సురేంద్ర శీలం రాసిన ఈ నవల కేవలం కుందేరు నది ఒడ్డున ఉన్న క్రిస్టిపాడు గ్రామ కథ మాత్రమే కాదు. ఆ ఊరి ప్రజల జీవితాలను మాత్రమే చిత్రించదు. ఇది మట్టి మనుషుల మనసుల లోతులను పరిశీలిస్తూ, వారి జీవన విధానాన్ని, భావోద్వేగాలను సూక్ష్మంగా అద్దం పట్టే నవల. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని అక్కడి మనుషుల బంధాలను, అక్కడి రాజకీయాలను, అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
సహజంగా నది అనేది నాగరికతకు మూలం. నాగరికత వృద్ధి చెందే క్రమంలో అక్కడ జరిగిన మార్పులకు అక్కడి ప్రజల జీవితాల్లో సంస్కృతి పరంగా, జీవన విధానంలో అన్ని రకాల మార్పులకు సాక్ష్యం నది. ఈ క్రమంలో కుందేరు నది కూడా క్రిస్టిపాడు గ్రామంలోని ఆధిపత్యం కోసం జరిగిన సంఘర్షణ, ఈ సంఘర్షణలో మానవ సంబంధాలు, గ్రామీణ వాతావరణం, సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేయబడతాయి. అందులో భాగంగానే ఆధిపత్య పోరులో కుల మత వర్గాలకు అతీతంగా చిగురించే ప్రేమలు ఎప్పుడు కూడా నలిగిపోతుంటాయి… అలా నలిగిపోయిన కోల్పోయిన ప్రేమకు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఊరి బాగోగుల కోసం ఊరి అభివృద్ధి కోసం ఆశయాల కోసం ప్రాణాలు కోల్పోయిన సాధారణ మనుషుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ కుందేరు. నవల అంతా కుందేరు నది, క్రిష్టిపాడు కేంద్రంగా సాగుతుంది. రాయలసీమ యాస భాష ఈ నవలలో మనకు కనిపిస్తుంది.
కులం, మతం లేదా వర్గం పేరుతో జరిగే ఆధిపత్య పోరాటాలన్ని అధికారం కోసమే. అధికారం చేజిక్కితే విచ్చలవిడిగా తమ దోపిడీని కొనసాగించవచ్చు. ఈ నవలలో అలాంటి ఆధిపత్య పోరు మనకు కనిపిస్తుంది. ఈ ఆధిపత్య పోరు గ్రామీణ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం జరుగుతుంది. ఈ క్రమంలో రెండు వర్గాలుగా ఊరు చీల్చబడ్డది. ఈ గొడవలన్ని కుందేరు నది ఒడ్డున ఉన్న నరసింహస్వామి గుడి మాన్యాలను స్వాధీనం చేసుకోవడానికి, నారపురెడ్డి మరియు తిమ్మారెడ్డి వర్గాల మధ్య జరిగే ఆధిపత్య పోటీ, గ్రామాధికారం కోసం జరిగే ఇరువర్గాల మధ్య జరిగే పోరునే ఈ కథకు కేంద్ర బిందువు. ఈ ఇద్దరి మధ్య పోరు వల్ల గ్రామమంతా ఎలా దోపిడీకి గురైంది, సాధారణ ప్రజలు ఎలా నష్టపోయారు అనేది ఈ రచనలో కనిపిస్తుంది. తన పుట్టిన ఊరితో బంధం కలిగిన శంకరం, ఆ దోపిడీని అణచివేసి గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనే ఆశయంతో ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతాడు. అయితే, చివరికి అతడు హత్యకు గురికావడం ద్వారా, సమాజంలో ఆధిపత్య శక్తుల దుర్మార్గాలను నవల తీవ్రంగా విశ్లేషిస్తుంది.
ఈ ఆధిపత్య పోరులో రికార్డింగ్ డాన్స్ కళాకారిణి శ్రావణి, ప్రభాకర్ మధ్య చిగురించిన ప్రేమకథ, ప్రభాకర్‌కు తన దారిని దిశను ఎరుక చేస్తూ తను చేయాల్సిన పోరాటం గురించిన సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూనే, సమాజంలో వెళ్ళునుకు పోయిన అన్యాయాలు మరియు కుల-వర్గ భేదాలను లోతుగా ఎత్తిచూపుతుంది. తరతరాలుగా కుల మతం వర్గం పేరుతో అవమానించబడుతున్న ప్రేమను ఇందులో చూడొచ్చు. కులాలు మరియు వర్గాలను దాటి నిలబడిన ఈ ప్రేమను అణచివేయడానికి, శత్రువులుగా ఉన్న నారపురెడ్డి, తిమ్మారెడ్డి తమ ఆదిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఒకటైన రాజకీయ కుట్రలను ఈ నవల ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం ప్రేమకథ కాదు. సామాజిక అసమానతలు ప్రేమలను ఎలా బలిగొంటాయో ఇందులో విశ్లేషణమైన వ్యాఖ్యాన్ని మనం చూడొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమలో నిలబడాలంటే ఇరువూరీ సామాజిక నేపథ్యమే కాకుండా దాంతో పాటు ఆర్థిక అంశం కూడా అవసరం అనేది ఇందులో చిత్రించబడింది.
అలాగే, గుర్రన్న మరియు ప్రభాకర్ మధ్య స్నేహం ఆదర్శవంతంగా నిలబడుతుంది. వివక్ష ఛాయలు కనిపించని బంధం స్నేహం అంటారు. కానీ అది నిజం ఎంత బాల్య స్నేహితులు అయినా, ఒకే దగ్గర చదువుకున్న మిత్రులు అయినా వాళ్ళ మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత మాటల ద్వారానో లేదా ఒకరినొకరు పలకరించే తిరులోనో అది బయట పడుతుంది. అయితే, ఈ స్నేహంలోనూ కుల మరియు వర్గ ప్రభావాలు సూక్ష్మంగా కనిపిస్తాయి, ఇది పాఠకులకు వారి సామాజిక సందర్భాలను బట్టి మరియు వారి మధ్య పిలుపును బట్టి విభిన్నంగా అర్థమవుతుంది. ఇక్కడ స్నేహం కూడా సమాజిక బంధనాల నుండి ముక్తం కాదని నవల బలంగా నొక్కి చెబుతుంది.
ఇందులో మరీ ముఖ్యంగా చర్చకు వచ్చిన అంశం రికార్డింగ్ డాన్సులు. మొదట్లో అవి ప్రజా నృత్యం గా ఉండేవి. ప్రజా నృత్యం నుండి అసలు లంగా మారిన క్రమాన్ని రచయిత ఇందులో వివరించాడు. మొదట్లో ఇది ప్రజల కళగా ఉండేది. శ్రమైక జీవన విధానంలో ఇది ఒక భాగం. రోజంతా చేసిన శ్రమను మర్చిపోవడానికి సాయంత్రం పూట గ్రామీణ గీతాలను పాడుకుంటూ, జానపదాల కథలను చెప్పుకునేవారు. అవన్నీ కూడా గ్రామీణ వాతావరణాన్ని శ్రమజీవుల జీవితాలకు అడ్డంపట్టేలా ఉండేవి. సినిమా రాకడలతో అవన్నీ మారిపోయాయి. వాటికి గ్లామర్ పెంచితే గాని అవి మనుగడలో సాగించలేని దుస్థితికి వచ్చేసాయి. దాన్ని నమ్ముకొని అదే జీవనాధారంగా బతుకుతున్న మనుషులు కూడా దానికి తగినట్లుగా మారిపోయారు. ఈ క్రమంలో ఎదురయిన సవాళ్లు ఎదురైనా అవమానాలను వివరించే ప్రయత్నం చేశాడు రచయిత.
ఈ నవలను చదువుతున్నంతసేపు, కుందేరు నది మనల్ని సేదతీరుస్తూ, క్రిస్టిపాడు గ్రామంలో మనమూ ఒక భాగమైనట్లు అనుభూతి కలిగిస్తుంది. అక్కడి స్థానిక యాస, బాసలు మనల్ని ఆకర్షిస్తూ, రక్తపు మరకలు అంటిన గజ్జలకు సాక్షిగా మనల్ని నది ఒడ్డున నడిపిస్తుంది. మొత్తంగా, ఈ రచన సామాజిక దోపిడీలు, రాజకీయ ఆధిపత్యాలు మరియు మానవీయ బంధాల మధ్య సంఘర్షణను విశ్లేషణాత్మకంగా, భావోద్వేగపరంగా చిత్రిస్తుంది, పాఠకులను ఆలోచింపజేస్తుంది.




