కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది.
ఈ పుస్తకాన్ని రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ.
నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే మార్గం. ‘ప్రజాస్వామ్యం లేకుండా శాంతి, శాంతి లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు’అని ముందు మాటలో స్పష్టంగా చెప్పారు రచయిత . “ద న్యూస్ మినిట్” ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, పరిశోధనాత్మక జర్నలిస్టు సుదీప్తో మండల్ చేసిన ఇంటర్వ్యూలో… సమకాలీన సామాజిక, పాలనా పరిస్థితులపై హింసపై శాంతి ప్రాధాన్యతను వివరిస్తూ లోతైన సుదీర్ఘమైన చూపు నిచ్చారు. ఇవాళ కమ్ముకున్న చిమ్మ చీకట్ల నుంచి బయటపడే వెలుగు నూ ఇచ్చారు. ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ “ప్రస్తుత పాలకులు కార్పొరేట్ తరహా అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు. దానిపట్ల వాళ్లకు రెండో ఆలోచన లేదు.” అని స్పష్టం చేస్తూ వర్తమాన పరిణామాల మూల కారణాల్ని మన కళ్ళ ముందు ఉంచుతారు. చాలా లోతైన అవగాహనను అందించే ఈ పుస్తకం లో ఒక చోట హరగోపాల్ సార్ అంటారు “గాంధీ చూసిన రీతిలో మీరు చరిత్రను చూడండి” అని. ఇది పుస్తకాన్ని చదివితే కానీ మనకు అర్థం అవ్వదు. ఇంకా”మావోయిస్టు పార్టీ అణిచివేయ బడింది అనుకుందాం! అప్పుడు ప్రభుత్వం యధేచ్ఛగా ఖనిజ నిక్షేపాల తవ్వకాలకు పాల్పడితే, ఆదివాసీలు ఏం చేస్తారు?” ఇది మనందరినీ ఆలోచింప జేసే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెబుతూ రచయిత అంటారు. ఆదివాసీలకు ఈ దేశంలో 200 సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్నదని, చరిత్ర పొరల్లోంచి వర్తమానాన్ని, భవిష్యత్తును చూడాలంటారు. ఈ ఇంటర్వ్యూలోని అనేక అంశాల్ని చాలా లోతుగా ప్రశ్నించడమూ అదే విధంగా విశ్లేషించడాన్నీ చూస్తాం.
ఈ పుస్తకంలో మరొక ఇంటర్వ్యూ సిఎస్ క్షేత్రపాల్ గారు చేశారు.”అణచివేత ఉన్నంతవరకూ తిరుగుబాట్లు ఆగవు. అంతిమ యుద్ధం తాత్కాలికమే” శీర్షికతో ఇది ఉంది. ఇందులో హరగోపాల్గారు కొన్ని లోతైన ప్రశ్నలు వేశారు.
1.రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన రక్షణలు ఏమిటి?
2.ఆపరేషన్ కగార్ అంటే ఏమిటి? దీన్ని ఎలా చూడాలి?
3. ఆదివాసీలపై బీజేపీ, సంఘ్ పరివార్ ల వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి?
4. ఆదివాసీ సమాజం కోరుకుంటున్నది ఏమిటి?
మొదలైన ప్రధానమైన అంశాలపై ప్రొఫెసర్ హరగోపాల్ గారి వివరణలు విశ్లేషణ మనకు ఈరోజు అవసరమైన అవగాహనను అందిస్తాయి. అవి సమాజమంతా ఆలోచించాల్సినవీ, పాలకులను ప్రశ్నించాల్సినవీ.
ఇందులో శంకరన్ గారి స్మారకోపన్యాసం పౌర స్పందన వేదికను గురించి,తెలుగు సమాజంలోని పెద్దలు ఆశావహ దృక్పథంతో సమాజం పై ప్రేమతో బాధ్యతతో శాంతి కోసం చేసిన కృషి ఫలితంగా, అప్పటి శాంతి చర్చల ఫలితాలు, నేటి వాటి రిలవెన్స్ మనల్ని ఆలోచన ఆచరణల వైపు తీసుకెళ్తుంది. ఇటీవలి భారత్ బచావో సభలో మాట్లాడిన హరగోపాల్ గారు”విప్లవ పార్టీలను అంచనా వేసేటప్పుడు అంతర్జాతీయ జాతీయ, స్థానిక అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వాళ్లు శాంతి చర్చల గురించి మాట్లాడుతారనే పరిశీలన మనకు ఉండాలి” అంటారు. ఇందులో ఇంకా ప్రాణనష్టం ఆపాలి. దేశ సంపద అయిన సహజ వనరులు ఖనిజాలు కార్పొరేట్ల దోపిడీ నుంచి నిలువరించ బడాలి. అనే అవగాహన అందిస్తూ, “మేము సైలెంట్ గా లేము. మా జీవితంలో మేము చేయగలిగే అంత పని చేసాము”అని అనుకొనేలా అందరూ యాక్టివ్ గా ఈ సామాజిక నిర్మాణంలో శాంతి కోసం నిలబడాలని పిలుపు నిస్తారు.
నిరంతర శ్రామికునిలా అనేక వేదికలపై మాట్లాడుతూ విరసం ఆవిర్భావ సభలో శాంతి కోసం విరసం కృషిని రచనలు అధ్యయనం సభలు సమావేశాలు బుద్ధి జీవుల పాత్రను వివరిస్తూ,”1948 లోనే దేశంలో మతతత్వ శక్తులు చాలా బలంగా ఉన్నాయని, సోషలిస్టు భావజాలం ఉన్నవాళ్ళ మంతా కలవవలసిన అవసరం ఉందని, నెహ్రూ జయప్రకాశ్ నారాయణకు ఉత్తరం రాసిన విషయాన్ని ప్రస్తావిస్తారు. పరిణామాల్ని చూస్తూ ఉండక మన సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన కాలం ఇది. అని వెయ్యి గొంతులై నినదిస్తూన్న మన కాలపు మహా మనీషి మానవ హక్కుల నిరంతర ప్రయాణికుడైన ప్రొఫెసర్ హరగోపాల్ గారితో శాంతి బాటలో మనమూ ఎన్నో కొన్ని అడుగులు వేయడమే ఈ పుస్తక పఠనంలోని ఆలోచన , అంతస్సారం.




