవలం పౌర జీవనానికి ఆటంకం కలిగిందని చెప్పడం సరిపోదు. పోలీసుల వాదనలను ధృవీకరణ లేకుండా అంగీకరించడం న్యాయపరమైన పరిశీలనను బలహీనపరుస్తుంది.

229వ పేరా ఇంకా ముందుకు వెళ్లి, నగరం మొత్తాన్ని ప్రభావితం చేయడానికి నిరసనలను ఉద్దేశపూర్వకంగా ప్రధాన ప్రాంతాలకు మార్చారని గమనించింది. ఇటువంటి వాదనలను నిరూపించడానికి, కోర్టు నిరసన ప్రాంతాలకు సంబంధించిన వివరణాత్మక మ్యాప్‌ను ధృవీకరణ కోసం అడిగి ఉండాల్సింది. ఇటువంటి సాక్ష్యాధారాల ప్రక్రియను విస్మరించడం వల్ల, పరీక్షించని వాదనల ఆధారంగా చట్టబద్ధమైన అసమ్మతిని నేరంగా పరిగణించే ప్రమాదం ఉంది.

ప్రశ్న: ఉపా కేసులలో రికవరీలు (వస్తువుల స్వాధీనం), కుట్రపూరిత సమావేశాలకు సంబంధించి కోర్టు అనుసరిస్తున్న విధానం, ‘నిరూపణ బాధ్యతను’ ఎలా మారుస్తుంది? ఇది సామాజిక క్రియాశీలతను, అసమ్మతిని నేరంగా మార్చే ప్రమాదం ఉందా?

సమాధానం: తీర్పులోని 215వ పేరాలో, సాధారణ ఐపిసి నిబంధనల కంటే ఉపావంటి ప్రత్యేక చట్టాల కింద ‘రికవరీలు’ తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే, ఎవరినైనా కుట్రదారుడని ఆరోపిస్తే, ఎటువంటి వస్తువులూ లేదా సాక్ష్యాధారాలూ లభించకపోయినా, కేవలం ఆ ఆరోపణే వారిని నిర్బంధంలో ఉంచడానికి సరిపోతుందని దీని అర్థం. సాంప్రదాయకంగా, రికవరీలు లేకపోవడం అనేది నిందితుడికి అనుకూలమైన అంశంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ సూత్రం తలకిందులైంది. ఇప్పుడు, కృత్రిమంగా సృష్టించిన ఆధారాలు లేదా తప్పుడు రికవరీలు లేకపోయినా, కేవలం పోలీసులు చేసే ఆరోపణతోనే జైలు శిక్షను కొనసాగించవచ్చు. ఇది ప్రత్యేక చట్టాల కింద అరెస్టు చేయడానికి ఉండాల్సిన కనీస ప్రమాణాలను తగ్గించేస్తోంది.

తీర్పులోని 217వ పేరా, ఉమర్ ఖలీద్ మొదటి నుండి చివరి వరకు ఈ కుట్రలో పాల్గొన్నాడనడానికి అతను వరుసగా సమావేశాలకు హాజరు కావడమే నిదర్శనమని పేర్కొంటూ దీనిని మరింత బలపరుస్తోంది. ఈ సమావేశాలు కేవలం నిరసనలకు సంబంధించినవి అయినప్పటికీ, వీటిని కుట్రపూరిత చర్చలుగా కోర్టు వివరించడం పోలీసుల కథనాన్ని బలపరుస్తోంది. ఈ తీర్పు ఒక ప్రమాదకరమైన ముందస్తు ఉదాహరణను నిర్దేశిస్తోంది: సామాజిక క్రియాశీలత, అసమ్మతి, బహిరంగ సమావేశాల్లో పాల్గొనడాన్ని కూడా కుట్రగా భావించవచ్చు, ఇది ప్రభుత్వం బెయిల్‌ను నిరాకరించడాన్ని సులభతరం చేస్తుంది. ఉమర్ ఖలీద్ చట్టబద్ధమైన అసమ్మతికి ఎదురవుతున్న ఈ ముప్పుకు ఒక చిహ్నంగా మారారు. ప్రజాస్వామిక స్వేచ్ఛను కాపాడటానికి ఇటువంటి వివరణలను సవాలు చేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.

ప్రశ్న: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల కలిగే విస్తృత పరిణామాలు ఏమిటి?

సమాధానం: ఈ తీర్పు ఉగ్రవాద నిర్వచనాన్ని విస్తరిస్తుంది, వారి అహింసా, రాజ్యాంగబద్ధమైన వైఖరిని విస్మరిస్తుంది; కేవలం ఆరోపణలనే నిరంతర నిర్బంధానికి తగిన ఆధారాలుగా పరిగణిస్తుంది. కుట్రదారులకు ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా ఉండటం అనవసరం అని కోర్టు తీర్పు ఇచ్చింది. వస్తువుల స్వాధీనం లేకపోవడాన్ని కూడా కోర్టు కొట్టిపారేసింది; వారి ఆదేశాల మేరకు పనిచేసే వారి వద్దే సామాగ్రి ఉంటుందని తర్కించింది. చివరికి, అహింస పట్ల ఖలీద్‌కున్న బహిరంగ నిబద్ధతను కూడా రహస్య ప్రణాళికలను దాచిపెట్టే ఒక ముసుగుగా కోర్టు అభివర్ణించింది.

 ఈ విధానం భారతదేశంలో అసమ్మతి తెలియచేసేవారికి అత్యంత ప్రమాదకరమైనది. రాజకీయ క్రియాశీలతను లేదా వ్యతిరేకతను కేవలం సాంగత్యం లేదా ఉద్దేశ్యం ఆధారంగా నేరంగా పరిగణించవచ్చని ఇది సూచిస్తోంది. బెయిల్ నిరాకరించడం వల్ల, ఉపా చట్టమూ, సెక్షన్ 43Dల కింద సుదీర్ఘకాలం జైలులో ఉంచడాన్ని నియంత్రించే ఒక బలమైన ముందస్తు ఉదాహరణ లభించే అవకాశాన్ని కోల్పోయాము. కొంతమంది చిన్నపాటి నిందితులకు ఉపశమనం లభించినప్పటికీ, వారిని కేవలం ఖలీద్, ఇమామ్ వంటి కుట్రదారుల ఆదేశాల మేరకు పనిచేసిన పావులుగానే కోర్టు పరిగణించింది. ఇది 1993 బొంబాయి పేలుళ్ల వంటి పాత కేసులను గుర్తుకు తెస్తోంది; అక్కడ కూడా చర్యలకు పాల్పడిన వారికి, వాటి వెనుక ఉన్న సూత్రధారులకు వేర్వేరు శిక్షలు పడ్డాయి. ఇది న్యాయమూ, నిష్పత్తి పైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొత్తంగా చూస్తే, ఈ తీర్పు న్యాయవ్యవస్థ తీసుకున్న స్వతంత్ర నిర్ణయంలా కాకుండా, ఒక రాజకీయ కథనాన్ని అమలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది న్యాయం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.

ప్రశ్న: నిరసనలను “శాంతియుతమైనవి కాకపోవచ్చు” అని సుప్రీంకోర్టు వర్గీకరించడం, చట్టబద్ధమైన అసమ్మతికి, ఉగ్రవాదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

సమాధానం: ప్రజాస్వామ్యం నిరసనలకు అవకాశం ఇస్తుందని, అయితే ప్రణాళికాబద్ధమైన విధ్వంసాన్ని సహించలేమని కోర్టు పేర్కొంది. అయితే, శాంతియుత నిరసనకు, విధ్వంసకర నిరసనకు మధ్య ఉన్న తేడాను కోర్టు ఎలా నిర్వచిస్తుందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. షాహీన్ బాగ్ సహా సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్‌ఆర్‌సి(జాతీయ పౌర పట్టిక) కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలన్నీ శాంతియుతమైనవే. నిరసనకారులు జాతీయ జెండాను ఎగురవేశారు, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను ప్రదర్శించారు, జాతీయ గీతాన్ని ఆలపించారు; రాజ్యాంగాన్ని గౌరవించారు. వారి ఉద్దేశ్యం అసమ్మతిని వ్యక్తపరచడం; ప్రభుత్వం తమ మాట వినేలా చేయడం మాత్రమే, హింసను ప్రేరేపించడం కాదు.

అయినప్పటికీ, నిరసనలు సుదీర్ఘకాలం కొనసాగాయని, అనేక సమావేశాలు, సమన్వయం, ప్రసంగాలు, వివిధ ప్రాంతాలకు తరలివెళ్లడం వంటివి ఉన్నాయని పేర్కొంటూ, కోర్టు వీటిని “శాంతియుతమైనవి కాకపోవచ్చు” అని పరిగణించింది. ఈ క్రమంలో, కోర్టు రక్షిత సాక్షుల వాంగ్మూలాలపై ఎక్కువగా ఆధారపడింది; వీరి గుర్తింపు, విశ్వసనీయత ఇంకా ధృవీకరణకాలేదు, పైగా వీరి సాక్ష్యాలు పోలీసుల ఒత్తిడి వల్ల ప్రభావితమై ఉండవచ్చు. సమాచార హక్కు అభ్యర్థనలను అడ్డుకున్నారు; సాక్షుల స్టేట్‌మెంట్‌లను వివిధ దశల్లో గోప్యంగా ఉంచారు, అయినప్పటికీ కోర్టు వాటిని “పరమ సత్యం”గా పరిగణించింది. ఈ విధానం విచారణకు ముందే శిక్షను ఖరారు చేయడమే కాకుండా, చట్టబద్ధమైన అసమ్మతికి, ఉగ్రవాదానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపివేస్తుంది, తద్వారా న్యాయాన్ని, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును దెబ్బతీస్తుంది.

‘చక్కా జామ్’ను ఉగ్రవాద చర్యగా నిర్వచించలేము. ఇది తమ హక్కులకు, గుర్తింపుకు, పౌరసత్వానికి ముప్పు కలిగించే చర్యలకు వ్యతిరేకంగా మైనారిటీలు చేపట్టిన నిరసన. కోర్టు దీనిని సానుకూల కోణంలో వివరించి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. పార్లమెంటు ఉద్దేశపూర్వకంగా వదిలేసిన వాటిని కూడా న్యాయమూర్తి చేర్చడానికి ప్రయత్నించడం చాలా విచారకరం.

ప్రశ్న: ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద తప్పుడు ఆరోపణలతో వ్యక్తిగతంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా, ఈ తీర్పు విన్నప్పుడు మీకు ఏమనిపించింది?

సమాధానం: చట్టం మనల్ని తాకదు అని మనం అనుకోవచ్చు, కానీ తొమ్మిది ఏళ్లు జైలులో గడిపిన వ్యక్తిగా, మరికొందరు 19 ఏళ్లు గడిపిన విషయం తెలిసిన వ్యక్తిగా, దాని ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో మాకు తెలుసు. కోర్టు ఉపా లేదా సెక్షన్ 43 తీవ్రతను తగ్గిస్తుందని నేను ఆశించాను, కానీ ఈ తీర్పు పోలీసులను బలపరుస్తుంది; సామాన్య పౌరుల స్వేచ్ఛను బలహీనపరుస్తుంది. ఇది చదివినప్పుడు నాకు భయం, ఉద్వేగం, అలసట; కొన్నిసార్లు చిరాకు కలిగాయి; వారి కపటత్వం నన్ను ఆశ్చర్యపరిచింది. వారు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూనే, ఆర్టికల్ 21 పట్ల తమకు ఆందోళన ఉందని చెప్పుకుంటారు. ఐదుగురికి బెయిల్ రావడం మంచిదే, కానీ వారిపై విధించిన షరతులు అన్యాయంగా ఉన్నాయి. గతంలో దీనివల్ల ప్రభావితమైన వ్యక్తిగా, ఈ తీర్పు పౌర హక్కులను కాపాడటానికి బదులుగా ప్రభుత్వ అధికారాన్ని బలపరుస్తున్నట్లు నాకు అనిపిస్తోంది.

రచయిత్రి గురించి:

నిష్ఠా సూద్ లండన్‌లో నివసిస్తున్నారు. ఆమె SOAS (లండన్ విశ్వవిద్యాలయం) నుండి పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిగ్రీ పొందారు. 2017 నుండి ఆమె అబ్దుల్ వాహిద్ షేక్‌తో కలిసి పని చేస్తున్నారు. నిందితులు, వారి కుటుంబాల కథనాలను డాక్యుమెంట్ చేస్తున్నారు.

2026 జనవరి 13

https://frontline.thehindu.com/interviews/umar-khalid-sharjeel-imam-uapa-civil-liberty-interview/article70505267.ece?utm_source=relatedstories&utm_medium=article&utm_campaign=trackRelArt

Leave a Reply